top of page

సంపుటి 3  సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

నా డైరీల్లో కొన్ని పేజీలు... 

గొల్లపూడి మారుతీ రావు

ఇద్దరు మిత్రులు

1972

జూన్ 21: మీ మీద 'కొత్త కెరటం' వస్తోంది. చాలా పంజంట్‌గా ఉండొచ్చు. టేకిట్ ఈజీ.

జూన్ 30: జ్యోతిలో 'కొత్త కెరటాలు'లో ఒక జాలీ యంగ్‌మాన్ కాలం వచ్చింది. It is tolerably bad.

ఇది 45 సంవత్సరాల కిందటి మాట. ఈ 'నా డైరీల్లో కొన్ని పేజీలు' శీర్షిక లేకపోతే దీని ప్రసక్తి వచ్చేది కాదు. ఈ విషయంలో నా మనస్సులోని మాట చాలా మందికి ఎప్పటికీ తెలిసేది కాదు.  పై  ఉత్తరం నాకు రాసింది ఆంధ్రజ్యోతి వారపత్రిక సంపాదకులు. నాకు మిత్రులు పురాణం సుబ్రహ్మణ్యం శర్మగారు. ఆయన వారం వారం తెలుగు సాహిత్యంలో ప్రముఖుల గురించి 'కొత్త కెరటాలు' శీర్షికన వ్యాసాలు రాసేవారు. అలాంటి పని  లోగడ ఆంధ్రపత్రికలో ఆనాటి ప్రముఖులను గురించి ముళ్ళపూడి వెంకటరమణ, బాపు అద్భుతమైన చిత్రాలతో రాశారు. బాగా రక్తి కట్టిన శీర్షిక ఆనాటిది.

'కొత్త కెరటాలు' కూడా రాణిస్తూ వచ్చాయి... అంతగా కాపోయినా, ఇందులో పురాణం పైత్యముంది. అలనాడు బాపూ రమణల 'మార్కు' ఉంది. ఎప్పుడో ఒకప్పుడు నా గురించి వ్రాయక తప్పదని తెలుసు.  'ఒక జాలీ యంగ్‌మాన్' ఆ వరసలో వచ్చింది. ఇప్పుడు ఆ కాలమ్  చేతికి అందుబాటులో లేదు కాని... పురాణం వ్యంగ్యం, విమర్శ, బొత్తిగా 'అవకాశాల'ను అడ్డం పెట్టుకుని పెరిగిన ఒక 'లేకి' రచయితని ఆ కాలంలో స్ఫురింపజేసారు.

సీసా కార్కు తీయగానే రుచిని గుర్తుపట్టగల పొడవైన ముక్కు... ఇన్నీ చేసి వాటికి న్యాయమో, అన్యాయమో చేసిన రచయిత.. ఇలాగ.

చదివి కొందరు నవ్వుకుని ఉంటారు. కొందరు కితకితలు పెట్టినట్టు ఆనందపడి ఉంటారు. కొందరయినా 'ఎందుకీ ధోరణి?' అనుకొని ఉంటారు. ఏమయినా పెద్ద స్పందన రాలేదు.

పురాణం ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతిలో చాలామంది గొప్ప రచనలు చేయదానికి కారణమయ్యారు. కొందరిచేత గొప్ప రచనలు చేయించారు. రాచకొండ "సారా కథలు", వడ్డెర చండీదాసు "హిమజ్వాల" గుర్తొచ్చే విషయాలు. నేనూ చాలా రచనలు చేశాను. ఆయనకి వామపక్ష భావాలపై మొగ్గు ఉండేది. ఆ రచయితలు ఆయన చుట్టూ మూగేవారు. కాని జీవితంలో, జీవనంలో ఆ కమిట్‌మెంట్ బొత్తిగా లేనివాడు. దీనికి నేను సాక్ష్యం చాలు. మా ఆవిడకి విధిగా పురాణం, రేడియోలో అప్పట్లో పని చేస్తున్న రాచకొండ నరసింహమూర్తిగారు కార్తిక సోమవారం బ్రాహ్మణులు.

'కొత్త కెరటాలు' చదివి నేను చాలా చాలా అప్సెట్ అయ్యాను. నాకు 33 ఏళ్ళు.  నా hurt feelings ని ఆయనకి చెప్పిన గుర్తు లేదు. అప్పటికీ ఇప్పటికీ ఆ అలవాటు నాకు లేదు. నా రచన నా ఉద్యమం. రచనా స్థాయిలో ఆ పని నాకు అపరిమితమైన తృప్తినిస్తుంది. పాఠకుల ఆనందం నాకు బోనస్. విమర్శకులని నేను దూరం పెడతాను. మనసు దాకా వారి విమర్శలను చేరనీయను. కాని అది ఆదరణీయమైనవయితే అక్కున చేర్చుకుంటాను. ఉదాహరణకు.. 'సాయంకాలమైంది’ చాలా పాపులర్ అయిన నవల. దానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచనగా బహుమతి వచ్చింది. చాలాకాలం తర్వాత అందులో కొన్ని లొసుగుల్ని చూపుతూ.. కారణాలతో సహా ఒకాయన నాకు ఉత్తరం రాస్తూ 'ఇవి నాకు అనిపించిన లోపాలు. మీకు సబబుగా అనిపిస్తే స్వీకరించండి' అని రాసారు. ఆ సవరణలు అంగీకరించడమే కాదు. మలి ముద్రణలో వాటిని సవరిస్తూ 'ముందుమాటలో ఆ వ్యక్తికి కృతజ్ఞతని చెప్పుకున్నాను. ముందుమాటలో ఆయన పేరు చేర్చాను. ఆయన తర్వాత నాకు మంచి మిత్రుడయ్యాడు. ఆయన మోదుగుల రవికృష్ణ.

అయితే పురాణంగారికి తను చేస్తున్న పని తాను చెయ్యనక్కరలేనిదని ఆయన మనస్సుకే అనిపించి ఉండాలి. కనుకనే పై ఉత్తరం. పురాణం ఇప్పుడు లేడు. లేని వ్యక్తి గురించి మాట్లాడడం అన్యాయం. ఆ కాలమ్  రాసిన పురాణం అనే మిత్రుడిని నేను క్షమించలేదు. ఆ విషయం ఆయనకెప్పుడూ తెలియజెప్పలేదు. ఇప్పుడిక తెలిసే అవకాశం లేదు.

ఏమైనా పురాణం రాసిన పై ఉత్తరం ఆయన guiltకి నిదర్శనం.

ప్రతీ మనస్సులోనూ సంస్కారం తొక్కిపెట్టిన 'Hyde' పాత్ర ఉంటుంది. ఆ పాత్ర రుచి ఒక్కొక్కప్పుడు మనకి సుఖంగా, హాయిగా ఉంటుంది. మారుతీరావు కృషిని మెచ్చుకోవడం సంస్కారం. మారుతీరావు కృషి 'గాలివాటం' అని చెప్పడం Hyde ని సుఖపెట్టడం.

ఇందుకు ఇద్దరు పెద్దమనుషులను, పాఠకులను ఉదహరించి ఈ విషయాన్ని ముగిస్తాను.

ఆగస్టు 29న అంటే నెల తర్వాత మద్రాసులో వాహిని స్టూడియోలో రామానాయుడిగారి సినిమా షూటింగ్‌కి వెళ్లాను. సెట్టుమీద శోభన్‌బాబు, గుమ్మడి, చంద్రమోహన్ ఉన్నారు. గుమ్మడిగారు నాకు పెద్ద అభిమాని. లోగడ నా 'కల్యాణి' రేడియో నాటకం విని ఉత్తరం రాసిన సహృదయులు.

మాట్లాడుతూ 'కొత్త కెరటాలు చదివారా?' అన్నారు. తలూపాను.

"నాకేం నచ్చలేదు. వ్యాసంలో మీ యిద్దరి intimacy తెలిసింది కాని అన్యాయంగా రాశారనిపించింది" అన్నారు. అప్పుడు నాతో రావికొండలరావు గారున్నారు. ఆయనా అదే అన్నారు.

సెప్టెంబరు 1: రాత్రి ఎస్పీ రూంకి వచ్చారు. కాలేజీ రోజుల్లో నా 'ఆశయాలకు సంకెళ్లు' నాటికలో బెనర్జీ వేషం వేశారు. నా పుస్తకాలంటే యిష్టం. Humility, Friendliness ఆయన సొత్తు. పాటలు అనర్గళంగా పాడారు. నేనూ, వివేకం, ఎస్పీ బుహారీకి వెళ్లి భోజనం చేశాం.

"మారుతీ రావు గారంటే యింకా ముసలివారనుకున్నాను. 110 ఏళ్ల కిందట మీ ఫోటో చూశాను. చాలా వయసొచ్చిందనుకున్నాను. ఇంకా అలాగే ఉన్నారు."

ఆ రోజుల్లో శంబల్పూరు ఉద్యోగానికి శెలవు పెట్టి రాజీనామా చేసేముందు మద్రాసులో స్థిరపడాలని మనస్సులో నిశ్చయించుకుని వచ్చాను.

‘ముందు మాట’ ముందు చెప్పుకుందాం. ఈ కాలమ్ 2017 నవంబరు 15న రాస్తున్నాను. 6న ఒక సభలో నేనూ, బాలూ గారూ పాల్గొన్నాం. అప్పుడూ ఈ మాటే అన్నారు బాలూ గారు.

ఆ రోజుల్లో సినిమాల్లో నటించడానికి మద్రాసు చేరి హోటల్ సుధారాలో ఉండేవాడు కె.వివేకానందమూర్తి. అతనికీ, బాలూగారికీ మంచి స్నేహం. నేనూ సుధారాలో ఉండేవాడిని. ఆ విధంగా మేం కలిశాం. ఈ డైరీ entry లో గుర్తుపట్టాల్సిన మాటలు రెండు ఉన్నాయి. బాలూ వినయం, స్నేహశీలత. మొన్న నవంబరు 6 సభ నాది. నేను సంపాదకత్వం వహించిన "వందేళ్ల కథకి వందనాలు" పుస్తకావిష్కరణకి బాలూ ముఖ్య అతిథి. నా ఆహ్వానం మేరకు వచ్చారు. ఆహ్వాన పత్రికలో 'పద్మభూషణ్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం' అని వేశారు. వెంటనే నాకు మెసేజ్. తన పేరు ముందు 'పద్మభూషణ్' చేర్చవద్దని.

"మీ నాన్నగారు మీకిచ్చిన పేరు బాలసుబ్రహ్మణ్యం. ప్రభుత్వం చేర్చిన పేరు 'పద్మభూషణ్'. ప్రభుత్వం అంటే మేమే. మాకు చేర్చుకునే హక్కు ఉంది." అన్నాను.

మరొక్కసారి... సహృదయతని, వినయాన్ని స్వభావంగా మార్చుకున్న వ్యక్తి బాలూ.

45 సంవత్సరాల తర్వాత జీవితం ఎన్ని మలుపులు తిరిగింది. వివేకానందమూర్తి సినిమాని మరిచిపోయి ఇంగ్లండులో డాక్టరుగా స్థిరపడి దాదాపు 35 సంవత్సరాలయింది. నేను 35 సంవత్సరాలుగా కలలో కూడా ఊహించని నటుడినయి రచయితని దాదాపు అటకెక్కించాను.

బాలసుబ్రహ్మణ్యం భారతదేశం గర్వించే గాయకులయ్యారు- పద్మభూషణ్.

              

అన్నిటికన్నా 'కాలం' చాలా బలమైనది. మన వ్యక్తిత్వంలోని కొన్ని కోణాలను మనం కూడా ఊహించని రీతిలో ఆవిష్కరిస్తుంది.

OOO

 "ఈ వ్యాసం ఆఖర్న గొల్లపూడి గారు ప్రస్తావించిన పుస్తకం పేరు "వందేళ్ళ తెలుగు కథకి వందనాలు". నాలుగైదేళ్ళ క్రితం తెలుగు కథ శతవార్షికోత్సవాల సందర్భంగా ఆయన వంద మంచి తెలుగు కథలు ఎంపిక చేసి, ఆయా రచయితలని కానీ, వారి కుటుంబీకులని కానీ ఇంటర్వ్యూలు చేసి, ధారావాహికంగా HMTV లో ప్రసారం చేశారు. ఆ కథలని ఇప్పుడు పుస్తకంగా ప్రచురించి ఆవిష్కరించారు. వాటిల్లో madhuravani.com అంతర్జాల పత్రిక సంపాదక బృందం లోని వంగూరి చిట్టెన్ రాజు గారి “జులపాల కథ” ఎంపిక అయింది".

Bio

గొల్లపూడి మారుతీ రావు

గొల్లపూడి మారుతీ రావు గారి పేరు తెలియని తెలుగు వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. గొల్లపూడి మారుతీరావు గారు సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి.  తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితులు. శతాధిక నాటకాలు, కథలు, నవలలు, వ్యాసాలు, కవితలూ రాశారు.  రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తి కి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. విజయనగరంలో జన్మించిన మారుతీ రావు గారి ప్రస్తుత నివాసం విశాఖపట్నం. ప్రపంచవ్యాప్తంగా శతాధిక పురస్కారాలు అందుకున్నారు.

***

bottom of page