top of page

“దీప్తి” ముచ్చట్లు

బై బై ఛార్లీ!

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg
samputi.jpg
maagurinchi.jpg
rachanalu.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

బీచ్ ఒడ్డునే ఉన్న థాయ్ రెస్టారెంట్ అది. సముద్రం మీదుగా వీస్తున్న చల్లని గాలులు, మేఘాల వాలుగా కురుస్తున్న సన్నటి తుంపరలు కలగలిసి ఆహ్లాదకరంగా ఉన్న ఆ వాతావరణంలో లోపల వెచ్చగా కూర్చుందామన్న నా ప్రతిపాదనని ఏకగ్రీవంగా తిరస్కరించారు పిల్లలు, చరణ్.

 

బయట లాన్ మధ్యలో అందంగా తీర్చిదిద్దిన లాఫింగ్ బుద్ధ ఫౌంటెయిన్ పక్కనే ఉన్న డైనింగ్ ఏరియాలో కూర్చున్నాము. చూడముచ్చటగా తీర్చిదిద్దారు ఆ ప్రదేశాన్ని.  ఆధునికత, సాంప్రదాయం కలగలిసిన లాంతర్లు చూరు చుట్టూరా అందంగా వేలాడుతూ ఉన్నాయి. ఆ ప్రదేశం మధ్యమధ్యలో అలంకరించిన ఆర్కిడ్ చెట్ల పూలు లేతనీలం రంగు గచ్చుపై పడి గులాబీ నక్షత్రాల్లా మెరుస్తున్నాయి.

లోపలా, బయటా గోడలపై "రామకియెన్" చిత్రాలు. ఆ కుఢ్యచిత్రాలని చూపిస్తూ రామకియెన్ అవటానికి మన రామాయణం కథే అయినా థాయ్ వర్షన్లో పేర్లు, పాత్రలు ఎలా మారాయో ఆద్యకి, అర్ణవ్ కి చెబుతున్నాడు చరణ్. చెవులు వాళ్ళ మాటలపై ఉన్నాయే కానీ, నా దృష్టి మాత్రం వాళ్ళపై లేదు. ఆ పరిసరాలలో అందాన్ని, సాంప్రదాయంలో స్వచ్ఛతని ఆస్వాదిస్తూ అలంకరణలో ఏది ఎక్కువ బావుందో తేల్చుకోలేక చుట్టూరా కలియచూస్తూ లోపలి వైపు తొంగి చూసాను. అక్కడ నా చూపుని కట్టిపడేసింది ఓ మూలనున్న గణేశుడి విగ్రహం. ఎంత అందంగా నవ్వుతున్న విగ్రహమో! అలాంటి నవ్వుముఖంతో ఉన్న ఇత్తడి విగ్రహం కావాలని కొన్నేళ్ళుగా ఎదురుచూస్తున్నాను. చరణ్ విసుక్కుంటాడు నన్ను. గణేశుడి విగ్రహంలో నవ్వెలా తెలుస్తుందని. మరీ పిక్కీగా ఉండొద్దని. తొండముంటేనేం? మొహంపై నవ్వంటూ ఉంటే, కళ్ళలో ప్రస్ఫుటంగా కనిపించదూ? గత రెండేళ్ళుగా మాస్క్ వెనుక నవ్వుల్ని పట్టిస్తుంది మన కళ్ళేగా? చరణ్ కి ఆ చిరునవ్వుల గణేశుణ్ణి చూపించబోయి ఆగిపోయాను. వాళ్ళని డిస్టర్బ్ చేయాలనిపించలేదు. మరోసారి చూపు అటుకేసే వెళ్ళింది. ఈసారి నన్నాకట్టుకున్నవి విగ్రహం ముందు ఉన్న గంగాళం లాంటి పెద్ద ఇత్తడి పురాతన పాత్రలోని నీటిలో అబ్బురంగా తేలియాడుతున్న ఆర్కిడ్ పూలు. గులాబీ ముత్యాల్లా మెరుస్తూ!

 

చూపు తిప్పుకోవటానికి కష్టపడకుండానే గుచ్చి గుచ్చి ఎవరో చూస్తున్నట్టనిపించి కౌంటర్ వైపు చూసాను. కౌంటర్ వెనకాల ఏప్రాన్ వేసుకుని ఉన్న ముసలావిడ మావేపే చూస్తుంది. షెఫ్ అయుంటుందా? లేక ఓనరా?  నేనూ ఆవిణ్ణి అలాగే పరీక్షగా చూసాను. నెరిసిన జుట్టు ఆవిడ తలకి థాయ్ పద్ధతిలో చుట్టుకున్న నల్లని స్కార్ఫ్ వెనుక దాగట్లేదు. మొహంలో ముడుతలు ఆవిడ వయసుని సరిగ్గా చెప్పలేకపోతున్నాయి. చిన్న కోల మొహంలో ఆ కళ్ళు లేతనీలం రంగులో గాజుగోళాల్లా మెరుస్తున్నాయి. ఆగ్నేయ ఏషియన్ లా అనిపించట్లేదెందుకో.

ఆవిడ ఏ పనీ చేయకుండా అలా నిల్చునే ఉంది. బహుశా ఆవిడ ఈ రెస్ట్రాంట్ ఓనరేమో. పర్యవేక్షణకై నిలుచుందేమో. ఎవరికన్నా కూడా మాపైనే ఓ దృష్టి పారేసి ఉంచింది. నేను అది గమనిస్తున్నానని తెలిసినప్పటికీ ఆమె మాత్రం చూపు తిప్పుకోలేదు. నాకే ఇబ్బందిగా తోచి 'హాయ్' అన్నట్టుగా పెదిమలు కదుపుతూ పలకరింపుగా నవ్వాను. తిరిగి నవ్వనైనా లేదు. అదే చూపు. అదోలా. 'క్రేజీ!' అని గొణుక్కున్నాను. అటూ ఇటూ చూసాను. తిరిగి చూసీ చూడనట్టుగా ముసలావిడని చూసాను. అదే చూపు. కొన్నిసార్లు సూటిగా ఉండే చూపూ కొంచెం తేడాగా తోస్తుందనుకుంటా. గమనిస్తే ఆవిడ గమనిస్తున్నది నన్నే అనిపించింది. ఎందుకో అసౌకర్యంగా అనిపించింది. ఇంతలో "పల్లవీ, నువ్వేమి తీసుకుంటావు?" చరణ్ పిలవటంతో అటు తిరిగాను. నా సేఫ్ బెట్  అయిన రెడ్ కర్రీ ఒకటి చెప్పి, వెయిట్రస్ ఆర్డర్ తీసుకుని వెళ్ళాక, తిరిగి కౌంటర్ వైపు చూసాను.  ఇంకా నన్నే చూస్తుంది ఆవిడ.

 

"చరణ్! ఆ వైపున్న ముసలావిడ ఎందుకో నా వైపే అదోలా చూస్తుంది చాలాసేపటినుంచి!" నేనలా అంటూండగానే ఠక్కున ఆవిడ వైపు తిరిగి చూడబోయాడు చరణ్. వెంటనే వారించాను. "మెల్లిగా. ఆవిడ గురించి మనం మాట్లాడుకుంటున్నట్టు తెలీకుండా యథాలాపంగా చూసినట్టు చూడు" అన్నాను మళ్ళీ.

 

ప్రయత్నించాడు కానీ చరణ్ కి అంత నాజూకైన వ్యవహారాలు పడవు. ఆసక్తిగా ఆవిడ వైపు చూసాడు. పిల్లలు కూడా చటుక్కున ఆవిడ ఉన్న వైపు తిరిగారు. చరణ్ తిరుగుతూండగానే ఆవిడ ఠక్కున వెనుదిరిగి వెళ్ళిపోయింది. ముగ్గురూ నన్ను ప్రశ్నార్థకంగా చూసారు. "ఎవరూ లేరుగా?" అన్నట్టుగా. "మళ్ళీ కనబడితే చూపిస్తానులే, చిత్రంగా ఉంది ఆవిడ తీరు!" అన్నాను.

 

ఆర్డరిచ్చిన వంటకాలు, థాయ్ వాళ్ళ హిందూయిజం మొదలైన అంశాలపై ముచ్చట్లు సాగాయి ఆర్డర్ వచ్చేలోపు. ఆ తర్వాత తినటం అయిపోతూనే అక్కడి ఆహ్లాదకర పరిసరాల్లాగే, ఆతిథ్యమూ, వంటకాల రుచీ చాలా బాగుందని ఆద్య అయిదు ఆనంద నక్షత్రాలనిచ్చింది అప్పటికప్పుడిచ్చిన తన గూగుల్ రివ్యూలో. ఆద్యకి, చరణ్ కి ఏదైనా నచ్చటమే కష్టం కానీ, నచ్చాయంటే టిప్పులు, రివ్యూలు దండిగానే ముట్టజెబుతారు. 

రోడ్ ట్రిప్ లో భాగంగా చేరిన ఈ "కార్పస్ క్రిస్టీ" అనే చిన్న ఊరిలో తిరిగి, తిరిగి అలసి ఉన్నామేమో, కడుపునిండా తిన్నాక ఇక కదలాలనిపించలేదు. హోటెల్ కి వెళ్ళిపోయి ఒక కునుకేస్తేనో? అనిపించింది. కానీ, అర్ణవ్ మాత్రం ముందనుకున్న ప్లాన్ ప్రకారం "హాంటెడ్ షిప్" కి వెళ్ళాల్సిందే అని పట్టుబట్టాడు. క్రితం రాత్రి నుంచీ వాడు ఎదురుచూస్తున్నాడు. "బ్లూ ఘోస్ట్" గా పేరుబడ్డ మెరైన్ షిప్ లో ఉండే కెప్టెన్ ఛార్లీని కలిసేందుకు.  అది నిజానికి రెండవ ప్రపంచయుద్దంలో వాడబడిన ఓ యుద్ధ నౌక. ఆ చారిత్రాత్మక విశేషాలు పిల్లలకి చూపించాలనుకున్నాము. కానీ, వాడు మాత్రం దాని మీద అల్లబడిన కథలన్నీ వైనవైనాలుగా వర్ణించి చెప్పాడు. వాడి కథప్రకారం - అది ఓ హాంటెడ్ షిప్. అందులో ఛార్లీ అనే కెప్టెన్ దెయ్యమై ఇంకా తిరుగుతూనే ఉంది/ఉన్నాడు (? - ఏమనాలో మరి. దెయ్యాలన్నీ స్త్రీలింగమెందుకయ్యాయో మరి? ఈ సందేహం పక్కనబెడితే,) ఆ ఛార్లీ అల్లరి దయ్యమన్నమాట. కొందరు సందర్శకులకి, అందులో పనిచేసే సిబ్బందికి అపుడపుడూ కనబడి అప్పటి విశేషాలూ చెబుతూంటాడట! అపుడపుడూ కొంచెం సరదాగా ఆటపట్టిస్తూనూ ఉంటాడట. ఇపుడు మేమెళ్ళి హాయ్ చెప్పాలట ఛార్లీకి! క్లుప్తంగా చెప్పాలంటే  ఆ నావపై దెయ్యాన్ని కలవాలన్నమాట.

 

సరే, వాడు చెప్పాక కాదనేదేముంటుంది. అదీ కాక, నాకసలే దెయ్యాలంటే బహు ప్రీతి కదా, నేనూ ఒకింత వాడి వైపే మొగ్గాక మిగిలిన ఇద్దరికీ తప్పలేదిక. "మరి నువ్వే డ్రైవ్ చేయాలి. నాకు ఆయాసంతో కాస్త నిద్రొస్తున్నట్టుగా ఉంది." చరణ్ ముందే చెప్పేసాడు. నేనూ సరేనన్నాను.

 

బిల్లు పే చేసేసి, పార్కింగ్ లాట్ వైపెళ్ళాము. చిత్రంగా కారు లాకయి లేదు. ఆశ్చర్యపడ్డాము. ఒకటి- మేము చేరిన ఈ ఊరు చరిత్ర మామూలుది కాదు. ఇంతకుముందు ఈ ఊరులోని హిల్టన్ హోటెల్ పార్కింగ్ లాట్ లో పార్క్ చేసిన గంటలో మా మిత్రుల కారు చక్రం దొంగిలించబడిందని బహు బాగా గుర్తుంది. ఇంకా అలాంటివెన్నో విని ఉండటం వల్ల కారుని లాక్ చేయకపోయేంత అజాగ్రత్తగా ఉండే ప్రసక్తే లేదు. రెండు- చేయకున్నా, అది ఆటో లాక్ అయిపోయేది కూడానూ. మరి మేము తిరిగొచ్చిన రెండు గంటలకి కారు తెరిచి ఉండటంతో కంగారుగా ఓసారి కారుకి సంబంధించిన అన్ని పార్టులూ ఉన్నాయో లేదో అని వెదుక్కున్నాము. అన్నీ ఉండాల్సినచోటే ఉన్నాయని తేల్చుకున్నాక, మెల్లిగా కారెక్కి కూర్చున్నాము.

 

అర్ణవ్ కూర్చోబోతూ ఒక్కసారి షాక్ కొట్టినట్టుగా "ఎవరో ఉన్నారు" అంటూ కారు దిగాడు. వాడి అరుపుకి అటువైపు వెళుతున్న ఇద్దరు ముగ్గురు మావేపే చిత్రంగా తిరిగి చూసారు. ఆద్య నవ్వి, "ఇదిగో, హోటెల్ వాడిచ్చిన షార్క్ బొమ్మపై కూర్చున్నావు" అంటూ వాడి సీట్లోంచి ఆ సాఫ్ట్ టాయ్ ని తీసి తన ఒళ్ళో పెట్టుకుంది. వాడు ఏదో గొణుక్కుంటూనే సీట్లో కూర్చున్నాడు. "వీడిపుడెళ్ళి ఛార్లీని కలవాలట." ఉడికించింది వాణ్ణి. వాడు ఉక్రోషంతో "ఇట్ ఫెల్ట్ క్రీపీ" అని సర్దుకుని, వెనకాలకి వంగి ట్రంకులో ఏదో వెదికాడు.

 

"ఇప్పుడేగా తిన్నావు? మళ్ళీ స్నాక్సా? సరిగ్గా కూర్చో" విసుక్కున్నాను కారు స్టార్టు చేస్తూ. "లేదమ్మా. స్నాక్స్ కోసం కాదు. ఎవరో ఉన్నారనిపిస్తుంది."

 

"ఎక్కడా? ట్రంకులోనా?" చరణ్, ఆద్య కిచకిచా నవ్వారు. వాడు వెదుక్కుంటున్నది ఏదో లీలగా అద్దంలో ఓ సెకండు పాటు నాకు కనబడ్డట్టయింది. ఉలిక్కిపడ్డాను. భ్రమేమో. అర్ణవ్ వైపు చూసాను. వాడింకా అయోమయంగా అటూ ఇటూ చూస్తున్నాడు. చరణ్ ని వాడి పక్కన కూర్చోమని చెప్పి ఆద్యని ముందుకు రమ్మన్నాను. వాడికి ధైర్యంగా ఉంటుందేమోనని. వాడిని మాటల్లో పెట్టాడు చరణ్.

 

గూగుల్ చెప్పినట్టల్లా నడుపుతున్నాను. ఓ పెద్ద స్మశానం ఊరి మధ్యలో. ఇక్కడ హాలోవీన్ పండుగ బాగా జరుపుతారట. దాని మీదుగా రెండు మలుపులు తీసుకున్నాక, ఉన్నట్టుండి నేను స్ట్రైట్ గా వెళ్ళాలని గూగులమ్మ చెబుతున్న చోట రోడ్ రెండు వైపులా  ఆగిపోవటంతో,  గూగులమ్మని విసుక్కుంటూ, కనబడుతున్న ఒకే ఒక ఆప్షన్ అయిన లెఫ్ట్ తీసుకున్నాను. ఆ రోడ్డుపై అయినా రైట్ తీసుకుని, ఎలాగోలా తిరిగి తోవలో పడేందుకు  చూస్తూంటే,  ఆ సన్నటి లెఫ్ట్ రోడ్ కూడా ముగిసి, రైట్ తీసుకోనీయకుండా "వన్ వే! డూ నాట్ ఎంటర్." అని ఎర్రెర్రటి అక్షరాలతో బోర్డు కనబడింది. నాకు మరో లెఫ్ట్ తీసుకోక తప్పలేదు. అనివార్యమయింది. చివరికి మళ్ళీ ఇందాక చూసిన స్మశానం ఎంట్రాన్సు వద్దకే వచ్చాను. చుట్టూతా జరుగుతున్న కన్స్ట్రక్షన్ పనుల వల్లేమో, ఈ గూగుల్ మ్యాప్ ప్రదేశాలని సరిగ్గా పట్టుకోలేకపోతున్నట్టుంది.

 

"ఎక్కడికెళుతున్నావు?  ఇందాక మిస్సయుంటే కనీసం ఇక్కడయినా రైట్ తీసుకోవాల్సింది కదా." చరణ్ అడిగాడు.

 

"అదే కదా! అదేంటో, ఈ రోడ్డు “వన్ వే!” అని చూపెడుతుంది. లేకపోతే ఈ స్మశానం చుట్టూ ప్రదక్షిణం చేయటం నాకు మాత్రం సరదానా?"  ఆ మాటలంటూనే ఆ పక్కనే ఉన్న స్మశానం వైపు చూసాను. నిజమే, కారులో అనివార్యంగా ఓ ప్రదక్షిణ పూర్తయింది.

 

"'వన్ వే!' బోర్డా? అదెక్కడుంది. అటువేపు కార్లు వెళుతున్నాయి చూడు?" ఆదుర్దాగా అన్నాడు చరణ్. నిజమే. కార్లు వెళుతూనే ఉన్నాయి. మరి నేను చూసిన ఎర్రెర్రని అక్షరాల "వన్ వే" బోర్డు? నన్ను లెఫ్టు అనివార్యంగా తీసుకునేలా చేసిన బోర్డు?

 

సన్నగా భయం మొదలైంది. ముందుకి వెళ్ళి జనసమ్మర్ధం లేని చోట రోడ్డు పక్కన పార్కింగ్ చేసి దిగ్గున దిగాను. అసంకల్పితంగా కారు డోర్లు అన్నీ తెరిచి నిలబడ్డాను. నా పక్కగా స్మశానంలోకి వెళుతూన్న ముసలావిడ నా వేపు తిరిగి చూసింది. ఆమెని చూడగానే భయం వెన్నులోకి సన్నగా పాకింది. ఆవిడ ఇందాక కౌంటర్ లో కనబడ్డ ముసలావిడ. అదే అన్నాను చరణ్ తో. చరణ్ కూడా కారు దిగాడు. చుట్టూ చూసాడు. "ఎక్కడా?" అన్నాడు. "అదిగో, వెళుతుందిగా. కనబడట్లేదా?" అనుమానంగా అడిగాను. వింతగా చూసాడు నన్ను.

 

ఆవిడ వెళ్ళిన వైపు మరోసారి చూసాను. ఆమె వెళుతున్న తోవ వెంబడి తాజాగా మెరుస్తూ ఆర్కిడ్ పూలు! గులాబీ కెంపుల్లా.

 

"పోనీ, ఆ పూలు కనబడుతున్నాయా?" అడిగాను చరణ్ ని!

 

తల అడ్డంగా ఊపి, ఇంకొంత చిత్రంగా చూసాడు నా వైపు. "సరే! అయితే నువ్వూ వాడి పక్కన కూర్చుని కార్ లో ఇంకెవరయినా ఉన్నారేమో చూడండి. లెట్ మీ డ్రైవ్. మీరిద్దరూ నిన్నటి నుంచీ దెయ్యాలని చూసేందుకు తెగ సరదాపడుతున్నట్టున్నారు! " అంటూ డ్రైవింగ్ సీట్ లో కూర్చుని "హాంటెడ్ షిప్" లొకేషన్ మ్యాపులో మరోసారి చూసుకున్నాడు. 

 

"హాంటెడ్ షిప్ కి వద్దు డాడీ! మన హోటెల్ స్వీట్ కే వెళ్ళిపోదాం" అర్ణవ్ హఠాత్తుగా నిర్ణయం మార్చుకున్నాడు. నేనూ వాణ్ణే సమర్థించాను. ఆద్య, చరణ్ మొహమొహాలు చూసుకున్నారు. "ఏమయింది మీ ఇద్దరికీ? నిజంగా దెయ్యాన్ని చూసినట్టు మొహాలలా పాలిపోయాయి?!" అంటూ మ్యాప్స్ లో లొకేషన్ హోటెల్ కి రీసెట్ చేసాడు.

 

అర్ణవ్, నేను వెనకాల సీట్లలో పక్కపక్కనే కూర్చున్నాము.  కారు స్టార్టయింది. వాడు నా పక్కగా మరింత జరిగి, ఒదిగి కూర్చున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత, ఎవరికీ వినబడకుండా నన్ను మెల్లిగా అడిగాడు. వాడి మొహంలో నేనెపుడూ చూడని భయం ఛాయలు. "అమ్మా, ఆవిడ ముసలావిడా? అయితే?"

 

"అవును. నీకు కనబడలేదా?" నేనూ గుసగుసగా అడిగాను వాణ్ణి. నిర్ధారించుకోవాలనేమో. నాకింకా దడ తగ్గలేదు.

 

"కనబడలేదు. కానీ, చాలా అల్లరి దెయ్యం. నన్ను గిల్లుతూనే ఉంది. రెస్ట్రాంట్ నుంచీ ఇక్కడి వరకూ మన కార్లోనే వచ్చి, నువ్వు కార్ ఆపినపుడే దిగింది. ఐ కుడ్ ఫీల్ హర్!" అన్నాడు. 

 

దడ పెరిగింది. సన్నటి చలి. బ్లాంకీ కప్పుకుంటూ మెల్లిగా సర్దుకుని "నేను చూసిందీ, నిన్ను  గిల్లిందీ ఒక దెయ్యమే అంటావా?" అనుమానం తీరక అటూ ఇటూ చూస్తూ అడిగాను.

 

 వాడు బయటకి చూస్తూ చెప్పాడు. "ఇందాక నువ్వు ముగిసిందనుకున్న రోడ్డు మీదే ముందుకి వెళుతున్నాము మనమిపుడు! పైగా, నువ్వన్న “వన్ వే!"   బోర్డూ నాకు కనబడలేదు.  వన్ వే బోర్డు లాగే, రోడ్డు ముగిసినట్టు నువ్వు భ్రమ పడటమూ ఆ దెయ్యం ముసలావిడ పనే. దిగాలనుకున్న చోట దిగేందుకేమో?"

వాడు అంత ధీమాగా చెబుతుంటే నేనూ కొంచెం సర్దుకున్నాను. 

 

హోటెల్ కి వెళుతూంటే మధ్యలో హాంటెడ్ షిప్ దూరంగా కనబడింది. దాన్ని చూస్తూనే, "హాయ్ ఛార్లీ!" అంటూ ఆద్య అల్లరిగా అరిచింది.

 

ఈ సారి అర్ణవ్ స్పందించలేదు. నేనూ మౌనంగా ఉన్నాను. ఏమో మరి! పిలవగానే 'ఓయ్' అంటూ వచ్చేస్తేనో?

 

*****

bottom of page