top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  2

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా​ మధురాలు

గార్డియన్ ఏంజెల్

Madhuravani_Social

 

ఆర్. శర్మ దంతుర్తి

ఐఐటి పొవాయి కాంపస్ లో మూల ఒక చోట కూర్చునున్న కేశవ్, అపర్ణ రావడం చూసి పలకరింపుగా నవ్వేడు. అపర్ణ మొహంలో నవ్వు మాట అటుంచి ఏ భావమూ లేకపోవడం చూసి అడిగేడు, "కాయా, పండా?"

 

"నా మొహం, నేను మాట్లాడనే లేదు. నాకు తీరిక లేదు. నేను మాట్లాడినా అమ్మ ఒప్పుకోదని చెప్పానుగా. ఆవిడతో మాట్లాడ్డమే అనవసరం. ఆవిడక్కావాల్సింది ఆవిడ మేనల్లుడూ, ఆ రాజారావుకున్న మెడికల్ షాపూ బాగుండడం. దానికోసం నేను ఏమైపోయినా పట్టించుకోదు."

 

"మరి నన్నేం చేయమంటావు?"

 

"నిన్న రాత్రి అలోచించాను. దీనికో మార్గం ఉంది. నువ్వు ఎలాగా వచ్చేవారం క్లీవ్ లేండ్ వెళ్ళిపోతున్నావు.  వచ్చే ఏటికి నాకూ ఇక్కడ చదువైపోతుంది. నేను కూడా అక్కడకి వచ్చేస్తాను. ఆ తర్వాత మరో ఏడాదికి నీ ఎం ఎస్ అయిపోతుంది. ఉద్యోగం రాగానే అక్కడే పెళ్ళి చేసుకుని ఇలా అయింది అని చెప్పేద్దాం. సింపుల్ గా తేల్చేయవచ్చు."

 

"ప్లాన్ బాగానే ఉంది కానీ ఒక్కత్తివే కూతురివి కదా వాళ్ళు ఒప్పుకోక ఏదైనా అఘాయిత్యం చెస్తే?"

 

"అఘాయిత్యం చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తాం అనేవారు అతి పిరికి మనుషులు. వాళ్ళు అలా అనడమే తప్ప మరోటేదీ చేయలేరు. మా అమ్మ కూడా అంతే."

 

"నిజంగా నీకంత ధైర్యం ఉందా అపర్ణా?"

 

"నా గురించి అలా ఉంచి ముందు నీ సంగతి చెప్పు. నీకు నేను చెప్పినట్టు చేయడానికి దమ్ములున్నాయా, లేకపోతే నువ్వూ మా అమ్మలాటి వాడివేనా?" నవ్వింది అపర్ణ.

 

"నేను ఓ ముఖ్యమైన విషయం చెప్పలేదు నీకు. నా తల్లీ, తండ్రీ పోయక మేనమామ పెంచాడని చెప్పాను కదా, ఆయనతో ఇలా అమెరికా వెళ్తున్నాని చెప్పాను. ఇంతెత్తున ఎగిరాడు, “నా కూతుర్ని చేసుకుంటావని నేను ఇప్పటిదాకా నిన్ను చదివించాను, ఇప్పుడిలా అమెరికా పారిపోతావా?” అంటూ ఏవేవో కబుర్లు, అరుపులూ, కేకలూను. అత్త కూడా అదే అన్నాక నేను చెప్పబోయాను, “నీ కూతురు నా కన్న పన్నెండేళ్ళు చిన్నది అలా నాకిచ్చి చేయడం పరమ దరిద్రపు ఆలోచన. కావాలిస్తే నేనే నీ కూతురికి మంచి సంబంధం కోసం సహాయం చేస్తాను. డబ్బులు కూడా, కానీ పెళ్ళి చేసుకోమని అడక్కు” అని. దానికి మరింత రెచ్చిపోయి అన్నాడు, “నాకూ మీ అత్తకి పదిహేనేళ్ళు తేడా ఉంది, మేము బాగానే ఉంటున్నాం కదా” అంటూ. చివరకి నేను తెగేసి చెప్పాను “పెళ్ళి చేసుకోను మీ అమ్మాయిని” అని. క్రితం నెలలోనే వెళ్ళినప్పుడు నా సామానులన్నీ బయట పారేసి “ఫో, మళ్ళీ ఎప్పుడూ మొహం చూపించకు” అన్నాడు. నా ట్రైన్ మర్నాటి కానీ లేదు. ఆ రోజు రాత్రి ఇంట్లోంచి పొమ్మన్నాడు. నేను రాత్రంతా అలా స్టేషన్ లోనే పడుకుని మర్నాడు వచ్చాను ఇక్కడకి. ఇవి పెద్దగా ఎవరికీ తెలియనవసరం లేదు కనక నీకూ చెప్పలేదు. మన సంగతి ఇంతవరకూ వచ్చింది కనక ఇప్పుడు చెప్తున్నా. నాకు నువ్వు తప్ప ప్రపంచం లో ఎవరూ లేరు.  నువ్వు కూడా నో అనేస్తే ఒక్కడినే క్లీవ్ లేండ్ వెళ్తాను. ఏదో శక్తి అంటావో, గార్డియన్ ఏంజెల్ అంటావో, భగవంతుడంటావో, మరోటి అంటావో అను; ఏదైతే నన్ను ఇప్పటివరకూ నడిపించిందో అదే ముందుకి తీసుకెళ్తుంది. ఒక సంతోషమైన విషయం ఏమంటే, నేను కనక ఇప్పుడు పోతే నా గురించి ఏడిచేవాడు ఒక్కడు లేడు ప్రపంచంలో. నేను అంత దురదృష్టవంతుణ్ణి, లేకపోతే అదృష్టవంతుణ్ణి. ఇంత చెప్పాను కనక ఇప్పుడు నువ్వే ఆలోచించు నాకు దమ్ములున్నాయా లేదా అనేది." మొహంలో దైన్యం అనేది కనపడకుండా అతి మామూలుగా చెప్పేడు కేశవ్.

 

“నువ్వు దురదృష్టవంతుడవి కాదు కేశవ్. మంచి చదువుంది, అమెరికా వెళ్తున్నావు. వచ్చే ఏటికి నీ ప్రేయసి నీ దగ్గిరకి వచ్చేస్తోంది. ఇంతకన్నా ఇంకేమిటి నీక్కావాల్సింది?" నవ్వుతోంది అపర్ణ.

 

కేశవ్ ఈ సారి నిజంగానే నేను అదృష్తవంతుణ్ణి అనుకున్నాడు మనసులో. అతనేం మాట్లాడకపోవడం చూసి అపర్ణే అంది,  "అలాగైతే ఇదే సుఖం అబ్బాయి గారు. వచ్చేవారం నువ్వు క్లీవ్ లేండ్ వెళ్తావు. పై ఏడు నేనొస్తున్నాను. మరో ఏడాదికి నీకు ఉద్యోగం రాగానే పెళ్ళి. అదయ్యాక అక్కడనుంచి ఫోన్ చేసి చెప్తాం తాంబూలాలు ఇవ్వడమే కాదు పెళ్ళి కూడా అయిపోయింది తన్నుకు చావండ్రా అని."

 

"ఓ మాట అడుగుతాను ఏమనుకోవు కదా?"

 

"అనుకుంటాను. కానీయ్, అడుగు" నవ్వింది అపర్ణ.

 

"రాజారావంటే నీకిష్టం లేదా? అతనికి మెడికల్ షాప్ ఉంది. ఫార్మసీ కోర్స్ చేసాడు. అన్నీ బాగానే ఉన్నై కదా?"

 

"నీకున్న గొడవలాంటిదే నాకూను. నేను ఇక్కడ బి.టెక్ చేసి అమెరికా వెళ్దాం అనుకుంటున్నా. అతనంటే నాకు మొదటి నుండీ ఇష్టం లేదు. పెద్దలందరూ కల్సి నేను పుట్టినప్పుడు ఇలా మేనరికం చేద్దాం అనుకున్నార్ట. నా ఇష్టాయిష్టాలతో పని లేదు కాబోలు. రాజారావు నాకన్నా ఎనిమిదేళ్ళు పెద్దవాడు. ఆయన్ని చేసుకుంటే ఆ గుంటూరు లో ఉన్న మెడికల్ షాపులో నేనేం చేయాలి? పోనీ షాపులో కూర్చోడం కాకపోయినా గుంటూర్లో ఏం చేయాలి?"

 

"సరే అయితే, అమ్మాయి గారి ప్లాన్ అప్రూవ్ చేయబడినది, సంతకం ఎక్కడ పెట్టాలి?" కేశవ్ నవ్వేడు.

 

ఇద్దరూ నవ్వుకుంటూ లేచారు వెళ్లడానికి

* * * * * *

ఐఐటి లో జరిగిన ఈ ప్రేమాయణం గుంటూర్లో తమ ఇంట్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది అపర్ణ.

 

కేశవ్ వెళ్లిన ఏడాదికి అపర్ణ కూడా ఎం ఎస్ కోసం క్లీవ్ లేండ్ కి అప్లికేషన్ పంపింది కానీ అక్కడ సీటు రాలేదు. అప్లికేషన్లు పెడుతున్నప్పుడే కేశవ్ చెప్పినట్టూ అప్లికేషన్ పెట్టిన మరో చోట కొలంబస్ లో సీటొచ్చింది అపర్ణకి.   అమెరికా వస్తూంటే తండ్రి చెప్పాడు అపర్ణతో దాదాపు ఏడుపుగొట్టు మొహంతో,"అమ్మా నాకు సర్వీసు మరో ఏడాది ఉంది ఆ తర్వాత మాకు జీతం ఉండదు మరి. నువ్వేమో అమెరికా వెళ్ళిపోతున్నావు. ఎలా?"

 

"నేను డాలర్లు పంపిస్తాను నాన్నా, ఏమీ కంగార్లేదు." నవ్వుతూ చెప్పింది అపర్ణ.

 

తండ్రీ, తల్లి కుదుటబడ్డారు. అయితే అపర్ణ అమెరికా వెళ్ళడం తోటే వాళ్ల ఆలోచనలు మారేయి. అమ్మాయి ఎం ఎస్ అవగానే ఎలాగా వెనక్కి వస్తుంది ఓ సారి ఉద్యోగంలో జేరేముందో ఆ తర్వాతో. రాగానే ఇంకేమీ చెప్పనివ్వకుండా రాజారావుతో పెళ్ళి చేసేసి చేతులు దులుపుకోవాలి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అమెరికాలో బతుకుతారా, గుంటూర్లో బతుకుతారా అనేది వాళ్ళిష్టం. ఇలా పడుచు పిల్లల ఆలోచనలు ఒకవైపూ, తల్లితండ్రుల ఆలోచనలు దానికి వ్యతిరేకంగానూ ఒకరివి మరొకొకరికి తెలియకుండానే కాలం పరిగెడుతోంది.

 

ఏడాది తిరిగేసరికి అపర్ణకి ఇంకా మరో సంవత్సరం చదువుందనగా కేశవ్ సింసినాటీ లో తేలాడు ఉద్యోగానికి. మరో ఆరునెలలకి అపర్ణ చివరి సెమెస్టర్ లో ఉండగానే ముందే అనుకున్నట్టూ ప్రేమపక్షులు రెండూ పెళ్ళి చేసుకుని ఒకటయ్యేయి స్థానిక హిందూ గుడిలో.

 

ఇది జరిగిన మరో మూడు నెలలకి తాను రాసే థీసిస్ సబ్మిట్ చేసేసి అపర్ణ డిగ్రీ చేత్తో పట్టుకుని కేశవ్ దగ్గిరకి సింసినాటీ చేరిపోయింది.  తాను అమెరికా వచ్చినప్పటినుండీ ఎప్పటికప్పుడు తనకి తీరినంతలో అపర్ణ ఇండియాలో తల్లికీ తండ్రికీ ఏవో డబ్బులు పంపుతూనే ఉంది. డాలర్లు చేతిలో పడుతూ ఉంటే తల్లీ తండ్రీ మురిసిపోతూనే అపర్ణ ఇండియా రాగానే రాజారావుతో ముడిపెట్టేద్దాం అనే భ్రమలోనే ఉన్నారు.

 

మూడునెలలు గడిచాక కేశవ్ పనిచేసే చోటే ఉద్యోగం సంపాదించిన అపర్ణ పెళ్ళి ఫోటోలతో సహా ఓ ఉత్తరం రాసి ఇంటికి పంపింది. తల్లీ తండ్రీ హతాశులైపోయేరు. కూతురు ఇలాంటి పని చేస్తుందని వాళ్లకి కలలో కూడా తడితే కదా? ఇప్పుడు రాజారావుతో ఏం చెప్పడం?

 

ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చేస్తే ఎటొస్తుందో? అసలే తాము కూతురి మోచేతి నీళ్ళు తాగి బతుకుతున్నారు. కూతురు తన పెళ్ళికి తమని కూడా పిలవలేదు, ఎక్కడో అమెరికాలో ఉన్న కూతుర్ని మీద, కూతుర్ని ఎగరేసుకుపోయిన కేశవ్ మీదా కోపం, ఏదో చేయాలనే తాపత్రయం, ఏమీ చేయలేని అసహాయత. దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళిద్దరూ ఇలా చేసినందుకు సర్వనాశనం అయిపోవాలనే బలమైన కోరిక, అంతలోనే తమకి వచ్చే డాలర్లు పోతాయేమోనని లోలోపల ఏడుపు. లోపల తిట్టుకుంటూ బయటకి చెప్పలేక, కక్కలేకా ఏడుస్తున్న రోజుల్లో రాజారావు గమనించేడు వీళ్ల సంగతి. అతను మరీ మరీ అడిగితే ఓ రోజు చెప్పేసేరు ఈ కధ ఇంక కడుపులో దాచుకోలేక.

 

రాజారావుకి మండిపోయింది. వీళ్ళ మీద కసి తీర్చుకోవాలి తాను. ఇప్పుడు కాదు, అవకాశం కోసం వేచి చూడ్డమే. తన జీవితం నాశనం చేసారు మభ్యపెట్టి.  కాలం పరిగెడుతూనే ఉంది. అక్కడ అమెరికాలో హాయిగా కొత్త కారు మీద ప్రేమ పక్షులు చక్కెర్లు కొడుతూ ఉంటే ఇక్కడ పాత సంసారం అరుపులూ కేకలతో అదిరిపోతూంది. రాజారావు పెళ్ళికి మరో సంబంధం చూసుకుంటున్నాడు. అయితే అబ్బాయి మాత్రమే కనాలని భారద్దేశంలో మొగుళ్లందరూ చాలాకాలం నుంచీ అమ్మలని ఏడిపించుకు తినడం వల్ల ఏ కుర్రాడికైనా పెళ్ళికి అమ్మాయి దొరకాలంటే జేజెమ్మలు దిగి వస్తున్నారు.

 

ఇటువంటి రోజుల్లోనే ఓ అద్భుతం జరిగింది అమెరికాలో.

* * * * * *

ఓ రోజు సాయంత్రం అఫీసునుంచి ఇంటికి వస్తూంటే కేశవ్ కారులో డేష్ బోర్డు మీద గేస్ అయిపోతున్నట్టూ లైట్ వెలగడం గమనించాడు. ఓ రెండు మైళ్ళు వెళ్ళాక కనిపించిన గేస్ స్టేషన్ దగ్గిర ఆపితే అక్కడే కనపడింది ఓ బోర్డు. "బయట క్రెడిట్ కార్డు పనిచేయదు. దయచేసి షాపు లోపలకి రండి."

 

లోపలకి వెళ్ళి క్రెడిట్ కార్డ్ ఇవ్వబోయేడు కుర్రాడికి. కార్డు మీద పేరు చూసాడు కాబోలు, "తెలుగువాళ్ళా? ఎక్కడుంటారు?" అడుగుతున్నాడు షాపులో కుర్రాడు. 

 

కేశవ్ అతని కేసి చూసాడు, ఇండియన్ అని తెల్సిపోతోంది. "మరో ఇరవై మైళ్ల అవతల," నవ్వుతూ సమాధానం చెప్పాడు. కుర్రాడు మాటకారి లా ఉంది "నేనిక్కడే స్కూల్లో చదువుకుంటున్నానండి," చెప్పాడు.

 

“అవునా? బాగుంది” కుర్రాడితో చెప్పి బయటకొచ్చి గేస్ నింపాక మరోసారి లోపలకెళ్ళి అడిగేడు “కార్డుతో పాటు, రసీదు ప్రింట్ చేసి ఇస్తారా?" అడిగేడు కేశవ్.

 

"మొత్తం $38.02 అయిందండి. ఆ రెండు సెంట్లు నేను ఇస్తాను కానీ మరో రెండు డాలర్లతో ఏదో ఒకటి కొంటారా, నలభై కి బిల్లు ఇచ్చేస్తాను?" కుర్రాడు అడిగేడు ఉత్సాహంగా.

 

అక్కడే కౌంటర్ మీద ఉన్నవాటికేసి చుసాడు కేశవ్, సిగరెట్ లైటర్లూ, బబుల్ గం లాంటివి తప్ప ఏమీ లేవు కొనడానికి. ఏం చేయాలా అని ఆలోచిస్తూంటే కుర్రాడే నవ్వుతూ చెప్పాడు, "పోనీ ఓ పవర్ బాల్ టికెట్ కొనకూడదు సార్? మీకు లాటరీ తగిల్తే మాకు ఓ నలభైవేల దాకా కమీషన్ వస్తుంది కూడా."

 

ఎలాగా తనకి లాటరీ తగలడం జరగదు కనక, సరే అని నవ్వుతూ కుర్రాడిచ్చిన లాటరీ టికెట్, క్రెడిట్ కార్డూ, రసీదు జేబులో పెట్టుకుని బయటకి నడిచేడు కేశవ్. ఆ తర్వాత ఆ విషయం పూర్తిగా మర్చిపోయేడు.

 

మూడు వారాల తర్వాత ఓ రోజు తీరిగ్గా టివి చుస్తూంటే న్యూస్ ఏంకరమ్మ చెప్పడం వినిపించింది - "మన ఊళ్ళోనే ఎవరో అదృష్టవంతుడికి అరవై మిలియన్ల లాటరీ తగిలింది కాని ఇప్పటి వరకూ ఎవరూ ముందుకి రాలేదుట. టికెట్ అమ్మినది ఫలానా గేస్ స్టేషన్. మీరే ఆ అదృష్టవంతులైతే వచ్చి తీసుకోండి."  

 

చటుక్కున తాను ఒకనాడు గేస్ స్టేషన్ లో కొన్న లాటరీ టికెట్ సంగతి గుర్తొచ్చి కేశవ్ దాన్ని వెదకడానికి బెడ్రూం లోకి దూరేడు. ఓ గంట అన్ని పేంట్ జేబులూ, రసీదులూ గాలించాక దొరికిన టికెట్ పట్టుకుని గూగిల్ మీద పడ్డాడు లాటరీ తనకి వచ్చిందో లేదో చూడ్డానికి. తర్వాత, అప్పటికే నిద్రపోయిన అపర్ణ ని లేపి చెప్పాడు గుండెలు అదురుతుండగా, తమకి అరవై మిలియన్ల లాటరీ తగిలినట్టూ.

 

తర్వాత ఇద్దరికీ నిద్ర పట్టలేదు. మొదటగా ఏం చేయాలా అని ఆలోచిస్తే తెల్సినది - ఎవరికీ ఏమీ చెప్పవద్దు. చెప్తే అనేకానేక గొడవలు.అప్పు ఇవ్వమని అడిగేవారూ, దానం కోసం వచ్చేవాళ్ళు అటుంచితే ఎవరో ఒకరు దొంగతనానికో, కాల్చి పారేయడానికో రావొచ్చు. మర్నాడు పొద్దున్నే బేంక్ కి వెళ్ళి లాకర్ ఒకటి అద్దెకి తీసుకుని సంతకం చేసిన లాటరీ టికెట్ ని ఫోన్ మీద కాపీ తీసిపెట్టుకున్నాక దాన్ని లాకర్ లో దాచారు దంపతులు.

 

ఇటువంటి విషయాలు ఎలాగా టివి ద్వారానో మరోలాగో బయటకి వచ్చేస్తాయి కనక కొంతమందికి తెలిసింది కేశవ్ కి లాటరీ తగిలినట్టు.  ఆ పై వారానికి డబ్బులు చేతిలోకి వచ్చాయి. టేక్స్ లు పోను నలభై మూడు మిలియన్లు చేతిలో పెట్టారు లాటరీ వారు.

* * * * * *

రహస్యం కాపాడ్డం అనేది ఒక చిన్న విద్య. దానికి గల ఒకే ఒక మంచి టెక్నిక్ ఏమిటంటే రహస్యం తెల్సిన మనిషి దాన్ని నోట్లోంచి ఎవరికీ - ఎవరికీ అంటే స్వంత పెళ్ళాం తో సహా ఎవరికీను - చెప్పకూడదు. ఒకసారి రహస్యం అనేది మరొకరికి తెలిస్తే సంతలో అందరికీ తెల్సినట్టే కదా? అలా కొంతమందికి మాత్రమే తెల్సిన మిలియన్ డాలర్ల రహస్యం త్వరలో ఊరంతా తెల్సింది. ఇంతవరకూ వచ్చాక అమ్మకి కూడా తెలిస్తే బాగానే ఉంటుందనుకుని అపర్ణ ఫోన్ చేసి ఇండియాలో ఉన్న అమ్మ నాన్నలకి చెప్పేసింది - చివరగా ఓ వార్నింగ్ - తాను చెప్పినదంతా మరీ రహస్యంగా ఉంచమని – ఇస్తూ. సరిగ్గా ఇక్కడే ధర్మరాజు కుంతి కి ఇచ్చిన - ఆడవాళ్ల నోట్లో రహస్యాలు దాగవనే - శాపం బయటకి ప్రస్ఫుటంగా తన్నుకుంటూ వచ్చింది.

 

అపర్ణ తల్లి తనకి “ప్రియమైన” మేనల్లుడు రాజారావుని పిల్చి చెప్పేసింది కథంతా. అత్త చెప్పినది వినగానే రాజారావుకి తన పగ తీర్చుకునే అవకాశం, మళ్ళీ అపర్ణని దక్కించుకునే అవకాశం కళ్లకి కట్టినట్టూ కనిపించేయి. ఆ ప్లాన్ ప్రకారం ఓ సారి అపర్ణ ఇండియా వచ్చిందా అ డబ్బులన్నీ తనవే. దెబ్బకి రెండు పిట్టలు, అదీ తన చేతికి మట్టి అంటుకోకుండా, అన్నీ తాను అత్తమ్మ చేత వేయించే ప్లాన్ మీదే. మావయ్యదేవుంది ఆయన అత్త ఎలా చెప్తే అలా కొంగు పట్టుకు తిరుగుతాడు.

 

అసలే కోపంతో ఉన్న అపర్ణ తల్లీ తండ్రీ, రాజారావు కూర్చుని తీరిగ్గా జాగ్రత్తగా ఆలోచించారు ఏం చేయాలో. అసలే ముగ్గురికీ అపర్ణ మీద, అపర్ణని ఎగరేసుకుపోయిన కేశవ్ మీద పీకలదాకా కోపంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ వీళ్లకి అరవై మిలియన్ల లాటరీ. మీకు కాళ్ళూ చేతులూ కదల్లేని స్థితిలో ఉన్నప్పుడు అవతల మీ వయసు వాడే లక్షణంగా ఏ ఫుట్ బాలో ఆడుతున్నాడనుకోండి, మీకెలా ఉంటుంది? అలాగే ఉన్న వీళ్ళు మూడు రోజులు ఆలోచించేరు కూడబలుక్కుని ఓ పధకానికి. దాని ప్రకారం పధకాన్ని అమల్లో పెడితే తర్వాత జరిగేది సినిమాలో ఇంటర్వెల్ అయ్యాక వచ్చే రెండో పార్టు లాగా దద్దరిల్లిపోద్ది, లేదా అద్దిరిపోద్ది, సినిమా భాషలో. కుర్చీల్లోంచి లేవకండి మరి.

 

ఆ పథకం ప్రకారం మర్నాటి నుంచీ అమ్మ కూతురికి రోజూ ఫోన్ చేసి అడగడం మొదలుపెట్టింది, "నిన్నూ అల్లుణ్ణి ఓ సారి చూడాలనుంది, ఇండియాలో బోరు కొట్టేస్తోంది మా ఇద్దరికీ, అపర్ణ వెళ్ళిపోయాక చేసేదేం లేదు, మనవడు పుడితే ఎంత సంతోషం," వగైరా వగైరాలు కలిపి, అప్పుడప్పుడూ కళ్ళు వత్తుకోకపోయినా అటువేపు ఫోనులో అపర్ణకి తన వెక్కిళ్ళు గట్టిగా వినిపించేలా చేస్తూను.

 

ఇలా దాదాపు రోజు ఫోను చేసి అడగడంతో “అమ్మకి తనమీద ఎంత ప్రేమో” అనిపించడం మొదలైంది అపర్ణ కి. లాటరీ తగిలాక డబ్బులకేం కొదవ లేదు కనక అత్తా మామలు రావడానికి వీసా కాయితాలు పంపించాడు ఇండియాకి కేశవ్. ఇది జరిగిన మరో రెండు నెలలకి అపర్ణ అమ్మా నాన్నలు విజిటర్ వీసా మీద క్లీవ్ లేండ్ లో తేలారు.

* * * * * *

అమెరికాలో దిగిన మర్నాటినుండే కేశవ్ కి అత్తగారు ఏదో పొడి పొద్దున్న తాగే కాఫీలో కలుపుతూ ఇవ్వడం మొదలుపెట్టింది. అపర్ణా, కేశవ్ ఆ పొడి ఏమిటో అడిగితే ఆవిడిచ్చిన సమాధానం ఇది - అది ఊర పిచ్చుక సత్తువ లేహ్యం (ఊపిలే) లోంచి తయారు చేసిన పొడి – పంటలకీ, వాతావరణానికీ అతి ముఖ్యంగా కావాల్సిన ఊరపిచుకలని చంపేసి తయారు చేసిన, అమోఘమైన భారద్దేశపు ఆయుర్వేదం మందు - పిల్లలు అత్యంత తెలివైన వారుగా, పచ్చగా గుమ్మిడికాయ రంగులో పుట్టడానికి, మగవాళ్ళు మాత్రమే వాడే మందు. అత్తగారు ఇచ్చింది కదా అని కేశవ్ దాన్ని ఓ వారం తాగి ఓర్చుకున్నాక దాని వాసనకి మొహం మొత్తి, మొహమాటం వదిలేసి ఇంక దాన్ని కాఫీలో కలపవద్దని చెప్పాడు. కానీ అత్తగారు ఈ పొడి అల్లుడు తినడానికి పట్టుకెళ్ళే మధ్యాహ్నం లంచ్ బాక్స్ భోజనంలో కలపడం మొదలుపెట్టింది కేశవ్ కి తెలియకుండా. 

 

తర్వాత కొన్నాళ్ళకి కేశవ్ కి వంట్లో ఏదో తేడాగా ఉంటే డాక్టర్ దగ్గిరకి వెళ్ళాడు. రక్త పరీక్షలో ఏదో తేడా కనిపిస్తే  దాన్ని టాక్సికాలజిస్ట్ దగ్గిరకి పంపించారు. రిజల్ట్ రావాల్సి ఉంది. అయితే ఈ లోపునే ఇంట్లో ఓ రోజు అర్ధరాత్రి కేశవ్ మంచం మీదనుంచి నేలమీద పడిపోయి లేవలేకపోతూంటే వెంఠనే ఎమర్జన్సీకి పరుగులు. అపర్ణ రాత్రంతా జాగారం చేశాక మర్నాటి పొద్దున్నకి కాస్త కుదుటపడిన కేశవ్ ని హాస్పిటల్లో వదిలేసి ఇంటికి వద్దామనుకుంటూంటే హాస్పిటల్ డాక్టర్ ఏదో కాయితం పట్టుకుని లోపలకొచ్చేడు.

 

అపర్ణ ఆయన్ని లోపలకి ఆహ్వానించింది, "రండి, రిపోర్ట్ లో ఏదైనా తేలిందా?"

 

"ఇదిగో ఇప్పుడే వచ్చింది, చూస్తున్నాను, టాక్సీడ్రోం అనే మాట విన్నారా ఎప్పుడైనా?"

 

"లేదే, ఏమంటారు దాని గురించి?"

 

డాక్టర్ చెప్పడం మొదలుపెట్టాడు, "ఎప్పుడైనా ఏ మందో మాకో తెలియక తీసుకున్నా, టెలెనాల్ లాంటి సులభంగా దొరికే ఏ మందైనా ఎక్కువ డోసులో తీసుకున్నా అది వికటించి విష ప్రభావం చూపిస్తుంది. అంటే ప్రాణాలు కాపాడే మందులే ఒక్కోసారి ప్రాణాంతకం అవుతాయి. అలా జరిగినప్పుడు శరీరంలో విషం - టాక్సిన్స్ అనేవి - జేరాయని తెలుస్తుంది. వాటివల్ల వచ్చే మనకి కనబడే రోగ లక్షణాలని సిండ్రోంస్ అంటాం. ఈ రెండు కలిపితే వచ్చే పదమే టాక్సీడ్రోం. ఇప్పుడు కేశవ్ కి టాక్సిడ్రోం ఉంది. ఇంట్లో కానీ బయటకానీ ఏమైనా విషపూరితమైనవి తినడమో తాగడమో చేస్తున్నారా?"

 

"లేదే? ఎటువంటి పదార్ధాల వల్ల ఇది జరగొచ్చు?" అపర్ణ అడిగింది.

 

మొహం అప్పటి దాకా మామూలుగా ఉన్న డాక్టర్ అపర్ణ తో చెప్పాడు సీరియస్ గా, "సాధారణంగా ఇలాంటివి జరగడానిక్కారణం ఇంట్లో మనుషులు; భార్యా భర్తల వల్ల వచ్చే తగాదాలు. దాంతో మొగుణ్ణి చంపే భార్యలూ, భార్యలని చంపే భర్తల వల్లే ఇలా జరుగుతుంది.  మీరు కాని ఇప్పుడు నిజం చెప్పకపోతే పోలీసులని సంప్రదిస్తాం. అ తర్వాత మాకు సంబంధం లేదు. చెప్పండి. మీరు కానీ కేశవ్ కి ఆయనకి తెలియకుండా ఏదైనా కలిపి తాగిస్తున్నారా? అన్నంలో కలుపుతున్నారా? కేశవ్ కిడ్నీలు పాడవుతున్నాయి అని ఈ రిపోర్ట్ చెప్తోంది.  ఇది చాలా సీరియస్ అయిన విషయం, నవ్వులాట కాదు. ఇది కనక నిజం అయితే మీకు జీవితాంతం జైలు శిక్ష పడుతుంది. ఏమి సమాధానం చెప్తారు దీనికి?”

 

అపర్ణ కళ్ళలో బెరుకు; ఇంత అవమానమా తనకి? అపర్ణ నోరు తెరిచి కోపంగా ఏదో అనబోతూంటే కేశవ్ వారించి చెప్పేడు డాక్టర్ తో, "లేదు డాక్టర్, అపర్ణ అలాంటిది కాదు. మేమిద్దరం కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నాం, ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం. అసలు నేనేమీ విషం లాంటివి తిన్నట్టుగానీ తాగినట్టుగానీ నాకు గుర్తే లేదు. అపర్ణ కేమీ సంబంధం లేదు. ఏదో ఒకసారి బయట తిన్న తిండివల్ల ఇలా అవ్వొచ్చా?"

 

"ఒక్కసారి తింటే అవదు కానీ … అది అలా ఉంచుదాం. ముందు మీకు తగ్గడానికి ట్రీట్ మెంట్ మొదలు పెడదాం, మామూలుగా నయం కావడానికి నాలుగు నుంచి ఆరువారాలు పట్టొచ్చు. రెండు వారాలు ఇక్కడున్నాక ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ గుర్తు పెట్టుకోండి, ఈ లోపుల చాలాసార్లు రక్తం పరీక్ష చేస్తాం ప్రోగ్రెస్ కోసం. అందులో ఏదైనా తేడా వస్తే ఇంక మీ ఇద్దరి మాటలు వినేది లేదు, డైరక్ట్ గా పోలిస్ రిపొర్టే. అర్ధం అయిందా?"

 

"తప్పకుండా అలాగే చేద్దాం," అపర్ణ, కేశవ్ ఒకే సారి చెప్పారు.

 

డాక్టర్ వెళ్ళిపోయాక, అసలీ విషం కేశవ్ వంట్లోకి ఎలా వచ్చి ఉండొచ్చో చాలా సేపు మాట్లాడుకున్నాక అపర్ణ మూడింటికి ఇంటికెళ్లడానికి లేస్తూ చెప్పింది మరో సారి, "రేపు వస్తాను పొద్దున్నే. నాకు వెళ్ళాలని లేదు కానీ అమ్మా, నాన్నలని ఓ సారి చూసి నీకు బాగానే ఉందని చెప్పి వస్తా."

 

“సరే, ఏమీ కంగారు పడకు. నాకు బాగానే నయం అవుతుందని డాక్టర్ అన్నాడుగా?”

 

అపర్ణ బయటకి రాబోతూంటే హాస్పిటల్ వరండాలో ఎవరో పలకరించారు పేరు పెట్టి. పిల్చినాయన తన పేరు చెప్పుకున్నాడు తర్వాత, సుబ్బయ్య అనే తెలుగువాడుట. హాస్పిటలోనే పనిచేస్తున్నాడు, “ఓ సారి మీతో అర్జంట్ గా మాట్లాడాలి కేశవ్ ఆరోగ్యం గురించి” అన్నాడు.

 

ఆశ్చర్యపోతున్న అపర్ణని పక్కకి తీసుకెళ్ళి ఏమీ ఉపోద్ఘాతం లేకుండా చెప్పేడు, "అసలు నేను ఇలా చెప్పకూడదు కానీ మీ పేర్లు చూసి సాటి తెలుగువాడిగా చెప్తున్నాను. మీ ఆయన మీద విష ప్రయోగం జరుగుతోంది. కిడ్నీలు పాడవుతున్నాయి. మరో మూడు వారాలు ఇలాగే జరిగితే అతను బతకడం అసంభవం."

 

“ఇప్పుడే డాక్టర్ టాక్సికాలజిస్ట్ రిపోర్ట్ చూసి అదే అన్నారండి. ఎప్పట్నుంచి ఇది జరుగుతోందో ఎవరు చేస్తున్నారో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధం కావడం లేదు.”

 

“ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని సామెత విన్నారా? ఇంట్లోవాళ్ళే చేస్తారిటువంటి పని. మీరు గానీ, మరొకరు….” హాస్పిటల్ డాక్టర్ అన్నట్టే అంటూ మధ్యలో ఆగాడాయన అపర్ణ కేసి అనుమానంగా చూస్తూ.

 

"ఇంట్లో నేను, మా అమ్మా, నాన్న, కేశవ్ తప్ప ఇంకెవరూ లేరండి. మా అమ్మ వండుతుంది రోజూ ఇంట్లో. ఎప్పుడూ ఇంట్లో తినే తిండి తప్ప మరోటి ఏమీ లేదు తేడా. మధ్యాహ్నం లంచ్ కి కూడా ఇంటి దగ్గిర్నుంచే బాక్స్ పట్టుకెల్తాడు కేశవ్. అసలెప్పుడూ బయట తినే అలవాటు లేదు, అత్యవసరం అయితే తప్ప. నాకేమీ నిజంగా తెలియదు." దాదాపు ఏడుస్తూ చెప్పింది అపర్ణ.

 

"మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఇలా చేయొచ్చా?"

 

ఒక్కసారి ఎందుకో అపర్ణకి తన తల్లి ఏదో పొడి కేశవ్ కి కాఫీలో కలిపి ఇవ్వడం గుర్తొచ్చింది. వెంఠనే చెప్పింది, “మా అమ్మ అలాంటిది కాదనుకుంటున్నాను. కానీ ఇండియా నుంచి ఏదో ఊరపిచ్చుక సత్తువ లేహ్యం అంటూ పట్టుకొచ్చింది. అది కాఫీలో కలిపి కేశవ్ కి ఇచ్చేది. ఒక వారం తర్వాత రుచి బాగోలేదని, దాన్ని కలపవద్దని చెప్పాడు. మానేసింది వెంఠనే. ఇది జరిగి ఆరువారాలు దాటిందనుకుంటా.  ఒక్క వారం వాడితేనే ఇలా అవ్వొచ్చా?”

 

“తెలియదమ్మా, కానీ ఆవిడ ఈ పొడిని కాఫీలో మానేసి రోజూ అన్నంలో కలుపుతున్నారేమో గమనించారా?”

 

“గుడ్ నెస్, చూడలేదండి. అది మా అమ్మ పట్టుకొచ్చింది కనక మంచిదే అనుకున్నాం.”

 

“ఆ పొడిలో ఏముందో, దాన్ని ఎవరు, ఎక్కడ దేనితో తయారు చేసారో తెలుసా?”

 

"తెలియదండి, మా మావయ్య కొడుక్కి మెడికల్ షాపు ఉంది అతనే ఇచ్చాడని అమ్మ చెప్పింది. అమ్మ పట్టుకొచ్చింది కదా అని తాగాడు కేశవ్, అదీ ఆరు వారాల క్రితం” చెప్పిన విషయమే మరోసారి నొక్కి చెప్పింది అపర్ణ.

 

"ఓ సారి ఫోన్ చేసి కనుక్కోండి ఆ మెడికల్ షాపు ఆయన్ని. మీకూ, మీకూ ఏమైనా కక్షలు లేవు కదా ఇలా మనుషులని చంపడానికి?"

 

"కక్షలా భలేవారే. నేను కేశవ్ ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నా.  అతని మీద ఈగ వాలనివ్వను.  ఈ మధ్యనే మాకు అరవై మిలియన్ల లాటరీ కూడా తగిలింది, ఆ డబ్బులకోసం మా కాళ్ళు నాకడానికి బోల్డు మంది ఉన్నారు," వెర్రినవ్వు నవ్వబోయింది అపర్ణ.

 

"అదన్నమాట. ఆ డబ్బుల వల్లే మీ పీకమీదకి రావొచ్చు. ఓ సారి ఆలోచించండి, డబ్బులు చూసి స్వంత బంధువులే కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం కొత్త కాదు. అయినా ఈ విషయ ప్రయోగం ఎవరు చేస్తున్నారో అది తెల్సుకోండి ముందు. నా పేరు సుబ్బయ్య అని మార్చి చెప్పాను. అసలు పేరు మీరు అడగకూడదూ, నేను చెప్పకూడదూ" లేచి వెనక్కి కూడా చూడకుండా చక చకా నడుచుకుంటూ వెళ్ళిపోయేడు హాస్పిటల్ టాక్సికాలజిస్ట్ ఉరఫ్ సుబ్బయ్య.

* * * * * *

ఆయనటు వెళ్లగానే కళ్ళు తిరిగినట్టైంది. అక్కడే ఉన్న బెంచీ మీద కాసేపు మౌనంగా కూర్చుంది అపర్ణ. “ఏ అమ్మ అయినా అలా స్వంత కూతురి మొగుణ్ణి చంపుతుందా?” అని ప్రశ్న ఎన్ని సార్లు వేసుకున్నా “అసంభవం, లేద”నే సమాధానం వస్తోంది. ఏదో స్ఫురించినట్టూ, ఫోన్ బయటకి తీసి, మెడికల్ షాపు ఓనర్, ఫార్మసిస్ట్ అయిన రాజారావుకి నెంబర్ కి కలిపింది ఇండియాకి.

 

రాజారావే ఎత్తాడు ఫోను, "అమెరికా నుంచేనా అత్తా? అంతా సజావుగా జరుగుతోందా?" మాట్లాడేది అత్తే అనుకుని రాజారావు అడుగుతున్నాడు.

 

"అంతా బాగానే ఉంది కానీ నేను అపర్ణని మాట్లాడుతున్నా, నువ్వు అమ్మతో మెడికల్ షాపులోదే ఏదో ఒక పొడి అమెరికా పంపావు గుర్తుందా? అది చాలా బాగా పనిచేస్తోంది కేశవ్ మీద, దానిలో ఏముంది? ఎవరు తయారు చేసారో చెప్తే ఇక్కడ పటేల్ స్టోర్ వారూ అనేకమంది ఇండియన్స్ కొంటామంటున్నారు. దేనితో చేసారు అది, అంటే అది ఏ రకం పొడి అనేది చెప్తావా?" చీకట్లోకి బాణం వేస్తూ అడిగింది అపర్ణ.

 

"మా ఇంట్లో పెంచుతున్నాను కొన్ని రకాల మెడికల్ మష్రూం ని. దానితో తయారు చేసిందే ఆ పొడి. అది అందరికీ వాడకూడదు. మిగతా అందరికీ కావాలిస్తే వేరుగా తయారు చేయాలి."

 

"సరే గాని నువ్వు ఫార్మసిస్ట్ వి కదా అ మష్రూం పేరు ఏమిటి? పేటెంట్ చేస్తే అమెరికాలో సులభంగా మిలియన్ల డాలర్లు సంపాదించొచ్చు కనక అడుగుతున్నాను. లేకపోతే ఎవరైనా ఈ ఐడియా ఎగరేసుకు పోవచ్చు."

 

"అవునా, ఆ మష్రూం పేరు ఒరేల్లానైన్ అనేది, ఇక్కడ ఆంధ్రాలో దాన్ని వొర్లు గొడుగులంటాం" పేటేంట్, డబ్బు అనగానే వళ్ళు మర్చిపోయి పేరు చెప్పేసేడు రాజారావు.

 

"సరే అయితే నేను ఇక్కడ పేటెంట్ గురించి కనుక్కుని నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. ఈ పొడి గురించి, అదెలా పనిచేస్తుందో అమ్మకీ నాన్నకీ ముందే తెలుసా?"

 

“ఎందుకు తెలియదూ, బ్రహ్మాండంగా తెలుసు. ఈ మందు అసలు అత్త అడిగినదే."

 

"అసలు మీకు అమెరికాలో ఉన్న కేశవ్ కి ఈ మందు పంపుదామని ఐడియా ఎలా వచ్చింది?"

 

"మీకు లాటరీ వచ్చింది, పిల్లల్లేరు, నీకైతే పెళ్ళైపోయింది కానీ ఏ అమ్మాయి దొరక్క నా బతుకు ఇలా ఉంది ఇక్కడ, మిగతావి ఆ మాత్రం నీకు తెలియదా?" మాట్లాడుతున్న బావ నవ్వులో ఈ సారి వెకిలితనం అపర్ణ కి స్పష్టంగా అర్ధమైంది.

 

"అవున్లే నాకూ తెలుస్తోంది. నేను ఇప్పుడు మాట్లాడేది ఇంటి బయటనుంచి. అమ్మా, నాన్నా బాగున్నారు. మళ్ళీ ఇంటికెళ్ళాక ఫోన్ చేస్తాను. బై" 

 

ఫోన్ కట్ చేసిన వెంఠనే అపర్ణ చేసిన మొదటి పని గూగిల్ మీద పడి ఈ కుక్కగొడుగు గురించి వెతకడం. గూగిల్ ప్రకారం తెల్సిన విషయం ఒరెల్లానైన్ అనేదో విషపు కుక్క గొడుగు, ప్రాణాంతకం అవుతుంది తింటే. దీన్ని పొడిగా చేసి తల్లి స్వంత కూతురి సంసారం కూల్చడానికి సిద్ధమైంది – తనకి ప్రియమైన మేనల్లుడి కోసమూ, ఎప్పుడో తాను పుట్టినప్పుడు ఇచ్చిన మతీ, సుతీ లేని వాగ్దానం కోసమూను. మొదట్లో తమ కళ్ల ఎదురుగానే కాఫీలో కలిపింది. వద్దు అన్నాక లంచ్ బాక్సులో రోజూ కలుపుతోందన్నమాట.  కళ్ళు బైర్లు కమ్ముతూంటే మరి కాసేపు కూలబడింది అపర్ణ. కళ్ల ముందు రంగు రంగుల బొమ్మలు కదులుతున్నై. వీళ్ల ప్లాన్ ప్రకారం ఈ పొడి తింటూ కేశవ్ కి కిడ్నీలు పాడయ్యాక చచ్చిపోతాడు.  అప్పుడు తాను వంటరి కనక ఇండియా వెళ్లక తప్పనిసరా?  తర్వాత తనని ఈ త్రాష్టుడు రాజారావు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడన్న మాట. దీనికి సూత్రధారి తన స్వంత తండ్రీ, తల్లీను! అయినా స్వంత అల్లుణ్ణి చంపుకుందామనే ఐడియా అమ్మకీ నాన్నకీ ఎలా కలిగిందసలు? తాను రాజారావుని చేసుకోనని తెలిసాకా? లేకపోతే తనకిష్టమైన కేశవ్ ని చేసుకున్నందుకా? తన పెళ్ళి అయిపోయింది, అయినా ఇంకా ఆ రాజారావు గురించి  తన అమ్మా, నాన్నా ఇలా ఏడుస్తున్నారెందుకో? ఈవిడ తనకి జన్మనిచ్చిన తల్లేనా? నరరూప రాక్షసా? అమెరికాలో ఉంటున్న తాము వీళ్ళు చేసిన పని, నయానో భయానో కనిపెట్టలేమని ఎలా అనుకున్నారు? అదృష్టం కొద్దీ ముందే తెల్సింది కానీ లేకపోతే ఈ పాటికి కేశవ్ చావు బతుకుల్లో ఉండేవాడే. ఒక్కసారి అంతులేని అసహ్యం తల్లి మీదా, తండ్రి మీదా, రాజారావు మీదా.  

 

ఆ తర్వాత అపర్ణ చేసినపని మరోసారి నేరుగా వెనక్కి హాస్పిటల్ రూములో ఉన్న కేశవ్ దగ్గిరకెళ్ళి చూచాయగా సుబ్బయ్య తనతో చెప్పినది చెప్పాక, మర్నాడు పొద్దున్నే తన తల్లినీ తండ్రినీ హాస్పిటల్ కి తీసుకొస్తున్నట్టు కేశవ్ తో చెప్పడం.

 

కళ్ళు పెద్దవి చేసుకుని విన్నాడు కేశవ్ అపర్ణ చెప్పిన విషయాలు. కాసేపటికి తేరుకుని అడిగాడు "మరేం చేద్దాం ఇప్పుడు? అయినా నువ్వు అతిగా అలోచించి ఆవిడని అనుమానిస్తున్నావేమో?"

 

"తల్లి అని ఊరుకున్నాను కానీ మరొకరెవరో అయితే ఈపాటికి ఆవిడ పీకపిసికి చంపేసి జైలుకెళ్ళి ఉండేదాన్ని," అపర్ణ అదిరే పెదవుల్లో కోపం చూసి చిన్నగా వణికేడు కేశవ్.

 

"కూల్ డౌన్, మరీ అంత కోపం వంటికి మంచిది కాదు. ఏం చేద్దాం అయితే?"

 

"రేపు పొద్దున్న వాళ్లని తీసుకొస్తా, ఇక్కడున్నంతసేపూ ఏమీ మాట్లాడకు. ఒక్క అక్షరం కూడా వద్దు. చాతనైతే నిద్రపో. వాళ్లని దింపేసి వచ్చాక అప్పుడు మిగతా నాటకం చెప్తాను. సరేనా?"

 

"అవునూ కాదూ అనడానికి నాకు వేరే దారి ఏదైనా ఉందా?" నవ్వేడు అంతటి నీరసంలోనూ కేశవ్.

 

కేశవ్ చేయి తన చేతిలోకి తీసుకుని అక్కడే చాలాసేపు కూర్చుంది అపర్ణ.  కాసేపటికి ఎక్కిళ్ళు వినబడి కళ్ళు మూసుకున్న కేశవ్ కంగారుగా చూశాడు. కారిపోయే కన్నీళ్లు కూడా తుడుచుకోకుండా అలాగే కేశవ్ చేయి పట్టుకుని  కూర్చుంది అపర్ణ. కొన్ని విషయాల్లో మాటలకేం విలువ లేదు కదా. మరో అరగంటకి తేరుకుంది కాబోలు, అడిగింది బేలగా, "కేశవ్, నేనేం తప్పు చేసాను ఈవిడకి? స్వంత తల్లి అని నెత్తి మీద పెట్టుకున్నాను, చెడ్డ పుత్రులూ, కూతుర్లూ ఉండొచ్చేమో గాని అసలు కుమాత అనే పదం లేదనే అంటారు. కానీ ఈవిడ చేసిందేమిటి?"

 

"మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడనేది అనేకానేక కారణాల మీద ఆధారపడిఉంటుంది. అందులో డబ్బు ఒకటి, అమ్మాయిలూ, పెరిగిన వాతవరణం, తినే తిండీ అనేవి మరి కొన్ని. ఇప్పుడు నువ్వు ఆవిడని నిలదీస్తే ఈ విషయం తెల్సిపోయినందుకు ప్లేటు ఫిరాయించి మరో మాట చెప్పొచ్చు. మనం ఏం చేయలేం."

 

అర్ధమైనట్టూ తలపంకించి ఇంటికి బయల్దేరింది అపర్ణ.

 

దారంతా ఒకటే అలోచన - ఏదో ఒకటి చేసి కేశవ్ ని, తన వాడైన కేశవ్ ని రక్షించుకోవాలి. దానికన్నా ముందు తన ఇంట్లో తిష్టవేసిన ఈ నరరూప రాక్షసిని వదిలించుకోవాలి. బండి మెల్లగా కదులుతుంటే ఏం చేయాలో చేయకూడదో అనే ఆలోచనల్తో సతమతమౌతూ ఇంటికి చేరింది అపర్ణ.

* * * * * *

కారు గరాజ్ లో పెట్టి లోపలకి వస్తూంటే ఎదురుగా నవ్వుతూ వచ్చే అమ్మ కనిపించింది. ఈ నాటి వరకూ ఆవిడ నవ్వు ప్రేమతో ముగ్ధ మనోహరంగా కనిపిస్తే ఇప్పుడదే నవ్వు వికట్టహాసంతో విషం చిమ్ముతున్నట్టుంది. ఏదో చేయాలని కోపం, తల్లి కనక ఏమీ చేయలేని అశక్తత. ఎంత కంట్రోల్ లో పెడదామనుకున్నా ఉవ్వెత్తున ఎగిసే అణుచుకోలేని అసహ్యం. కొన్ని సార్లు చేతిలో తుపాకి ఉండకపోవడం మంచిదేనేమో, లేకపోతే ఏమౌతుందో? విసురుగా చెప్పులు వదిలి తన గదిలోకి వెళ్ళింది అపర్ణ. వెనకనే వచ్చింది తల్లి, "ఏమైందే, అలా ఉన్నావేం? తలనెప్పా, కాస్త జాండు బాం రాయమంటావా?"

 

"వద్దులే, కాసేపు నన్ను పడుకోనీయ్, బెడ్రూం తలుపు వేసేసి వెళ్ళు. నేను రెండు గంటల్లో లేచి వస్తా,' తల్లి మొహం కేసి చూడకుండా ఉండడం కోసం కళ్ళు మూసుకుంటూ చెప్పింది సమాధానం.

 

మళ్ళీ ఆలోచనలు ముసురుతున్నై ఎడతెగకుండా. ఎక్కడో చదివినట్టు గుర్తు - కుపుత్రో జాయేత్ క్వచిదపి కుమాతా నభవతి అని కదా? మరి తనకి ఇలా అవడానికి కారణం ఏమిటో? తానేం తప్పుచేసింది? తనకు నచ్చిన కేశవ్ ని పెళ్ళిచేసుకోవడం, ఆవిడ చెప్పిన రాజారావుని చేసుకోకపోవడమేనా? ఆ రాజారావు కేశవ్ ముందు ఏ విషయంలో అయినా గడ్డిపోచకి సరితూగగలడా?

 

మంచం మీద నిద్రపట్టక అటూ ఇట్ళు దొర్లడం, తలకింత జాండూ బాం, అది పనిచేయక మరింత కోపం. ఇది కాదు పధ్ధతి. తనకి తెల్సిన దాని ప్రకారం, కేశవ్ అప్పుడప్పుడూ అంటున్నట్టే తాను ప్రొబ్లెం గురించి ఆలోచించడం మానేసి దీనికున్న సొల్యూషన్ గురించి ఆలోచించాలి. గడియారం అప్పుడే ఆరున్నర దాటినట్టుంది. కళ్ళు మూసుకుని ఒక పది నిముషాలు ఆలోచించేసరికి తెల్సింది ఏం చేయాలో. ఫోన్ బయటకి తీసి యునైటెడ్ ఎయిర్ లైన్స్ వారికి చేసింది ఫోను.

ఓ గంట కిందా మీదా పడ్డాక అనుకున్న పని అయింది. 

 

కాస్త తేరుకున్న మనస్సుతో గదిలోంచి బయటకొచ్చి వంటింట్లోకి నడిచింది టీ తాగడనికి. అమ్మా, నాన్నా హాలులో టివిలో వచ్చే ఏదో హిందీ ప్రోగ్రాము చూస్తున్నట్టున్నారు. తనకి తల్లి అయిన ఈవిడా, తండ్రి అయినా ఆయనా ఇద్దరికీ ఇద్దరే. టీ కప్పు చేత్తో పట్టుకుని వచ్చి వేరేచోట ఉన్న సోఫాలో కూర్చుంటూ చెప్పింది, "ఇప్పుడే మరోసారి డాక్టర్ తో మాట్లాడాను. ఓ గంటలో హాస్పిటల్ కి రమ్మన్నాడు. నేను వెళ్ళి చూసొస్తా. రాత్రికి నాకు ఏమీ వండవద్దు. మీరిద్దరూ తినేసి నిద్ర వస్తే పడుకోండి, నాకోసం చూడకండి.”

 

"అదేమిటే, అల్లుడికి అలా అయినందుకు మాకూ మనసు మనసులో లేదు. నువ్వు కూడా ఇలా తిండి తిననంటే ఎలా? అరోగ్యం సరిగ్గా చూసుకోవద్దా? నన్ను రమ్మంటావా డాక్టర్ దగ్గరికి? నీకు తోడు ఉండడానికి?"

 

"వద్దులే, ఆ డాక్టర్ నువ్వు వస్తే ఏమంటాడో? ఈ అమెరికాలో ప్రతీదానికీ మెడికల్ రికార్డులన్నీ ప్రైవేట్ అనీ ఆ విషయాలు బయటకి ఎవరికీ చెప్పకూడదనీ రూల్స్ ఉన్నై అసలే. నేను చూసొస్తానులే," తల్లి ఇంకేం మాట్లాడ్డానికీ అవకాశం ఇవ్వకుండా నోరు మూయించింది అపర్ణ. తండ్రి ఎప్పట్లగానే భార్యావిధేయుడు కనక ఆయన నోరు మెదపడూ, ఈవిడ మెదపనివ్వదూ.

 

రాత్రి పది దాటుతుంటే ఇంటికొచ్చిన అపర్ణ వస్తూనే చెప్పింది స్థిరంగా, "ఇప్పుడో పెద్ద ప్రొబ్లెం వచ్చింది. కేశవ్ ని కెనడాలో ఉన్న స్పెషలిస్ట్ దగ్గిరకి తిసుకెళ్ళాలిట. మీరిద్దరూ రావడం కుదరదు వీసా ప్రొబ్లెం వల్ల. అందువల్ల మీ ఇద్దరికీ టికెట్లు మార్పించాను. రేపు రాత్రికే మీరిద్దరూ ఇండియా వెళ్ళిపోతున్నారు. నేను కేశవ్ తో కలిసి వెళ్లి కెనడా లో ఉండాలి ఈ ట్రీట్ మెంట్ ఆరువారాలు అయ్యేవరకూ. కెనడాలో అయితే బాగా కుదిరే చాన్స్ ఉంది అన్నారు. నేను ఎప్పటికప్పుడు మీకు చెప్తా కేశవ్ ఎలా ఉన్నాడో. ఇంక భోజనం వద్దు ఈ రోజు నాకు. నేను పడుకుంటా, మీ సామాను మీరు సర్దుకోండి."

 

“అదేమిటే, మేము ఇక్కడ ఉంటే మీకు వంటా అదీ సహాయం చేస్తాంగా?” అమ్మ అడిగింది, తన బెడ్రూం లోకి వెళ్ళిపోయే కూతుర్ని చూస్తూ. 

 

తల్లీ తండ్రీ చూస్తుండగా అపర్ణ వెనక్కి వచ్చి చెప్పింది, “చెప్పానుగా, అసలే నాకు దేనికీ తీరికలేదు, కెనడా రావడానికి మీకిద్దరికీ వీసా లేదు. అది రావాలంటే ఎంత కాలం పడుతుందో తెలియదు. ట్రీట్ మెంట్ కి కెనడా వెంఠనే వెళ్ళమని చెప్పారు.  అందుకే ఇలా చేసాను. మీ ఇద్దరూ వెళ్ళే విమానం రేపు మధ్యాహ్నం రెండింటికి, నేను మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకెళ్తా పొద్దున్న. కేశవ్ ని చూసాక అట్నుంచి అటే విమానాశ్రయంలో దింపుతా."

 

మరో సారి నోరు నొక్కేసినట్టైంది అపర్ణ అమ్మకి. తండ్రి కూతురికేసి చూద్దామనుకునేలోపులే అపర్ణ తన గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుంది.

* * * * * *

మర్నాడు పొద్దున్నే సామాను సర్దేసి పదింటికే బయల్దేరారు ముగ్గురూ. ముందు హాస్పిటల్ కి ఆ తర్వాత అట్నుంచటే ఎయిర్ పోర్ట్ కీను.  హాస్పిటల్ లో అత్తగారు ఎంతో బాధపడుతున్నదానిలా కేశవ్ తో చెప్పడం అందరూ విన్నదే, "నీకిలా అయిందిప్పుడు అనుకోకుండా. మేము సహాయం చేద్దామనుకున్నాం కానీ ఇలా వెళ్ళిపోవాల్సి వస్తోంది,” వగైరా వగైరా. మావగారు ఏమాటంటే ఎటొస్తుందో అనే శంకో మరోటో గాని ఏమీ పెద్దగా మాట్లాడలేదు. ఓ అరగంట కూర్చున్నాక కేశవ్ ఏమీ మాట్లాడకపోవడం చూసి లేచారు వెళ్లడానికి. మావగారు వెళ్తూ, వెళ్తూ కేశవ్ చేతిని షేక్ హాండ్ టైపులో ఓ సారి నొక్కి వెళ్ళాడు.

 

ఎయిర్ పోర్ట్ లో బోర్డింగ్ పాస్ లు తీసుకున్నాక మీరింక దయచేయవచ్చు అంటున్నట్టూ అపర్ణ చెప్పింది, "నేను వెళ్ళి కేశవ్ దగ్గిరుండాలి డాక్టర్ వచ్చేసరికి, నేను వెళ్తాను. వెళ్ళాక ఫోన్ చేయండి."

 

కూతుర్ని దగ్గిరకి లాక్కుని కాగలించుకుందామనుకునే అమ్మకి దూరంగా జరిగింది అపర్ణ. వాళ్లు చేతిలో ఉన్న సామాను మోసుకుంటూ చెకింగ్ లోకి వెళ్తూ వెనక్కి చూసేరు ఓ సారి కూతుర్ని చూడ్డానికి. అప్పటికే అపర్ణ బయటకి వెళ్ళిపోయింది. చెకింగ్ అయ్యి లోపలకి వెళ్ళాక అపర్ణ అమ్మ అంది వాళ్ళాయనతో, "ఇప్పుడు మనకి ఆఖరికి భోజనం కూడా లేదు. ఏదైనా కొందామంటే జేబులో రూపాయలు తప్ప ఏమీ లేవు. కూతురు ఇలా చేస్తుందని నేను అనుకోలేదు. ఇది ఇలా తయారయ్యిందేమిటండి?"

 

ఆయనేదో అనబోయి ఈవిడ తన నోట్లోంచి వచ్చేదానికి ఏం అర్ధం తీస్తుందో అనుకుంటూ చప్పున నోరు మూసుకున్నాడు.

 

తర్వాత జరగాల్సినవి అతి మామూలుగా జరిగిపోయేయి. మొదటి విమానంలో ఇచ్చిన వేరు శెనక్కాయలో మరోటో తింటూ చికాగో చేరారు దంపతులు. అక్కడ ఓ నాలుగ్గంటలు ఆకలితో మాడుతూ కూర్చున్నాక మరో గంటకి ఆహారం అందింది ఇండియా వెళ్ళే విమానంలో.

* * * * * *

హాస్పిటల్ కి వచ్చిన అపర్ణ కేశవ్ తో చెప్పింది తాను చేసిన పని. 

 

“కెనడా వెళ్ళాలా అయితే ఇప్పుడు మనం? మరి మనకి మాత్రం వీసా ఉండక్కర్లేదా అని వాళ్ళు అడగలేదా?” నవ్వుతూ అడిగాడు కేశవ్.

 

“ఈ విషయాలు ఆ మాత్రం తెల్సి చస్తే ఇటువంటి చచ్చు ప్లాన్ లు వేసేదా ఆవిడ? ఛీదరించుకుంది అపర్ణ.

 

మరో వారంలో కొంత కోలుకున్నాక ఇద్దరూ ఇంటికొచ్చారు. డాక్టర్ చెప్పడం ప్రకారం మందులు వాడుతూనే ఉండాలి. ఓ సారి విషం వంట్లోకి చేరకుండా చూసుకున్నాక వంట్లో అప్పటికే చేరినది ఫ్లష్ అయి బయటకి పోవడానికి ఆరు నెలలు పట్టవచ్చు.

 

ఇండియాలో ఉన్న అమ్మ నుంచి వచ్చే ఫోన్లు వస్తూనే ఉన్నై అపర్ణకి. అపర్ణ ఆ కాల్స్ కి సమాధానం చెప్పడం మానేసి చాలా రోజులైంది. కేలండరులో నెల మారి మొదటి తారీఖు వచ్చాక మరింతగా వచ్చే ఫోన్లు చూసి కేశవ్ అడిగాడు, "మరీ ఇంతగా చేస్తున్నారు - నువ్వు నెల నెలా పంపే డబ్బులు రాలేదేమో, ఒకసారి చూడు."

 

ఈ సారి అపర్ణ చెప్పింది, "ఆవిడకీ నాకూ ఇంక తీరిపోయినట్టే. నేను జన్మలో ఆవిడ మొహం చూసేది లేదు. నెల నెలా డబ్బులా నా మొహమా. అవన్నీ వాళ్ళని ప్లేన్ ఎక్కించగానే కట్టిపెట్టాను. ఇంక మన దారి మనదీ వాళ్ల దారి వారిదీ."

 

"వాళ్లకెవరూ లేరుగా మరెలా?"

 

"నీ అదృష్టం తల్చుకో కేశవ్, ఆ నరరూప రాక్షసులు ఎలా పోతే నీకేం? అయినా ఆవిడ అమ్మ అవడం నాకు, నీకు కాదు. నాకే ఆవిడ గురించి లేనిది నీకేల? ఈ రోజుక్కూడా నేను చేతిమీద గిల్లి చూసుకోవాల్సి వస్తోంది, అసలీవిడ ఇటువంటిదా అనే విషయం. ఆవిడ బతుకుతుందా ఛస్తుందా అనేది నాకేల?"

 

"పోనీయ్, మనం బతికి బయటపడ్డాం. డబ్బులొచ్చాక మనుషులెలా ఉంటారో, స్వంత బంధువులే ప్రాణాలు తీయడానికెలా తెగిస్తారో తెలిసి వచ్చింది," అపర్ణ దగ్గిరకి తీసుకుంటూ అన్నాడు కేశవ్.

 

“ఓ సారి ఐఐటి లో ఉన్నప్పుడు అన్నావు గుర్తుందా, నీకెవరో గార్డియన్ ఏంజెల్ ఉంది రక్షించడానికి అని? ఆ ఏంజెల్ లేకపోతే ఏమై ఉండేవాళ్ళం? అసలు మనకీ విషయం టాక్సికాలజిస్ట్ చెప్పకపోతే ఏమై ఉండేదో తల్చుకోవడానికే భయం గా ఉంది," కేశవ్ ని హత్తుకుంటూ అంది అపర్ణ.

 

"శుభం కార్డు పడిందిగా, ఇంకా అదే గొడవా? అయినా హేయ్, ఓ మాట చెప్పమంటావా?"

 

"ఏమిటది?” అపర్ణ తలెత్తి కుతూహాలంగా చూసింది.

 

“నా గార్డియన్ ఏంజెల్ నాకు కనపడకుండా ఆకాశంలోంచి రక్షిస్తూ ఉంటుందనుకునేవాణ్ణి, కానీ ప్రస్తుతానికి ఆవిడ నా కౌగిట్లోనే ఉంది,” అపర్ణని మరింత దగ్గిరగా లాక్కుని చెప్పేడు కేశవ్.

 

(లాటరీ వచ్చాక ఏ డబ్బులైతే తమకి సుఖం ఇస్తుందనుకున్నారో వాటివల్లే దుఖాంతం అయ్యే కధలు చాల ఉన్నాయి. సుఖాంతం చేస్తూ అల్లిన కధ ఇది. ఎక్కడైనా ఇలా జరిగినట్టు మీకు తెలిస్తే అది పూర్తిగా కో ఇన్సిడెన్స్ మాత్రమే, నా కధకీ ఆ జరిగిన వాటికీ ఏమీ సంబంధం లేదు)

bottom of page