top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  2

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

అదన్నమాట సంగతి

ఆవకాయ మన అందరిదీ...

Jyothi Valaboju

జ్యోతి వలబోజు

జనవరి పోయి ఫిబ్రవరి వచ్చింది. చలి తగ్గింది. వేడి ఇంకా పెరగలేదు. మల్లెపూల ఘుమఘుమలు మొదలయ్యాయి.. మామిడికాయలు చిన్న పిందెలుగా కనిపిస్తున్నాయి. ఉగాది వరకు మంచి కాయలు వస్తాయేమో. అయినా అవి పనికిరావుగా. పప్పులో వేసుకోవడానికి, రోటి పచ్చళ్లు చేసుకోవడానికి పర్లేదు. అసలు ఆవకాయ పెట్టుకోవాలంటే ఏప్రిల్ దాటి మే రావాల్సింది. మే రెండు లేదా మూడవ వారం వస్తేగాని మంచి కండ, పులుపు ఉన్న మామిడికాయలు మార్కెట్లకు వెల్లువెత్తదు. ఈ ఆవకాయ ఉంది చూసారూ?  దాని మాట తలచుకోగానే ఎర్రగా, వర్రగా, నూనెలో మెరిసిపోతూ ఏమందం అది. ఆ దృశ్యం కళ్లముందు కనపడగానే నోట్లో నీళ్లూరతాయి. అలా ఫీలవ్వనివాడు తెలుగువాడే కాదస్సలు.  నా మాట అవునంటారా... కాదంటారా...   కాదని ఎందుకంటారులెండి. ఆవకాయ పెట్టుకునే ముందు అసలు ఈ ఆవకాయ ఎన్నేళ్లు, ఎన్ని యుగాల క్రింద మొదలుపెట్టారో కాస్త మాట్లాడుకుందాం.

 

"ఆకలి రుచెరుగదు” అని సామెత చెప్పిన మన పెద్దలే “పుర్రెకో బుద్ధీ జిహ్వకో రుచీ” అని కూడా శలవిచ్చారు. ప్రతీ మనిషికి కూడు, గూడు, నిద్ర తప్పనిసరిగా ఉండాలి. కోటి విద్యలూ కూటికోసమే అయినా ఆ ఆహారం కూడా రుచిగా ఉండాలని అందరూ కోరుకుంటారు.  ఆకలిగొన్నవాడికి భైరవి రాగం కంటే , రవివర్మ చిత్రం కంటే పప్పన్నమే ఎంతో మేలు. కన్నులనిండుగా ఉండడం కంటే కడుపు నిండడమే  ఘనమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులు, పామరులు  ఒప్పుకొని తీరవలసిందే..

అప్పడుపు కూడు భుజించుటకన్న సత్కవుల్ హాలికులైన నేమి?” అని తృణీకరించటం పోతనగారికి చెల్లింది గానీ .... హాలికులైనా, (శ్రీశ్రీ మాటల్లో) ఆల్కహాలికులైనా మన కవులు తమ రచనలలో భోజనానికి పెద్దపీటే వేశారు. అంతేనా!  అన్నివృత్తులలో వంట వృత్తి మొదటిది అని మహాకవి గంగాదాసుగారు నిర్వచించిన సూత్రము. ఈ పాక కళకి ఆరు రసాలు (షడ్రుచులు) ఉండగా కవితకు తొమ్మిదిరసాలు (నవరసాలు) ఉన్నాయి. కవిత లేదా రచనలలో నవరసాలలో అన్నీ ప్రాణమని చెప్పలేము. ఇందులో ఏది ఉంచినా, తీసివేసినా జరిగే నష్టమేమి ఉండదు. కాని  వంటకు మాత్రం  షడ్రుచులన్నీ తప్పనిసరిగా ఉండవలసిందే. ఇందులో ఏ ఒక్కటి తగ్గినా, హెచ్చినా  వండినదంతా పెంటలో పడేయక తప్పదు అని సాక్షిలో కామకవి బాధపడ్డారు.

ముక్కలను ఊరబెట్టి తర్వాత కాలంలో అప్పుడప్పుడు తినడానికి పెట్టేదే ఊరగాయ లేదా ఆవకాయ. ఇప్పుడు ఊరగాయలు అంటేనే అమ్మో అని పరిగెడుతున్నారు నేటి తరం పిల్లలు. అసలు ఈ ఊరగాయలు  మన  ప్రాచీనుల ఆరోగ్యరహస్యం అని మీకు తెలుసా.. ప్రతీ పదార్ధంలో మనకు మేలు, కీడు కలిగించే అంశాలు ఉంటాయి. ప్రతీ హానికి విరుగుడు కూడా అదే వస్తువులో ఉంటుంది. కాని మానవుడు ఆ పదార్థాలను పూర్తిమొత్తంగా ఆహారంగా తీసుకోకపోవడం వల్ల కీడు జరుగుతోంది.  ఇలాటి వాటికి పరిష్కారం ఊరగాయలు అని చెప్పవచ్చు. ఉదాహరణకు పచ్చిమామిడివల్ల కలిగే హానికి విరుగుడు మామిడి తొక్కలో ఉంది. నిమ్మరసంలో ఉండే పులుపువల్ల కలిగే మంటకు విరుగుడు నిమ్మతొక్కలో ఉంది. అందుకే మన ప్రాచీనులు ఈ కాయలను తొక్కతో సహా నిలవ ఉంచి (ఊరబెట్టి) అన్ని కాలాలలో తమ ఆహారంలో చేర్చుకునేవారు. ఇలా ఊరబెట్టినవి అనారోగ్య సమయంలో పథ్యానికి కూడా వాడతారు.

  

మన తెలుగువారి వంటకాలన్నింటిలో ఊరించే ఊరగాయల రుచే వేరు. ఇంట్లో ఇష్టమైన మాంసం వండినా, నోరూరించే శాఖాహారంలో  పసందైన పలు రకాల కూరలు చేసిపెట్టినా, ఎర్రగా, వర్రగా, కంటికింపుగా ఊరిస్తూ నోటికి జివ్వుమనిపించే కారం, ఉప్పు, మసాలాలతో ఆవకాయ ఉంటే మిగతావన్నీ దానిముందు దిగదుడుపే. ఈ మాట అబద్ధమని ఏ తెలుగువాడూ అనడు.. అనలేడు కూడా.. ఉత్త కారం మెతుకులతోనే కడుపు నింపుకునే పేదవారినుండి ప్రతీరోజూ   పంచభక్ష్య పరమాన్నాలు ఆరగించే కోటీశ్వరుడికైనా  కంచంలో  కాస్త   ఊరగాయ ఉండాల్సిందే.  అది లేకుండా ముద్ద మింగని వారెందరో.  

 

ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఈ ఊరగాయలను గురించి ప్రస్తావన చాలా గ్రంధాలలో ఉంది.

అయ్యలరాజు నారాయణామాత్యుడు రచించిన హంసవింశతి గ్రంథంలో శృంగార రసభరిత పద్యాలు మాత్రమే ఉంటాయని చాలామంది అపోహపడుతుంటారు..    కాని ఈ గ్రంధం నిజంగా ఒక విజ్ఞానసర్వస్వం.. ఇందులో ఎన్నో విషయాలమీద వివరణాత్మక పద్యాలు ఉన్నాయి. అందులో  ఊరగాయల గురించిన ప్రస్తావనలో ఈ పద్యం.. 

 

సీసము-

మామిడికాయయు, మారేడుగాయయు,

గొండముక్కిడికాయ, కొమ్మికాయ

గరుగుకాయయు, మొల్గుకాయ, యండుగుకాయ,

లుసిరికెకాయలు, నుస్తెకాయ,

లెకరక్కాయయు, వాకల్వికాయయు,

జిఱినెల్లికాయయు, జిల్లకాయ,

కలబంద గజనిమ్మకాయ, నార్దపుకాయ,

చిననిమ్మకాయయు, జీడికాయ,

 

తేటగీతి-

కుందెనపుకొమ్ము, మామెనకొమ్ము, బుడమ

కాయ, యల్లము, మిరియంపుకాయ, కలివి

కాయ, కంబాలు, కరివేపకాయ లాది

యైన యూరుగాయలు గల వతని యింట

ఈ పద్యంవలన  18వ శతాబ్దంనుండే తెలుగువాళ్లు ఎన్నోరకాల ఊరగాయలను చేసుకుని తినేవారని తెలుస్తోంది. క్రీ.శ.17-18 శతాబ్దాల కాలం వాడైన అయ్యలరాజు నారాయణామాత్యుడు వ్రాసిన 'హంసవింశతి' లో విష్ణుదాసు విదేశీప్రయాణ సన్నివేశంలో (ప్రధమాశ్వాసం 166వ వచనం) ఆయన తనతో తీసుకుని వెళ్ళిన భోజన పదార్ధాల జాబితాలో కొన్ని - మూగలు, చిటి కాఱుకులు, వెల్లగిసెలు, అమృతకలశాలు, సోగులు, చక్కెర బుడగలు, గరిజులు, దేమనాలు, బాలకాయలు, నిడికుడకలు, సడకుడకలు, గూళ్ళాపిడలుతోపాటుగా పలురకాల ఊరగాయలు తీసికెళ్లాడంట.. ఈ పలహారాలూ, భక్ష్యాలు ఇప్పుడు ఉన్నాయో లేవో మరి.  కాని అంతకంటే ముందే 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద ప్రబంధంలో కూడా ఊరగాయ గురించిన ప్రస్తావన వచ్చింది.

 

 ఓ మహాకవి శ్రీకృష్ణదేవరాయలు ఆస్థాన విద్వాంసులు, కవులగురించి ఈ విధంగా వర్ణించాడు.

 

సీ. అధిపాన్న రాయలే ఆస్థాన పండితుల్

ఘనుడగు పెద్దన్న కందిపప్పు

అష్టదిగ్గజములే అష్టావకాయలు

ఆ రామలింగంబు చారు పులుసు

అప్పడాలు వడియాలు ఆ చోపుదారులు

రమ్య పచ్చళ్లు పారా జవాన్లు

పరమాన్న పాత్రంబు భట్టు మూరితి కవి

ఆతిమ్మకవిరాజు నేతిదొన్నె.

 

గీ. పప్పుకూరలు సంగీత పాటగాళ్లు

మెంతిపెరుగులు భోగము మేళములును

ఊరుబిందులు చిల్లర వారలెల్ల

మేలు అప్పాజి ఊరిన మిరపకాయ.

 

అంటూ రాయలవారి ఆస్థానాన్ని షడ్రసోపేతంగా చేసారు. అష్టదిగ్గజాలు ఎనిమిద రకాల ఆవకాయలు కాగా, అల్లసాని పెద్దన్న కందిపప్పు, రామలింగడు చారు, భట్టుమూర్తి పరమాన్న పాత్ర, తిమ్మరాజు నేతిగిన్నె, పారాజవాన్లు రమ్యమైన పచ్చళ్లు, చోపుదారులేమో అప్పడాలు, వడియాలు అయ్యారు. ఇక సంగీత పాటగాళ్ల సంగతి వస్తే వాళ్లేమో పప్పుకూరలు, భోగం మేళగాళ్లు మెంతిపెరుగులు, చిల్లర వాళ్లు ఊరుబిందెలవలె ఉండగా అప్పాజీ ఐతే ఊరిన మిరపకాయ అని పోల్చారు.  ఆహా!! ఈ  పద్యం చదువుతుంటేనే ఘుమఘుమలాడుతూ వంటకాలన్నీ కంటిముందు కనిపిస్తూ  నోరూరిపోతుంది. కాదంటారా?  రాయలవారి సంగతి తర్వాత ముందు ఈ పదార్థాలన్నీ ఎవరైన వడ్డిస్తే బావుండు అని అనిపించక మానదు.

 

రాయలవారి ఆముక్తమాల్యదలో విష్ణుచిత్తుడు  వివిధకాలాలలో తన ఇంటికి వచ్చిన అతిధులకు ఆయా కాలపు వాతావరణానికి అనువైన ఆహారాన్ని తయారుచేయించి వడ్డించేవాడంట..

చ . తెలినులివెచ్చ యోగిరముఁ దియ్యని చారులుఁ దిమ్మనంబులున్
బలుచనియంబళు ల్చెఱకుపా లెడనీళ్లు రసావళు ల్ఫలం
బులును సుగంధిశీతజలము ల్వడపిందెలు నీరుఁజల్లయు
న్వెలయఁగఁ బెట్టు భోజనము వేసవిఁ జందనచర్చ మున్నుగన్

ఎండాకాలంలో ఐతే అతిథులకు ముందుగా చల్లబడడానికి చందనం ఇచ్చి,తర్వాత తెల్లని, గోరువెచ్చగా ఉన్న అన్నము, తియ్యని చారులు, జ్జిగపులుసులు, పలుచని అంబలి, చెఱకు పాలు, లేత కొబ్బరికాయ నీళ్ళు, భక్ష్యములు, వివిధ రకములైన ఫలాలు, వట్టివేళ్ళు మొదలైనవాటితో చల్లబరిచి, సుగంధభరితం చేసిన మంచి నీరు, శరీరానికి వేడి చేయకుండా ఉండడానికి ఊరవేసిన మామిడిపిందెలు, మజ్జిగ మొదలగు పదార్థములతో సుష్టుగా భోజనము పెట్టేవాడు. అంటే ఆ కాలంలో కూడా వేసవిలో మామిడిపిందెలు, కాయలను ఊరవేసి ఊరగాయలు/ఆవకాయలు పెట్టేవారని అర్ధమవుతోంది.

 

మ.పునుఁగుం దావి నవౌదనంబు మిరియంపుం బొళ్లతోఁ జట్టి చు
య్యను నా దాఱని కూరగుంపు, ముకుమం దై యేర్చునావం జిగు
ర్కొనువచ్చళ్లును, బాయస్నానములు, నూరుంగాయలున్, జేసుఱు
క్కను నేయుం, జిఱుపాలు వెల్లువగ నాహారం బిడున్ శీతునన్.

ఇక గజగజ వణికించే చలికాలంలోకూడా ఎటువంటి లోటు చేయకుండా కమ్మని రాజనాల బియ్యంతో వండిన వేడి వేడి అన్నము, మిరియాల పొడితో తిరగమోత పెట్టగా చుయ్యిమనుచు ఘుమ ఘుమలాడే కూరలు, ముక్కులోని జలుబును కూడా తక్షణమే వదలగొట్టగల ఆవపిండి వేసి గుచ్చెత్తిన ఊరగాయలు, చేతి మీద పడగానే చుర్రుమనే వేడి నెయ్యి, గోరువెచ్చని పాలతో సుష్టిగా భోజనం పెట్టేవాడు. ఊరగాయలు వేసవిలోనే కాదు తర్వాత వచ్చే చలికాలంలో కూడా వడ్డించేవాడంట విష్ణుచిత్తుడు. చలికాలంలో బాధించే జలుబును వదలగొట్టే ఆవపిండితో చేసిన ఆవకాయ ఆహారంలో చేర్చడం ఆరోగ్యదాయకమని శతాబ్ధాల క్రితమే చెప్పారు.. దీన్నిబట్టి, వేసవిలో మామిడికాయలు కాపుకు వస్తాయి. వాటితో ఊరగాయలు పెట్టుకునే సంప్రదాయం అనాదిగా కొనసాగుతున్నట్టు అర్థమవుతోంది.

అన్నట్టు ఇంకా వెనక్కి వెళితే  పోతన భాగవతంలో గోపాలురు చల్దులారగించే ఘట్టంలో ఊరగాయల ప్రసక్తి వస్తుంది..

గోపాలురు బాల కృష్ణునితో పాటు ఊరి చివర పచ్చిక బయళ్ళలో పశువులను మేపుకుంటున్నారు. మిట్ట మధ్యాహ్నమయింది. ఎండ మాడ్చి వేస్తోంది. అందరకీ ఆకలి వేస్తోంది. ఇక రండర్రా, చల్దులు తిందాం, అని కిట్టయ్య ఇతర  గోపాలురను కేకేసి ఎలా పిలుస్తున్నాడో చూడండి :

 

ఎండన్ మ్రగ్గితి రాఁకటం బడితి రింకేలా విలంబింపఁగా

రండో బాలకులార ! చల్ది గుడువన్ రమ్య స్థలంబిక్కడీ

దండన్ తేగలు నీరు ద్రావి యిరువందం బచ్చికల్ మేయుచుం

దండబై విహరించు చుండగ నమంద ప్రీతి భక్షింతమే. 

 

మీరంతా ఎండలో మ్రగ్గి పోయారు. ఆకలితో ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయడమెందుకు?  రండి ! మనం చల్దులు తినడానికి ఇక్కడ ఈ చోటు చాలా అనువుగా, మనోహరంగా ఉంది. ఇక్కడ లేగ దూడలు నీళ్ళు త్రాగి, ఈ చుట్టు ప్రక్కల గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నాయి. ఈ అందమయిన స్థలంలో చల్దులు తిందామా మిత్రులారా?? అంటూ పిలుస్తున్నాడు చిన్నికన్నయ్య..

గోవులు కాసిన తర్వాత ఆకలితో   చల్దులు తినే ఆ పిల్లల సరదాలూ, కొంటెచేష్టల గురించి పోతన ఎంత మనోఙ్ఞంగా వర్ణించాడో చూడండి:

మాటి మాటికి వ్రేలు మడచి యూరించుచు

నూరు గాయలు దినుచుండు నొక్క

డొకని కంచము లోని దొడిసి చయ్యన మ్రింగి

చూడు లేదని నోరు సూపు నొక్క

డేగురార్గుర చల్దు లెలమిఁబన్నిదమాడి

కూర్కొని కూర్కొని కుడుచు నొక్కొక

డిన్నియునుఁదగ బంచి యిడుట నెచ్చెలి

తనమనుచు బంతెన గుండు లాడు నొకడు

 

కృష్ణుఁజూడు మనుచుఁగికురించి పరు మోల

మేలి భక్ష్య రాశి మెసఁగు నొకఁడు

నవ్వు నొకఁడు సఖుల నవ్వించు నొక్కడు

ముచ్చటాడు నొకఁడు మురియు నొకడు

ఒక పిల్లవాడు మాటి మాటికి వేలు ముడిచి ప్రక్క వారిని ఊరిస్తూ ఊరగాయలు తింటూ ఉంటాడు. ఒకడేమో ప్రక్క వాడి కంచంలో నుండి కొంత చల్ది లాక్కుని గుటుక్కున మ్రింగి వేసి, అబ్బే!  నేను తినలేదు కావాలంటే చూసుకో ! అని  నోరు చూపిస్తాడు.  పందెం కట్టి ఐదారుగురి చల్దులను కూరుకుని కూరుకుని మరొకడు తింటున్నాడు. ఇంకొక గోపాలకుడు  ఒకరిదొకరం పంచుకుని తినడం స్నేహలక్షణం అంటూ నచ్చచెబుతూ తింటున్నాడు. ఒక పిల్లవాడేమో అదిగో  చూడు ! కృష్ణుడు  అంటూ చూపు మరల్చి  ప్రక్క వాని కంచంలోని చల్దులలో మేలైన భక్ష్య రాశిని వాడు చూడకుండా లాక్కుని తింటున్నాడు. ఇలా ఒక పిల్లవాడు నవ్వుతుంటే , ఇంకొకడు అందరినీ నవ్విస్తున్నాడు. మరొకడు ఏవో ముచ్చట్లు చెబుతుంటే ఇంకొకడు మురిసిపోతున్నాడు. ఇలా బాల్యాన్ని పోతన ఎంత అందంగా, కళ్లకు కట్టినట్టుగా చిత్రీకరించాడో..    

మీరే చెప్పండి. కొత్తావకాయ అన్నంలో కలుపుకుని తిన్న తర్వాత లేదా కడిగేసిన మామిడికాయ ముక్కను ఎంతసేపు చప్పరిస్తాం. ఆ రుచి, ఆ ఆనందం ఎంత అద్భుతం కదా.. మీరలా చేయలేదా.. అయ్యో... అయ్యో.. చాలా మిస్ అయ్యారే. ఈసారి ట్రై చేయండి.. భలే ఉంటుంది.

కాశీఖండంలో కూడా ఊరగాయల ప్రస్తావనలో ఈ విధంగా చెప్పారు. ఊరగాయలు అచ్చంగా భారతీయులవే. అందులోనూ ఈ పచ్చళ్లు, ఊరుగాయలు/ఆవకాయలు ఎక్కువగా పెట్టుకునేది, తినేది మన తెలుగువారే. మనదేశంలో మిరపకాయల వాడకం ముందునుండి లేదు. కారానికి ఎక్కువగా మిరియాలనే ఉపయోగించేవారు. మనదేశంలో పోర్చుగీసు వర్తకులు ఈ మిరపకాయలను తీసుకొచ్చారని ప్రతీతి. కాలానుగుణంగా పండే కూరగాయలను నిలవ ఉంచి,  అవి దొరకని రోజుల్లో వాటిని రుచికరంగా తినడానికని ఈ ఊరుగాయ ప్రక్రియ మొదలైంది. ఒకరకంగా ఇవి ఆరోగ్యదాయకమే. కాని ఈ ఊరుగాయలు ఇప్పుడు మనం కారం, నూనె,  మసాలాలతో తయారుచేసుకుని నిలవ చేసుకునే ఆవకాయల్లాంటివి కావు. శ్రీనాధుడి కాలంలో అసలు మిరపకాయల వాడకమే లేదు. అందుకే ఈనాడు మనం ఆవకాయ, మాగాయ అని పిలుచుకునే ఊరగాయలు అప్పట్లో లేవు. ఇవేగాక మనం తొక్కు అని పిలుచుకునే నిలవ పచ్చళ్లు కూడా ఉన్నాయి కదా. చింతకాయ, నిమ్మకాయ, ఉసిరికాయ, దబ్బకాయ వంటివి తొక్కి(నలక్కొట్టి) కాని, తరిగికాని తగినంత ఉప్పు, పసుపు వేసి కలిపి నిలవ ఉంచేవారు. కావలసి వచ్చినప్పుడు తిరగమోత పెట్టుకుంటారు.  ఇప్పుడంటే మనం తిరగమోత పెట్టేటప్పుడు కారం, ఆవ, మెంతిపొడులు కలుపుకుంటున్నాం కాని అసలు మిరపకాయలే లేని సమయంలో ఉప్పు, పసుపులో ఊరబెట్టినవే అసలైన ఊరగాయలు. అలా ఊరడం వల్ల బాగా మాగే ఒకరకం ఊరగాయకి   మాగాయ అని పేరు వచ్చిందేమో. కారానికి మిరియాలు వాడే కాలంలో   (క్రీ.శ.1370-1450 నాటికంటే ముందునుండే)  శ్రీనాధుడు వర్ణించిన ఊరుగాయలు ఇవేనేమో.

 

శృంగారనైషధంలో శ్రీనాథుని పద్యం:

 

మిసిమిగల పుల్లపెరుగుతో మిళితములుగ

ఆవపచ్చళ్ళు చవిచూచి రాదరమున

జుఱ్ఱుమని మూర్ధములదాకి యెఱ్ఱదనము

పొగలు వెడలంగ నాసికాపుటములందు

అప్పట్లో కారానికి మిరియాలు వాడేవారు కదా.  ఇక పెరుగుపచ్చళ్లలో ఆవపెట్టి , మిరియపు ఘాటు తగిలిస్తే ఎలా ఉంటుంది..  ఒకసారి శ్రీనాధుడికి ద్రావిళ్ల విందులో అనుభవమైనదంట. బంగారు రంగులోకి మారిన  పుల్లటి పెరుగులో ఆవపిండి, మిరియాల ఘాటు కలిసిన ఆకుపచ్చడిని బావుందని జుర్రుకుని తింటే ఆ మంట మూర్థానికి (నషాళానికి) తాకి, ముక్కులోంచి  పొగలు వచ్చాయంట. పుల్లటి పెరుగులో ఆవ కలపడానికి ఒక కారణం ఉంది. పెరుగులోని దోషాలకు విరుగుడు ధనియాలు,జీలకర్ర, శొంఠి, ఆవాలు అని ఆయుర్వేదశాస్త్రం చెబుతోంది. ఇలా రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వంటలు చేసి తినడం వల్లనే ఆనాటివారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు మరి.

సీ. భీష్మునిపైకి కుప్పించి లంఘించు గో

పాలకృష్ణుని కుండలాలకాంతి

కరిరాజు మొరపెట్ట పఱువెత్తు కరివేల్పు

ముడివీడి మూపుపై బడిన జుట్టు

సమరమ్ము గావించు సత్య కన్నులనుండి

వెడలు ప్రేమ క్రోధ వీక్షణములు

కొసరి సల్దులు మెక్కు గొల్ల పిల్లల వ్రేళ్ళ

సందు మాగాయ పచ్చడి పసందు

తే.గీ..ఎటుల కనుగొంటివయ్య! నీ కెవరు చెప్పి

రయ్య! ఏరాత్రి కలగంటి వయ్య! రంగు

కుంచెతో దిద్ది తీర్చి చిత్రించినావు!

సహజ పాండితి కిది నిదర్శనమటయ్య

 

మహాభారతయుద్ధంలో ఆయుధం పట్టనని, యుద్ధం చేయనని సఖుడు అర్జునుడికి మాట ఇచ్చిన శ్రీకృష్ణుడు  ఆవేశంలో తన ఆన మరచి చెలికాడి కోసం భీకరయుద్ధం చేస్తున్న భీష్ముడిపైకి లంఘించాడు. అలనాడు కరిరాజు మొర విని తన ఇల్లాలిని, మందిరాన్ని అందరినీ మరచి రక్షింప బయలుదేరిన దేవదేవుడు. తన చిన్నతనంలో స్నేహితులతో చేరి సల్దిలో మాగాయ పచ్చడి నంజుకుంటూ సరదాగా గడిపిన చిన్నికృష్ణుడేనా ఇంత ఆగ్రహం, ఆవేశం చూపించింది... ఈ సంఘటనలన్నీ  కళ్లకు కట్టినట్టుగా చూపించాడు ఈ  తెలుగుకవి అని జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు  ఉదయశ్రీ లో మహాకవి పోతన గూర్చి వ్రాసిన పద్యంలో మాగాయ గురించి  ఇలా వ్రాశారు.

 

ఆంధ్రుల అమృతం ఆవకాయ మీద ఓ ఆవకాయ ప్రియుడైన కవి ఏమన్నాడంటే...

మధురం మధురం ఆవకాయ మధురం

పాతదీ మధురం - కొత్తదీ మధురం

ఊటా మధురం - పిండి మధురం

ముక్కా మధురం - టెంకీ మధురం

 

ఇక గరికపాటి నరసింహారావుగారు  ఆవకాయ గురించి  చక్కటి పద్యాన్నే చెప్పారు.

మామిళ్ళ ముక్కలపై మమకరముంజల్లి

అందింపగ జిహ్వ ఆవకాయ

కూర లేనిచో కోమలి వేయుచో

అనురాగముంజల్లు ఆవకాయ

ఎండాకాలమునందు ఎండిపోయిన గుండెకు

అభినందనలు దెల్పు ఆవకాయ

చీకుచున్ననుగాని పీకుచున్ననుగాని

ఆనందమే నిచ్చు నావకాయ

ఆపదల నాదుకొను కూర ఆవకాయ

అతివ నదుమైన జోడియె ఆవకాయ

ఆంధ్రమాత సింధూరమే ఆవకాయ

ఆంధ్రదేసమ్మె తానొక్క ఆవకాయ

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతి రామకృష్ణగారు కూడా తన అత్తగారి కథలు పుస్తకంలో అత్తగారు ఆవకాయ పెట్టడంలో ఓనమాలు తెలీకపోయినా నిమ్మకాయ పెట్టినట్టే ఇది కూడా చాలా సులువు అనుకుని ఐదువేల మామిడికాయలతో ఊరగాయ పెట్టే ప్రహసనాన్ని ఈ సంకలనంలో “ అత్తగారు - ఆవకాయ” అంటూ మొదటికథలోనే  రాసారు. ఆవకాయ పెట్టటం కన్న యజ్ఞం చేయటం తేలిక, యజ్ఞం చేస్తే ఫలం అన్నా దక్కుతుంది, మరి కొంతమంది ఆవకాయ పెడితేనో ఫలితం కూడా దక్కదు. అసలు ఆవకాయ పెట్టటం అన్నదే ఓ పెద్ద ప్రహసనం. అందునా నూజివీడు చిన్నరసాలకు అలవాటుపడ్డ ప్రాణానికి వేరేకాయతో ముద్ద దిగదు. అసలు విషయానికి వస్తే “ఆధునిక తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయే పాత్రలు చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. ఆ చిరంజీవుల జాబితాలో చేరుతుంది  మన భానుమతి ‘అత్తగారు’,” అన్నారు శ్రీ కొడవటిగంటివారు.  

 

మన ఆవకాయ లేదా ఊరగాయను ఇప్పుడు ఎక్కువగా పికిల్ అని కూడా అంటున్నారు. ఇలా ఎందుకంటే... ఇంగ్లీషువాళ్ళు మొదటిసారి  భారతదేశం  వచ్చినప్పుడు మన ఊరగాయలను రుచి చూశారు. ఇలాంటి వంటకాన్ని వాళ్లు ఎప్పుడూ రుచి చూసి ఉండకపోవడం చేత, వాటిని ఇంగ్లీషులో ఏమని పిలవాలో వారికి తెలియలేదు అప్పుడు. కానీ వారి పికిల్సులాగా పులుపుగా ఉండడంవల్ల  మన ఊరగాయలను "పికిల్సు" అని పిలవడం మొదలుబెట్టారు. మనదేశంలో ఇంగ్లీషు వాడకం పెరిగిన కొద్దీ ఊరగాయలను పికిల్సు అని చెప్పుకోవడం వాడుకలోకి వచ్చింది.

 

కొద్దిరోజుల క్రితమే అంతర్జాలంలో సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ లో ఛందస్సు అనే గ్రూపులో ఉన్న సభ్యులు ఇరవైనాలుగు గంటలలో ఆవకాయ అనే అంశం మీద  శతకం రాయమంటే  ద్విశతకానికి కాస్త దగ్గరగా వచ్చారు. మొత్తం 190 పద్యాలు ఆవిష్కృతమయ్యాయి. 

https://kinige.com/book/Avakaya+Padyalu

 

దీనివలన మనకు అర్ధమయ్యేది ఏంటంటే... ఆనాడైనా, ఈనాడైనా ఆవకాయ మన అందరిదీ అని. రుచి, కొలతలు  కాస్త మారినా  ఆహారంలోనూ, సాహిత్యంలోనూ ఇప్పటికీ అదే ఆదరణ పొందుతోంది..

నా చిన్నప్పుడు ఆవకాయ పెట్టడం పెద్ద ప్రహసనంగా,  పండుగలా ఉండేది. దానికోసం కొన్ని రోజుల ముందే మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు తెచ్చిపెట్టేది అమ్మ. మిరపకాయలను తొడిమలు తీసి రోకళ్లతో పొడి కొట్టే గిర్మీలో వాడు కల్తీ చేయకుండా దగ్గరుండి పొడి కొట్టించేది. పసుపు కూడా ఇంట్లోనే విసుర్రాయిలో విసురుకోవడం. అమ్మ, నాన్నమ్మ ఈ పనులన్నీ చేసేవారు. పనివారు శుభ్రంగా ఉండరని అమ్మ వాళ్లతో చేయించేది కాదు. ఏడాదంతా నిలవ ఉంచేది కాబట్టి ఆవకాయ చాలా శుభ్రంగా, మడితో చేయాలి అనేది మా నాయనమ్మ.  ఆవాలు పొడి కొట్టి ఉంచకూడదు. అవి నిద్రపోకూడదు అని ఆవకాయ పెట్టే రోజు పొద్దున్నే ఇంట్లో ఉన్న రోలులో నిలువెత్తు రోకలితో పొడి చేసేది. అవి చెల్లాచెదురు కాకుండా కుదురు ఉండేది. నేను కూడా నిలబడి రోకటిపోటు వేసిన గుర్తుంది.  అంటే కొంచెం పెద్దయ్యాకనన్నమాట.  నాలుగైదు రోజులకు ముందే జాడీలన్నీ కడిగి తుడిచి పెట్టేది. ఆవకాయకు రెండు జాడీలు, అల్లం ఆవకాయకు రెండు జాడీలు, నువ్వావకాయకు ఒక జాడీ, ఉడికిన తొక్కుకు ఒక జాడీ ఇలా విడివిడిగా ఉండేవి. ఇందులో సగం పంచడానికే పోయేవనుకోండి.. ఇక ఆవకాయ పెట్టడానికి కూడా మంచి రోజు చూసుకోవాలి. ఆ రోజు పొద్దున ఐదుగంటలకే హోల్సేల్ మార్కెట్ కు వెళ్లి కాయలు సంచీలలో కొని కొట్టేవాడిని కూడా ఇంటికి తీసుకొచ్చు ముక్కలు కొట్టించేది. పిల్లలను కూర్చోబెట్టి ఆ ముక్కల జీడి తీయమనేది. అదో సరదా పిల్లలందరికీ. ఈ  పనంతా అయ్యాక మామిడిపళ్లు ఇస్తా అని లంచం ఆశ పెట్టేది కూడా. లేకుంటే ఒక దగ్గర కూర్చుంటారా పిల్లలు సెలవుల్లో.. ముక్కలు కలిపేటప్పుడు ఆ ఎర్రెర్రని మసాలాలు చేతులతో కలపాలని నాకు చాలా ఇష్టంగా ఉండేది కాని అమ్మ దూరంగా కూర్చోబెట్టేది అందరినీ. కాని ఇప్పుడీ హడావిడి ఎక్కడిది..  సాయం కూడా దొరికే అవకాశం లేదు. అన్ని పొడులు రెడీమేడ్ గా దొరుకుతున్నాయి. ఒక్కరోజు పని తొందరగా ముగించుకుని మార్కెట్ వెళ్లి మంచి మామిడికాయలు కొని, ముక్కలు కొట్టించుకుని, అక్కడే నూనె, మసాలాలు కొని ఇంటికొచ్చి పోపేసుకుని, పొడులు కలుపుకుని, ముక్కలు కలిపేసి ఓ నాలుగైదు రకాలు ఆవకాయలు పెట్టి జాడీలను పక్కకు జరిపిన ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టి ఉతికిన పాతచీర కప్పి వంటింట్లో ఒక శుభ్రమైన స్థలంలో పెట్టేస్తే ఏడాదికి కావలసిన ఆవకాయ రెడీ అయిపోతుంది. ఈ ఆవకాయ మొత్తం కలిపి జాడీలోకి ఎత్తిన తర్వాత గిన్నెలో కొంచెం మసాలా ఉంచి అందులో వేడన్నం కలుపుకుని తింటే ఉంటుంది సామిరంగా... అసలే మండు వేసవి. వేడి సెగలు పొగలు అయినా  ఉష్ ఉష్ అనుకుంటూ ఎర్రని ఈ మండే కొత్త ఆవకాయన్నం తినాలి.. తర్వాత పెరుగు ఉంటుందనుకోండి. ఆ రుచి స్వర్గానికి ముంగిట్లో ఉన్నట్టు అనిపిస్తుందా లేదా..

ఇప్పుడు ఆవకాయ తినడం చాలా తగ్గిపోయింది.  వేసవిలో ఆవకాయ  పెట్టిస్తా అంటే మా ఇద్దరు పిల్లలు వద్దంటారు. కాని నేను పెట్టే ఆవకాయ కోసం ఎదురుచూసే ఇద్దరు ముగ్గురు మిత్రులున్నారు. ఎప్పుడు ఆవకాయ పెట్టి ఫోన్ చేస్తానా అని వెయిటింగ్.. ఫోన్ చేయగానే మనిషిని పంపి తెప్పించుకుంటారు.  అదే మరి తెలుగువారి ఆవకాయ మహాత్యం. ప్రాంతాలవారీగా ఆవకాయ తయారీ విధానం మారినా రుచిమాత్రం అమోఘం..

 

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పేజీలైనా రాసేయొచ్చు కాని ఎక్కడో అక్కడ ఆపాలిగా..  ఈ కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం విలవిలలాడిపోతోంది. ఎప్పుడు మామూలు స్థితికి వస్తామో తెలియట్లేదు. కాని నాకు మాత్రం ఈసారి ఆవకాయకు ఎటువంటి ఢోకా లేదనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా రెండు నెలల టైముంది ఆవకాయలు పెట్టడానికి. ఇఫ్పటికీ మంచి మామిడాకాయలు దొరుకుతున్నాయి (ఫ్రీగా కాదండోయ్. డబ్బులకే ). ఉగాదికి సాంపిల్ ఆవకాయ పెట్టేసారు చాలామంది..   ఆవకాయలు మే లేదా జూన్ లో కూడా పెట్టొచ్చు. మంచి కాయలు  ఉంటాయి. అప్పటికి కరోనా భూతం పారిపోయి ఉంటుంది.. ఏమంటారు..

 

కొసమెరుపు:

మల్లాది రామకృష్ణశాస్త్రిగారి  కృష్ణాతీరంలోని అన్నప్ప వాళ్లావిడకు చుట్టాలొచ్చారని ఎక్కువ హైరానాపడకు అంటూ ఇదిగో ఇలా కానిచ్చేయమన్నాడంట.

 

"పెందలాడే కాస్త పప్పూ అన్నం బెడుదూ. చుట్టాలొచ్చారని, నవకాయ పిండివంటలు జేసేవ్. వంకాయ నాలుగు పచ్చళ్లు చేసి పోపులో వేసి, ఆనపకాయ మీద యింత నువ్వుపప్పు చల్లి, అరటిదూట మొఖాన యింత ఆవెట్టి, తోటకూర కాడల్లో యింత పిండిబెల్లం పారేయ్. కొబ్బరీ, మామిడీ, అల్లం యీ పచ్చళ్లు చాల్లే...పెరుగులో తిరగమోతపెట్టి దాన్లో పది గారె ముక్కలు పడేయ్. రవంత శెనగపిండి కలిపి మిరపకాయలు ముంచి చమురులో వెయ్. సరే క్షీరాన్నమంటావా?అదో వంటా? ములక్కాయలు మరి కాసిని వేసి పులుసో పొయ్యి మీద పడేయ్. యీపూటకు యిల్లా లఘువుగా పోనీయ్. ఇదిగో నేను స్నానం చేసి వస్తున్నాగాని,ఈలోగా, ఓ అరతవ్వేడు గోధుంపిండి తడిప్పెట్టూ, రత్తమ్మొస్తే నాలుగు వత్తి అలా పడేస్తుంది. మధ్యాహ్నం పంటికిందకు వుంటాయ్.."

హైరానాపడకుండా ఇవి చేస్తే చాలంట..

ఇపుడు ఇది ఎందుకు గుర్తు వచ్చిందంటే...

కరోనా సమయంలో లాక్ అవుట్ మూలంగా ఉన్న మొగుళ్లు, ఉద్యోగాలు చేసే కొడుకులు, కూతుళ్లు అది చేసిపెట్టు, ఇది చేసి పెట్టు అని అమ్మను అదిగో అలాగే సతాయిస్తున్నారు మరి. ఈ లాకవుట్ ఏమో కాని ఇంటి ఇల్లాళ్లకు వంటింటినుండి విశ్రాంతి దొరకట్లేదు.  పనిమనిషి కూడా రావట్లేదు. వంట చేయడం ఒకెత్తు అయితే ఈ సింకెడు గిన్నెలు కడగడం ఇంకో పెద్ద ఎత్తు. వర్క్ ప్రమ్ హోమ్ అని మొగుడు, పిల్లలు వాళ్ల లాపీలు పెట్టుకుని వాళ్ల రూమ్ ల నుండి బయటకు రారు కదా.  ఈ సమయంలో అందరూ రుచులతో పాటు పనీ పంచుకుంటే బావుంటుందంటాను. మీరేమంటారు?

*****

bottom of page