top of page

సంపుటి  4   సంచిక  4

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వంగూరి పి.పా.

 

ఆ ఐదుగురూ - ఐదు నెలలలోనే ...

 

vanguri.PNG

వంగూరి చిట్టెన్ రాజు

 

మే, జులై, ఆగస్ట్, సెప్టెంబర్, 2019 నెలలు తెలుగు సాహిత్య రంగానికి చాలా అన్యాయం చేశాయి.  ఐదుగురు ప్రముఖ సాహితీవేత్తలని మనకి దూరం చేశాయి. అందులో నలుగురికి ‘పిలుపు’ వస్తే, ఒకావిడ తనంతట తనే వెతుక్కుంటూ వెళ్ళిపోయింది.

గత ఐదు నెలలుగా నేను ఎంత మర్చిపోదాం అనుకున్నా నన్ను వెంటాడుతున్న జ్ఞాపకాలు ఆ ఐదుగురు  బంధువులవీ.....అంటే నిజమైన బంధువుల కంటే ఎక్కువ అభిమానం, గౌరవం, సాహిత్య రంగంలోనే ఉంటూ జీవిత కాలం ఎవరి లో వారు ఇంకెవరూ ఎదగలేని ఎత్తులకి సునాయాసంగా చేరుకుని అందరికీ ఆదర్శప్రాయులైన వారే. వారిలో ఇద్దరితో నాకు వ్యక్తిగతంగా ఆత్మీయులుగా, దశాబ్దాల వారి స్నేహామృతం లో తరించే అవకాశం లభించడం కేవలం నా అదృష్టమే. ఆ ఇద్దరే ఇటీవల పరమపదించిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారూ, కె.బి. లక్ష్మి గా అందరికీ తెలిసిన కొల్లూరు భాగ్య లక్ష్మి గారు. మిగిలిన వారు నాకు ఫేస్ బుక్ మిత్రులే కానీ వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవ లేదు. సోమరాజు సుశీల గారిని సభలలో చూశాను. వారి కథలని చదివి ఆనందించే పుణ్యం చేసుకున్నాను. రామతీర్ధ గారి గురించీ, జగధ్ధాత్రి గారి గురించి, ఆ దంపతుల సమిష్టిగానూ, ఎవరికి వారే చేసిన సాహితీ సేవల గురించి ఎంతో మంది చాలా మంచి విషయాలు చెప్పేవారు. శర్మ గారు నాకంటే ఏడాది పెద్ద, లక్ష్మి గారు నాలుగేళ్ళు చిన్న అయితే సోమరాజు సుశీల గారు నాకంటే నిజంగానే ఒకే ఒక రోజు పెద్ద. అంటే ఆ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆమె 28 నాడు పుట్టగా నేను ఆ మర్నాడే అదే జిల్లా కేంద్రం అయిన కాకినాడలో పుట్టాను. రామతీర్ధ గారూ, జగధ్ధాత్రి గారు నాకన్నా చాలా చిన్న వారు.  ఇటీవల పరమపదించిన ఆ సాహితీమూర్తులని స్మరించుకుంటూ మా మధురవాణి తరఫున నివాళులు అర్పిస్తున్నాం.   

శ్రీకాంత శర్మ గారిని నాకు బాపు గారు 1998 లో పరిచయం చేశారు. కారణం ఏమిటంటే ఆ ఏడు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున అట్లాంటాలో నిర్వహించిన మొట్ట మొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సుకి ప్రధాన అతిధిగా బాపు గారి మాటల్లోనే చెప్పాలంటే “మా ఇద్దరి గొట్టాం గాళ్ళ కంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సరి అయిన వాడు” అంత వరకూ శర్మ గారు  తెలుగు కవితా ప్రపంచం లో చెలరేగుతున్న ‘ఇజాల’ కవితల ఉచ్చు లో పడకుండా “అనుభూతి కవి” గానూ, ఆంధ్ర ప్రభ వార పత్రిక ప్రధాన సంపాదకులుగా గానూ మాత్రమే నాకు తెలుసు. నేను పిలిచి ఆహ్వానించగానే ఎక్కడా భేషజం లేకుండానే “వారం కంటే అమెరికాలో ఉండలేను” అని చెప్పి, చెప్పినట్టే వారం ఉన్నారు. అదే ఆయన మొదటి అమెరికా పర్యటన. ఆ చారిత్రాత్మక సభకి ప్రధాన అతిధిగా “తెలుగు సాహిత్యంలో సమకాలీన పోకడలు” అనే అంశం మీద గత వంద సంవత్సరాలలో కవిత్వం, వచన కవిత్వం, భావ కవిత్వం, రకరకాల కవిత్వ వాదాలు, కథా సాహిత్యం, నాటికలు ఇలా అన్ని సాహిత్య ప్రక్రియల పురోగతి గురించీ అనర్గళంగా, కాగితం చూడకుండా ప్రసంగించి మమ్మల్ని ఆచార్యం చకితుల్ని చేసి ఎన్నెన్నో తెలియని విశేషాలు చెప్పారు శ్రీకాంత శర్మ గారు.  

ఆ తరువాత 2002 లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అనుబంధ విభాగం ఇండియాలో ట్రస్ట్ గా పెడితే బావుంటుంది అనే ఆలోచన వచ్చీ రాగానే వెంటనే నేనూ, వంశీ రామరాజు గారూ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి ఇంటికి వెళ్ళిపోయి ఆయనతోటీ, జానకీ బాల గారితోటీ మా ఆలోచన పంచుకున్నాం. “స్థానిక పరిస్థితి కి భిన్నంగా నిజమైన సాహిత్య సభలు, కార్యక్రమాలు ఎలా చెయ్యాలి “అని తన ఆలోచనలని, సూచనలని మాకు వివరంగా చెప్పారు శర్మ గారు. వెంటనే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారే చైర్మన్ గానూ, రచన సాయి గారు వైస్ చైర్మన్, జానకీ బాల గారు, తెన్నేటి సుధ గారూ ట్రస్టీ లు గానూ, వంశీ రామరాజు గారు మేనేజింగ్ ట్రస్టీ గానూ హైదరాబాద్ లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అనే పేరిటే లాభాపేక్ష లేని సంస్థ రిజిష్టర్ చేశాం. వెనువెంటనే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ప్రధాన సంపాదకులుగా, జానకీ బాల గారు సహ సంపాదకురాలుగా, ఖదీర్ బాబు రూప కల్పనతో వెలువడిన “అమెరికా కథ” సంకలనం ఇండియాలో మా మొట్టమొదటి ప్రచురణ. ఆ పుస్తకావిష్కరణ సభ అనంతరం నేను వ్రాసిన “యమ సభ” హాస్య నాటికని స్థానిక ప్రొఫెషనల్ నటీ నటుల చేత ప్రదర్శింప చేశారు శ్రీకాంత శర్మ గారు. 

స్వయంగా అనుభూతి కవి, కథకులు, విశ్లేషకులు, నాటక రచయిత, ఎంతో క్లిష్టమైన కూచిపూడి నృత్య దృశ్య నాటక రచయిత, సినీ గేయ రచయిత, రేడియో ప్రయోక్త, ఉన్నత స్థాయి పత్రికా సంపాదకులు, ప్రాచీన, ఆధునిక సాహిత్యాలలో అన్ని ప్రక్రియ లలోనూ వ్యక్తిగత ప్రతిభ, పాండిత్యాలు ఉన్న ఏకైక సాహితీ వేత్తగా రాణించడమే కాకుండా, అసంఖ్యాకమైన ఇతర ఆదునిక తెలుగు రచయితలలో కూడా ఎవరు, ఏ అంశం మీద పట్టు ఉండి తగిన స్థాయిలో బాగా మాట్లాడగలరో శ్రీకాంత శర్మ గారికి కరతలామలకం అని మేము జనరి 1, 2007 లో బాపు-రమణ మైత్రీ షష్టి పూర్తి ప్రధాన ఆకర్షణgగా నిర్వహించిన మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో తెలిసింది. ఆ సదస్సులో అనిర్వచనీయమైన మరొక ఆనందం బాపు గారు తన సతీమణి భాగ్యమతి గారి తోనూ, రమణ గారు సతీమణి శ్రీదేవి గారి తోనూ మొట్ట మొదటి సారిగా ఒక బహిరంగ వేదిక ని అలంకరించడం ఒక ఎత్తు అయితే  బాపు గారికి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారూ, ముళ్ళపూడి వారికి నేనూ సన్మాన పత్రాలు సమర్పించి వారిద్దరి మైత్రీ షష్టి పూర్తి సందర్భంగా జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించుకోవడం మరొక ఎత్తు. ఆనాటి అపురూపమైన ఆ ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను.  

ఏ సంవత్సరమో జ్ఞాపకం లేదు కానీ ఆ తరవాత ఒక సారి శ్రీకాంత శర్మ గారూ, జానకీ బాల గారూ హ్యూస్టన్ లో వారం రోజులు మాతో ఉండి మా కుటీరాన్ని పావనం చేశారు. వారికి నాసా చూపించినప్పటి ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. శ్రీకాంత శర్మ గారి మీద గౌరవ భావంతో ఆయన రచించిన “పరి పరి పరిచయాలు” అనే  అపురూపమైన పుస్తకాన్ని 2009 లో మా సంస్థ తరఫున ప్రచురించి ఆయనకి కానుక గా సమర్పించాం. 

ఎంతో స్నేహశీలి, నిరంతరం నవ్వుతూనే జీవితం గడిపిన హాస్య ప్రియులు, అజాత శత్రువు అద్వితీయ సాహితీ వేత్త అయిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు గత జులై 25, 2019 నాడు  పరమపదించడం ఎంతో బాధాకరం. 

సరిగ్గా నాలుగు రోజుల తర్వాత...మరొక జులై 29, 2019 నాడు ఎవరూ ఊహించని విధంగా కె.బి. లక్ష్మి గారి అకాల, అనాయాస మరణం తెలుగు సాహిత్య ప్రపంచాన్ని మరొక సారి అందరినీ కలచి వేసింది. కె.బి. లక్ష్మి అనగానే అందరికీ గుర్తుకి వచ్చేది ఆమె ఆహ్లాదంగా, గల గలా నవ్వు, అనర్గళంగా ప్రవహించే ఉపన్యాస ప్రవాహం, సుదీర్ఘ సాహిత్య సేవ, అంతులేని స్నేహ భావం. దశాబ్దాలగా ఎప్పుడు ఇండియా వెళ్ళినా నేను ముందుగా పలకరించే సాహితీవేత్తలలో లక్ష్మి ఒకరు. ఏ సాహిత్య సభ పెట్టినా ప్రధాన వక్తలలో లక్ష్మి గారికే పెద్ద పీట. ఆ మాటకొస్తే హైదరాబాద్ లో ఎవరు, ఏ విధమైన సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించినా వక్తగా “కె.బి. లక్ష్మి ని పిలిచారా?” అనేదే ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే అంశం ఏదైనా, ముందు బాగా తన ప్రసంగం తయారు చేసుకుని ఆసక్తికరంగా, సమయ స్ఫూర్తి తో ప్రసంగించడం ఆమె సొత్తు. 2010 లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా-ఆంధ్రప్రభ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ కథల పోటీలో  పోటీ నిర్వహించినప్పుడు భాగ్య లక్ష్మి గారి “వెన్నెల లోని వికాసమె” కథకి బహుమతి లభించింది. ఆ పోటీకి గొల్లపూడి వారు ఉత్తమ కథల ఎంపిక చెయ్యడంతో లక్ష్మి గారు ఇంకా మురిసి పోయారు. ఆమె జ్ఞాపకాలతో ఈ మధురవాణి సంచికలో ఆ కథ ప్రచురిస్తున్నాం.

కె.బి. లక్ష్మి కి నేనంటే ఎందుకో ప్రత్యేకమైన అభిమానం.  రెండేళ్ళ క్రితం తన కుమారుడు ప్రవీణ్ దగ్గరకి డాలస్ వచ్చినప్పుడు, రాగానే నన్ను పిలిచి “మీ ఇంటికి ఎప్పుడు రానూ?” అని అడిగారు. “అమెరికా దాకా వచ్చాక మిమ్మల్ని చూడక పోతే, అమ్మ బాబోయ్, ఇంకేమన్నా ఉందా?” అదీ ఆమె చెప్పిన కారణం. అప్పుడు ఆమె, ప్రవీణ్ తో హ్యూస్టన్ వచ్చి, మా ఇంట్లోనే ఉండి, మా నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం లో సుమారు గంటన్నర సేపు తన జీవిత సాహిత్య ప్రస్థానం గురించి కూలంకషంగా వివరించారు. రేడియో వ్యాఖ్యాత, విమర్శకురాలు, కథా రచయిత్రి, ప్రముఖ వక్త, ఈనాడు వారి ప్రముఖ పత్రికలైన విపుల, చతుర పత్రికలకి అనేక సంవత్సరాలు సంపాదకురాలు, పాత్రికేయురాలు గా ఆమె బహుముఖ ప్రజ్ఞాపాటవాలకి మా హ్యూస్టన్ శ్రోతలు జేజేలు పలికారు. 

అంతకు ముందు నుంచే అనుకుంటాను ఆమె మా హ్యూస్టన్ సాహితీ లోకం గూగుల్ గుంపు లో సభ్యురాలిగా సాహిత్య చర్చలలో పాల్గొనే వారు. ఇక మా మధురవాణి పత్రికకి కి కె.బి లక్ష్మి గారు ఎంతో అభిమాని. పత్రిక విడుదల అవగానే కథలు, కవితలు, నేను వ్రాసే ఈ శీర్షికకే కాక అన్ని పేజీలనీ పూర్తిగా చదివి స్పందించే పాఠకురాలు మా లక్ష్మి. ఇలా అనేక రకాలుగా మా హ్యూస్టన్ వాసులతో అవినాభావ సంబంధం పెంచుకున్న కె.బి.లక్ష్మి గారి ఆకస్మిక మరణం మమ్మల్ని ఎంతో విషాదానికి గురి చేసింది. 

ఈ విషాద వార్తల నుంచి కోలుకుంటూ ఉండగానే సెప్టెంబర్ 26 నాడు ‘ఇల్లేరమ్మ’ సుశీల గా లబ్దఃప్రతిష్టులైన సోమరాజు సుశీల గారి మరణ వార్త సాహితీ ప్రియులందరినీ కలచి వేసింది. హాస్య రచయిత్రిగా, ‘పెళ్ళి పందిరి” పత్రికా శీర్షిక నిర్వాహకురాలిగా, ప్రముఖ రసాయన శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, అదే రంగం లో పారిశ్రామిక వేత్తగా, అన్నింటికీ విభిన్నమైన ఆర్ ఎస్ ఎస్ బౌధ్దిక్ ప్రముఖ్ గా అనేక రంగాలలో తనదైన ముద్ర వేసుకుని, స్నేహశీలి గా అందరి అభిమానాన్నీ, గౌరవ మర్యాదలనీ సంపాదించుకున్నారు సుశీల గారు. ఆ మహామనీషి తో నాకు వ్యక్తిగత పరిచయ కలగక పోయినా పరోక్షంగా వేలాది ఆమె అభిమానుల్లో నేను కూడా ఒకడిని. 50 ఏళ్ళు నిండాక “చిన్న పరిశ్రమలు-పెద్ద కథలు” తో రచనా వ్యాసంగమ్లో అడుగు పెట్టి, “రాయడం అంటే మన గోడు చెప్పుకోవడమే” అనీ “ఇల్లేరమ్మ కథలు అన్నీ జరిగినవే. ఒక్కటి కూడా ఊహించి రాయ లేదు”, “శ్రీపాద గారు నాకు మానసిక గురువు” “అమెరికా వాళ్ళ నిజాయితీ నాకు నచ్చింది. ఇక్కడి వాళ్ళు అమెరికా వారి గురించి అనుకునే వన్నీ తప్పు” అనీ మృణాళిని గారి “అక్షర యాత్ర” లో చెప్పుకున్న, చెప్పిన లోతైన రచయిత్రి సుశీల గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాం.

ఇక జగధ్ధాత్రి గారు అనగానే ఇప్పుడు అందరికీ జ్ఞాపకం వచ్చేది విషాద విశాఖ కానీ అంతకు ముందు విశాఖ సాహితీవికాసమే. కాలమిస్టుగా, అనువాదకునిగా, విమర్శకునిగా, వక్తగా సాహితీ రంగం లో విశాఖ, విజయ నగరాలతో ఎంతో అనుబంధం ఉండి సాహితీ సహజీవనం సాగించిన భర్త రామతీర్ధ మే, 2109 నెలలో పరపపదించగా జగధ్ధ్దాత్రి గారు తనంతట తాను కైలాస వాసం చేరుకోవడం బాధాకరం.

 

నాకు వ్యక్తిగతంగానూ, మా హ్యూస్టన్ వారికీ సాహితీ మిత్రులైన కె.బి. లక్ష్మి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సోమరాజు సుశీల, రామతీర్ధ & జగధ్ధాత్రి గార్ల దివ్యస్మృతికీ మధురవాణి పత్రిక తరఫున నివాళులు అర్పిస్తున్నాం.  

*****

bottom of page