top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg
samputi.jpg
maagurinchi.jpg
rachanalu.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

ఎన్నారై కాలమ్ - 1

తరగతులు - గతులు

 

satyam.jpg

సత్యం మందపాటి

(“Madhuravani.com” పత్రిక మొదలుపెట్టిన కొద్ది సంచికల తర్వాతనే నా “సత్యాన్వేషణ” శీర్షిక ప్రచురణ కూడా మొదలుపెట్టారు సంపాదకులు. అంటే ‘సత్యాన్వేషణ’ శీర్షికకు ఇప్పటికి దాదాపు నాలుగున్నర సంవత్సరాల వయసు వచ్చింది. అందుకని ఆ శీర్షికకి ‘శుభం’ పలికేసి, అలాగేనో ఇంకొంచెం విభిన్నంగానో వేరే శీర్షిక వ్రాద్దామనుకుంటుంటే, ‘సరే, అలాగే చేద్దాం’ అన్నారు మన ‘Madhuravani.com’ సంపాదకులు. వారి ప్రోత్సాహంతో మొదలవుతున్న ఈ కొత్త శీర్షికే “ఎన్నారై కాలమ్”. ‘సత్యాన్వేషణ’ లాగానే ఈ శీర్షికని కూడా అలాగే ఆదరించి, ఆనందిస్తారని ఆశిస్తున్నాను - రచయిత)

 

మొట్టమొదట ఆదిమానవుడిగా వున్నప్పుడే, మనిషి తన మనుగడకు ఒంటరిగా బ్రతకటం కష్టం అని అర్ధం చేసుకున్నాడు. సింహాలు, పులులూ మొదలైన క్రూర మృగాలు, ఆవులూ గొర్రెలూ మేకలు మొదలైన బలహీనమైన జంతువులను వేటాడి చంపేసి తింటుంటే తన ఒంటరి బ్రతుకెంత ప్రమాదకరమైనదో గ్రహించాడు. అవి మందలు మందలుగా జీవిస్తూ, కేవలం ఆ సంఘటిత బలం వల్ల ఎలా ఆ క్రూరమృగాల బారినిండీ తప్పించుకుంటున్నాయో చూశాడు. జంతువుల జీవనసరళి నించీ ఎన్నో మంచి విషయాలు నేర్చుకుని పాటిస్తున్న ఆదిమానవడు, తనూ అదే పద్ధతిలో తన చుట్టు వున్న కొంతమంది మనుష్యులని కలుపుకుని సంఘజీవి అయాడు. అలా మనుష్యులకు మనుష్యులు, కుటుంబాలకి కుటుంబాలు దగ్గరై ఒంటరిగా దొరకని ధైర్యాన్నీ, శౌర్యాన్నీ మందీమార్బలం ద్వారా సంపాదించుకున్నారు. సమాజాలు ఏర్పరచుకున్నారు. ఈ హైటెక్ రోజుల్లో మనం ‘టీం వర్క్’ అంటాము కదా, అదే ఆనాటి మానవుడికే కాక, ఈనాటి మన మనుగడకి కూడా రక్షణ అయింది.

బాగుందయ్యా, అంత గొప్ప సంఘ జీవులం మనం మరెందుకు ఇన్ని విభజనలు చేసుకుని కొట్టుకు చస్తున్నాం? మళ్ళీ మానవ మనుగడనే పణంగా పెడుతున్నాం? నేను కులం, మతం, ప్రాంతం, రంగు మొదలైన ప్రమాదకరమైన విభజన భజనల గురించి చాల వ్యాసాలు వ్రాశాను. అందుకని ఇక్కడ వాటిని పేర్కొనటమే తప్ప  వివరంగా వాటి జోలికి పోను. ఈ వ్యాసం ఉద్దేశ్యం కూడా అదికాదు.

కాకపోతే ఆ గీతలు ఎలా ఎక్కడెక్కడ వున్నాయో క్లుప్తంగా చూద్దాం. అవి ఇక్కడ వద్దనుకున్నా, కొంతమంది వాటిని ఎలా అపార్ధాలు చేసుకుని సమాజానికి ఎంత ద్రోహం చేస్తున్నారో చూపిద్దామని మాత్రమే చెప్పవలసి వస్తున్నది.

మన మను సిద్ధాంతంలో కుల ప్రస్తావన లేదు. మను సిద్ధాంతంలో నాకు నచ్చినవి కొన్ని, నచ్చనవి చాల వున్నా వ్యక్తిగత నమ్మకాలతో వ్యాసం నడపటం భావ్యం కాదు కనుక అవిక్కడ ఈ వ్యాసానికి అనవసరం. ఆయన వాడిన మాట చతుర్వర్ణాలు. చాలమంది అన్నీ తమకే తెలుసునన్నట్టుగా ప్రచారం చేస్తున్నట్టు నాలుగు కులాలు కాదు. నాలుగు వర్ణాలు. ఆనాడు, అంటే క్రీస్తు శకం ప్రారంభానికి కొంచెం ముందూ వెనుకగా, సమాజంలోని ప్రజలని వారి వృత్తులనిబట్టి నాలుగు వర్ణాలుగా చూపించాడు మనువు. చదువుకుని ఇతరులకి ఎంతో జ్ఙానాన్ని ప్రసాదించే వారు ఒక వర్ణం, ప్రజలని దక్షతతో పరిపాలించేవారు రెండవ వర్ణం, ప్రజలకి కావలసిన నిత్యావసరాలని ఎక్కడెక్కడినించో తెచ్చి సరసమైన ధరలకు అందించేవారు మూడవ వర్ణం, తమ కాయకష్టంతో ప్రజలకి కావలసిన ధాన్యాలు, కూరగాయలూ, ఇతర నిత్యావసర సామానులు తయారు చేసేవారు నాలుగవ వర్ణం. ఈ నాలుగు వర్ణాలని పూర్తిగా అపార్ధం చేసుకుని, స్వలాభం కోసం కులాల నిర్మాణం చేసుకుని, మనల్ని మనమే విభజించుకుని విడిపోవటం మన ఖర్మ. ఈనాటికీ హీనంగా కొట్టుకు చావటం మన దురదృష్టం.

ఈనాడు ప్రపంచమంతటా ఎన్నో దేశాల్లో చేస్తున్న పెద్ద వ్యాపారాలు చూస్తుంటే, వాళ్ళు ఈ చతుర్వర్ణాల మను సిద్ధాంతం అక్షరాలా పాటిస్తున్నారనిపిస్తుంది. మైక్రోసాఫ్ట్, టొయోటా, శామ్సంగ్, యాపుల్, టాటా.. ఏ కంపెనీ అయినా సరే, ఇవి పాటిస్తూనే వున్నాయి. ప్రపంచమంతటా ఆ కంపెనీలు ఎలా నడుస్తున్నాయో చూద్దాం. ఆ కంపెనీలలోని మేథావులు కంపెనీ మనుగడ కోసం, లాభాల కోసం ఏం చేయాలీ ఎలా చేయాలి అని ఒక ప్రణాలిక తయారు చేస్తారు. (మార్కెట్ రీసెర్చి, ప్రాడక్ట్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్). ఆ కంపెనీ నడిపే నాయకులు అవి తయారుచేయటానికి కావలసిన సౌకర్యాలందజేసి, ఆ ప్రణాలికని అనుకున్నట్టుగా నడిపిస్తారు. (ఎగ్జిక్యూటివ్ మానేజ్మెంట్ నించీ క్రింద మేనేజ్మెంట్ దాకా). అక్కడ తయారు చేయవలసిన ఉత్పత్తికి అవసరమైన సరుకులని, భాగలనీ ఇతర వ్యాపారుల నుండి కొనుగోలు చేస్తారు. (సప్లై చైన్). వాటితో ఆ కంపెనీ కార్మికులు, వారి వారి రకరకాల నిర్మాణ నైపుణ్యంతో చేయవలసిన కార్లనూ, కంప్యూటర్లనూ, ఇతర మెషీన్లనూ తయారుచేస్తారు. (ప్రొడక్షన్ వర్కర్స్). ఈ రకంగా ఇక్కడ ఆనాటి మనువు చెప్పిన నాలుగు వర్ణాలూ కలిసి పని చేస్తేనే ఆ కంపెనీ నడుస్తుంది. నిలబడుతుంది. లాభాలలోకి వెడుతుంది.

నేను చేసిన పరిశీలనలో ఇంకొక సరదా విషయం కూడా వుంది. మన దేశంతో పాటు యూరోపియన్ దేశాల్లోనూ, ఆసియా దేశాల్లోనూ చాలమంది ఇంటి పేర్లు వారి వృత్తులను బట్టే వచ్చాయి. భారతదేశంలో చూస్తే నేతి సుబ్బారావు, దిట్టకవి అప్పారావు, వేదాల శంకర్, ఫరూక్ ఇంజనీర్, నారి కంట్రాక్టర్, నానీ పల్కీవాల మొదలైన పేర్లు వినిపిస్తాయి. అలాగే యూరోపియన్లలో జేమ్స్ కుక్, పెర్రీ మేసన్, ఆలివర్ గోల్డ్ స్మిత్, జాన్ కార్పెంటర్, ఎలిజబెత్ టైలర్, జిమ్ బేకర్, ఎర్ల్ స్టాన్లీ గార్డనెర్.. ఇలా ఎన్నో చూడవచ్చు. అలాగే కొన్ని చైనీస్ పేర్లలో కూడా షి (చరిత్రకారుడు), జి (లైబ్రేరియన్), క్యు (స్టోర్ మేనేజర్), ట్యు (కసాయి), చ్యు (వంటవాడు).. ఇలా ఎన్నో వాళ్ళు చేసే వ్యాపారపరమైన పేర్లు కనిపిస్తాయి.

ఇలాటి వర్ణాల పేర్లతో సహా, కులాలతో పేర్లూ, మతాలతో పేర్లూ, ప్రాంతాలతో పేర్లూ కూడా మామూలే! మరి ఇలాటి పేర్లు ఫలానా వాళ్ళు ఫలానా అనే ఒక్క గుర్తింపు కోసమేనా? ఒకప్పుడు అవును. ఇప్పుడు కాదు. నేతి సుబ్బారావుగారి అబ్బాయి నేతి అశోక్ నేతి వ్యాపారం చేయకుండా ఇంజనీరయివుండవచ్చు. ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ తోటరాముడు కాకుండా పుస్తకాలు వ్రాసుకుని పెద్ద పేరు సంపాదించాడు. షియాన్ చ్యు చైనాలో పెద్ద మాన్యుఫాక్చరింగ్ కంపెనీకి సియీవో అయాక వంటలు చేసే అవసరం రాలేదు. నేను గుంటూరులో చదువుకునే రోజుల్లో ఆల్బర్ట్ వెంకటేస్వర్లు అని గుంటూరు ఎ.సి. కాలేజీలో ఒకతను వుండేవాడు. అతను మతం మార్చుకుని ఆల్బర్ట్ తగిలించుకున్నాడుగానీ శ్రీవెంకటేశ్వరస్వామిగారిని వదల్లేదు. అతనికి ఇటు శ్రీనివాసూ, అటు ఏసూ ఇద్దరి సహాయ సహకారాలూ కావాలి కాబోలు! ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు అవటం కోసం ఇస్లాం మతం పుచ్చుకున్నా, ఆనాటి సినీ నటుడు ధర్మేంద్ర ధర్మేంద్రుడే! ఇలా ఎన్నో ఉదాహరణలు. ఇవి ఎంతగా మారిపోయాయంటే ఒక్కొక్కప్పుడు ఇలాటి గుర్తింపులు అసలు అవసరమా అనిపిస్తుంది కూడాను.

మనం విమానాశ్రయంలో కూర్చున్నప్పుడు ఎందరో మనుష్యులు, భవంతులు, కార్లు.. ఇలా ఎన్నో అక్కడ కిటికీల్లోనించీ కనిపిస్తుంటాయి. విమానం పైకెగిరాక భూమి మీద వున్న మనుష్యులే కాదు, పైన చెప్పిన భవంతులు, కార్లతో పాటు పెద్ద పెద్ద విమానాశ్రయాలు కూడా కంటికి కనపడవు. మనం కొంచెం ఎత్తుకు వెళ్ళి అక్కడ నించీ చూస్తే ఎవరూ కనపడనప్పుడు, ఈ భూమి మీద ఇక ఎవరు ఎవరైనా ఒకటే కదూ! అలాగే మన దృక్పథం కూడా మారాలేమో!

ఇంకా ఎత్తుకు వెడితే అక్కడి నించి మనకి కనపడేవి రెండే రెండు.

ఒకటి  భూమి. పొలాలు, చెట్లూ వున్న చోట ఆకుపచ్చగానూ, కొండలున్న చోట గోధుమ రంగులోనూ, వాటి మీద మంచు వుంటే తెల్లగానూ వున్న భూమి.

రెండు నీరు. నదులూ, సముద్రాలూ వున్న చోట నీలంగా కనపడే నీరు.  

అవి చూస్తుంటే మనుష్యుల విభజన మీద ఇంకొక భావన వచ్చింది నాకు.  

కార్ల్ మార్క్స్ పేరు వినేవుంటారు. ఆయన సిద్ధాంతాల తోనే వచ్చింది మార్క్సిజం. మార్క్సిస్ట్ సిద్ధాంతం. ఈనాటి మార్క్సిస్ట్ రాజకీయ పార్టీగానీ, వారి ‘కొట్టేయ్, నరికేయ్, చంపేయ్’ సిద్ధాంతాలతోగానీ ఏమీ సంబంధం లేని అసలు సిసలైన మార్క్సిజం. నాకు ఆయన చెప్పిన కొన్ని విషయాలు నచ్చాయి కానీ, మార్క్సిస్ట్ పార్టీ కానే కాదు.  పైన చెప్పిన మా ఆల్బర్ట్ వెంకటేస్వర్లు మతంలాటిది కాదు మనం ఇక్కడ చెప్పుకోబోయేది.  

మార్క్స్ కూడా మన సంఘాన్ని, పైన మనం ఆకాశం నించీ చూస్తున్న ఉదాహరణలో చెప్పినట్టుగానే,  రెండు తరగతులుగా విభజించాడు. పచ్చగా వున్న ధనవంతులు (హావ్స్), నీలం కాలర్ వున్న చాలీచాలని జీతాల పనివాళ్ళు (హావ్ నాట్స్) అని. నా చిన్నప్పుడూ, కుసింత పెద్దప్పుడూ మామూలుగా తెలుగు భాషలో వాటి అర్ధం చూసి ఓహో అని వదిలేశాను. కానీ ఇంకొంచెం పెద్దయాకనే ఆ మాటలకు అసలు అర్ధం పూర్తిగా అర్ధం కాలేదు. ఈనాటి ప్రపంచ పరిస్థితులు సమగ్రంగా ఆకళింపు చేసుకుంటూ చూస్తుంటే, ఇప్పుడు ఆయన చెప్పినదేమిటో స్ఫుటంగా తెలుస్తున్నది. ఎంత బాగా చెప్పాడు అని ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా నాకు బాగా తెలిసిన రెండు దేశాలు అమెరికా, భారతదేశాల్లో ఈ తేడా బాగా కనిపిస్తుంది.   

మార్క్స్ సిద్ధాంతం ప్రకారం, డబ్బున్నవాళ్ళు అంటే గొప్ప ధనవంతులు. అవసరమున్నా లేకపోయినా, ఏది కావాలనుకున్నా, వద్దనుకున్నా అది కొనగలిగే స్థోమత వున్నవాళ్ళు. డబ్బులు లేనివాళ్ళు అంటే, మన తెలుగు సామెతలో చెప్పినట్టు, రెక్కాడితే కానీ డొక్కాడనివాళ్ళు. మార్క్స్ మరి మధ్య తరగతి మందహాసాల గురించి తన సిద్ధాంతపరంగా అంతగా పట్టించుకున్నట్టు లేదు. ఆ విషయం గురించి ఇక్కడే ఇంకొక వ్యాసంలో మనమే చెప్పుకుందాం.

ధన మూలం ఇథం జగత్ అన్నారు పెద్దలు.

దాన్నే ఆంగ్లంలో “Money, money, money! It’s a rich man’s world” అన్నారు నా కెంతో ఇష్టమైన గాయకులు ABBA.

ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, ఈ డబ్బే విపరీతంగా వుంటే మనం పైన అనుకున్న కులం, మతం, ప్రాంతం మొదలైన గీతలన్నీ ఇట్టే మాయమయిపోతాయి.

నిజంగానా? అంటే వాళ్ళకి ఆ విభజనలు వుండవా? కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలూ, వేషాలూ, రంగులూ.. ఇంకా వెంటాడుతూనే వుంటాయా?

విమానంలాగే ముఫై ఐదు అడుగుల ఎత్తున వెడుతున్నప్పుడు, భూమి మీద మనుష్యులతో పాటు అవి  కూడా కనుమరుగై పోతాయా? 

ఎలా మాయమవుతాయి? విమానం ఎంత ఎత్తున ఎగురుతున్నా, భూమి మీదకి దిగాలి కదా మరి!

అవన్నీ వుండటం, వుండక పోవటం వారి అవసరాలనుబట్టీ, స్వలాభాలనుబట్టీ వుంటుంది.  అవి లేనట్టూ నటిస్తూ అవసరార్ధాన్నిబట్టి వాటిని వాడుతూనే వుండటం చూస్తూనే వున్నాం కదా!

డబ్బు అనే కత్తికి రెండు వేపులా పదును వుంటుంది మరి! అంతేకాదు ఆ పదును కత్తితో తీయటి మామిడిపండుని ముక్కలు కోసి మిత్రులకు పెట్టవచ్చు, శత్రువుల పీకలూ తెగ్గొట్టవచ్చు.

ఒకవేపు ఆపదలలో వున్నవారికి సహాయం చేయటం, బీదవారికి చదువులు చెప్పించటం, తగిన ఆహారం ఇవ్వటం, అవసరమైన వైద్య సహాయం చేయటం.. ఇలా ఎన్నో మానవతా దృక్పథంతో చేసేవారున్నారు. ఇలాటి కొంతమంది మహానుభావులని మనం దినవారీ చూస్తూనే వుంటాం. వారి పేర్ల లిస్ట్ ఇవ్వనఖ్కరలేదు. వారెవరో మీకు తెలుసు.

కాకపోతే మనం ఈ వ్యాసంలో చెప్పుకుంటున్న సమస్య ఆ రెండో పక్కన వున్న పదును. ఆ పదునుకి నాకు ముఖ్యంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ధనమదం లేదా నాకు డబ్బుంది నన్నెవరూ ఏమీ చేయలేరు అనే అహంకారం. రెండవది పదవుల కోసం పోరాటం. మూడవది ‘ఇంకా కావాలి’ అనే స్వార్ధం.  

ఆ విషయాన్ని కొంచెం పరిశీలిస్తే కొన్ని నిజాలు బయటపడతాయి.

ఈ మూడూ ఒక్కొక్కప్పుడు వేరువేరుగానూ, మిగతా సమయాల్లో కలిసిగట్టుగానూ సాటి ప్రజలను స్వాహా చేస్తుంటాయి. ఇలాటివారికి ధనం అనేదే అహంకారాన్ని ఇస్తుంది. పదవులు కోరుకుంటుంది. స్వార్ధం పెంచుతుంది. సాటి మానవుల మీద ప్రేమని చంపుతుంది. అసహ్యాన్ని పెంచుతుంది. మనిషికీ మనిషికీ మధ్య దూరాన్ని పెంచుతుంది. సమాజాన్నే బలి తీసుకుంటుంది. ధనవంతులని ఇంకా ఎక్కువ ధనవంతులని చేస్తుంది. పేదవారిని పేదవారిగానే వుంచుతుంది. లేదా చంపేస్తుంది.

ఆరోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ, మొగలాయీల భారతదేశ దురాక్రమణ, హిట్లర్ జ్యూయిష్ వారి ఊచకోత, అమెరికాలో ఈమధ్య అధ్యక్షుడి పదవి పోకముందు అతని నిరంకుశ పరిపాలన, ధనమదం, లంచం, శ్వేతజాత్యహంకారం, ప్రభుత్వమే చేసిన ఉగ్రవాదం, కొన్నేళ్ళ క్రితం భారత ప్రధానమంత్రిని జేబులో వేసుకుని ఒక సాధారణ వనిత దేశ ప్రగతినే పణంగా పెట్టి విభజించి పాలించి ప్రపంచంలోనే గొప్ప ధనవంతురాలయిపోవటం, మన తెలుగు రాష్ట్రాల్లోనే అదే పధ్ధతిలో ఒక చోట కులం కార్డు ఉపయోగించి జనాన్ని భ్రమలో పెట్టి కోటానుకోట్లు సంపాదించటం, ఇంకొక చోట మన చరిత్ర మరచిపోయి మతం కార్డు వాడి తమ రాజకీయ ప్రయోజనాల కోసం తురుష్కురుల కాళ్ళ దగ్గర చేరి పూజలు చేసి ఆ మతం వారి ఓట్లు సంపాదించటం. ఇలా ఎన్నో ఉదాహరణలు చూసేవారికి కనిపిస్తూనే వున్నాయి.    

 అలానే బాగా డబ్బున్న సినిమా నటుడు నడిరోడ్డులో మనుష్యుల మీదనించీ కారు పోనిచ్చి చంపినా కేసు వుండదు.

ఒక రాజకీయ నాయకుడు రైతుల కడుపులు కొట్టి, కొన్ని వేల ఎకరాల భూమిని మింగేసినా అది ఒక సమస్య కాదు.  

ఒక డబ్బున్న వాడి కొడుకు అర్ధరాత్రి ఒకమ్మాయిని మానభంగం చేసినా ఫరవాలేదు.

ఒక బాబాగారు పెద్ద పెద్ద వాళ్ళనందరినీ చేతుల్లో పెట్టుకుని, నిత్యానందాలు చేసినా తప్పేమీ లేదు.

పెద్ద పెద్ద హిందీ సినిమా నటులు మతపరంగా మన శత్రుదేశానికి పూర్తి మద్దతు ఇచ్చి, వారికి భజనలు చేస్తుంటే అది దేశద్రోహం కాదు.

ఇవన్నీ కార్ల్ మార్క్స్ చెప్పిన ఒక పక్క హావ్స్ కథలయితే, ఇంకొక పక్క హావ్ నాట్స్ సంగతి చూద్దాం. కష్టజీవుల కథలన్నీ అందరికీ తెలిసినవే అయినా, నన్నెంతో కలచి వేసిన రెండే రెండు ఉదాహరణలు చెప్పి ఈ వ్యాసం ముగిస్తాను.

మనకి అన్నం పెట్టేవాడు రైతు. ఆ చిన్నకారు రైతు పండించే బియ్యం, గోధుమలు, పప్పులు, కూరలు.. ఏవైనా సరే, అతని దగ్గర కొనుగోలు చేసే ప్రభుత్వమయినా, పెద్ద సూపర్ బజారు వ్యాపారులైనా, ఇతర మధ్యవర్తులు పెద్ద భూస్వాములైనా రైతు కష్టాలకి తగ్గ ధర ఇవ్వటంలేదు. వారి దగ్గర ఎంత పిండాలో అంత పిండి వారి దగ్గర సరుకు కొంటారు. ఆ మధ్యవర్తులు మనకి అమ్మే ధరలు మాత్రం ఆకాశానికి అంటుతాయి. కష్టమొకడిదీ, లాభమింకొకడిదీ. అంతే కాదు. వానలు, వరదలు వచ్చి పంటలు కొట్టుకుపోతుంటే ఆ నష్టమూ చిన్నకారు రైతుదే. రోజురోజుకీ పెరిగే ఎరువుల ఖర్చులూ, విత్తనాల ఖర్చులూ కూడా రైతువే. మన దేశంలో రైతుల ఆత్మహత్యలు ప్రపంచంలోని అన్ని దేశాలకన్నా ఎక్కువ. అన్నపూర్ణ ఆంధ్రదేశంలో, అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకా ఎక్కువ. ఎందుకని? ఈ దోపిడికి కారకులెవరు? మళ్ళీ పై వర్గం వారే!

అలాగే అమెరికాలో మాదకద్రవ్యాల అమ్మకం చాల ఎక్కువ. ఆ మాఫియాలని కొలంబియా, మెక్సికోలాటి మధ్య అమెరికా దేశాల వారి సహాయంతో నడిపుతున్నది అమెరికాలోని శ్వేతజాతి ధనవంతులే. ఎన్నో బిలియన్ల డాలర్ల వ్యాపారం. వాళ్ళందరూ పెద్ద పెద్ద భవనాల్లో అన్ని సుఖాలూ అనుభవిస్తూ బాగానే వుంటారు. కానీ పట్టుబడి జైలుకి వెళ్ళేవారు మాత్రం రోడ్దు మీద చిల్లర డబ్బుల కమిషన్ కోసం అమ్మకాలు చేసే నల్లవారు, మెక్సికన్స్. వారిలో కొంతమంది ఎన్నో సంవత్సరాలు జైళ్ళల్లో మగ్గుతున్నారు. చిన్న చేపల్ని పెద్ద చేపలు తినటం అంటే ఇదే కాబోలు.

ఏ దేశపు గొప్పతనమైనా అక్కడ ఎంతమంది బిలియనీర్లు, మిలియనీర్లు వున్నారన్న కొలమానం మీద ఆధారపడదు. కనీసం తినటానికి కూడా తిండి లేక బాధపడుతున్న కటికపేదవారున్నంతవరకూ ఏ దేశమూ గొప్పదవదన్న నిజాన్ని మనం గుర్తించటం అవసరం!

*****


Feedback
editor@madhuravani.com
 
©  2022 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా editor@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed
 &  Maintained
 by
Srinivas Pendyala

bottom of page