top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  2

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

వెండి కంచం

Sai Prabhakar.JPG

శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ

"ఇదిగో మిమ్మలనే! ఎక్కడున్నారు? అమ్మాయి ఉత్తరం రాసింది, పిల్లలకి శెలవులిచ్చారట, వచ్చేవారం బయలుదేరి వస్తున్నారుట". శాంతమ్మ మాటలకి  పడక్కుర్చీలొ కునుకు తీస్తున్న రాఘవ నిద్ర ఎగిరిపోయింది. 

 

“వచ్చేవారమే? సరిగ్గా చదివావా” అని రెట్టించి అడిగా డు కొంచం ఆదుర్దాగా.

 

మీరే చదువుకొండని ఉత్తరాన్ని రాఘవ వళ్ళో పడేసి, వంటింట్లోకి  వెళ్ళిపోయింది శాంతమ్మ.

 

ఉత్తరాన్ని పైనించి క్రిందకి నాలుగు సార్లు చదివాడు. అవును వచ్చేవారమే, సరిగ్గా ఎనిమిది రోజులుంది.

 

తాలూకా రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రాఘవకి ఉద్యోగంలో ఒక్క క్షణం తీరికుండేది కాదు. ఉదయం పదింటికి తాలూకా కచ్చేరి కి వెళితే తిరిగి ఇంటికొచ్చేసరికి రాత్రి ఏ తొమ్మిదో పదో అయ్యేది.

 

ఇక జామాబంది రోజుల్లో అయితే అర్ధరాత్రి పై మాటే. ఆదివారం సెలవన్న పేరుకే గాని, ఇంటిపట్టునుండటం అన్నది బహు అరుదు. ఒకవేళ ఉన్నా, కరణాలు మునుసబులు అతనిని ఆ రోజు కూడా వదిలేవారు కాదు.

రాఘవ శాంతమ్మలకు నలుగురు అబ్బాయిలు ఒక్కత్తే కూతురు. కూతురు సుగుణతో సహా పెద్దపిల్లలిద్దరికి పెళ్ళిళ్ళై వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు.  

 

సరిగ్గా అప్పటికి 55 ఏళ్ళు నిండడంతో ప్రభుత్వము వారు ఇక చాలు నీసేవలని రాఘవని పదవీ విరమణ చేసారు. చివర ఇద్దరు పిల్లలు అప్పటికింకా హైస్కూలు కూడా పూర్తి చేయలేదు.

 

రిటైరయ్యిన తరువాత రాఘవ జీవితంలో ఒక్కసారి స్తబ్దత ఏర్పడింది. ఉరుకుల పరుగుల దినక్రమం నెమలి నడకలా మారి చాల తాపీగా నడుస్తోంది. అప్పుడే చీకటి పడిందా నుంచి ఇంకా చీకటి పడలేదా అనే స్థాయికొచ్చింది. రిటైరై వారం గడిచింది. ఒక రోజు ట్రెజరీ నుంచి పిలుపొచ్చింది రాఘవకి - గ్రాట్యుటి లెక్కలు పూర్తయ్యాయి వచ్చి డబ్బుతీసుకోమని. ఉత్సాహంగా వెళ్ళిన రాఘవ, ట్రెజరీ వారు చెప్పిన కబురువిని నీరుగారిపోయాడు. వారిచ్చే మొత్తం, తను వేసుకున్న లెక్కలలో సగంకూడా లేదు. 

 

మొదటి నెల గడిచింది. ఒకటో తారీఖున ట్రెజరీ పాసుబుక్కు లో పడిన పెన్షన్ చూసి ఖిన్నులై పోయా డు రాఘవ. ఇప్పటివరకు వచ్చిన జీతంలో మూడోవంతు మాత్రమే. నోట మాట రావడం లేదు. జీవితంలో మొట్టమొదటిసారి ఆదాయవ్యయాలని పోల్చుకుంటున్నాడు. కూరలు, కిరాణా, పండగలు, పబ్బాలు, పచ్చే పోయే చుట్టాలు - ఏ ఖర్చు తప్పుతుంది? ఇప్పటిదాకా తన జీవితంలో ఒకరికివ్వడమేగాని, అడగని వ్యక్తిత్వం రాఘవది. భర్త తెచ్చిన సంపాదనని సంసారానికి ఖర్చుపెట్టడమే కానీ ఏనాడూ వివరాలడగని భార్య శాంతమ్మ. అటువంటి కుటుంబంలో ఆర్ధిక ఒడిదడుగులు మొదలయ్యాయి. ఆదాయం మూరెడు ఖర్చు బారెడు.

 

అప్పటికే పెన్షన్ లో కొంత శాతం అమ్మేసి డబ్బు తీసేసుకున్నాడు. అది కూడా దాదాపు హరించింది. ఇక వచ్చే నెల నుంచి సంసారం ఈదడం ఎలా అన్న ప్రశ్న అతని మెదడుని దొలిచేస్తోంది.

 

ఒకరోజు సాయంత్రం  దేముడి దగ్గర దీపం వెలిగించడానికి అగ్గిపెట్టె కోసం పడమటింట్లోకి వచ్చిన శాంతమ్మ, రాఘవ కళ్ళజోడు తీసి పడక్కుర్చీలొ కూర్చుని ఆలోచిస్తూ ఉండటం కనిపించింది.

 

ఈ సమయంలో బయటికివెళ్ళే మనిషి ఎందుకిలా ఉన్నారో అని ఒకింత ఆదూర్దా పడింది. నుదిటిపై చేయి వేస్తూ " ఏం అలా ఉన్నారు? ఈ రోజు బయట కెళ్ళడం లేదా?” అని అడిగింది. ఏమీ లేదని నసిగాడు.

 

రెట్టించి మళ్ళీ అడిగేసరికి చెప్పకుండా ఉండలేకపోయాడు. పెద్దకొడుకులు ఇద్దరు వారి వారి సంసారాల్లో ఈదుతున్నారు, వారితో పంచుకోవడం సుతరామూ ఇష్టం లేదు. వారేవచ్చి పరిస్ఠితులడిగితే చెప్పేవాడేమో. కానీ అది ఊహకందనిది. ఇక సహ ధర్మచారిణితో పంచుకుంటేతప్ప మనసు కుదుటపడేలా లేదని కొంచెం వ్యధతోనే తనకెంత పెన్షను వస్తుంది ఖర్చులెంత అన్న వివరాలు ఆమె ముందుంచాడు.

 

భర్త వ్యధను శాంతమ్మ అర్ధం చేసుకుంది. ఉన్నంతలోనే శాంతమ్మ కి బంగారు నగలు బాగానే అమర్చాడు.

మెల్లిగా అతనితో అంది "ఈ కష్టాలు కలకాలం ఉండవు, రెండుమూడేళ్ళలో పిల్లలిద్దరు గట్టెక్కెస్తారు, వాళ్ళకికూడా రెక్కలొచ్చేస్తాయి. నా బంగారుగాజులు వదులైపోయాయని బీరువాలో పెట్టాను.ఇప్పటికిప్పుడు వాటిని వేసుకుని నేనెక్కడికి వెళ్ళేది లేదు, రెండు గాజులు బాంకులో పెట్టి డబ్బు తెప్పిద్దాం, మెల్లిగా విడిపించుకోవచ్చు బంగారం ఉన్నది అవసరానికి ఉపయొగంకాక మరెందుకు” అని సలహా ఇచ్చింది.

 

ఒక్కసారి రాఘవ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కలలో కూడా ఈపరిస్ఠితి ఊహించలేదు. జత గాజులు బ్యాంకులో తాకట్టు పెట్టడం డబ్బు తేవడం జరిగిపోయాయి. కూర్చుని తింటే కొండలు కరుగుతాయి. రెండో జత గాజులు మరొక రెండునెలల్లో బాంకులో చేరాయి. ఆరు నెలలు తిరక్కుండా చంద్రహారాలు, నల్లపూసలు కూడా గాజులను వెతుక్కుంటూవెళ్ళాయి.

 

రాఘవింట్లోని బంగారమంతా బాంకు తాకట్లో భద్రంగాఉంది. కనీసం వడ్డీ అయినా కట్టకపోతే వేలం వేస్తామని బాంకు నుండి నోటీసులు రావడంతో అప్పుడప్పుడు పదో పరకో కడుతూండేవారు.

 

సరిగ్గా అప్పుడే పులిమీద పుట్రలా మరొక ఆపదొచ్చిపడింది. భారీగా కురిసిన వర్షాలకి శరంబీ నుంచి నీరు కారడం మొదలైంది. వడ్రంగి మేస్త్రి వచ్చి చూసి పెణక పూర్తిగా పాడైపోయింది వెంటనే మార్చాలని హెచ్చరించాడు. ఏమి చేయాలో పాలుబోవడం లేదు రాఘవకి. నిద్రపట్టడం లేదు. రోజంతా ఇంటి గురించే ఆలోచన. ఈ ఒక్క ఆధారం కూడా లేకపోతే నిలువ నీడ లేకుండా పోతాం అనే బాధ.

 

మజ్జిగ గ్లాసు పట్టుకొని శాంతమ్మ కటకటాల గదిలోకి వచ్చింది. ఇంటిగురించి ఏమాలోచించారని ఆమె అడుగుతుంటే రాఘవే మొదలుపెట్టాడు. ఈ వర్షాకాలం ఇంకా నెలపైగా ఉంది, ఇంటిపని వాయిదా వేయడానికిలేదు, ఏమిచేయాలో పాలుపోవడం లేదు అన్నాడు. "ఇంక ఆలోచించేదేముంది, పెణక మార్పించేయడమే. మీరు దేనిగురించి ఆలోచిస్తున్నారో తెలుసు, డబ్బు గురించేగా? మొన్న వేసవి శెలవులకు వాళ్ళ వెండికంచాన్ని అమ్మాయి ఇక్కడే వదిలేసి వెళ్ళింది. వచ్చే ఏడాది తీసుకెళతానని చెప్పింది అని మీకు చెప్పానుకదా! బీరువాలో నా చీరల క్రిందున్న అరలో పెట్టాను దానిని బ్యాంకులో పెట్టి డబ్బు తెద్దాం. వచ్చే వేసవికి అమ్మాయొచ్చే సమయానికి విడిపించి ఇచ్చేయొచ్చు" అంది శాంతమ్మ.

 

కూతురికి పెళ్ళిలో అల్లుడి కట్నంలో భాగంగా వెండికంచం గ్లాసు ఇవ్వడం జరిగింది. కేజీన్నర వెండికంచం - మధ్యలో బంగారప్పువ్వు, చుట్టూ లతలు అడుగున నాలుగు దళసరి మట్లుతో కంచం, చక్కటి బరువైన గ్లాసు చాలా దర్జాగా ఉండేవి. ఈ మధ్యకాలంలో దాని అవసరం లేకపొవటంతో పుట్టింట్లో వదలి వెళ్ళిపోతూ ఉంది.

 

 ఆ మాటతో ఎక్కడలేని ఓపిక వచ్చింది రాఘవకి. తన మనసులో కూడా అదే ఆలోచన ఉన్నా, బయటికి వెల్లడించడానికి సందేహించాడు. వెండికంచం బాంకులోకి వెళ్ళటం, డబ్బు రావడం ఇంటి పని పూర్తవడం చక చకా జరిగిపోయాయి.

 

అమ్మాయి నిన్న గాక మొన్న వెళ్ళినట్లుంది. అప్పుడే సంవత్సరం అయిపోయిందా!

 

ఇప్పటిదాకా కొడుకులపైన కూడా అధార పడని జీవితం ఆఖరికి కూతురి వస్తువు తాకట్టు పెట్టే దుస్థుతికి వచ్చింది. విధి ఎంత బలీయమైనది? గతమెంత వైభవం!

 

రాఘవకి వివిధ ప్రాంతాలకు బదిలీలు జరిగినా, సింహభాగం సొంతూళ్లో ఉన్న తాలూకాఫీసు లోనే పనిచేసాడు. రాఘవంటే తాలూకాఫీసు, తాలూకాఫీసంటే రాఘవ అన్నంతలా పేరుండేది. లాండ్ రెవెన్యు లో అతనికున్న పట్టు జిల్లాలో ఎవరికీలేదనటంలో అతిశయోక్తి లేదు. ఎన్నో ఊళ్ళ కర్ణాలు మునుసబులు రైతులకు చాలా ఉదారంగా వృత్తిపరంగా సహాయాలు చేసేవాడు. తప్పులు చేసిన ఎంతోమందిని వారి కుటుంబాలు రోడ్డునబడకుండా కాపాడాడు. తాలూకాలో తహసిల్దారు కన్నా రాఘవకిచ్చే గౌరవమే ఎక్కువ. రిటైరయ్యేవరకు కూడా అతని జీవితం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగిపోయింది.

 

"వెండికంచం" - రాఘవకి కూర్చున్నా పడుకున్నా అదే ఆలోచన - ఎలా విడిపించాలాని. ఇంకొక వస్తువేదైనా పెట్టి దీన్ని విడిపిద్దామంటే ఊన్నవన్నీ ఊడ్చేశారు. ఎవరి వద్దనైనా చేబదులు తేవాలి లేదా అమ్మాయికి విషయం చెప్పి తలదించుకోవాలి. ఈ రెండు పనులూ తలతీసేసేవే. పుట్టి బుద్ధెరిగి ఇప్పటివరకూ ఎవరి దగ్గరా చెయ్యి జాచి అడగలేదు. ఇంట్లో ఎంత కష్టాలు అనుభవించినా అవి మూడోకంటివాళ్ళకు తెలియవు. అటువంటిది ఇప్పుడు బయటపడడం అనే ఊహ తల్చుకుంటేనే గుండె పిండేసినట్లయిపోతోంది.

 

అల్లుడికి ఈ విషయం తెలిస్తే ఇంత దిగజారిపోయామనుకుంటారనే వ్యధ అతనిబాధని రెట్టింపుచేస్తోంది.

 

ఉత్తరం వచ్చి మూడురోజులవుతోంది. రాఘవకి ఏమి చెయాలో పాలుపోవడం లేదు. బయటికెళ్ళడం తగ్గించేసాడు.

 

“ఏమండి! కంచం గురించి ఆలోచించారా", అడిగింది శాంతమ్మ.

 

"అన్నీ గుర్తున్నాయి! ఇంకా మరచిపోయే స్థితి రాలేదు" అని కొంచం విసుగు ధోరణిలో కసురుకొనేలా వినిపించింది రాఘవ సమాధానం.

 

"ఎందుకంత విసుగు? చంటాడి పుట్టినరోజు కూడా వస్తోంది కదాని గుర్తుచేశాను" కొంచం నిష్టూరంగా అంది శాంతమ్మ.

 

మనవడి పుట్టినరోజని వినిపించగానే ఒక్కసారి గతుక్కుమన్నాడు రాఘవ.

 

అప్పుడు గుర్తుకొచ్చిందతనికి - మనవడు  పుట్టినరోజు కూడా ఆ వారంలోనే. పిల్లల పుట్టినరోజున వెండికంచంలో వడ్డించి తినిపించడం అమ్మాయి వాళ్ళ ఆనవాయతి.

 

నెమ్మదిగా గుడికి బయలుదేరాడు రాఘవ. గుడి చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకో కొద్దిసేపట్లో గుడి మూసేస్తారు. స్వామీ! పుట్టినప్పటినుండి ఏ కష్టమొచ్చినా నీకే మ్రొక్కుకున్నాను ఏ సంతోషమొచ్చినా నీతోనే పంచుకున్నాను. ఎప్పుడూ నన్ను నిరుత్సాహపరచలేదు. నాకెన్నో ఇచ్చావు, ఒక చెంబుడు నీళ్ళతో అభిషేకం తప్ప నేనేమి చేయగలిగాను తండ్రి నీకు? ఇప్పుడు నాకొచ్చిన సమస్యను కష్టమనాలో ఆపదనాలో అర్ఠం కావడంలేదు. లోకం దృష్టిలో ఇది అతిచిన్న సమస్యేమో? బయటికితెలిస్తే తేలిగ్గా కొట్టిపారేస్తారేమో? తెలియదు. కానీ నాకు మాత్రం అతి క్లిష్టమైనది. పౌరుషంగా తలెత్తుకొని బ్రతికానయ్యా! ఈసారి కూడా నువ్వే గట్టెకించాలి అని శివలింగానికి మ్రొక్కి ఇంటికి వెళ్ళాడు.

 

రాఘవ మడతమంచం మీద అటుఇటు దొర్లుతున్నాడు. ఒకటే ఆలోచన - వెండికంచం. వచ్చే గురువారమే అమ్మాయొచ్చేది. రకరకాల ఆలోచనలతో రాఘవ మనసు పరిపరి విధాలు పోతోంది. ఎప్పుడు పట్టిందో నిద్ర తెలియదుగాని, మెలుకువ వచ్చేసరికి తెల్లారిపొయింది.

***

 

ఉద్యోగం చేసే రోజుల్లో ఆఫీసుకెళ్ళే తొందరలో ఏదో హడావుడిగా పూజాకార్యక్రమాలు ముగించిన రాఘవకి, రిటైరైన తరువాత అనుష్టానానికి బోలెడు తీరిక దొరికింది. అప్పుడు లేని కష్టాలు ఇప్పుడు వస్తున్నాయని ఒక నిర్లిప్తతతో పూజాముగించి పడక్కుర్చీలో కూర్చున్నాడు.

 

ఇంతలో వీధి తలుపు వద్ద రిక్షాలాగిన శబ్దం వినిపించి వొళ్ళోని కళ్ళజోడుని కళ్ళకు పెట్టుకొని ఎవరై ఉంటారాని తొంగిచూస్తుంటే " రాఘవ గారూ" అని పిలుస్తూ లోపలకి వస్తున్నాడు ప్రక్క ఊరి కరణం ఆ వెనక్కాల ఇద్దరు మునసబులు. రాఘవ లేచి లాల్చీ వేసుకొని కటకటాలగదిలోకి వచ్చాడు. కుశలప్రశ్నలన్నీ అయ్యాక అందరూ టీ తాగుతుంటే వాళ్ళొచ్చిన విషయం మొదలుపెట్టాడు కరణం. అప్పటికి రాఘవ రిటైరయ్యి ఆరు నెలలు కావొస్తోంది. రిటైరైన వారంలోపే గ్రామ కరణాలు మునసబులు అందరూ కలసి రాఘవకి సన్మానం చేద్దామనుకున్నారు కానీ వివిధ కారణాల మూలంగా కుదరలేదు. ఇప్పుడు మొత్తానికి సమయం కుదిరింది. ఈ గురువారమే సన్మానం జరపాలని తీర్మానించాము కాబట్టి మీరు వద్దనకుండా సతీసమేతంగా రావాలని పట్టుబట్టారు. ఈ పరిస్థితుల్లో నాకు సన్మానమా? అసలు నేనేమైనా ఆనందించగలనా? ఎల్లుండి ఊదయమే అమ్మాయివస్తోంది ఆరోజు సాయంత్రమే సన్మానం.

 

రాఘవ అయిష్టంగానే బలవంతమ్మీద ఒప్పుకున్నాడు.

 

గురువారం ఉదయమే సుగుణ పిల్లలు దిగారు. సుగుణకి ఆరోజు రాఘవకి జరగబోయే సన్మానం గురించి చెప్పింది శాంతమ్మ. సాయంత్రం నాలుగు గంటలకు కుటుంబంతో సన్మానానికి బయలుదేరాడు రాఘవ. 

తల్లి బంగారు గాజులు కాకుండా మాములు గాజులు వేసుకోవడం మెడలో కూడా మంగళసూత్రాలు తప్ప వేరే నగలు లేకపోవడం చూసి, మరచిపోయిందేమో చెబుదామని నోటిదాకావచ్చి మనస్కరించక ఆగిపోయింది సుగుణ. ఆర్ డి ఒ ముఖ్యాతిధిగా జరిగిన సభలో అందరూ రాఘవ సేవలను పొగుడుతూ ప్రసంగించి దంపతులకు పూల దండలు వేసి శాలువా మరియు జ్ఞప్తికతో ఘనంగా సత్కరించి అందరూ గ్రూపు ఫొటో తీసుకున్నారు.

 

అందరూ కలసి వారిని జీపు దాకా సాగనంపారు. బిళ్ళ బంట్రోతు శాలువా సన్మానపత్రం, షీల్డు పూలదండలున్న సంచిని తీసుకొచ్చి జీపులో పెట్టాడు.

***

 

మరునాడు శుక్రవారం యధావిధిగా స్నానాదికాలు ముగించుకొని పూజకుపక్ర మించాడు రాఘవ.  ఒక్కటే ఆలోచన "వెండికంచం". అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పూజ ముగించుకొని పడక్కుర్చీలో కూర్చోబోతుంటే, ఒక్కసారి తనకు జరిగిన సన్మానం గుర్తుకొచ్చింది. అందరు తన గురించి  ఎంత గొప్పగా మాట్లాడారో తలచుకుంటూ, సన్మాన పత్రాన్ని ఒక సారి చదువుకుందామని బీరువాలోని సంచీని తెరిచి ఒక్కక్కటే బయటికి తీసున్నాడు. సన్మానపత్రం, షీల్డు, శాలువా దాని కింద ఒక తెల్లని కవరు. సన్మానపత్రం అచ్చ తెలుగులో షీల్డు ఆంగ్లంలో వ్రాసి ఉన్నాయి. కవరుని తీశాడు, కవరు పైన "రాఘవగారికి ధన్యవాదములతో" అని వ్రాసిఉంది. రాఘవకి ఒకింత ఆశ్చర్యం కలిగింది. ఆతృతగా కవరును చించి అందులోనించి ఒక పావుఠావు పేజీ ఉన్న లేఖని బయటకు తీసి చదవడం ప్రారంభించాడు.

 

నమస్తే రాఘవ గారు,

 

సుమారు ముప్ఫై సంవత్సరాలకు పైగా మీరు మాకందరికీ ఎన్నోరకాల ఉపకారాలు చేసారు. కన్నతండ్రి తమ పిల్లలను కడుపులో పెట్టుకొని చూసుకున్నట్లు - ఎంతో మంది బంట్రోతు పిల్లల స్కూలు ఫీజులు కట్టిన వైనం, బిళ్ళ బంట్రోతు నారాయణుడు తీవ్రమైన జబ్బుకు అందరివద్దా చందాలు వసూలుచేసి ఆసుపత్రిలో అతనికి ఖరీదైన చికిత్స ఇప్పించి, అతను తిరిగి కోలుకున్నంతవరకు మీరు ఆ కుటుంబం బాగోగుల పట్ల చూపిన శ్రద్ధ ఎలా మరచిపోగలం చెప్పండి? ఇవి మీ మంచితనానికి మచ్చుతునకలు మాత్రమే. మీరు సంపాదించింది కొండంత అభిమానం మరియు ప్రేమ. అవే మీకు శ్రీరామరక్ష. మీ విశ్రాంత జీవితం మీరుకోరుకున్న విధంగా సాగిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ,

 

ఇట్లు

మీ శ్రేయోభిలాషులు

 

అప్పటికే రాఘవ కళ్ళు చెమర్చాయి. ఒక్కసారి గతస్మృతులన్నీ కళ్ళముందు కదలాడ సాగాయి. భోజనానికి రండి అన్న శాంతమ్మ పిలుపుకి ఆ అనుభూతులనుంచి బయటబడి భోజనానికుపక్రమించాడు.

 

భోజనం వడ్డిస్తూ, అటూ ఇటూ చూసి, కూతురు లేదని నిర్ధారణ చేసుకొని " ఏమండి! ఇప్పటిదాకా అమ్మాయి కంచం విషయమేమి ఎత్తలేదు. అడిగితే ఏం చెప్పాలో పాలుపోవటం లేదు" అని విశనకర్ర విసురుతూ నెమ్మదిగా చెప్పింది శాంతమ్మ.

 

రాఘవ మౌనమే ఆమెకు సమాధానమైంది.

 

"మీరేమి అనుకోనంటే నాదొక సలహా" అని చెప్పమంటారా అన్నట్లు కాస్త భయంగా అతనికేసి చూసింది శాంతమ్మ.

 

చెప్పమన్నట్లుగా ఆమె వైపు చూడకుండానే తల క్రిందకి పైకి ఊపాడు.

 

"ఒకసారి బాంకుకి వెళ్ళి, ఈ ఇంటిపై ఏదైనా డబ్బిస్తారేమో కనుక్కొండి" అంటూ కంచంలో మజ్జిగ వడ్డించింది శాంతమ్మ.

 

ఆ మాట వినగానే ఒక్కసారి రాఘవ గుండె కలుక్కుమంది. ఇంక అన్నం తినబుద్ధి కాలేదాయనకు. కంచంలోనే చేయికడుక్కొని లేచిపోయాడు.

 

నిర్ఘాంతపోయింది శాంతమ్మ. అయ్యో అనవసరంగా చెప్పానా అని ఒకింత బాధ కలిగిందామెకి.

 

పడమటింట్లో నాలుగడుగులు తిరిగి కుర్చీలోనే ఒక కునుకు తీశాడు రాఘవ. రేడియో లో కార్మీకుల కార్యక్రమం అప్పుడే పూర్తయి ప్రాంతీయవార్తలు మొదలయ్యాయి. వార్తల మధ్యలో "ఇప్పుడే అందిన వార్త" అని వినపడగానే, లేచి రేడియో సౌండ్ పెంచాడు. ఆ వార్త వింటూనే ఆశ్చర్యచకితులైపోయాడు. ఇది కలా? నిజమా? నమ్మలేకపోయాడు. అదే వార్తని మళ్ళా మళ్ళా ప్రస్రారం చేస్తూండటంతో ఆశ్చర్యంలోంచి బయటకు వచ్చాడు. ఏమే ఒక్కసారి ఇలా వస్తావా అని శాంతమ్మను పిలిచి ఆ వార్తని పెద్దగొంతుకతో చెప్పసాగాడు. 

 

"రాష్ట్ర ప్రభుత్వం పదవీ విరమణ వయస్సుని 55 సంవత్సరాలనుండి 58 సంవత్సరాలకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది ఈ సంవత్సరం రిటైరైనవాళ్ళందరికి వర్తిస్తుంది. రిటైరైనాటి నుండి ఇప్పటివరకు గడచిన కాలాన్ని జీతంతో కూడిన శలవుగా ప్రకటించారు. తీసుకున్న పెంక్షన్ మినహాయించి మిగిలిన జీతాన్ని ఒకే మొత్తంగా రెండురోజుల్లో చెల్లించవలసినదిగా రాష్ట్రంలోని అన్ని టెజరీ శాఖలను ఆదేశించారు. గ్రాట్యుటీ మరియు ప్రొవిడెంటు నిధిని కూడా తీసుకున్నట్లయితే, ఆ మొత్తాన్ని లోనుగా పరిగణిస్తారు. విషయం తెలుసుకున్న శాంతమ్మ ఆనందానికి హద్దులు లేవు. దంపతులిద్దరికీ అంతా ఒక కలలా ఉంది. రాఘవ కిప్పుడు నెత్తిమీద పెద్దభారం తొలగినట్టయి మనసు దూదిపింజలా ఎగరసాగింది. ఇంటిల్లిపాదికీ ఆనాడొక పండగ దినమయింది.

 

ఆ సాయంత్రమే రాఘవ డైనమో సైకిల్ శుభ్రంగా ఆయిలింగ్ చేయబడి సిద్ధమైంది. మరునాడే కచ్చేరీ బయలుదేరాడు. చెప్పిన విధంగానే ప్రభుత్వంవారు రెండురోజుల్లో జీతం బాకీలను చెల్లించారు.

 

వెంటనే రాఘవ బాంకుకి వెళ్ళడం, తాకట్టుపెట్టిన వస్తువులన్నిటినీ విడిపించుకొని రావడం జరిగిపోయాయి. మనవడు పుట్టినరోజున వాడు అన్నం తింటున్న "వెండికంచం" ధగ ధగా మెరిసింది.

 

*****

bottom of page