MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
“దీప్తి” ముచ్చట్లు
ఆంట్ టర్కీ
దీప్తి పెండ్యాల
"అసలా సాయంత్రం ఆ నీలాకాశంలో నాకేమీ కనబడలేదు. కానీ, జిమ్మీ కార్టర్ మాత్రం "Its the darndest thing ever I saw " అంటూ అటుకేసే చూసాడు. అతనితో పాటు మరో పది మంది వరకూ ఉన్నారు, వారూ వింతగా ఆకాశం వైపే చూసారు." చేతిలో ఉన్న కోక్ ని సిప్ చేయటానికి ఆగాడు మైక్.
"మ్యాన్, ఐతే నువ్వు మిస్టర్ ప్రెసిడెంట్ చూసిన UFOని చూడలేదన్నమాట?" స్టీవ్ అడిగాడు.
"ఆశ్చర్యమేముంది? మైక్ కి మామూలుగానైనా ఎదురుగా ఉన్న అద్భుతాలు ఎపుడూ కనబడవు కదా..." మోడల్ లా నిలబడుతూ సుతారంగా తన హ్యాట్ తిప్పుతూ కళ్ళెగరేసింది ఏంజెలా.
అందరూ ఒక్కసారిగా నవ్వి ఏంజెలా కి చీర్స్ చెప్పారు.
మైక్ కూడా చిన్నగా నవ్వి కొనసాగించాడు- "కమాన్ ఏంజెలా, నిజంగా అద్భుతమే అయితే మిస్సవకపోయుండేవాడిని. కానీ, అతనిది కేవలం భ్రమ అని నాకు అనిపించింది. నీకు తెలుసుగా నేను అవి ఎంత అద్భుతమైనప్పటికీ భ్రమలని నమ్మనని." కొంటెగా అన్నాడు, ఏంజెలా చిరుకోపం నటించేందుకు ఎప్పటిలాగే వ్యర్థ ప్రయత్నం చేసి, తనవల్ల కాక నవ్వేసింది.
ఆ వృద్ధజంట అలా టీజ్ చేసుకుంటూంటే చూడటం మాకెపుడూ సరదాగా ఉంటుంది.
“మరి ఆ తర్వాత ఏమయిందీ? మేథ్యూ ఆసక్తిగా అడిగాడు.
"ఏముంది? చాలా విశ్లేషణలు జరిగాయి. అన్నట్టు, ఆ సాయంత్రం సంఘటన నాటికింకా జిమ్మీ ఇంకా ప్రెసిండెంట్ అవలేదు. జార్జియా గవర్నర్ అయేకంటే ముందు ఒక లయన్స్ క్లబ్ మీటింగ్ తర్వాత మేమందరం బయట నిలబడి ఉన్నప్పుడు జరిగిన గుర్తు. బహుశా, ఆ తర్వాతి రోజుల్లో అది UFO కాకపోవచ్చనీ భావించాడనుకో."
మైక్ చెప్పే కబుర్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మైక్ మా పక్కింటి వెనిటా వాళ్ళ అంకుల్. ప్రతీ థ్యాంక్స్ గివింగ్ కి బంధువులందరినీ పిలిచి డిన్నర్ పార్టీ ఇస్తారు వెనిటా మరియు మేథ్యూ. గలగలా మాట్లాడే వెనిటాదీ భలే చొచ్చుకుపోయే స్వభావం. మా స్వభావాలే కాక, రెండు కుటుంబాలలో పిల్లల వయసూ ఇంచుమించూ ఒకటే అవటంతో, మేము ఈ ఇంట్లోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే మా రెండు కుటుంబాలు చక్కగా కలిసిపోయాయి. ప్రతీ సంవత్సరం ఆనవాయితీలా జరిగే ఆ ఫ్యామిలీ డిన్నర్ కి మమ్మల్నీ పిలుస్తుంది. ఒక్కోసారి కొత్తవారు కనబడుతుంటారు కానీ ఎపుడూ వచ్చే దాదాపు యాభయి మంది బంధువులలో మాత్రం దాదాపుగా అందరూ పరిచయమే. అలా ప్రతీ సంవత్సరం థ్యాంక్స్ గివింగ్ రోజు సాయంత్రం భలే సరదాగా గడుస్తుంది. ఆ కబుర్లు, వాళ్ళ చెణుకులూ...
నా చిన్నప్పుడు దసరా శెలవుల్లో నానమ్మగారింటికి వెళ్ళినప్పుడు తన ఉమ్మడి కుటుంబం నుంచి అతికష్టంగా ఒక్కరోజు వెసులుబాటు చేసుకుని అన్నదమ్ముల కుటుంబాలను కలవటానికి వచ్చే మా పెద్ద మేనత్త చెప్పే కబుర్లు వినేదాన్ని ఇలాగే. ఇంతింత కళ్ళు చేసుకుని, చేటంతగా చెవులు చాచుకుని. ఆ ఒక్కరోజు తనతో గడపడం ఎంతో అపురూపంగా ఉండేదనీ?.రాత్రంతా కూచుని అందరం కబుర్లాడుకునేవారిమి. మా సంతోషాన్ని చూసి, నిద్రాదేవీ మా దరిదాపులకీ వచ్చేది కాదు.
ఇదిగో, ఈ మైక్ చెప్పే కబుర్లూ అలాగే ఉంటాయి. మైక్ 1960-80 కాలంలో "ఆఫీస్ ఆఫ్ క్యాబినెట్ అఫైర్స్" లో పనిచేసేవారు. వైట్ హౌజ్ విశేషాలు, తన అనుభవాలు, తను చూసిన వింతవిషయాలు, ఒక్కోసారి ఎన్నో ఆసక్తికరమైన విషయాలెన్నో తన హాస్యచతురతని జోడించి చెబుతుంటే వింటూ ఉండాలనిపిస్తుంది.
అంతలోపు వెనిటా వాళ్ళ కజిన్ వాళ్ళబ్బాయి, జెన్నీ, తన చేతిలో మొబైల్ వైపే ఆదుర్దాగా చూస్తూ డైనింగ్ టేబుల్ వద్దకి వచ్చాడు. "ఏంటీ, మీ డిన్నర్ ఇంకా అవలేదా? షాప్స్ అన్నీ ఆరు గంటలకే తెరుస్తున్నారు.ఎర్లీ బర్డ్స్ కి స్పెషల్ ఆఫర్స్ మిస్సవుతాము. డ్యాడ్, మనం బాస్ ప్రో లో కయాక్ డీల్ ఈ సారి మిస్సవకూడదు." హడావిడి పెట్టాడు అందరినీ.
అప్పుడు గమనించాను. ఆ డైనింగ్ హాల్ లో ఈ ముచ్చట్లు వింటున్నవారిలో పిల్లలెవరూ లేకపోవటం. నిజమే. చకచకా తినేసి, టీన్ పిల్లలంతా మీడియా రూములో సినిమా చూస్తున్నారు. ఈ ఎలిమెంటరీ పిల్లలంతా తమ తమ ఫోన్లు, ఐప్యాడులతో బిజీగా ఉన్నారు.ఈ తరంపై జాలేసింది. ఈ కుటుంబసమయాలు, కబుర్లేవీ వాళ్ళ జ్ఞాపకాలలో ఉండవు.
జెన్నీ మాటలు వినగానే ఏదో గుర్తొచ్చినట్టుగా అందరూ మరబొమ్మ`ల్లా హడావిడిగా మిగతా పనులూ పూర్తి చేసేసుకున్నారు మాల్ కి బయల్దేరటానికి… అప్పటివరకూ సరదాగా ఉన్న వాతావరణం యాంత్రికంగా మారింది. ఏంజెలా, మైక్ ఒకరినొకరు చూసుకుని నిట్టూర్చటం నా దృష్టిని దాటిపోలేదు.
మేమూ బై చెప్పి మా ఇంటికొచ్చేసాము. మా పిల్లలూ వాళ్ళ పిల్లలతో పాటే ఏదో ప్లాన్ చేసుకున్నటున్నారు. మా అనుమతి తీసుకుని వెనిటావాళ్ళతో మాల్ కి వెళ్ళిపోయారు.
నాకు ముచ్చట్లంటే ఇష్టం. హాయిగా అందరూ కలిసికూర్చుని కబుర్లాడుకోవడంలో ఉన్న సంతోషం ఈ షాపింగుల్లో ఉంటుందా? థాంక్స్ గివింగ్ రోజు షాపులు తెరవటం నాకెందుకో నచ్చలేదు. ఈ షాపింగులు కుటుంబ సమయాలని హరించటం అస్సలు నచ్చలేదు. పాపం ఈ స్టోర్స్ మాత్రం ఏం చేస్తాయి? గత కొన్నేళ్ళుగా ఈ ఒక్కరోజులో కళ్ళుతిరిగే ఆన్లైన్ అమ్మకాలతో మొత్తం బిజినెస్ ని తమ సొంతం చేసుకుంటూ వస్తున్న అంతర్జాల దిగ్గజాలని తట్టుకుని నిలబడాలంటే తప్పదు కదా.
***
రాత్రి 9 గంటలకనుకుంటా, ఏదో మూవీ చూస్తుంటే, స్నూపీ అరుపు విని, పిల్లలు వచ్చుంటారనుకుని ఇంటి బయటకి వచ్చాను.
ఎవరూ కనబడలేదు.
ఎవరూ లేరని నిర్ధారించుకుని లోపలికి వెళుతుంటే ఓ అపరిచిత కంఠం వినబడింది. ఆ వినవచ్చిన దిశగా చూస్తే- వెనిటా ఇంటి ముందు ఒక ముసలావిడ.
మునుపెన్నడూ చూసిన గుర్తు లేదు. తెల్లగా, అందంగా, హుందాగా ముడుతలు పడిన చర్మంలో ఏదో వింత ఆకర్షణ. ఫ్యాన్సీ లేసుతో కుట్టిన గవున్ కి మ్యాచింగ్ గా గ్లవ్స్, హ్యాట్ తో ఏదో వింటేజ్ ఫోటో షూట్ కి తయారయినట్టే ఉంది.
ఆవిడ మాట్లాడుతుంది నాతోనే -"మీ ఇల్లు ఇదేనా?"
బహుశా పార్టీకి చేరటం లేటయిందేమోననుకుంటూ చొరవతీసుకుని అడిగాను- "అవును.నేనిక్కడే ఉంటాను. మీరు వెనిటా ఇంటికి వచ్చారా? ఇంట్లో వాళ్ళిప్పుడే మాల్ కి వెళ్ళారు. ఇంకా ఇంట్లో ఎవరైనా ఉండవచ్చు."
నా మాటలు పట్టించుకోనట్టే అంది-"తెలుసు.వెళుతుంటే చూసాను.నా పేరు కార్లెట్. అంతా 'ఆంట్ టర్కీ' అంటారు.వెనిటా వాళ్ళ బంధువుని."
"మీ నిక్ నేం తమాషాగా ఉంది. నా పేరు ప్రీతి" నవ్వుతూ చేయి చాపాను.
చీకటిలో కనబడలేదనుకుంటాను. తన వాకింగ్ స్టిక్ పై పెట్టిన రెండు చేతులనీ కనీసం కదల్చనైనా లేదు.
"విన్నాను. ఇందాక మిసెస్ కాంబెల్ నీ పేరు చెప్పింది. నీకు సమయముంటే మీ ఇంట్లోకి రావచ్చా? నాకు ఇక్కడ బోర్ కొడుతుంది" మహా సీరియస్ గా అడిగింది.
ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, వెంటనే నన్ను నేను తిట్టుకున్నాను. కనీసం లోపలికి ఆహ్వానించనందుకు.
ప్లీజ్, కమిన్. అంటూ లోపలికి తీసుకెళ్ళాను. "మంచినీళ్ళు, జ్యూస్ ఏదయినా తీసుకుంటారా?" మర్యాదగా అడిగాను.
"ఏదీ వద్దు. నువ్విలా కూర్చో.మాట్లాడుకుందాము." అంటూ సోఫా పక్కనే ఉన్న మూన్ చెయిర్ లో అలవోకగా కూర్చుంది. చెప్పొద్దూ. ఈ అమెరికన్స్ ఉంటే ఒబేసిటీతో ఉంటారు, లేదంటే ఇలా ఎంత వయసొచ్చినా... చక్కగా, ఆరోగ్యంగా, అతి నాజూగ్గా, చులాగ్గా ఉంటారు. ఇందాక చీకట్లో గమనించలేదు కానీ, ఆమె అందం అసాధారణమైనది. ఏ హాలీవుడ్ నుంచో దిగి వచ్చినట్టే ఉంది.
ఇంతలో నా ఫోన్లో ఏవో మెసేజులు వచ్చిన నోటిఫికేషన్. అసంకల్పిత ప్రతీకార చర్యలా ఫోన్ చేతిలోకి తీసుకున్నాను. విసుగ్గా చూసింది నా వైపు. కొంచెం చురుగ్గానూ. నేను పిల్లలు ఫోన్ పట్టుకుంటే చూసే చూపే అది. పోల్చుకోగలను. చటుక్కున పక్కన పెట్టేసాను.
తన ఆకుపచ్చ గాజు కళ్ళతో ఇంటిని పరికించి చూసి అంది. -"నిన్ను చూస్తూంటే నాన్సీ గుర్తొచ్చింది. ఇందాక మిసెస్.కాంబెల్ కూడా అదే అంది."
నేను కొంచెం మొహమాటపడ్డాను. వెనిటా వాళ్ళింటికి తరచుగా వచ్చే మైక్, ఏంజెలా, వెనిటా కజిన్స్ అందరినీ వాళ్ళింటి పార్టీల్లో కలిసినప్పటికీ, ఈ మిసెస్. కాంబెల్ ఎవరో అస్సలు స్ఫురించలేదు. అలా నా గురించి బాగా తెలుసని చెబుతున్న మనిషెవరో తెలీదనటం సంస్కారం కాదు కనుక సంభాషణ నాన్సీ వైపు మర్లించాను.
"నాన్సీ అంటే ఎవరు?, ఎక్కడుంటారు" అని అడిగాను.
"నాన్సీ రీగన్. రోనాల్డ్ రీగన్ భార్య." నన్నే చూస్తూ అంది.
అక్కడికే షాకయ్యాను. -వీళ్ళింట్లో ప్రెసిడెంట్ల గురించి తప్ప మామూలు విషయాలు మాట్లాడరా? ఎవరిని చూసినా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడినంత సహజంగా ప్రెసిడెంట్ల గురించి మాట్లాడుతారు?" నా స్వగతంలోనే అనేసుకున్నాను. అంతలో మైక్ ఉద్యోగ నేపథ్యంలో ఆ కుటుంబానికి కొందరు వ్యక్తులతో పరిచయాలు ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేనని తోచింది.
అసలిలా, అత్యున్నత స్థాయి వ్యక్తులతో సంభాషించిన నేపథ్యం లో నాలాంటి సాధారణమైన వ్యక్తితో సంభాషణకి ప్రేరణ ఏముంటుందీ? తలాతోక లేకుండా వస్తున్న ఆలోచనలని తప్పించుకుంటూ,
పైకి మాత్రం-" ఆవిడ నాలా ఉండేవారా?" అప్పటికప్పుడు గూగుల్ ఇమెజెస్ చూడాలన్నఇంపల్సివ్ కోరికని బలవంతంగా అణిచివేసి ఆశ్చర్యంగా అడిగాను.
"అహ. రూపులో కాదనుకో. కానీ, ఏవో పోలికలుంటాయి. నీకు ఆస్ట్రాలజీ మీద చాలా నమ్మకం కదూ?" ఎదురుగా ఉన్న "ఓం" గుర్తుని చూస్తూ అడిగింది.
"సరిగ్గా చెప్పలేను. చిన్నప్పుడు నమ్మేదాన్నని గుర్తు. ఇప్పుడు నమ్ముతున్నానా,లేదా తెలీదు. నా వరకూ నాకు జాతకాలు, అవీ మనలని ప్రతీ పనికీ నిరోధిస్తాయని అనుభవం మీద తెలుసుకున్నాను." అన్నాన్నేను.
"కానీ, ఈ గ్రహాలు అవీ మన జీవితాలని ప్రభావితం చేస్తాయంటే కాదంటావా?" సూటిగా చూస్తూ అడిగింది.
"ఉహూ. అనను. కంటికి కనిపించని శక్తి ఉంది. అది సైన్స్ అవ్వొచ్చు. దాన్ని దైవత్వం అనుకోవటంలో ఆ నమ్మకం నాకు బలాన్నిస్తుంది. I believe in Faith. " నన్ను ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతుందో తెలీకున్నా సంభాషణ ఎటు దారితీయబోతోందో చూడాలన్న ఆసక్తితో సమాధానాలు చెబుతూ వెళుతున్నాను.
"నిజమే, దేవుడిని నమ్ము. అంతా మంచే జరుగుతుంది." సినిమాల్లో చూపించే చర్చి ఫాదర్ స్టయిల్ లో అంది.
“మీరు దేవుడిని నమ్ముతారయితే. దేవుడినేనా? మానవ మేధకి అందని ఇతర విషయాలనీ నమ్ముతారా?” కుతూహలంగా అడిగాను.
ఓసారలా పైకి చూసి, గొంతు తగ్గించి చెప్పింది. - “I believe in everything until it's disproved. So I believe in fairies, the myths, dragons.
It all exists, even if it's in your mind. Who's to say that dreams and nightmares aren't as real as the here and now?” మిస్టిక్ వాయిస్ లో ఆమె ఆ కోట్ చెబుతుంటే ఆమె కూడా ఓ ఫెయిరీ లా కనబడింది. అందానికి తగ్గ చక్కటి గొంతు. వయసుకి తగ్గ వణుకూ హుందాగా ధ్వనిస్తుంది. ఆ గొంతుకలో.
"జాన్ లెనన్ కోట్ అది. ఇంచుమించు నేనూ అంతే. లేవని నిరూపితమైనవైతే తప్ప లేవని నమ్మను. ఇందాక మైక్ చెప్పాడే- UFO చూళ్ళేదని. జిమ్మీ చూసింది UFO కాకపోవచ్చు కానీ, గ్రహాంతర వాసులు లేరనీ నేననుకోను." అంది.
ఒక్క క్షణం ఆశ్చర్యపోయాను. ఓ?! మైక్ మాట్లాడుతుంటే ఇంట్లోనే ఉన్నారీవిడ. నేను చూడనైనా లేదేంటో. ఈసారి పార్టీకీ కొంచెం లేట్ గానే వెళ్ళానేమో, అందులోనూ షాపింగ్ మాల్ అంటూ అందరూ హడావిడి పడటంతో కొత్తగా వచ్చినవారిని చూడనేలేదు. ఇందాక ఈవిడన్న మిసెస్ కాంబెల్ కూడా అక్కడే చూసుంటారు నన్ను?
ఆలోచనలో పడ్డ నన్ను మరో ప్రశ్న అడిగింది - "నీకు జాన్ లెనన్ తెలుసునా?"
"ఓ! తెలీకేం? పాత తరం పాపులర్ సింగర్ కదా? బీటల్స్ లో పాపులర్ కదా." ఉత్సాహంగా అన్నాను.
"గుడ్. నీకు మా తరం వాళ్ళూ తెలుసయితే?" అంది.
"అయ్యో. అందరూ తెలీదు. కాకపోతే, మా గీతనీ, యోగానీ, మంత్రాన్నీ నమ్మనన్నాడుగా చివరల్లో రాసిన ఓ పాటలో? అలా అతను మాత్రం తెలుసంతే." నవ్వుతూ అన్నాను.
"అవును. ఆ పాటలోనే అతడు జీసస్ నీ నమ్మనన్నాడు, ఆ పై మరికొన్ని ఇలాంటి మాటలు, భావజాల ప్రకటనలే అతన్ని బలికొన్నాయి. 'జీసస్ కంటే బీటల్స్ గొప్పద'నేలా జాన్ లెనన్ భావిస్తున్నాడన్న కోపంతో, లెనన్ ని హత్యచేసాడు ఒక మూర్ఖుడు- ' విచారం ధ్వనించింది ఆమె మాటల్లో.
మూర్ఖులు లేనిదెక్కడని? దిగులుగా మనసులోనే నిట్టూర్చాను.
అంతకంటే ఎలా స్పందించాలో, దానిపై ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నాకు ఒక సెలబ్రిటీ గాయకుడిగా పేరుబడ్డవాడిగా మాత్రమే ఈ జాన్ లెనన్ తెలుసు కానీ, అతని గురించి వేరే విషయాలు తెలీకపోవటం వల్ల అతని విషయంలో ఏం జరిగిందో తెలీదు.
ఒకటి మాత్రం అబ్బురపరిచింది. ఆంట్ టర్కీ, దేవుడిపై, మతంపై తన అభిమతానికి భిన్నంగా ఉన్నవారినీ మనిషిగా సమాదరిస్తుంది. ఇలాంటి మనుషులని అరుదుగా చూస్తామేమో, ఆవిడపై ఆసక్తి మరింత పెరిగింది.
నేను ఆలోచనలోంచి బయటకి వస్తూ...- "ఇందాక నాన్సీ రీగన్ అన్నారు. ఆవిడెలా తెలుసు మీకు?" అని అడిగాను.
"కేవలం ఒక పార్టీలో పరిచయం. మైక్ ద్వారా. తర్వాత ఒకసారి వైట్ హౌజ్ కీ వెళ్ళాను. అప్పుడు చూసాను. రోనాల్డ్, నాన్సీకి అస్ట్రాలజీ మీద నమ్మకం ఎక్కువ. వైట్ హౌజ్ లోనే పర్సనల్ అస్ట్రాలజర్ ఉండేది. రోనాల్డ్ రోజూవారి ముఖ్యమైన మీటింగ్ సమయాలు అన్నీ, తను సూచించినట్టే జరిగేవని చూచాయగా మా అందరికీ తెలుసు. అచ్చు నీలాగే నాన్సీ కూడా ఆ వూడూ[Voodoo] లాంటి డిజైన్ ఒకటి రోనాల్డ్ గదిలో ఉంచేది. అదీ ఆస్ట్రాలజర్ వారిద్దరి హోరోస్కోప్ ఆధారంగా వేసిన డిజైన్. గ్రహాలన్నిటినీ అనుకూలంగా ఉంచుతుందట కదా? నువ్వూ అందుకేనా వేస్తావు?
వూడూ అనగానే నాకు వణుకొచ్చింది.నేను వూడూ డిజైన్లు ఎప్పుడు వేసాను? ఏమంటుందీవిడా?
నెమ్మదిగా ఆవిడనే అడిగాను."మీరేదో పొరబడినట్టున్నారు. నాకు వూడూ గురించి ఏమీ తెలీదు?"
తల పంకించి-" బహుశా నీకిది మాట్లాడటం ఇబ్బందిగా ఉందేమో? ముందు గదిలో నువ్వు డిజైన్ వేస్తూంటే చూసాము.నేనూ, మిసెస్.కాంబెల్. అదే గ్రహాలను అనుకూలంగా ఉంచే వూడూ డిజైన్."
అప్పటికి, నాకు కొద్దిగా ఏదో అర్థమయినట్టయ్యి, చెప్పాను.- "ఓ, అది వూడూ డిజైన్ కాదు. ముగ్గు లేదా రంగోలి అంటాము. నాకు చిన్నప్పటినుంచీ అదొకటే ముగ్గు వచ్చు. అష్టదళపద్మం.
శుక్రవారం సాయంత్రం లక్ష్మీ పూజ చేసేపుడు ముందు గది తలుపు, కిటికీ తెరిచే ఉంచుతాను. "బయటకి కనబడుతుంది, బ్లైండ్స్ వేసేయ"మని ఎన్నిసార్లు ఇంట్లో వాళ్ళు చెప్పినప్పటికీ, నేను ఎందుకో పట్టించుకోలేదు.ఏమీ కనబడదని అనుకునుంటాను.? ఈవిడిపుడు నేను ఏ రకం పూజలు చేస్తున్నాననుకుంటుందో? నేను వేసే డిజైన్ - నాకు వచ్చిన ఒకే ఒక ముగ్గు - పీఠం కింద, కలశం కిందా... అంతటా అదే ముగ్గు నేను వేసేది. అది- "అష్టదళపద్మం".
అదే చెబితే, ఆవిడ తల పంకించి ఏదో గొణుక్కుంది. ఆ తర్వాత- "నీకు వూడూ అంటే నిజంగా తెలీదా?'
"అదేదో బ్లాక్ మ్యాజిక్ అని తెలుసు అంతే." అన్నాను ఆ పదం పలకడానికే ఏ మూలో భయపడ్డట్టున్నాను కూడా.
ఆంట్-టర్కీ నన్నే చూస్తూ అంది- "నీకే కాదు. వూడూ అంటే ఏంటో బాగా తెలుసనుకునేవారికీ వూడూ సరిగ్గా తెలీదు. వూడూ అంటే నువ్వు భయపడుతున్నట్టు బ్లాక్ మ్యాజిక్ కాదు. అదీ ఒక మతమే. నా మతం లా, నీ మతం లా. కానీ, అది ఆఫ్రికన్ తెగల్లో ఉన్న ఒకానొక మతం. బానిసలుగా వచ్చిన ఆ తెగ వారిపట్ల ఉండే చిన్నచూపు వారి మతాన్ని అపార్థం చేసుకునేలా చేసింది. నల్లవారిపై ఉండే ఒకానొక భయం వారి మతానికి తప్పుడు భాష్యం చెప్పి, ఆ మతంలోని ప్రీస్టులని మంత్రగాళ్ళుగా, వారి మతాన్ని ఒక ఛాందసపు మూఢనమ్మకంగా ముద్ర వేయటం జరిగింది. సినిమాలు, రచనలు కూడా దాన్ని బ్లాక్ మ్యాజిక్ గా చూపించటం వల్ల అలాగే పేరుపడింది. ఎంతలా అంటే- వూడూ మతానికి చెందినవారు తమ మతం ఇదని చెప్పుకోవటానికి భయపడేలా! మంచిని ఆచరించమని చెప్పిన ఒక మతాన్ని పూర్తిగా కాలరాసింది ఈ వివక్ష." చెబుతూ చెబుతూ ఒక్క నిమిషం ఏదో అడ్డం పడ్డట్టుగా ఆగింది. ఒక చేదు వాస్తవంతో పాటు, ఆవిడ కంఠ స్వరంలో ఆవేదన నన్ను కదిల్చివేసింది.
నేనేమీ మాట్లాడలేకపోయాను. నేను చూసిన ఆ తరం అమెరికన్లలో పరమతం పట్ల సమభావం మునుపెన్నడూ చూసినట్టు లేనేమో, ఆవిడ అందమే కాదు, దాని వెనుక హృదయం కూడా అసాధారణమైనదని మాత్రం తెలిసింది.
ఏమి గుర్తొచ్చాయో, చాలా సేపు మౌనంగా ఉండిపోయింది. వచ్చినప్పటి నుంచీ గమనించాను. ఆవిడ మాట్లాడుతున్నపుడయినా, మాట్లాడకుండా మౌనంగా ఉన్నపుడయినా, మనసు ఏదో చింతనలో ఉన్నట్టే ఉంది. ఉండదూ? వసుధైక కుటుంబం అనుకునేవారికి ఈ ప్రపంచం పెద్ద చిక్కే. ఆలోచనల నిండా ఎన్నో బెంగలు, చింతలు, చింతనలు. అదిగో అవన్నీ గూడుకట్టుకునున్నట్టే ఉందీవిడ.
అంతలోనే చటుక్కున లేచింది. "నేను వెళ్ళాలి ప్రీటీ. మిసెస్ కాంబెల్ ఎదురుచూస్తుంది. తలుపేసుకో." ఆవిడ హడావిడిగా బయల్దేరింది.
"మీతో ఈ సమయం గడపడం చాలా సంతోషాన్నిచ్చింది." నే చెప్తున్న మాటలు వినకుండానే చకచకా వెళ్ళిపోయింది. వాకింగ్ స్టిక్ తాటిస్తూ.
ఆవిడెందుకలా హఠాత్తుగా బయల్దేరిందో అర్థమవలేదు కానీ దాని గురించి ఆలోచించలేకపోయాను. ఆ సరికే మరేదో ఆలోచన నా మనసుని తొలుస్తూండటం మొదలయింది. ఇలా ఒక మతాన్ని మూఢనమ్మకంగా ముద్ర వేసి కాలరాయటం- మరెన్ని మతాల విషయాల విషయంలో జరగనుందో కదా?
****
అంతలోనే పిల్లలూ రావటంతో ఆ ఆలోచనా అటకెక్కింది ఆరోజుకి.
****
"హే ప్రీటీ! గుడ్ ఈవినింగ్. నీవిచ్చిన క్యాండిల్ హోల్డర్స్ ఎంత బాగున్నాయి చూడు?" తరువాతి రోజు ఇంటి బయట క్రిస్మస్ అలంకరణలు చేస్తూన్న వెనిటా పలకరించింది.
దీపావళి మొదలు కార్తీకమాసమంతా మా ఇంటి గుమ్మానికి ఇరువైపులా నేను పెట్టే ప్రమిదలు వెనిటాకి చాలా ఇష్టం. అచ్చం అలాగే నేనింతకు ముందు ఇచ్చిన రంగుల ప్రమిదల్లో లెడ్ దీపాలు పెడుతుంది క్రిస్మస్ అలంకరణల్లో భాగంగా. ఆ ప్రమిదలనే క్యాండిల్ హోల్డర్స్ అంటుంది.
"బావున్నాయి. బ్యూటిఫుల్." అంటూ చుట్టూ చూసాను. ఇలా నవంబర్ ఆఖరి వారం మొదలు ఈ హాలిడేస్ సమయంలో మా వీధి, వీధంతా శోభాయమానంగా ఉంటుంది. వెలుగులీనుతూ. అందరిళ్ళముందూ పోటీపడేలా ఉంటాయి అలంకరణలు.
చల్లటి సాయంత్రాలు చీకటితో చిక్కపడబోతున్నంతలో ఈ విద్యుత్ వెలుగులు పరుచుకుంటాయి వీధంతా.
అంతలో వెనిటాని "ఆంట్ టర్కీ" గురించి అడగాలని గుర్తొచ్చి,"హే వెనిటా, నిన్ను ఒకటి అడగాలి. ఆంట్ టర్కీని గురించి నువ్వెపుడూ చెప్పనేలేదు? నిన్న..." నా మాట పూర్తి కాకుండానే వెనిటా ఉత్సాహంగా చెప్పింది. -"ఓ, ఆంట్ టర్కీ కి ఫస్ట్ టోస్ట్ ఇచ్చామని అడుగుతున్నావా? ఆంట్ టర్కీ మా అందరికీ చాలా ఫేవరేట్. అసలైతే మాకు ఆంట్ కాదు. మా మామ్, అంకుల్ మైక్ తనని 'ఆంట్ టర్కీ' అంటుంటే, వాళ్ళని చూసి మేమంతా అదే పేరుతో పిలిచేవారిమి. మా చిన్నతనంలో థ్యాంక్స్ గివింగ్ అంటే వాళ్ళింట్లోనే.ఆవిడకి తగని బంధుప్రీతి. ఎక్కడెక్కడివారినో కజిన్స్ అందరినీ పిలిచి థ్యాంక్స్ గివింగ్ పార్టీ ఇచ్చేది. ఎంత సరదా రోజులో అవి. సరదాగానూ ఉండేది. స్ట్రిక్ట్ గానూ ఉండేది. సీడీ ప్లేయర్ కానీ, వాక్ మన్ కానీ... ఏదీ ఉండకూడదు. ఆరోజు అన్నీ వదిలి కేవలం ఆటలు, మాటలు... అంతే. తను పోయిన తర్వాత ప్రతీ థ్యాంక్స్ గివింగ్కి తన గుర్తుగా తనకి మొదటి టోస్ట్ ఇవ్వటం అలవాటయింది."
నేను పార్టీలో కాస్త లేటుగా జాయినయ్యాను. టోస్ట్ ఇవ్వటమెపుడూ చూడలేదని వెనిటాతో అనలేకపోయాను. ఆ క్షణాన మరేదో తెలుసుకోవాల్సి ఉన్నట్టనిపించింది.
"ఇంట్రెస్టింగ్. మిసెస్ కాంబెల్ అన్నారు, ఆవిడెవరూ?"
అప్పటి వరకూ హుషారుగా ఉన్న వెనిటా మొహం వివర్ణమయింది. "ఆవిడ మా ఆంట్ టర్కీ నైబర్. ఇద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు. డెబ్బయి,ఎనభైల్లో మిసెస్ కాంబెల్ పేరున్న కాలమిస్ట్. రేసిజాన్ని ఖండిస్తూ ప్రభావవంతమైన రచనలు చేసేవారావిడ.
"మరి ఇప్పుడు ఎక్కడున్నారు?"
"పది సంవత్సరాలయింది. ఎపుడూ కలిసుండే వారిద్దరూ విడిపోయి. హేట్ క్రైం అది. ఆ రోజు ఆంట్ టర్కీ, మిసెస్.కాంబెల్ ఒక రెస్టారెంట్లో ఉన్నారు. మిసెస్ కాంబెల్ ని టార్గెట్ చేసాడు షూటర్. బుల్లెట్ గమనించి తనని కాపాడే ప్రయత్నంలో తనని పక్కకి తప్పించగానే, వరుస బులెట్లతో ఇద్దర్నీ షూట్ చేసాడు. మా అందరికీ ఆ సంఘటన ఓ పెద్ద విషాదాన్ని మిగిల్చింది."
అనుమానమేదో తలెత్తగా, నమ్మకం కుదరక మళ్ళీ అడిగాను.-"మరి వాళ్ళిద్దరూ...?"
“నో ప్రీటీ, ఆ రోజే ఆఖరు. అంబులెన్స్ క్షణాల్లో వచ్చినప్పటికీ ఆ సరికే ప్రాణాలు కోల్పోయారిద్దరూ."
వెన్నులో సన్నగా వణుకొచ్చింది. నిన్న ఆంట్ టర్కీని చూడటం నిజమా? కల కన్నానా?
“వెనిటా? ఏదైనా ఫోటో ఉందా? ఆంట్ టర్కీది?”
“ఇదిగో, ఇక్కడే లివింగ్ రూమ్ లో ఫ్యామిలీ పోర్ట్రయిట్ లో ఉంది చూడు.” లోపలికి రమ్మంటూ చూపించింది.
దాదాపు పరిగెత్తినట్టే వెళ్ళి చూసాను. ఫోటో చూస్తూనే షాక్ తిన్నట్టుగా మ్రాన్పడిపోయాను.
అదే మొహం! అదే ఫ్యాన్సీ గౌను. వాకింగ్ స్టిక్ పై రెండు చేతులూ ఉంచి!
బహుశా ఈ ఫోటోలో చూసి కల కనుంటానా?. కానీ, ఎపుడూ సరిగా విననైనా వినని పేర్లు, వివరాలు కలలో ఎలా సాధ్యం? వై మీ? నాకే ఎందుకు కనబడి ఉండాలి?
నేనే నమ్మలేకపోతున్న విషయాన్ని వెనిటాతో ఎలా పంచుకోవాలో తెలీక, "గుడ్ ఫోటో!" అనేసి, మా ఇంటివైపు నడిచాను. నాతోపాటు వెనిటా కూడా బయటకి వచ్చి తిరిగి తన డెకరేషన్ పనిలో పడింది.
ఇంటిముందుకు రాగానే, సెక్యూరిటీ కెమెరా "రింగ్" మోగింది. ఠక్కున ఏదో స్ఫురించి, ఫోన్ లో- ముందురోజు రాత్రి రికార్డయిన క్లిప్పింగ్స్ చూసాను. ఇంటిముందు ఎవరితోనో మాట్లాడుతూ నేనయితే కనబడుతున్నాను. నా వెనుకెవరూ రికార్డవలేదు.
అయోమయంగా ఇంటిలోపలికి వెళ్ళబోతున్న నాకు, వెనిటా అబ్బురంగా ఇంకా చెబుతూనే ఉన్న మాటలు చెవినపడ్డాయి- "ప్రీటీ, ఇప్పటికీ ఆంట్ టర్కీ ప్రతీ థ్యాంక్స్ గివింగ్ రోజున మాతోనే ఉంటుందని మైక్ ఊరికే అంటూంటాడు. మా పైనే కాదు మనుషులపై తనకున్న ప్రేమ అలాంటిది. అందరూ కలిసే సమయాలంటే మరింత ఇష్టముండేది తనకి!"- చెట్టు చుట్టూ క్రిస్మస్ లైట్లు చుడుతూన్న వెనిటా మొహంలో వింత వెలుగు. బహుశా అవి ఆంట్ టర్కీ జ్ఞాపకాలు మోసుకొచ్చిన వెలుగులు కావచ్చు.
“There is a supernatural force within the workings of love that none of us, not even scientists, can deny.” ― Ken Poirot
*****