top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg
samputi.jpg
maagurinchi.jpg
rachanalu.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

మధురవాణి ప్రత్యేకం - భువనోల్లాసం

నా కథ -2

భువనచంద్ర

జరిగిన కథ:

మొదటి ఎపిసోడ్ లో జరిగిన కథ- క్లుప్తంగా: 

బాలా త్రిపుర సుందరి తల్లి తండ్రి ఆమె 17వ యేట విడిపోయారు. తల్లి దిలావర్ అనే ముస్లింని ప్రేమించి ఆస్ట్రేలియా వెళ్లిపోతే, తండ్రి సరోజినీ ఆంటీ అనే ఓ డాన్సర్ తో బొంబాయి లో సెటిల్ అవుతాడు. బాలని శ్రీనివాస్, పశుపతి, జీవన్ అనే ముగ్గురు ప్రేమిస్తున్నా నిర్లిప్తంగా ఉంటుందే తప్ప ఏ సమాధానమూ ఇవ్వదు. బాలకి డబ్బు, ఇల్లు, కార్లు, తోటలు అన్నీ ఉన్నాయి, తోడు మాత్రం ఎవరూ లేరు. స్వేచ్ఛ నిండుగా ఉన్న ఒంటరితనం బాలది.

తరువాతి కథ చదవండి:

“మా అమ్మ నిన్ను దగ్గరుండి మరీ తీసుకుని రమ్మన్నది, నువ్వు అంటే మా అమ్మకి ప్రాణం”, అని కళ్లు మెరుస్తూ ఉండగా అన్నాడు జీవన్.

“అదేదో పూజో, వ్రతమో అన్నారు అందుకేగా?” నవ్వి అన్నాను.

“ఎందుకు నవ్వావు?” లలిత అడిగింది.

“నవ్వుతూ మాట్లాడటం మర్యాద అని ఇంగ్లీష్ వాళ్లు అంటే, నవ్వు నాలుగు విధాల చేటు అని మనవాళ్లు అన్నారు. ఏది రైటో తేల్చుకోలేక ఇంగ్లీష్ వాడికే కాస్త విలువ ఇచ్చాను”, పకపకా నవ్వి అన్నాను.

“బయలుదేరుదామా?” ఉత్సాహంగా అన్నాడు జీవన్.

“జీవన్, నేను దేవుణ్ణి నమ్ముతాను. దేవుణ్ణి నమ్ముతాను అంటే పూజలనీ, వ్రతాలనీ మంత్రాలనీ నైవేద్యాలనీ నమ్ముతానని కాదు. ప్రసాదాల వరకూ ఓకే. ఆకలితో ఉన్నవాడి ఆకలి కొంతైనా చల్లారుస్తాయి ప్రసాదాలు. నా దృష్టిలో దేవుడంటే సర్వాంతర్యామి. నీలో నాలో చీమలో దోమలో కూడా ఉన్నాడు. ఇప్పుడు నీతో వస్తే మీ అమ్మగారు నన్ను కూడా పూజకి కూర్చోబెడతారు. మూడు గంటలు కూర్చోవడం నావల్ల కాదు. ఎందుకంటే శరీరం పూజలోనూ మనసు ఊహల్లోనే ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. మధ్యాహ్నం వచ్చి ప్రసాదం తీసుకుంటా” స్పష్టంగా చెప్పాను.

“అమ్మకి ఏం చెప్పనూ?” ఇబ్బందిగా అన్నాడు.

“నేనన్నది యధాతథంగా చెప్పగల ధైర్యం ఉంటే అదే చెప్పు, లేదంటే నీ ఇష్టం వచ్చిన కారణం చెప్పు” ఛాయిస్ అతనికే వదిలేశాను.

“సరే…” బయలుదేరాడు, మొహంలో కాస్తంత అసంతృప్తి కనిపించింది. మధ్యతరగతి మొహాలు అద్దాలాంటివి. మనసులోని భావాల్ని క్షణాల్లో ప్రతిఫలిస్తాయి. ఆ విషయాన్ని నేనే కాదు లలిత కూడా కనిపెట్టింది.

“పాపం చిన్నబుచ్చుకున్నాడే సందూ. మరీ అంత నిర్మొహమాటం పనికిరాదు” కొంచెం చిరుకోపంతో అంది. దాని దృష్టిలో అది నాకు కేర్ టేకర్.

“అతను అసంతృప్తిగా ఉన్నది నేను పూజకి వెళ్లకపోవటంవల్ల కాదు. తన మనసుని మరోసారి బయటపెట్టే ఛాన్స్ పోయిందని” పకపకా నవ్వి అన్నాను.

“అదేం.. చెప్పొచ్చుగా!” అమాయకంగా అడిగింది లలిత.

“చెప్పాలంటే అడ్డంగా ఉన్నది నువ్వేగా. ఇంకేం చెబుతాడు?” చచ్చేట్టు నవ్వాను. అప్పటికి కానీ దానికి బల్బు వెలగలా.

“ఒకవేళ చెప్పాడే అనుకో, ఏం చేస్తావు? ఏం జవాబు ఇస్తావు?” కుతూహలంగా అడిగింది.

“అతనే తల్లి మీద ఆధారపడి ఉన్నవాడు. అంతే కాదు, జీవితాన్ని నిర్మించుకోవాలనే ఉద్దేశం ఏమాత్రమూ లేనివాడు. అటువంటి వాళ్ళు కేవలం ప్రేమించగలరు. నిన్నైనా నన్నైనా. ప్రేమని గెలుచుకున్నా ఓడిపోయినా వాళ్లేమీ దేవదాసులు కారు. తమ మీద తామే జాలిపడి, మరో అమ్మాయి ప్రేమ కోసం తొందరగానే పలవరించడం మొదలెడతారు” తేలిగ్గానే అన్నాను.

“చాలా అన్యాయం సుందూ, ఎదుటి వాళ్ల ప్రేమని అలా కాఫీలో పడ్డ ఈగని తీసేసినట్టు తీసేయడం చాలా తప్పు.  నువ్వు ప్రేమించాలని నేను అనడం లేదు, ఆ విషయమే  స్పష్టంగా అతనితో చెబితే బాగుంటుందిగా” కొంచెం సీరియస్ గానే అన్నది లలిత.

“ఆ విషయం అతనికి తెలీక కాదు, ఆ మాత్రం గ్రహించలేని వాడు కాదు” నేను నిర్లిప్తంగా అన్నాను.

“మరి?” ప్రశ్నించింది.

“నువ్వూ నాతోటి ఇవాళ వాళ్ళింటికిరా” లేచాను నేను.

***

 

“శ్రీనివాస్ ని నమ్మకు” పక్కనే కూర్చుంటూ అన్నది కామేశ్వరి. అంతకు గంటకు ముందే నేను షాపింగ్ కని “టేక్ అవే” (take away) మాల్ కి వచ్చాను. షాపింగ్ పేరిట టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఏది కావాలో నిర్ణయించుకున్నాకే షాపులో అడుగు పెడతాను. ఇవాళ ఓ పదిహేను గిఫ్టులు కొనాల్సి వచ్చింది. ఎప్పుడూ గిఫ్టులను ఇంట్లో స్టాకు చేసుకోవడం అలవాటు. ఎప్పుడు ఎవరు వచ్చినా తడుముకోనక్కరలేదు.

మాల్ నుంచి లిఫ్ట్ లో కిందకు వస్తుంటే కలిసింది కామేశ్వరి. డిగ్రీ లో నా క్లాస్ మేట్ అది. చాలా పోష్ కేరక్టర్. అద్భుతమైన సౌష్టవానికి తోడు వెర్రెతించే డ్రెస్సులు వేయడంలో కుర్రాళ్ళకి డార్లింగ్ అయిపోయింది. ఎవరితో మాట్లాడినా హాయిగా, ఫ్రీగా మాట్లాడుతుంది.

“ఏమైంది?” కార్ స్టార్ట్ చేస్తూ అడిగాను.

“రేవతిని ఫామ్ హౌస్ చూపిస్తానని తీసుకెళ్లి అసభ్యంగా బిహేవ్ చేశాడట”

“రేవతి ఎలా బయటపడిందీ?”

“అలాగే అన్నట్టు నటిస్తూ ఎక్కడ ‘తన్నాలో’ అక్కడ తన్ని బయటకొచ్చిందట. పోలీస్ రిపోర్ట్ ఇస్తానని బెదిరించి మరీ”

“మంచిపని చేసింది. శ్రీనివాస్ ని నమ్మకు అని నాతో ఎందుకు చెబుతున్నావు?” డ్రైవ్ చేస్తూనే అడిగాను.

“బాలా, నీతో చెబుదామని చాలాసార్లు అనుకుని కూడా చెప్పకుండా ఉండడానికి ఎంత ప్రయత్నించానో తెలుసా? శ్రీనివాస్ అందరితో చెబుతున్నాడట, నిన్ను లవ్ లో పడేస్తానని. పశుపతి అయితే ఇంకొంచెం ముందుకెళ్లి నువ్వే అతనన్నా అతని పాటన్నా పడి చచ్చిపోతున్నావని బిల్డప్ లు ఇస్తున్నాడట. మన ఫ్రెండ్ సర్కిల్ అందరికీ ఈ విషయాలు తెలిసినా నీ ముందు ఎత్తరు. ఇవాళ ఏమైనా నీతో చెప్పితీరాలనుకున్నాను. గుడ్ లక్ ఏమంటే- ఇక్కడే నిన్ను కలవడం”

కామేశ్వరి వంక చూశాను ఆమె ముఖంలో 100% సిన్సియారిటీ కనిపించింది.

“నీ మీద ఏ ట్రిక్కూ ప్రయోగించలేదా?” అడిగాను.

“వంద సార్లు ట్రై చేశాడు. కొన్నిసార్లయితే కాస్త బెదిరించాడు కూడా” నవ్వి అన్నది కామేశ్వరి.

“ఏమంటాడు?” అడిగాను.

“తను తలుచుకుంటే నన్ను ఏమైనా చేయగలడట”

“నువ్వేమన్నావు?” క్యూరియస్ గా అడిగాను. కామేశ్వరి పోష్ అని తెలుసుగానీ మిగతా వివరాలు తెలీదు. ఎవరి జీవితాల్లోకి తొంగిచూడటం నా అలవాటుకాదు. ఎవరి జీవితాలు వాళ్లవి. నేనెవర్ని పరిశోధించడానికో, ప్రవచనాలందించడానికో. కానీ కామేశ్వరి నిజంగా ఏమని జవాబిచ్చిందో  తెలుసుకోవాలనే అడిగాను.

“నా రివాల్వర్ కి లైసెన్స్ ఉందని తీసి చూపించాను. అన్నట్టు నేను షూటింగ్ లో ఎక్స పర్టుని అని నీకు తెలియదు కదూ. మా ఫాదర్ డిఫెన్స్ పర్సనల్. ఢిల్లీలో ఉండగా షూటింగ్ కి రెగ్యులర్గా వెళ్లేదాన్ని. డాడీ పోయాక ఇక్కడికి వచ్చేసాము” ఆగింది. బహుశా తండ్రిగారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండొచ్చు.

అసంకల్పితంగా నిట్టూర్చాను. తండ్రికి సంబంధించిన తీయ్యని తలపులైనా తనకు ఉన్నాయి. మరి నాకూ? వెంటనే తేరుకున్నాను. నిరాశ భయంకరమైన డ్రగ్ లాంటిది. దానిని దగ్గరికి చేరనిస్తే అది మనని ముంచేస్తుంది.

“బాలా వీళ్లున్నారే, ఈ మగవాళ్లు ఉత్తి పిరిగ్గొడ్డులు. ఆడది ఎదురుతిరగనంతవరకే వీళ్ళ ప్రేలాపం. ఒక్కసారి ఎదురుతిరిగితే వీళ్ళు ముడుచుకుపోతారు. శ్రీనివాస్ కి డబ్బు ఉందని మదం, తండ్రి పరపతి ఉందని మదం, కానీ ఏ మాత్రం తండ్రి పరపతికో పదవికో భంగం కలిగితే తన ఆటలు సాగవనే మహాభయం అతనికి అంతర్లీనంగా చాలా ఉంది. అందుకే ఆడది తనంతట తానే వలలో పడేలా చేస్తాడు” తలతిప్పి నన్ను చూస్తూ అన్నది.

“కామీ, అతని ఇంటెన్షన్ నేనెప్పుడో గమనించా. నన్ను ‘ఉంచు’ కోవాలనే అతని ఆలోచననీ అర్థం చేసుకున్నా. అతని తండ్రి అతని వెనకాల లేకపోతే పైసాకి కొరగాడు. ఇలాంటి వాళ్లు ఒక చిత్రమైన జాతి, అందితే జుట్టు అందకపోతే కాళ్లు. నా దృష్టిలో శ్రీనివాస్ ఒక బాడీగార్డ్, వీడు మరెవర్నీ దరిదాపులకి కూడా రానివ్వడు. ఇక పశుపతి కథ వేరు. అతని పాట వచ్చేది కేవలం గొంతులోంచి, అచ్చు అతని మాటలాగే. ప్రగల్బాలు ఎక్కువ. జీవితాన్ని సంగీతమయం చేసుకోవాలంటే మొక్కవోని సంకల్పం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, సాధన ఉండాలి. నాలుగు పాటలు నేర్చుకున్నంత మాత్రాన సంగీతజ్ఞుడు అవ్వడు. అలాగే సంగీతకారుడికి ఉండవలసిన మొదటి లక్షణం, అనుభవిస్తూ పాడటం. పశుపతి కేవలం పాడతాడు, అనుభవిస్తూ పాడటం అతనికీ జన్మలో రాదు. తన గొంతు తనే వినటానికి ఇష్టపడే వాళ్ల జాబితాలో ఉండేది మొదట పశుపతి పేరే” చెప్పాను.

“అబ్బ,  ఓ మంచి రిలీఫ్. ఓ మాంఛి కాఫీ తాగుదామా?” ఉత్సాహంగా అన్నది కామేశ్వరి షార్ట్ కట్ లో కామీ.

“వై నాట్?” హోటల్ బ్లిస్ ముందర కారాపాను.

“నెక్స్ట్ వీక్ బాంబే వెడుతున్నా” మెరిసే కళ్ళతో అన్నది కామీ కాఫీ తాగుతూ.

“చాలా సంతోషం. ఏదైనా విశేషమా?” అడిగాను.

“శాండిల్య అని నాకో ఫ్రెండ్ ఉన్నాడు. భలే హుషారైన వాడనుకో. బాంద్రాలో వాళ్లకో ఇల్లు ఉంది. మొన్నీమధ్యే వాళ్ల పేరెంట్స్ లండన్ వెళ్లారట. బోర్ గా ఉంది రమ్మని కాల్ చేశాడు. సరదాగా వెళ్దాం అనుకుంటున్నా.  అసలు రేపే బయలుదేరాలనుకున్నాను గానీ వీకెండ్లో మా అమ్మ బర్త్ డే. అందుకే ఆగాను” వివరించింది కామీ.

“వెళుతున్న సంగతి మీ అమ్మగారికి తెలుసా?” అనుకోకుండా తటాలున అడిగాను. ఓ క్షణం నా వంక చిత్రంగా చూసి, “ఇటువంటివి నువ్వు ఎప్పుడూ అడగవు. అడిగావు కనుక నిజమే చెబుతా. బాలా, మా అమ్మ చాలా దురదృష్టవంతురాలు.  వయసులో ఉన్నపుడే భర్తను పోగొట్టుకుంది. నా కోసం తన సుఖాన్ని వదులుకొని మోడిన చెట్టులా ఉంటోంది. నేను తప్ప మరో జీవితం  ఆవిడకి లేదు. ఏడాదిన్నర క్రితం ఆదిత్యగారనే వ్యక్తి సడన్ గా ఓ హోటల్లో మమ్మల్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు. కాలేజీలో ఆయనా, మా అమ్మ చాలా దగ్గరి ఫ్రెండ్స్ అట. మాటల్లో అతను పెళ్లి చేసుకోలేదని తెలిసింది. ఓ ఏడాది నుంచి అతను అప్పుడప్పుడు ఫోన్ చేయడం చూస్తున్నా. మా అమ్మ కూడా కొంత సీరియస్ నెస్ తగ్గించుకొని ఆయనతో మాట్లాడుతుంది అనిపించింది. నీకు తెలుసుగా, అమ్మ మితభాషి అని. అదీగాక శాండిల్య వాళ్లు మాకు ఢిల్లీ నుంచి పరిచయమే, అందుకే ఒప్పుకుంది. అసలు నా ఉద్దేశం ఏమంటే అమ్మకి కాస్త ప్రైవసీ కల్పించడం. కనీసం వాళ్ళిద్దరూ ఓ లంచ్ కో డిన్నర్ కో వెళ్లినా నాకు సంతోషమే” చల్లబడ్డ కాఫీని గుక్కలో తాగేసింది కామీ.

“కామీ, నిజంగా నువ్వు గ్రేట్. నీ మనసులో ఇంత సున్నితత్వం ఉన్నదనీ, ఇంత సున్నితంగా మీ అమ్మగారి గురించి ఆలోచించగలవనీ ఇప్పుడే తెలుసుకున్నా. హాట్సాఫ్” లేచి ఓ హగ్ ఇచ్చాను. నిజంగా నాకు చాలా సంతోషం కలిగింది. ఇప్పటిదాకా కామేశ్వరి మీద ఉన్న అభిప్రాయం ఎగిరిపోయి చెప్పలేనంత గౌరవమూ, ప్రేమా కలిగాయి. విచిత్రం ఏమంటే మనతో ఉన్న మనుషుల గురించి మనకు తెలుసనుకుంటాము, నిజానికి ఏమీ తెలియదని ఇవాళ నాకు రుజువైంది. 

“శాండిల్యా, నేనూ మంచి ఫ్రెండ్స్. అతను ఎక్కడ ఉంటే అక్కడ ఉత్సాహం ఉంటుంది. తల్లిదండ్రులకి లెక్కలేనంత డబున్నా అతను స్వంత కంప్యూటర్ సెంటర్ నడుపుతూ నెలకో లక్ష సంపాదిస్తాడు. చాలామంది బ్రాంచీలు పెట్టమని అడిగినా, ‘నేను సంపాదించేది నా బ్రతుకు నేను బ్రతకడానికీ, నేను నేర్చుకున్నది నలుగురికి నేర్పడానికే. సంపాదించడానికి బ్రతకడం అంటే నాకు అసహ్యం’ అంటాడు. సాహిత్యం అంటే ప్రాణం” ఉత్సాహంగా చెపుతూ పోతుంది కామీ. సడన్ గా అతన్నెందుకో చూడాలనిపించింది అయినా సైలెంట్ గా ఉన్నాను.

“పోనీ నువ్వూ రాకూడదూ బాలా, నిజంగా నీకూ ఓ చేంజ్ ఉంటుంది. రావా ప్లీజ్”, నా చేతులు పట్టి ఊపుతూ అన్నది కామీ.

“కొంచెం ఆలోచించి చెబుతా” అన్నాను. నిజం చెబితే ఆలోచించనక్కర్లా. నేను ఎక్కడికి వెళ్ళినా అడిగేవాళ్లు ఎవరూ?

“ఓహ్! అబ్బా.. ఎంత సంతోషంగా ఉందో. రానంటావేమో అని భయపడ్డాను, ఆలోచిస్తానన్నావు అంతే చాలు. అమ్మాయ్, నీ టైం అద్భుతంగా గడుస్తుందని మాత్రం సెంట్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వగలను. త్రీ ఆఫ్ అజ్, అంటే నువ్వూ, నేనూ, శాండిల్య బాంబేని దున్నేద్దామ్” మహా ఉత్సాహంగా అన్నది. ఆమె కళ్ళల్లో ఆనందాల మెరుపులు.

కారు స్మూత్ గా సాగిపోతుంది. “ఇంతకుముందొకసారి నేను బాంద్రా వెళ్లాను. అప్పుడు అంకుల్ ఆంటీ ఉన్నారు. పదిరోజుల పాటు భలే ఎంజాయ్ చేశా. శాండీ నన్ను బైక్ మీద ఎక్కించి బాంబే మొత్తం తిప్పాడు. ఓహ్! ఫెంటాస్టిక్ డేస్” అవి చెబుతూనే ఉంది కామీ నాన్ స్టాప్ గా.

‘ఈహై ముంబై నగరియా’ అంటూ పాడిన అమితాబ్ గుర్తొచ్చాడు. ‘జరా హాట్ కే జరా హాట్ కే ఏ యేహై ముంబై మేరీ జాన్’ అంటూ నవ్వించిన జానీ వాకర్ గుర్తొచ్చాడు. కలత కన్నీళ్లు కలగలిసిన నగరం ముంబై, ఆనాడు బొంబాయి. “మా ఊరు బొంబాయి, నా పేరు రాధాబాయి” అని గిలిగింతలు పెట్టిన గీతాంజలి గుర్తొచ్చింది.

ముంబై గౌరవ ‘షరీఫ్’ గా పనిచేసిన దిలీప్ కుమార్, ‘శ్రీ 420’ సినిమా తీసి ముంబైని అద్భుతంగా చూసిన రాజ్ కపూర్, ముంబై రోడ్ల మీద వెడుతుంటే మేడల మీదనుంచి ప్రేక్షకులు వెర్రెత్తి పోయి చూసే దేవానంద్, నర్గిస్, మధుబాల ఇలాంటి హేమాహేమీలు అందరూ గుర్తొచ్చారు.

ఆ మహానగరంలోనే మా నాన్న కూడా సరోజినీ ఆంటీతో ఉంటాడన్న విషయం కూడా గుర్తొచ్చి ఓ క్షణం మనసు కలుక్కుమంది. జస్ట్ ఓ క్షణం అంతే.

ఇందాకట్నుంచి నిద్ర పట్టడంలేదు బాంబే వెళ్లాలని నిర్ణయించుకున్న క్షణం నుంచి ఓవైపు ఉత్సాహం.  సినిమాలంటే అందరూ యువతీ యువకుల్లాగా నాకు ఇష్టమే. ఆనాటి రాజ్ కపూర్ నుంచి ఈనాటి అతని మనవడు రణబీర్ కపూర్ వరకు అందరి సినిమాలు చూస్తూనే ఉంటాను. ఒకప్పుడు తెలుగు సినిమాలని హిందీ వాళ్ళు రీమేక్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే వందల సంఖ్యలో డబ్ చేసేస్తున్నారు. ఏ చానల్లో చూసినా హిందీలో డబ్ చేసిన తెలుగు సినిమాలే.

చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ వీళ్లందరినీ హిందీలో చూడటం భలే ఉంటుంది. హిందీ సినిమాలు ఇప్పుడు పెద్దగా తెలుగులో అనువాదం కావట్లేదు, అఫ్ కోర్స్ కొన్ని అయ్యాయి కానీ సూపర్ హిట్ కాలేదు. ఎప్పుడో కలత నిద్ర పట్టింది. ఆ కలత నిద్రలో మా అమ్మానాన్న….!

సశేషం….  మళ్ళీ కలుద్దాం.

bottom of page