
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మధురవాణి ప్రత్యేకం
అధ్యాత్మికం

ఎర్రాప్రగడ రామకృష్ణ
హిరణ్యకశిపుడి పేరు మనం అంతా వినే ఉంటాం.
మహావిష్ణువు పట్ల అతనికి పరమ ద్వేషం.
విష్ణువు ఎక్కడైనా దొరికితే పట్టి సంహరించాలన్న కసితోనే జీవితమంతా గడిపినవాడు. అతని భార్య పేరు లీలావతి. వారిద్దరికీ ప్రహ్లాదుడు పుట్టాడు. ఈ కథంతా విష్ణు పురాణంలోనిది.
తండ్రికి విష్ణువు పట్ల ఎంత వైరమో -కొడుక్కి విష్ణువు పట్ల అంత భక్తి. ఇలా ఎందుకు జరిగింది అనేది అటు మనస్తత్వ పరిశోధనకీ, ఇటు భారతీయ స్త్రీల చాతుర్యానికి కూడా సంబంధించిన గొప్ప విషయం!
ప్రహ్లాదుడు పుట్టక ముందే - లీలావతి కడుపులో వుండగా హిరణ్యకశిపుడికి తపస్సు చేయాలని సంకల్పం కలిగింది.
శివుణ్ణి మెప్పించి, ఎన్నో వరాలు, ఆయుధాలు గ్రహించి - వాటి సాయంతో మహావిష్ణువును మట్టు పెట్టాలని అతని ఆలోచన. సరే, తపస్సుకి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసుకుని, ఒక మంచి ముహూర్తం కూడా చూసుకుని - భార్య లీలావతికి వీడ్కోలు చెప్పి తపస్సు కోసం అడవిలోకి బయలుదేరి వెళ్ళిపోయాడు-శివుడు ప్రత్యక్షమై, వరాలన్నీ ఇచ్చి సాగనంపేదాకా తపస్సు చేయాలి-ఎన్నాళ్ళయినా, ఎన్నేళ్ళయినా! అలా అనుకుని, పొద్దున్నే వెళ్ళినవాడు సాయంత్రానికి తిరిగి వచ్చేసాడు. అదేమయ్యా మొగుడా - అని లీలావతి అడిగితే - అడవిలో పెద్ద డిస్టర్బెన్స్ ఏర్పడిందని చెప్పాడు.
ఈయన ఒక చెట్టు క్రింద స్తిమితంగా కూర్చుని - కళ్ళు మూసుకుని ఓం నమః శివాయ - అనడం మొదలు పెట్టాడో లేదో - అదే చెట్టుపై ఒక చిలుక వాలి నారాయణ, నారాయణ - అంటూ రొద చెయ్యడం ప్రారంభించిందట. మన పిల్లలు ఏదో మంచి బుద్ధి పుట్టి పుస్తకాలు తీసి చదువు మొదలు పెట్టేసరికి దాని దుంప తెగా - సరిగ్గా అదే టైముకి టి.వి.లో మనకి బాగా యిష్టమైన సీరియల్ వచ్చేస్తుంది. డైలాగులు బాగా వినపడాలని మనం పెద్ద వాల్యూమ్ తో టి.వి. పెట్టేసుకుంటాం. దాంతో పిల్లల చదువు చెట్టెక్కి పోతుంది చూసారా! అక్కడా ఇదే జరిగింది! హిరణ్యకశిపుడి ఏకాగ్రత చెల్లాచెదరైపోయింది.
ఎన్నిసార్లు పట్టుదలగా కూర్చుని, మళ్ళీ తపస్సు మొదలు పెట్టినా - కుదిరి చావలేదు. చోటు మార్చి చూద్దామనుకుంటే - హిరణ్యకశిపుడు ఎక్కడ కూర్చుంటే - చిలక కూడా అక్కడికే తయారై - నారాయణ నారాయణ అంటూ ‘చిలకగోల’ ప్రారంభించేది. చివరికి అతనికి విసుగుపుట్టి - ఇంకోసారి ఎప్పుడో మరో మంచి ముహూర్తం చూసుకుని మళ్ళీ వద్దామనుకుని - ఇంటికి చక్కా తిరిగివచ్చాడు. లీలావతి చాలా తెలివైంది. అసలు రహస్యమేమిటో ఆవిడకి తెలిసిపోయింది. ఆ చిలుక రూపంలో వచ్చినవాడు నారదమహర్షి. హిరణ్యకశిపుడి తపస్సు చెడగొట్టడానికి నారదుడే చెట్లమీద చిలకలా వాలి - నారాయణ నామం జపించడం మొదలెట్టాడు. ఈ కథంతా లీలావతి గ్రహించింది. అయినా నమ్మలేనట్లుగా మొహం పెట్టి - ఏదీ ఏమంది? ఎలా అంది? అలా నాలుగేసి అక్షరాలు పలకడం చిలకలకి సాధ్యమవుతుందా - మీ భ్రమగానీ, మళ్ళీ చెప్పండి, సరిగ్గా అలాగే పలికిందా! మీరు బాగా విన్నారా, చిలుక ఎలా అనిందో సరిగ్గా చెప్పండి - అని పదేపదే రెట్టించింది. ప్రశ్నలకు సమాధానం రాబట్టడంలో స్త్రీలకి గల నైపుణ్యం అపారం-అని భారతీయ మొగుళ్ళు చాలా మందికి తెలిసిన విషయమే! (ఎలాంటి మొగుడైనా కొన్ని కొన్ని విషయాల్లో భార్యలకి లోకువైపోవడానికి తగినన్ని ప్రత్యేక ఆయుధాలు భారతీయ స్త్రీల దగ్గర రెడీగా ఉంటాయి.) ప్రేమగా, లాలనగా, గోముగా, మృదువుగా మాట్లాడుతూ - మొగుడ్ని బుట్టలో పెట్టేసే విద్యలో భారతీయ మహిళలు - సుప్రసిద్ధలు. బాగా కాగిన పంచదార లేత పాకంలోకి-గులాబ్ జాం మెత్తగా జారిపోయినట్లుంటుంది- ఆ ప్రోసెసింగ్. అలాంటి స్త్రీ సహజమైన కిటుకులు, ఉపాయాలు, చమత్కారాలలో మన లీలావతి కూడా అందెవేసిన చేయి. మొత్తానికి, మొగుణ్ణి అలా బుజ్జగిస్తూ, లాలిస్తూ 108 సార్లు శ్రీమన్నారాయణ నామ జపం పూర్తి చేయించింది. సదరు కార్యక్రమమంతా జరుగుతున్నప్పుడు హిరణ్యకశిపుడు ఎక్కడ ఉన్నాడు. ప్రయాణం బడలిక తీర్చుకోవడానికి లీలావతి ఒడిలో తలవాల్చి సేద తీరుతున్నాడు. మర్చిపోకండి - అప్పటికి ప్రహ్లాదుడు తల్లి కడుపులో తొమ్మిది నెలల పసికందుగా ఉన్నాడు.
అంటే, పిల్లవాడికి నారాయణ మంత్రోపదేశం చేసింది ఎవరన్నమాట! అర్థమయింది కదా! సాక్షాత్తు అతని తండ్రి హిరణ్యకశిపుడు! లీలావతి చాతుర్యం ఏ స్థాయిదో అర్ధమయింది కదా! సుభద్ర కడుపులో నెలలు నిండిన స్థితిలో ఉన్న అభిమన్యుడు - పద్మవ్యూహం లోకి ప్రవేశించే టెక్నిక్ ఎలా అయితే గ్రహించాడో - అదే తరహాలో ప్రహ్లాదుడికి నారాయణ మంత్రం ఒంట పట్టింది.
'సతీలీలావతి' పేరుతో కమలహాసన్ హీరోగా - ఆమధ్య ఒక డబ్బింగ్ సినిమా వచ్చింది. గుర్తుందా! అందులో ఏ పాత్ర పేరుకూడా లీలావతి కాదు. అయినా ఆ సినిమా పేరు మాత్రం 'సతీలీలావతి' అని పెట్టారు. దారి తప్పిన మొగుణ్ణి చాకచక్యంగా తనవైపుకి పిల్లల సాయంతో తిప్పుకున్న స్త్రీ కథ అది. లీలావతి కథలో కీలకం ఏమిటో గ్రహించాడు కనుక చిత్ర దర్శకుడు - తన సినిమాకి ఆ పేరు పెట్టి పాతకథను స్పురింపచేసాడు.
స్త్రీలకుసంబంధించిన ఈ అపార నైపుణ్యాన్ని మన పూర్వకవులంతా బాగా గ్రహించారనడానికి ఎన్నో దాఖలాలున్నాయి. పరమశివుడికి పార్వతినిచ్చి కట్టపెట్టాలని - సప్తఋషులు సంకల్పం చేసి హిమవంతుడి దగ్గరికి బయలుదేరారు - సంబంధం మాట్లాడడానికి! అప్పుడు శివుడు అంటాడు-మీరు ఏడుగురు కాదు కదా - ఏభైమంది వెళ్ళినా పని జరగదు. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు వంటి పనులలో స్త్రీలు కడు చతురులు. ఒక ముత్తయిదువు నెవరినైనా వెంట పెట్టుకుని వెళ్ళండి. “ప్రాయేథైవం విధే కార్యే పురంద్రీణాం ప్రగల్భతా”! కుమారసంభవంలో కాళిదాసు వర్ణన ఇది. ఇంత గొప్ప అబ్జర్వేషన్ ఉంది కనుకే కాళిదాసు తర్వాత ఎవరని వేళ్ళు లెక్కేస్తే మళ్ళీ మళ్ళీ ఆయన పేరు చెప్పవలసి వస్తోందన్నారు-మన పెద్దలు.
రాయబారానికి వెళ్ళేముందు హస్తినలో అడుగు పెట్టగానే కృష్ణుడు కుంతీదేవిని కలిసాడు-పాండవులంతా ఇలా ఇలా చెప్పారు. ఏం చెయ్య మంటావు అని అడిగితే-ఆవిడ అన్నదట-నాకోడలు ద్రౌపది ఏంచెప్తే-అది చెయ్యి అని! పాండవుల్లాంటి మహాయోధుల్ని ముందంతా కడుపులో పెట్టుకొని భద్రంగా కాపాడిన స్త్రీ మూర్తి కుంతి అయితే - తరువాత అంతా గుండెల్లో పెట్టుకుని జాగ్రత్తగా నడిపించిన ప్రతిభాశాలి - ద్రౌపది!
ఆ స్త్రీల కథలను అర్థం చేసుకున్న ఆధునిక మహిళలు సమాన హక్కుల కోసం పోరాడటం కాదు - తమ స్థాయిని గ్రహించి గర్వపడతారు!