top of page

పుస్త​క పరిచయాలు

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

సంపుటి  5   సంచిక  1

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని  పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

సంక్షిప్త పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

chaganti tulasi.JPG
vfa.JPG
amerikula.JPG
chaitanyam.JPG
boldenni.JPG

ఈసారి చాలా పుస్తకాలే వచ్చాయి పరిచయం చెయ్యడానికి.  ఒక్క నవంబరులో వంగూరి ఫౌండేషన్ వారే నాలుగు కొత్త పుస్తకాలు వేయడం గమనార్హం.  ‘రంగంటే ఇష్టం’ చాగంటి తులసి గారు రాసిన సాహితి చింతనలు.  ‘అమెరికా తెలుగు కథానిక’ పద్నాలుగవ సంపుటి ప్రతి రెండేళ్ళకూ ఒకసారి వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించే అమెరికా రచయితల కథా సంకలనం.  ఇక ‘అమెరికులాసా కథలూ, కమామీషులూ’ వంగూరి చిట్టెన్ రాజు గారు గత కొద్ది సంవత్సరాలలో కౌముది అంతర్జాల పత్రికలలో నెల నెలా వెలువరించిన రచనల సంపుటి.  ‘చైతన్యం’ సోమ సుధేష్ణ గారు రాసిన కథల సంపుటి.  ఈ పుస్తకాలతో వంగూరి ఫౌండేషన్ వారు ఇంతవరకు 85 పుస్తకాలు ప్రచురించారు.  అమెరికాలో అస్థిత్వం ఉన్న ఒకే సంస్థ నుండి ప్రచురించబడే ఇన్ని తెలుగు పుస్తకాలు ఒక రికార్డే మరి. 

పై పుస్తకాలు కావలసిన వారు vangurifoundation@gmail.com కి రాసి తెప్పించుకోవచ్చు.  వచ్చే సంవత్సరం ఆయన నిర్వహించే సాహితీ సభలకు హాజరైతే ఆ పుస్తకాలు మీవే మరి. 

పై నాలుగింటితో పాటు ఈ మధ్యనే ఓర్లండోలో జరిగిన అమెరికా తెలుగు మహా సభలో పరిచయమయిన లలిత గారు తన పుస్తకం గురించి మాట్లాడడం విన్నాక ఆ పుస్తకాన్ని కూడా పరిచయం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం కలిగింది.  అందుకే ఈ అయిదు పుస్తకాల పరిచయం. 

రంగంటే ఇష్టం చాగంటి తులసి గారు వివిధ సందర్భాలలో రాసి ప్రచురించిన వ్యాస సంపుటి. 

పుస్తకంలోని నలభై వ్యాసాలూ, తులసి గారు వివిధ సందర్భాలలో రాసి వివిధ పత్రికలలో ప్రచురించినవి.  ఆ వ్యాసాలలో మనకు వినిపించేవి తులసి గారి పర్సనల్ రిఫ్లెక్షన్సు.  ‘రంగంటే ఇష్టం’ తో మొదలై గత ముప్ఫై, నలభై ఏళ్ళలో వివిధ మాధ్యమాలలో ప్రచురించిబడిన సాహిత్య వ్యాస మాల ఈ పుస్తకం.  గురజాడ, చాసో రచనల విశ్లేషణతో పాటు అవి తన వ్యక్తిగత మరియు సాహితీ దృక్పథంపై ఏవిధంగా ప్రభావం చూపాయో పాఠకులకి క్షుణ్ణంగా తెలుస్తుంది.  ఎన్నో వ్యాసాలలో ఆవిడ ప్రయత్న పూర్వకంగానూ, కొన్నింటిలో అప్రయత్నంగానో అయినా, పదే పదే వ్యక్తం చేసిన ఒక భావం ద్వారా మనం గ్రహించగలిగే విషయం ఆవిడ పెరిగిన వాతావరణం.  చాసో, నారాయణబాబు, రోణంకి అప్పలస్వామి గారు, కొంతగా శ్రీశ్రీ మొదలైన సాహితీ హేమా హేమీల మధ్య ఆడుతూ, పాడుతూ, వాళ్ళ మధ్య జరిగే వాదనలు వింటూ, వాళ్ళు ఇచ్చిన విలువలని తలకెక్కించుకుంటూ గడిపిన బాల్యం ఆమె వ్యక్తిత్వం పైనా, సాహితి వ్యాసంగం పైనా ఎంత ప్రభావం చూపిందో స్పష్టంగా గ్రహించగలం.  “పసితనంలో పడిన ముద్రలు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయన్న మాట ముమ్మాటికీ నిజం.  ఉత్తమ సాహిత్యం ఆలోచన కలిగించి మనిషిని మనిషిగా తీరిచి దిద్దుతుంది.  సందేహం లేదు” అని తన ఉదాహరణగా నిర్ద్వందంగా వ్యక్తం చేస్తారు.  దొరటోపీ రోణంకి, గిరిజాల జుట్టు నారాయణబాబు, పొట్టి అంట్యాకుల పైడి రాజు, గుండ్రమొహం ఆరుద్ర, ‘నాన్న ఉన్నాడా అంటూ వచ్చే శెట్టి ఈశ్వరరావు, ముగ్గురు సూర్యుళ్ళూ (అవసారాల సూర్యారావు, అంబళ్ళ సూర్యారావు, బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు), మధ్య మధ్య విశాఖపట్నం నుండి వచ్చే శ్రీశ్రీ ... ఇందరి ఆలోచనలు, ఆవేశాలు ఆమెను ప్రభావితం చేసాయంటే ఆశ్చర్యం ఏముంది?

‘గురజాడ సమకాలీన భారతీయ కథకులు’ ఒక పరిశోధనాత్మక వ్యాసం.  ఉర్దూ, బెంగాలీ, మళయాళం, ఒడియా, అస్సామీ, గుజరాతీ, కన్నడం, తమిళం, మరాఠీ, తెలుగు, హిందీ భాషలలో మొదటి ఆధునిక కథ ఎప్పుడు ఎవరిచేత రాయబడిందో అన్న చర్చ చాలా ఆసక్తి కరంగా ఉంది.  “అయితే కాలం, తేదీ, సంవత్సరంగాని, స్త్రీ రాసినదా, పురుషుడు రాసినదా అన్నది ప్రధాన అంశం కాకూడదు.  ఆ రాసిన ఆధునిక కథ అవునా కాదా అన్నది నిర్ధారించబడాలి.” అన్నది ఆవిడ ప్రాధమిక సూత్రం.  అయితే ఆధునిక కథంటే ఏమిటి ఆవిడ ఉద్దేశ్యంలో?  కథకు ఆధునికతను ముఖ్యంగా కథారూపం నిర్ణయిస్తుందని, అదే ముఖ్య ప్రాతిపదిక అని అంటారు తులసి గారు.  అది, ఇంకా కొన్ని అంశాలను ఆధారం చేసి గురజాడ గారి దిద్దుబాటు కథ మొట్ట మొదటిదని ఢంకా బజాయించి చెబుతారు.   అలాగే మిగిలిన భాషల్లో కూడా.  సుమారుగా ఈ మొదటి ఆధునిక కథలకు అన్ని భాషలలోనూ ఒకే టైమ్ ఫ్రేమ్ ఉండడం గమనించ దగ్గ విషయం, ఒకే సంవత్సరం కాక పోయినా.  ఆవిడ భారతీయ భాషలలో ఆధునిక కథ పుట్టుపూర్వోత్తరాలపై చేసిన పరిశోధన, విశ్లేషణ, నిజాయితీ మెచ్చుకోక తప్పదు. 

ఈ వ్యాసాలలో గురజాడ, చాసోలకు ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే చెప్పుకోవాలి.  ఇరవై అయిదు శాతం పైగా వ్యాసాలు ఈ ఇద్దరిపైనా, ఇద్దరు రచయితలు సృజించిన సాహిత్యం పైనా ఉన్నాయంటే అది తులసి గారికి వారిద్దరి మీదున్న అభిమానం, వారిద్దరు ఆమె జీవితం పైనా, ఆమె సాహిత్యపు జిజ్నాస మీద ఉన్న ప్రభావానికి గుర్తింపని చెప్పచ్చు. 

చాసో రాసిన ‘కుంకుడాకు’, ‘ఎందుకు పారేస్తాను నాన్నా’ లాంటి ఎంతో మంచి కథలు తనను ఎంత ప్రభావితం చేసాయో చెబుతారు తులసి గారు.  చిన్నప్పుడు ఆయన ఎలా కాళ్ళు పట్టించుకునేవారో, ఆ సమయంలో ఆయన చెప్పిన కథలు - ఆ కథలు చదువుగా చెప్పని చదువులంటారు తులసిగారు.  అయితే ఎంత గొప్పవారిలోనూ కొంత విచిత్ర మనస్తత్వం ఉండకపోదు.  చాసో గారూ అంతే.  తులసి గారి పరిశీలనలో చాసో ఒక మాస్టర్ ఆర్టిస్ట్.  ఆవిడ ఊహాలో మాస్టర్ ఆర్టిస్టుల హృదయాలు గదులు గదులుగా ఉంటాయని, వీళ్ళు తమ హృదయంలోనికి ఒక గదిలోకి ప్రవేశిస్తే మిగతా గదులన్నీ మూసుకుపోతాయని, మిగతా గదులున్నాయన్న జ్ణానం కూడా మరి వీళ్ళకి ఉండదని, తాము ప్రవేశించిన గది మాత్రమే సర్వస్వం అవుతుందని ఒక ఆసక్తికరమయిన ఆలోచన.  వ్యాసాల్లో ఇలాంటి వ్యక్తిగత అనుభవాలు చదువుతూంటే ఏదో నేర్చుకున్నట్లుంటుంది. 

గురజాడ రాసిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కావ్య చిత్రణ గురించి రాస్తూ, తులసి గారు, ‘సమాజాన్ని అప్రతిష్ట పాలు చేసే పరిస్థితిని కాళ్ళ ఎదుటబెట్టి, నైతిక భావాల ఉన్నత ప్రమాణాలను ప్రాచుర్యానికి తేవడంకంటే సాహిత్యానికి ఉత్తమమైన కార్యమేదీ ఉండదనీ, చెడుగును జనరంజకంగానూ, కరుణాత్మకంగానూ బయటపెట్టి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయవలసి ఉంటుందనీ – మంచిని పెంచాలన్న ఆరాటంతో చదివిన, చూసిన, జీవించిన విస్తృత అనుభవంతో ‘సాహిత్య సృజన’ చేసిన మహనీయుడు గురజాడ’ అంటారు.  ‘అతిచిన్న కేన్వాసులో ఎంతవరకు అవసరమో అంతవరకే నేపథ్యాన్ని అతి నేర్పుతో వాడుకుంటూ బొమ్మకడుతూ దూరాల్ని సమీపాలని కలుపుతూ ప్రధానమైన అంశం వేపే దృష్టి పడేటట్టు చేసే అద్భుతమైన  చిత్రీకరణ’ అని స్పష్టంగా చెప్పగలిగిన ఆలోచన తులసి గారిది. 

అలాగే, కాళీపట్నం రామారావు గారి కథల్లో పాత్రల గురించి చెప్పినా, రావిశాస్త్రి రచనల్లో సమకాలీన సమాజ చిత్రణ గురించి విశదీకరించినా, రామలక్ష్మి సాహిత్యంలో జెండర్ స్పృహ గురించి మాట్లాడినా, తులసి గారి ఆలోచనలలో, మాటల్లో నిజాయితీ కొట్టొచ్చినట్లు కనబడుతుంది.  

వ్యాసాలన్నీ ఎంతో ఆసక్తికరంగా చదివిస్తాయి.  ముఖ్యంగా వ్యక్తిగతమైన అనుభవాలతోనూ, చక్కని విశ్లేషణతోనూ, ఎంతో సాహిత్యాభిలాషితోనూ రాసిన ఈ వ్యాసాలు ఇన్ఫర్మేటివ్, ఏడ్యుకేటివ్.  

* * *

అమెరికా తెలుగు కథానిక 14 వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించిన కథల సంపుటి. 

 

అమెరికా తెలుగు రచయితల కథలను ప్రతి రెండేళ్లకొకసారి సంకలనాలుగా ప్రచురించడం వంగూరి ఫౌండేషన్ వారి ఆనవాయితీ.  ఈ పుస్తకంతో కలిపి ఇది పద్నాలుగో సంకలనం.   పుస్తకం ముందుమాటలో చెప్పినట్లు ఈ సంకలనాల వల్ల ప్రయోజనం ఒక్కటే.  ఇవి అమెరికా తెలుగు కథా ప్రయాణంలో మైలు రాళ్లు.  భవిష్యత్తులో ఎప్పటికైనా ఎవరైనా అమెరికా కథా గమనం ఎలా సాగిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకాలు చెప్పకనే చెబుతాయి.  కథా రచనలో పరిణితి, సమాజం (అమెరికా, భారతదేశం) లో ఆర్థిక సామాజిక జీవనంలో వస్తున్నమార్పులు, వాటితో పాటు కథావస్తువులో వచ్చిన కొత్తదనాలు, కథనంలో వచ్చిన మార్పులు, తెలుసుకోడానికి ఈ సంకలనాలు తప్పక సహాయం చేస్తాయి. 

ఈ పుస్తకంలో ముప్ఫై రెండు కథలున్నాయి.  తాడికొండ శివకుమార శర్మ గారి కథ ‘తో గానీ,... తో గానీ,... తో గానీ’ అన్న కథతో మొదలై, చివరగా వంగూరి చిట్టెన్ రాజు గారు రాసిన ‘ఆరోగ్యమూ, ఆత్మ కథ...’ తో కలిసి ముప్ఫై రెండు మంది రచయితల కథలు పాఠకుల ముందుంచారు.  ప్రతి ఏటా ఉగాది సందర్భంలో వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించే ఉగాది పోటీలలో గెలుపొందిన రచనలు కొన్నైతే, ఎంపిక చేసిన వివిధ రచయితల రచనలు మరికొన్ని.  కథలకు నేపథ్యం అమెరికా నుండి ఆంధ్రా వరకూ నడిచింది.  కథా వస్తువులలో కూడా వైవిధ్యాన్ని పాఠకులు చూడవచ్చు.   కొత్త రచయితల మొదటి కథలతో పాటు యాభై ఏళ్ళ పైచిలుకు అనుభవంతో రాసిన రచయితల కథలూ ఉన్నాయి.  చదవండి. 

పుస్తకం వెల రెండువందల రూపాయలు. 

* * *

అమెరికులాసా కథలూ, కమామీషులూ  - వంగూరి చిట్టెన్ రాజు గారి కలం నుంచి ధారావాహికంగా ప్రతి నెలా కౌముది అంతర్జాల పత్రికలో గత రెండున్నర సంవత్సరాలలో వచ్చిన కథలు, కాదు కాదు, కమామీషులు ఈ పుస్తకరూపంలో మన ముందుకొచ్చాయి.  అంతకు మునుపు వచ్చిన ఆయన పుస్తకాల పేర్లు చూస్తే, అమెరికామెడీ, అమెరికాలక్షేపం, అమెరికాకమ్మ, అమెరికలకలం, అమెరికట్టుకథలు, అమెరికులాసా అంటూ, ఏదో డు ము, వు, లు, చేరిస్తే తెలుగు నామ వాచకమైనట్లు అమెరికాను తెలుగు కామెడీగా చేసిన ఘనత చిట్టెన్ రాజు గారిదే.  అవి పుస్తకాల పేరులే కాదు, ఈ పుస్తకంలోని కొన్ని కథల పేర్లను కూడా ఎలా పెట్టారో చూడండి, అమెరికాఖరి రోజుల కథ, అమెరికంగారు కథ, అమెరికారోగ్యం కకావికల కథ, అమెరికుక్కల్, పిల్లుల్, కోతుల్ కథ, అమెరికట్టడాలూ-కూల్చివేతలూ కథ, అమెరికోడి కత్తి కథ, అమెరికామెంతులూ లైకులూ, అమెరికాస్టింగ్ కౌచ్ కథ అంటూ...

పుస్తకం పేరు మొదలుకుని చివరి వరకూ ప్రతి పదంలోనూ మనకు కనిపించేది రాజు గారి వంగ్యం, హాస్యం.  అయినా, ఆయన రాసిన ఏ కథలో అవి లేవు కనక?  ఇక విక్టోరియా రాణి గారి పాత్ర సరే సరి.  ఆవిడ లేకపోతే, ఆవిడ ఆయన చెవి మెలెయ్యకపోతే ఇక రాజు గారి కథేముంది? 

తన జీవితంలో జరిగిన చిన్న విషయం కూడా అటు self-deprecating గానూ, వ్యంగ్యం గానూ, అవసరమైనచోట్ల చురకలంటిస్తూ, అడుగడుక్కీ నవ్విస్తూ రాసే హాస్య బ్రహ్మ రచనలకు పరిచయం చెయ్యనక్కరలేదు. 

రాజు గారు రాసిన కథలు ఒక ఎత్తైతే,  జయదేవ్ గారు వేసిన ముఖచిత్రం  మరో ఎత్తు.  Statue of Liberty తను నుంచున్న పీఠం మీదనుంచి దిగి విస్తుపోయి చూస్తూంటే, రాజుగారు ఆనందంగా పుస్తకాలు ఒకచేత్తోనూ, పెన్ను మరోచేత్తోనూ పట్టుకుని అదే పీఠం మీద డాన్సు చేస్తున్నట్లు గీసిన బొమ్మ అది.  జయదేవ్ గారి దృష్టిలో అమెరికాలో తెలుగు సాహిత్యానికి రాజు గారు వేసిన పెద్ద పీటకు ప్రతిబింబమది. 

పుస్తకం ధర వంద రూపాయలే. 

* * *

చైతన్యం సోమ సుధేష్ణ గారు రాసిన కథల సంపుటి.  ఆవిడ ఇదివరలో రాసిన ‘నర్తకి’ నవల కూడా వంగూరి వారి ప్రచురణే. 

రచయిత కూడా సమాజంలో ఒక మనిషే.  అయితే పాఠకుడికి రచయితకు తేడా ఏమిటంటే, పాఠకుడు కేవలం అనుభవించగలడు కాని రచయిత ఆ అనుభవాన్ని వ్యక్తీకరించి మళ్ళీ పాఠకుడి ముందుంచగలడు.  అంతే కాదు, పాఠకుడు అనుభవించలేని సంఘటనలను కూడా తాను భావించి పాఠకుడిచేత భావింపచేయగలడు.  రచయిత ఒక అబ్జర్వర్.  సమాజంలోంచి పుట్టినవాడే.   రచయిత ప్రజ్ఞ ఆ పరిశీలనా సునిశితంతో, ఎంత స్పష్టంగా, ఎంత కళాత్మకంగా పాఠకుడి ముందుంచుతాడో అన్న విషయాలపై ఆధారపడి ఉంటుంది.  అంతే కాదు, రచయిత ఊహకి అంతులేదు.  పాఠకుడిని ఎంత దూరానికైనా తీసుకెళ్లగలిగే సామర్ధ్యం ఉంటుంది. 

తన మాటగా రచయిత్రి కూడా ‘జీవితాలను అవగాహన చేసుకునే నాలోని ఆసక్తే కథలను వ్రాయమని ఉసికొల్పింది’ అంటారు.  కథకుడికి ఉండాల్సిన ఒక మంచి గుణాన్ని ఆవిడ చక్కగా చెప్పారు.  “ఒక్క ఆలోచన అందివ్వగానే పాత్రలు మొండి మనుషుల్లాగ ఏ మాత్రం మార్పుకు లొంగకుండా తమదైన వ్యక్తిత్వాన్ని చూపించుకుంటాయి’ అని. 

సుధేష్ణ గారి ఈ ‘చైతన్యం’ పుస్తకంలో ఇరవై రెండు కథలున్నాయి.  అన్ని కథలకూ అమెరికాలోని ప్రవాసాంధ్రుల జీవితాలే నేపథ్యం.  1990, 2000 మధ్యలో ఆమె రాసి వివిధ పత్రికలో ప్రచురించబడ్డ కథలలో కొన్ని ఏరి మనముందుంచారు రచయిత్రి. 

మనుష్యుల మధ్య సంబంధాలైతేనేమి, ఆవిడ రాసిన కాలంలో ఉన్న వివిధ సమస్యలైతేనేమీ, పాఠకులు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు ఇట్టే ఐక్యమైపోతారు కథల్లో, ఎందుకంటే అవి నిజ జీవితానికి అంత దగ్గర్లో ఉండడం వల్ల.  పిల్లల పెళ్ళిళ్ళయితే నేమి, భార్యాభర్తల మధ్య విడాకులైతే నేమి, అమెరికా వచ్చినా వదలని మగవారికి స్త్రీల పట్ల ఉన్న చులకన భావాలు, స్వతంత్రంగా బతక గలిగే స్త్రీ ఆలోచనలు గ్రహించి రాజీ పడాల్సి వచ్చిన అవసరాలు, ఇలా ఎన్నో మనకళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు కథల్లో పాత్రల ద్వారా.  యద్దనపూడి సులోచనారాణి గారు రాసిన ఒక కథకు (నయన) తనదొక పూరణ ఒక కథగా మనకందిస్తారు సుధేష్ణ గారు.  అన్ని కథల్లోనూ సంభాషణలు సహజంగా ఉంటాయి.  తను చెప్పదల్చుకున్న సందేశాన్ని పాఠకులకు ఏదో ఉపన్యాసం లాగా కాకుండా  కథ ద్వారానే చెప్పడం బాగుంది.  సుధేష్ణ గారికి తెలుగు భాష అంటే ఉన్న మక్కువ మనకు కథల్లో స్పష్టంగా తెలుస్తుంది. 

కథలు సహజంగా చదివించేటట్లు ఉన్నాయి.  ఇదివరలో ఆవిడ రాసిన నర్తకి నవల లాగే ఈ పుస్తకానికి కూడా మంచి ఆదరణ లభించవచ్చు. 

పుస్తకం ఖరీదు రూ. 150 మాత్రమే. 

* * *

 

బోల్డన్ని కబుర్లు – అన్నీ లలిత గారు చెప్పినవే.  ఆవిడ చెప్పినట్లుగా, రెండేళ్ళగా వారం వారం తన బ్లాగులో (boldannikaburlu.blogspot.com) రాసుకున్న పోస్టులకు ఇచ్చిన ఒక పుస్తకరూపం ఇది.  సుమారు ఏడాదిన్నర ముందే పుస్తకం వెలువడినా, నా చేతుల్లోకి మొన్నీ మధ్యే, అంటే ఓర్లాండోలో జరిగిన అమెరికా సాహిత్య సభల సందర్భంలో ఆవిడ మాటలు వినడం, ఆవిడ ఆప్యాయంగా తన పుస్తకాన్నివడం జరగడంతో నాకు చదవడానికి అవకాశం వచ్చింది. 

బ్లాగుల్లో రాసిన రాతలు సాహిత్యం కోవలోకి వస్తాయా?  నా ఉద్దేశ్యంలో బ్లాగులు తమ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా, తమకు తోచినట్లుగా చెప్పడం కోసం ఉపయోగపడే మాధ్యమాలు.  ఇందులో ఒక నియమం ఉండక్కరలేదు.  ఎవరికిష్టమయినట్లుగా వారు రాసుకోవచ్చు.  ఆ మాటలు సాహిత్యం నిర్వచనానికి కట్టుబడి వుండాలని లేదు.  అయితే ఆ నిర్వచనం విస్తరిస్తోందనడంలో సందేహం లేదు.  అవి చదివేవారెవరు?  ఎవరు రాస్తారో వారి స్నేహితులు, ఆ స్నేహితుల స్నేహితులు, అలా మొదలవుతుంది.  బ్లాగులు ఎవరి తృప్తికోసం వారు రాసుకున్నా, కొంతమంది రాసే రాతలు వారు రాసే విధానాల్లో తేడా ఉంటుంది.  బ్లాగులకు యూనివర్సల్ అప్పీల్ లేక విస్తృత పరిధి కనక ఉంటే, ఎక్కువ మందిని చదివించే రీతిలో ఉండి, మిగతా ప్రపంచానికి కూడా తెలిసి ప్రాచుర్యం పొందే అవకాశం ఉంటుంది. 

నాకు తెలీదు, లలిత గారి కబుర్లు ఎంత మందిని చదివిస్తున్నాయో అని.  కాని, ఆమె చెప్పిన మాటల్ని బట్టి ఆమె కబుర్లు వినడానికి ఎంతో మంది ఆసక్తితో ప్రతి వారం ఎదురు చూస్తుంటారని.  ఎందుకబ్బా అని అనుకున్నాను, అందుకే పుస్తకం చదివాను. 

పుస్తకంలో కబుర్లు బోలెడు.  అన్నీ ఆమె చిన్నప్పుడు పెరిగిన అనాతవరం వాతావరణం, డిగ్రీలు లేకపోయినా ఎంతో చదువున్న నానమ్మ, పుస్తకాలు, దిన, వార, మాస పత్రికలు, న్యూస్ పేపర్లనేన్నో పరిచయం చేసిన అప్ప, ఆయన భార్య దొడ్డ, శ్రీనన్న, అమ్మ, నాన్నగారు, లలిత గారి మేలి సగం (better half అన్నమాట) బదరి, ఒకరేమిటి, తన జీవితాన్ని తాకిన ప్రతి మనిషితో తన అనుభవాల్ని కబుర్ల రూపంగా బ్లాగుల్లో రాసినవన్నీ, ఇప్పుడు పుస్తకరూపంలో మనముందుకు తెచ్చారు లలిత గారు.  అన్ని కబుర్లూ, ఆహ్లాదంగా, చిలిపిగా, ఎవరినీ కించ పరచకుండా, మనముందుంచిన తన జీవితంలోని అనుభవాలే.  ఒక తరంలో మనందరం, కొద్దో, గొప్పో, అలాంటివి అనుభవించిన వాళ్ళమే.  చదువుతూంటే, మన చిన్నప్పటి జ్ఞాపకాలూ, మనకు తెలిసిన మనుషులూ, మనసుకు తడుతూనే ఉంటాయి.  అందుకేనేమో ఆవిడ బ్లాగు ఎంతో మందిని ఆకర్షించింది. నాకన్నిటికంటే నచ్చిన విషయమేమిటంటే, లలితగారు పెరిగిన వాతావరణంలో అక్షరం మీదున్న గౌరవం.  అదే ఆమె కూడా సంతరించుకుంది.  పుస్తకం చదివితే లలిత గారి జీవితం మనకంతా తెలిసిపోయినట్లనిపిస్తుంది. 

పుస్తకం మొదలు పెడితే చివరి వరకూ చదివించుకు పోతుంది.  చదువుతూన్నంతసేపూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటుంటాం.  పదాలతో చేసిన కొత్త కొత్త ప్రయోగాలు (మేలి సగం లాంటివి) కాస్త ఆగి నవ్వించి ముందుకు తీసుకెడతాయి. 

ప్రపంచ సమస్యలను పుస్తకంలో వెతక్కండి, అవేవీ ఉండవిక్కడ. అవి ఉండాలని లలిత గారు రాయలేదు ఆ బ్లాగు. 

లలిత గారు చెప్పిన కబుర్లెన్నో ఎన్నెన్నో.  హాయిగా చదువుకోండి. 

పుస్తకం ఖరీదు రూ. 150.  జెవి పబ్లికేషన్సు వారు ప్రచురించినదీ పుస్తకం.  కాపీలకు జ్యోతి వల్లభోజు గారిని (jyothivallaboju@gmail.com) కాని, లలిత గారిని కాని (lalithats@yahoo.com) సంప్రదించండి. 

* * *

samkshipta-rasadhuni.jpg
Rasadhuni-Samkshipta.jpg

సమీక్షించిన వారు: కేంద్ర మహాకవి కాళిదాసు సాహితీ సమ్మానన అవార్డు గ్రహీత,రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం డీన్, బ్రహ్మశ్రీ డా।। రాణి సదాశివమూర్తి 

పుస్తక రచయిత: డా।। పి.వి బాలాజీ దీక్షితులు

 

ప్రముఖ హోమియో వైద్యులు డా।। పి.వి బాలాజీ దీక్షితులు రచించిన  రసధుని అద్భుత అమలిన శృంగారకావ్యం అనడం లో ఎలాంటి సందేహము లేదు. ఇది భగవంతుని ఏ రూపంలో చూస్తే ఆ రూపంలో కనబడినట్లు, ఎవరు ఎలా భావిస్తే అలా కనబడే కవితా సంపుటి రసధుని. రాధ కోసం కృష్ణుడు పడే వ్యధలా  అర్ద నారీశ్వరులు చేసే లయన్యాసం లా అద్బుతంగా కవి తన భావాలు రాశారన్నారు,ఇందులో అద్భుత భావాలు, చక్కని పదాలు, మంచి వస్తువు కనిపిస్తుంది, కవిత్వం మానసిక ఆరోగ్య సంజీవిని అనడానికిది మంచి ఉదాహరణ,భాధలు, సమస్యలు నచ్చక కవి చెక్కిన అద్భుత భావనా శిల్పం ఈ రసధుని అని చెప్పక తప్పదు.

 

ప్రతులకై సంప్రదించండి:  రచయిత డా।। పి.వి బాలాజీ దీక్షితులు, 4-2-405, గిరిపురం, తిరుపతి

ఫోన్: 8885391722

ప్రచురణ:educreationpublishing

పుస్తకం వెల: 170

Available Online @ E-Book, Amazon, Flip kart

bottom of page