adannamaata.png

సంపుటి  5   సంచిక  2

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మా వాణి ...

మధురవాణి పాఠకులకి ముందుగా శార్వరీ నామ సంవత్సర శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలుపుతూనే, ‘తస్మాత్ జాగ్రత్త’ అని హెచ్చరిక కూడా చెయ్యవలసి వస్తుంది అని ఏనాడూ ఊహించ లేదు. ‘శార్వరి’ అంటేనే ‘కటిక చీకటి’ అని అర్ధం కాబట్టి అది ‘కరోనా రూపం’ లో కొన్ని నెలల క్రితం చైనా లో సాయంకాలపు చిన్న నీడలా ప్రవేశించి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనీ ‘కోవిడ్-19” కటిక చీకటిలో ముంచెత్తుతున్నదేమో అని కొందరు భావించినా ఆశ్చర్యపోనక్కర లేదు. అమెరికా లాంటి సంపన్న దేశాలకి కూడా ప్రాణాంతకమైన ఈ సూక్ష్మ జీవి వ్యాప్తిని నిరోధించడం అతి కష్టతరంగా మారుతుంది.

పూర్వం వశిష్టుల వారికీ, శ్రీ రాముడికీ జరిగిన ‘యోగ వాశిష్టం” లో ప్రస్తావించబడిన ‘కర్కటి’, ‘అనాయసి’, ‘ఆయసి’ మొదలైన పేర్లతో మానవ జీవిత వినాశనం కోసమే పుట్టిన సంచార క్రిముల ఆధునిక వికాట్టహాసమే  ఈ నాటి ‘కరోనా” కానీ, ఇదేమీ కొత్తది కాదు అని మనలో కొందరు చేస్తున్న ప్రచారం మాట ఎలా ఉన్నా, 'ఉన్న విషయం ఏమిటంటే ఈ ‘కరోనా’ విష జ్వరానికి ఇప్పటి దాకా  మందూ, మాకూ, వాక్సీన్, గుళికలూ ఏమీ లేవు. అవి కనిపెట్టడానికి ఐదారు నెలల సమయం పడుతుంది. ఈ లోగా మనం చెయ్యగలిగినదల్లా ఒకే ఒక్కటి.....ఆ వ్యాధి వ్యాపించకుండా అన్ని నివారణ చర్యలనీ తూచా తప్పకుండా పాటించడం. అవేమిటో మీకు తెలుసు. పదే, పదే చేతులు కడుక్కోవడం, ఇంటిలోనే ఉండడం, అత్యవసరంగా బయటకి వెళ్ళవలసి వస్తే ఆరు అడుగుల సామాజిక దూరం పాటించడం, దగ్గినా, తుమ్మినా, ఆఖరికి మాట్లాడినా, నవ్వినా నోటికి రుమాలు, లేదా మోచెయ్యి అడ్డం పెట్టుకోవడం, అనుమానం వస్తే నాటు వైద్యం మానేసి తక్షణం వైద్య పరీక్ష చేయించుకోవడం..ఒక నెల పాటు ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేరా? ఇవి సామూహిక జాగ్రత్తలు కాదు. వ్యక్తిగతంగా మనంతట మనం తీసుకోవలసిన జాగ్రత్తలు.

 “నాకు ఏ విధమైన దగ్గు, జ్వరం, రొంపా లాంటి రుగ్మత సూచనలు లేవు కాబట్టి నాకు కరోనా అంటలేదు” అనే భ్రమలో ఉండడం అన్నింటికన్నా ప్రమాదకరమైన విషయం. అందుకే “తస్మాత్ జాగ్రత్త” అని చాలా పెద్ద గొంతు తో హెచ్చరిస్తున్నాం. మీరు కరోనా ప్రమాదం లో చిక్కుకోకండి. మీకు దగ్గర అయిన వారినీ, ఇతరులనీ ఈ కరోనా కోరలకి చిక్కనీయకండి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు.

అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ, హాయిగా ఇంట్లోనే ఉండి, ఎప్పటి నుంచో చదవాలి అనుకుంటున్న పుస్తకాలు చదువుకోండి. ఇంట్లో ఉన్న కుటుంబం తో కేరమ్స్ ఆడుకోండి. దూరంగా ఉన్న దగ్గరి వాళ్ళతో ఫేస్ బుక్ లో, వాట్సప్ లో చమత్కారాలు పంచుకోండి. అటక మీద సామాను సద్దుకుంటూ, పాత ఫోటోలు, ఉత్తరాలూ వాటి జ్ణాపకాలూ నెమరు వేసుకోండి. అంతెందుకూ. ఇంటి పట్టునే ఉండి ఈ మధురవాణి సంచిక నీ, గత ఐదేళ్ళ పాత సంచికలనీ  ఆస్వాదించండి. 

పాఠక దేవుళ్ళకి ఈ  శార్వరి,  త్వరలోనే కరోనా తో సహా అన్ని చీకట్లనీ పారద్రోలి వెలుగురేఖలని పంచుతుందని ఆశిస్తూ....మరొక్క సారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో.... 

*****

మధురవాణి నిర్వాహక బృందం

sahityam@madhuravani.com

MADHURAVANI TELUGU MAGAZINE  మధురవాణి

new_mv_cover_apr20.JPG