top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  2

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా​ మధురాలు

పరిధులే తెలియని...

social logo.JPG

వాత్సల్య

"నేనూ శ్రీరాం విడాకులు తీసుకుందామనుకుంటున్నాము" ఉరుములేని పిడుగులా స్నేహితురాలు జానకి నుండి పొద్దున్నే వచ్చిన ఆ సందేశాన్ని చూసి హతాశయురాలినయ్యాను.అయినా పొద్దున్నే పిల్లల స్కూలు, వంట హడావిడితో ఆ విషయాన్ని కాసేపు పక్కనపెట్టి పనులన్నీ అయ్యాకా జానకికి ఫోనుచేసాను.

"భావనా, ఇంక వివరాలేమీ అడగకే, నేను విడిపోదామని నిర్ణయించేసుకున్నాను" అంది జానకి స్థిరంగా.

 

"అది కాదే..అసలు మీ ఇద్దరి మధ్యా అంత గొడవలు...." ఇంకా నా వాక్యం పూర్తి చెయ్యనేలేదు, జానకి అందుకుని "నువ్వు బయట వాళ్ళకి ఫ్యామిలీ కౌన్సిలర్‌వి ఏమో కానీ నాకు మాత్రం స్నేహితురాలివి అంతే..ఇంక వివరాలు అడిగి మా ఇద్దరి మధ్యా సయోధ్య కుదర్చాలని చూడకు, అది జరగని పని" అని కోపంగా.

 

ప్రస్తుతం ఇది ఏమి చెప్పినా వినే స్థితిలో లేదు అని అర్ధమయ్యి ఫోను పెట్టేసాను..ఆఫీసుకి వెళ్ళానే  కానీ సాయంత్రం వరకూ జానకి, శ్రీరాం గురించి ఆలోచనలే.

 

నేనూ జానకీ డిగ్రీ నుండీ పీజీ వరకూ కలిసి చదువుకున్నాము. మా పీజీ సీనియర్ అయిన శ్రీరాం జానకిని చూసి ఇష్టపడి పెద్దలని ఒప్పించి పెళ్ళిచేసుకున్నాడు. వాళ్ళకి ఆరేళ్ళ  బాబు అక్షయ్, ఇద్దరూ చక్కగా సంపాదిస్తున్నారు, ఉన్నంతలో హాయిగా ఉన్నారు.అసలు వాళ్ళ మధ్య అంత తీవ్రమైన గొడవలు ఏమి జరిగి ఉంటాయో నాకు అర్ధం కాలేదు. 

 

నాకు  తెలిసున్నంత వరకూ శ్రీరాం మంచివాడే,అసలు జానకి ఎందుకు  అలాంటి నిర్ణయం తీసుకుందో ఎంత బుర్ర బద్దలుకొట్టుకున్నా నాకు తట్టట్లేదు.విషయం తేల్చుకోవాలని వారాంతం కలిసి వచ్చేటట్లు ఆఫీసుకు ఒకరోజు శలవుపెట్టి  పదేళ్ళ మా చిట్టి తల్లి సుమని అత్తగారికి అప్పచెప్పి జానకి వాళ్ళ ఊరు బయలుదేరాను.

 

"ఆల్ ద బెస్ట్ భావనా, నువ్వు సాధించగలవని నాకు నమ్మకం . ఎన్నో జంటలని కలిపావు, నీ ప్రాణ స్నేహితురాలి విషయంలో ఫెయిల్ అవ్వవని తెలుసు, జాగ్రత్త" అంటున్న పవన్ కేసి కృతఙతతో చూసి సీట్లో కూర్చున్నాను.

 

***

"నువ్వు వస్తావని నాకు తెలుసు  కానీ ఇలా రెక్కలు కట్టుకుని ఎగిరొస్తావనుకోలేదు "  అంది గుమ్మంలో నన్ను చూసిన జానకి నవ్వుతూ .

 

ఏడ్చి దిగులుగా ఉంటుందనుకున్న జానకి అలా లేకపోయేసరికి ఊపిరి పీల్చుకున్నాను, అసలు జానకి నిజమే చెప్పిందా అన్న ఆలోచన నన్ను నిలవనివ్వడంలేదు.శ్రీరాం కూడా మామూలుగానే ఉన్నాడు.కుశల ప్రశ్నలు వేసి ఆఫీసుకెళ్ళిపోయాడు.

 

"నేను శలవు పెట్టడం కుదరదే, నీకు అమ్మ తోడుగా ఉంటుంది" అంది కాసేపాగి ఆఫీసుకు బయలుదేరుతున్న జానకి.

 

"అంటే? నా కన్నా ముందే వీళ్ళ విషయం జానకి వాళ్ళ అమ్మగారికి తెలిసిపోయిందన్నమాట" అనుకుంటుండగానే భవానీ ఆంటీ లోపలనుండొచ్చారు.రాత్రంతా ప్రయాణం చేసి రావడం వల్ల టిఫిన్ తినగానే నిద్రపోయాను. పన్నెండింటికి లేచి హాల్లోకి వచ్చేసరికి భవానీ ఆంటీ కూర్చుని ఏదో భక్తి చానెల్ చూస్తున్నారు.మా కాలేజీ రోజుల్లో కూడా ఎప్పుడూ ఆంటీతో  పెద్దగా మాట్లాడింది లేదు. అప్పట్లో ఆవిడ ఉద్యోగం చేసేవారు. అందువల్ల నేను జానకి వాళ్ళింటికి వెళ్ళడం కంటే జానకే మా ఇంటికి ఎక్కువ వచ్చేది.

 

ఏమి మాట్లాడాలో తెలీక  వెళ్ళి అలా ఆంటీ పక్కన కూర్చున్నాను.”పూజలూ అవీ చేస్తావా భావనా?”ఆంటీ నుండి ఊహించని ఆ ప్రశ్నకి తత్తరపడి “ఏదో వచ్చినంత మేర ఆంటీ” అన్నాను ఏమనాలో తెలీక.

 

“ఇంట్లో పెద్దవాళ్ళెవరూ ఉండరా?” ఇంకో ప్రశ్న దూసుకొచ్చింది ఆవిడ నుండి.

 

“అత్తగారు, మామగారూ ఉంటారాంటీ,వాళ్ళు వాళ్ళ పూజలు చేసుకుంటారు” అన్నాను మెల్లగా.

 

“కేవలం రోజువారీ పూజలేనా? హోమాలూ, ఇతర పూజల సంగతీ?”అని అడిగారావిడ. ఈ భక్తి ప్రశ్నల పరంపర ఏమిటీ అనుకుంటూనే వస్తున్న విసుగుని అణచుకుని,  “ఏదో మా అత్తగారు మామగారూ అప్పుడప్పుడు ఏదన్నా చేయించాలంటే చేయిస్తాము” అని చెప్పాను

 

“అదేమిటమ్మాయ్,ప్రతీ సంవత్సరం జాతకం ఎలా ఉందో చూసి పరిహారాలూ అవీ చేయించరా?” ఆంటీ ఆశ్చర్యం ప్రకటించింది.

 

“లేదు” అన్నాను ముక్తసరిగ. నా విసుగుని పసిగట్టిన ఆంటీ ఇంక ప్రశ్నించలేదు.

 

మళ్ళీ కాసేపాగి ఆవిడే “నేను నిత్యం వీళ్ళ జాతకాలన్నీ దగ్గరబెట్టుకుని చూస్తూ వీళ్ళ ఉద్యోగంలో అభివృద్ధి కోసం లేదా అనారోగ్యాల బారిన పడకుండా పరిహారాలు అవీ సూచిస్తుంటాను” అన్నారు.

 

“అవునా” అన్నాను ఇంక ఆసక్తి కనపరచకుండా.

 

“కానీ ఏమిటో ఇలా చెప్తున్నందుకు శ్రీరాం ఈ మధ్య జానకిని కోప్పడుతున్నాడు.వాళ్ళ మంచి కోసమే కదమ్మా నేను చెప్పేది. మొన్న నేను చెప్పిన హోమం చేయించి ఉంటే అక్షయ్ అనారోగ్యం బారిన పడి ఉండేవాడు కాడు” అన్నారు ఆంటీ.

 

నా నుండి మౌనమే సమాధానం కావడంతో అంటీ ఇంక రెట్టించలేదు. మళ్ళీ వెంటనే ఆవిడే  “పద భోజనం చేద్దాము” అనడంతో ఇద్దరమూ టేబుల్ దగ్గర చేరాము. భోజనంఅసలు రుచీ పచీ ఉన్నట్లు లేదు.”జానకి ఇంత భయంకరంగా వంట చేస్తుందా?” అని ఆశ్చర్యపోయాను. నాకు తెలిసి దానికి వంట బాగానే వచ్చు మరి.

 

నా ఇబ్బంది పట్టించుకోని ఆంటీ మాత్రం  “నేను వచ్చేవరకూ వీళ్ళకి అసలు ఆరోగ్యం గురించి అవగాహనే లేదమ్మాయ్,నేను వచ్చి వాళ్ళ వంటల్లో మార్పులు చేసాను” అనడంతో అసలు కధ అర్ధమయ్యింది.అతి కష్టం మీద భోజనం ముగించాను.

 

మరునాడు అందరమూ సూపర్ మార్కెట్టుకి బయలుదేరాము.అక్షయ్ ముందు సీట్లో  కూర్చుంటా అన్నా కానీ వాళ్ళ అమ్మమ్మ బలవంతంగా వాడిని తన దగ్గర కూర్చోబెట్టుకోవడం,శ్రీరాం విసుగు, జానకి నిస్సహాయతా నా దృష్టి దాటిపోలేదు కానీ ఏమీ ఎరగనట్లే కార్లో కూర్చున్నాను. 

 

కార్లో ఉన్నంతసేపూ ఆంటీ తనకి హోమియో వైద్యం కూడా తెలుసనీ,వాళ్ళ వీధిలో పూజలూ పునస్కారాలంటే తననే సంప్రదిస్తారనీ,నియమ నిష్ఠల్లో తను ఎవరికీ తీసిపోననీ ...ఇలా ఆవిడ స్వోత్కర్షే సరిపోయింది. ఓ దశలో వినలేక విసుగొచ్చింది కూడా. “ఊ”  కొడుతూ అలా కిటికీ లోంచి చూస్తూ కూర్చున్నాను.

 

సూపర్ మార్కెట్టులో కూడా ఆంటీ అక్షయ్ చెయ్యి వదలట్లేదు. వాడేమో “నాన్న” అని ఏడిస్తే “నాన్న నాన్న అంటావేమిటి ఎప్పుడూనూ, నిన్ను పెంచింది నేను కాదూ?” అని వాడికి ఒక జెల్లకాయ ఇవ్వడంతో వాడు మరింతగా “నాన్న కావాలి” అని మారాం చెయ్యడంతో శ్రీరాం దగ్గరకి పంపించక తప్పింది కాదు ఆవిడకి.

 

నాన్న దగ్గరకి వెళ్ళిన అక్షయ్ ఎంతో ఉత్సాహంగా  కబుర్లు చెప్తోంటే శ్రీరాం ఆనందాన్ని చూడటానికి నా రెండు కళ్ళూ చాలలేదు. జానకి మాత్రం ఆంటీతోనే ఉంది.కాసేపయ్యాకా నేను జానకిని ఏదో మిషతో శ్రీరాం వాళ్ళ దగ్గరకి పంపించాను.

 

వెంటనే నేను ఆంటీనీ తీసుకుని పక్క షాపుకి వెళ్ళాను.అవసరం లేకపోయినా అవీ ఇవీ చూస్తూ ఆంటీని నాతో ఒక గంటసేపు ఉంచి అప్పుడు వెళ్ళాము శ్రీరాం వాళ్ళ దగ్గరకి. వెళ్ళేసరికి అక్షయ్ ఉయ్యాల  ఎక్కి ఊగుతోంటే జానకీ, శ్రీరాం ఆ పక్కనే కూర్చుని వాడిని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఐస్క్రీం తింటున్నారు.

 

“అబ్బబ్బా..ఆ ఐస్క్రీములు తినద్దని చెప్తే వినరు వీళ్ళు”అంది ఆంటీ మొహం మాడ్చుకుని.పాపం వెంటనే జానకి లేచి చేతిలో ఉన్న ఐస్క్రీం పారేసి  ఆంటీ దగ్గరకొచ్చి కారు వైపు దారితీసింది.

 

నాకు పరిస్థితి కొంచెం కొంచెం అర్ధం కాసాగింది కానీ జానకో, శ్రీరామో ఎవరో ఒకళ్ళు ఇదీ సమస్య అని విపులంగా చెప్తేనే నా అనుమానం నిజమో కాదో తెలుసుకోవచ్చు. 

 

ఆ సమయం కూడా మరునాడే అనుకోకుండా చిక్కింది.పొద్దున్నే టిఫిన్లయ్యాకా అక్షయ్ వాడి, బొమ్మలూ, పుస్తకాలు ఉత్సాహంగా నాకు చూపిస్తున్నాడు.. ఆంటీ వంటింట్లో ఉన్నారు. ఆవిడ అక్కడ ఉన్నారన్న మాటే కానీ అక్షయ్‌ని  ఒక పది మార్లయినా పిలిచిఉంటారు తన దగ్గరకి రమ్మని. నాకు కొంచెం ఆవిడ ప్రవర్తన ఆశ్చర్యమనిపించినా పట్టించుకోలేదు.

 

కూరలు తేవడానికి జానకీ, శ్రీరాం బయలుదేరబోతుండగా “నేనూ వస్తాను” అంటూ ఆంటీ జత కలిసారు.శ్రీరాం వెంటనే ఏదో పనున్న వాడిలా వెనక్కొచ్చి “జానకీ, బాస్ ఫోన్ చేస్తున్నాడు, మీరు వెళ్ళి రండి” అని వాళ్ళిద్దరినీ పంపించేసాడు.

 

“అసలు మీ సమస్య ఏమిటి అని శ్రీరాం ని ఎలా అడగడం?” అని నేను మధనపడుతుండగా శ్రీరాం వచ్చి “కొంచెం మీతో మాట్లాడాలి” అన్నాడు.

 

శ్రీరాం తనంతట తానే వచ్చి అలా అనేసరికి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాను.అక్షయ్‌కి నేను వాడికోసం తెచ్చిన బొమ్మలు,కొత్త పుస్తకం ఇచ్చి   శ్రీరాం ని అనుసరించాను.

 

“ జానకీ, అక్షయ్ లేకుండా నేను ఉండలేనండీ” అన్నాడు కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లుతుండగా.

 

 శ్రీరాం కొనసాగించాడు.“నేను జానకిని ఇష్టపడి చేసుకున్న మాట నిజమే.అంత మాత్రం చేత మా అమ్మా నాన్నలకి దూరమవ్వాలంటే మాత్రం ఎలా చెప్పండి? పాపం భర్త నిరాదరణకి గురి అయ్యి, ఒంటరిగా ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లలని పెంచారు అని ఆంటీ మీద చాలా గౌరవం ఉండేది. అందుకే ఆవిడ ఏది చెప్పినా వినేవాడిని.అదే నేను చేసిన తప్పు అని తెలుసుకునేసరికి నా జానకి నాకు కాకుండా పోతోంది.

 

ప్రతీ నెలా ఏదో హోమాలూ,పూజలూ అంటారు.ప్రతీ నెలా నాలుగైదు శలవలు ఎలా చెప్పండి?కాదంటే “పెళ్ళయిన కొత్తలో లాగ లేను,ఈ మధ్య వాళ్ళమ్మని నిరాదరిస్తున్నా” అని జానకికి కోపం.

 

అక్షయ్‌ని నా నుండి ఎంత వీలయితే అంత దూరం పెట్టాలనెందుకు అనుకుంటున్నారో అర్ధం కావడం లేదు. వాడు పుట్టినప్పుడు జానకి పుట్టింట్లోనే ఉంది.ప్రెగ్నెన్సీలో నా దగ్గరే ఉండమన్నాను కూడా, కావాలంటే సాయానికీ ఆంటీనో మా అమ్మనో పిలుద్దామని.మొదట జానకి సరే అంది, కానీ ఏమయ్యిందో తెలీదు, ఒకరోజు ఆంటీ ఫోను చేసారు, జానకి నిర్ణయం మార్చుకుని వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తానంటే ఒప్పుకున్నాను, ఆడపిల్లలకి ఆ సమయంలో పుట్టింటి మీద మనసు మళ్ళడం సహజమే కదా అనిపించింది.

 

వాడు పుట్టాకా పదిహేను రోజులు అక్కడే ఉన్నాను. అమ్మా వాళ్ళేమో అందరూ ఉన్నాము కాబట్టి బారసాల చేద్దామన్నా కానీ ముహుర్తం వగైరా అంటూ ఆంటీ ఒప్పుకోలేదు.మేము తిరిగి వచ్చిన మూడోరోజే అకస్మాత్తుగా బారసాల చేసి జాతకం ప్రకారం అంటూ తనకి నచ్చిన పేరుకూడా పెట్టేసింది ఆవిడే.మనసు చివుక్కుమన్నా ఏమీ అనలేదండీ.

 

మూణ్ణెల్లకి జానకి నా దగ్గరకి వచ్చింది. వాళ్ళిద్దరినీ చూసి నా ఆనందానికి అవధుల్లేవు.చంటి పిల్లాడిని చూసుకోవడంలో జానకికి నా శాయశక్తులా సాయమందించాను.ఏమయ్యిందో తెలీదు, ఒక్క రెణ్ణెల్లకే  “చంటి పిల్లాడితో చేసుకోలేకపోతున్నా” అంటూ జానకి మళ్ళీ వాళ్ళమ్మ దగ్గరకి వెళ్ళిపోయింది.

 

“ఆవిడ ఉద్యోగస్తురాలు, ఇంట్లో ఉండరు కదా, సాయం కావాలంటే మా ఇంటికి వెళ్ళు, అమ్మ ఉంటుంది కదా” అని నచ్చ చెప్పాలని చూసాను. ఊహూ..వినలేదు.”సాయం కావాలంటే అమ్మ వాళ్ళ పక్క ఫ్లాట్లో వాళ్ళున్నారన్న” సమాధానం విని ఇంక నేను రెట్టించలేదు. 

 

జానకి అక్కడకి వెళ్ళిన కొద్ది రోజులకే ముహుర్తం బాగుంది అంటూ వాడి అన్నప్రాశన కూడా  నేను లేకుండానే చేసారు. నాకు తెలీక అడుగుతాను ముహుర్తం అంటే ఆరోజుకి ఆరోజు వచ్చేది కాదు కదండీ, కనీసం ముందు రోజైన మాకు చెప్పాలి కదా? 

 

మొదటి మనవడిని ఊరు తీసుకెళ్ళాలని పాపం అమ్మా వాళ్ళకి ఎంత ఆశగా ఉండేదో, నేను ఎంతో బ్రతిమాలిన మీద  జానకి ఒక్కపూట మాత్రం ఉండి వచ్చేసింది.

 

ఒక్కటి అని కాదండీ , ఏదైనా ఆంటీ ఆధ్వర్యంలోనే జరగాలి,జానకి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడకూడదు, నాతో సరదాగా బయటకి రాకూడదు.పైగా అక్షయ్ పుట్టిన నక్షత్రం మంచిదికాదుట,వాడి ఆరోగ్యం బాగోదు అంటూ ఒకసారి హోమం ఇంకోసారి యాగం చెయ్యాలంటారు , ఇంకోసారి ఎక్కడికో వెళ్ళి చేపలకో, కుక్కలకో ఆహారం వెయ్యాలంటారు .వాడు తుమ్మినా దగ్గినా నా దగ్గరకొచ్చి “వాడు పుట్టిన  నక్షత్రం బాలేదు” అని పది సార్లంటే ఒక తండ్రిగా నాకుఎంత బాధగా ఉంటుంది?అది నా చేతిలో లేనిది కదా.

 

ఎప్పుడైనా అలా సరదాగా ఇద్దరమే బయటకెళ్ళినా ఆవిడ సహించలేరు..ఆరోగ్యం పేరుతో ఎలాగూ ఇంట్లో రుచిగా వండుకోనివ్వరు,ఎప్పుడో ఒక్కసారైనా ఇద్దరం అలా బయటకెళ్ళి ఫలానాది తినాలనుకోవడం కూడా తప్పే అంటే ఎలా?.నోరెత్తితే “మా అమ్మ మన గురించి అంత తపన పడుతోంటే నీకు అర్ధం కావట్లేదు” అని జానకి నిష్ఠూరమాడేది.

 

జానకి అడిగిందని ఒక ఆదివారం సరదాగా వంట వండిపెట్టాను, ఆరోజు సాయంత్రం అనుకోకుండా ఆంటీ వచ్చి,”ఏమిటి ఈ తిండి, ఇలాగేనా తినేది?” అనడంతో జానకి వెంటనే అంతా చెత్త బుట్టలో పడేసింది.ఆరోజు కోపం ఆపుకోలేక జానకితో గొడవ పెట్టుకున్నాను, “అంత ఆరోగ్యకరం కానప్పుడు మధ్యాహ్నం ఎందుకు తిన్నావంటూ?”.

 

అది చిలికి చిలికి గాలి వాన అయ్యి ఇంక నేను ఏది మాట్లాడినా జానకి పెడర్ధాలు తియ్యడం మొదలెట్టింది.ఆవిడ జోక్యం శృతిమించుతోంది అని ఒకసారి జానకితో సున్నితంగా అన్నందుకు, నేను వాళ్ళమ్మని వద్దంటున్నా కాబట్టి నేను జానకికి అక్కర్లేదుట.

 

ఆవిడ మీద ఎంత కోపం ఉన్నా కానీ,పెద్దావిడ కాబట్టి  ఆవిడ వయసుని దృష్టిలో పెట్టుకుని నేను ఆవిడని గౌరవిస్తాను,ఈ పూజలూ అవీ  సరైనవా కాదా అని కూడా నేను వాదించను.ఆవిడ మా మంచి కోసమే చెప్తుండచ్చు, ఎదురు చెప్పట్లేదు కదా అని ఊరుకుంటోంటే ఆవిడ జోక్యానికి అంతు ఉండట్లేదు.ఈవిడ చేయించే పూజల గురించి నేను మా ఊరి గుడిలో పూజారి గారిని అడిగాను.ఆయనే ఆశ్చర్యపోయారు ఈవిడ చేయించే పూజలూ అవీ చూసి.

 

అసలు కొన్ని చేయించడానికి అందరికీ అర్హత  లేదు అని కూడా చెప్పారు. అదే మాట ఆంటీతో అంటే “ఫలానా వారే పూజలు చేయించాలి అని ఎక్కడా లేదు,అవన్నీ మనం పెట్టుకున్న నియమాలు శ్రీరాం,నేనూ చదివాను గ్రంధాలన్నీను” అనేసరికి ఏమనాలో తెలీలేదు.

 

అక్షయ్‌కి నానమ్మా, తాతలని ఫోనులో పలకరించడమే తప్ప ఈ ఆరేళ్ళలో గట్టిగా ఓ రెండ్రోజులు వాళ్ళు వచ్చినదీ లేదు మేము వెళ్ళి ఉన్నదీ లేదు.ఎప్పుడన్నా జానకి మా ఊరు వద్దామని తయారయినా వెంటనే వాళ్ళమ్మకి ఫోను చేసి చెప్పేది.” ఆ ఊరిలో నువ్వు ఎలా ఉండగలవూ” అంటూ ఆవిడ దీర్ఘాలు తీసేసరికి అన్నీ క్యాన్సిల్. జానకి అడుగు తీసి అడుగెయ్యాలన్నా, ఇంట్లో చిన్న వస్తువు కొనాలన్నా వాళ్ళ అమ్మ అనుమతి  అనట్లు తయారయ్యింది పరిస్థితి.

 

సంవత్సరంలో దాదాపు ఆరు నెలలు మా ఇంట్లోనే ఆవిడ మకాం.పెద్దవారు కాబట్టి ఆసరాగా ఉంటారనుకుంటే ఆవిడవల్ల మా మధ్య అనవసర కలతలు రేగుతున్నాయి అనిపిస్తోంది.

ఆవిడ వస్తే అక్షయ్‌ని అందరితో ఆడుకోనివ్వరు. “వాళ్ళు ఫలానా మతం, కులం” అంటూ ఆ చిన్ని బుర్రలో కూడా లేని పోనివి నాటేవారు.దీనితో వాడికి ఇల్లు తప్ప వేరే లోకం లేదు. 

 

ఏమన్నా అంటే “మా అమ్మ ఒంటరిది, ఎవరు చూసుకుంటారు?” అంటూ జానకి ఏడుపు.

“నా కుటుంబంతో నేను సరదాగా సమయం గడపాలి,మా అమ్మా నాన్నలు కూడా మనవడితో ఆడుకోవాలి, వాడికి పెద్దనాన్నలు, అత్తల కుటుంబాలు తెలియాలి,పిల్లవాడు బయటకెళ్ళి సరదాగా పిల్లలతో ఆడుకోవాలి ” అని ఆశించడమే  తప్పంటే ఎలాగ?

 

ఈవిడ ఇలా ఉండబట్టే జానకి వాళ్ళ అన్నయ్యా,వదినా దూరం పెట్టారని అర్ధమయ్యింది” అని ఆగాడు శ్రీరాం.

 

ఇంతలో బయటకి వెళ్ళిన వాళ్ళు తిరిగొచ్చారు.శ్రీరాం విడాకులు కోరుకోవట్లేదు అని నాకు అర్ధమయ్యింది, ఇంక జానకి సంగతి చూడాలి అనుకున్నా.

 

సాయంత్రం వాకింగుకి అని చెప్పి జానకిని ఒక్కదానినీ పార్కుకి లాక్కొ చ్చాను.“శ్రీరాం నుండి విడివడి బ్రతకగలవా?” సూటిగా అడిగాను దానిని.

 

“నా ఉద్యోగం ఉంది, వాడిని చూసుకోవడానికి అమ్మ ఉంది, ఎందుకు ఉండలేను” శూన్యంలోకి చూస్తూ జవాబిచ్చింది జానకి.“నిన్ను నువ్వు మోసం చేసుకోకు జానకీ,నిజంగా నీకు శ్రీరాం అంటే అయిష్టమేనా,విడిపోయేంత గొడవలున్నాయా?” మళ్ళీ అడిగాను.

 

“లేవనుకో, కానీ అమ్మ ఏమో మా మంచి కోసమే చెప్తుంది,ఇదివరకట్లాగ శ్రీరాం అమ్మని చూడట్లేదనిపిస్తోందే.ఇప్పటికే వదిన మోజులో పడి అన్నయ్య అమ్మని నిర్లక్ష్యం  చేసాడు,నేను కూడా చూడకపోతే….నిజం చెప్పొద్దూ నాకు శ్రీరాం కావాలి, అక్షయ్ కి తండ్రి ప్రేమ కావాలి,కానీ అమ్మ ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటుంది,అమ్మని ఎప్పటికీ నా దగ్గరే పెట్టుకుందామంటే  శ్రీరాం పడనిచ్చేటట్లు లేడు” వెక్కుతూ ఆపింది జానకి.

 

అది ఏడుస్తోందే కానీ నాకు సంతోషమేసింది,”హమ్మయ్యా, సమస్య ఎక్కడుందో అర్ధం కాకపోవడం వల్ల  విడాకులంటోంది కానీ నిజంగా దీనికి శ్రీరాం అంటే అయిష్టం లేదు” అని.

 

“ఊరుకోవే..అయినా అమ్మని చూడకపోతే ఎలాగ? కని పెంచి పెద్దచేసిన ఆవిడ కదా.శ్రీరాంకి అర్ధమయ్యేటట్లు చెప్పు, లేదంటే విడాకులు తీసుకుందువుగాని,ఏడవకు” అన్నాను.నాకు సమస్య  ఇప్పుడు అర్ధమయ్యింది.పరిష్కారం కూడా రూపుదిద్దుకుంది.

 

“నాకు మాత్రమే  అన్నీ తెలుసు, నేనే కరెక్ట్” అన్న అహంకారం నరనరానా జీర్ణించుకుని, తన మాట నెగ్గించుకోవడం కోసం తనకి తెలీకుండానే  కూతురి కాపురంలో కలతలు రేపుతున్న ఆంటీని మార్చడానికి ప్రయత్నించే కంటే, తన కాపురంలో వాళ్ళ అమ్మ జోక్యం శృతిమించింది అని జానకికి అర్ధం అయ్యేటట్లు చెప్తే చాలు అనిపించింది.

 

మరునాడే మా ఊరు తిరుగు ప్రయాణమయ్యాను

***

 కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు ఏదో పెళ్ళికి వెళ్ళాలి,ఇంకా ఏదో పని కూడా ఉంది అంటూ అక్షయ్‌తో ఓ నాల్రోజుల కోసం మా ఊరొచ్చింది జానకి.మా ఊరొచ్చి హోటల్లో దిగడమేమిటని రూం ఖాళీ చేయించి దాని సామానంతా కారులో పెట్టాను,"మీ అత్తగారూ వాళ్ళూ ఏమనుకుంటారో?" అని అది అరిచి గీ పెడుతున్నా కానీ వినకుండా.

 

"అమ్మాయ్, రేపు సుమని స్కూలు మానిపించు,పొద్దున్న ఎనిమిదింటికి పూజ మొదలు" ఆర్డరేసింది మా అత్తగారు నేను ఇంట్లో అడుగుపెడుతూనే.

 

"అమ్మా..ప్లీజ్ నానమ్మకి చెప్పు,పది రోజుల క్రితమే స్కూలు ఎగ్గొట్టాను, ప్రతీసారీ మా టీచర్లకి కారణం చెప్పలేకపోతున్నా.."నన్ను చుట్టుకుని ఏడుస్తోంది మా పదేళ్ళ చిట్టి తల్లి సుమ ."ఇప్పుడు స్కూలు మానిపించి చెయ్యాల్సిన అర్జెంటు పూజలేమిటే?" ఆశ్చర్యంగా అడిగింది జానకి."సాయంత్రం మా అత్తగారు వాళ్ళు గుడికెళ్ళాకా వివరంగా చెప్తాలే" అన్నాను లో గొంతుకతో.

 

సాయంత్రం అత్తయ్యగారు,మామయ్యగారూ రేపటి పూజ గురించి మరలా ఒక్కసారి అన్నీ ఉన్నాయో లేదో చూడమని చెప్పి గుడికి బయలుదేరారు.వాళ్ళు వెళ్ళాకా నేను జానకికి చెప్పడం ప్రారంభించాను

 

"ఏమి చెప్పనే, సుమ  పుట్టిన ఘడియ మంచిది కాదుట,అది పుట్టినప్పటినుండీ ఏవో పూజలూ, హోమాలూ అంటూనే ఉన్నారే.దానికి జలుబొస్తే పూజ, జ్వరమొస్తే హోమం,మార్కులు తగ్గితే జపం అన్నట్లుంది పరిస్థితి, వాళ్ళ మూర్ఖత్వానికి అంతు లేకుండా పోతోంది.అసలు మా అమ్మ వాళ్లయితే వీళ్ళ కంటికి ఆనరు.అన్నీ వీళ్ళకే తెలుసుట.ఏముంది లేవే,కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది,వదిలెయ్" అన్నాను.

 

"అదేంటే? మాధవుడి మీద నమ్మకం ఉండకూడదు అనను కానీ ,మానవ ప్రయత్నం అంటూ ఉండాలి కదా, అది లేకుండా ప్రతీదానికీ ఈ పూజలేమిటే, అయినా పిల్లలకి అప్పుడప్పుడు జ్వరాలూ అవీ మామూలే కదా,ఇదంతా చూస్తూ కూడా పవన్ ఏమీ అనడా" అసహనంగా అంది జానకి.

 

"పవన్ కి చెప్పి చూసానే,మన మంచికే కదా వాళ్ళు చెప్పేది అంటాడు,గట్టిగా వాదిస్తే అత్తా,మామలకి ఎదురుతిరుగుతున్నానంటాడు" అన్నాను.

 

"అస్సలు ఊహించలేదే నువ్విలాంటి పరిస్థితిలో ఉన్నావని,పొద్దున్నుండీ చూస్తున్నాను, సుమని నీ దగ్గరకి రానీయరు కదా మీ అత్తగారు,ఎందుకలాగ?" అంటూ మరో సందేహం వెలిబుచ్చింది.

 

"సుమ  పుట్టినప్పుడు మా అమ్మకి అనారోగ్యంగా ఉండటంతో అత్తగారే అన్నీ చూసుకున్నారు.హమ్మయ్య అత్తగారు చూసుకుంటున్నారు అనుకున్నా కానీ ఆవిడ చూసుకున్నారు అన్న ఒకే కారణంతో ఇలా దానిని నా నుండి దూరం పెడతారనుకోలేదు".అని నిట్టూర్చాను

 

తను ఉన్న నాల్రోజులూ నా మీద మా అత్తగారి పెత్తనం చూసి జానకి మనసు రగిలిపోతోంది అని నాకు తెలుస్తూనే ఉంది.ఓరోజు సాయంత్రం ఇంట్లో ఇద్దరమే ఉన్నాము,వంటింట్లో టీ పెడుతున్న నా దగ్గరికొచ్చింది జానకి.

 

"మీ అత్తగారు చేస్తున్న తప్పే మా అమ్మ  చేస్తోందని అర్ధమయ్యిందే,తల్లితండ్రులనైనా ఇంకెవరినైనా కానీ భార్య భర్తల మధ్యలోకి ఒక పరిధికి మించి ఆహ్వానించకూడదని తెలుసుకున్నాను.నేను నా నిర్ణయం మార్చుకున్నట్లే”  అంది కళ్ళల్లో మెరుపుతో.మళ్ళీ వెంటనే “కానీ నాకు నీ కాపురం గురించే దిగులుగా ఉంది,మరీ ఇబ్బందయితే నువ్వూ, సుమ వచ్చి మా ఇంట్లో ఉందురుగాని, మీరిద్దరూ కొన్ని రోజులు దూరంగా ఉంటే   పవన్ మారతాడేమో" అంది.

 

మరునాడు దానిని రైలెక్కించి వచ్చేసరికి మా సుమ, వాళ్ళ నానమ్మ, తాతలతో కూర్చుని ఏదో మాట్లాడుతోంది.

 

నన్ను చూడగానే "చూడమ్మా, స్కూల్లో డ్రామా కోసం నా పేరుతో తో పాటు నానమ్మ, తాత పేరు కూడా  ఇవ్వాలిట" నవ్వుతూ ఫిర్యాదు చేసింది.

 

"అవును భావనా, మొన్ననే కదా నీ స్నేహితురాలి ముందు మీ అత్తయ్య డ్రామా అంత బాగా రక్తి కట్టించింది,ఆ కళని మెరుగుపరచుకోవాలనుకుంటోందమ్మా" అని మామయ్యగారు అనేసరికి అందరమూ హాయిగా నవ్వుకున్నాము.

*****

bottom of page