top of page

సంపుటి 3  సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

ఆకేసి , పప్పేసి...

Jyothi Valaboju

జ్యోతి వలబోజు

"హలో ఒదినె?"

"హలో! రేపు జర జల్ది  రావే. చాలా పనుంది"

"సరే ఒదినె జల్ది  పని చేసేసుకుని వచ్చెస్తాలే. అయినా నీకన్నీ తెలుసు. నేనేం చేయగలను చెప్పు?"

"నువ్వైతే రావే. చెప్తా కదా"

*****

"వదినా! తొందరగా రమ్మన్నవు గదా వచ్చేసా. ఇపుడు చెప్పు ఏం చేయాలి. ఇల్లు సర్దాలా...?"

"అదంతా ఎవరో చేస్తారు కాని పైన బంగ్ల మీద భోజనాల దగ్గర చూసుకోవా?. మాకు కింద ఫంక్షన్ దగ్గర నుండి కదలనీకి ఉండదు. పిల్లలు ఉన్నారు. వాళ్లను తీసుకుని భోజనాల దగ్గర ఏం కావాలో నువ్వే చూసుకో"

"సరేలే నువ్వు టెన్షన్ పడకు. నువ్విక్కడ చూసుకో. కాని ఒక్క విషయం. నేను ఒడ్డించే దగ్గర ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ పెట్టను. అందరికీ ఒక్కతీరుగ ఒడ్డిస్తా. సరేనా?"

"సరే. అలాగే చేయి. అందరూ మంచిగ తినేసి వెళితే చాలు. ఎవరికీ తక్కువ కాకూడదు. అందుకేగా నిన్ను జల్ది రమ్మంది. ఒడ్డనతో పాటు కూరలు, స్వీట్లు గిట్ట చూసుకో. తక్కువ పడితే చెప్పు. తెప్పిద్దం"

"సరే అయితే నేను పైకి వెళ్తున్నా. అంతా చూసుకుంటలే."

**********

ఈ వడ్డన విషయం ఎందుకు చెప్తున్నా అంటే... నేను చిన్నప్పటినుండి అంటే ఊహ తెలిసినప్పటినుండి,  మనుషుల ప్రవర్తనలు అర్ధమైనప్పటినుండి. నేను మా చుట్టాల్లో వడ్డనలో ముఖ్యంగా నాన్ వెజ్ అప్పుడు  ఈ తేడా ఎక్కువగానే చూసాను.  

అప్పుడు నాకు పదేళ్లో , పన్నెండెళ్లో ఉండొచ్చనుకుంటా. మా బంధువుల్లో ఒకరింటికి భోజనానికి వెళ్లాం. నాన్ వెజ్ ... హోస్ట్ లేదా తినడానికి రమ్మని పిలిచినవారన్నమాట. అప్పట్లో బఫే పద్ధతులు లేవు. బంతి భోజనమే. టేబుల్స్ లేదా నేల మీద వరుసగా లేదా చుట్టూ కూర్చునేవారు. అన్నంలాంటివి వడ్డించాక  మటన్ కర్రీ వేసేటప్పుడు మాత్రం ఇంటి ఓనరమ్మ వస్తుంది.  కూరలో గరిట పెద్దగానే ఉంటుంది. అందరికీ వడ్డిస్తూ  కొందరికేమో గరిట నిండుగా ముక్కలతో కూర వేస్తుంది. మరి కొందరికి ఇంకొంచం వేసుకో వేసుకో అంటారేగాని గరిట గిన్నెలోంచి బయటకు రాదు. ఇలా కొన్ని ఇళ్ళల్లో చూసా కాని నాకు అప్పుడు అర్ధమయ్యే కాదు. అమ్మతో చెప్తే నవ్వేసేది. మనం మాత్రం అలా ఎప్పుడూ చేయకూడదు అందరికీ సమానంగా  వడ్డించాలి అని చెప్పింది. ఇప్పటికీ మర్చిపోలేదు. మర్చిపోలేను కూడా.. ఇపుడు ఆ విషయం తలుచుకుంటే భలే నవ్వొస్తుంది. భోజనానికి పిలిచి ఈ బేధభావాలు ఎందుకు చూపిస్తారో కొందరు? అని.

ఇప్పుడు కాస్త తగ్గింది కాని నా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే… ఎవరింట్లనన్నా దావత్ ఉందంటే “అక్కడ పప్పు కూరలు పెడుతుండ్రా .. కూర, చికెన్ పెడుతుండ్రా” అనేవాళ్ళు. తద్దినాలు, ఓడిబియ్యం దావత్ లకైతే యాట కూర తప్పదు. అప్పలు, మురుకులు, ముక్కతో పాటు మందుకూడా తప్పకుండా పెట్టాలి. లేదంటే.. “ఆ.. వాడేం పెట్టిండు. పప్పు కూరలు. దానికోసం అంతదూరం పోయినం. ఇంట్ల తినలేమా?” అని తిట్టుకునేవాళ్లు. తిన్నంత తిండి, తాగినంత మందు ఉండాల్సిందే.

అప్పుడు గాని  పెద్దవాళ్లందరూ సంతోషపడరు. పెట్టేవాళ్లు కూడా ఖర్చుకు వెనుకాడకుండా భోజనాల దగ్గర ఏదీ తక్కువ చేసేవారు కాదు. ఇప్పటికీ కొందరు ఈ పద్ధతిని ఇంకా పాటిస్తున్నారు. ఎంత ఖర్చు చేసినా సరే భోజనాలు మాత్రం ఘనంగా ఉండాల్సిందే..

*****

"అక్కయ్యా!! వంట అయ్యిందా?"

"అమ్మాయ్! భోజనం అయిందా?ఇవాళేం చేసావు??

ఇలాంటి సంభాషణలు మామూలే కదా. ఎవరినైనా పలకరించినప్పుడు ఆయా సమయాలను బట్టి ముందుగా అడిగేది “తిన్నారా? ఇవాళేంటి స్పెషల్?” అని.

"ఆడవాళ్లకు వంట తప్ప వేరే ముచ్చట్లే ఉండవా??"

వంట చేయడమనేది మన సంస్కృతి స్త్రీకి లభించిన ఒక గొప్ప వరం. అగ్నిముందే నిలబడి వంట చేయడం ఒక యజ్ఞం లాంటిది. ఇంట్లోవాళ్లందరి ఆరోగ్యం, అభిరుచి తెలుసుకుని వాటిని దృష్టిలో ఉంచుకొని వంట చేసి వడ్డించి ఆకలి తీర్చడమే కాక సంతృప్తిగా కడుపు నింపడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందుకే తృప్తిగా భోజనం చేసిన తర్వాత అనుకోకుండా మనసులో వచ్చే మాట "అన్నదాతా సుఖీభవ.”

కాని నిజం చెప్పాలంటే వంట చేయడం ఒక గొప్ప కళ. ఏదో బ్రతకడానికి తినక తప్పదు కాబట్టి వండుకోక తప్పదు అన్నట్టు ఆదరాబాదరా కుక్కర్ పెట్టి, కూరలు తరిగి పోపులో పడేసి వంటింట్లో శతసహస్రావధానం చేసినట్టుగా మారిపోయింది నేటి జీవితం. ఏమంటే అందరూ సమయానికి సమానంగా చదువులు,ఉద్యోగాలకు పరిగెత్తక తప్పడంలేదు. ఒకోసారి రెండురోజుల కొకసారి, వారంకోసారి కూరలు వండి ఫ్రిజ్ లో పెట్టుకుని రోజుకొకటి వేడిచేసుకుని తినేవాళ్లు కూడా ఉన్నారు. సాంకేతిక, మర యంత్రాలతో పాటు పనిచేస్తూ మనిషి జీవితం కూడా యాంత్రికంగా మారిపోతుంది.  ఇదంతా చూస్తుంటే, వింటుంటే  పూర్వం అంటే మా అమ్మమ్మ, నానమ్మ, అమ్మ చెప్పిన మాటలు, చూసిన సంఘటనలు మనసులో తిరుగుతుంటాయి.

ఆ రోజుల్లో గ్యాసు పొయ్యిలు, కరెంట్ పొయ్యిలు ఎక్కడివి. కట్టెలు, బొగ్గులు లేదా ఊకతో చేసే పొయ్యిల మీద వంట చేసేవారు. కళాయి పూసిన ఇత్తడి పాత్రలు.(ఇపుడు ఇత్తడి అంటే ఇరవై ఆమడలు పారిపోతున్నారు అతివలు). వంటిల్లు మట్టి గోడలతో ఉండేది. రోజు రాత్రి పడుకునే ముందు వంటిల్లు శుభ్రం చేసి పొయ్యిలో బూడిద అంతా తీసేసి పడుకునేవాళ్లు . ప్రతి గురువారం రాత్రి పేడతో గోడలు అలికి ముగ్గులుపెట్టి శుక్రవారం ప్రత్యేకంగా వంట ప్రారంభించేవాళ్లు. ( మా అమ్మమ్మ ఇంట్లో ఇది చూస్తుంటే ఎప్పుడు వింతగానే ఉండేది) ఇప్పట్లా భోజనాలు బెడ్ రూముల్లో, టీవీ చూస్తూనో తినేవాళ్లు కాదు. వంటింట్లో కాని మరో గదిలొ కాని విస్తరాకులు లేదా అరిటాకులు వేసి నేలమీదే వరుసలో కూర్చుని తినేవాళ్లు మగవాళ్లైనా, ఆడవాళ్లైనా. అప్పుడే కష్టసుఖాలు మాట్లాడుకునేది. అమ్మ పెద్ద పల్లెంలో అన్నం పెట్టి వేడి వేడి నెయ్యి వేస్తూ, పిల్లలందరినీ చుట్టూ కూర్చోబేట్టి పప్పన్నం, చారన్నం, కూరన్నం చివరలో పెరుగన్నం అంటూ ముద్దలు కలిపి పెట్టేది. చిన్నపిల్లలకైతే నోట్లో , పెద్దపిల్లలకైతే చేటిలో పెట్టేది. ఇలా తింటూనే కథలు కూడా చెప్పేది కదా.. గుర్తుందా ..పోటీ పడుతూ తినేసి పిల్లలు ఆటలకు పరిగెత్తేవాళ్లు . ఇప్పట్లా తినడానికి అస్సలు సతాయించలేదమ్మా పిల్లలు. ఫ్రిజ్ లేదు కాబట్టి రోజు రోజు వండుకోవాల్సిందే. తాజా, నిల్వ పచ్చళ్లు, ఊరగాయలు, అప్పడాలు. పండగలొస్తే తప్పనిసరిగా చేసే పులిహోర, పాయసం. ప్రతీ పండక్కీ వేర్వేరు రకాల పిండి వంటలు, ప్రసాదాలు.

తినేటప్పుడు కూడా కొన్ని నిబంధనలు ఉండేవి. ఏదైనా చెప్పగానే ఎందుకు అని ఎదురు మాట్లాడకుండా పాటించేవాళ్లు అందరూ. భోజనం చేసేటప్పుడు ఎడమచేతిని నేలపై ఉంచడం తప్పు. కంచాన్ని చేతిలో పట్టుకుని తినడం కూడా తప్పని చెప్పేవారు. ఎడమచేత్తో తినే పదార్థాలను తాకడం అనాచారమని చెప్పేవారు పెద్దలు. తినేటప్పుడు తుమ్మొద్దు. తుమ్ము వస్తే పళ్లెం క్రింద కొన్ని నీళ్లుపోయాలి అనేది ఒక నియమం. అలాగే విస్తరాకులో కాని అరిటాకులో కాని వడ్డించేటప్పుడు ప్రతి పదార్థాన్ని ఒక వరుస క్రమంలో వడ్డించాలి. పచ్చడి నుండి మొదలెట్టి చివరగా అన్నం, నెయ్యి వడ్డించేవారు. అన్ని పదార్థాలు వడ్డించేవరకు ఎవ్వరూ భోజనం మొదలెట్టకూడదు.అలాగే భోజనం ఐపోయాక కొంపలు మునిగిపోయినట్టు లేచి వెళ్లిపోకూడదు. మరి కొందరు తినేవరకు కూర్చోవాలి. ఇది ఒక క్రమశిక్షణ లాంటిది.

వంట చేయడం మాత్రమే కాదు వడ్డించడం కూడా చాలా ముఖ్యం. స్థిమితంగా కూర్చుని ఒకరు వడ్డిస్తే భోంచేయడంలో తేడా ఉంటుంది. వడ్డించేవారు ఆప్యాయతతో, ప్రేమతో కావలసినంత వడ్డించడం, మరి కొంచం వేసుకోండి పర్లేదు అని మారు వడ్డన చేయడం ఒక ప్రత్యేకమైన కళ, ఇంత ఆప్యాయంగా వడ్డిస్తే ఎంత మొహమాటస్తుడైన మరికొంచం వడ్డించుకోక తప్పదు. అలాగే వడ్డించేటప్పుడు అవతలి వ్యక్తి ఎవరు, ఏమిటి, అతని హోదా , దర్జా ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వడ్డించడం మహాపాపం. ప్రతి వారికి సమానంగా వడ్డించడం అనేది చాలా ముఖ్యమైన విషయం.

సహజ సిద్ధంగా ఓర్పు, సున్నితత్వం, లాలన లాంటి లక్షణాలు కలిగిన స్త్రీయే ఇందుకు సమర్ధురాలని తలచే పెద్దలు ఈ మహత్తరమైన బాధ్యతని అప్పగించారేమో. అన్నం ప్రాణుల జీవాధారం. కోటి విద్యలు కూటి కొరకే. ఆనాటినుండి ఈనాటి వరకు ఏ మనిషైనా పొద్దుటినుండి రాత్రి వరకు గానుగెద్దులా కష్టపడేది పట్టెడన్నం కోసమే కదా. ..

ఈనాడు ఇలా వండి వడ్డన చేయడం చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పాలి. చివరికి ఇంట్లో సత్యనారాయణ వ్రతమైనా, తద్దినమైనా, ఆఖరికి ఓ పాతికమందిని కాదు కాదు.. పదిమందికి వంట చేయడం కూడా కుదరట్లేదు అంటూ కేటరింగ్ నుండి తెప్పిస్తున్నారు.  అది కూడా స్వంతంగా వడ్డించరు. బఫే పద్ధతి. టేబుల్ మీద పెట్టేసి ఎవరికిష్టమైనది వాళ్లు పెట్టుకుని, ప్లేటు చేత్తో పట్టుకుని నిలబడి తినాలి. ఇలా తింటూ ఎంతమంది తిట్టుకుంటారో కాని చాలామంది తినడం కూడా ఓ పనే. తొందరగా కానిచ్చేస్తే చాలు అనుకుంటున్నారు. కాని మనం ఎదుటివారి ఇష్టాయిష్టాలు, మంచి రుచికరమైన వంటకాలు చేసి ప్రతీ ఒక్కరిని పలకరిస్తూ కొసరి కొసరి వడ్డిస్తే ఆకలి తీరినా మనసు తృప్తిగా సంతోషిస్తుంది.

నా చిన్నప్పుడు మా అమ్మావాళ్లింట్లో అయితే చిన్న చిన్న పార్టీలు చాలా జరిగేవి. ప్రతీదానికి కారణం ఉండదు. ఇప్పటికీ కూడా పదిరవై మందికి ఇంట్లోనే చాలా రకాల వంటకాలు చేయడం జరుగుతుంది. సత్యనారాయణ వ్రతం లేదా తద్దినం లాంటి చిన్న చిన్న ఫంక్షన్లకు నాకు స్వయంగా వంఢి వడ్డించడం చాలా ఇష్టం. ఇటువంటి వంట, వడ్డనలో ఉప్పు, కారం, మసాలాలు, కూరగాయలు కాదు ప్రేమ, అభిమానం కలిసి ఉంటుందని నమ్మకం.. కొంచెం ఎక్కువమంది ఉంటే ఇద్దరు ముగ్గురు కలిసి సులువుగా యాభై  మంది వంట చేసేయొచ్చు.

ఇప్పుడు పెళ్లిళ్లు, పుట్టినరోజులు లాంటి ఫంక్షన్లకు భోజనంలో ఎన్నిరకాల వంటకాలు పెట్టారు అనేది పోటీలా మారింది. చేసేవాళ్లు పెడతారు కాని తినేవాళ్ల సంగతేంటి? ఎవరైనా ఎన్నని తినగలరు. వందలకొద్ది అయిటమ్స్  తయారు చేస్తారు. అన్నీ రుచి చూడాలన్న ఆరాటం. తినలేనివన్నీ వృధాయే కదా? పెళ్లిళ్లు జరిగే హాల్స్ లో మిగిలిన ఆహారం అప్పటికప్పుడే అనాధాశ్రమాలకు , రోడ్లమీద పడుకునే పేదవారికి పంచేస్తారని తెలిసినపుడు డబ్బులు వృధా కానందుకు సంతోషం కలుగుతుంది.


కుటుంబం అంతా కలిసి ఎక్కడికైనా పిక్నిక్ ప్లాన్ చేసారనుకోండి. అందరూ కలిసి అడవిలాంటి ప్రదేశంలోకాని, ఖాళీగా ఉన్న పొలాలలో కాని వంటలు చేసి, అందరూ కలిసి పచ్చని ప్రకృతిలో ఆటలు, పాటలతో, నవ్వుల కేరింతలతో భోజనాలు చేసి కాస్సేపు విశ్రాంతి తీసుకుంటే అది ఎంత శక్తిని, సంతృప్తిని ఇస్తుందో?! పూర్వకాలంలో అంటే ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇవన్నీ సర్వసాధారణం. కాని నేడు అలా కాదు కదా. అందుకే అప్పుడప్పుడు కుటుంబంలోని వారు, బంధువులు కలసి గడపాలి. దానికోసమే కార్తీక వనభోజనాలు చాలా మంది ఏర్పాటు చేస్తున్నారు. కాని అవి కూడా కుల వనభోజనాలుగా మారిపోతున్నాయి.

చిన్న సంసారమైనా కుటుంబ సభ్యులందరూ తమ సాంకేతిక సరంజామాని పక్కన పెట్టేసి ఒకేచోట కూర్చుని మాట్లాడుకుంటూ, భోజనాలు చేస్తే ఎంత బావుంటుంది..  ఆ సమయంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే పిల్లలు, వాళ్లని సముదాయించే అమ్మానాన్నలు, పెద్దవాళ్లైతే తమ కుటుంబం గురింఛిన చిన్నవి, పెద్దవి కలిసి చర్చించడం.. లేదా ఇతర విషయాలు... మాట్లాడుకోవటమో!

ఒక్కసారి ఆలోచించండి​...

Bio
bottom of page