top of page

సంపుటి  5   సంచిక  1

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

పాండి బజార్ కథలు - 10

ఖుషీ కార్నర్

సి.నా.రె. - సవ్యసాచి

భువనచంద్ర

"సి.నా.రె" అనగానే నాకు 'యమునా కినారే' అన్నట్టు అనిపిస్తుంది. అంటే 'యమునాతీరాన' అని అర్ధం. అక్కడేముంటుంది? ప్రేమకి పర్యాయపదమైన రాధాకృష్ణులు ఉంటారు. అద్భుతమైన ఓ ఆధ్యాత్మిక, అలౌకిక అనుభవంతో మనసు పరవశిస్తుంది. అందుకే... సినారె అంటే నాకు అంత అభిమానం"తాదాత్మ్యంగా అన్నాడు ర.మో.

"అవును. ఆయన ఓ విలక్షణ కవి. ఏ పాట వ్రాసినా అందులో ఆద్భుతమైన సంస్కారం తొణికిసలాడుతూ వుంటుంది. చదివింది ఉర్దూలో అయినా, తెలుగు భాష మీద ఆయనకున్న పట్టు, ప్రజ్ఞ అసామాన్యం, అనితరసాధ్యం"భక్తిగా అన్నాడు గుంటూరు గాలిబ్.

 

"నేను కలిసిన మహా కవుల్లో ఆయనొకరు" ఆనందంగా నవ్వి అన్నారు ప్రొడక్షన్ చీఫ్‌గా పని చేసి విశ్రాంతి తీసుకుంటున్న గురయ్యగారు.

 

"అదృష్టం అంటే మీదే. సరేగానీ, ఆయన ఓ విధంగా సినీ శ్రీనాధుడే. ఆయన చేపట్టని కవితా ప్రక్రియ లేదు. గజల్, ప్రపంచ పదులు.. ఆ సంగతి పక్కన పెడితే ఆయనకున్నంతమంది శిష్యులు, ప్రశీష్యులు ఏ కవికీ లేరనడం అతిశయోక్తి కాదు. అలాగే ఆయన అధ్యక్షత వహించిన/ఉపన్యసించిన సభల్ని గనక లెక్కపెట్టి  ఉంటే ఎన్నో గిన్నీస్ బుక్కు రికార్డుల్ని తమంతట తామే తిరగవ్రాసుకుని వుండేవి"ఉపన్యాసధోరణిలో అన్నారు ముక్తేశ్వర్రావుగారు.

 

"అయ్యా.. ఆయన్ని గురించి మాట్లాడాలంటే రోజులు చాలవు. ఆయన సాహిత్యం గురించి మాట్లాడాలంటే  నెలలు సంవత్సరాలు కూడా చాలవు. అందుకే ఓ మాంచి సినారె పాటెత్తుకుందాం" ప్రపోజ్ చేసారు సైకిల్ మూర్తి.

 

"ఆహా.. చాలామంది  'నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ' ఆయన మొదటి పాట అనుకుంటారు. ఆయన మొదటి పాట 'కలల అలలపై తేలెను మనసు మల్లె పూవై' కూడా 1962లో వచ్చిన గులేబకావళి కథ లోదే. ఆయన వ్రాసిన పాటలు అజరామరాలు. గులేబకావళి కథ లోనే 'మదన సుందర నా దొరా' అనే పాట కూడా ఉంది. అద్భుతమైన పాట. కానీ, ప్రేయసి ఎదట ఓ పాట పాడి ఆమె మనసు గెలుచుకోవడానికి 'తగిన' పాటగా అప్పటికీ ఇప్పటికీ నిలిచిపోయిన పాట 'నన్ను దోచుకుందువటే' పాట. ఇదిగో" అంటూ గొంతు సవరించాడు ర.మో.

 

"రెడీ" అన్నది సావిత్రి హుషారుగా..

 

******

 

చిత్రం: గులేబకావళి. సంగీతం: జోసెఫ్, కృష్ణమూర్తి.

గానం: ఘంటసాల, సుశీల, రచన: సి.నా.రె.

 

పల్లవి:

నన్ను దోచుకుందువటె

నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని

కన్నులలో దాచుకొందు నిన్నే

నా స్వామి నిన్నే నా స్వామి

||నన్ను ||

 

చరణం 1:

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన

పూలదండవోలె కర్పూర

కళికవోలె కర్పూర కళికవోలె

 

ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు

ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు

కలకాలము వీడని సంకెలలు

వేసినావు.. సంకెలలు వేసినావు

 

||నన్ను ||

 

చరణం 2:

నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై

నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై

వెలసినావు నాలో నే కలసిపోదు

నీలో కలసిపోదు నీలో

 

ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం

ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం

ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం

ఇగిరిపోని గంధం...

 

||నన్ను || 

 

సి.నా.రె ఓ గొప్ప ఉపన్యాసకుడు, సాహితీవేత్త, గాయకుడు, గొప్ప సంస్కారి. మట్టిలో పుట్టిన మాణిక్యంగా వెలిగిన ఓ మహా మనిషి. అన్నిటికీ మించి, ఎందరో కవుల్ని ప్రోత్సహించి, ఆ వర్ధమాన కవుల్ని వెలుగులోకి తెచ్చిన మహానుభావుడు.

 

'హ్యాపీ బర్త్ డే టూ యూ' గీతం కనిపెట్టి వ్రాసినవాడు చాలా చాలా గొప్పవాడు. కేవలం పేరు మార్చి ఆ గీతాన్ని ఎవరి బర్త్ డేకైనా సరే, కుల, మత, జాతి, దేశ బేధాలు లేకుండా, ఆఖరికి కుక్కా పిల్లీ పుట్టినరోజులకి కూడా ఆ గీతాన్ని మనం వాడుకోవచ్చు.

 

అలాంటి అత్యద్భుత సాహిత్యాన్నే తెలుగుజాతికి అందించారు సినారె. ఈ పాట ఎవరైనా సరే, కుల మత, దేశ, ప్రాంతీయ జాతి భేదం లేకుండా పాడుకోవచ్చు. అయితే వారు తెలుగువారై ఉండాలి. ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్న తెలుగువారికైనా, పుట్టిన రోజున, పెళ్ళి రోజున, ఏ శుభం జరిగిన రోజైనా యీ పాట పర్‌ఫెక్టుగా సరిపోతుంది" అన్నారు కోరం గారు.

 

"ఏ పాట?" అడిగింది సావిత్రి నవ్వుతూ.

"జరిగిన కథ సినిమాలోని 'భలే మంచి రోజు' పాట" ఠక్కున అన్నాడు ర.మో.

"అవునవును. ఏ శుభదినానికైనా తగిన పాట!" తలాడించారు గాలిబ్‌గారు.

"అందుకోండి మరి" అన్నాడు సైకిల్ మూర్తి.

 

*****

 

చిత్రం: జరిగిన కథ.. గానం: ఘంటసాల,. సంగీతం: ఘంటసాల... 1969

 

పల్లవి:

భలే మంచి రోజు పసందైన రోజు

వసంతాలు పూచే నేటి రోజు..ఆ..

వసంతాలు పూచే నేటి రోజు ||భలే||

 

చరణం:

గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు

గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు

నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు

 ||భలే||

 

చరణం:

చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు

తొలి వలపులు చిలికిన రోజూ కులదైవం పలికిన రోజు

చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు

తొలి వలపులు చిలికిన రోజూ కులదైవం పలికిన రోజు

కన్న తల్లి ఆశలన్నీ సన్న జాజులై విరిసిన రోజు

 

 ||భలే||

 

(చిత్రంగా ఇది సి.నా.రె వ్రాసి ఇవ్వగా ట్యూన్ కట్టిన పాటకి కాడు. ఘంటసాలగారు ఇచ్చిన ట్యూన్‌కి సి.నా.రె సాహిత్యాన్ని సమకూర్చారు)

 

"ఈ పాట ఎంత పాపులర్ అంటే, ఆనాటి నించి యీనాటి వరకూ ప్రతి పండగ రోజునా, పుట్టిన రోజునా, పెళ్లి రోజునా లౌడ్ స్పీకర్లలో, టీవీ చానెల్స్‌లలో రింగ్ టోన్స్‌లో మారుమ్రోగుతూనే వుంది " పాట విన్న ఆనందంతో అన్నారు గాలిబ్ గారు.

 

"అబ్బాయ్... నాకు చాలా ఇష్టమైన పాటొకటుంది.. 'అంతగా నను చూడకు..' అనే పాట. పాడవూ. అమ్మాయ్ నువ్వు కూడా" అన్నారు ముక్తేశ్వరరావుగారు.

 

"ఒక్క నిముషం" దూరంగా వెళ్తున్న బజ్జీల బండివాణ్ని పిలుస్తూ అన్నారు కో.రం.గారు.

 

*****

"మిర్చి బజ్జీలు వెయ్యడం అంత తేలిక వ్యవహారం కాదు. ఉప్పూ, వాము, అతి చిక్కగా తగినంతగ చింతపండు గుజ్జు మిర్చిగారి పొట్టలో కూరాలి. ఆ తరవాత పర్ఫెక్టు ఉప్పు , తగినంత చిల్లీ పౌడర్, అతి కొద్దిగా పసుపు, కొంచెం వాముతో సరైన పిండి తయారు చెయ్యాలి. 'శనగపిండి' క్వాలిటీ బాగా లేకపోతే 'బజ్జీ' ఎందుకూ పనికిరాదు. అలాగే పిండిలో ఎన్ని నీళ్లు కలపాలనేది అనుభవం మీదగానీ తెలీదు. " ఆగాడు ముక్తేశ్వరరావు.

 

"అంతేగాదు.. పెద్ద మంటలో వేయించకూడదు. నూనె వేడెక్కాక స్టౌని సిమ్ లో పెట్టి నాజూగ్గా, సరైన రంగు వచ్చేదాకా వేయించాలి." తనూ జాయిన్ అయ్యాడు సైకిల్ మూర్తి.

 

" ఆ తరువాత వేడివేడి బజ్జీ పొట్టకి మళ్లీ ఆపరేషన్ చేసి ఉల్లి తరుగు, కొత్తిమిర తరుగూ తగినంత వేసి చాలా జాగ్రత్తగా తగినన్ని చుక్కల నిమ్మరసం జల్లి, ఆ వేడి మీద తింటుంటే..." నోరూరుతుండగా అన్నాడు గాలిబ్‌గారు.

 

"అయ్యా, ఇపుడు మీరు చెప్పినట్టుగానే, వాయ మీద వాయ మీకు అందిస్తాను. రేపు మీకు స్పెషల్‌గా మసాలా మిర్చిబజ్జీలే కాక, కాప్సికం బజ్జీ, కాకరకాయ బజ్జీ, లోపల గింజలుండని బాపట్ల వంకాయ బజ్జీ, పొట్లకాయ రింగ్స్, ఉల్లిపాయ రింగ్స్, నేతిబీరకాయ , బీరకాయ బజ్జీలే కాక వంకాయ బజ్జీలు కూడా  తినిపిస్తాను. ప్రామిస్" అంటూ వేడి వేడి బజ్జీలు వేస్తూ అన్నాడు మిర్చిబజ్జీవాడు.

 

"శ్భాష్.. అయితే మాతోపాటు నువ్వూ  పాట విను" ఉత్సాహంగా అన్నాడు కో.రం (కోదండ రంగారావు)

*****

చిత్రం: మంచి మనిషి (1964), సంగీతం: ఎస్.రాజేశ్వరరావు & టి. చలపతిరావు.

గానం: ఘంటసాల.

పల్లవి:

అంతగా నను చూడకు ... ష్... మాటాడకు

అంతగా నను చూడకు . వింతగా గురి చూడకు వేటాడకు

హోయ్  ||అంతగా||

 

చరణం:

చలిచలి గాలులు వీచెను సన్నని మంటలు లేచెను.

చలిచలి గాలులు వీచెను సన్నని మంటలు లేచెను

తలుపులే కవ్వించెను .వలవుల వీణలు తేలించెను అంతగా నను చూడకు ... ష్... మాటాడకు

||అంతగా||

 

చరణం:

జిలిబిలి ఊహలు రేగెను . నా చేతులు నీకై సాగెను

జిలిబిలి ఊహలు రేగెను . నా చేతులు నీకై సాగెను

పెదవులే కవ్వించెను ... పదునౌ చూపులు బాధించెను

||అంతగా||

 

చరణం:

వాలుగ నిన్నే చూడనీ . కలకాలము నీలో దాగనీ .

వాలుగ నిన్నే చూడనీ . కలకాలము నీలో దాగనీ

నవ్వులే పండించనీ . పువ్వుల సంకెల బిగించనీ .

హోయ్ అంతగా నను చూడకు . ష్ . మాటాడకు

||అంతగా||

 

"ఓ పక్క వేడి వేడి బజ్జీలు,... అవి నంజుకోవడానికి పచ్చిమిర్చి, ఉప్పు చింతపండు అల్లం వేసి మెత్తగా నూరి పొగరుగా పోపు పెట్టిన చెట్నీ, ఈ పక్క గిలిగింతలు పెట్టే డ్యూయెట్. ఇంకేం కావాలి ఏడుకొండలవాడా" బజ్జీ ఘాటుకి వగరుస్తూ అన్నారు గాలిబ్‌గారు.

"అయ్యా, ఇదే కాదు సార్, అరటికాయ బజ్జీలూ, బంగాళదుంప బజ్జీలు ముక్కలుగా కోసి, ఉప్పూ కారం ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి ఓ గిన్నెలో బ్రహ్మాండంగా కలగలిపి నిమ్మరసం జోడించి ఎండిన తామరాకులో ఆ మిక్చర్ వేసిస్తా చూడని. పార్కు పార్కంతా మీ చుట్టూ తిరక్కపోతే ఒట్టు" మహోత్సాహంగా అన్నాడు బండివాడు.

"నీ పేరేమిటోయ్?" అడిగారు కో.రం.గారు

"అయ్యా నా పేరు సత్తిబాబండి. కొంతకాలం సినిమా హాల్లో ఆపరేటర్‌గా పన్జేశానండి" వినయంగా అన్నాడతను.

 

"ఐతే. నీ కిష్టమైన పాటేదన్నా చెప్పు" అడిగారు గాలిబ్.

 

"మీరు మాట్లాడేది. సి.నా.రె గారి గురించని నాకు తెలిసిపోయిందండి. అందుకే ఓ స్పెషల్ సాంగ్ అడుగుతా. హిందీలో  ‘చైనా టౌన్’ అనే సినిమా వుంది. హీరో షమ్మికపూర్. దాన్ని తెలుగులో 'భలే తమ్ముడు'గా తీశారు. హిందీలోనూ, తెలుగులోనూ కూడా పాడింది మహమ్మద్ రఫీగారే. రఫీ అంటే నాకు దేవుడు. అందుకే ఆ పాట పాడండి" అన్నాడు సత్తిబాబు.

 

"హిందీ లిరిక్ తెలుసా?" అడిగారు ర.మో.

 

"ఆ.. బార్ బార్ దేఖో .. హజార్ బార్ దేఖో.. ఏ దేఖ్నేకి చీజ్ హై హమారే దిల్‌రుబా.. తాలేవూ.. తాలేవూ.. తాలేవూ.. "పాడి వినిపించాడు సత్తిబాబు.

అందరూ చప్పట్లు చరిచారు.

"బ్రహ్మాండంగా పాడావయ్యా.. శభాష్" మెచ్చుకుని సావిత్రి.

 

"మరి మీరు తెలుగులో పాడండి" అన్నాడు సత్తిబాబు.

 

చిత్రం: భలే తమ్ముడు 91969), సంగీతం: టి.వి.రాజు

గానం: మహమ్మద్ రఫీ

పల్లవి:

ఎంతవారు గాని వేదాంతులైన గాని

వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్

కైపులో కైపులో కైపులో.. 

||ఎంత||

 

 చరణం:

హోయ్ హోయ్ చిన్నది

మేనిలో మెరుపున్నది 

చేపలా తళుకన్నది

సైప లేకున్నది.. హోయ్ చిన్నదీ (repeat 4 lines)

ఏ వన్నెకాని వలపు నమ్మి వలను చిక్కునో

కైపులో కైపులో కైపులో..

||ఎంత||

 

చరణం:

ఆడకు వయసుతో చెరలాడకు

ఆడితే వెనుకాడకు  కూడి విడిపోకు . హోయ్ ఆడకూ.. హోయ్ repeat

మనసు తెలిసి కలిసి మెలిసి వలపు నింపుకో..

కైపులో కైపులో కైపులో..

||ఎంత||

 

చరణం:

బల్లే బల్లే లేత వయసుడికిందిలే

తాత మనసూరిందిలే లోకమింతేలే..

హో బల్లే బల్లే లేత వయసుడికిందిలే

తాత మనసూరిందిలే లోకమింతేలే..

హోయ్ బల్లే బల్లే

పాత రుచులు తలచి తలచి తాత ఊగెనోయ్..

కైపులో కైపులో కైపులో..

||ఎంత||

 

"అయ్యా మీకు తెలుసో తెలీదోగానీ, ఎన్.టి.ఆర్ గారూ, టి.వి రాజుగారూ చాలా రోజులు ఒకే గదిలో ఉండేవారు. చాలా మంచి మిత్రులు. అందుకే ఎన్.టి.ఆర్ గారి చాలా సినిమాలకి, టివిరాజుగారు సంగీత దర్శకత్వం చేశారు” మరో రౌండ్ వేడి వేడి మిర్చి బజ్జీలు వడ్డించి అన్నాడు సత్తిబాబు.

 

"అబ్బా! ఆ విషయం నాకు తెలీదే" ఆశ్చర్యంగా అన్నారు కో.రం గారు

 

"బాబూజీ.. దుర్యోధనుడి మీద పాట వుంది చూసారూ. శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో. దానికదే పాటండి. ఆ సినిమాలో సంగీతం టి.వి.రాజుగారే. అబ్బ.. ఏం కంపోజింగ్ అండీ. అసలు సి.నా.రె వాడిన పదాలు, ఆయనకి ప్రబంధాలలోనూ, ఇతిహాసాలలోనూ వున్న 'పట్టు'ని తెలియజేస్తాయండి. ఆ పాట పాడరూ?" వినయంగా అడిగాడు సత్తిబాబు.

 

'సత్తిబాబూ. నువ్వు నిజంగా గ్రేటువోయ్. ఏకవచనం ప్రయోగించినందుకు ఏమీ అనుకోకు. నీకంటే పెద్దవాడిని కనక అలా అన్నాను. ఎంత మంచి పాట అదీ!" నవ్వి అన్నారు గురయ్యగారు. గొంతు సవరించుకుంది సావిత్రి.

*****

చిత్రం: శ్రీకృష్ణపాండవీయం. సంగీతం: టి.వి.రాజు.

గానం: పి.లీల, పి.సుశీల

పల్లవి:

స్వాగతం.. సుస్వాగతం.. స్వాగతం కురుసార్వభౌమా

స్వాగతం.. సుస్వాగతం.

శతసోదర సంసేవిత సదనా

అభిమానధనా సుయోధనా.. ||స్వాగతం||

 

చరణం:

మచ్చలేని నెలరాజువు నీవే

మనసులోని వలరాజువు నీవే

రాగభోగసురరాజువు నీవే... ఆ...

రాజులకీ, రారాజువు నీవే

ధరణిపాల శీరోమకుటమణి తరుణకిరణ

పరిరంజిత చరణా.

 

||స్వాగతం||

 

చరణం:

తలపులన్ని పన్నీటి జల్లులై

వలపులన్ని విరజాజి మల్లెలై . ఆ

తలపులన్నీ పన్నీటి జల్లులై.. వలపులన్నీ విరజాజి మల్లెలై

నిన్ను మేము సేవించుటన్నదీ.. ఎన్ని జన్మముల పున్నెమో ఇదీ

కదనరంగ బాహుదండ ధృతగదా ప్రకట పట శౌర్యాభరణ

||స్వాగతం||

 

"అయ్యా.. సంగీతం భగవంతుడి భాష అంటారండి. ఆ భాషని మీరందరూ అద్భుతంగా నేర్చుకున్నారండీ. నేను బజ్జీలమ్ముకునేవాడ్ని. డబ్బున్నోడ్ని అయితే మీకు సన్మానాలు చేద్దును. కానీ, నా గుండెనిండా ప్రేమతో ఇస్తున్నానండీ. యీ బజ్జీల్ని మరోసరి తిని ఆనందించండి. ఇదే నా సంతోషాన్ని తెలుపుకునే మార్గం.."

"అంతకంటేనా.. మహదానందంగా తింటాం. కానీ డబ్బులు వొద్దంటే మాత్రం వూరుకోం. ఎందుకంటే యీ చల్లని వాతావరణంలో పాటలతో పాటు ఘాటుఘాటు హాటు హాటు బజ్జీలు తింటుంటే స్వర్గం నాలుక చివర నాట్యమాడింది. థాంక్సోయ్. రేపట్నించి సరదాగా ఇదే సమయానికి రావాలి సుమా"ఆప్యాయంగా సత్తిబాబు భుజం తగ్గి అన్నారు కోరా గారు.

*****

అయ్యా.. సి.నా.రె  ప్రతీ పాట ఓ కావ్యమనదగినదే. కొత్తగా సినీరచయిత కాదల్చుకున్నవారికి సి.నా.రె పాటలే పాఠ్య గ్రంధాలు. ఆ మహారచయితకి అంజలి ఘటిస్తున్నాను. ఓ సారి "లిటిల్ చాంప్స్" కి వారు అతిథిగా వొచ్చి అన్నారు. "ఆ తరానికి యీ తరానికీ అద్భుతంగా వంతెన వేశావు భువనా శభాష్" అని. అంతకంటె గొప్ప బహుమతి ఇంకేముంటుంది నాకు.

 

నమస్సులతో

మీ భువనచంద్ర

 

 

ఈ రోజే అంటే (12.12.2019) గురువారం నాడు పరమపదించిన గొప్ప నటుడు, వక్త, AIR ప్రయోక్త & Assistant Station Director, గొప్ప కథా, మాటల, నవలా రచయిత, దార్శనికుడూ, తన రచనలతో ఆల్మోస్ట్ చివరి వరకూ  అశేషాంధ్రులను అలరించిన బహుముఖ ప్రజ్ఞాశాలీ, కాలమిస్టూ శ్రీ గొల్లపూడి మారుతీరావుగారికి యీ త్రైమాసిక రచన అంకితమిస్తూ, వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

నమస్తే..

bottom of page