
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు
గార్డియన్ ఏంజెల్
ఆర్ శర్మ దంతుర్తి
ఐఐటి పొవాయి కాంపస్ లో మూల ఒక చోట కూర్చునున్న కేశవ్, అపర్ణ రావడం చూసి పలకరింపుగా నవ్వేడు. అపర్ణ మొహంలో నవ్వు మాట అటుంచి ఏ భావమూ లేకపోవడం చూసి అడిగేడు, "కాయా, పండా?"
"నా మొహం, నేను మాట్లాడనే లేదు. నాకు తీరిక లేదు. నేను మాట్లాడినా అమ్మ ఒప్పుకోదని చెప్పానుగా. ఆవిడతో మాట్లాడ్డమే అనవసరం. ఆవిడక్కావాల్సింది ఆవిడ మేనల్లుడూ, ఆ రాజారావుకున్న మెడికల్ షాపూ బాగుండడం. దానికోసం నేను ఏమైపోయినా పట్టించుకోదు."
"మరి నన్నేం చేయమంటావు?"
"నిన్న రాత్రి ఆలోచించాను. దీనికో మార్గం ఉంది. నువ్వు ఎలాగా వచ్చేవారం క్లీవ్ లేండ్ వెళ్ళిపోతున్నావు. వచ్చే ఏటికి నాకూ ఇక్కడ చదువైపోతుంది. నేను కూడా అక్కడకి వచ్చేస్తాను. ఆ తర్వాత మరో ఏడాదికి నీ ఎం ఎస్ అయిపోతుంది. ఉద్యోగం రాగానే అక్కడే పెళ్ళి చేసుకుని ఇలా అయింది అని చెప్పేద్దాం. సింపుల్ గా తేల్చేయవచ్చు."
రాయలే దిగి వస్తే...
శ్రీనివాస భరద్వాజ కిశోర్ (కిభశ్రీ)
శ్రీకృష్ణ దేవరాయనికి, ఒకసారి భూలోక పర్యటన చేసి వస్తే బాగుంటుందని ఆలోచన రాగా కాలమాన పరిస్థుతుల ప్రకారం దుస్తులు ధరింపజేసి అమెరికాలో ఒక పట్టణంలో ఒక బుర్ర మీసాల తెలుగాయన శరీరంలోకి దింపాడు దేవేంద్రుడు.
మీటింగుకు ఆలస్యమైపోయి హడావిడిగా కారు దిగి పరుగు లాంటి నడకతో పోబోతూంటే ఒకాయన గుద్దుకోవడంతో పగటికల చెదిరిన ఆర్కే తేరుకుని గుద్దుకున్న ఆయన బుఱ్ఱమీసాలను చూడగానే గుర్తుపట్టేసి చిరునవ్వుతో “హాయ్ -అయామ్ ఆర్కే” అని షేక్ హాండ్ ఇవ్వబోతే రాయలు మీసం మెలివేసి గర్జించి చిరుకోపంతో చూసాడు.
“ ప్రభూ - నన్ను గుర్తు పట్ట లేదా? నేను మీ వికటకవిని - చేసిన పాపాల ఫలితంగా 20వ శతాబ్దంలో మరో జన్మ ఎత్తాను. రామకృష్ణ పేరు సంక్షిప్త రూపం ఆర్కే - ఇప్పుడే మీ రాక గురించి మీకు టూరుగైడుగా వుండమని ఆదేశించాడు దేవేంద్రుడు. ఇది 21వ శతాబ్దం, రాజ్యాలు రాచరికాలు లేవు, ప్రజాస్వామ్యంలో అభివాదం చేసే తీరు ఇదే”అన్నాడు.
వెండి కంచం
- శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ
"ఇదిగో మిమ్మలనే! ఎక్కడున్నారు? అమ్మాయి ఉత్తరం రాసింది, పిల్లలకి శెలవులిచ్చారట, వచ్చేవారం బయలుదేరి వస్తున్నారుట". శాంతమ్మ మాటలకి పడక్కుర్చీలొ కునుకు తీస్తున్న రాఘవ నిద్ర ఎగిరిపోయింది.
“వచ్చేవారమే? సరిగ్గా చదివావా” అని రెట్టించి అడిగా డు కొంచం ఆదుర్దాగా.
మీరే చదువుకొండని ఉత్తరాన్ని రాఘవ వళ్ళో పడేసి, వంటింట్లోకి వెళ్ళిపోయింది శాంతమ్మ.
ఉత్తరాన్ని పైనించి క్రిందకి నాలుగు సార్లు చదివాడు. అవును వచ్చేవారమే, సరిగ్గా ఎనిమిది రోజులుంది.
తాలూకా రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రాఘవకి ఉద్యోగంలో ఒక్క క్షణం తీరికుండేది కాదు. ఉదయం పదింటికి తాలూకా కచ్చేరి కి వెళితే తిరిగి ఇంటికొచ్చేసరికి రాత్రి ఏ తొమ్మిదో పదో అయ్యేది.
ఇక జామాబంది రోజుల్లో అయితే అర్ధరాత్రి పై మాటే. ఆదివారం సెలవన్న పేరుకే గాని, ఇంటిపట్టునుండటం అన్నది బహు అరుదు. ఒకవేళ ఉన్నా, కరణాలు మునుసబులు అతనిని ఆ రోజు కూడా వదిలేవారు కాదు.
రాఘవ శాంతమ్మలకు నలుగురు అబ్బాయిలు ఒక్కత్తే కూతురు. కూతురు సుగుణతో సహా పెద్దపిల్లలిద్దరికి పెళ్ళిళ్ళై వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు.
పరిధులే తెలియని...
వాత్సల్య
"నేనూ శ్రీరాం విడాకులు తీసుకుందామనుకుంటున్నాము" ఉరుములేని పిడుగులా స్నేహితురాలు జానకి నుండి పొద్దున్నే వచ్చిన ఆ సందేశాన్ని చూసి హతాశయురాలినయ్యాను.అయినా పొద్దున్నే పిల్లల స్కూలు, వంట హడావిడితో ఆ విషయాన్ని కాసేపు పక్కనపెట్టి పనులన్నీ అయ్యాకా జానకికి ఫోనుచేసాను.
"భావనా, ఇంక వివరాలేమీ అడగకే, నేను విడిపోదామని నిర్ణయించేసుకున్నాను" అంది జానకి స్థిరంగా.
"అది కాదే..అసలు మీ ఇద్దరి మధ్యా అంత గొడవలు...." ఇంకా నా వాక్యం పూర్తి చెయ్యనేలేదు, జానకి అందుకుని "నువ్వు బయట వాళ్ళకి ఫ్యామిలీ కౌన్సిలర్‌వి ఏమో కానీ నాకు మాత్రం స్నేహితురాలివి అంతే..ఇంక వివరాలు అడిగి మా ఇద్దరి మధ్యా సయోధ్య కుదర్చాలని చూడకు, అది జరగని పని" అని కోపంగా.
పాపం, భక్తుడేకదా!
మూలం: జయకాంతన్
అనువాదం: సుందరేశన్
ఆ కోవెల, ఊరు మధ్యన ఉంది. అయినా సందడి లేకుండా నిమ్మళంగానే ఉంది.
కోవెలంటే ఒక మైలు దూరంనుంచి చూసి, “ఆహా!” అని దాని స్థలపురాణంగురించి గొప్పగా వల్లించడానికి గోపురాలేవీ లేవు. చూసి, నివ్వెఱపడకుండా సొంత ఇంట్లోకి ప్రవేశించే భావనతో ఎవరైనా సరే ఈ కోవెలని దర్శించవచ్చు. ఏ పెద్ద ద్వారబంధమూ అడ్డు రాదు. కోవెలకి నాలుగు అడుగుల వెడల్పుకి నడవా, ప్రహరీ గోడా ఉన్నాయి.
కోవెలలోకి అడుగుపెట్టగానే వరుసగా నల్లరాయి మెట్లు కనిపిస్తాయి; ఆ మెట్లమీద నిలబడితే పక్కనే దండిగా పెరిగిన పొన్నచెట్ల కాయలు, ఆశ్రయం మధ్య చల్లని పిల్లగాలి మనకి నిత్యమూ స్వాగతం చెప్తుంది. పక్కనేవున్న ఇప్పచెట్ల తోటలో ఆవులని మేయడానికి వదిలేసి కాపరులు ఈ కోవెల వసారాలో ఆవు-పులి ఆట ఆడుకుంటారు. ఆటకని వాళ్లు గీచుకున్న గీతలు గచ్చునేలమీద స్థిరంగా కనిపిస్తాయి. పగటివేళ వాళ్ళు అక్కడ ఆడుతూనో లేక నిద్రపోతూనో కాలం గడుపుతారు; దానికెవరూ ఆక్షేపించరు. వీటికి మధ్య చిన్నికృష్ణుడు ఒక అరలో సంరక్షణకని, తంతి తీగల వెనుక, చేయికి అందే దూరంలో దర్శనమిస్తాడు.
మనం పిలుస్తే వెంటనే దూకి మన దగ్గరగా వచ్చి కూర్చుంటాడేమో అనే ధోరణిలో ముద్దుగా ఆ విగ్రహం ఉంది.
సెల్వి
గిరిజా హరి కరణం
అక్క దగ్గర రెండు రోజులుండి సీనుతో కలిసి మా వూరు బయలుదేరాను. బస్సెక్కి కిటికీ పక్కన కూర్చున్నాను. కింద నిలబడి అక్క చంకలో ఉన్న బాబు చెయ్యి పట్టుకొని టాటా చెప్పిస్తోంది.
పూర్తిగా తెల్లవారలేదింకా. ఆ మసక చీకట్లలోనూ కనబడుతున్నాయి అక్క కళ్ళనిండా నీళ్ళు .
బస్సు కదలబోతుంది. “వస్తానక్కా! లెటర్ రాస్తాను” అంటూ చెయ్యి ఊపాను. అక్క గబగబా నడిచి బస్సు దగ్గరగా వచ్చి "సెల్వీ !వాళ్ళతో జాగ్రత్తగా వుండు, గొడవ పెట్టుకోకు, వాళ్ళేమైనా చెయ్యగలరు" అంది.
ఫరవాలేదక్కా, నీవు ధైర్యం గా ఉండు, చెప్పాగా నీకు, ఎవరూ ఏమీ చేయ్యలేరు, నేను చెప్పింది గుర్తుందిగా”
అంటుండ గానే బస్సు కదిలింది. టిక్కెట్ట్ తీసుకుని సీటుకి జారబడి కళ్ళు మూసుకున్నాను. మనసు గతాన్నితడుముకుంటూంది.