
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మధురవాణి ప్రత్యేకం
సాహితీ సౌరభాలు

ప్రసాద్ తుర్లపాటి
ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి
జయంతితే సుకృతినో రస సిద్దా: కవీశ్వరా:
నాస్తిక్లేశాం యశ: కాయే జరా మరణంచ భయం
ధన్యాత్మలగు కవీశ్వరులు తమ కీర్తీ శరీరాలచే రససిద్ధి పొందిన యోగులవలే సదా ప్రకాశిస్తూ వుంటారు.
తెలగాణా ప్రాంతములో భాసిల్లిన ప్రముఖ కవివర్యులు సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు,
“నేను పుట్టక ముందే
నెత్తి మీద నీలి తెర
కాళ్ళ కింద ధూళి పొర”
" కాలమనే కావ్యములో చెక్కిన అక్షర శిల్పంలా " సదా జీవిస్తునే వుంటాను అన్న కవి ఆచార్య నారాయణరెడ్డిగారు.
డా. సి. నారాయణరెడ్డి గారు కరీంనగర్ జిల్లా, వేములవాడ మండలం, హనుమాజిపేట గ్రామంలో ప్రజోత్పత్తి నామ సంవత్సర గురుపూర్ణిమ నాడు, అనగా 29.7.1931 జన్మించారు. సృజనాత్మకశక్తి, లయాత్మకత, ఆశుగణం, గానశీలం వీరీ ప్రత్యేకతలు. వీరు యెన్నొ కవితలు, గ్రంధాలు, సినీ గేయాలు రచించారు. వీరు రచించిన "విశ్వంభర" కావ్యానికి 1988లో ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది
“దండమయా "విశ్వంభర"
దండమయా పుండరీక, దళనేత్ర హరీ
దండమయా కరుణానిధీ దండమయా నీకు నెపుడు దండము కృష్ణా “
అన్న శ్రీక్రష్ణ శతకములోని "విశ్వంభర" అర్ధములో వీరు రచించిన ప్రముఖ కావ్యము "విశ్వంభర".
" పేర్లతో అగత్యంలేని మనిషి కధానాయకుడి గా విశాల విశ్వము రంగస్థలముగా, ఇతివృత్తం తేదీలతో నిమిత్తంలేని కధే ఈ విశ్వంభర'.
ఈ కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు. అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్, మార్క్స్, గాంధీ - ఇలా ఇలా ఎన్నెన్ని రూపాలో మనిషికి!
కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతిశక్తుల వశీకరణం - ఇలా ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులో మనిషికి! ఆదిమదశ నుంచీ ఆధునికదశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలోని ప్రకరణాలు. మనిషి సాధన త్రిముఖం - కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం. ఈ సాధనలో అడుగడుగునా ఎదురుదెబ్బలు. క్షతుడైనా మనిషి తిరోగతుడు కాలేదు.
ఇలాంటి మహోన్నతమైన ఆలోచనల రేఖాచిత్రం ' కావ్యరచనకు పునాది."
అన్నారు తన కావ్య ప్రస్తావనలో.
సంపూర్ణ మానవ వికాసమే కావ్యాత్మగా, వేదంతార్ధాలకు ప్రతీకగా ఈ కావ్యము కళాత్మకంగా, వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా అన్ని అంశాలను ప్రస్తావిస్థున్నది.
"పృథివీ శాంతా సాగ్నినా' శాంతా సామే' శాంతా శుచగ్్మ్' శమయతు | అంతరి'క్షగ్్మ్ శాంతం తద్వాయునా' శాంతం తన్మే' శాంతగ్్మ్ శుచగ్్మ్' శమయతు | ద్యౌశ్శాంతా సాదిత్యేన' శాంతా సా మే' శాంతా శుచగ్్మ్' శమయతు |
పృథివీ శాంతి'రంతరి'క్షగం శాంతిర్-ద్యౌ-శ్శాంతిర్-దిశ-శ్శాంతి'-రవాంతరదిశా-శ్శాంతి' రగ్ని-శ్శాంతి'ర్-వాయు-శ్శాంతి'-రాదిత్య-శ్శాంతి'-శ్చంద్రమా-శ్శాంతిర్-నక్ష'త్రాణి-శ్శాంతి రాపశ్శాంతి-రోష'ధయ-శ్శాంతిర్-వనస్పత'య-శ్శాంతిర్-గౌ'-శ్శాంతి'-రజా-శాంతి-రశ్వ-శ్శాంతిః పురు'ష-శ్శాంతి-బ్రహ్మ-శాంతి'ర్-బ్రాహ్మణ-శ్శాంతి-శాంతి'-రేవ శాంతి-శాంతి'-ర్మే అస్తు శాంతిః' |
తయాహగ్్మ్ శాంత్యా స'ర్వశాంత్యా మహ్యం' ద్విపదే చతు'ష్పదే చ శాంతిం' కరోమి శాంతి'ర్మే అస్తు శాంతిః' ||
ఏహ శ్రీశ్చ హ్రీశ్చ ధృతి'శ్చ తపో' మేధా ప్ర'తిష్ఠా శ్రద్ధా సత్యం ధర్మ'శ్చైతాని మోత్తి'ష్ఠంత-మనూత్తి'ష్ఠంతు మా మాగ్ శ్రీశ్చ హ్రీశ్చ ధృతి'శ్చ తపో' మేధా ప్ర'తిష్ఠా శ్రద్ధా సత్యం ధర్మ'శ్చైతాని' మా మా హా'సిషుః |
ఓం సహ నా'వవతు | సహ నౌ' భునక్తు | సహ వీర్యం' కరవావహై | తేజస్వినావధీ'తమస్తు మా వి'ద్విషావహై'' ||
ఓం శాంతిః శాంతిః శాంతిః' |"
అన్న శాంతిమంత్రార్ధాలు వీరి విశ్వంభరలో సాక్షాత్కరిస్తాయి. మనశ్శక్తి వ్యక్తిగా సాగితే జీవిత చరిత్రగా, సమష్టిగా సాగితే సమాజ చరిత్రగా ఎలా కనిపిస్తుందో అన్న భావన మనకు స్పస్టముగా కనిపిస్తుంది.
" విశ్వంభర ఆధునిక ఐతిహాసిక వచన కవితా కావ్యం. కాల గమనానికి దర్పణం. తేదీలు, దస్తావేజులు, గణాంకాలు లేక మానవ చరిత్రను కీర్తిస్తున్న గానం. ఇందులో కవిత్వాన్ని ఆస్వాదించే వారికి అడుగడుగునా కవిత్వమే లభిస్తుంది. విశ్వంభర మరో మాటలో చెప్పాలంటే మనసు కావ్యం. విశ్వంభరలోని మానవుడు, కథానాయకుడు ఒక్క భారతీయుడే అనుకోవడానికి వీల్లేదు. సినారె ప్రతి పంక్తినీ చమత్కారంగా, రసాత్మకంగా తీర్చిదిద్దారు. ఆధునిక కవిత్వంలోని గందరగోళం ఏమాత్రం లేకుండా ప్రతి దృశ్యం పాఠకుల ముందు కదలాడుతూ కాలయంత్రంలా సాగిపోతుంది. ఆ అనుభవాలతో తడిసిపోతుంది." అన్నారు శ్రీ చీకోలు సుందరయ్య గారు.
కవిగా నా స్థానాన్ని మరింతగా సార్ధకం చేసిన కావ్యము "విశ్వంభర" అని డా.సి.నారాయణరెడ్డి గారు స్యయముగా చెప్పుకొన్నారు. ఈ గ్రంథానికి 1988 సంవత్సరంలో భారతదేశంలోని అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం ప్రదానం చేయబడింది. సినారె దీనిని రాజాలక్ష్మీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు తన ప్రియమిత్రులైన శ్రీ రమణయ్య రాజా గారికి అంకితమిచ్చారు.
మరియొక సంచికలో వారు రచించిన ఇతర కవ్యాలు, రచనలు, వ్యాసాల గురించి ప్రస్తావిస్తాను.
అందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు