top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  2

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

“దీప్తి” ముచ్చట్లు

తెల్ల కాగితం

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

"మామ్, నేను సాయంత్రం వరకల్లా వస్తాను, గుర్తుందిగా. రెండింటికే డాక్టర్ అపాయింట్మెంట్.  ఈ రోజు అపాయింట్మెంట్ కి నిన్ను మిస్టర్ సాక్స్ తీసుకెళతానన్నాడు. జాగ్రత్తగా వెళ్ళిరా. సరేనా?"  మామ్ కి జాగ్రత్తలు చెబుతూనే ఇంట్లోంచి బయటకు వచ్చాను. మామ్ కి రెండువారాల క్రితం కుడి కాలు ఫ్రాక్చర్ అయింది. ఇంకొన్ని వారాలు డ్రైవ్ చేయలేదు. డాడ్ కూడా ఊర్లో లేకపోవటంతో మా ఇంటికి దగ్గర్లో ఉండే బంధువు మిస్టర్.సాక్స్ సాయం కోరాను.

 

 

"హాయ్ ఆండ్రూ!" - వారాంతం శెలవు మీద వచ్చి, కాలేజీకి తిరిగి బయల్దేరుతున్నదల్లా ఆగి మరీ ఉత్సాహంగా నన్ను పలకరించింది పక్కింటి స్నేహితురాలు అంజలి.

నాకు వినబడింది. స్పష్టంగా. కానీ బదులు చెప్పాలనిపించలేదు. వినబడనట్టే తిరిగి లోపలికెళ్ళిపోయాను.

"ఏమయిందీ? ఏదయినా మర్చిపోయావా?" - నన్నే చిత్రంగా చూస్తూ అడిగింది మామ్.

మెడలో వేలాడుతున్న "డేవిడ్ బ్రదర్స్ పెస్ట్ కంట్రోల్ కంపెనీ" ఐ.డి.కార్డు, చేతిలో ఉన్న కంపెనీ బ్యాగ్ కేసి చూసుకున్నాను. ఆలస్యం సహించని బాస్ డేవిడ్ గుర్తొచ్చాడు. అయినా అంజలితో మాట్లాడటం తప్పితే చాలనిపించింది ఆ క్షణం.
 బ్యాగ్ ని ఓ మూల పెడుతూ వచ్చి రిక్లయినర్ లో కూలబడ్డాను.

 

"వెళ్ళినట్టే, వెళ్ళి వెనక్కి వచ్చావేంటీ?" -   మామ్  మళ్ళీ అడిగింది.

"ఏమీ లేదు, ఆ పక్కింటి దయ్యం..." మాటలు పూర్తి చేయలేక అర్ధోక్తిలో ఆగిపోయాను.


మామ్ నా గొంతులో ధ్వనించిన కోపాన్ని గమనించి, నమ్మలేనట్టుగా చూసింది నా వైపు -"అదేంటి? ఏంజెల్ పై కోపమెందుకూ? చిన్ననాటి నుంచీ మనింట్లో పెరిగినట్టు పెరిగిన పిల్ల. ఎపుడూ ఇద్దరూ కలిసే ఆడేవారు కదా?  గత సంవత్సరం నుంచీ  ఏంజెల్ ని  చూసిందే లేదు . పాపం. ఈ వారాంతం వచ్చినప్పటినుంచీ నీ కోసం ఎన్ని సార్లడిగిందో? ఎందుకిలా ఏంజెల్ ని తప్పించుకు తిరుగుతున్నావు?"

"ఏంజెల్ కాదు. అంజలి తన పేరు. అంజలి అనే పిలవాలని ఎన్నిసార్లు చెప్పాలి? వీలవకపోతే దయ్యం అని పిలువు. అదయితే సరిగ్గా సరిపోతుంది."  విసుక్కుంటూనే అన్నాను గొణుగుతున్నట్టుగా.  నాకే తెలియని అసహనం నాలో.

మామ్ దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ నన్నే చూస్తుంటే, ఆ పరిస్థితి కలిగించిన ఇబ్బంది వల్ల కొంతా, మరీ ఆలస్యమైతే బాస్ ఈ పార్ట్ టైం ఉద్యోగం నుంచీ తీసేస్తాడన్న భయంతో కొంతా... లేచి బ్యాగ్ తీసుకుని, కిటికీ కాస్త తెరిచి బయటకు చూసాను.

ఎవరూ లేరని నిర్ధారించుకుని, నా వైపే సాలోచనగా చూస్తున్న మామ్ కి బై చెప్పేసి బయల్దేరాను.

వెనుక నుంచి మామ్ మాటలు వినబడ్డాయి - "ఆండ్రూ, ఈ రోజు మిస్టర్ సాక్స్ రానవసరం లేదు. నా అపాయింట్మెంట్ వాయిదా వేస్తున్నానని చెప్పు."

 

ఆ మాటలు విన్న నేను ఆశ్చర్యపోలేదు. మామ్ ఇకపై మిస్టర్ సాక్స్ ని వీలయినంత దూరముంచే అవకాశముందని నాకు ఇందాకే అర్థమయింది.

కార్ నడుపుతున్నానన్న ధ్యాసే కానీ, చిన్నబోయిన మామ్ మొహం గుర్తొస్తుంది. మామ్ కి అంజలి అంటే చాలా ఇష్టం. అంజలి అనే కాదు. మామ్ కి మనుషులంటే ఇష్టం. నాకూ అంజలి మంచి స్నేహితురాలుగా తోచేది.

ఒక్కసారి హైస్కూల్ లోకి వచ్చాక, ఇద్దరి దారులూ వేరవటం మొదలయింది.

హైస్కూల్ రంగుల ప్రపంచం. నాకు మొదటి నుంచీ ఇష్టమైన బ్యాండ్ లో చేరాను. అక్కడ కొత్త స్నేహాలు, పగలనకా, రాత్రనకా మా ప్రాక్టీసులు, అదే లోకంగా జీవితం. చదువుపై  ఆసక్తి తగ్గింది. బ్యాండ్ వరకే నా ఆసక్తి పెరిగి ఉంటే బావుండేది. ఆ తర్వాత నా ఆసక్తులు కొత్త అలవాట్లు, వాటి ఆకర్షణా వలయాలని అల్లుకుంటూ వెళ్ళాయి. సీనియర్ యియర్- పన్నెండో తరగతి వచ్చాక మాత్రమే నేను వాస్తవాన్ని గుర్తించాను. కాలేజీ చదువులకి నేను సిద్ధంగా లేననీ, నాలుగేళ్ళ పాటు చదివి డిగ్రీ తీసుకోగల ఆసక్తీ లేదని నాకు అనిపించింది. అదే సమయంలో అంజలి కష్టం ఫలించి, తను కోరుకున్న ఐవీ కాలేజీలో సీటు రావటంతో రెక్కలు కట్టుకుని మరీ అక్కడ వాలిపోయింది.

 

తెలీకుండానే దూరం పెరిగింది కానీ, కనబడినపుడు స్నేహంగానే మాట్లాడుకున్నాము. ఎటొచ్చీ, ఈ మధ్యే నా దారి వేరవటం కాదు, మొదటినుంచీ మేము వేరు వేరు అనే అనిపిస్తుంది. ఈ మార్పుకి కొంతవరకూ నాకు నేను కారణమయితే, మరికొంత మిస్టర్ సాక్స్ కారణమయుండాలి. మిస్టర్ సాక్స్ మా డాడ్ కి కజిన్ వరుస. మా ఊరి కి ఈ మధ్యే బదిలీపై వచ్చాడు. తరచుగా ఇంటికి వస్తూంటాడు. అంతకుముందు అతనున్న కంట్రీసైడ్ ప్రాంతంలో ఇతర దేశీయులెవరూ లేకపోవటంతో, అతనికి ఈ మహానగరం నిండా విస్తరించి ఉన్న ఇతర జాతులని చూస్తుంటే అసహనం కాబోలు. నొసలు ముడి వేస్తూంటాడు.   మా వీధిలో ఉన్న ఇతర దేశాల వారి ఉనికిని చూపులతోనే నిరసిస్తూంటాడనిపిస్తుంది. మన దేశానికి వచ్చి, వాళ్ళు సంపన్నులవుతున్నారని మాత్రం అపుడపుడూ గొణుగుతాడు. ఓ రోజు నాకు బాగా గుర్తు.   అక్కడి నుంచి ఇల్లు మారమని, కకేషియన్స్ మాత్రమే ఉన్న కమ్యూనిటీలో ఇల్లు తీసుకొమ్మనీ మామ్ తో అన్నాడు. ఆ మాట వినీ నేనూ ఆశ్చర్యపోయాను. మామ్ కి ఎందుకో మిస్టర్ సాక్స్ పై పెద్ద మంచీ, చెడూ అంటూ ఏ అభిప్రాయం ఉండకపోయేది కానీ, ఆ రోజు మాత్రం "నాకిక్కడంతా బాగుంది. నాకిలాగే బాగుంది" అని నిక్కచ్చిగా అంది. ఆ పై ఆ ప్రస్తావన మామ్ ముందెపుడూ తేలేదిక. కానీ, నేను మిస్టర్ సాక్స్ మాటలు శ్రద్ధగా వినటం మొదలుపెట్టాను. అప్పుడు మొదలయిందనుకుంటా. చిన్నప్పుడు తెలీని తేడాలు స్పష్టంగా కనబడటం.  మిస్టర్ సాక్స్ అభిప్రాయాలు వింటూంటే మాత్రం వారు వేరు, పరాయివారు అన్న స్పృహ గట్టిగా కలగటం మొదలయింది. తర్వాత ఎందుకో మా ఇద్దరి పద్ధతులు, ఆసక్తులూ వేరు వేరు అన్న స్పృహ కలుగుతూండటంతో అంజలితో స్నేహం పట్ల ఆసక్తి కలిగేది కాదు. తరచి చూస్తే నా ఇతర కకేషియన్ స్నేహితులెవరూ నాలా ఈ అయిష్టత చూపట్లేదు.  నేను నాకు తెలీకుండానే మిస్టర్ సాక్స్ లా మారుతున్నట్టు తెలిసేది కానీ అదేమీ తప్పనిపించలేదు.  


కట్ చేస్తే- మళ్ళీ బ్యాండ్ పై దృష్టిపెట్టాను. కమ్యూనిటీ కాలేజీలో చేరాను. డేవిడ్ ఇచ్చిన వీకెండ్ జాబ్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే నా పట్ల నాకేమీ రిగ్రెట్స్ లేవు. నేనెలా ఉండాలనుకున్నానో అలాగే ఉన్నాను. కానీ, అంజలి విభిన్నంగా ఉన్నందుకు నచ్చట్లేదు. తను తనలా ఉంది. నాలా లేదు. అదీ నచ్చట్లేదు. ఈ లోకంలో మనుషులందరూ మూసపోసినట్టు నాలా ఉండాలని నేను కోరుకోను కానీ, నా కంటే పూర్తి భిన్నంగా ఉండటం బహుశా నాకు నచ్చట్లేదేమో. అందుకే మిస్టర్ సాక్స్ మాటలలో నాకు నేను ఐడెంటిఫై చేసుకుంటున్నానేమో.

నేను ‘చేరవలిసిన ఇల్లు వచ్చింద’ని నా కార్ లోని  జీ.పీ.ఎస్ చెప్పటంతో ఆలోచనల్లోంచి బయటకి వచ్చాను.

 

సరిగ్గా పార్క్ చేయగానే, డేవిడ్ నుంచి మెసేజ్. "ఆండ్రూ, నువ్వు సర్వీస్ చేయాల్సిన మిస్టర్.తోట ఇంటికి చేరావు కదా" అని. అప్పుడు గమనించాను. పని వేళలు మొదలు కాగానే, నేను నా ఫోన్ లో ఉన్న "జియో ట్రాకింగ్ యాప్  ఆన్ చేయలేదని. అంజలి కనబడటంతో మరేవో ఆలోచనల్లో పడి ఈ విషయమే మర్చిపోయానని.


వెంటనే సమాధానం పంపాను - 'చేరాన'ని. ఇతని సమయపాలన, వృత్తిపట్ల అంకితభావం నాకు కొత్త కాదు.  ఏ తేడాలూ ఒప్పుకోడు. పొరపాట్లూ సహించడు. అందుకే ఈ ఊరిలో అతని సర్వీసెస్ కి మంచి పేరుంది. ఉద్యోగుల అజాగ్రత్త పట్ల అతనికి జీరో టాలరెన్స్.  

వెంటనే ఫోన్ లో ట్రాకింగ్ యాప్ కూడా ఆన్ చేసాకే, ఆ ఇంటి తలుపు తట్టాను.

ఒక ఐదు నిమిషాల తర్వాత చెవికి హెడ్ సెట్ పెట్టుకుని, తలుపు తీసింది ఒకావిడ. తలుపు తీసీ, తీయగానే, "ఎక్స్క్యూజ్ మీ అని"  కంప్యూటర్ దగ్గరికెళ్ళి, ఏదో చెప్పి, తిరిగి నా దగ్గరికి వచ్చింది. బహుశా ఏదో మీటింగ్ లో ఉన్నట్టుంది.

 

ఒక పాత టీ-షర్ట్, వెలిసిపోయిన పజామా, గోధుమ వర్ణం, నుదుటిపై చిన్న టాటూ [దాన్ని బొట్టు అంటారని అంజలి చెబుతుంది, కానీ, నేను టాటూ అనే అంటాను],  మొహాన చిరునవ్వు అంటించుకుని వచ్చింది. వెరసి, మళ్ళీ ఇక్కడా ఓ ఇండియన్ వుమన్. ఐ జస్ట్ హేట్ దెమ్, యూ నో?


"షూస్ బయటే వదలగలవా?" అభ్యర్థనగా అడిగింది. మాకు అలవాటే. ఈ ఇండియన్ వుమెన్ ప్రేయర్ రూం లోకి చెప్పులు వేసుకుని రాకూడదంటారు. కొందరు ఇళ్ళలోకే వద్దంటారు. అలాంటప్పుడు షూస్ కి వేసుకోవటానికి కొన్ని తొడుగులు ఇస్తాడు డేవిడ్. అవి వేసుకున్నాను.

 

ఆవిడ నా కాళ్ళవైపు కొంచెం నిరాశగా చూసి, వెంటనే సర్దుకుంది. మొహంపైకి చిరునవ్వు తెచ్చిపెట్టుకుంది. ప్రేయర్ రూం లోకి మాత్రం వెళ్ళవద్దని చెప్పి, ఇల్లు చూపించింది, ఎక్కడెక్కడ పెస్ట్ కంట్రోల్ కోసమని, బొద్దింకలు వగైరాలు రాకుండా జెల్ బెయిట్ పెట్టాలో వివరిస్తుంది. నాకు తెలీనట్టు. నేనేదో ఈ పనికి కొత్తయినట్టు. సర్వీస్ కి వచ్చిన ప్రతీసారీ ఏమి చేయనున్నానో చెప్పాల్సిన పని నాది. కానీ, ఒక్కోసారి వింటూ ఉండటంలో సౌలభ్యం ఒకటుంది. అదేంటంటే... ఆవిడ మాట్లాడుతూ ఉంటే, నేను మాట్లాడనవసరం లేదు. అందుకు. నాకిష్టం కాని వ్యక్తులతో మాట్లాడ్డం నాకు పెద్దగా ఇష్టముండట్లేదు. ఆవిడంటే ఎందుకు ఇష్టం లేదని మీరు అడిగితే -"మళ్ళీ మొదటికొస్తున్నారు మీరు." అంటాన్నేను. అదంతే. అంజలి ఎందుకు నచ్చదో అందుకే. సరే, మొత్తానికి అలా ఆ ఇల్లు ని ఎలా క్రిమికీటకాలకి స్థానంలేని భద్రతా స్థావరం గా  మార్చాలో వివరించింది. మొహం మీది నవ్వు ఏ మాత్రం తగ్గకుండా. ఎందుకలా నవ్వుతూ ఉంటారో? నా మొహం మీద అయిష్టత కనబడకా? లేక, నాలాంటి వారి మొహాలపై కదలాడే అయిష్టతలకి అలవాటు పడా?


ఆవిడ చెప్పిన చోట్లన్నీ షీట్ మీద మార్క్ చేసుకున్నాను.  అసలు, ఇల్లు అంటారా దాన్ని. మేన్షన్. ఎంత పెద్ద భవంతో. ఎంతో అందంగానూ తీర్చిదిద్దబడి ఉంది. ఇల్లు నచ్చింది. కానీ, ఆ ఇంటికి ఆవిడ యజమానురాలు అవటం నచ్చలేదు. ఎందుకంటే, అలాంటి అందమైన ఇళ్ళకి యజమానులుగా ఎవరుండాలనే దానిపట్ల నాకు కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి మరి. ఎంతో గంభీరంగా ఎలిజబెత్ రాణిలా మెరిసిపోతూ ఉండే మా గ్రానీ గుర్తొచ్చింది. ఇలాంటి వాటికి అలాంటి యజమానురాలే ఉంటే బాగుండదూ? మా మామ్, చెల్లెళ్ళు లాంటివాళ్ళు తిరుగాడితే కదూ ఈ భవంతికి అందమొచ్చేది?

నాకు అప్పజెప్పి వెళ్తున్నదల్లా మళ్ళీ వచ్చింది. 

 

పని చేసుకోకుండా ఏంటీవిడా? 

 
"అడగటం మర్చిపోయాను. మంచినీళ్ళేమయినా కావాలా?" ఓపెన్ చెయ్యని వాటర్ బాటిల్ ఆఫర్ చేస్తూ ఆదరంగా అడిగింది.

"నో, అయాం ఫైన్" అన్నాను. ముఖం అలాగే గంటుగా పెట్టుకుని.

అన్ని గదుల్లోనూ స్ప్రే చేయటం, జెల్ బెయిట్ పెట్టటం అంతా అయిపోయింది. హాల్ లో ఉన్న నాలుగేళ్ళ పిల్లాడు తెల్ల కాగితం మీద ఏదో రాసుకుంటున్నాడు. పక్కన పెన్సిళ్ళు, క్రేయాన్లూ... మధ్య మధ్య నా వంక చూస్తూ స్నేహపూర్వకంగా నవ్వుతున్నాడు. నన్నేదో రకంగా ఆకట్టుకోవాలని కాబోలు. కాగితం పై ఏదో చూపుతున్నాడు. వాళ్ళమ్మని చూసినంత నిర్లక్ష్యంగా వాడినీ చూసాను. అయినా వదలడే. 


చివరి అంకంగా కిచెన్ క్యాబినెట్స్ ఓపెన్ చేసి, మూలలలో జెల్ బెయిట్ పెడుతూన్నప్పుడు జరిగిందది. పని పూర్తి చేసి వెళ్ళిపోయే తొందరలో ఉన్నానేమో, ఒక క్యాబినెట్ డోర్ ని ఠక్కున  వేసేసాను. ఆ వేయటంలో విసురుకి దాని పైన షెల్ఫ్ లో స్టాకప్ అయి ఉన్న గాజు గ్లాసులన్నీ ఒక్కసారిగా కిందపడ్డాయి. భళ్ళున పగిలాయి. పెద్ద శబ్ధం చేస్తూ. 

క్షణంలో జరిగింది ఈ భీభత్సమంతా.

ఆ శబ్ధం విని భయపడ్డ పిల్లాడు గట్టిగా వాళ్ళమ్మని కేకేసాడు. ఆ లోపే, ఆ శబ్ధం వినబడిందేమో, పరుగు,పరుగున వచ్చేసి వాణ్ణి గట్టిగా పట్టుకుంది. నా ముందంతా కిచెన్ నుండి డైనింగ్ ఏరియా వరకూ చెల్లా చెదురుగా, పెద్దా, చిన్నా పరిణామాల్లో, పదునుగా కొనదేలి పడి ఉన్న గాజుముక్కలు. ఎదురుగా ఇందాకటి వరకూ నేను నిర్లక్ష్యంగా చూసిన తల్లీ, పిల్లాడు.

ఒక్కసారిగా కళ్ళ ముందు అజాగ్రత్తని క్షమించని డేవిడ్ కనబడ్డాడు. ఇపుడు ఈవిడ ఇచ్చే ఫీడ్ బ్యాక్ చాలు అతనికి. నన్ను ఫైర్ చేసేందుకు. మరో ఉద్యోగం వెదుక్కొనేందుకు పట్టే సమయం, ఆ లోపు నాకున్న అవసరాలు అన్నీ కళ్ళ ముందు నిలిచాయి. ఇంతవరకూ మనసున తిష్ట వేసుకునున్న అసహనాలు, చిరాకులు అన్నీ మాయమయ్యాయి. భయం, బెంగ, దిగులు ఆక్రమించుకున్నాయి.

పిల్లాడిని ఇటు వైపు రావొద్దని చెప్పి వాడిని హై చెయిర్ లో కట్టేసింది. వాడు అంత గందరగోళంలోనూ ఆ కాగితం మాత్రం వదలకుండా గట్టిగా చేతిలోనే పట్టుకుని ఉన్నాడు. కిచెన్ దగ్గరగా వస్తున్న ఆమెకు సంజాయిషీ ఈయబోయాను- "సారీ..సారీ..." అంతకంటే ఏమి చెప్పాలో తెలియట్లేదు.

"ఇట్స్ ఓకే. ఇట్ హ్యాపెన్స్" అంది. కాకపోతే మొహంలో ఇందాకటి నవ్వు లేదు. అలాగని కోపమూ లేదు.

ఆ మాట ఊహించలేదు నేను. ఇపుడిలా అని, తర్వాత డేవిడ్ కి చెప్పి రిఫండ్ చేయమంటుందేమో?

"సారీ. నేను క్లీన్ చేస్తాను..."

నా మాట పూర్తి కాకముందే అంది. "ఫర్లేదు. నేను చేస్తాను." అంటూ చకచకా వెళ్ళి గ్లవ్స్ వేసుకుని, ఫ్లోర్ బ్రష్ తో ఆ గాజు ముక్కలన్నీ ఒక దగ్గరగా ప్రోగు చేసేందుకు  సిద్ధమయింది.
 
తర్వాత నేనేమి చెయ్యాలో అర్థమవక అక్కడే నిల్చుండిపోయాను. ఇది జరుగకుండా ఉండుంటే, ఈ పాటికి బయటకి వెళ్ళుండేవాడిని.

కళ్ళముందు కనబడుతున్న అంత పనిలోనూ - నన్నూ, నా అవస్థను గమనించిందేమో - "అన్ని గదులూ పూర్తయ్యాయా?" అంది.


అవునన్నట్టుగా తలూపాను.


“సరే, అయితే. థ్యాంక్యూ” అనేసి, సిద్ధంగా ఉన్న చెక్ ఇచ్చింది. నేను ఫీడ్-బ్యాక్ పత్రం ఇచ్చి, కార్ వద్దకు వెళ్ళాను. రశీదు తెచ్చివ్వటానికి.

ఆవిడకి రశీదు ఇచ్చి, ఆవిడ నింపిన ఫీడ్ బ్యాక్ పత్రం చేతుల్లోకి తీసుకుని క్షణాల్లో పై నుంచి కిందికి చదివేసాను.  నా ఘనకార్యం గురించి ఏదయినా రాసిందేమోనని? ఆ పత్రంలో అన్ని ప్రశ్నలకీ ఆమె నుంచి  ఒకే సమాధానం- "గుడ్".  హమ్మయ్య! ఒక్కసారిగా మనసు తేలికయింది.

"థ్యాంక్యూ" అని చెప్పి బయటకు వస్తుంటే పిల్లాడు నాకేసి చూసి మళ్ళీ నవ్వాడు. ఈసారి నాకు వాడిపై ఏ చిరాకూ రాలేదు. పైగా నేనూ నవ్వాను. కాస్త గిల్టీగా. వాడు నాకు వాడి చేతిలో ఉన్న కాగితం అందించబోయాడు. ఇందాకటి నుంచీ వాడి చేతిలోనే ఉన్న కాగితం అది. అందుకుని దాన్ని చూడగానే ఆశ్చర్యపోయాను. వాడు గీసింది నన్నే. అంతకుముందు నేను పని చేసుకున్నంతసేపూ నా వైపు చూస్తూ వాడు కాగితం మీద గీసింది నా బొమ్మేనన్నమాట. అది సరిగ్గా నా చిత్రమే. "కోపంగా ఉన్న నేను". అంతే. అందులో నేను గొప్పనుకున్న నా జాతి వర్ణాన్ని వాడెక్కడా అద్దలేదు. వాడికి కనబడిందల్లా నా కోపం, అసహనం. అంతే. బహుశా అంజలికీ, ప్రస్తుతం కనబడుతున్న నా రూపం ఇదే కావచ్చు? మామ్ కి కనబడ్డ రూపమూ ఇదేనా? అందుకేనా అంత బాధగా కనబడింది? మరొక్కసారి ఆ బొమ్మ వైపు చూసాను, కోపంగా వికృతంగా ఉన్నాను.  నా చేతిలో ఉన్నది తేలికయిన కాగితమే కానీ, మోయలేనంత బరువుగా ఉంది. ఆ కాగితం తీసుకుని- వాడికి థాంక్స్ చెప్పి బయటకి నడిచాను.


వెళుతున్నవాడినల్లా మరొక్కసారి ఆవిడ వైపు చూసాను. పాత టీ-షర్ట్, వెలిసిపోయిన పజామా, అదే గోధుమ వర్ణం శరీరం, పైగా ఇపుడు దానితో పాటే చేతిలో చీపురు. అదే రూపం. నుదుటన అదే బొట్టు. కానీ, ఇప్పుడు దాన్ని టాటూ అనాలనిపించటం లేదు.

“Patriotism can flourish only where racism and nationalism are given no quarter. A patriot is one who loves his homeland. A nationalist is one who scorns the homelands of others.”  ― Johannes Rau
 

*****

bottom of page