
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కవితా మధురాలు
చిత్రకొండ గంగాధర్
సంపాదకుల ప్రత్యేక ఎంపిక
వేగబాండ్ స్వప్నంలోంచి
1
సముద్రతీరపు
తెల్లని ఓడరేవు పట్టణం మీద
నా నీడ ముందుకు సాగుతోంది
జీవితం ఒక్కసారె
మృత్యువాంఛతో జీవిస్తున్న మనిషిలో
ఒక ప్రాచీన రాత్రి మేలుకుంది
చలిమంట
పెనుబాకు
పులి గర్జన
సుదూరపు పల్లెటూరి నుండి
ఒక స్త్రీ రోదన మంద్రంగా విన్పిస్తోంది
2
ఎండుటాకుల్లా
కొన్ని పదాలు రాలిపోతున్నాయి నాలో
కౌమారమూ, యవ్వనమూ
మృత్యువు ధరించిన పూల దండలో ముత్యాలు
ఒకానొక
పారదర్శకమైన నీటిపాయ
నాచు పట్టిన ఆమె కాలి అందెల్ని మింగివేస్తోంది
మరణించిన
కొన్ని పదాల్తోపాటూ కలిసి
పిచ్చివాని కళ్ళు ఎగుర్తున్నాయి మంచు తుంపర్లలా
నా లోపల
ప్రాంకోయిస్ విల్లాస్ తొలిసారి కనిపించిన
యింటికి వెళ్తున్నాను
ఎవరూ లేరు
అంతా వెళ్ళిపోయారు ఖాళీ చేసి
నేను వెళ్తూనే వున్నాను
నా లోపలి అపురూపమైన నెత్తురుత
('ఆత్మహత్యా సదృశ దేశదిమ్మరి ఆఖరి కోరిక - పత్రశకలం' నుండి )


దాసరాజు రామారావు
వాళ్లిద్దరూ, ఒక డాగీ...
ఏ మొదట్లో మొదటి అడుగు వేశారో
ఏ చివరికి చివరి అడుగు వేస్తారో
ముందటి ఆకాశతీరం రెండు చేతులా ఆహ్వానిస్తున్నట్లు
వెనక దారి వెనకెనకనే జారిపోతున్నట్లు
నడుస్తున్నరు
అడుగులు పదిలంగా లెక్క పెడుతున్నట్లు
అందాలో, అర్థాలో తూచి తూచి అక్కడక్కడా నాటుతున్నట్లు
కొత్త నడకలేవో కనుక్కోవాలని
కనుగొంటున్నట్లు
ఒకరి ముందు ఒకరు
ఒకరి వెనక ఒకరు
ఒకరి పక్కనా ఒకరు
ఎవరెవరు
ఏ అల్లావుద్దీన్ మాయాలాంతరుతో వూరేగుతున్నరో
ఎవరి కెవరూ అందుకోలేని స్వీయ మానసికావస్థల దూరాలలో సాగుతున్నరో
* *
అతడు:
ఏవో రెండు ప్రపంచాలని మడిచి, పాంటు జేబుల్లో దూర్చుకున్నట్లు
వాలే దృశ్యాలను పర్వాలేనితనంతో దులిపేసుకుంటున్నట్లు
దేహం వింతగా వూపుకుంటూ
మనస్సు మాత్రం రాతిఖనిలా పాతుకున్నట్లు
సముద్రాన్ని ముట్టకుండనే దాటకుండనే
తీరంమీద సైకతశిల్పంగా మెరిసిపోవాలన్నట్లు
నువ్వో నేనో అడ్డుపడుతున్నట్లు
వ్యూహాల కొండమీంచి దొర్లిపడుతూ, మళ్లీ ఎక్కుతున్నట్లు
ఆమె:
గాలాడని శూన్యావరణంలో ఊపిరి తెరచాప కోసం వెతుక్కుంటున్నట్లు
వెలుగుతో పనున్న పచ్చనాకులా
వినవచ్చే శబ్దాలకు
కొంగు పట్టుకుంటున్నట్లు
కదలికల్లేని, గడ్డకట్టిన మంచుపర్వతంగా శరీరం
హృదయం కాళ్లసందుల పడి నలుగిపోతున్నట్లు
మర్లిపోతున్న దారి వెంట పగిలిన నిలువుటద్దం ముక్కల వైపు
తల తిప్పి చూసుకుంటున్నట్లు
ఊహించిన జీవితానికి
ఊడిపడ్డ జీవితానికి లంకె తెగిన చోట
లంగరేదో వేయడానికన్నట్లు
ఇంటికుక్క:
చెవుల కానే గాలిపాటల మంద్రస్వరాన్ని పారవశ్యంగా తోకాడిస్తూ వింటున్నట్లు
తెల్లమబ్బుల సాయంత్రపు విడిదికి
గౌరవ అతిథిగా హాజరౌతున్నట్లు
అటు ఇటు కదుల్తూ,ప్రాణశ్వాసల రుచినేదో ఆస్వాదిస్తున్నట్లు
స్వేచ్చా గమనాల తోవన సంకెళ్ల పగుళ్ల చప్పుళ్లు చేస్తున్నట్లు
బతుకుని పెనవేసుకుని, ప్రేమిస్తున్నట్లు
రేపటిని వల్లె వేస్తూ, తనున్నంత సత్యంగా విశ్వసిస్తున్నట్లు
శ్రీనివాస భరద్వాజ కిశోర్ ( కిభశ్రీ )

అత్త
ఆధునిక వికటకవి తన మిత్రులతో అత్తపై సరదాగా
మెత్తని మాటలజెప్పుచు
మత్తున నను ముంచెనత్త, మాటవరుసకే
పుత్తడివివి కట్నమనుచు
ఇత్తడిపై రోల్డుగోల్డువిచ్చెను కనగన్
అంతలో భార్య అటురావటం గమనించి రూటు మార్చి
ఉత్తమురాలెంతో మా
యత్త తనసుగుణములన్ని యాభరణముగా
మొత్తము జగమందునగల
పుత్తడి కన్నను విలువగు పుత్రికనిచ్చెన్
అతను చేస్తున్న పనిని పసిగట్టిన భార్య గోడమీది లక్ష్మీ సరస్వతుల పటాలు చూస్తూ నర్మగర్భంగా
అత్తలనెగతాళిని మా
యత్తవినిన సంతసించు, నదివింటే మా
అత్తకుఅత్తయె మొత్తము
విత్తము హరియించి నిన్ను వీధిని దోయున్
దానికి జవాబుగా వికటకవి సరస్వతితో
ఎత్తునకెదుగగ వలసిన
విత్తమునిచ్చేనుగనుక వేడేనిక మీ
అత్తను కరుణించమనుచు
చిత్తము శుద్ధమ్ముజేసి చేరి పదములన్
పటంలో సరస్వతి దానికి కోపంగా
చిత్తరువున జేరిచి నను
కొత్తగ మాయత్తకరుణ కోరుదువౌరా
బొత్తిగ నను మరచిన నీ
కుత్తుక నులుమంగ నాకు కోరికగల్గెన్
వాణిని ప్రసన్నం చేసుకోవటానికి కవి వాణి
మొత్తము సృష్టిని గలరే
మెత్తమనసునందు నిన్ను మించినవారల్?
ఇత్తరి నటించి కోపము
బెత్తము ఝళిపించిచూప భీతి కలుగునే?
ఇత్తువు నీవే మదలో
మొత్తమ్మాలోచనలను మురిపెముతోడన్
వత్తువు నీవే కడు (గమ్)
గమ్మత్తుగ నా పదములందు మసలుచునుండన్
విత్తమ్మే వలెనన మీ
యత్త కరుణవలెను, దానికత్యవసరమౌ
ఉత్తమ విద్యలను సమా
యత్తము గావింతువీవెయనునది నిజమే
అదివిని అనుగ్రహించిన వాణి తన అనుంగు కవి భక్తునితో
ఉత్తమ భావమ్మిది మా
అత్తకు నామీదనుండె నాదరమనగన్
విత్తముకై విద్యవిడక
చిత్తము నందుంచుమోయి చింతలు లేకన్

శ్రీనివాస్ వేమూరి
పరిపూర్ణం
గొంగూరకు యుల్లిలా
పనస పొట్టు, ఆవలా,
నీదొక దారి
నాదో దారి
యయినను గాని,
కలిసిన హాయి.
నా జీవన పయనం లో...
సహ చరివై వచ్చావు,
అందమైన బ్రతుకు నిడి,
రసమయమును చేశావు.
జీవితాన రుచి పెంచి,
ఉద్దీపన చేశావు.
బుద్ధిని నేను,
మనసే నువ్వు.
బొమ్మను నేను,
బొరుసువు నువ్వు.
పురుషుడు నేను,
ప్రకృతి నువ్వు.
భిన్నమైన ధృవాలం,
ఆకర్షణ యందులకే!
జత కలసి తోడుగా...
విడి వడని బంధంతో...
వాగార్థపు చందంలో...
పూవుకు తావైనట్లు,
బ్రతుకు మనం సాగించాం.
అందుకే ప్రియా!
"ఒంటరి బ్రతుకే రేఖీయం
జంటగ కదిలిన పరిపూర్ణం"
లలితానంద్

అసహజ సహజం
మతులు బదిలీ
గతుల బదిలీ
బతుకు బదిలీ
మెతుకు బదిలీ
స్మృతుల బదిలీ
బాష బదిలీ
అందని ఆకాశంలో అక్షరం
అంతర బాహ్యాల బదిలీలో
అసహజమే సహజ