MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
నా డైరీలో గొల్లపూడి గారి పేజీలు
వంగూరి చిట్టెన్ రాజు
ఐదేళ్ళ క్రితం అనుకుంటాను.....అంటే సుమారు 2015 డిశంబర్ లో గొల్లపూడి మారుతీ రావు గారిని పిలిచి “గురువు గారూ, హ్యూస్టన్ లో కొంతమంది ఔత్సాహికులం కలిసి “మధురవాణి” అనే అంతర్జాల సాహిత్య పత్రిక మొదలుపెడదాం అనుకుంటున్నాం. మీకు తెలుసో లేదో అందులో మీరు ఒక ధారావాహిక వ్రాస్తున్నారు” అని ఆయనతో ఉన్న చనువుతో చమత్కారంగా చెప్పగానే ఆయన తన ట్రేడ్ మార్క్ నవ్వ్వు గల గలా నవ్వేసి “అయ్యో, అంతకంటేనా రాజాధిరాజా, మార్తాండతేజా...కానీ ‘నెల తప్పకుండా’ రాయడం కుదరదేమో” అన్నారు గొల్లపూడి గారు తన సహజసిధ్దమైన శ్లేష జోడించి..అంటే ప్రతీ నెలా రాయడం కుదరదేమో...అని ఆయన అనుమానం.
“మీకు అంత శిక్ష వెయ్యను లెండి. మీ కమిట్ మెంట్స్ నాకు తెలుసు. మా పత్రిక త్రైమాస పత్రిక..అంటే మూడు నెలలకి ఒకసారి వస్తుంది. అలా వ్రాస్తే చాలు.” అని ‘మధురవాణి’ నేపధ్యం చెప్పగానే “మీరు ఆర్డర్ వేస్తే కాదనగలనా కానీ కనీసం నెల ముందు నాకు జ్ఞ్జాపకం చేస్తూ ఫోన్ చేసి పలకరించండి. మీతో మాట్లాడుతూ ఉంటే నాకూ, మా శివానీకి ధైర్యంగా ఉంటుంది” అన్నారు గొల్లపూడి గారు. అది కూడా ఆయన “స్టాక్’ డైలాగే. అలాంటిదే ఆయన మరొక డైలాగ్ “అమెరికాలో నాకు చాలా మంది తెలుసు కానీ అతి కొద్ది మంది మిత్రులలో మీరుంటారు.” అనేది కూడా ఆయన కొద్ది మంది తోనో, చాలా మంది తోనో అన్నప్పటికీ అది కేవలం మన ఒక్కరితోటీ మాత్రమే అంటున్నట్టుగా ఆప్యాయంగా చెప్పడం గొల్లపూడి గారి లౌక్యానికీ మరొక ఉదాహరణ.
మాట ఇచ్చినట్టు గానే గొల్లపూడి మారుతీ రావు అంతటి సాహితీ దిగ్గజం మా ‘మధురవాణి’ పత్రికకి 2016 ఉగాది సంచిక నుంచీ ఇటీవల దాకా “నా డైరీలో ఒక పేజీ” అనే ధారావాహిక నిర్వహించి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది పాఠకులని అలరించి, మా పత్రికకి ఎనలేని ప్రాచుర్యం, గౌరవం కలిగించారు. గత డిశంబర్ 12, 2019 నాడు గొల్లపూడి మారుతీ రావు గారు తన 80 వ ఏట పరమ పదించడం ఎంతో బాధాకరం. ఇప్పుడు నా డైరీలో గొల్లపూడి గారి పేజీలు అనే పేరిట ఆయనతో నాకు పెనవేసుకున్న అనుబంధాన్నీ, కొన్ని జ్ఞాపకాలనీ క్లుప్తంగా పంచుకుంటూ గొల్లపుడి మారుతీ రావు గారి దివ్య స్మృతికి ఈ ‘మధురవాణి’ సంచిక ని మా బృందం తరఫున అంకితం ఇస్తున్నాం.
గొల్లపూడి మారుతీ రావు గారిదీ నాదీ సుమారు 30 ఏళ్ల “చొక్కా” ల అనుబంధం. ఎందుకంటే ఆయన భాషలోనే చెప్పాలంటే “నేను ఎప్పుడు అమెరికా వెళ్ళినా చిట్టెన్ రాజు గారి చొక్కా పట్టుకు తిరుగుతాను. అలాగే ఆయన ఇండియా ఎప్పుడు వచ్చినా నా చొక్కా వదలరు”. ఆయనా, నేనూ మొట్ట మొదట 1991 లో న్యూ ఆర్లీన్స్ లో కలుసుకున్నప్పుడు అమెరికాలో వాతావరణం చాలా ‘వేడి’గా ఉంది. అంటే ఏదో వేసవి కాలం కాబట్టి వేడి కాదు. అప్పుడు తానా సంఘం కేవలం కులాల ప్రాతి పాదికగా రెండుగా చీలి పోతూ ఉండగా అమెరికాలో మా బోటి మామూలు తెలుగు వారందరూ ఏమీ చెయ్య లేక రగిలి పోతున్న సామాజిక వేడి అమెరికా అంతటా వ్యాపించిన సందర్భం. ఆ తపనతో నేను వ్రాసిన “ఏడవ లేక నవ్విన సన్యాసి” అనే నాటకం న్యూ ఆర్లీన్స్ లో వేశాం. అందులో మూడు పాత్రలు ఎవరి కులం పాత్ర ఆ కులం వారే ధరించి, పేరు చెప్పి ఆయా కులాల అహంభావాలని వేదిక మీద బాహాటంగానే ప్రదర్శిస్తూ జట్కా సంఘం...అంటే Joint Association of Telugu Cultural Associations లో మొదటి అక్షరాలనమాట...ఆ… అఖిల అమెరికా తెలుగు సంఘం అధ్యక్ష పదవి కి పోటీ చేసి ఆఖరికి అన్ని కులాల వారూ కలిసి మెలిసి ఉండాలి అని ఒక సైకియాట్రిస్ట్ ఇచ్చిన సలహా పాటించడమే ఆ నాటిక సారాంశం. సుమారు మూడు వేల మంది ప్రేక్షకులు ఆనాడు ఆ నాటికని చూసి చలించిపోయారు. ఇంచు మించు పదిహేను నిముషాలు నిశ్చేష్టులై నిలబడి పోయీ, చాలా మంది స్టేజ్ వెనక్కి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూనూ ఆ నాటి అమెరికా తెలుగు వారి సాంఘిక సమస్యకి కులమతాలకి అతీతంగా అనూహ్యంగా స్పందించారు. గొల్లపూడి గారు మా నాటికనీ , ఈ ప్రేక్షకుల స్పందననీ సైడ్ వింగ్స్ లోంచి చూశారు. ఆ నాటికా, దానికి వచ్చిన స్పందనా చూసి, నిర్ఘాంతపోయి, నా దగ్గరకి వచ్చి “అయ్య బాబోయ్, మీ పేరేమిటో గానీ, మరీ అంత ధైర్యంగా ఎలా రాయగలిగారూ. ఇదే డ్రామా ఆంధ్రా లో వేస్తే ఈ పాటికి మిమ్మల్ని హత్య చేసి ఉండే వారు” అన్నారు నాతో గొల్లపూడి గారు. అంతే కాదు. “దీని తరవాత మా డ్రామా ఎవరూ చూడరు. కేన్సిల్ చేసేద్దాం” అని కూడా అనడంతో నేనూ, నిర్వాహకులూ కంగారు పడినా అంతా సద్దుమణిగి గొల్లపూడి గారి “ఓ మనిషి గోతిలో పడ్డాడు” నాటిక అద్భుతంగా ప్రదర్శించారు. అందులో ఆయనా, జె.వి. సోమయాజులు గారూ, పద్మనాభం, తులసి మొదలైన వారు వేశారు. అదే నాకు గొల్లపూడి వారితో తొలి ప్రత్యక్ష పరిచయం. ఆ నాటి రాత్రి అంతా మిస్సిసిప్పి నది మీద క్రూజ్ లో వీరందరితోటీ, ముఖ్యంగా గొల్లపూడి గారితో ఓడ మీద గడపడం ఒక మరపురాని అనుభూతి.
రెండో సారి ఆయన్ని 1994 లో నవ్య సాహితీ సమితి వారు మా కాలనాధ భట్ట వీరభద్ర శాస్త్రి గారి నిర్వహణలో విజయవాడ లో జరిగిన అఖిల భారత తెలుగు రచయితల సమ్మేళనంలో కలుసుకోవడమే కాకుండా చాలా సమయం గడిపాం. ఆ సభలో నా మొట్ట మొదటి పుస్తకం “అమెరికా అపహాస్య నాటికలు” మారుతీ రావు గారే ఆవిష్కరించి, నన్ను గుర్తుపట్టి అంతకు మూడేళ్ళ ముందు న్యూ ఆర్లీన్స్ లో జరిగిన ఉదంతాన్ని “ఈయన ఇలా కనపడతాడు కానీ చాలా దమ్ము ఉన్న రచయిత” అని ఆ సభలో ఆ నాటకం గురించి చెప్పడం నాకు చాలా ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగించింది. అప్పుడు ఆయనా, లత గారూ, ఎన్. ఆర్. నంది గారూ, పాలగుమ్మి విశ్వనాధం గారూ గంటల తరబడి అమెరికా విషయాలు చాలానే మాట్లాడుకున్నాం. అప్పటికి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మొదలు పెట్టి రెండు నెలలే అయింది. నేను పాల్గొన్న మొట్ట మొదటి సాహిత్య సభ అదే కావడంతో ఆ సంస్థ ని ఎలా తీర్చి దిద్దాలీ అనే అంశమీద అప్పటికీ అనేక దేశాల అనుభవం ఉన్న గొల్లపూడి గారి సలహాలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. నా ఆలోచనా పరిధి విస్తరించింది. కాలక్రమేణా మా అనుబంధం అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంది. ఆ తరువాత గొల్లపూడి గారిని అమెరికా, సింగపూర్, ఇంగ్లండ్, ఆస్త్రేలియా దేశాలకి ఆహ్వానించగలిగాను కానీ, నేను ఎంత ప్రయత్నించినా లత, పాలగుమ్మి, ఎన్నార్. నంది గార్లని అమెరికా ఒక్క సారి కూడా తీసుకురాలేక పోవడం నాకు ఇప్పటికీ ఎంతో బాధగా ఉంటుంది.
2009 లో మేము హైదరాబాద్ లో నిర్వహించిన రెండవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు గొల్లపూడి గారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించడమే కాకుండా ఆయన సతీమణి శివానీ గారితో కలిపి ఆయనకి “జీవన సాఫల్య పురస్కారం” ప్రదానం చెయ్యడం నా జీవితంలో నాకు ఎంతో ఆనందాన్నీ, సంతృప్తినీ ఇచ్చింది. అప్పుడు “ఇప్పటి దాకా నాకు చాలా ఎవార్డులు వచ్చాయి కానీ, ఇలా లైఫ్ టైమ్ ఎఛీవ్ మెంట్ అవార్డు ఇదే మొదటి సారి.” అని గొల్లపూడి గారు అనగానే ఆశ్చర్య పోయాను. ఆ తరువాత ఆయనకి అటువంటి పురస్కారం ఎప్పుడు వచ్చినా “దానికి మీరే బోణీ కొట్టారు రాజు గారూ. మీ హస్త వాసి మంచిది” అంటారు గొల్లపూడి గారు. బాపు-రమణల తర్వాత మేము అలా సత్కరించిన వ్యక్తి గొల్లపూడి గారే.
అలాగే 2016 లో సింగపూర్ లో జరిగిన 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు లో గొల్లపూడి వారు ఆహ్వాన అతిధిగా పాల్గొని అద్భుతమైన ఉపన్యాసం చేశారు. ఇక్కడ ఒక చిన్న విషయం ప్రస్తావిస్తాను. ఆయనని ఆహ్వానించినప్పుడు “గురువు గారూ, సింగపూర్ ఖర్చులు అన్నీ పెట్టుకుంటాను కానీ పారితోషికం అంత ఇవ్వలేను సార్” అని నేను అనగానే “చిట్టెన్ రాజు గారూ. మీరు చేస్తున్నది నిస్వార్ధ సేవ. అయినా మిమ్మల్ని డబ్బు గురించి అందరూ దొబ్బడం నేను గమనిస్తూనే ఉన్నాను. మీ దగ్గర నుంచి నేను నయా పైసా కూడా పుచ్చుకోను.” అని భుజం తట్టారు. అదే స్ఫూర్తితో ఆయన మేము నిర్వహించిన అనేక అంతర్జాతీయ కథల పోటీలకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. నేను రచించిన “అమెరికాడీ నాటికలు”, “అమెరికాకమ్మ కథలు” మొదలైన పుస్తకాలకి ఆయనే ముందు మాటలు వ్రాశారు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. చాలా మంది “లబ్ధ ప్రతిష్టులు” ముందు మాటలంటే మొహమాటానికి పోయి పుస్తకం చదవకుండానే జనాంతికంగా నాలుగు ‘మందు’ మాటలు బరికి పారేసే వాళ్ళలా కాకుండా గొల్లపూడి గారు ప్రతీ పుస్తకం ఒకటికి మూడు సార్లు చదివితే కాని తన ముందు మాట వ్రాయరు. అంతే కాదు యావత్ ప్రపంచంలో ఆయన ఎక్కడ ఏ అంశం మీద ఎంత సేపు మాట్లాడినా అది లోతైన అవగాహనతో, మధ్యే మధ్యే చమత్కారాలతో అనర్గళంగా ఉండవలసినదే! దటీజ్ మారుతీ రావ్!
ఇక మారుతీ రావు గారి అసమానమైన, అనితర సాధ్యమైన సాహిత్య కృషికి మరొక ఉదాహరణ ఆయన HMTV లో 120 వారాల పాటు నిర్వహించిన “వందేళ్ళ కథకి వందనాలు” టీవీ ధారావాహిక కార్యక్రమమే కాక 2017 లో అదే పేరిట ఆయన ప్రచురించిన 1350 పేజీల బృహత్ గ్రంధం. అందులో గురజాడ వారి ‘దిద్దుబాటు’ తో మొదలు పెట్టి 116 కథలే కాక ఆయా కథకుల సునిశిత జీవిత పరిచయం చేశారు గొల్లపూడి గారు. నాకు ఇప్పటికీ తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళు గగుర్పొడిచే అంశం ...గొల్లపూడి గారు తెలుగు సాహిత్య చరిత్రలో అత్యంత ప్రతిభావంతులైన 116 మంది కథకుల సరసన నన్ను కూడా నిలబెట్టి, నా “జులపాల కథ” ని ఆ 116 కథలలో ఒకటిగా ఎంపిక చేసి, తిరుపతిలో అప్పటి సంయుక్త ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణ లో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభల సమయంలో నన్ను HMTV లో నన్నూ, ఆ కథనీ పరిచయం చేసి నన్ను ధన్యుడిని చేశారు. దానికి ఆయన ఇచ్చిన ఉపోద్ఘాతం లో “ఈ ధారావాహికలో ఉన్న అన్ని కథలూ ఆయా రచయితలు అనుభవంతో చేయి తిరిగిన తరువాత వ్రాసినవే కానీ చిట్టెన్ రాజు గారు వ్రాసిన మొట్టమొదటి కథే అలా ఎంపిక కావడం ఒక ప్రత్యేకత” అన్నారు గొల్లపూడి గారు. ఇక్కడ అప్రస్తుతం అయినా, 2012 లో తిరుపతి మహా సభల సందర్భంగా అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెలువరించిన వేల కొద్దీ పేజీల ప్రత్యేక సంచికలో నామ మాత్రానికైనా మా అమెరికా తెలుగు వారి సాహిత్య కృషిని ప్రస్తావించకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించినా కానీ గొల్లపూడి వారు తన బృహత్ కథా సంకలనంలో నాదీ, కల్పనా రెంటాల కథ “అయిదో గోడ” (ఆ కథ కూడా వంగూరి ఫౌండేషన్ నిర్వహించిన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన కథల పోటీలో గొల్లపూడి గారే ఎంపిక చేసిన ఉత్తమ కథా విజేత), అమెరికాలోనే కాక తదితర విదేశాలలో వికసిస్తున్న తెలుగు సాహిత్యానికి తగిన గుర్తింపు ఇచ్చి అంతర్జాతీయ సాహిత్య అవగాహనలో తనదైన ముద్ర వేశారు. తిరుపతిలో ఆ మహా సభలు HMTV లో నా పరిచయం తర్వాత “పదండి. పెద్దాయన దర్శనం చేసుకుందాం” అని నన్నూ, గణేష్ పాత్రో గారినీ దగ్గరుండి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక దర్శనం చేయించారు గొల్లపూడి గారు.
మరొక్క ముఖ్య విషయం....ఒక సారి మాటల సందర్భంలో నేను వ్రాసిన హాస్య కథలలో కొన్నింటిని ఒక టీవీ సీరియల్ గా తీస్తే బావుంటుంది అని చాలా మంది సూచించినప్పుడు నేను సలహాల కోసం మొదట పిలిచినది ఇద్దరినే.... గొల్లపూడి గారినీ, ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారినీ. బాలూ గారు చాలా మంది టీవీ వాళ్ళని పరిచయం చేసీ, ఇతర విధాలుగానూ ఎంతో సహాయం చేశారు. ఇక కథ, ప్రతీ ఎపిసోడ్ స్క్రీన్ ప్లే లు రాయడానికి గొల్లపూడి గారూ, నేనూ హైదరాబాద్ లో ‘సాయి కుటీర్’ లో పది రోజులు సమావేశం అయ్యాం. ఆ సమయంలో ఒక Z తెలుగు TV లో పని చేసే ఒకాయన గొల్లపూడి గారిని చూడ్డానికి రాగానే నన్ను ఆయనకి పరిచయం చెయ్యడమే కాకుండా, నేను వ్రాసి, వేసిన “అసలు ప్రశ్న” నాటకాన్ని గొల్లపూడి గారు ఆయనకి చూపించారు. అంతే! అనుకోకుండా ఆ మర్నాడు ఆ టీవీ ప్రొడ్యూసర్ గారు గొల్లపూడి గారి సలహా మీద తను తీస్తున్న ఒక టీవీ సీరియల్ లో ఆరు ఎపిసోడ్స్ లో నాకు ఒక ముఖ్య పాత్ర ఇచ్చి నన్ను టీవీ నటుణ్ణి చేశారు. ఆ విధంగా నా టీవీ అరంగేట్రం గొల్లపూడి గారి చేతుల మీదుగానే జరిగింది.
ఇక శివానీ గారు....అనగా గొల్లపూడి గారి సతీమణీ, శివ కామ సుందరి గారు....ఆమెకి నేను పిన్ని గారు అనే పిలుస్తాను... ఆమె ఆత్మీయత గురించి ఎంత వ్రాసినా తక్కువే. నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినా ఆవిడ చేతి వంట తినకుండా రాలేదు. ఒక సారి...2008 లో... న్యూయార్క్ మహా నగరం లో శివానీ గారికీ, నాకెంతో ఆత్మీయురాలూ, ప్రముఖ రచయిత్రీ అయిన శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారికీ, గొల్లపూడి గారికీ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూపించినప్పుడు “అదిగో శివానీ. ఆ దేవతకి దణ్ణం పెట్టుకో. కనక వర్షం కనికరిస్తుంది. నీకు గ్రీన్ కార్డ్ వచ్చినా రావచ్చు. నీతో బాటు నాకూనూ...” అని చమత్కరించారు మారుతీ రావు గారు. ఆ ఏడు కాలిఫోర్నియా లో జరిగిన 6వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కి గొల్లపూడి గారూ, రమణి గారూ ఆహ్వానిత అతిధులు.
గొల్లపుడి మారుతీ రావు గారితో నా వ్యక్తిగత అనుబంధం గురించి ఇలా రాసుకుంటూ పోతే ఎంతయినా ఉంది కానీ ఆఖరి మాటగా...
ఈ ఏడాది మొదట్లో...జనవరి, 2019 లో వైజాగ్ నుంచి ఎవరో ఒకాయన “రాబోయే ఏప్రిల్ లో మన గొల్లపూడి మారుతీ రావు గారి 80వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన మీద ఒక అభినందన సంచిక తెద్దాం అనుకుంటున్నాం. ఆయన అమెరికా మిత్రుల పేర్లు చెప్పమనగానే మారుతి గారు కిరణ్ ప్రభ గారి పేరూ, మీ పేరూ, చెప్పారు. ఆ సంచిక లో మీరు గొల్లపూడి గారి గురించి ఏదైనా వ్రాయగలిగితే బావుంటుంది.” అని అడిగారు. అంత కంటే అదృష్టం ఏముంటుంది. అలాగే వ్రాశాను. ఇప్పటి ఈ వ్యాసం లాగానే....అపురూపమైన జ్ఞాపకాలతో ...అది ఆయన నాకు కలిగించిన మరొక అసమానమైన గౌరవం, నా మీద చూపించిన అనురాగం.
సకల విద్యా పారంగతుడు, బహు ముఖ ప్రజ్ఞాశీలి, ఆప్త మిత్రులూ అయిన గొల్లపూడి మారుతీ రావు గారే మాలాంటి అసంఖ్యాక అభిమానులకి అసలైన కళా ప్రపూర్ణుడు, పద్మ విభూషణుడు..అన్ని బిరుదులకీ, సన్మానాలకీ అతీతుడు..ఆయన ఇప్పుడు మన మధ్య లేక పోవడం ఎంతో బాధాకరమే అయినా ఆయన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మనతో ఉంటాయి. నాతోనే ఉంటాయి. గొల్లపూడి మారుతీ రావు గారి ఆత్మకి శాంతి చేకూరాలి అని మా మధురవాణి బృందం తరఫునా, వ్యక్తిగతంగానూ ప్రార్ధిస్తూ ఆయనకి మా అశృ నివాళి అర్పిస్తున్నాం.
.
*****