top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  2

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వంగూరి పి.పా.

 

అమెరి”కొంప ముంచిన కరోనా” కథ

 

vanguri.PNG

వంగూరి చిట్టెన్ రాజు

గత జనవరి నెలాఖరున మా సుపుత్రుడూ, మా క్వీన్ విక్టోరియా, ఆవిడ తమ్ముడూ, చెల్లెలూ కట్టకట్టుకొని ఇండియా వెళ్ళారు. నేనూ వస్తాను అని మారాం చేశాను కానీ “అక్కర లేదు. ఇక్కడే ఇంటికి కాపలా ఉండు” అంది మా క్వీన్ విక్టోరియా. ఇంటిని విశ్వాసంగా కాపలా కాసేది ఎవరో తెలిసే మరి ఆవిడ అలా అందో, లేదో  ఆలోచించడానికి నాకు మనసొప్పడం లేదు. ఏది ఏమయినా, ఆవిడా, ట్రంప్ గారూ ఒకే సారి ఇండియా నుంచి వెనక్కి రావడానికి కొన్నాళ్ళ ముందే ఈ కరోనా వైరస్ చైనాలో పుట్టి అన్ని దేశాలకీ ఎగుమతి అవుతోంది అని టీవీలో చూశాను కానీ ఇలాంటివి చాలానే చూశాంగా, వస్తూంటాయ్, పోతూంటాయ్ కదా అని నేను పట్టించుకో లేదు.

కానీ జరిగింది ఏమిటంటే...

మా అర్ధాంగి ఇండియా నుంచి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఒక పవిత్ర ‘భారత అమెరికన్ భర్త’ గా తప్పదు కాబట్టి నేను హ్యూస్టన్ పెద్ద విమానాశ్రయానికి వెళ్ళాను. అక్కడ కష్టమ్స్ లో కష్టాలు తప్పించుకుని మూడు పెద్ద పెట్టెలూ, భుజాల మీద నుంచి వేళ్ళాడుతున్న భోషాణం అంత చేతి సంచీ వగైరాలతో మా అర్ధాంగి చక్రాల బండి తోసుకుంటూ నీరసంగా బయటకి వచ్చింది. అప్పుడు నా కర్తవ్య నిర్వహణ లో భాగంగా ఆవిడని కావిలించుకోడానికి, కనీసం “హగ్గడానికి” ఆత్రంగా ముందడుగు వేశానో లేదో....ఆవిడ ఠకీ మని రెండు అడుగులు వెనక్కి వేసింది. వేస్తే వేసింది, అలా వేస్తూనే రెండు చేతులూ జోడించి “నమస్తే” అంది. ఈ నమస్కార గ్రహీత ఎవరా అని నేను ఒక సారి నా వెనక వేపు చూసి, అక్కడ ఏ ఆడా, మగా లేక పోవడం తో, ఇందాకటి నా కావలింత సంకేతం ఆవిడకి సరిగ్గా అందలేదేమో అని ఈ సారి అనుమానం రాకుండా రెండు చేతులూ ముందు చాచి మరొక అడుగు ముందుకు వేశాను.  దుంప తెగా. ఆవిడ మళ్ళీ ఠకీ మని రెండు అడుగులు వెనక్కి వేసి మళ్ళీ రెండు చేతులూ జోడించి “నమస్తే, నమస్తే” అంది. ఇలా నేను ఒక అడుగు ముందుకీ, ఆవిడ రెండు అడుగులు వెనక్కీ ఆట ఆడుకోవడం అక్కడ ఉన్న ఇతర పవిత్ర భారతీయులూ, ఆరబ్బులూ, తెలుపు, నలుపు, పసుపు రంగుల మానవాళి చూసి బహు ముచ్చట పడిపోతూ, కొందరు వీడియోలు కూడా తీసేసుకుని ఫేస్ బుక్ లో పెట్టయ్యడం మొదలు పెట్టారు. ఎందుకంటే మేము ఇద్దరం వయసు మళ్ళక పోయినా, మళ్ళిన పవిత్ర భారతీయ దంపతులలాగే ఉంటామేమో కానీ మా ప్రవర్తన అందుకు భిన్నంగా ఉంది ఆ రోజు. అసలు వాడు ఎవడో తెలియనట్టు ఒకానొక భారత అమెరికన్ భార్య అదే స్థాయి భారత అమెరికన్ భర్తకి బహిరంగంగా, చేతులు జోడించి ఒకటి కాదు, రెండు సార్లు ‘నమస్తే’ చెప్పడం చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? దీనికి ఫేస్ బుక్ లో లక్షల లైకులు రావాలి కదా! అదే వాళ్ళకి కావలసినది కదా! 

ఇక నాకు ఒళ్ళంతా చెమటా, బుర్రంతా విపరీతమైన అనుమానాలు ఠక, ఠకా, చక, చకా వచ్చేశాయి. ఎందుకంటే, మా పెళ్ళి అయి నాలుగు దశాబ్దాలు దాటినా మా క్వీన్ విక్టోరియా ఎన్ని ‘అమెరికోతి’ పనులైనా చేసిందేమో కానీ నాకు చేతులెత్తి ఏ నాడూ నమస్కారం పెట్టి నిటూర్చిన దాఖలాలు లేవు. ఆఖరికి “అబ్బబ్బ. నీకూ, నీ తెలివి తేటలకీ ఒఖ్ఖ దణ్ణం” అని విసుగ్గానో, వేళాకోళానికో కూడా పెట్టిన ఒక్క నమస్తే సీను కూడా లేదు. అంతకంటే ముఖ్యంగా, ఆ రోజు అకారణంగా నా ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరగడం నా కోపానికి అసలు కారణం. 

నాకు తెలీక అడుగుతానూ, ఓ మగాడన్నాక, వాడికి ఒక పెళ్ళాం ఉన్నాక, సదరు పెళ్ళాం నెల్లాళ్ళు పది వేల మైళ్ళ దూరంలో ఉన్నాక, ఒకానొక విమానాశ్రయం లో కలుసుకున్నాక, ఆ మూడు పెట్టెల్లో ఒకానొక పెట్టె లో కష్టమ్స్ వెధవ వాడి దాడిని తప్పించుకున్న నాకెంతో ఇష్టమైన కొత్తావకాయ, గోంగూర పచ్చడీ, నువ్వుల పొడీ వగైరాలు ఉండగా....నన్ను తనంతట తనే వచ్చి వాటేసుకోవడం పోయి, కావిలించుకోవడం మానేసి, కనీసం ‘హగ్గడం’ మానేసి ఇంత అవమానకరంగా నేను ఎన్ని ప్రక్రియలలో భారత భర్త అదే భారత భార్యని పబ్లిక్ గా ముట్టుకోగలడో అని తంటాలు పడుతూ వేసిన ప్రతీ ముందడుగుకీ, తను రెండు వెనకడుగులు వెయ్యడం నా ప్రాధమిక హక్కులకి భంగం వాటిల్లినట్టు కాదా అని ఈ సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తున్నాను. 

నా మనస్సు ఇంత తీవ్ర మనస్తాపాన్ని పొందుతున్న సమయం లోనే, మా హ్యూస్టన్ విమానాశ్రయం లోనే మా క్వీన్ విక్టోరియా నాతో మాట్లాడిన మొదటి మాట సావిత్రి రేలంగిని మాయా బజార్ లో “ఒహొ సుందరీ” పాటలో చెప్పిన ‘దూరం, దూరం” అనేది అయితే రెండో మాట “కరోనా”. 

కరోనా? అదేమిటో..అప్పటి దాకా అమితాబ్ బచ్చన్ అనే ఆరడుగుల అందగాడిని సినిమాలలో చూసినప్పుడల్లా  ‘నువ్వూ ఉన్నావు, ఎందుకూ?” అనే మా క్వీన్ విక్టోరియాకి హిందీ వచ్చును అని నాకు తెలియదు. ఇలా హఠాత్తుగా “కరోనా?” అంటుంది ఏమిటీ....ఏమిటి హిందీలో కరో నా..అంటే నన్ను ఏం  చెయ్యమంటుందీ. అసలు మై క్యా కర్నా? అందులోనూ ఇలా పబ్లిక్ గానా, అదేదో తెలుగు లోనే అడగవచ్చు కదా. ఈ భాష మార్పిడికి కారణం బెట్టిది?” అని నాకు కించిత్తు భాషావేశం వచ్చిన మాట వాస్తవం. కానీ అప్పుడప్పుడే టీవీ వార్తలలో ఈ కరోనా అనే మాట వినపడుతూ ఉండడం వలన నేను బ్రిలియంట్ గా ఆలోచించి అప్పుడే విమానం దిగిన మా అర్ధాంగికీ, ఈ కొత్త కరోనాకీ ఉన్న లింకు ఏమిటో ఊహించగలిగాను. గలగగానే, సీను రివర్స్ అయి, నేను కావిలింత కార్యక్రమం వాయిదా వేసేసి రెండు అడుగులు వెనక్కి తగ్గడం, ఆవిడ ఒకడుగు ముందుకు వెయ్యడం జరిగి, మొత్తానికి ఆ భూతాల్లాంటి పెట్టెలు కారులో పెత్టుకుని ఇంటికి వచ్చి చేరాం. ఇక్కడ కూడా నేను గమనించిన మరొక ప్రగాఢమైన విశేషం మా క్వీన్ విక్టోరియా కారులో ముందు సీటులో నా పక్కన కూచోడానికి కరుణించకుండా కరోనా ధర్మమా అని వెనక సీట్లో కూచోడం. అనగా ఆ నాడు అధికారింగా వెనక సీటులో కూచున్న ఆమె యజమాని. నేను కారు డ్రైవరూ అన మాట. ఇది కూడా మా దాంపత్య జీవితం లో ఏ నాడూ జరగని విషాద ఘట్టం.  ఆ వెధవ కారు నెలవారీ ఖర్చు మటుకు నాదే. సొమ్ము ఒకరిదీ, సోకు ఇంకొకరిదీ అని ఊరికే అన్నారా? 

అక్కడితో ఆ కరోనా కథ అయిపోయి మనం కంచి కి చేరుకున్నాం అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. ఎందుకంటే ఇంటికి రాగానే, క్వీన్ విక్టోరియా నా ప్రాణాలకి “స్వయం ప్రకటిత వెలివేత” కార్యక్రమం అమలు లో పెట్టింది. అంటే ఇంట్లో ఉన్న ఇద్దరే ఇద్దరం ఒకరిని ఒకరు వెలివేసుకోవడం అనమాట. అలా అని ఇద్దరం ఒకే గదిలో అనుకుంటే చెప్పడానికేముందీ? మాది కింగ్ సైజ్ సింగిల్ కాట్ అయినా డబుల్ క్వారంటీన్. ఆవిడ వంటింట్లో సరదాగా క్వారంటీన్ లో ఉన్నప్పుడు నేను చచ్చినట్టు పడక గదిలో ఏకాంతం అనుభవించాలి. అక్కడ వంకాయ వేపుడు అయిపోయి, గిన్నెలు కడిగేసి గంట కొట్టగానే గదుల మార్పిడి...అంటే. నాకు వంటింట్లోకి ప్రమోషన్..ఆమెకి పడక గదిలో ప్రవేశం. పూర్వం ఇలా ఎవరినైనా సంఘం కానీ కులం కానీ వెలి వేసి బహిష్కరించినా, వాళ్ళు లెంపలు వేసేసుకుంటే చాలు, వెంటనే గోమూత్రం తో శుధ్ధి చేసి ఆ వెలి అనగా బహిష్కరణ ఎత్తి వేసే వారుట. ఈ రోజుల్లో ‘యూతు” కోసం  ఆర్గానిక్ గోమూత్రం కూడా అందుబాటు లోకి వచ్చింది అని విన్నాను. మా విషయం లో ఈ కరోనా నుంచి దేశం విముక్తి అయ్యాకే మాకు ఈ స్వయం ప్రకటిత వెలివేత కి కూడా విముక్తి అని మా క్వీన్ విక్టోరియా నొక్కి..అంటే నన్ను కాదు, తనని తానే నాజూగ్గా నొక్కుకుని వక్కాణించింది. ఏమన్నా అనబోతే “దేహ రక్షణే దేశ రక్షణ, మొగుడు గారూ” అని ఒక కొత్త వాగుడు మొదలు పెట్టింది నా ప్రాణాలకి. 

మా చిన్నప్పుడు మేము ఆడి పారేసి, బొచ్చు సగం ఊడిపోయిన బాల్ బాడ్మింటన్ బంతి లా ఉండి, కంటికి కనపడని కరోనా అనే ఒకానొక సూక్ష్మజీవి మా పచ్చటి సంసారం లో ఎంత చిచ్చు పెట్టాలో అంతా పెడుతోంది. వోలు మొత్తం పెపంచం అంతా గగ్గోలు పెడుతూ ఉంటే మధ్యలో నీ గోల ఏమిటయ్యా అంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్టు ఉంది నా పరిస్థితి. 

కొస మెరుపు ఏమిటంటే...

ఇండియా నించి తెచ్చిన ఆవకాయల సద్దుడు కార్యక్రమం, గంజి పెట్టించి తెచ్చుకున్న కాటన్ చీరలు బీరువాలో పెట్టుడు కార్యక్రమం, ఎప్పుడైనా ఓపిక తెచ్చుకుని మా పెరట్లో వాటిని నాటి పండిస్తానేమో అనే ఆశ తో తను తెచ్చిన కూరగాయల విత్తనాల పొట్లాలు నాకు కనపడేటట్టుగా బల్ల మీదే పెట్టెయ్యడం లాంటి దైనందిన కార్యక్రమాలకి రెండు, మూడు “కరోనా రోజులు” తరువాత మా క్వీన్ విక్టోరియా ఒకానొక అర్ధరాత్రి తన ఉద్యోగానికి బయలు దేరింది. నేను నా “టెంకి జెల్ల” బహుమతి కోసం, ఆ విధంగా అయినా “భార్యా స్పర్శ”  అవుతుంది కదా అనే ఆశతో ఎప్పటి కంటే ఎక్కువ ఆరాటం తో ఎదురు చూస్తున్నాను....అబ్బే ...అలాంటి సూచనలు లేవు సరి కదా “ఏమిటి, అలా వెర్రి మొహం పెట్టావ్?’ అని రెచ్చ గొట్టింది మా క్వీన్ విక్టోరియా. “అబ్బే, ఏం లేదు.” అని ఆ మాత్రం సిగ్నల్ అందకపోతుందా అని తల వెనకాల వేపు తడుముకున్నాను.   

అంతే...తను విరగబడి నవ్వి “ఓ అదా? నో వే...ఆరడుగుల దూరం పాటించమని ట్రంప్ గారు చెప్పారు. అంచేత ఈ సారి..ఇదిగో ఇలా మన ఇన్నేళ్ళ సాంప్రదాయాన్ని పాటిస్తాం అనమాట” అని ఆ ఆవకాయల పెట్టె లో అట్టడుగున దాచి పెట్టిన ఒకానొక వేప బెత్తం పైకి తీసింది మా క్వీన్ విక్టోరియా. దాని పొడుగు ఆరడుగులు. 

*****

bottom of page