Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మధురవాణి ప్రత్యేకం
అధ్యాత్మికం

ఎర్రాప్రగడ రామకృష్ణ
భాగవతంలో వామనుడు త్రివిక్రమ ఆకృతిని దాల్చిన ఘట్టం పరమాద్భుత దృశ్య కావ్యం. మూలంలో లేని ఆ రమణీయ చిత్రణలో పోతన 'రవిబింబంబు ఉపమింప పాత్రమగు..' అంటూ సూర్యుణ్ని ప్రమాణంగా నిలబెట్టాడు. ఆ కల్పనలోని పరమ ఔచిత్యాన్ని వ్యాఖ్యాతలు వేనోళ్ల కొనియాడారు. నారాయణ శతకంలో 'చర సింహాసనమై అభంభు (ఆకాశం) గొడుగై తద్దేవతల్ భృత్యులై బ్రహ్మాండమాకారమై...' అంటూ శ్రీహరి గురించి అదే పోతన చేసిన వర్ణనను ఆదిత్యుడికి అన్వయించారు. శ్రీమన్నారాయణుడికి - సూర్యభగవనానుడికి తేడా లేదని తేల్చారు. అటు భక్తకోటి సూర్యుణ్ని ప్రత్యక్ష నారాయణుడిగా ఆరాధిస్తోంది, ఉపాసిస్తోంది, పులకిస్తోంది. 'ఒక్క విష్ణువేమిటి? ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః .. చతుర్ముఖుడు శివుడు కుమారస్వామి ప్రజాపతి దేవేంద్రుడు యమకుబేర వరుణాది సమస్త దేవతలూ ఆయనే!' అన్నారు అగస్త్య మహర్షి ఆదిత్య హృదయంలో.
మహానారాయణ మంత్ర సముదాయంలోని 14,15 అనువాకాలు సైతం దాన్ని సమర్ధించాయి. 'నిన్నుం త్రిపురుషమూర్తి త్రివేదమయుం రావించి...' అపరాధం చేసానంటుంది కుంతీదేవి భారతం ఆదిపర్వంలో.
'రశ్మిమంతుడు’ (అనంతమైన కిరణాలు గలవాడు) అనే విశేషణం పునాదిగా కల్పవృక్ష కవి 'వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకుం పరమార్ధభూతమై, వెలుగులు (పారమార్ధిక విద్యలు) తన్ను మించి మరి విశ్వమునందున వేరు చోట లేవు’ అంటూ సృజన వైభవ పరిపూర్ణమైన పద్యాన్ని నిర్మించారు. సూర్యుణ్ని 'అంబుధిశోషణ దాహమూర్తిగా సంబోధిస్తూ కోట్ల కిరణాలతో అనంతసాగర జలాలను ఆవిరి చేయగల ఆదిత్యుడి సామర్ధ్యానికి అంజలి ఘటించారు.
'ఆవిరి మేఘమై మేఘం వర్షమైన్ వాన చినుకు అన్నం మెతుకుగా పర్యవసిస్తుందీ అంటూ వేదం చేసిన ప్రతిపాదనను దానిలో అనుసంధానించారు. అటు జ్ఞానానికీ, ఇటు భోజనానికి జనావళికి సూర్యుడే ఆధారమన్న వేదార్ధాన్ని కవితామయం చేశారు.
'ఒక్క సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు'నన్నాడు పోతనామాత్ర్యుడు. ఆ లెక్కన కవులకు మరెన్నో రకాలుగా గోచరించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అన్ని సంధ్యలలోనూ అపురూపమైన విశేషాలను కవులు దర్శించారు, మనముందుంచారు. 'పిట్టనై ఎగురనా గుట్టు రెక్కలు విప్పి తొలి మబ్బు కిరణాల వెలుగునందు' అంటూ ఉషోదయ సౌందర్యానికి ఉత్తేజితులై అద్భుతమైన ఊహలకు రెక్కలు తొడిగారు. 'సువర్ణ రేణు చయ సంతత భూషిత దీప్తియైన ఈ దినమణికిన్ నభో మణికి ఏను మ్రొక్కెదన్' అని మధుర గీతాలాపనలు చేశారు. భాస్కర శతకకర్త మారన అయితే 'ఇంచుక నేర్పు చాలక విహీనత చెందిన నా కవిత్వముల్.. వాసి తగ్గిన నా కవితా పాకం, పాటవం.. మించు వహించె నీ కతన.. నీ కారణంగానే ఘనత వహించింది' అన్నాడు . ఉషొదయ కిరణాలు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆశలను వెలిగిస్తాయి. (బతుకులోన) చీకట్లను తొలగిస్తాయి.
సూర్యారాధనకు పుష్య, మాఘ మాసాలు మరింత ప్రశస్తమైనవి. రథసప్తమి సూర్యోపాసనకు ఎంతో అనువైన రోజు.
మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని రథసప్తమిగా పిలుస్తారు. అది కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి. ఆరోజు బ్రహ్మముహూర్త కాలంలో ఆకాశంలో నక్షత్రాలు ర్థం ఆకారంలో కనిపిస్తాయంటారు. అందుకని ఆ తిథి రథసప్తమిగా ప్రసిద్ధి కెక్కింది. రథసప్తమినాడు సూర్యభగవానుని ఆరాధించడంవల్ల ఎన్నో శుభాలు కలుగుతాయని పురాణాలు వర్ణించాయి.
జననీ త్వమ్హి లోకానాం సప్తమీ సప్త సప్తికే
సప్తమ్యా హృదితె దేవీ నమస్తే సూర్యమాతృకే
అంటూ రథసప్తమి పర్వదినాన మొదటగా సూర్యుని తల్లి అయిన గాయత్రిని ధ్యానించాలని 'ధర్మసింధువు' బోధించింది. మగవారంతా ఆనాడు ఆదిత్య హృదయం పఠించడం పరిపాటి.
స్త్రీలు అదృష్టం, సౌభాగ్యం, ఐశ్వర్యం, సౌందర్యం తమ సొంతం చేసుకోవాలని తపనపడి రథసప్తమినాడు ఉపవాసం ఉండి సూర్యదేవుని ఆరాధిస్తారు. రథసప్తమినాడు తలమీద దీపం ధరించి సూర్యదేవుని స్తుతిస్తారు. తరువాత ఆ దీపాన్ని నదిలొ కానీ, చెరువులో కానీ వదిలేస్తారు. పిమ్మట ఏడు జిల్లేడాకుల్లో (సంస్కృతంలో అర్కపత్రం) రేగుపళ్ళు పెట్టి తలమీద, భుజాలమీద పెట్టుకుని స్నానానికి ఉపక్రమిస్తారు.
స్నానానంతరం సూర్యభగవానునికి ఎదురుగా పిడకలమీద చక్కెరపొంగలి లేదా క్షీరాన్నం చేసి భక్తి శ్రద్దలతో నివేదిస్తారు. సూర్య ప్రసాదాన్ని చిక్కుడాకుల్లో పెట్టి అందరికీ పంచి పెడతారు. బియ్యాన్ని తమకు తోచిన దక్షిణతో కలిపి దానమిస్తారు.
తల్లిదండ్రులు లేనివారు రథసప్తమి నాడు పితృదేవతలకు తర్పణం విడుస్తారు. సూర్యుడి పూజ, పితృదేవతారాధన కలిపి చేయటం శ్రేష్టం.
సూర్యభగవానుని శ్రీమన్నారాయణునిగా, ఆరోగ్యదేవతగా, సకల దేవతా స్వరూపునిగా ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు. ప్రత్యక్ష నారాయణుడు, లోకచక్షువు, కర్మసాక్షి అంటూ పూజిస్తారు. అంతేకాక సూర్యుణ్ని ఆ రోజు 'త్రిపురుషమూర్తిగా' 'త్రివేదమయుని'గా భావన చేస్తూ పూజించాలని పురాణాలు బోధించాయి.
బ్రహ్మ స్వరూప ముదయే, మధ్యాహ్నేతు మహేశ్వరమ్
సాయం ధ్యాయేత్ సదా విష్ణుం, త్రిమూర్తించ దివాకరమ్
సూర్యుడు ఉదయం బ్రహ్మస్వరూపుడు, మధ్యాహ్నం శివస్వరూపుడు, సాయంకాలం విష్ణు స్వరూపుడు. అందుకే సూర్యుడు 'త్రిపురుషమూర్తి". అలాగే సూర్యుడు ఉదయం రుగ్వేద స్వరూపుడు, మధ్యాహ్నం యజుర్వేద స్వరూపుడు, సాయంకాలం సామవేద స్వరూపుడు. కనుక సూర్యుడు "త్రీవేదమయుడు" అని పురాణాలు వర్ణించాయి.
"నిన్నుం త్రిపురుషమూర్తి త్రివేదమయుం రావించిన ఈ అపరాధంబు నాకు సహింపవలయు" అంటూ కుంతీదేవి సూర్యభగవానుని ప్రార్ధించినట్లుగా మనకు భారతం ఆదిపర్వంలో కనపడుతుంది. రథసప్తమి రోజు సూర్యభగవానుని త్రిపురుషమూర్తిగా, త్రివేదమయునిగా భావనచేస్తూ ఆరాధిస్తే శుభం జరుగుతుందని మన పెద్దలు సూచించారు.
నదేవో విద్యతే కాష్టే.. నా పాషాణే.. నమృణ్మయే
భావేతు విద్యతే దేవ: తస్మాత్ భావో హి కారణమ్!
కొయ్యలోనో, రాతిలోనో, మట్టిలోనో కానే కాదు - దైవం మనిషి భావంలో ఉన్నాడు. భావన చేసేవారికే భగవంతుడు!
*****