top of page

సత్యాన్వేషణ - 11

‘సినీ స్వర్ణయుగ సాహిత్య సౌరభం’

 

సత్యం మందపాటి

సంపుటి  5   సంచిక  1

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

“సినిమా సంగీతంలో సాహిత్యం ఏమిటి సార్” అంటారు కొంతమంది.

వాళ్ళకి ఒకటే జవాబు. మన తెలుగు చలన చిత్ర సంగీత స్వర్ణయుగంలో పాటలు వింటుంటే, ఆరోజుల్లోని సాహిత్యపు విలువలు ఎలాటివో సలభంగా అర్ధమైపోతుంది. అప్పుడు తెలుగు సాహిత్యంలో, సినిమా సాహిత్యం ఒక ముఖ్యమైన విభాగంగా వుండేది. అప్పటికే పేరు ప్రఖ్యాతులుగాంచిన ఎందరో మహాకవులు, గొప్ప రచయితలు సినిమా రంగాన్ని తమ పాటలతో, కథలతో, మాటలతో అలరించారు.

నా విషయానికి వస్తే, మంచి పుస్తకాలతో పాటూ, ఆనాటి తెలుగు సినిమా పాటల్లోని సాహిత్యమే నాకు తెలుగు భాష మీద మమకారాన్ని పెంచింది. తెలుగు భాషని ఎంతగానో తీర్చిదిద్దింది. తెలుగు భాషలోని అందాలను దగ్గర చేసి, ఆనందించే అవకాశం కల్పించింది. నా చేత ఇంకా ఎన్నో తెలుగు, బెంగాలీ పుస్తకాలని చదివించింది. సాహిత్యం మీద ఎనలేని ఉత్సాహాన్ని కలిగించింది.

నా వయసులోని వారికి బాగా గుర్తుండే వుంటుంది. ఆరోజుల్లో ఇంటర్వెల్లో సినిమా పాటల పుస్తకాలు మొదట్లో పది పైసలు, తర్వాత ఇరవై ఐదు పైసలకి (పావలా) కొనుక్కునేవాళ్ళం. ఇంటికి వెళ్ళి ఆ పాటలు మళ్ళీ మళ్ళీ చదువుకుని ఆనందించిన వారిలో నేనూ ఒకడిని.

మన అదృష్టం ఏమిటంటే, ఎందరో గొప్ప కవులు మన చలన చిత్ర స్వర్ణయుగంలో మరువలేని గీతాల్ని అందించారు. ఒక్కక్క రచయితా ఎన్నో గొప్ప పాటలు ఆనాడు వ్రాసి, వారు గతించినా ఈనాటికీ మనల్ని వాటితో అలరిస్తున్నారు. ఎంతోమంది అలనాటి మహాకవుల దగ్గరనించీ, బహు కొద్దిమంది ఈనాటి గీత రచయితల దాకా, ఆ సాహితీ మూర్తులని తలుచుకుందాం. ఆయా రచయితల పేర్లు చెప్పుకుంటున్నప్పుడు, వారు వ్రాసిన ఎన్నో గొప్ప పాటల్లో, నాకు ఎంతో నచ్చిన కొన్ని పాటలు ఉదహరిస్తాను.

సముద్రాల రాఘవాచార్య సీనియర్ అనగానే మొట్టమొదటగా గుర్తుకి వచ్చే పాట, ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’. ఇది సీతారామ కళ్యాణం చిత్రంలో గాలిపెంచెల నరసింహారావుగారు స్వర పరిచిన పాట. ప్రతి పెళ్ళిలోనూ ఈనాటికీ తప్పనిసరిగా వినిపించే పాట. ఆయన వ్రాసిన పాటల్లో నాకు సాహిత్య సంగీతపరంగా ఎంతో నచ్చిన పాటల్లో, షావుకారు చిత్రంలోని ‘ఏమనెనే, చిన్నారి ఏమనెనే’, ‘పలుకరాదటే చిలుకా’, దొంగరాముడులో ‘అనురాగము విరిసేనా’ (సుశీల గొంతులో మాధుర్యం వినాలంటే ఈ పాట విని తీరాల్సిందే) మొదలైనవి. అన్నిటికీ మించి సువర్ణసుందరిలో ఆయన వ్రాసిన ‘హాయి హాయిగా ఆమని సాగే’ ఆదినారాయణరావు సంగీతంతో ఎంతో హాయి హాయిగా వుంటుంది. అలాగే అనార్కలి చిత్రంలో ‘రాజ శేఖరా నీపై మోజు తీరలేదురా’ పాట మీద మోజు పడిని వారు ఎవరు? లవకుశ సినిమాలో దాదాపు అన్ని పాటలూ ఆయనవే. అజరామరం.  

సముద్రాల జూనియర్ పేరు చెప్పగానే వెంటనే గుర్తుకి వచ్చే పాట, ‘పాండురంగ మహాత్యం’ సినిమాలోని ‘జయ కృష్ణా ముకుందా మురారి’. ఆరోజుల పాట ఈనాటికీ మన మనసుల్లో నిలిచిపోయింది. నాకెంతో ఇష్టమైన ఆయన వ్రాసిన పాట ‘బ్రతుకు తెరువు’లో ‘అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం’ ఘంటసాలగారి సంగీతం, గానం మనసుకి ఎంతో ఆనందం కలిగిస్తుంది. జయసింహలోని ‘ఈనాటి ఈ హాయి’ మరొక హాయిగొలిపే పాట. అలాగే ‘రావే నా చెలియా’, ‘మనవి సేయవే’, ‘సఖియా వివరింపవే’.. ఒకటా రెండా.. ఎన్నో గొప్ప పాటలు ఈ మహనీయనువే!  

‘మల్లీశ్వరి’ పాటలతో మనల్ని ఆకాశ వీధిలో తిప్పి, మనసున మల్లెలు పూయించినది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ‘ఇది మల్లెల వేళయనీ, ఇది మల్లెల మాసమనీ..’ మన చేత కంటతడి పెట్టించారు. అదే పాటలో ఆయన వాడిన పదాలు, ‘తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది’, ‘వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం, వసివాడని కుసుమ విలాసం’, ‘ద్వారానికి తారామణి హారం, హారతి వెల్లెల కర్పూరం’ చిరస్మరణీయం. ‘రావమ్మా మహలక్ష్మీ’ అన్నా, ‘మేడంటే మేడా కాదు’ అన్నా,  ‘నీవుండేదా కొండపై’ అన్నా, ‘పదములె చాలును రామా’ అన్నా ఆయనకే చెల్లింది. ‘సడిసేయకో గాలి’ అని చల్లగా వీస్తున్న మారుతాన్ని కూడా శాసించిన కవి ఆయన.

మల్లాది రామకృష్ణశాస్రి చిత్ర గీతాల మీద వ్రాస్తుంటేనే శరీరం పులకరిస్తుంది. శ్రోతలని రసికరాజులుగా మలిచిన మహాకవి. ‘కుడి ఎడమైతే పొరపాటులోదోయ్’, ‘జగమే మాయ, బ్రతుకే మాయ’ మొదలైన పాటల్లో నాలగు మాటల్లో నాలుగు వేదాల వేదాంతం చూపించిన కవి. ‘తెల్లవార వచ్చె తెలియక నా స్వామి, మళ్ళి పరుండేవొ లేరా” నాయకి మేలుకొలుపు పాట కొంచెం గడుసుగానే వుంటుంది. ‘మది శారదాదేవి మందిరమే’, ‘రాగమయీ రావే, అనురాగమయీ రావే’, ‘రసికరాజ తగువారముకామా’, ‘శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా’ పాటల్లోని గొప్ప సాహిత్యం, పెండ్యాల నాగేశ్వరరావులాటి విద్వాంసుల నాదామృతాన్ని బయటికి తీసుకువచ్చిన పాటలు. సంగీతాన్ని సాహిత్యం నడిపించిన పాటలు. వాగ్దానం చిత్రంలో ఆయన వ్రాసిన ‘గిరిజా కళ్యాణం’ యక్షగానం మరువలేనిది.

తర్వాత ‘ఆకలేసి కేకలేసిన’ మహాకవి గురించి వ్రాద్దామనుకుంటుంటే, చెవిలో రింగుమంటున్నాయి ఆ ‘హాహాకారాలు, ఆర్తారావాలు, ఒక లక్ష నక్షత్రాల మాటలు, ఒక కోటి జలపాతాల మ్రోతలు’. అంతటితో ఆగటం లేదు. ‘ఘాటెక్కిన గంధక ధూమం, పోటెత్తిన సప్త సముద్రాల్, రగులుకునే రాక్షసి బొగ్గూ, రాబందుల రెక్కల చప్పుడు,...” అదొక అంతులేని ప్రవాహం. ఆ ప్రవాహం పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ. ఆయన మాటల్లోనే, ‘ఇప్పటిదాకా కవిత్వం కవులని నడిపించింది. ఇకనించీ శ్రీశ్రీ కవిత్వాన్ని నడిపిస్తాడు’ అని. చలం వ్రాసిన యోగ్యతాపత్రంలో అంటారు, ‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ”, “హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వటం అతనికే తెలుసు”

మనకి స్వతంత్రం వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే వ్రాసిన పాటలో శ్రీశ్రీ అంటారు, “స్వాతంత్రం వచ్చెననీ సభలే చేసి, సంబరపడగానే సరిపోదోయ్. సాధించిన దానికి సంతృప్తిని పొంది, అదే విజయమనుకుంటే పొరపాటోయి. ఆగకోయి భారతీయుడా, కదలి సాగవోయి ప్రగతిదారుల. ఆకాశం అందుకొనే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగ మింకొక వైపు. అవినీతి బంధుప్రీతి చీకటిబజారు అలముకొన్న ఈదేశం ఎటు దిగజారు? కాంచవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి ఈ పరిస్థితీ. పదవీవ్యామోహాలు కులమత భేదాలు భాషాద్వేషాలు చెలరేగే నేడు. ప్రతిమనిషి మరియొకని దోచుకొనేవాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకొనే వాడే. స్వార్ధమె అనర్ధ కారణం, అది చంపుకొనుటే క్షేమ దాయకం. సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకలజనుల సౌభాగ్యమె నీ లక్ష్యం, ఏకదీక్షతో గమ్యం చేరిననాడే లోకానికి మన భారతదేశం, అందించును శుభసందేశం’. అప్పటినించీ ఇప్పటిదాకా ఆయన చెప్పిన పరిస్థితులు ఏమాత్రం మారకపోగా, ఇంకా దిగజారిపోయాయి. ఇది శ్రీశ్రీ భారతదేశానికి ఆనాడే అందించిన ప్రమాదావస్థ ప్రకటన.

ఆకలిరాజ్యం చిత్రంలో శ్రీశ్రీ కవితలని ఎన్నో వాడుకున్నారు, మాటలు వ్రాసిన గణేష్ పాత్రో, దర్శకుడు బాలచందర్. ‘జగన్నాధ రధ చక్ర్రాలు’ కవిత నిడివి తగ్గించి దాసరి నారాయణరావు తన చిత్రంలో వాడుకున్నారు. కన్యాశుల్కం చిత్రంలో ‘ఆనందం అర్ణవమయితే, అనురాగం అంబరమైతే’ కవిత, చక్కటి పాటగా వినిపిస్తుంది. ఆనాటి తెలుగు సినిమాల్లో సాహిత్యం చేసిన ఝంఝా ప్రభంజనం, శంఖారావం, ఢంకాధ్వానం తెలుసుకోవాలంటే ఇలాటివి మంచి ఉదాహరణలు.  

ఆయన పాటల్లో మానవత్వాన్ని తట్టి లేపుతూ, మనుష్యులను ఉత్తేజపరచే పాటలూ ఎన్నో వున్నాయి. వెలుగునీడలు చిత్రంలో ‘కల కానిది, విలువైనది’ పాట నాకు ఎంతో ఇష్టమైన పాట. ‘అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏదీ తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి, అదియే ధీరగుణం’ మంచి సందేశం. జయభేరి సినిమాలో ‘అధికులనీ అధములనీ నరుల దృష్టిలోనే భేధాలు’ అని వ్రాసిన నందుని చరితలో ఆయన భావాలు మళ్ళీ స్పష్టంగా కనిపిస్తాయి.

అంత విప్లవ భావాల శ్రీశ్రీ చాల సరళమైన తెలుగులో ఎంతో మధురమైన పాటలూ వ్రాశారు. ఆరాధన చిత్రంలో ‘వెన్నెలలోని వికాసమే’, ఇద్దరు మిత్రులులో ‘పాడవేల రాధికా’, బావామరదళ్ళులో ‘పయనించే మన వలపుల’, బొబ్బిలియుద్ధంలో ‘నినుచేర మనసాయెరా’, డాక్టర్ చక్రవరిలో ‘మనసున మనసై’ కొన్ని మధురగీతాలు.

శ్రీశ్రీగారికి సంస్కృతంలో మంచి ప్రవేశం వుంది. పునర్జన్మ చిత్రంలో ‘ఎవరివో నీవెవరివో’ పాటలో ఆయన వ్రాసిన, “నీ కర కంకణ నిక్వణమా, అది వాణీ వీణా నినాదమా? నీ పద నూపుర నిస్వనమా, అది జలధితరంగ రావమా? రావే మోహన రూపమా, రావే నూతన తేజమా, రావే రావే’ వింటుంటే మనసు ఎక్కడో తేలిపోతుంది.  

నాస్తికుడయిన ఆయన, వాగ్దానం సినిమాలో ‘సీతా కళ్యాణం’ హరికథ కూడా వ్రాశారు. ఆయన వ్రాసిన చాల కవితలని కొద్ది మార్పులతో ఇతర కవులూ కొన్ని సినిమాల్లో వ్రాశారు. ‘నేను సైతం, నేను సైతం’ లాటివి.

ఒకపక్క శ్రీశ్రీ వేడి గాడ్పులు వీస్తుంటే, ఇంకొక పక్క ‘కొండగాలి తిరిగింది, గుండె వూసులాడింది, గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది’ అని శీతల పవనాలు తెప్పించారు ఆరుద్ర. అంత్య ప్రాసలు ఆరుద్రగారి ముద్ర. ఆయన పదాల పొందికకి ‘మొగలి పూల వాసనతో జగతి మురిసిపోయింది. పడుచుతనం అందానికి తాంబూలమిచ్చింది’.

ఆరుద్రగారి తెలుగు సెలయేరులో పారే నీరులా, హాయిగా, చల్లగా మన మనసుల్ని తాకుతూ ఆహ్లాదంగా వుంటుంది. ‘చెట్టులెక్క గలవా, ఓ నరహరి పుట్టలెక్కగలవా’, ‘చిలకా గోరింకా, కులికే పకా పకా’, ‘కరుణాలవాలా ఇది నీదు లీలా’, ‘నీలగగన ఘన శ్యామా’, ‘చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముచ్చట్లు’, ‘నమో నమో బాపూ, మాకు న్యాయ మార్గమే చూపూ”, ‘గాంధి పుట్టిన దేశమా ఇది’, ‘మానవుడే మహనీయుడు’, ఇలా ఎన్నో వున్నాయి.

డబ్బింగ్ చిత్రాలకి ఎంతోమంది పాటలు వ్రాశారు కానీ, ఆరుద్ర పాటలు తెలుగులో వ్రాస్తేనే, పరాయి భాష వారు బాణీలు కట్టారు అనిపిస్తుంది ఆ పాటలు వింటుంటే. రాజకపూర్ ఆహ్ చిత్రాన్ని ‘ప్రేమలేఖలు’ పేరుతో డబ్బింగ్ చేస్తే, తెలుగు పాటలు, హిందీ పాటల కన్నా ఎక్కువగా ప్రజాదరణ చెందాయని ఒకసారి శంకర్ (అండ్ జైకిషన్) అన్నారు. ఆ సాహిత్యం చూడండి. ‘పందిట్లో పెళ్ళవుతున్నాదీ, కనువిందవుతున్నాదీ, నటనమే ఆడెదనూ. పెండ్లి కుమార్తెకు పూజాఫలమూ చేతికందేనూ, గోరింటాకు కోయగబోతే నా గోళ్ళుకందేనూ.” ఇలాటి కవితలు చదివితే తెలియదు ఆ పులకరింత, విని అనుభవించాల్సిందే. ‘ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల సంగీతం’, ‘నీకు పూర్తిగా తెలుసునులే’, ‘విధి రాకాసి కత్తులు దూసి’ అన్నీ పాటలూ రత్నాలే. అలాగే ఎన్నో తమిళ డబ్బింగ్ సినిమా పాటలు. ‘బంగారు బొమ్మ రావేమే, పందిట్లో పెళ్ళి జరిగేనూ’ వెంటనే గుర్తుకి వస్తుంది. పెళ్ళిపుస్తకంలోని ‘శ్రీరస్తూ, శుభమస్తూ’ ప్రతి పెళ్ళిలోనూ వినిపించే పాట. పరమ నాస్తికుడయిన ఆరుద్ర వ్రాసినె బ్రహ్మండమైన భక్తి పాట, “రాయినైనా కాకపోతిని, రామ పాదము సోకగా’. ఈపాట విని పరవశించని వారు ఎందరు?

ఆరుద్ర మనసుని పరవశింప చేసిన కవి అయితే, అసలు మనసుని కదిలించిన కవి మనసు కవి ఆత్రేయ.

మూగమనసులు సినిమాకి ముళ్ళపూడి కథ, మాటలు వ్రాస్తే, అన్ని మనసు పాటలూ వ్రాసింది ఆత్రేయ.

‘పోయినోళ్ళందరూ మంచోళ్ళు, వున్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు’, ‘చావు పుటుక లేనిదమ్మ నేస్తమన్నదీ, జనమజనమకదీ గట్టి పడతదీ’, ‘కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతదీ, కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది’. ఇలాటి రతనాల పలుకులు ఎలా మరచిపోతాం?

‘పులకించని మది పులకించు’, ‘వద్దురా కన్నయ్యా’, ‘దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం’, ‘ఈ జీవన తరంగాలలో’, ‘చిటపట చినుకులు పడుతూ వుంటే’, ‘శిలలపై శిల్పాలు చెక్కినారు’, ‘మనిషి బ్రతుకింతే, మనసు గతి ఇంతే’, ‘నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి’ ఇలా ఎన్నో మంచి పాటలు వున్నాయి.

ఆత్రేయ పాటలు, చాల వరకూ మాటలే అని మనకి తెలుసు. అందుకే అందరు సంగీత దర్శకులూ పాటలకి బాణీలు కడితే, మహాదేవన్ ఆత్రేయ మాటలకు బాణీ కట్టారు అంటారు. ‘నీ సుఖమే కోరుకున్నా, అందుకే నిను విడిచి వెడుతున్నా’, ‘నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది. నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది’, ‘ఏమండోయ్ శ్రీవారూ, ఎక్కడికీ వెడతారు’.. ఆయన వ్రాసిన కొన్ని ‘మాటల’ పాటలు ఇలా వుంటాయి మరి.

ఆత్రేయ కూడా కమ్యూనిష్టే. ఆ భావాలు ‘కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడీదానా’లో కనిపిస్తాయి. శ్రీశ్రీ  భావజాలంలాగానే నడుస్తుంది. అలాగే ‘రేపంటి రూపం కంటి, పూవింటి తూపుల వంటి, నీ కంటి చూపుల వెంట నా పరుగంటి’ పాట ఆరుద్ర వ్రాసే ప్రాసల ముద్రతో నడుస్తుంది.

‘చెంగావి చీర కట్టుకున్న చిన్నది’, ‘చిటపట చినుకులు పడుతూ వుంటే’, ‘లే లే లే నారాజా’లాటి పాటలు వ్రాసిన ఆత్రేయను ఆరోజుల్లో ‘బూత్రేయ’ అన్నారు. తర్వాత ఆయన శిష్యుడినని చెప్పుకుని, ‘బూతూరి’గా పేరు సంపాదించిన వేటూరి పాటలు (‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’, ‘ఈ సిగ్గుఎగ్గులెంత వరకూ నీ చీర జారు వరకూ’, ‘పాలకొల్లు పాపా, నీ పయట జారు వేళ’, ‘జాకెట్లో జాబిల్లీ’, 'చీరకెంత గర్వం.. యవ్వన గిరులను తాకెననా' లాటి కొన్ని వందల పాటలు) వింటుంటే, ఆత్రేయ వ్రాసిన ఆ పాటలు, వేటూరి బూతు పాటల ముందు ఎక్కడా నిలవవు.

చాలవరకూ విజయా, వాహినీ సంస్థలకి మాత్రమే పరిమితమైన రచయిత పింగళి నాగేంద్రరావు. “ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయిరా. వెయ్యరా, వాడికో వీరతాడు” డైలాగ్ గుర్తుందా? ఆయనే ఈయన. ‘ఎంత ఘాటు ప్రేమయో’, ‘ఎంత హాయి ఈరేయి’, ‘మోహనరాగ మహా’, ‘అలిగితివా సఖీ ప్రియా’, ‘శివశంకరి శివానంద లహరి’, ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు’, ‘రావోయి చందమామ’, ‘అలిగిన వేళలె చూడాలి’, ‘ఆడువారి మాటలకు అర్ధాలె వేరులే’, ‘బృందావన మది అందరిదీ’, ‘ప్రేమయాత్రలకు బృందావనమూ’, ‘చూపులు కలిసిన శుభవేళా’, ‘ఎంత హాయి ఈరేయి, ఎంత మధురమీ హాయి’, ‘కలవరమాయే మదిలో’, ‘అహ నా పెళ్ళంట, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘మనసు పరిమళించెనే’, ‘ఓ సఖీ ఓ చెలీ ఓ మదీయ మోహినీ’, ‘నీవేనా నను తలచినదీ’ (మొట్టమొదటి ఫేస్ టైం పాట!), ‘మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే’, ‘లేచింది మహిళాలోకం’, ‘సుందరి నీవంటి దివ్య స్వరూపము’ ఒకటా రెండా ప్రతి పాటా మనసుని ఉయ్యాలలూపుతుంది. ‘రుసరుసలాడుతు విసిరిన వాల్జెడ వలపు పాశమవుతుందని’ భయంట. అదే ఆయన కవితల్లోని సొగసు. పింగళి వ్రాసిన పాటల పల్లవులు కొన్ని, ‘అహ నా పెళ్ళంట’,’ చూపులు కలిసిన శుభవేళ’, ‘లాహిరి లాహిరి’ సినిమా మకుటాలుగా వచ్చాయి కూడాను.  

తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీద సూటిగా ఎక్కుపెట్టిన కవి దాశరధి కృష్ణమాచార్య ఎంతో లలితమైన తెలుగులో పాటలు వ్రాశారంటే ఆశ్చర్యం వేస్తుంది. దాశరధిగారి పాటలు వింటుంటే మనసుకి ఆహ్లాదంగా వుంటుంది. ‘ననుపాలింగ నడవచి వచ్చితివా”, ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’, ‘ఓ చెలి, కోపమా అంతలో తాపమా’, ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ’, ‘నా కంటిపాపలో నిలిచి పోరా...నీవెంట లోకాల గెలవనీరా’, ‘అందాల బొమ్మతో ఆటాడవా’, ‘గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టుకొమ్మన పిట్టుంది పిట్టమనసులో ఏముంది’, ‘మనసే కోవెలగా మమతలు మల్లెలుగా’ ఇలా ఎన్నో మధురాతి మధురమైన పాటలు వ్రాశారు దాశరధి.

అందమైన పాట అంటే, సినారె వ్రాసి వుంటారు అనుకోవాల్సిందే. సి. నారాయణరెడ్డి వృత్తిపరంగా తెలుగులో ఘనాపాటి. ఆయన వాడిన పదాలు పారిజాత పుష్పాలు అని ఈ పాటలు వింటే మీకు ఇట్టే తెలిసిపోతుంది.

‘అభినవ తారవో నా అభిమాన తారవో’, ‘ఏదో ఏదో అన్నది.. గోగులు పూచే పూగులు కాచే ఓ లచ్చ గుమ్మడీ’, ‘స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం’, ‘నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని’, ‘చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా’, ‘అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి’, ‘ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో’, ‘తెలిసిందిలే నెలరాజ నీరూపు తెలిసిందిలే’.. ఇలా ఎన్నో వున్నాయి. విశ్వనాథ్ గారికి వ్రాసిన పాటలు, ‘వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి’, ‘శృతి నీవు ధ్యుతి నీవు’, ‘సంగీత సాహిత్య సమలంకృతే’, ‘ప్రణతి ప్రణతి ప్రణతీ’ మొదలైనవి నాకెంతో ఇష్టం. 

తెలుగు సినిమాల్లో హాస్యం రంగరించిన పాటలు వ్రాసి, కలకాలం గుర్తుపెట్టుకునేలా చేసింది హాస్య రసరాజు, నేనెంతో అభిమానించే కొసరాజు రాఘవయ్యగారు. ఆయన స్వతహాగా రైతుబిడ్డ. అందుకే ఆయన పాటల్లో ఎన్నో పల్లె పదాలు కనిపిస్తాయి. అదీకాక, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయలలాగానే ఆయన కూడా కమ్యూనిష్టు భావాలు కలవాడే. వాటన్నటికీ మించి మంచి హాస్యప్రియుడు. హాస్యంగా వ్రాస్తూనే చురకలు అంటించిన గొప్ప కవి.

‘నందామయా గురుడ నందామయా’, ‘శివ శివ మూర్తివి గణనాధా నీవు శివుని కుమారుడవు గణనాధా’ పాటల్లో ఆయన అరవై ఐదేళ్ళ క్రితమే, భారతదేశంలో ఈనాటి పరిస్థితులు ఎలా వుంటాయో, హాస్యభరితంగానే అయినా, ఆవేదనతో వ్రాశారు. ఈ రెండూ పాటలు గూగులమ్మనడిగి వినండి. మీకే అర్ధమవుతుంది. తర్వాత ఆయన పూర్తిగా జానపద భాషలో వ్రాసిన ఎంతో గొప్ప పాట ‘ఏరువాకా సాగరోయ్ చిన్నన్న’. చాల అందమైన పల్లెటూరి తెలుగు వినిపిస్తుంది. ‘పడమట దిక్కున వరద గుడేసే’. వరద గుడి అంటే ఇంద్రధనుస్సు, హరివిల్లు. ‘ఎండిన బీళ్ళు ఇగుళ్ళు వేసే’, ‘కోటేరుని సరిజూచి పన్నుకో’, ‘యెలపట దాపట ఎడ్లు దోలుకో’ చక్కటి పల్లె పద ప్రయోగాలు.

‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే’, ‘భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, ఇల్లరికంలో వున్న మజా’, ‘సరదా సరదా సిగరెట్టు’, ‘చవటాయను నేను, ఒఠ్ఠి చవటాయను నేను’, ‘టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ డాంబికాలు పోవద్దురా’

‘వంటయింటి ప్రభువులం పాకశాస్త్ర యోధులం’, ‘తీపి తీపి కల్లోయ్ రాజా, ఓపినంత ఏస్కో రాజ’, ‘చిల్లర రాళ్ళకు మొక్కుతువుంటే చెడిపోదువురా’, ‘ఎయ్యిర సిన్నోడెయ్యిరా, ఎయ్యిరా నీ సోకుమాడా దరువెయ్యరా’ ఇలాటి ఎన్నో హాస్యగీతాలు వ్రాశారీయన, కొసరాజు కేవలం హాస్య రచయితే అనుకోవటం పొరపాటు. ఈ క్రింది పాటలు చూడండి.

 ‘ఏనిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు’, ‘చెంగుచెంగున గంతులు వేయండి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా’, ‘కలవారి స్వార్ధం నిరుపేద దు:ఖం ఏనాటికైనా మారేనా’, ‘రైతు పైని అనురాగము జూపని రాజులుండగా నేలా’, ‘కళ్ళు తెరచి కనరా, సత్యం ఒళ్ళు మరచి వినరా,  సర్వం నీకె భోధపడురా’, ‘ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపు సొలుపేమున్నది’, ‘నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా’.. ఆరోజుల్లో తెలుగు ప్రజలందరి నోళ్ళల్లో నానిన పాట ‘మామ, మామా, మామా’. ప్రతి పాటా ఆణిముత్యమే!

ఈ స్వర్ణయుగంలో కొంతమంది రచయితలు కొద్ది పాటలే వ్రాసినా ఎంతోమంచి పాటలు వ్రాశారు.

గోపీ వ్రాసిన ‘ఒక వేణువు వినుపించెను అనురాగ గీతికా’, అనిశెట్టి తీయని గీతం ‘చల్లని వెన్నెలలో, చక్కని కన్నె సమీపంలో’, సుంకర ‘ఆ మనసులోన’, రావూరి ‘రావే నిదురా హాయిగా’, వడ్డాది ‘చల్లని రాజా, ఓ చందమామ’, సదశివబ్రహ్మం ‘పాలకడలిపై శేషతల్పమున’, స్థానంవారి ‘మీరజాలగలడా’, గుంటూరు శేషేంద్రశర్మ ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మని కల ఇచ్చింది’. ఇలాటి పాటలని ఎలా మరువగలం?

౦                 ౦                 ౦

చాలమంది సంగీతకారులు మన చలనచిత్ర సంగీత స్వర్ణయుగం 1980 దశకం మొదట్లోనే ముగిసింది అంటారు. ఒకవిధంగా చూస్తే వారితో అంగీరించక తప్పదు. ఎందుకంటే దాదాపు అదే సమయంలో తెలుగు సినిమా రంగంలో చాల మార్పులు వచ్చాయి. బొడ్డు సినిమాలు, బూతు పాటలు, ప్రేక్షకులలో కూడా ఏది మంచో, ఏది చెడో తేల్చుకోలేని కథలూ, నిర్మాత దర్శకులలో దిగజారిన విలువలూ సంస్కారం, కుల దురభిమానాలూ, అంతులేని ధనాపేక్ష మొదలయాయి. మన సినిమాల్లో సంగీతంతోపాటు సాహిత్యం కూడా కుంటుపడటం మొదలయింది.

అప్పుడే గ్రీష్మంలో వసంతంలా వచ్చింది విశ్వనాథ్ అందించిన “శంకరాభరణం”. సంగీత సాహిత్యాలు ఒక్క పండితులకే కాదు, పామరులు కూడా ఆనందించగలరు, అనుభవించగలరు అని నిరూపించిన చిత్రం. విశ్వనాథ్ శకం (రెండవ ఇన్నింగ్స్ అందాం) మొదలయాక మళ్ళీ కొంత సంగీతానికీ, సాహిత్యానికీ ప్రాధాన్యం వస్తున్నదనే ఆశ మొదలయింది. బాపు, జంధ్యాల, దాసరి, ఎస్వీ కృష్ణారెడ్డి, వంశీ మొదలైన విలువలు వున్న దర్శకులు ఇక వెనక్కి తిరిగి చూడలేదు.

విశ్వనాథ్ దాదాపు అన్ని పాటలకూ పల్లవులు, కొన్నిటికి చరణాలు కూడా తనే ఇచ్చి ఎన్నో మంచి పాటలు వ్రాయించుకున్నారు. స్వతహాగా రచయిత కనుక, కళా తపస్మి తన గేయరచయితలందరి దగ్గరా కూర్చుని, సందర్భం వివరించి, ఎంతో స్పందన ఇచ్చి చిరస్మరణీయమైన పాటలను వ్రాయించుకున్నారు. అందించారు.   

వేటూరితో ఇబ్బందులు వచ్చి, విశ్వనాథ్ ఒక కొత్త కవి కోసం వెతుకుతున్నప్పుడు, ‘విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం’ అంటూ బ్రహ్మదేవుడే దిగి వచ్చాడు. ఆ చిత్రం ‘సిరివెన్నెల’. ఆ చిత్రం పేరే ఆయన పేరుగా మూడు దశాబ్దాలుగా తెలుగు జాతి గర్వించే పాటలెన్నో అందించారు చేంబోలు సీతారామశాస్త్రి.

‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం, ఓం.. ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం ఓం...కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం, ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం’. ఇది చలన చిత్రరంగంలో ఆయన తొలి పాట అంటే నమ్మటం కష్టమే. నాకు చేంబోలు సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’ గారిలో బాగా నచ్చినది, పైకి మాత్రమే మంచి సౌందర్యమైన మాటలు కనపడవు. వాటి వెనకాల ఎంతో లోతైన అర్ధం వుంటుంది. ఎక్కడా మాటలు వెతికి వేసినట్టు వుండవు. ఆయనదోక భావావేశం. ఒక విధమైన సమాధి స్థితిలోకి వెళ్ళి వ్రాస్తారేమో. లేకపోతే ఏమిటండీ, ఆ పదాల ప్రవాహం. వేగం. కొన్నిచోట్ల, మళ్ళీ మళ్ళీ వింటేగాని ఆయన్ని అర్ధం చేసుకోవటం కష్టం. విన్న ప్రతిసారీ ఆ పాటలో దాగివున్న ఇంకా కొన్ని అందాలు, అర్ధాలు కనిపిస్తాయి.

‘నయన తేజమే న కారమై, మనో నిశ్చయం మ కారమై, శ్వాస చలనమే శి కారమై, వాంఛితార్దమే వ కారమై, యోచన సకలము య కారమై, ఓం నమశ్శివాయ, భావమె భవునకు భావ్యము కాగా, భరతమె నిరతము భాగ్యము కాగా, తుహిన గిరులు కరిగేలా, తాండవమాడే వేళా’ ఇలా సాగుతుంది ఆ భావగర్భితమైన ఆవేశం.

అలా అని ఆయన వ్రాసిన ఎక్కువ పాటలు సంస్కృత భూయిష్టమైనవి కాదు. ఏ పాట వ్రాసినా తేనెలూరు తెలుగులో వినటానికి హాయిగా కూడా వుంటాయి.

‘కాటుక కంటినీరు పెదవులనంటనీకు, చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు, నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా, నీ కుంకమకెపుడూ పొద్దుగుంకదమ్మా’, ‘ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా, ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి, కాలకూటముకన్న ఘాటైన గరళమిది, గొంతునులిమే గురుతై వెంటనే వుంటుంది, ఆటు పోటు ఘటనలివి, ఆటవిడుపు నటనలివి, ఆదిశక్తివి నీవు, అంటవు నిన్నేవి’

‘జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది’. ప్రపంచమే మీ కుటుంబమయితే, మీరు ఏకాకి ఏమిటండీ, ఏమిటి అసలు మీ ఉద్దేశ్యం? ఆ పాట మరొక్కసారి వింటే కవి హృదయం పూర్తిగా అర్ధమవుతుంది.

‘తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాక అల సాగకుంటె, మేఘాల రాగం ఇల చేరుకోదా, తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం’ రేపటి పిల్లలు మరి భూగోళాన్ని కాపాడుకోవద్దూ!

నాకెంతో ఇష్టమైన గాంధీగారి మీద శాస్త్రిగారు వ్రాసిన పాట. ‘ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధి, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి, కరన్సీ నోటు మీద, ఇలా నడి రోడ్డు మీద చూస్తున్న బొమ్మ కాదుర గాంధి, భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధి, తర తరాల యమయాతన తీర్చిన వరదాతరా గాంధి, గుప్పెడు ఉప్పును పోగేసి, నిప్పుల ఉప్పెనగా చేసి దండియాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత, సిసలైన జగజ్జేత, చరఖా యంత్రం చూపించి, స్వదేశి సూత్రం నేర్పించి, నూలు పోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపిత, సంకల్ప బలం చేత, సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన కాంతి, తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేఛ్చా భానుడి ప్రభాత కాంతి, పదవులు కోరని పావనమూర్తి, హృదయాలేలిన చక్రవర్తి!’. ఈ పాట ఎన్నిసార్లు విన్నానో నాకే తెలీదు. విన్న ప్రతిసారీ కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. జాషువా వ్రాసిన గాంధీ పద్యాలు కదిలించినంతగా, మళ్ళీ నన్ను ఈ పాట కదిలించింది.

జాషువా అంటే గుర్తొచ్చింది, ఆయన వ్రాసిన పాపాయి పద్యాలలాటి సిరివెన్నెల పాట , ‘గోపాల బాలుడమ్మా, పదే పదే చూసుకున్న తనివితీరదమ్మ, రారా కన్నా కడుపార కన్నా, నా చిటికిలు వింటూ చూస్తావే నేనేవరో తెలుసా నాన్నా, నిను ఆడించే నీ అమ్మనురా, నువు ఆడుకునే నీ బొమ్మనురా‘ ముచ్చటైన లాలిపాట.

ఒక యువతి తన ప్రేమని వెల్లడించే పధ్ధతి ఇది. ‘ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను, ఎదలోని ప్రేమను మృదువైన మాటను. గాలిలోన వేలితోటి రాసి చూపనా, నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపనా, వాలు జడల కాగితాన విరజాజుల అక్షరాలు పేర్చి కూర్చి చూపనా’. ఆహ్లాదకరమైన పాట.

‘ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ, ఎదలో నిదురించే కధలెన్నో కదిలేలా, నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా, నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా, జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు, వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమె, పూచే పూవులలో నీ నవ్వులు జ్ఞాపకమె,


తూరుపు కాంతుల ప్రతి కిరణం నీ కుంకుమ జ్ఞాపకమే, తులసి మొక్కలో నీ సిరుల జ్ఞాపకం, చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం’  ఏపాట వింటుంటే ప్రతివారికీ తమ చిన్నప్పటి జ్ఞాపకాలు తెరలు తెరలుగా గుర్తుకొస్తుంటాయి.

‘తెలవారదేమో స్వామీ, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలుమంగకూ, తెలవారదేమో స్వామీ. చెలువమునేలగ, చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు, కలల అలజడికి నిద్దుర కరవై, అలసిన దేవేరి.. అలమేలుమంగకూ, తెలవారదేమో స్వామీ’ మొదట అన్నమాచార్య వ్రాసిన కీర్తన అనుకున్నాను. తర్వాత తెలిసింది ఇది సిరివెన్నెలగారిదని.

ఈ మహానుభావుడి గురించి కొన్ని పేజీలపాటిలా వ్రాస్తూనే వుండొచ్చు. కానీ ఎక్కడో ఒకచోట ఆపాలి కదా!

వేటూరి వ్రాసిన పాటల్లో ఎంతో ఆవేశంతో, లోతైన అర్ధంతో వ్రాసిన ఈ పాట నాకు ఎంతో ఇష్టం. అదే ప్రతిఘటన చిత్రంలో ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో, రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో, మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం, నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే ఏమైపోతుందీ సభ్యసమాజం, ఏమైపోతుందీ మానవధర్మం, ఏమైపోతుందీ ఈ భారతదేశం, మన భారతదేశం మన భారతదేశం’ ఇదీ ఈమధ్య కూడా తెలుగునాట జరుగుతున్న బారతమే! ఎంతో గొప్ప సాహిత్యం. అలాగే ఈయన వ్రాసిన ఇంకొక పాట, ‘వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోయాను గగనానికి’ మనిషిని మొత్తం కదిపేస్తుంది.  

అలాగే చంద్రబోసు, భువనచంద్ర, అశోక్ తేజ కొన్ని చక్కటి పాటలు వ్రాశారు.

చంద్రబోస్ వ్రాసిన ‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో వుంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది’ నాకెంతో ఇష్టమైన పాట!

రోజూ ఏ పని చేస్తున్నా, ఈ తెలుగు స్వర్ణయుగ సంగీత మాదురితో కొన్ని గంటలు గడపటం నా అదృష్టం.

౦                 ౦                  ౦

bottom of page