MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మా గురించి
2016 లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాహిత్యాభిమానులకి ఒక చిరు కానుకగా సాహిత్యాభిమానులం కొంత మంది కలిసి ప్రారంభించిన ఈ "మధురవాణి" అంతర్జాల సాహిత్య పత్రికకి సాదర స్వాగతం. చిలుకూరి సత్యదేవ కవీంద్రుడు రచించిన ఈ క్రింది పద్యం మధురవాణి పత్రిక నిర్వహణలో మాకు మేము నిర్దేశించుకున్న కొన్ని ఆశయాలకి అద్దం పడుతుంది.
సీ. పరమేష్ఠి మదిలోన విరబూసినట్టిదౌ
మల్లెపూతీవె యీ మధురవాణి
ధవళవసనములన్ ధరియించి రాయంచ
నధిరోహణము సేయు మధురవాణి
కరమందు మాణిక్యవరవీణ మీటుచున్
మధురవాగ్ఝరినిచ్చు మధురవాణి
సాహిత్య సంగీత సారమ్మునింపుగా
మదిని నిల్పెడి తల్లి మధురవాణి
ఆ. కథల కథనములను, కైతల హృదియందు
పద్యభావమందు, గద్యమందు,
వ్యాస, గీతములను పాండిత్యమధురిమల్
చిలుకు మధురవాణి, పలుకుపడతి!
అమెరికాలోని హ్యూస్టన్ మహానగరంలో “మధురవాణి" సుమారు నలభై ఏళ్ల క్రితమే, కేవలం 25 తెలుగు కుటుంబాలు మాత్రమే ఉండే రోజులలో మొదలుపెట్టి, మా తెలుగు సాంస్కృతిక సమితికి అనుబంధంగా ఉన్నప్పటికీ పాతికేళ్ళ పాటు సాహిత్యానికి పెద్ద పీట వేసి, అమెరికాలో తొలి సాహిత్య పత్రికలలో ఒకటిగా గుర్తింపు పొందడం అందరికీ తెలిసినదే. కాలక్రమేణా కొన్నేళ్ళు కేవలం సంస్థాగత సమాచార పత్రికగా మారిపోయి, గత పదేళ్ళగా సుదీర్ఘ సుషుప్తి లోకి జారుకుంది మధురవాణి. ఆ “మధుర వాణి” ని నిద్ర లేపి, ముస్తాబు చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఒక అంతర్జాల పత్రికగా తీర్చిదిద్దడమే మాకు మేము నిర్దేశించుకున్న ఆశయం.
ఉన్నవి చాలక ఇంకో అంతర్జాల పత్రికా? అని ఎవరైనా అడిగితే... అవును, "ఉన్నవి చాలకే" అని ఒక సమాధానమూ, "మా ఉన్నత ప్రమాణాలకి తగిన" లాంటి పడికట్టు పదాలతో ఇతరులని తక్కువ చేయకుండా రచయితలనీ, పాఠకుల పాటవాన్ని గౌరవిస్తూ ఆత్మీయ వాతావరణంలో సరదాగా సాహిత్యపరంగా అందరం కలిసి మెలిసి “సాహిత్యానందం” పొందే సదుద్దేశంతో మాత్రమే ఈ పత్రిక నిర్వహించబడుతుంది.
ఈ అంతర్జాల పత్రిక “మధురవాణి” ఏడాదికి నాలుగు సార్లు వెలువడుతుంది. ప్రతీ ఏడూ జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ లలో వచ్చే మన పండుగల సందర్భంగా మధురవాణి వెలువరించే ప్రణాళికలో ఉన్నాం.
ఏ సంస్థ తోటీ అనుబంధం లేకుండా కేవలం సాహితీ బంధుత్వం మాత్రమే ఉన్న ఈ క్రింది ఔత్సాహికులు స్వచ్చందంగా, ఉత్సాహంగా నిర్వహిస్తున్న పత్రిక ఈ “మధురవాణి”. మేము భారత దేశంలో వేరు వేరు ప్రాంతాల నుంచి అమెరికా వలస వచ్చిన చాలా మందిలో కొంత మందిలా హ్యూస్టన్ నగరంలో నివసించడం ఎంత యాదృచ్చికమో, భిన్నత్వంలో ఏకత్వంలా మా అందరినీ కలిపిన ఏకైక అంశం తెలుగు సాహిత్యాభిలాష. ఆ అంశమే “మధురవాణి” పునరుజ్జీవనానికి ప్ర్రాణం పోసింది. మాలో అందరూ సమానులే కానీ ఎవరూ “ఎక్కువ” సమానులు కాదు సుమా!
అందరూ ఊహించే విధంగానే ఈ పత్రికలో కూడా మంచి కథలూ, కమామీషులూ, కవితలూ, వ్యాసాలూ, విశ్లేషణలూ సరదాగా నవ్వుకునే హాస్య & వ్యంగ్య రచనలూ, చిత్రాలూ, ఆధ్యాత్మిక విషయాలూ మొదలైన హంగులన్నీ ఉంటాయి. వాటిల్లో మీకు నచ్చినవి ధరించండి, నచ్చనివి భరించండి.
“మధుర వాణి” కి సంబంధించిన ఏ విషయానికైనా సంప్రదించవలసిన ఇమెయిల్ sahityam@madhuravani.com
భవదీయులు
| శ్రీనివాస్ పెండ్యాల | దీప్తి పెండ్యాల | వంగూరి చిట్టెన్ రాజు | మధు పెమ్మరాజు | శాయి రాచకొండ | విన్నకోట రవి శంకర్ |
Disclaimer
మధురవాణి లో ప్రచురించబడిన రచనలలో అన్ని అభిప్రాయాలూ పూర్తిగా ఆయా రచయితలవే.
మధురవాణి నిర్వాహక బృందం ఎటువంటి పర్యవసానానికీ బాధ్యత వహించదు. ఈ విషయంలో వాదోపవాదాలకు తావు లేదు.
******