
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
మధురవాణి ప్రత్యేకం
సాహితీ సౌరభాలు

ప్రసాద్ తుర్లపాటి
ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి - 2
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
ఆచార్య నారాయణరెడ్డి గారు రచించిన మరియొక గొప్ప కావ్యము "కర్పూర వసంతరాయలు".
"రాగిరేకులలో, రాతిపలకలలో కనుమూసిన తెలుగుల చరితకు ప్రాణం పోసిన మహామనీషి" శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారికి అంకితమిస్తూ, క్రీ.శ. 1957 లో రచించబడిన గేయ కథా కావ్యమిది.
క్రీస్తుశకం 1386 నుండి 1402 వరకు కొండవీడును రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పాలించిన 'రసికప్రభువు' -కుమారగిరి రెడ్డి. కుమారగిరి రెడ్డి ఆస్తాన నర్తకి 'లకుమ'. ఈ లకుమా, ప్రభువుల ప్రణయగీతం కర్పూరవసంతరయలు. కుమారగిరి, లకుమ నాట్యానికి, ఆమె సౌందర్యానికి దాసుడు అవుతాడు. రాజ్యాన్ని, రాణిని విస్మరిస్తాడు. రాజ్య పరిరక్షణ కోసం రాణి లకుమ ను అర్థిస్తుంది. లకుమ ప్రాణత్యాగం తో ఈ కావ్యం ముగుస్తుంది. చారిత్రక ఇతివృత్తాన్ని తీసుకుని శృంగారమే ప్రధానాంశముగా కథనల్లుతూ, వ్యక్తి సుఖముకన్నా, దేశసుఖమే ప్రధానమని తలచిననొక నాయిక త్యాగమే ఈ కావ్య కథ. కరుణ, వీర రసాల సమ్మేళనమే ఈ కావ్య శిల్పం.
ఈ కావ్యం ఒక రసఝరి. మాత్రా ఛందస్సు లో నారాయణరెడ్డి గారి రచన సాగింది. అనురాగానికి, దేశరక్షణ కర్తవ్యానికి మధ్య నాయిక లకుమ అనుభవించిన సంఘర్షణ ఎంతో అద్భుతంగా చిత్రీకరించబడినది. అందుకే ప్రజాశ్రేయస్సు కోసం ఆమె చేసిన త్యాగం, లకుమను చిరంజీవిగా చేసింది. కుమారగిరి సామ్రాజ్యంలోని వసంతోత్సవాల కర్పూరపరిమళం తెలుగు దేశాన యిప్పటికీ గుభాళిస్తూనే వుంటుంది. ఈ కావ్యాన్ని స్వయంగా నారాయణరెడ్డి గారు ఆలపించారు.
"వో సఖీ (లకుమా)! యేమందువో నీవు? ఇంకేమి?
వ్యష్టికన్నను దేశదృష్టియె గరిష్టమని
ఈ విధిని ప్రభువు వాపోవుచుండగ లకుమ
అందించు సందేశ మతని జాగృతుజేసె.
ప్రభువు కన్నులకు కనుపడె నపుడు కొండవీడును,
మహారాజ్ఞియును, జనమహాంభోధియును
నేటికిని లకుమ అందెల ఝుణత్కారములు
వినిపించు కొండవీటను వీచు వాయువులు
కొమరగిరి చరితమ్ము కొండవీటను, శిశిరమును
సైతము వసంతముగ రూపు గట్టించు
కొండవీటను పాదుకొన్నట్టి మట్టిలో
సైతమ్ము కర్పూరసౌరభమ్ములు వీచు "
కొండవీటను శిశిరమును సైతము వసంతముగ రూపుగట్టించారు తన కావ్యాంతములో...
ఆచార్య నారాయణరెడ్డి గారు తెలుగులో గజల్స్ రచయితలలో ప్రముఖులు. తన గజల్స్ ను తన కుమార్తె శ్రీమతి గంగ గార్కి అంకితమిచ్చారు.
“నన్నే కన్నయ్యగ తన
కన్నుల ఒడిలో పొదిగిన
గంగకు అర్పింతును నా
గజళ్ళు ఎదలోన ముడిచి
ఋణవిముక్తికై చేసిన
కృతి సమర్పణం కాదిది
తల్లి నోట ముద్దలిడే
పిల్లవాని చాపల్యం”
వారి కలం ఎంత శక్తిమంతమైనదో, వారి గళం కూడా అంత సమ్మోహనాత్మకమే.
ఆచార్య నారాయణరెడ్డి గారు ఎన్నో గజల్స్ ను ఆలపించారు.
వీరు రచియించిన మరియొక మధుర భావనామయ కావ్యము "నాగార్జున సాగరము". మాత్రాఛందస్సు తో పాటుగా, నాదమయమగు స్వరనియమముతో వీరి రచన సాగింది.
"ఇక్ష్వాకు వంశక్షి
తీంద్ర చంద్రుల కీర్తి
కౌముదులు నల్గడల
కలయ విరిసిన నాడు;
కృష్ణవేణీ తరం
గిణి పయ: కింకిణులు
త్రిసరణ క్వాణాల
దెసలు నింపిననాడు;
శ్రీపర్వతాగ్రమ్ము
సింహళాగత బౌద్ధ
భిక్షువుల విజ్ఞాన
పీఠికమ్మగు నాడు;
సిద్ధార్ధుని విశుద్ధ
సిద్ధాంత బీజములు
శాఖోప శాఖలై
సాగి పోయిననాడు
నే జీవించి యు
న్నానంచు భావించి
పలికింతు గేయ కా
వ్యమును హృదయమును పెంచి"
అని తన నాగార్జునసాగర కావ్యారంభము కావించారు.
డాక్టర్ శ్రీ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు గారన్నట్లు, "ఆనకట్ట వలన నాగార్జునకొండ మునిగిపోవుచున్నదే అని విచారపడనవసరము లేదు. శ్రీ నారాయణరెడ్డి గారు నాగార్జున కొండకు శాశ్వత కీర్తికాయము సృష్టించియున్నారు".
సమకాలీన సంఘటనలు తనను ప్రేరేపించినపుడు కవిగా స్పందించి ఎన్నో చక్కని గేయాలు రచించారు.
వీరు ఎన్నో చక్కని సినీ గీతాలు రచించారు. గంభీర శబ్దంతో పాటుగా, లాలిత్యం తో కూడిన గీతాలనెన్నింటినో రచించారు. వీరి గీతాలు ప్రచండపద దీర్ఘసమాసభూయిష్ఠములు మరియు 'రవ్వంత సడి లేని రసరమ్య గీతాలు కూడా". సి. నారాయణ రెడ్డి గారు 1962 లో ‘గులేబకావళి కథ’ లోని పాటద్వారా సినిమా రంగం లోకి అడుగు పెట్టారు. “నన్ను దోచుకుందువటే వెన్నెల దొరసానీ అనే పాట“ తో పేరుపొందారు. తెలుగు పాటకు చక్కని పదబంధాలతో, చక్కని భావనలతో, సందేశాత్మకముగా కావ్యగౌరవం కల్పించారు. వీరు వ్రాసిన కొన్ని పాటలను స్మరించుకుందాం -
“ప్రణవనాదం ప్రాణంకాగా
ప్రకృతి మూలం తానంకాగా
భువనమ్ములే రంగ భూమికలు కాగా
భుజంగ భూషణుడు అనంగ భీషణుడు
పరమ విభుడు గళధరుడు
భావ రాగ తాళమయుడు సదయుడు “
అని ఆ పరమశివుడితో తాండవము చేయించారు.
“ప్రణుతి ప్రణుతి ప్రణుతి ప్రధమ కళా సృష్టికి "ప్రణతి"
పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం
ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం
ఐంకారమా
పైరు పాపాయిలకు జోలలు పాడే......
గాలుల సవ్వడి
హ్రీంకారమా
గిరుల శిరసులను జారే ఝరుల నడల
అలజడి
శ్రీంకారమా
ఆ బీజాక్షర వితతికి
అర్పించే జ్యోతలివే
ప్రణుతి ప్రణుతి ప్రణుతి ప్రధమ కళా సృష్టికి "ప్రణతి"….
“ వేద వేదాంత వనవాసినీ
పూర్ణ శశి హాసినీ
నాద నాదాంత పరివేషినణీ
ఆత్మా సంభాషిణీ
వ్యాస వాల్మీకి వాగ్దాయినీ
జ్ఞాన వల్లీ సముల్లాసినీ..”
ఓంకారమా, ఐంకారమా, హ్రీంకారమా, శ్రీంకారమా - ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న శ్రీలలితాసహస్రనామావళి మూల మంత్రాన్ని తీసుకుని, ప్రకృతికి అనుసంధానిస్తూ, అమ్మవారిని సందర్శించారు ఈ గీతం లో.
“నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా
కూరిమిగలవారంతా కొడుకులేనురా
జాలిగుండె లేని కొడుకుకన్న కుక్కమేలురా... కుక్కమేలురా “
"సర్వం మిధ్య" అనే వేదాంత తత్వాన్ని వుదహరిస్తూ, కొడుకు దుష్టప్రవర్తన చూసి బాధ పడే వొక తండ్రి వేదనను వివరించారు
“వ్యాధులు బాధలు ముసిరే వేళ..
మృత్యువు కోరలు సాచే వేళ
గుండెకు బదులుగా గుండెను పొదిగీ..
కొనవూపిరులకు ఊపిరులూదీ..
జీవనదాతలై వెలిగిన మూర్తుల
సేవాగుణం మాకందించరావా..”
తమ నిస్వార్ధ సేవతో ఎంతో మందికి ప్రాణ దానం చేస్తున్న వైద్యులను కొనియాడరు. వారి సేవా గుణాన్ని ప్రసాదించమని సర్వాంతర్యామియైన భగవంతుని వేడుకున్నారు.
“మంచువంటి మల్లెవంటి మంచిమనసుతో
జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు….
కాగితంపు పూలకన్న గరికపువ్వు మేలు”
నిరాశ, నిస్పృహ లతో వున్న యువకునికి చదువు కన్నా గుణమే ప్రధానమని ఉత్సాహపరచారు.
“హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమధ గణము కనిపించగా
ప్రమదనాద కర పంకజ భ్రాంకృత ఢమరుద్వని వినిపించగా
ప్రళయ కరళ సంకలిత భయంకర జలదరార్బటుల
జలిత దిక్కటుల జహిత దిక్కరుల వికృత ఘీంకృతుల
సహస్రఫణ సంచలిత భూత్క్రుతుల….”
తన సుదీర్ఘ, గంభీర పదబంధాలతో, తన చెలి తో నృత్యం చేయించారు.
“సీతగా ధరణిజాతగా
సహన శీలం చాటినది
రాధగా మధుర బాధగా
ప్రణయ గాథల మీటినది
మొల్లగా కవితలల్లగా
తేనెజల్లు కురిసినది
లక్ష్మిగా ఝాన్సీలక్ష్మిగా
సమర రంగాన దూకినది”
అంటూ మహిళా ఔన్నత్యాన్ని ఎంతో గొప్పగా చాటారు
“వటపత్రశాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి
కల్యాణ రామునికి కౌసల్య లాలి
యదువంశ విభునికి యశోద లాలి
కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి
పరమాంశభవునికి పరమాత్మ లాలి
అలమేలు పతికి అన్నమయ్య లాలి
కోదండరామునికి గోపయ్య లాలి
శ్యామలాంగునికి శ్యామయ్య లాలి
అగమనుతునికి త్యాగయ్య లాలి "
అలతి అలతి పదాలతో పరమాత్మకే లాలి పాడారు. భగవంతునికి మొదటగా నవరత్నమాలికల జోల, అమ్మల జోల, తదుపరి వాగ్లేయకారుల కీర్తనల జోల. భగవంతునికైనా, తొలి దైవం అమ్మే కదా ! తల్లి ప్రేమకు, పసిబాలుని కి గంభీర పదబంధము సరిగ్గా వొప్పదని, నారాయణ రెడ్డి గారు సామాన్య పదాలతో అనంత అర్ధాలను మనకందించారు.
“నీవుంటే వేరే కనులెందుకూ
నీ కంటే వేరే బ్రతుకెందుకూ
నీ బాటలోనే అడుగులు నావే
నా పాటలోనే..మాటలు నీవే.
"స్నేహమే నాజీవితం స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి" అంటూ స్నేహ పరిమళాలను పంచే తన మిత్రునితో కృతజ్ఞతగా చెప్పారు..
“నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే
పూల ఋతువు సైగచూచి పిఖము పాడే
మనసే వీణగా ఝణ ఝణ మ్రొయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా
పగలే వెన్నెల జగమే ఊయల..
కదలే ఊహలకే కన్నులుంటే..
పగలే వెన్నెల “
వసంత ఋతువు ఆగమన వేళ, వొక కన్నె వూహల హృదయంతరంగాన్ని ఆవిష్కరించారు.
“జనకుని కొలువున అల్లనసాగే జగన్మోహిని జానకి..
వేణుధరుని రధమారోహించిన విదుషీమణి రుక్మిణి..
రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా..
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా..”
శివరంజని రాగలాపలనలో తన చెలిని సాధ్వీమణుల తో పోలుస్తూ సాదరంగా తన హృదయాంతరంగములోనికి ఆహ్వానించారు
“నవ్వులా అవి కావు
నవ పారిజాతాలు
రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు”
అసలే రసరమ్య గీతాలు, అందులోనూ, రవ్వంత కూడా సడి చేయనివి - అంత సుకుమార లావణ్యభరితాలు తన ప్రియుని నవ్వులని చాటుగా ప్రియుని వీక్షిస్తున్న ఒక ప్రియురాలితో చెప్పించారు. మరి ఇద్దరు జ్ఞానపీఠుల చిత్రరాజము కదా !! (ఏకవీర)
“ ఈ నల్లని రాళ్ళలో... ఏ కన్నులు దాగెనో...
ఈ బండల వూటున... ఏ గుండెలుమ్రోగెనో...ఓ...
పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి
మునులవోలె కారడవుల మూలలందు పడియుున్నవి”
ప్రకృతి వనరులను ప్రేమిస్తూ, నిష్కల్మషమై, తన చేతిలో అపరూప శిల్పాలుగా రూపుదిద్దుకొనబోతున్న 'శిలామునులనూ' దర్శించారు.
“ పాలకు ఒకటే తెలివర్ణం,
ఇల ప్రతిభకు కలదా కులభేదం,
వీరులకెందుకు కులభేదం
అది మనసుల చీల్చెడు మతబేధం
గాలికి కులమేదీ ఏది నేలకు కులమేదీ
గాలికి కులమేదీ”
ఇంత నిష్కల్మష హృదయులు కాబట్టే, నారాయణ రెడ్డి గారు కులమతాలు ప్రతిభకు కొలమానము కాదని, ఒక వీరపత్ని తో ఉత్సాహ గీతం పాడించారు.
వీరికి అతున్నత పురస్కారలయిన, పద్మశ్రీ మరియు పద్మభూషణ పురస్కారాలు, సాహిత్యములో భారత జ్ఞానపీఠ పురస్కారం లభించాయి. ఎన్నో ఉన్నత పదవులకు వీరు వన్నె తెచ్చారు.
అందుకే ఆ పద్మభూషణుడు ఇలా అన్నారు –
“పేరేమో సింగిరెడ్డి
నారాయణరెడ్డి కాని,
కులం కీళ్ళు విరిచే నా
కలానికీ సన్మానం “
ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం గారు అన్నట్లు - "విశ్వమానవ హృదయాంతరాళాల్లోని చైతన్య జలపాతాల సవ్వడినీ, విప్లవ జ్వాలల వేడినీ రంగరించి కవితా జగత్తులో మానవతా దృక్పథానికి మనోజ్ఞ రూపాన్ని దిద్దుతున్న శిల్పి సి.నారాయణరెడ్డి. పద్యం నుండి గేయానికి, గేయం నుండి వచనానికీ అభ్యుదయాన్ని సాధిస్తూ పట్టింది బంగారంగా, పలికింది కవిత్వంగా ప్రగతి సాధిస్తున్న కవిచంద్రులు రెడ్డిగారు. మనిషిలోని మమతను, బాధను, కన్నీటినీ, మున్నీటినీ, అంగారాన్నీ, శృంగారాన్నీ, వియోగాన్నీ, విప్లవాన్నీ కవితల్లో కీర్తించడం రెడ్డిగారి మతం".
చివరగా వీరి సందేశము -
“నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు”
ఇకపోతే, తెలంగాణా సాహిత్యోద్యమములో ఎందరో ప్రజాకవులు ప్రముఖ పాత్ర వహించారు. వారిలో ప్రముఖులు - శ్రీ సుద్దాల హనుమంతు, శ్రీ సుద్దాల అశోక్ తేజ, బండి యాదగిరి, గోరేటి వెంకన్న, గద్దర్ తదితరులు. వీరు కాక, కథకులు నందిని సిద్దారెడ్ది, శ్రీ కౌముది, శ్రీ ఆఫ్సర్, శ్రీ చంద్రబోస్ తదితర ఏందరో ప్రముఖులు తమ కవితలతో, కధలతో, గేయాలతో సాహితీ వ్యవసాయం సాగించారు.
బండి యాదగిరి గారి ఈ గేయం ఎంతో ప్రాముఖ్యాన్ని పొందింది –
“బండెనుక బండి గట్టి..
పదహారు బండ్లు గట్టి..
ఏ బండిల బోతవ్ కొడుకో..
నైజాము సర్కరోడా..
నాజీల మించినావురో నైజాము సర్కరోడా”
సుద్దాల హనుమంతు గారి గేయం -
“పల్లెటూరి పిల్లగాడ,
పసులు గాసే మొనగాడా,
పాలు మాని ఎన్నళ్ళయిందో
ఓ పాల బుగ్గల జీతగాడా…”
“రాజ్యహింస పెరుగుతున్నాదో, పేదోళ్ళ నెత్తురు ఏరులై పారుతున్నదో"అంటూ గేయ శరాలను సంధిస్తున్నారు శ్రీ గోరేటి వెంకన్న గారు. ప్రపంచీకరణ మాయాజాలం పల్లెల పై ప్రభావితం చూపుతున్నప్పుడు, కుల వృత్తులు ధ్వంసమై, మూలకు పడుతున్నప్పుడు, పల్లెలను మింగి పట్టణాలు వృద్ధి చెందుతున్నప్పుడు, మానవత్వపు విలువలు మృగ్యమైపోతున్నపుడు ఆయన హృదయం వేదనతో రగిలి ఈ పాటగా రూపుదాల్చినది –
"పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలో తల్లి బందీయై పోతుందో..”
ఈ విధముగా తెలంగాణా ప్రాంతములో తెలుగు సాహిత్యం వెల్లివిరుస్తూ వున్నది. భక్తి, సామాజిక స్పృహ, విప్లవ చైతన్యం అన్నీ కలకలిసిన సాహితీ పుష్పములు తెలంగాణా సాహితీ ఉద్యానవనం లో వికసిస్తున్నాయి. ఈ "తెలంగాణాలో వెల్లివిరిసిన సాహితీ శోభ” వ్యాస సంపుటి ఒక విహంగ వీక్షణం మాత్రమే. ఇంకా ఎంతో మంది ప్రముఖులను గురించి చర్చించుకోవాల్సిన అవసరం వున్నది.
ఇంకా ఎంతో మంచి సాహిత్యం రావాలనీ, తెలుగు తల్లికి సాహితీ కుసుమాలను అందించాలనీ, ఆకాంక్షిస్తూ...
తప్పులుంటే మన్నించాలని ప్రార్థిస్తున్నాను.
ఈ వ్యాసానికి ఆధారాలు:
1. ఆంధ్రుల సాంఘిక చరిత్ర - శ్రీ సురవరం ప్రతాప రెడ్డి
2. ఆంధ్ర సాహిత్య చరిత్ర - శ్రీ పింగళి లక్ష్మీకాంతం
3. ఆంధ్రుల చరిత్ర - శ్రీ బీ.ఎస్.ఎల్ హనుమంతు
4. ప్రజాకవి - దాశరధి సాహిత్యం - శ్రీ దాశరధి కృష్ణమాచార్య
5. అక్షర మందాకిని - శ్రీ దాశరధి రంగాచార్య
6. ఆంధ్రమహాభాగవతము - బమ్మెర పోతన
7. తెలుగు రామయణాలు - వ్యాస సంకలనం - " రామాయణ సుధాలహరి"
8. విశ్వంభర – డా. సి. నారాయణ రెడ్డి
9. కర్పూర వసంతరాయలు – డా. సి. నారాయణ రెడ్డి
10. నాగార్జున సాగరము – డా. సి. నారాయణ రెడ్డి
11. జాతీయకవి సి నా రె - ఆచార్య కసిరెడ్డి
మరియు ప్రముఖుల స్పందనలు..
అందరికీ శార్వరీ నామ ఉగాది శుభాకాంక్షలు.
వచ్చే సంచిక నుంచి "తెలుగు సాహిత్యములో జీవనదులు" మకుటంతో మరికొన్ని సాహితీ సౌరభాలని పంచుకుంటాను.
*****