top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  2

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా​ మధురాలు

సెల్వి

girija hari.PNG

గిరిజా హరి కరణం

అక్క దగ్గర రెండు రోజులుండి సీనుతో కలిసి మా వూరు బయలుదేరాను. బస్సెక్కి కిటికీ పక్కన కూర్చున్నాను.  కింద నిలబడి అక్క చంకలో ఉన్న బాబు చెయ్యి పట్టుకొని టాటా చెప్పిస్తోంది.

 

పూర్తిగా తెల్లవారలేదింకా. ఆ మసక చీకట్లలోనూ కనబడుతున్నాయి  అక్క కళ్ళనిండా నీళ్ళు .

 

బస్సు కదలబోతుంది. “వస్తానక్కా! లెటర్ రాస్తాను” అంటూ చెయ్యి ఊపాను. అక్క గబగబా నడిచి బస్సు దగ్గరగా వచ్చి  "సెల్వీ !వాళ్ళతో జాగ్రత్తగా వుండు, గొడవ పెట్టుకోకు, వాళ్ళేమైనా చెయ్యగలరు" అంది.

 

ఫరవాలేదక్కా, నీవు ధైర్యం గా ఉండు, చెప్పాగా నీకు, ఎవరూ ఏమీ చేయ్యలేరు, నేను చెప్పింది గుర్తుందిగా” 

 

అంటుండ గానే  బస్సు కదిలింది. టిక్కెట్ట్  తీసుకుని సీటుకి జారబడి కళ్ళు మూసుకున్నాను.  మనసు గతాన్నితడుముకుంటూంది.

 

***

టెంత్ క్లాస్ ఫైనల్ ఎగ్జాం రేపు ఆఖరి పరీక్షకు చదువుతున్నాను. ఇంటి వెనకున్న అరుగు మీద కూర్చుని, పెరటి గోడ కవతలున్న స్ట్రీట్ లైట్ వెలుతురులో, చదువుకు కూర్చునేటప్పటికే పదైంది .

అర్ధరాత్రి గడిచినట్లుంది అమ్మ మళ్ళీ బాధతో మూలుగుతూంది. లేచి వెళ్ళి నొప్పి తగ్గటానికి మాత్ర ఇఛ్ఛి కాళ్ళు వత్తుతూ కూర్చున్నాను.

“ఇంక చాల్లే వెళ్ళి చదువుకో, రేపు ఆఖరు పరీక్ష కదా” అంది అమ్మ. 

అమ్మ నిద్రపోయాక మళ్ళీ పుస్తకాల ముందు కూర్చున్నాను .  చదువుతూ అలాగే పుస్తకాల మీద పడి ఎప్పుడు నిద్రపోయానో ఏమో, వేప చెట్టు కొమ్మల సందులనుంచి ఎండ పొడలు పడుతుంటే మెలకువ వచ్చింది. వేప పూలు పిందెలు రాలిపడున్నాయి పైన.

 

పుస్తకం అట్టమీదున్న వేంకటేశ్వర స్వామికి దణ్నంపెట్టి కళ్ళకద్దుకుని గబ గబా లేచి ముఖం కడుక్కుని గూట్లో వున్న హాల్ టికెట్టు తీసుకుని “అమ్మా వెళ్లొస్తా" అంటూ ఒక్క పరుగున వెళ్లి స్కూలు దగ్గర ఆగాను. ఆఖరు బెల్లు కొట్టేస్తున్నారు. గసపెడుతూ హాల్లో అడుగు పెట్టాను.  ఎగ్జాం రాసేసి బయటికి రాగానే సీను పరిగెత్తుకుంటూ వచ్చాడు.

 

“అక్కా నీకోసమే చూస్తున్నానే, అమ్మ మాట్లాడటం లేదు. పక్కింటత్త నిన్ను పిలుచుకురమ్మంది. వాడి చెయ్యి పట్టుకుని పరుగెత్తాను. అమ్మను దింపి నేలమీదుంచారు. తలదగ్గర దీపం వెలిగిస్తుంది మాణిక్యమ్మ. గుండె గొంతు దాటి బయటకొచ్చేస్తుందా అన్నంత దుఃఖం వెళ్లుకొచ్చింది. సాయంత్రానికంతా వూరు దాటించారు. అమ్మను మరునాడు అక్క కామాక్షి వచ్చింది వాళ్ల అత్త గారితో కలసి రాయదుర్గం నుంచి ఆఖరు చూపులు కూడా దక్కలేదని నెత్తినోరు బాదుకొని ఏడిచింది. 

 

పది రోజులు గడిచాయి. కామాక్షి వాళ్లత్త గారు మస్తానమ్మ మాణిక్ష్యంతో కలసిపోయి తెగ పెత్తనం చేసేస్తున్నారిద్దరూ. కర్మ జరిగిపోయింది. "రేప్పొద్దున మేం వూరెళ్తున్నాం తమ్ముడు, సెల్విని కూడా మాతో పంపించు. కొన్నాళ్లు మాతో వుండి కాస్త మనసు ఆర్చుకొని వస్తుంది" అని నాన్ననడిగింది మస్తానమ్మ రాత్రి అన్నాలు తింటుంటే. 

నాన్న వెంటనే ఒప్పేసుకుని నాతో "అత్తతో వెళ్లు. తమ్ముడ్ని కూడా తీసుకెళ్లు. కొన్నాళ్లాగి నేనొచ్చి తీసుకొస్తాను" అన్నాడు

మాణిక్యమ్మ ముఖం వెలిగిపోయింది. "అత్తమ్మ మాట విని జాగ్రత్తగా వుండండి. ఒంటిగా పరిగెత్తి రాకండి, రోజులు బాగా లేవు. మీ నాన్న వీలు చూసుకుని వస్తారు, మిమ్మల్ని తీసుకొస్తాడు."  అంటూ మా యిద్దరిని ప్రయాణం చేయించింది. 

 

మాణిక్యమ్మ భర్త పెళ్లయిన రెండేళ్లకే యిల్లొదిలి ఎటో వెళ్లి పోయాడు, అప్పటినుండి యిక నాన్న వాళింట్లోనే వుండటం. అప్పుడప్పుడూ యింటికొచ్చి కాసేపున్నా అమ్మమీద చిర్రుబుర్రలాడుతూ దాష్టీకం చెయ్యటం, అమ్మ నోరెత్తితే దెబ్బలు, అమ్మ జబ్బు పడ్డాక కొట్టటం మాత్రం తగ్గింది. 

 

అమ్మపోగానే  మాణిక్యమ్మ ఆమె  చెల్లెళ్ళు ఇద్దరూ కూడా యింట్లో చేరిపోయారు , పెద్దామె భర్తనొదిలేసొచ్చి వాళ్ల అక్కదగ్గరే వుంటుంది . చిన్నామెకింకా పెళ్లి కాలేదు. వాళ్ల మాటలు జోకులూ నవ్వులూ చూస్తుంటే చిరాకుగా వుంది. ఇంట్లో వుండబుద్దవటం లేదు. రిజల్ట్స్ రావటానికింకా టైముంది కదా అని అక్క వాళ్ల తో బయలు దేరాను సీనుని తీసుకొని.

                                                     ***

ఒక నెల గడిచింది, అక్క పరిస్ధితి కూడా అంతంత మాత్రంగానే వుంది. తెల్లారకముందే లేచి వెళ్లి రెండిళ్లలో వంట పని. తర్వాత యింకో యింట్లో సాయంత్రం దాకా పిల్లల్ని చూసుకోటం యింటికొచ్చి వంట పని నీళ్లు తేవడం. ఒక్కనిమిషం తీరిక లేకుండా చేస్తుంది. అక్కను చూస్తే అయ్యో అనిపించి. ఆమెతోబాటు వెళ్లి సాయం చేస్తూ వున్నాను.

 

ఇంతలో అక్కకు వేవిళ్లు మొదలయినాయి. ఒకటే వాంతులు. నీరసించిపోతుంది. ఆమెను ఇంటి దగ్గరుండమని నేనే మూడిళ్లు పని పూర్తి చేసి సాయంత్రం యింటికొస్తున్నాను. అక్క భర్త ఏం పనిచేస్తాడో, తెల్లవారుజామునే వెళ్లిపోయి అర్ధరాత్రి వస్తాడింటికి. యిక మస్తానత్త ఆవిడ చేసే పెత్తనాలు చేస్తుంది. చీటీలు కట్టించుకోవటం యింకా ఏవేవో చేస్తూ తిరుగుతూ వుంటుంది. 

 

ఆమె చిన్నకొడుకు ఎప్పుడూ ఎక్కడో తిరుగుతూ డబ్బు కావలసినప్పుడు యింటికి వస్తాడట. వాళ్లమ్మ చిన్నకొడుకు రాగానే రాచమర్యాదలు చేసి అడిగినంత డబ్బులిచ్చి పంపుతుందట. మూడోది ఆడపిల్ల. దానిని సినిమాలకు షోకులకూ డబ్బివ్వకపోతే నట్టింట్లో కాళ్ళు బార్ల చాపి శోకాలు పెడుతుంది. ముసలాయన అరుగు మీద కూర్చుని దగ్గుతూ వుంటాడు. ఆయన ముఖం చూసేది ఆ యింట్లో అక్క మాత్రమే. - "మీ బావ రాత్రి పగలూ కష్టపడి తెచ్చింది  ఆమె చిన్న కూతురికీ, కొడుకుకి యిస్తుంది, కానీ కనీసం ముసలాయన బతిమాలినా పైసా యివ్వదు. నేను పని చేసే యిళ్లకొచ్చి నెలవగానే జీతం డబ్బులు తీసుకెళుతుంది." అంటూ బాధ పడింది అక్క. 

                                                  ***

రిజల్ట్స్ వచ్ఛేశాయి. సెకండ్ క్లాసులో పాసయ్యానని సంతోషంగా నాన్నకు లెటర్ రాశాను. జవాబు మాణిక్యమ్మ చెల్లెలు రాసింది.  "బావ ఏదో బిజినెస్ పెట్టాడు. ఇప్పుడే రాలేడట. తీరిక చూసుకొని నీకు జాబు రాస్తానన్నాడు. నీవు తొందరపడి రావద్దని చెప్పమన్నాడు." అని రాసింది.

 

"బావ" అని రాసిందేమిటి? నాన్న, మాణిక్యమ్మ పెళ్లి చేసుకున్నారా? అమ్మ గుర్తొచ్చి కన్నీళ్లు ఆగలేదు నాకు. 

రోజులు గడుస్తున్నాయి. తెల్లవారుజామునే వెళ్లి రెండిళ్ల పని అయ్యాక, మూడో ఇంట్లో ఉండే ఆవిడ పద్మక్క. పద్మక్క వాళ్ల పిల్లలిద్దరినీ చూసుకొని సాయంత్రం యింటికొస్తున్నాను. పిల్లలు నాకు బాగా మాలిమి అయ్యారు. పద్మక్క కూడా మంచిదవటంతో అపుడపుడూ కష్టసుఖాలు మాట్లాడుకునేదాన్ని.

 

మస్తానత్త బాగానే చూస్తుంది నన్ను, సీనును. కానీ, ఆమె చిన్న కొడుకు ఇంటికి రాగానే వాడికి అవి, యివి అందివ్వమని  స్నానానికి నీళ్లు పెట్టమని అన్నం వడ్డించమని పురమాయిస్తుంది నన్ను. నాకు తెగ చిరాకనిపిస్తుంది. యీ మధ్య ఎక్కువగా యింట్లోనే వుంటున్నాడు. పళ్లికిలించటం చొరవ తీసుకొని మాట్లాడటం. అప్పుడప్పుడు ఒంట్లో బాగాలేదని యింట్లోనే పడుకుంటున్నాడు. 

 

సేవలు చేయమని వాళ్లమ్మ నస భరించలేక పోయాను "వరుసేగా, మా దేవేందర్ ని చేసుకో. అక్కా చెల్లెళ్లిద్దరూ ఒక్కింటిలోనే వుండి హాయిగా కాపురాలు చేసుకోవచ్ఛు" అంటూ మొదలు పెట్టింది. ఓ సారి ఖచ్చితంగా చెప్పేశానామెకు "నాకిప్పుడే పెళ్లిచేసుకునే వుద్దేశంలేదని. డిగ్రీ చేసి వుద్యోగం చేస్తానని."

"ఓ! నీవు యింకా మీ నాన్న తీసుకెళ్లి చదివిస్తాడనే అనుకుంటున్నావా." మీ నాన్న పెళ్లి చేసుకున్నాడుగా 

నీకు తెలియదా? ఇంకేమొస్తాడు, నిన్ను తీసుకెళ్తాడు? నేను చెప్పినట్టు విని మావాడిని చేసుకో. 

నీ తమ్ముడు యిక్కడే వుండచ్చు నీ మంచికే చెబుతున్నా విను "అంటూ నా తల నిమురుతూ అక్కను పిలిచి 

మీ చెల్లెలికి నచ్చచెప్పు, చిన్నపిల్ల కదా. ఏదో డాంబికాలు పోతూ వుంది. నీవే ఒప్పించాలి " అంటూండేది. 

తర్వాత అక్క చెప్పింది. "వాడికేదో జబ్బులా వుంది. చూశావుగా అస్థిపంజరంలా ఎలా వుంటాడో వాడికి 

నిన్నివ్వాలట. మా అత్త ఎంతకైనా తెగిస్తుంది. జాగ్రత్తగా వుండు. నాన్నదగ్గరకెళ్లి పోతే మంచిదేమో 

మా అత్త ఆ మాణిక్యమ్మ జాబులు రాసుకుంటున్నారు." అంది.

 

పద్మక్క తో చెప్పుకుని ఏడ్చాను -"ఇంటికెళ్లాలంటే భయంగా వుందక్కా! " అన్నాను.

"వెళ్లొద్దులే మా యింట్లోనే వుండు మస్తానమ్మ అడిగితే పద్మక్క ఆఫీసు పనితో బిజీగా వుంది, చిన్నబాబు యేడుస్తాడని కొద్దిరోజులు రాత్రుళ్లు కూడా వుండమందని చెప్పు!" అంది.

 

నాన్న దగ్గరకి వెళ్లినా ఫలితమేమి ఉండదనిపించింది. పద్మక్క వాళ్లింట్లోనే వున్నాను .  

 

ఒక రోజు పద్మక్క చెప్పింది “సెల్వి సార్ కి హైదరబాద్ ట్రాన్స్ ఫర్ అయ్యింది. అక్కడున్న మా హెడ్డాఫీసులో  నాకు కూడా జాబ్ వచ్చింది. నీవు కూడా మాతో వచ్చేయ్యి.  వీళ్ళ బాధ లేకుండా. మాతో ఉండచ్చు, పిల్లలు కూడా నీకు బాగా అలవాటయ్యారు." అని.

“ఈ మధ్య దేవేందర్ గాడి చేతలు మాటలు వెగటు పుట్టిస్తున్నాయి. ఎలాగైనా మా అత్తను మీరే ఒప్పించండి. మీతో వచ్చేస్తాను" అని బతిమాలాను అక్కను. 

పద్మక్క మస్తానమ్మను ఒప్పించింది. నేను హైదరాబాద్ వెళ్తున్నానని తెలిసి దేవుగాడు అస్తమానం పద్మక్క వాళ్ళ వీధి లో తచ్చాడుతూ, నేను షాపుకు వెళ్తుంటే వెంట పడుతున్నాడు. "నీవెళ్ళిపోతే నేను బతకలేను. పెళ్ళిచేసుకుందాము." అంటూ పిచ్చిగా వాగుతున్నాడు.

“నా వెంట పడ్డావంటే పద్మక్క వాళ్ళాయనకు చెప్తాను, జైల్  లో పెట్టిస్తాడు “ అంటూ బెదిరించాను. ఊరెళ్ళే ముందు రోజు ఇస్త్రీ బట్టలకోసం వెళుతుంటే మళ్ళీ వెంటపడ్డాడు . నేను గబగబా నడుస్తుంటే మెడమీద ఏదో చురుక్కున గుచ్చుకున్నట్టయ్యింది. తడుముకుంటూ వెనక్కి తిరిగాను. చాలా దగ్గరగా పళ్ళికిలిస్తూ “ఊరికే! తమాషాకి, నొప్పిగా ఉందా” అంటూ తాకబోయాడు. చేతిలొ ఉన్న పిన్నుసూది పళ్ళమద్యపెట్టుకుంటూ.

“ఛీ! నీ పని చెప్తానుండు" అంటూ వెనక్కితిరిగి  ఇంటికొచ్చేసాను .

 

పద్మక్క వాళ్ళ తో బాటు హైదరాబాదు వచ్చేసాను.రోజూ పిల్లల్ని స్కూల్లో దింపటం, తీసుకురావటం, ఇంట్లో అన్నిపనులూ అయ్యాక అక్క దగ్గర కూర్చుని అక్క కొనిచ్చిన ఇంటర్ బుక్స్ చదవటం. హాయిగా గడుస్తున్నాయి రోజులు.  దగ్గర లో వున్న కుట్టుసెంటర్ కి వెళ్ళి మిషన్ కుట్టటం ఎంబ్రాయ్డరీ అల్లికలూ కూడ తొందరగానే నేర్చు కున్నాను. సెంటర్ లొ చీరలకు ఫాల్స్ అవీ కుట్టి, కొంచం డబ్బు కూడబెట్టాను .

 

ఓ రోజు అక్క ఫోన్ చేసింది ,"సెల్వీ ఏలా వున్నావు?  ఇంక వచ్చెయ్య రాదూ.  ఆ దేవుగాడు పోయాడు, అదేదో ఎయిడ్స్ జబ్బట వాడికి, మా అత్తతో ఇంకే గొడవా వుండదు, రా సెల్వి, చిన్న  బాబుని చూడ లేదుగానువ్వు. ఎప్పుడొస్తావు  నాకు చూడాలనివుంది. సీనుగాడు వీధులెమ్మట తిరుగుతున్నాడు. వీలుచేసుకుని నేనే ఫోన్ చెస్తాను.” గబగబా మాట్లాడి ఫోన్ పెట్టేసింది అక్క.  వెంటనే అక్క దగ్గరకెళ్ళిపోవాలనిపించింది. వెళ్ళొస్తానని పద్మక్క ని అడిగాను. “పరీక్షలకు డబ్బుకట్టాము, కుట్టటమదీ బాగానేర్చుకుంటున్నావు. ఇంకొన్నాళ్ళు ఇక్క డే వుంటే మంచిదికదా సెల్వి?  ఇంత లో చిన్నబాబు  కూడ కాస్త పెద్దవాడవుతాడు. నీ చదువుకూడా పూర్తయ్యాక వెళ్ళుదు వుగాని" అంటూసర్దిచెప్పింది.

***

మూడు నెలలు గడిచాయి.

 

ఒక్కక్షణం తీరిక లేకుండా వుంది, పైగా ఈ మధ్య తరచూ జ్వరం తలనొప్పి, బాగా నీరసం. ఓ రోజున బట్టలుతికి ఆరేస్తూ కళ్ళు తిరిగి పడిపోయాను.         డాక్టర్ దగ్గరకెళ్తే, మందులు రాసిచ్చి కొన్నిటెస్ట్లు చేయించమంది.

వారమయ్యాక మళ్ళీ వెళ్ళాము హాస్పిటల్ కి . నన్నుబయట కూర్చోమని పద్మక్కను లోపలికి పిలిచింది డాక్టరు. చాలాసేపయ్యాక నన్నుపిలిచి మందులురాసిచ్చింది.   

 

“చూసావా అక్కా ! నాకు ఏమీ లేదు మామూలు జ్వరమంటే విన్నావు కాదు,” అన్నాను.

అక్క మౌనంగా ఆటో దిగి ఇంట్లో కెళ్ళి పోయింది. మరునాడు పొద్దున్నే లేచేవరకల్లా వంటంతా చేసేసి పిల్లల్ని రెడీ చేస్తోంది.

 “నాకు బాగానే వుందక్కా. మీరు ఆఫీస్ కి రెడీ అవండి.“ అంటూ ఆమె చేతిలో పని అందుకోబోయాను .

“సెల్వీ, చెప్తున్నానుకదా. వెళ్ళు. నీగదిలో పడుకో“ కసిరిందామె .

ఆ రోజు రాత్రి పిల్లలు పడుకున్నాక వాళ్ళ గదిలోకి పిలిచిందామె, నన్ను ఇంతకుముందెప్పుడూ పిలవలేదు వాళ్ళిద్దరూ వుండగా. తలుపుదగ్గరే నిలబడ్డాను. కూర్చో సెల్వీ అన్నారాయన. “ఫరవాలేదన్నా అన్నాను”. అక్క తలవంచుకుని కూర్చుంది .

“సెల్వీ, ఇలా చెప్తున్నామని ఏమీ అనుకోకు, డాక్టరు నీకు ఎయిడ్సని చెప్పింది. ఈ పరిస్తితుల్లో ఇంట్లో ఉండటం పిల్లలకీ క్షేమం కాదు. మీ అక్కవాళ్ళింటికి వెళ్ళటమూ వద్దని మా సలహా. మదర్ థెరెస్సా ఆశ్రమంలో ప్రత్యేక వైద్యం ఉందని తెలుసుకున్నాను. అక్కడ చేర్పిద్దామనుకుంటున్నాము" అన్నాడాయన.

కాళ్ళకింద భూమి లేనట్టూ, శూన్యంలోకి జారిపోతున్నట్టూ వుంది కళ్ళు చీకట్లు కమ్మి పడిపోయాను. అక్క పిలుపుకు మెలకువొచ్చింది. “ఈ నీళ్లు తాగు సెల్వీ” అంటోందామె. గుండె పగిలేలా ఏడ్చాను. ఓదారుస్తూ మాట్లాడింది.

“ఇలా నిన్ను పంపాల్సి రావటం నాకేమీ బాగా లేదు కానీ ఏంచెయ్యను చెప్పు ,ఇది భయంకరమైన జబ్బు ఇది నీకెలా వచ్చిందో ఏమో మరి నీవిక్కడుండటం మాకూ పిల్లలకూ క్షేమం కాదు “ అంటూ నాకొచ్చిన  జబ్బుగురించిన వివరాలన్నీ చెప్పిందక్క .  ఎలా? ఎలా వచ్చిందీ జబ్బు నాకు,ఎప్పుడూ ఏ ఇంజక్షన్ తీసుకోలేదు. ఏ తప్పూ లేదునాలో. అక్కచెప్తున్న కారణాలేవీ నా పట్ల వర్తించవు.

       

ఎప్పుడు నిద్రపోయానో కొట్టినట్టుగా మెలకువొచ్చింది. ఇంకా తెల్లారలేదు. వున్నట్టుండి అక్క చేసిన ఫోన్ “ఆ దేవుగాడు చచ్చి పోయాడు. వాడికి ఎయిడ్సట.” వొళ్ళు జలదరించింది. అస్తిపంజరంలా ... పళ్ళికిలిస్తూ... పిన్నుతో గుచ్చి వెకిలిగా నవ్వుతూ.  పరుగెత్తుకెళ్ళి, రూంలోనుంచి వస్తున్న పద్మక్క  కు ఆ రోజు జరిగింది చెప్పాను.

అక్క “అయ్యో... ఎంతఘోరం... వాడు మనిషా... రాక్షసుడా? అంటూ గదిలోకెళ్ళి భర్తకి చెప్పింది .

అంతా విని - “అయితే, సెల్వికి ఆ జబ్బేనని తేలిపోయినట్టే. ఆ హోం వాళ్ళతో మాట్లాడి చేర్పిద్దాము." అంటున్నాడు .   నిస్త్రాణగా కూర్చుండిపోయాను .

 

***

“నిర్మలహృదయాలయం“ అన్న పెద్ద బో. లోపలికి వెళ్ళగానే ఎడమవైపు పెద్ద హాలు ,చుట్టూతా ఆరడుగుల వెడల్పు సిమెంటు అరుగు, హాలు మధ్యన నలుచదరపు అరుగు.మద్య అరుగు మీద కుర్చీలు, టేబులు, ర్యాకుల్లో ఫైళ్ళు మందులు మొదలైన  సరంజామా,నర్స్ లు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. గోడవారన చివరిదశలో వున్న రోగులు నేలమీద పడుకుని వున్నారు. పక్కగుడ్డలు కూడ లేవు,కొందరు స్పృహలో లేరు, కొందరు బాధతో అరుస్తూ నర్సుల్నిపిలుస్తున్నారు. చావుకు దగ్గరగా వున్న ఆ రోగుల్ని, అటెండర్లు పక్కకీడ్చి వారు చేసిన కశ్మలాన్నిఫినాయిల్ నీళ్ళతో కడుగుతున్నారు. చెమ్మ,దుర్గంధం.  చూస్తుండగానే ప్రాణంపోయిన రోగిని డోలీలాంటి బట్టలో వేసి తీసుకెళ్తున్నారు. ముందు ముందు నాపరిస్థితీ ఇంతేనా? కడుపులో తిప్పేసింది. వణికిపోతూ అక్కను పట్టుకుని ఏడ్చేసాను. “సెల్వీ! ఏడవకు, వాళ్ళందరూ ఎంతోకాలంగా జబ్బుతో వున్న ముసలి వాళ్ళు. ఇప్పుడు మంచిమందులొచ్చేసాయి. నీ జబ్బు తొందరగా తెలిసిందిగా. ఇక్కడ మంచి వైద్యం దొరుకుతుంది. అందుకే మీ అక్క దగ్గరకు పంపలేదు నిన్ను.నేను ఫోన్ చేస్తుంటాను.“ఓదార్చింది అక్క. బాధగా తిరిగి వెళ్తున్న అక్క మొహంలో అసహాయత. వెళ్ళేముందు చేతుల్లో డబ్బులుంచింది ఏ అవసరానికైనా ఉపయోగపడతాయని.

 

***

మూడునెలలు  గడిచాయి. ఆ రిపోర్టులని బట్టి ఎన్నో మందులిచ్చారు. మెల్లిగా అక్కడి వాతావరణానికి అలవాటుపడ్దాను. తోటపనీ, చేతిపనులూ చేసుకుంటూ అక్కడందరితో స్నేహంగా వుంటున్నాను.

***

 

ఒక రోజు పొద్దున్నే హోం లో మెడికల్ క్యాంప్ పెట్టారు. నన్నుకూడా పరీక్ష చేసి రక్తం తీసుకున్నారు. 

***

 ఆ రోజు పొద్దున్నే చెట్లకు నీళ్ళు పోస్తున్నాను. సిస్టర్ వచ్చి “సెల్వీ! మదర్ పిలుస్తున్నారు త్వరగా రా“ అంది. బిందె పక్కనపెట్టి అఫీస్ రూంకెళ్ళాను.

 

"రా సెల్వీ! నీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి, నీకే జబ్బూ లేదు ,నీవు ఆరోగ్యంగా వున్నావు. నీకింతకుముందు వచ్చింది ఫాల్స్ రిపోర్టట, కంగ్రాటులేషన్స్! గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ “అంటూంది. ఒక్క క్షణం కలో, నిజమో తెలీలేదు.

 

"నిజమా" ఆశ్చర్యంగా అదొక్క మాటే అనగలిగాను. చిరునవ్వుతో తలూపింది మదర్.

 

ఆ వెంటనే పద్మక్కకు ఫోన్ చేసాను, వెంటనే వచ్చేసింది. గట్టిగా కావలించుకున్నాను, ఇద్దరికీ కన్నీళ్ళాగలేదు  “సారీ సెల్వీ. సారీ" అంటుంది అక్క పదే పదే. “ఇక ఇంటికి పోదాం పద" అంది.

"ఇప్పుడే వద్దులెండి అక్కా టైమివ్వండి నాకు. ఆలోచించుకుని ఫోన్ చేస్తాను" అని చెప్పాను .కొంచెంసేపు బలవంతం చేసి వెళ్ళిపోయింది.

ఆ తర్వాత అక్కా వాళ్ళూరికొచ్చి, నేను బాగా ఆలోచించాను, "అది మా నాన్న యిల్లు  నేను,తమ్ముడూ అక్కడా యిక్కడా ఎందుకు కాలం గడపాలి? నేను దైర్యంగా నిలబడి మా నాన్నను వాళ్ళనుండి కాపాడుకుంటాను. నా చదువుతో ఏదో ఓ ఉద్యోగం సాధించకపోను. సీను జీవితమూ నిలబెడతాను." అని గట్టిగా నిర్ణయించుకున్నాను.

ఆ నిర్ణయం ఫలితమే ఈ బస్సులో మా వూరికి బయల్దేరాను.

బస్సు పెద్ద కుదుపుతో గతంలోంచి బయటకొచ్చాను. పక్క సీట్లో సీను ప్రశాంతంగా నిద్రపోతున్నాడు.

***

bottom of page