top of page

సంపుటి  5   సంచిక  1

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వంగూరి పి.పా.

 

శివలింగం మీద తేలు కథ

 

vanguri.PNG

వంగూరి చిట్టెన్ రాజు

శివలింగం మీద తేలు కనపడితే చేత్తో తియ్యలేం, చెప్పుతో కొట్టలేం. సరిగ్గా అలాగే ఉంది ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం లో మూడు రాజధానుల యవ్వారం. అసలు సమస్య మూలాలకి వెళ్తే..ఇదంతా జాతివైరం సమస్యే కానీ రాజధాని సమస్య కానే కాదు. ఇదంతా శత్రు శేషం లేకుండా సమూలంగా తుడిచిపెట్టెయ్యాలి అనే తాపత్రయమే కానీ సౌత్ ఆఫ్రికా మీద ప్రేమ కానె కాదు. మా అమెరికాలో ఒక సారి ట్రంప్ గారిని ఒక ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్న “మీరు ఫలానా పని ఫలానా విధంగా చెయ్యడం తప్పు కదా. మరి మరొకలా ఎందుకు చెయ్యలేదు?” దానికి ఆయన సమాధానం “నేను అమెరికా అధ్యక్షుడిని. నువ్వు కాదు. అదంతే” అన్నారు. ఇప్పుడు పైకి అలా అనకపోయినా, ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్నది అదే.

రాజధాని విషయయం లో గత ఎన్నికలకి ముందు జరిగిన సంగతుల విహంగ వీక్షణం చేస్తే,.... శివరామకృష్ణన్ కమిటీ వారు రాజధాని ఒకే ప్రాతం లో పెట్టి హైదరాబాద్ లో జరిగిన తప్పిదం జరగకుండా వైజాగ్, రాయల సీమ, కాళహస్తి ప్రాంతాలలో వికేంద్రీకరణ జరగాలని చెప్పడమే కాకుండా, విజయవాడ-గుంటూరు మధ్య ఉన్న సస్యశ్యామలమైన “రైస్ బౌల్ ఆఫ్ ఇండియా” ని సిమెంట్, కాంక్రీట్ లతో ఒక రాజధాని పట్టణంగా మార్చడం తగని పని అని కూడా హెచ్చరించింది. మరి కృష్ణా – గుంటూరు జిల్లాలలో అప్పటికే పాతుకు పోయి ఐశ్వర్యం, రాజకీయ బలం, యావత్ ప్రపంచం లోనే  అన్ని రంగాలలోనూ అత్యధిక స్థాయిలో విజయ పతాకం ఎగర వేస్తున్న కమాసా వారికి ఆ రిపొర్ట్ నచ్చ లేదు. ఆ శివరామ కృష్ణన్ కమిటీని తోసిరాజు అని నారాయణ కమిటీని వేసి, సింగపూర్ ని తలదన్నే భ్రమరావతిని తెర మీదకి తెచ్చి, ఆక్కడి రైతులకి ఎడతెగని వాగ్దానాలు చేసి అమరావతిని ఖాయం చేశారు. ఆ తతంగం లోనూ, ఇతరత్రా అన్ని పథకాలలోనూ, సంపద సృష్టి, అధికారం, లాభాలు అన్నీ కసామా వారికే చెందడం గమనించిన ప్రజలు తరవాతి ఎన్నికలలో కమాసేతరులు మూకుమ్మడిగా “ఒక్క చాన్స్” అన్న రెసామా కి కనీ వినీ ఎరగని స్థాయిలో పట్టం కట్టారు. ఆ వ్యతిరేకత దన్నుగా  ఇక రెచ్చి పోవడం రెసామా వారి వంతు అయింది. అయితే వాళ్ళ నాయకుడి రూటే వేరు. కసామా నాయకుడు అన్నీ నేనే చేశాను, “నన్ను ఎన్నుకోవడం చారిత్రక అవసరం” అని చెప్పుకుంటే, రెసామా నాయకుడు మిత భాషి. మాట్లాడవలసినదంతా ఎన్నికల ముందు పాదయాత్ర లోనే మాట్లాడేశారు. ఇక నోరు మెదప కుండా శత్ర్రు శేషం లేకుండా చేసే పనిలో పడ్డాడు. ఆయన శివ లింగం మీద మొదట వేసిన తేలు కసామా వారికి గ్రామాలలొ రాజకీయంగా పట్ట్టు ఉన్న జన్మభూమి ని మటుమాయం చేసి గ్రామ సచివాలయాలని పెట్టి, రంగులు వేయించి నాలుగేళ్ళ లో మళ్ళీ వచ్చే ఎన్నికలకి కావలిసిన రాజకీయ బలం ముందే పెంచుకున్నారు. ఇక రివర్స్ టెండరింగ్ పెట్టి, పోలవరం వగైరా అన్ని పనులలోనూ కసామా పేరు వినపడకుండా జనం మర్చిపోయేలా చేశారు. ఇక కసామా వారి ఆర్ధిక మూలాలని దెబ్బ కొట్టడానికి వారికి స్థాన బలం, ఆర్ధిక బలం ఉన్న విజయ వాడ-గుంటూరు మీద కేంద్రీకరించారు. కసామా ప్రాబల్యానికి, ముఖ్యంగా వారి నాయకుడికీ “అమరావతి మహా నగరం” ఒక ప్రతిష్టాత్మక మైన ప్రతీక గా నిలిచింది. దాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి పారేయడానికి వ్యూహం లో భాగంగా అలనాటి శివరామ కృష్ణన్ కమిటీ చెప్పిన అధికార వికేంద్రీకరణ అనే ప్రతిపాదన...దాన్ని ‘వంక’ అని కూడా అనవచ్చును...తెర పైకి తెచ్చి, దానికి జీ ఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హై పవర్ కమిటీ ల ద్వారా  మమ అనడమే ఆలస్యం. ఇది కసామా వారి పాలిట ఆ అమర లింగేశ్వరుడి లింగం మీద మరొక తేలు లాంటిదే కదా.  ఎందుకంటే, వైజాగ్ లో రాజధాని వద్దు అన్నా, కర్నూలు లో హై కోర్టు వద్దన్నా ఆ జిల్లాల వారికి కసామా మీద కోపం ఒక ఎత్తయితే, అమరావతి ని మార్చకుండా అరవడం తప్ప ఏమీ చెయ్య లేని పరిస్థితి.

ఇంకా అసలు రాబోయే రెసామా రహస్యం మరొకటి ఉంది, నా దృష్టిలో. మరొక ఏడాదిలో వైజాగ్ రాజధాని అయ్యాక, నామకహా ఒకటి రెండు శాసన సభ సమావేశాలు అమరావతిలో నిర్వహించినా....మెల్లగా ఆ పేరు తొలగించి, ఆ భవనాలు ఉన్న వెలగపూడి పేరే ఖాయం అవుతుంది. అంతే కాదు, మా రాష్త్రం భరించలేనంత ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మాకు శాసన సభ ఒక్కతి చాలు,శాసన మండలి దండగ అని ఎన్టీఆర్ తరహాలో కే కేంద్ర ప్రభుత్వానికి నచ్చ  చెప్పి  లెజిస్లేటివ్ కౌన్సిల్ పూర్తిగా రద్దు చేస్తారు. దాంతో ‘పప్పు” నాయుడు తో సహా ఆ కౌన్సిల్ లో ప్రస్తుతం మెజారిటే లో ఉన్న కసామా వారంతా తమ రాజకీయ ప్రాబల్యం పూర్తిగా కోల్పోతారు. మాట్లాడడానికి వేదికా లేదు. ఏ బిల్లు అయినా రెసామా వారి అసెంబ్లీ లో సునాయాసంగా ఆమోదించబడుతుంది. వారి కి అండగా కాసామా వారు ఎలాగా ఉన్నారు. ఇక దసామా, మైసామా, తదితరులకి 50 శాతం రిజర్వేషన్లు, నవ రత్నాల పేరిట నగదు పంపిణీ కార్యక్రమాలు, అధికారిక, అనధికారిక ఓట్ల కొనుగోలు కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి.

అన్నట్టు రాష్త్రం అభివృద్ధి అంటారా...మధ్యలొ ఈ గోల ఎందుకూ? ముందు ఒక ఏడాదిలో కసామాని భూస్థాపితం చేశేశాక, మరొక మూడేళ్ళు ఉందిగా..అప్పుడు చూసుకుందాం. ఉదాహరణకి, రెండో ఏడు పోలవరం మళ్ళీ మొదలు పెట్టి ఎన్నికల సమయానికి పూర్తి చేద్దాం. అమరావతి రైతులంటారా? వాళ్ళకి వచ్చిన లోటు ఏమీ లేదు. ఎందుకంటే అవన్నీ వాళ్ళు కాంట్రాక్ట్ కాగితాల మీద సంతకాలు పెట్టి, ప్రతిఫలాలు ఆశిస్తూ, వాటికి ఒప్పుకుని ఇచ్చిన పొలాలే కదా!. ఎలాగా కోర్ట్ కి వెళ్తారు కాబట్టి  సదరు కోర్ట్ వారు ఎలా తీర్పు ఇస్తే అలాగే చేద్దాం. కోర్ట్ జడ్జీలు మనకి తెలిసిన వారే గా!. కావాలంటే ఆ కాంట్రాక్ట్ లో ఉన్నట్టు కొంత భూమీ, కొన్ని ఫ్లాట్లు కట్టేసి రైతులకి ఇచ్చేద్దాం. కసామా వారు కొన్న భూముల మీద కేసులు పెట్టి ఆ తమాషా చూద్దాం.

ఇంత హడావుడిలోనూ, ఇక అమరావతిలోని అమర లింగెశ్వర స్వామి గుడిలో లింగం మీద మరొక తేలు రెసామా వారు హఠాత్తుగా ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమం. నిజానికి అది కసామా వారే నారాయణ గారి ఆధ్వర్యం లో చడీ చప్పుడూ లేకుండా అక్కడా, అక్కడా ఏనాడో మొదలుపెట్టి తెలుగు భాష తెలుగు వారికి అనవసరం అని తేల్చేసినా, ఇప్పుడు ఏకంగా రాష్ట్ఱం మొత్తం మీద అమలు కావడం, అంతే కాక అదంతా దసామా వారికీ, ఇతర బీదసామా లనీ ధనిక అగ్రసామా వారితో సమాన స్థాయి కోసమే అనీ చెప్పడం తో ఆ ఓటు బ్యాంక్ వారు సంతోషం గానే ఉన్నారు. ఒడ్డున పడ్డ మేధావులు తమ పడక్కుర్చీ ప్రకంపనలతో తెలుగు భాష ఎంత గొప్పదో వాళ్ళలో వాళ్ళకి చెప్పుకుంటూనే ఉన్నారు. ఆ నాడు కసామా నాయకులకీ, ఈ నాడు రెసామా నాయకులనీ కలుసుకుని చెప్పే దమ్ములు, అవకాశాలూ వీరికి లేవు. ఉన్నా అది చెవిటి వాడి చెవిలో శంఖం ఊదడమే1 మొత్తానికి ‘ఎవరు నవ్విన నాకేటి సిగ్గు” అనే పధ్దతిలో ఎవరు ఏమి అనుకుంటే నాకేమిటీ? అని తెలుగు భాషని అటకెక్కించేశారు.

అసలు, సిసలు శివ లింగం మీద గండ్ర గబ్బ..అంటే అడవి తేలు ఎప్పుడు పడుతుందీ అంటే....నాలుగేళ్ళలో వచ్చే ఎన్నికలలో రెసామా వారు ఓడిపోయి, మళ్ళీ కసామా వారు అధికారం లోకి వస్తే అమర లింగెశ్వరుడి మీద ఉన్న అన్ని తేళ్ళనీ చేత్తో తీస్తారా, చెప్పుతో కొడతారా? అమరావతి లో మళ్ళీ శంకుస్ఠాపనకి మోడీ గారిని పిలుస్తారా?

అసలు ఏనాటికైనా తెలుగు వారందరికీ మనం ‘ఒసామా”..అంటే ఒకటే సామాజిక వర్గం అనే రోజులు వస్తాయా అంటే ‘భలే వారే. మాకు ఇలాగే బావుంది” అన్ని అన్ని సామాజిక వర్గాల వారూ అనుకుంటున్నారు. కనీసం ఈ 2020 నూతన సంవత్సరం లో అయినా రాజకీయ అవసరాలు, కక్ష సాధింపులూ అన్నీ ఒక కొలిక్కి వచ్చి  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ఱం కాస్త గాడిని పడుతుంది అని ఆశిస్తూ, అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.  

*****

bottom of page