top of page

సంపుటి 3  సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

పాండి బజార్ కథలు - 1

భువనచంద్ర

నాందీప్రస్తావన

నేటితరం సంగతి వేరు కానీ, నాడు... సినీ జీవులు పుట్టి పెరిగింది మాత్రం మద్రాస్ అనే నేటి చెన్నై 'పాండీ బజార్ 'లోనే. ఎదరో సినీ కళాకారులు,  సాంకేతిక నిపుణులూ, రచయితలు, గీత రచయితలు, నృత్య, సంగీత కళా దర్శకులు, దిగ్దర్శకులూ, అందరూ ఆ పాండీ బజార్లో నడయాడినవారే. ఆ చల్లని చెట్ల క్రింద సేదదీరినవారే. మొట్ట మొదట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని కలిసిందీ, షావుకారు జానకి గారినీ, మైలవరపు గోపీగారినీ కలిసింది అక్కడే.  నేను ఏర్ ఫోర్స్ లో పనిచేస్తున్న రోజుల్లోనే "మాంబళం" స్టేషన్లో దిగి, "భట్స్" హోటల్లో టిఫిన్ చేసి,  మాంబళం,  కోడంబాకం  ఏరియాలో తెగ తిరిగే వాణ్ణి. ఎందుకంటే, నాకే తెలీదు అప్పుడు. కానీ, ఏ ఏరియాలో తిరిగానో  అక్కడే అద్దెగదుల్లో ఉండటమూ రచయితగా ఎదగటమూ కూడా జరగడం దేవుడిచ్చిన వరం కాక మరేమిటీ!? ఆరుద్రగారి ఇంటి వెనుకనున్న 'మలర్ కొడి మేన్షన్'- నా మొదటి నివాసం. జయలలిత(CM) తల్లిగారు నివసించిన H.No. 10, శివజ్ఞానం స్ట్రీట్ ఇంటిపక్క ఇల్లే నా రెండో నివాసం.

అసలీ పాండీ బజారుకీ, సినిమాకీ ఉన్నదో అవినాభావసంబంధం. ఆ రోడ్ల మీదే... కోటానుకోట్ల కలలూ, కన్నీళ్ళు కూడా దర్శనమిస్తాయి. ఒకపక్కన వస్త్రవ్యాపారం, మరోపక్క ఆసియాలో పెద్ద ఎత్తున జరిగే నగల వ్యాపారం, ఇంకోపక్క 'కలల వ్యాపారం' ఇలా త్రివేణి సంగమం లా... ఇదో వ్యాపార సంగమం. గాయకులూ, గాయనీ మణులూ కూడా ఇక్కడ ప్రభవించినవారే.

పానగల్ పార్కు బెంచీలకి పింగళి గారూ, మల్లాది రామకృష్ణశాస్త్రి గారూ, ఘంటసాల గారూ, జరుక్ శాస్త్రి గారూ అందరూ గుర్తే. అక్కడి చెట్లకి ఇంకా ఆ మహానుభావుల స్వరాలు జ్ఞాపకమే. అదిగో ఆ గీతా కేఫూ, వుడ్ లాండ్స్ హోటలూ, నల్లీ సిల్క్స్, ఊమ్మిడియార్స్, బాలాజీ భవన్, భగవతీవిలాస్ అన్నింటికీ గుర్తే. ఎవరికేమి కావాలో, ఎవరి 'పసందూ ఏమిటో!

డబ్బున్నవాళ్ళు స్టైలుగా వుడ్ లాండ్స్ డ్రైవిన్ లోకో, కాస్మోపాలిటన్ క్లబ్ కో కార్లేసుకుని పోతే, జేబులో బరువు తక్కువ వుండే వాళ్ళు 'కయ్యేంది భవన్' లకు (తోపుడు బళ్ళు మీద నడిచే హోటళ్ళు) కి పోయి, కడుపు ఆకలి చల్లార్చుకుంటారు.ఇప్పటికీ రూపాయి ఇడ్లీలు అక్కడ దొరుకుతాయి. ఎందరో గొప్పగొప్పనటులూ, కళాకారులూ, ఆ తోపుడు బండి హోటల్సులో కడుపు నింపుకున్నవారే.

ఆ బజారుని తలుచుకునే గుండె ఉప్పొంగిపోతుంది. ఆ బజారుని తలుచుకుంటే గుండె నీరై కళ్ళలోంచి కరిగిపోతుంది. నాడు నేను చూసిన మహానుభావులు ఇప్పుడక్కడ లేరు. కేవలం వారి జ్ఞాపకాలనే సమాధులు మాత్రం మిగిలి వున్నాయి. ఓ రాణీ బుక్ స్టాల్ , చౌదరాణీ గారు  (త్రిపురనేని  రామస్వామి చౌదరి గారి అమ్మాయి), చందమామ రామారావుగారు, ఎప్పుడు నేను వెళ్ళినా "వణక్కం సారూ" అని నోరారా పిలిచి చక్కని టీ అప్పటికప్పుడు చేసి అందించే నటరాజన్, ఇలా ఎందరో పాండీబజార్ చెట్లనీడల్లో నీడగా కలిసిపోయారు.

తల్లీతండ్రీ గురువుగా నన్నాదరించిన డాక్టర్ గోపాలకృష్ణ గారు (స్టాండర్డ్ ఎలెక్ట్రికల్స్ ముందున్న ఫుట్ పాత్ మీద నాలుగు కుర్చీలు వేసి, 35సం. కి పైగా లక్షలాది మందికి ఉచిత హోమియో మందుల్ని అందించిన మహానుభావుడు) ఇంకా అక్కడే వున్నారు. ఆ వేపచెట్టు నీడలో... చల్లగా అందర్నీ ఆశీర్వదిస్తూ...!

అందుకే ఈ పాండీ బజార్ కథల్ని వారికే అంకితమిస్తున్నా... అన్ని సుమాలూ వాడిపోయేవే... రంగు వెలిసిపోయేవే... అక్షరసుమాలు తప్ప. అందుకే  మరోసారి ఆ మహానుభావుడికి నమస్కరిస్తూ, ఆ జ్ఞాపకాల నీడల్ని స్పృశిస్తూ... కథల్లోకి వెడదామా...

మీ

భువనచంద్ర.

తెల్లవారుఝామున నాలుగున్నర గంటలకే పాండీ బజార్‌లోని నిద్రగన్నేరు చెట్లు ఉలిక్కిపడి లేచాయి. కారణం సింపుల్.. శతకోటి సుబ్బారావు బయటికొచ్చి నిన్న రాత్రి మిగిల్చిన సగం బీడీని ముట్టించడమే. అతని చేతిలో ఎప్పుడూ సరికొత్త 555 పేకెట్టు వుంటుంది. దాని ఖరీదు కూడా పాపం శ.కో.సుబ్బారావుకి తెలీదు. ఆ పేకెట్టుని అతను G.N. సుందర్ లేక ఘనసుందర్ ఇంటిముందున్న ట్రాష్ కేన్ నించి సేకరిస్తాడు. పొద్దున్నే ఓ కట్ట బీడీలు కొని వాటిని కళాత్మకంగా ఆ 555 పేకెట్ట్లో అమరుస్తాడు. ఆ పేకెట్‌ని మాత్రం ఎవరి ముందూ ఓపెన్ చెయ్యడు.

 

సుబ్బారావు 'రాక'కి నిద్రగన్నేరు చెట్ల నిద్ర’పోక'కీ సంబంధం ఏమిటని మీరు అడగవచ్చు. బీడీ ముట్టించగానే అతను అందుకునేది ఘంటసాలగారి 'వాతాపి గణపతింభజే' పాటని. అతను 'శుక్లాంబరధరం విష్ణుం' అని మొదలుపెట్టగానే పసి ఆకులన్నీ దడుసుకుంటాయి. నడి వయసు ఆకులన్నీ నవ్వుకుంటాయి. వృద్ధపత్రాలన్నీ గబుక్కున ప్రాణాన్ని త్యాగం చేసి నేలమీద ఠక్కున వాలతాయి. అది చూసి నేనో గొప్ప వాక్యం కనిపెట్టాను. శిశువులకీ, పశువులకీ సంగీతం ఆహ్లాదాన్ని కలిగిస్తే శ. కో. సు గారి సంగీతం చెట్లకి శిశిరాన్ని తెప్పిస్తుందని. పాండీబజార్ ఆ చివర నించి యీ చివరిదాకా నడుస్తూనే స్వరప్రక్షాళన చేసుకుంటాడు శ. కో. సు.

 

"ఈడెమ్మ... రాలిపడ్డ ఆకుల్ని ఎత్తలేక చావొస్తుంది. ఓ తెలుగాయనా.. ఏదో ఓ రోజున మావాళ్లు నిన్ను సైలెంటుగా చితకదన్ని పూడుస్తారు" అంటూ రోడ్లు తుడిచే కుముదం, ఆవిడ బేచ్ రోజూ హెచ్చరించినా శ. కో. సు మాత్రం ఏనాడూ స్వరార్చన మానలేదు.

"ఎందువలన?" అని మీరడుగుతారు."దైవఘటన" అని మాత్రం నేను చెప్పను. మీరే చూడండి.

*****

'సలలిత రాగసుధారస సారం' బాలమురళీకృష్ణగారిని హింసించడం ప్రారంభించాడు శతకోటి సుబ్బారావు. టైము కరెక్టుగా తెల్లవారిఝాము .5.30 ని.లు."ఇదిగో శతకోటీ!  వెంటనే ఆపకపోతే, ఏం జరుగుతుందో నేను చెప్పను" పిచ్చి కోపంతో అరిచాడు ఆంధ్రా టీస్టాల్ ఓనరు నరసింహంనాయుడు. ఆయనది నెల్లూరు. 'టీ' అంటే నాయుడుగారి టీ నే తాగాలి. ఆ స్టాలు వున్నది ఆరుద్రగారి ఇంటిగేటు ఎదురుగానే. ఆ పాట వినగానే "వీడ్ని తగలెయ్య. బంగారంలాంటి పాటని ఖూనీ చేస్తున్నాడు. వీడి జిమ్మడా" అనుకుంటూ లేస్తారు మా అమ్మలగన్నయమ్మ కె.రామలక్ష్మీ ఆరుద్ర.

 

"ఎన్నైనా తిట్టుకో. వాడ్ని తగలెట్టడానికి మాత్రం కిరసనాయిలు డబ్బా పుచ్చుకుని బైటికి పోకు. ఒక్కసారి ఇంట్లో అడుగుపెట్టాడంటే మనం బైటికి పోయేదాకా వాడు పోడు" గాఠిగా దుప్పటి చెవుల మీదుగా కప్పుకుంటూ ఆరుద్రగారు రామలక్ష్మిగారిని హెచ్చరించడం వందసార్లు విన్నాను.

"ఏం చెయ్యను నాయుడూ. కడుపు గడబిడగా వుందని నైట్ ఫుడ్డుని స్కిప్ చేశా. మరిప్పుడు ఆకలిగా వుంది. రూంలో వెయ్యి నోటు తప్ప చిల్లర లేదాయే. ఆకల్ని మర్చిపోవాలంటే పాటలేగదా శరణ్యం!" తాత్కాలికంగా పాట ఆపి అన్నాడు శ. కో. సు

"ఇదో పంతులు కన్నాంబ సవత్తాడిందగ్గర్నించీ యీ మాట అంటన్నావు. అసలు వెయ్యి రూపాయల నోటు ఎట్లా వుంటదో చూశావా?నోరు తెరిస్తే చాలు" చిరాగ్గా అన్నాడు చిన్నారాయణ.

"పోన్లే నారాయణా. పాట ఆపాడుగదా. ఇదో.. యీ టీ తాగు. నోటు మార్చాక ఇద్దువులే డబ్బు.." టీ గ్లాసుల్లో ఇద్దరికీ టీ పోసి ఇస్తూ అన్నాడు నరసిమ్హానాయుడు.

"వెయ్యేళ్ళు చల్లగా వుండు నాయుడు" టీ గ్లాసుని భక్తిగా అందుకుంటూ దీవించాడు శ. కో. సు

ఆ ఆశీస్సులకోసమే ప్రతిరోజూ ఏదోవిధంగా శ. కో. సు కి ఫ్రీగా టీ ఇస్తాడు నాయుడు. బ్రాహ్మణుడు ఆశీర్వదిస్తే శుభం జరుగుతుందని అతని నమ్మకం. సమయం 6 గ.లు

*****

సమయం 6 గం.10 ని. 'మలర్ కోడి' మేన్షన్. పాండీ బజార్. రూమ్.నెం. 34.

"అయ్యా" శ. కో. సుఅరుపుకి పిచ్చి కోపంతో నిద్ర లేచాడు రబ్బీ. అతనిదీ నెల్లూరే. చిన్న సైజు వేదాంతి. "ఏమిటి? టూత్ పేస్టా? నిద్ర లేచాక అడగొచ్చుగా? లేపి మరీ అడగాలా?" అరుస్తూనే పేస్టు ట్యూబు ఇచ్చాడు రబ్బీ. "మీరు చల్లగా వెయ్యేళ్ళుండాలి" వేలి మీద 'పేస్టు' కొంచెం వేసుకుని ట్యూబుని తిరిగిచ్చాడు శ. కో. సు...  రూం.నెం.34 పక్కనే వున్నై బాత్రూములు. రబ్బీ తలువు వేసుకోగానే భుజాన వున్న సంచిలోంచి టవల్ తీసుకుని బట్టల్ని విడిచి బాత్రూంలోకి దూరాడు శ. కో. సు..  దంతధావనం , కాలకృత్యం, పంపునీళ్ల స్నానం అర్జంటు అర్జంటుగా కానిచ్చి బైటికొచ్చి మళ్లీ 'దిరీసు' (అనగా డ్రెస్సు) తగిలించుకుని మళ్లీ రోడ్డున పడ్డాడు.

ఆంధ్రా టీ స్టాల్ ముందు జనం భీకరంగా గుమిగూడి వున్నారు. మహా రష్షు . పక్కనే వున్న 'భగవతీ విలాస్' ముందు ఆడామగా గుమిగూడి వున్నారు. వాళ్లందరూ ప్రొడక్షన్ వాళ్లు. ఏడింటికి ముందే సినిమా ప్రొడక్షన్ వాళ్ల వేన్‌లు అక్కడ ఆగుతాయి. పెద్ద పెద్ద వెసల్స్(పాత్రల్లో)లో, ఇడ్లీ, ఉప్మా, వడ, పూరీ, దోసె, పొంగల్, కారా చెట్నీ, కొబ్బరి చెట్నీ, సాంబార్ లాంటివన్నీ నింపుకుని వాటిని వేన్‌లలో ఎక్కింపజేస్తారు. ప్రొడక్షన్ అసిస్టెంట్లు, గిన్నెలు కడిగే పని మనుషుల్నీ, సర్వింగ్ వాళ్లని మాత్రం గుమిగూడి వున్న స్త్రీపురుషుల్లోంచి తీసుకుంటారు. అక్కడా బోలెడు రాజకీయాలు. ఎవరి 'ఇలాకా'లు వాళ్లకున్నాయి. ఏ గ్రూపూ బయటివాళ్లని రానివ్వదు. మగాళ్లని వదిలేస్తే, రోజూ పనికోసం అక్కడ గుమిగూడే ఆడాళ్లు కనీసం ఇరవై మంది వుంటారు. యంగ్ ప్రొడక్షన్ అసిస్టెంట్లయితే కుర్రపిల్లల్ని(అంటే చామింగ్ గాల్స్‌ని), ఓల్ద్ ప్రొడక్షన్ అసిస్టెంటయితే కాస్త నడివయసువాళ్లనీ తీసుకుంటారు గనక వాళ్లకు రోజూ పనులు దొరుకుతూనే వుంటాయి. బైట పనులకి రోజుకి యాభై కూడా ఇవ్వరు. సినిమా కంపెనీ పనిలోకి పోతే 200కి సంతకమో, వేలిముద్రో వ్రాయించుకుని వందరూపాయలిస్తారు. అంతేకాదు హాయిగా తిన్నంత టిఫినూ, తిన్నంత  లంచ్, డిన్నర్, కాఫీ, టీ ల విషయం లెక్కలేదు.

ఆ ఆడవాళ్ల గుంపు అందర్లోకి మహా అందంగా వుండేది పంకజం. ఆవిడ వయసు 25 నించి 35 మధ్యలో ఏదైనా కావొచ్చు. విరగబూసిన సువర్ణ గన్నేరు చెట్టులా వుంటుంది. మెల్లిగా కదుల్తున్న పూలరథంలా వుంటుంది. బలంగా, ధీమాగా ఎదిగిన పొగడమొక్కలా వుంటుంది. ఆ కళ్ళు కొలనులో యీదులాడే చేపలు. ఆ నవ్వులు  తొలకరి మబ్బుల మధ్యలో మెరిసిన తటిల్లతలు.( ఏం బాబూ.. ప్రొడక్షన్ తాలూకూ అంట్లు తోమేదాన్ని అంతలా వర్ణిస్తున్నావ్. ఏనాడూ హీరోయిన్లని చూసిన పుణ్యాన పోలేదా? అని మీరనుకుంటారని నేననుకోను. అయ్యా మనం ముందు మనుషులం. ఆ తర్వాతే నటి అయినా, నటుడయినా, యజమాని అయినా పనిగత్తె అయినా) దూరం నించి, అంటే 'ఆరు గజాల' దూరం నించి పంకజాన్నే చూస్తున్నాడు శ. కో. సు.. ఆమె ఏదో ఓ ప్రొడక్షన్ వేన్ ఎక్కి అక్కడ్నించి వెళ్లిపోయేదాకా ఆమెని తప్ప ఎవర్నీ చూడడు. ఒక్కోసారి 'దేవుడి బండి' వస్తుంది. అంటే, బాబాగారి పటాల్ని రిక్షాలో పెట్టుకుని టేప్ రికార్డర్‌లో భజనలు వినిపించే బండి అన్నమాట. ఆ బండి రాగానే అందరూ అటువైపు తిరిగి నమస్కారాలు చేస్తారు. భక్తిగా మరోసారి దండం పెడతారు.

అప్పుడు కూడా శ. కో. సుచూపు పంకజం మీదే వుంటుంది గానీ పొరపాటునైనా పక్కకి జరగదు.

ఉదయం 7.30 ని.లు. ప్రొడక్షన్ వేన్‌లన్నీ వెళ్లిపోయాయి. బ్రిలియంట్ ట్యుటోరియల్స్ వైపు నించి ఓ కుర్రోడు భగవతీ విలాస్ వైపు రావడం చూశాడు శ. కో. సు గబగబా అతనివైపు నడిచి "బాబూ.. నువ్వు.. నువ్వు.. మీ వూరు..." అంటూ పలకరించాడు.

"మాది గుంటూరండీ.. నా పేరు వివేక్.. బ్రిలియంట్ ట్యూటోరియల్స్‌లో చదువుతున్నా" అన్నాడా కుర్రోడు.

"అంత దూరం నించీ అదే అనుకున్నా. మాదీ బ్రాడీపేట గుంటూరే. మీ నాన్నగారూ.."గుర్తుకు తెచ్చుకుంటున్నట్టు బుర్రగోక్కున్నాడు శ. కో. సు

"మాధవరావుగారండీ. సి.వి.యస్ ధన్‌గారి ట్యుటోరియల్ కాలేజీలో మేథ్స్ లెక్చరర్‌గా పని చేసి.."

"ఆగాగు. అబ్బా. ఇప్పటికి మబ్బు వీడినట్టు విడిపోయిందయ్యా.. మా మాధవ్‌గాడి కొడుకువా. నేనూ మీ నాన్నా ఇద్దరం ఒకేసారి డిగ్రీ చేశాం. హా..హా.... అయినా ఆ పోలికలు ఎక్కడికి పోతాయి.  భలే కలిశాం కదూ. పద.. హాయిగా కాఫీ తాగుతూ మాట్లాడదాం" కుర్రాడి చెయ్యి పట్టుకుని మరీ భగవతీ విలాస్‌లోకి లాక్కుపోయాడు శ. కో. సు

"ఈ కుర్రాడెవడో అయిపోయాడు. మూడ్రోజులకి సరిపడా టిఫిన్ లాగిస్తాడీ శతకోటిగాడు. ఈ నా కొడుక్కి పెద్దచిన్నా లేదు. కనిపించినవాడ్ని కరగెయ్యడమే... థూ" మూడో టీ తాగుతూ ఈసడించాడు చిన్నారాయణ. మూడుసార్లు టీ తాగితేగానీ క్లియర్ కాదు అతనికి.

"ఏం చేస్తాడు నారాయణగారు. ఫుడ్డుకి లాటరీ కొడతన్నాడాయే" సానుభూతిగా అన్నాడు నరసింహం నాయుడు. పాండీబజార్ లో  పనీపాటా లేక తిరిగేవాళ్లూ, సినిమా చాన్సుల కోసం వచ్చి ఏ సినిమాలోనూ వేషం దొరక్క, వేరే ఏ పనీ రాక తిరిగేవాళ్లు అతనికి కొత్త కాదు.

"ఎం.ఏ చదివిన నా కొడుకు ఏదో ఓ పన్జేసుకోవచ్చుగా" మళ్ళీ యీసడించాడు  నారాయణ.

"మీకు తెలీదు నారాయణా. ఇదో మాయాలోకం. నేను పన్నెండేళ్ళ క్రితం సినిమా వేషాల కోసమే మద్రాసొచ్చా. ఇహ చస్తే వేషాలు రావని నిర్ణయించుకున్నాకే ఊళ్ళో ఇల్లు అమ్ముకుని ఇక్కడ టీ స్టాల్ పెట్టా. దేవుడి దయవల్ల నాలుగు డబ్బులు వచ్చి రెండిళ్ళు కట్టుకున్నా కన్నమ్మ పేటలో.  నిజం చెబితే నేనూ ఒకప్పుడు ఫుడ్డ్‌కి లాటరీ కొట్టినోడ్నే" నిట్టూర్చి అన్నాడు నాయుడు.  

"అందుకేగా. బేవార్సుగాళ్ల  మీద జాలితో టీ తాగిస్తావు" లేచాడు చిన్నారాయణ.

*****

రెండేళ్ళు గడిచినై. ఈ మధ్య నిద్రగన్నేరు చెట్ళు ఉలిక్కిపడటం మానేసినై. కారణం వాటి ముందు తన 'విద్య'ని శ. కో. సు ప్రదర్శించకపోవడమే.

"అమ్మయ్యా. ప్రాణాలకి హాయిగా వుంది. లేకపోతే పొద్దున్నే బాలమురళీనీ, ఘంటసాలనీ, PBS నీ, SPB నీ అందర్నీ చెడుగుడు ఆడుకునేవాడు ఆ సుబ్బిగాడు" కొబ్బరి బోండాల గెలల్ని ప్రొడక్షన్ వేన్‌లోకి ఎక్కిస్తూ అన్నాడు ప్రొ. అసిస్టెంటు గంగరాజు.

"అవునుగానీ అసలాయన ఎక్కడ వుంటాడు గంగరాజూ?" అడిగాడు సాంబశివరావు. రేణుకా ఫిలిం సాంబుడంటారు అతన్ని. కుతూహలంగా అటువైపు ఓ చెవి వేసింది మార్గరెట్. మార్గరెట్‌ది  సింగరాయకొండ. 'అందగత్తె'వి అని అందరూ ఎక్కేస్తే ఆ మాటనే దైవవాక్కుగా భావించి మద్రాసు లగెత్తుకొచ్చింది పక్కింటి బాబూరావుతో. ఉత్సాహం చల్లబడేదాకా వుండి సొంతవూరికి చెక్కేశాడు బాబూరావు. మార్గరెట్ వేరే దారిలేక మద్రాసులోనే దిగబడి ప్రస్తుతం ప్రొడక్షన్ హెల్పర్‌గా బతుకు బండి లాగిస్తోంది.

“ఆకాశంలో మేఘాలకీ, ఫుడ్డుకి లాటరీ కొట్టే  సినిమావోళ్లకీ స్థిరమైన చోటుంటదేటి సాంబడూ. పగలు పార్కు బెంచీలూ, రాత్రుళ్ళు ఫుట్‌పాత్‌లూ. ఖర్మంటే దీన్నే అంటారు. ఎం.ఏ చదివాడంట. ఏం లాభం!" నిర్లిప్తంగా అన్నాడు గంగరాజు.

సంవత్సరన్నర గడిచింది..

శ. కో. సుమాత్రమే కాదు, పంకజం కూడా కనపడటంలేదు. శ. కో. సువెళ్లిపోయిన రెండేళ్ళ వరకూ పంకజం మద్రాసులోనే వుంది. సంవత్సరంన్నర నించి పంకజం అడ్రస్సు ఎవరికీ తెలీలేదు.

*****

 

మరో మూడు నెలల తర్వాత:

"శంకరా.. నాదశరీరాపరా" పాట మొదటి పదం వినబడగానే టపటపా రాలిపడ్డాయి పండుటాకులు. అయోమయంగా దిక్కులు చూశాయి నడివయసాకులు. ఉలిక్కిపడి లేచాయి లేతాకులు. పక్షులు గగ్గోలుగా అరిచి భయంతో రెక్కలు టపటపా కొట్టుకున్నాయి.

"డోంట్ వర్రీ.. సునామీలూ, తుఫాన్లూ ఏమీ రాలేదు. ఆ భయంకర నాదం శతకోటి సుబ్బారావుది. 'జింబో నగర ప్రవేశం' లాగా మనోడు పాండీ బజార్ ప్రవేశం చేసినట్టున్నాడు" ఆకుల్ని లాలించి అసలు కథ చెప్పిందో వృక్ష మాత.

"ఓర్నాయనోయ్. శంకరశాస్త్రిని ఈ నాకొడుకు మింగేశడోయ్ నాయుడూ" ఉలిక్కిపడి టీ ఒంటిమీద వొలకబోసుకున్నాడు చిన్నారాయణ.

"వస్తాడుగా!" దూరం నించి దగ్గరవుతున్న శ. కో. సు'వాయిస్'ని గమనించి అన్నాడు నరసింహం నాయుడు.

నిముషమున్నర గడిచే ముందే దాపుకొచ్చాడు శ. కో. సు

ఖరీదైన గోల్డ్ ఫ్రేమ్ కళ్లజోడు. మూడు కుడిచేతికీ, మూడు ఎడంచేతికి వెరశి ఆరు దిబ్బల్లాంటి రత్నాలు పొదిగిన బంగారు వుంగరాలు. మెళ్ళో బ్రహ్మాండమైన జెర్రిపోతులాంటి బంగారు గొలుసు. చేతిలో 555 పేకెట్టు. నోట్లో కూడా 555 సిగరెట్టే. అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు చిన్నారాయణ. ఆశ్చర్యంతో బిగదీసుకుపోయాడు నరసింహంనాయుడు.

"నాయుడుగారూ, వెయ్యికి చిల్లరలేదు. టీ ఇప్పిస్తారా?" నవ్వుతూ నాయుడి చేతిని తన చేతిలోకి తీసుకుని అన్నాడు శ. కో. సు

"మీరు.." కంగారు పడ్డాడు నాయుడు.

"నేనే.. మీ సుబ్బారావుని. ఎన్నాళ్ళు మీరు నాకు పొద్దున్నే ఆప్యాయంగా 'టీ' భిక్ష పెట్టారో. ఎన్ని జన్మలెత్తి మీ రుణం తీసుకోగలనూ!" కన్నీళ్లతో అన్నాడు శ. కో. సు

"అసలు మీరు..?" అడగబోయి ఆగాడు చిన్నారాయణ.

 

"సినిమా చాన్సులు ఇక రావని డిసైడ్ చేసుకుని కేరళ వెళ్లా. అక్కడ కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేశా. పెద్దగా డబ్బులు రాలేదు కానీ, మంచిపనివాడినని పేరొచ్చింది. ఓ సినిమా జరుగుతుండగా మధ్యలో డైరెక్టరు పోయాడు హార్టెటాక్ వచ్చి. మిగతా సినిమా నన్ను పూర్తి చేయమన్నారు. ఆ సినిమా పేరు 'నక్షత్రంగళ్'. సూపర్ హిట్టయింది. ఆ తర్వాత 'నీలమలయుడె మడియిల్' సినిమాకి నేనే డైరెక్టరయ్యాను. దానికో ఆర్టిస్టు కావాల్సొచ్చింది. ఓ కొత్త ఆర్టిస్టుని పరిచయం చేశా. సూపర్ డూపర్ హిట్టయింది. డైరెక్టరుగా నేనూ, ఆర్టిస్టుగా ఆమె యమా బిజీ అయ్యాం. పెళ్ళి కూడా చేసుకున్నాం. నాయుడూ మా బిడ్డకి ఇవ్వాళ  అన్నప్రాసన చెయ్యాలి. కానీ, నీ చేత్తో టీ ప్రాసన చేయిద్దామని అనుకున్నానయ్యా. ఎన్నాళ్ళు, ఎన్నేళ్లు నీ టీలు తాగి పొట్ట నింపుకున్నానూ.. నీకు నేనిచ్చే గౌరవం ఇదే.. నా గుండెల్లోని గౌరవం...!" నాయుడ్ని కౌగలించుకుని శ. కో. సు అంటుండగానే ఓ పడవ కారొచ్చి ఆగింది. అందులోని దిగినావిడ్ని చూసి షాకు తిన్నాడు చిన్నారాయణ. ఆమె 'పంకజం' అనీ, ఆవిడ ఎత్తుకున్న పిల్లాడు శ. కో. సు కొడుకనీ నేను చెప్పనక్కర్లేదని నాకు తెలుసు. శ. కో. సు అసలు పేరు వేణు. మరి యీ శ. కో. సు అంటే 'ఏమిటంటే', ఏవుందీ సినిమా వేషాలకోసం ప్రయత్నించే శతకోటి సుబ్బారావుల్లో నేనూ ఒకడ్ని" అన్నాడు .

 

మీ

భువనచంద్ర

 

Tags, Bhuvana Chandra, Pandey Bazaar Kathalu, madhuravani telugu magazine, Telugu Film Industry, TFI

Bio

భువనచంద్ర

నూజివీడు దగ్గర గుల్లపూడిలో జన్మించి, 18 సంవత్సరాలకి పైగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేసి, , నాలుగు వార్ మెడల్స్ పొందిన తరువాత భువన చంద్ర పదవీ విరమణ చేశారు.  తరువాత విజయ బాపినీడు గారి “నాకో పెళ్ళాం కావాలి” అనే సినిమాలో 1987 లో పాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసి, సుమారు వెయ్యి చిత్రాలలో 2500 పైగా పాటలు రచించి విలక్షణమైన కవిగా లబ్ధ ప్రతిష్టులయ్యారు. స్క్రీన్ ప్లే, సంభాషణల రచయిత గానూ, నటుడిగానూ రాణించారు. అనేక పత్రికలలో కథలు, వ్యాసాలూ, ఒక ఆధ్యాత్మిక సీరియల్ మొదలైన ప్రక్రియలలో నిత్య సాహితీ కృషీవలుడిగా, మంచి వ్యక్తిగా పేరున్న భువన చంద్ర గారి నివాసం చెన్నై మహా నగరం.

***

bottom of page