MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మా వాణి ...
మరో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. మరో దశాబ్ధానికి తలుపులు తెరుస్తూ.
సంబరాల సందర్భాలలో వెల్లువెత్తే శుభాకాంక్షల వెల్లువలో "రేపటిపై ఆశ" వెల్లివిరుస్తుంది. వీచే గాలిలో కొత్తదనాన్ని అనుభూతింపజేస్తుంది. పీల్చేగాలిలోనూ శుభకామనలని శ్వాసించమంటుంది. ఎంత గొప్పదో కదా ఈ ఆశ? కటిక కరి మబ్బుల్లోనూ తళుక్కుమనే వెలుగుల హరివిల్లులా... ఎన్ని ప్రతికూలతల నడుమనున్నా, మదిలో వెలుగుతూండే ఈ ఆశ మనిషిని/ఆశయాన్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంది. కొత్తదనాన్ని స్వాగతింపజేస్తుంది.
కోటి ఆశలతో, కొంగొత్త ఆకాంక్షలతో 2020కి స్వాగతం చెబుతున్న శుభతరుణంలో సాహితీ బంధువులందరికీ madhuravani.com సంపాదక బృందం శుభాకాంక్షలు తెలుపుతుంది. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ అఖండమైన సంతోషాన్ని, అద్భుతమైన సాహిత్యాన్ని మోసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
ఒక్కసారి తరచి చూసుకుంటే, 2019 సాహిత్యాభిమానులకి ఎంతో ఆనందాన్ని అందించింది, దానితో పాటుగా అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఎందరో సాహితీ మహారథుల మహానిర్యాణాలకి మౌనసాక్షిగా నిలిచిన గత సంవత్సరం చివరలో వెళుతూ వెళుతూ సాహితీ,సినీ,నాటక రంగాలలో స్రష్ట గొల్లపూడి మారుతీ రావు గారి మహా నిష్క్రమణాన్నీ తనలో కలిపేసుకుని శోకభారంతో కదిలింది.
రాజకీయ, సాహిత్య, సినీ, నాటక రంగాల్లో ఏ అంశాన్నయినా అలవోకగా రాయగల అసాధారణ మేధోశక్తి గొల్లపూడి గారి సొంతం. తెలుగువారిని తన బహుముఖ ప్రజ్ఞా పాటవాలతో ఎన్నో యేళ్ళు అలరించిన గొల్లపూడి గారు గత నాలుగేళ్ళుగా తన కాలం "గొల్లపూడి డైరీ" తో మన madhuravani.com పత్రికనీ అలంకరించారు. ఈ సంచికనుండీ ఆ పేజీ కొనసాగించలేమని తెలిపేందుకు క్షంతవ్యులము. గొల్లపూడిగారితో కొన్ని దశాబ్ధాలుగా అపురూప స్నేహబంధాన్ని పంచుకుంటున్న వంగూరి చిట్టెన్ రాజు గారు ఈ వార్త నుంచి కోలుకోవటానికి ప్రయత్నిస్తూ వారి జ్ఞాపకాలతో అందిస్తున్న అక్షర నివాళికై ఈ లంకె తెరవగలరు.https://www.madhuravani.com/vanguri-gollapudi
ఈ డిసెంబర్ చివరలో కేంద్రప్రభుత్వం ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం బండి నారాయణ స్వామి గారు రచించిన -రాయలసీమ సాంస్కృతిక, చారిత్రక నవల "శప్తభూమి" ని వరించింది. రచయిత బండి నారాయణ స్వామి గారికి సంపాదక బృందం అభినందనలు తెలుపుతుంది.
*****
మధురవాణి నిర్వాహక బృందం