top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg
samputi.jpg
maagurinchi.jpg
rachanalu.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

మధురవాణి ప్రత్యేకం

అధ్యాత్మికం

నిండు సంస్కృతికి నిలువుటద్దం

ఎర్రాప్రగడ రామకృష్ణ

భూమిని నమ్ముకున్న దేశమిది. మనదేశ వ్యవసాయ సంస్కృతి సౌందర్యానికి పట్టం కడుతూ, మట్టి సువాసనను పట్టి చూపించే పండుగ ఏదైనా ఉందంటే- అది మకర సంక్రమణమే! నేలతల్లి కన్న పేగుకు కనకాభిషేకం జరిపించే గొప్ప పర్వమిది.

సూర్యుడు ఒక రాశిలోంచి మరో రాశిలోకి మారడాన్నే మనం సంక్రాంతిగా పిలుస్తాం. ఇది ఏడాది పొడవునా జరిగేదే. అంటే ఏడాదికి 12 సంక్రాంతులు వస్తూనే ఉంటాయి. అయినా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం ఒక విశేష పరిణామం. హేమంత రుతువులోని ఈ మకర సంక్రమణంతో దక్షిణాయనం ముగిసి, ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. కనుక జనవరిలో వచ్చేదాన్నే మనం అసలైన సంక్రాంతిగా సంభావిస్తాం.

‘మాటలు ఉమ్మడి కావాలి.  కలయికలు అధికం కావాలి. మనసులు ఏకం కావాలి. చిత్రాలు సంకల్పాలు సద్భావాలు సంపూర్ణంగా సంఘటితం కావాలి' అని రుగ్వేదం ఆకాంక్షించింది. ఆ ఐక్యత, పరిపూర్ణత తెలుగునాట సంక్రాంతి పూట సంభవిస్తుంది. సంపూర్ణ సాంస్కృతిక స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకే శ్రీనాథుడు దీన్ని పెద్ద పండుగ అన్నాడు.

మనోహరమైన మంచుతెరలు, చలిపొద్దులు, గంగిరెద్దులు, భోగిమంటలు, తలంటులు, పిండివంటలు, కొత్త పంటలు, జడగంటలు, పడుచుజంటలు, వారి తీపివలపు పంటలు, హరిదాసులు, పిట్టలదొరలు, గొబ్బెమ్మలు, భోగిపళ్లు, బంతిపూలు, పట్టు పరికిణీలు, పాశురపఠనాలు, రథంముగ్గులు, కోడిపందాలు, కనుమతీర్థాలు, బొమ్మలకొలువులు, అన్నింటికీ మించి ఇంటి ముంగిట బంగారు ధాన్యరాశులు -ఒక్కటేమిటి? నిండు సంస్కృతికి నిలుటద్దం, పరమార్ధం సంక్రాంతి పండుగ. దాని ఉనికి - బోసిపోయిన నగరవీధులు కావు, వాసికెక్కిన పల్లెసీమలు!

సంక్రాంతి మూడురోజుల పండుగ. భూమాతకు గోమాతకు జామాతకు ప్రీతిని కలిగించే పండుగ. భోగి సంక్రాంతి కనుమ పేర్లతో పిలుచుకొనే మూడు రోజుల- పెద్దల పండుగ, పంటల పండుగ, పశువుల పండగ వెరసి సంక్రాంతి పండుగ.

ఒదులుగా ఉంచుకోవలసినవేవో, వొదుల్చుకోవలసినవేవో తేల్చుకోమంటుంది భోగి. ఇంట్లో చేర్చిన చెత్తను, పాత సామాగ్రిని భోగి మంటల్లోను, ఒంట్లో చేరిన చెత్తను మన సంకల్పాలను దహనం చేసి హాయిగా తలంటుకొని తేలికపడటమే భోగి పరమార్ధం. దారిద్ర్య చిహ్నాలను దగ్ధం చేయడమే భోగం. పిల్లలకు భోగిపళ్లు పోయడం, పంటలు బాగా పండాలని కోరుతూ ఇంద్రుడికి నైవేద్యం (ఇంద్రపొంగలి) సమర్పించడం మన ఆచారం.

సంక్రాంతి పూట పెద్దలను స్మరిస్తూ దానధర్మాలు చేయడం సంప్రదాయం. మకరరాశికి అధిపతి శనేశ్వరుడు. కనుక ఆ రోజు నువ్వులు మినుములు దానం చేయడం ఆనవాయితీ. ఉత్తరాయణ పుణ్యకాల ఆగమనాన్ని స్వాగతిస్తూ సూర్యారాధన చేయడం వంటి పుణ్య కార్యాచరణతో గతించిన మన పెద్దలకు ఉత్తర ద్వారాలు తెరుచుకొని వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ఒక విశ్వాసం. నూనెలో లక్ష్మి, నీటిలో గంగ కొలువై ఉంటారట. భోగి రోజున 'అలక్ష్మి' నుంచి మనం దూరమైతే సంక్రాంతి రోజున లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పెద్దలు వివరించారు.

కనుమ - పశువులకు ప్రాధాన్యం కల్పించే పండుగ. పశుసంపదను మనవాళ్లు 'సొమ్ములు' అనేవారు. వాటికి శుభ్రంగా స్నానం చేయించడం, గంటలు, మువ్వలు పట్టెడలు మెడలో అలంకరించడం, కొమ్ములకు రంగులు వేయడం, ముస్తాబు చేయడం అందమైన ఆచారం. కనుమనాడు ఎడ్లను గోవులను పూజించి వాటికి నైవేద్యం పెట్టిన పొంగలిని పసుపునీళ్లతో కలిపి పొలాల్లో జల్లడం వల్ల పంటలు బాగా పండుతాయని రైతులు నమ్ముతారు. దాన్నే 'పొలె చల్లడం' అంటారు.

సంక్రాంతినాటి ఆచారాలు అంతరార్థాలు మనకు బోధించేదేమంటే- పశువులు పక్షులు మానవ పరివారంలో భాగం కావాలని... ఆహారంలో, సంపదలో వాటికీ భాగం పంచాలని... ఆరుగాలం తనతో సమానంగా శ్రమించే పశువుకు మనిషి కృతజ్ఞుడై ఉండాలని! పశువును సముదాయించే వేళ కర్షక జనావళికి కళ్లు తడిగా మెరుస్తాయే- ఆ మెరుపు పేరు సంక్రాంతి! 'తొలి పండక్కి వెళదాం' అని పెనిమిటిని ఒప్పించి, పుట్టింటికి రప్పించిన ఇల్లాలి కళ్లలో సంతృప్తి మిలమిలలాడుతుందే- ఆ కళ పేరు సంక్రాంతి! బాదం పిస్తాలతో ఇంతకాలంగా బలిష్టంగా మేపింది- కోడిమీద ప్రేమతో కాకుండా, గెలుపుమీద కసితోనే అయినా, అది తెలియని కోడిపుంజు యజమాని పరువుకోసం పోరాడుతున్నప్పుడు దాని కళ్లలో ఆ వెలుగు చిమ్మే ఎర్రని పౌరుష ప్రతాపాల పేరు సంక్రాంతి!

శీతగాలులతో హేమంతం సీమంతం చేసే వేళ ప్రాయం రసవంతం అవుతంది కదా... ఆ వెచ్చదనం పేరు సంక్రాంతి. నిండుగాదుల్ని చూసి పొంగిపోతూ రైతన్నలు తమ ఇంటి ముంగిట, దేవాలయ ప్రాంగణాల్లోను వడ్ల కంకులను కుచ్చులుగా వేలాడదీస్తారు. ఆ 'వడ్ల కిరీటాల' పై పిట్టలు మందలు మందలుగా చేరి చేసే వెర్రి సందడి పేరు సంక్రాంతి. గుమ్మాలకు పూసిన పచ్చపసుపు పరిమళం, గోడలకు వేసిన గుల్ల సున్నం ఘాటుతో కలసి గుమ్మం ముందు గొబ్బెమ్మల చుట్టూ పరిభ్రమిస్తుంటే మనకు తెలియకుండానే మనలో ఆనందం పుట్టుకొస్తే- సంక్రాంతి వచ్చినట్లు. 'పండగ చేస్కో' అనే మాటకు అసలైన అర్థమదే!

సంక్రాంతి అంటే సప్తవర్ణ శోభిత జీవన స్వప్నలిపి! ఆ జ్వాలతో మన హృదయసీమల్ని జ్యోతిర్మయం చేసుకోగలిగితే- అది నిజమైన సంక్రాంతి. సంక్రాంతి అంటే పొలమారిన జ్ఞాపకం. అలలెగసిన మానససరోవరం. సంక్రాంతి ప్రకృతిపరంగా పల్లెలకు సంక్రమించిన కానుక. నగరాలను ఊరించే కోరిక. దాని కోసమే గ్రామసీమలకు ఈ పరుగులు- ఆ పచ్చదనాన్ని శ్వాసించాలని, ఆ బాంధవ్యాలను ఆస్వాదించాలని, ప్రకృతిని సేవించాలని, వెరసి కర్పూరంలా తెలియకుండానే కరిగిపోయిన మన బాల్యాన్ని ఒక్కసారి ప్రేమగా తడుముకోవాలని  అందుకూ పల్లెలకు ఈ పరుగులు!

ఆ సంస్కృతిని చేజార్చుకొంటే మనల్ని మనం కోల్పోతాం!

*****

bottom of page