top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

సంపుటి  4   సంచిక  4

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

పాండి బజార్ కథలు - 9

ఖుషీ కార్నర్

సాహిత్యసిరి... ఇంటింటాశ్రీశ్రీ

భువనచంద్ర

sipraali.PNG
sreesree.PNG

‘‘వాడు చేసుకుని పెళ్లి

ఛస్తున్నాడు కుళ్లికుళ్లి

నువ్వెందుకు కడుతున్నావురా కిళ్లీ

జిల్లేడాకుల్తో మళ్లీమళ్లీ’’

‘‘ఇదండీ నేను రాసిన మొదటి కవిత’’ పకపకా నవ్వీ అన్నారు కోదండరంగారావు గారు (కో.రం).

‘‘కవితే నంటారా?’’ వెటకారంగా అన్నారు నందినరసింహం.

‘‘కాక? కుక్కపిల్లా సబ్బుబిళ్లా కవిత కాలేనిది నా కవిత  కవిత కాకుండా ఎలా పోతుందీ?’’ (............) అన్నారు కో.రం.

‘‘అది శ్రీశ్రీది’’ చికాగ్గా అన్నారు ముక్తేశ్వర్రావుగారు.

‘‘ఆయనిచ్చిన స్ఫూర్తితో రాసిందే నా కవిత కూడా.. ఇదిగో ముక్తేశ్వర్రావుగారూ, నరసింహంగారూ ఆ రోజుల్లో యువతీ యువకులందరూ కలం పట్టింది శ్రీశ్రీ గారి స్ఫూర్తితోనే, అప్పటి వరకూ ఆకాశంలో తేలే కవుల్నీ సాహిత్యాన్నీ నేలకి దింపి, ఇదిగో కళ్లు తెరుచుకుని వాస్తవాలని గమనించండి.. అని వాళ్లకి వాస్తవ పరిస్థితుల్ని చూపింది శ్రీశ్రీనే’’. ఆ గారు కో.రం గారు.

‘‘ఆ మాట ముమ్మాటికీ నిజమే, సామాన్యుడి వెతలే శ్రీశ్రీకి కవితా వస్తువులయ్యాయి. బడుగుల కన్నీళ్లే  ఆయన కలంలో సిరాగా ఒదిగాయి. సామాన్యుడి ఖేదాన్నీ సమస్యలనీ ఎలుగెత్తి చాటుటమేగాక పరిష్కారాన్ని సూచించినవాడు కూడా శ్రీశ్రీనే. అందుకే ‘‘ ఈ యుగం నాది’’ అని ధీమాగా అనగలిగాడు’’ వివరించారు సైకిల్ మూర్తి.


‘‘ నిజం...! ఆయన పాడిన పాటల్లో నాకిష్టమైనవి ఎన్నోవున్నై. ముఖ్యంగా ‘‘గాంధారిగర్వభంగం’’ డబ్బింగ్ సినిమాలో మానవుడేనోయ్ పాట. అబ్బ...ఆయనకి మనిషి మీద ఎంత నమ్మకం..’’ తన్మయత్వంతో అన్నది సావిత్రి.

‘‘ ఆలస్యం ఎందుకూ..అందుకోండి..కోరస్ గా అమూల్యగారే కాదు అందరూ పాడతారు ‘‘ ఉత్సాహంగా అన్నాడు ర.మొ.

చిత్రం:  గాంధారీగర్వభంగం (డబ్బింగ్ సినిమా)

సాకీ: పదునాలుగు లోకములు ఎదురేలేదే

పదునాలుగు లోకముల ఎదురన్నది లేదుగా

మానవుడీనోయ్..

మానవుడే సర్వశక్తిధాముడు కదా...

పల్లవి: మనుష్యుడిల మహానుభావుడే...చూడగా

మనుష్యుడిల మహానుభావుడే.... కోరస్:  ||మనుష్యు||

చరణం: మానవుడే తలచినచో గిరులనెగురవేయడా

మానవుడే తలచినచో నదులగతుల మార్చడా

మానవుడే తలచినచో భూమ్యాకాశాలనే

ఏకముగా చేయగల సేతువు నిర్మించడా

మానవుడేనోయి సురాసురకిన్నెర గంధర్వుల

గర్వమణచగలిగినట్టి ధీరుడోయీ.... ||మనుష్యు||

చరణం: నయనమ్ముల రాగములో... హృదయమ్ము స్నేహములో 

మానవుడే సృష్టికలంకారము...

స్వేచ్ఛా స్వాతంత్రమవో దీక్షాసాధన వీరుడె

మానవుడే యుగభవన ద్వారము

మండలమున స్వర్గమునే స్థాపించద జాలినట్టి

వీరుడోయీ.... ||మనుష్యు||

చరణం: గ్రహనక్షత్రాల నడుమ..క్రమ్మిన చీకట్ల నడుమ

మానవుడే కాంతి కిరణ దీపమూ..

ప్రణయసుధాధారలతో ...ప్రళయ విషజ్వాలలతో

మానవుడే పరమాత్ముని రూపము

మానవుడే నోయ్...

మానవుడే నోయి జణామరణములను దాటి సదా

అమరకీర్తి కాందవాలుగు ధీరుడోయీ...

 పల్లవి 2 lines వరకే  సింక్ ఉంది. మిగతాది లిప్ సింక్ లేదు గనక సర్వస్వతంత్రంగా  రాశారు శ్రీశ్రీ. ఒరిజినల్ హిందీ సినిమాలోని పాట

ఎక్కడో వుంటే, శ్రీశ్రీ ఈ పాటని ఎవరెస్టంత ఎత్తుకి తీసుకెళ్లారు. ఈ ఒక్కపాట కోసమే సినిమా మళ్లీమళ్లీ చూసిన వారు కోకొల్లలు.

‘‘అసలు ఈ పాటని ఎవరైనా డబ్బింగ్ సాంగ్ అనగలరా?’’ ఓ రకమైన భక్తితో అన్నారు గుంటూరు గాలిబ్ గారు.

‘‘ నాకు నచ్చిన విషయం ఏమిటో చెప్పనా? సురులు, అసురులు కిన్నెరులు, గంధర్వులు వీరందరి గర్వాన్ని అణచిగలిగిన వాడు మానవుడని బల్లగుద్ది చెప్పడం. అట్లాగే ధరామండలంలో స్వర్గాన్ని స్థాపించగలిగిన వీరుడనీ జరామరణాలను దాటే అమర కీర్తిని అందుకోగలిగిన వాడనీ కీర్తించడం...అంతేకాదు ఈ సర్వ సృష్టికీ మానవుడే అలంకారమన్నారు’’ ఉత్సాహంగా అన్నది సావిత్రి.

‘‘ ఆయన గొప్ప కవే కాదు...గొప్పతాత్వికుడు, గొప్ప స్వాప్నికుడు, గొప్ప ఆశావాది’’ అర్థనిమిలిత నేత్రాలతో శ్రీశ్రీని తలుచుకుంటూ అన్నాడు సైకిల్ మూర్తి. ఈ మాట నూటికి నూరుపాళ్లు నిజమే’’ అన్నది అమూల్య.

‘‘ఎలా?’’ ప్రశ్నించాడు ముక్తేశ్వర్రావు.

‘‘రచయిత వ్యక్తిత్వం పాటలో తెలుస్తుంది. సన్నివేశపరంగా పాట రాసినా, జాగ్రత్తగా గమనిస్తే ఆ పాటలో రచయిత సహజ స్వభావం వ్యక్తిత్వమూ కనిపిస్తాయి’’ అన్నది అమూల్య.

‘‘అదే చెప్పమంటున్నాను’’ మళ్లీ అన్నాడు ముక్తేశ్వరరావు. ‘‘సరే, ఆనాటి రచయితలో చాలా మంది ఇంత అని పారితోషికాన్ని డిమాండ్ చేసేవారట. శ్రీశ్రీగారు అలా కాదు. ‘అయ్యా నా బడ్జెట్ ఇంతే’ అంటే చాలు, ఎదుటి మనిషిని బట్టి, మన్ననని బట్టీ కన్సిడర్ చేసేవారుట. అందుకే ఆయన ఉంగరం ఎప్పుడూ తాకట్టులోనే వుండేదట. నిజంగా శ్రీశ్రీలాంటి మహా కవికి పాటకి ఎంతిచ్చినా తక్కువే కానీ, జనాలు తీసుకునేది యాంటీ అడ్వాంటేజ్ గా. అటువంటి స్థితిలో వున్నా శ్రీశ్రీ మహా ఆశావాది. నిరాశకీ నిస్పృహకీ ఏనాడు పాటలో చోటివ్వలేదు. జీవితంలోనూ చోటివ్వలేదు. వారు రాసిన ‘అనంతం' చదివినా, వారి ‘పాడవోయి భారతీయుడా’ పుస్తకంలోని ఫుట్ నోట్స్ లు చదివినా మనకీ విషయం స్పష్టంగా బోధపడుతుంది’’ వివరించింది అమూల్య. 

‘‘ అరేభాయ్...   పాట పాడేద్దామా? లేదా’’  అన్నాడు ర.మొ.

‘‘కానీ మరి’’ ఉత్సాహపరిచాడు గుంటూరు గాలిబ్.

చిత్రం: వెలుగునీడలు, సంగీతం ..పెండ్యాల * గానం; ఘంటసాల

పల్లవి: కలకానిదీ...విలువైనదీ...బ్రతుకు...కన్నీటి ధారలలోనే బలిచేయకూ.. ||కల||

చరణం: గాలివీచి పూవూల తీగ..నేలవాలిపోగా

జాలివీడి అటులేదానీ... వదలి ల్తైతువా...గా..

చేరదీసి నీరుపోసి...చిగురింపనీయవా... ||కల||

చరణం: అలముకొన్న చీకటిలోనే... అలమటించనేలా...

కలతలకు లొంగిపోయి...నిలివరించనేలా...

సాహసమను జ్యోతినీ..చేకొనీ సాగిపో...

చరణం: అగాధ మౌ జలనిధిలోనే.. ఆణిముత్యమున్నటులే

శోకాల మరుగున దాగీ ...సుఖమున్నదిలే

ఏదీ తనంతతానై..నీ దరికి రాదూ...

శోధించి సాధించాలీ... అదియే ధీరగుణం.. ||కల||

 

నోట్: ‘‘అగాధమో జల నిధిలోనా... ఆణిముత్యామున్నటులే

 శోకాల మరుగున దాగి...సుఖమున్నదిలే’’..

అనే రెండు లైన్లూ ‘ఉ’ డుమలై నారాయణ కవిభావం. అని శ్రీశ్రీగారే ‘పాడవోయి భారతీయుడా’ పుస్తకం ఫుట్ నోట్ లో రాశారు. మళ్లీ "ఏదీ తనంత తానై" నించి చివరివరకూ శ్రీశ్రీదే.

ఆ రెండు లైన్లూ ఉ డుములై వారిదెలా అంటే వెలుగు నీడలు తెలుగు తమిళ వెర్షన్స్ కి తెలుగు శ్రీశ్రీ, తమిళం ఉ డుములై నాయా రాశారు. ఇద్దరూ ఒకే చోట కూర్చుని రాయడం వల్ల వీరి భావాల్ని వారూ, వారి భావాల్ని వీరు సినిమా ఉన్నతి కోసం పంచుకున్నారు. శ్రీశ్రీ తీసుకుంది కేవలం రెండు లైన్లే.

ఉడమలై వారి వంశమూలాలు తెలుగు వైతే, శ్రీరంగం వారి మూలాలు తమిళంవి. ఈ మాట అన్నదీ శ్రీశ్రీనే. ఆయన ఉడుమలై వారి ప్రస్తావన తేకపోతే ప్రజలకీ విషయం తెలిసేదే కాదు. పాటకి పాట చోరీ చేసే ఘనులు పరిశ్రమలో శ్రీశ్రీగారు ఓపెన్ గా చెప్పడం వారి నిజాయితీకి ప్రత్యక్ష సాక్ష్యం.

‘‘ఎంత బాగుందయ్యా పాట..." ఆనందంగా అన్నాడు కో.రం గారు ఈపాట గొప్పదే కాదండి, ఆత్మహత్య చేసుకోదలిచిన  గే వ్యక్తి చివరి సారిగా ఓ సినిమా చూద్దామని వెళ్లి, ఈ పాటని చూసి, మళ్లీ విని తన మనసు మార్చుకుని, అనుకున్నది సాధించానని ఉత్తరాల ద్వారా శ్రీశ్రీకి తెలియ పరిచారట. ఇది అప్పటికే కాదు, ఎప్పటికీ మనసులోని నిరాశను చీల్చిచెండాలి, ఆశావాదాన్ని ప్రతిష్టించే పాట. అందుకే ఈ పాట చిరంజీవి. శ్రీశ్రీని మనసులో తలుచుకుంటూ అన్నారు సైకిల్ మూర్తి .

‘‘ఆయన లో మహా సరదా అయిన మరో శ్రీశ్రీ దాగున్నాడు. ఆ శ్రీశ్రీ ఎంత హాస్య చతురత గలవాడంటే ఊహించడం కూడా కష్టమే. అన్నారు గుంటూరు గాలిబ్.

"ఎట్టెట్టా "యాసగా అన్నది సావిత్రి.

‘‘ చూడండి  (.... లారే) సి.ప్రా.తి సిరిసిరిమువ్వ ప్రాస క్రీడలు లిమాలిక్కులులో రాసిన బుల్లి కవితలు, నేటిక్కూడ అవి సరిపోతాయి. నేటి పరిస్థితికీ అద్దంపడతాయి.

‘‘పోయిన కాంగ్రెస్ ప్రతిష్ట

పుంజుకునేదెప్పుడూ?

సరదాపడి మాచకమ్మ

సమర్తాడినప్పుడు.. (3.1.1954)

‘‘ ప్రజాస్వామ్య పార్టీల్లో

 ప్రజలకు తావెప్పుడూ?

నేతి బీరకాయలోన 

నేయిపుట్టినప్పుడు

"జాతీయభాష కాగలసిరి

సంస్కృతానికెప్పుడూ?

మరణించిన కళేబరం

మాట్లాడేటప్పుడు"

అయ్యా...చదువుతున్నారుగా... సాంస్కృతభాష అటకెక్కి ఆంగ్ల భాష గద్దెనెక్కింది. భారతీయభాషల్ని జాతుల్ని సాంస్కృతి క్రమక్రమంగా చంపేస్తోంది. ఆఖరిగా సర్కారు స్కూళ్లల్లో కూడా తెలుగుని తొలగించే ఏర్పాట్లు ఘనంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందేగదా?

కాసేపు నిశ్శబ్దం అలముకొన్నది. కారణం, సొంత రాష్ట్రాలలోనే, తెలుగు ప్రజలే, తెలుగుతల్లి (.........) తెలుగు భాషనీ, సంస్కృతికీ సమాధి కట్టి చోద్యం చూస్తున్నందుకు. ప్రతి వ్యక్తీ తన జాతినీ తన భాషనీ ప్రాణంగా చూసుకుంటాడు. కాపాడుతాడు. ఇటు తమిళ, మళయాళ, కన్నడ, జర్మనీ, అటు నార్త్ ఇండియన్స్ నీ చూడండి. ఒక్క తెలుగు వాడు తప్ప అందరూ బిడ్డలకి మాతృభాష నేర్పేవారే? అలాగే విచిత్రమైన సంగతి ఏమంటే నిన్నగాక మొన్న వచ్చిన బుడ్డాడ్ని కూడ మన సినిమా వాళ్లు సంగీతం పేరులో  నెత్తిన పెట్టుకుంటున్నారు. తమిళ సంగీత దర్శకుల ఖ్యాతిని భుజాల కెత్తుకునీ మరీ మోస్తున్నారు.

అయ్యా, కేవీ మహదేవన్ (వారు మళయాళీ అయినా తెలుగు భాషకి చేసిన సేవ అపూర్వం) ఎంఎస్ విశ్వనాథన్, విశ్వనాథన్ రామమూర్తి ఇలా ఓ తరం తర్వాత ఇళయరాజా, దేవా, శంకర్ గణేష్. ఆ తర్వాత ఏ.ఆర్. రహమాన్, హేరిస్ జయరాజ్  కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా, అనిరుధ్, శ్రీకాంత్ దేవా.... ఇలా తరతరాలనీ మన తెలుగు నిర్మాతలు 'దేవతలు'గానే చూసి చాలా భారీ పారితోషికాన్ని సమర్పించుకుంటూనే ఉన్నారు.

ఆ మొదటి తరంలోనే మద్రాసులో, ఎస్ రాజేశ్వరరావు ఆది నారాయణరావు మాస్టర్ వేణు, పెండ్యాల, చలపతి రావుకు, టీవీ రాజు, కోదండ పాణి ఇలాంటి ఎందరో మహానుభావులున్నా తమిళ నిర్మాతలు ఒక్క తెలుగు వాడినైనా సంగీత దర్శకత్వానికి పెట్టుకోలేదు. ఇది నిజంగా బాధ కలిగించే మాటే.

‘సంగీతానికి .......లేవని తెలుగువాడు నిరూపిస్తే, మా సంగీతానికి మా వాళ్లున్నారనే, ‘ కంచెలు’ వేసి మరీ నిరూపించిన వారు ఇరుగుపొరుగు వారే.

సరే ఆ విషయం వదిలేస్తే శ్రీశ్రీ గొప్ప దార్శనికుడు. ద్రష్ట. రాబోయే కాలపు రీతిని వీటిని కూడా తన పాటలో ప్రతిబింబింప చేసిన మహా కవి. ఆయన రాసిన, ‘పాడవోయి భారతీయుడా పాటే అందుకు ఉదాహరణ’ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు గురయ్యగారు. ఆయన ప్రొడక్షన్ మేనేజర్ ( చాలా సీనియర్)

 

వెలుగు నీడలు:      సంగీతం: పెండ్యాల  

పల్లవి:     పాడవోయి భారతీయుడా... ఆడి పాడవోయి విజయగీతిక

నేడే స్వాతంత్ర దినం... వీరుల త్యాగఫలం

నేడే నవోదయం... నేడే ఆనందం ||పాడ||

చరణం:      స్వాతంత్ర్యం వచ్చె ననీ... సభలే చేసే.. సంబరపడగానే

సరిపోదోయీ... సాధించిన దానికి సంతృప్తిని చెందీ 

అదే విజయమనుకుంటే పొరబాటోయీ..

ఆగవోయి భారతీయుడా... కదలి 

సాగవోయి ప్రగతి దారులా... ||పాడ||

చరణం:     ఆకాశం అందుకొనే ధరలొక వైపూ

అదుపులేని నిరుద్యోగమింకొక వైపు 

అవినీతి బంధుప్రీతి చీకటి బజారు

అలముకొన్న నీ దేశం ఎటు దిగజారూ?

కాంచవోయి నేటి దుస్థితీ... ఎదిరించవోయి ఈ పరిస్థితీ ||పాడ||

చరణం.. పదవీవ్యామోహాలూ.. కులమత భేదాలు

భాషాద్వేషాలు చెలరేగే నేడు

ప్రతి మనిషీ మరియొకనీ దోచుకునేవాడే

తన సౌఖ్యం తనభాగ్యం చూసుకునే వాడే 

స్వార్థమే అనర్థకారణం... అది చంపుకొనుటే క్షేమదాయకం ||పాడ||

చరణం.. సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం

సకల జనుల సౌ భాగ్యమే నీ లక్ష్యం

ఏక దీక్షలో గమ్యం చేరిననాడీ

లోకానికి మన భారతదేశం..

అందించునులే శుభ సందేశం. ||పాడ||

.

‘‘శ్రీశ్రీగారు ఈ పాట రాశాకే పెండ్యాల గారు ట్యూన్ కట్టారట. అందుకే శ్రీశ్రీగారు పబ్లిగ్గా అన్నారు. పెండ్యాల గారికి  న్యూస్ పేపర్ చేతికిచ్చి ట్యూన్ కట్టమన్నా, అయిదు నిమిషాల్లో అద్భుతంగా ట్యూన్ చేస్తారని" నవ్వుతూ అన్నది సావితి.

"అంతేకాదు పాటని గమనిస్తే.. ఆనాటి పరిస్థితులు ఈనాడు అలాగే వుండటమే గాక మరింత దిగజారాయి. అప్పుడు కుల మత సమస్యలు వున్నా...ఇప్పుడున్నంత తీవ్రంగా  అసహ్యంగా లేవు. నిజం చెబితే సమాజం కులాలుగా విడిపోయింది". బాధలో అన్నారు గాలిబ్ గారు.

‘‘ ఒకటి మాత్రం నిజం. శ్రీశ్రీ బతికుంటే, తను రాసిన పాటలోని ప్రతి అక్షరమూ ఇన్నేళ్ల తర్వాత కూడా సంఘాన్ని యధాతథంగా చూపుతూనే వున్నందుకు గుండె ముక్కలు చేసుకుంటారే గానీ... ఆహా, నా పాట కాలానికి అద్దంపట్టింది... పడుతోంది అని గర్వించరు." శ్రీశ్రీ వీరాభిమానిగా అన్నాడు ర.మోం

‘‘ బాబ్బాయి..కాస్త నవ్విద్దురూ..’’ బతిమాలాడు కో.రం గారు.  అయితే కాస్కోండి.

‘‘ భోషాణప్పట్టెల్లో 

ఘోషా స్త్రీలను బిగించి గొళ్లెంవేస్తూ

‘‘ భేషుభలే బీగా ’’ లని 

శ్లేషించెను సాయిబొకడు సిరిసిరిమువ్వా..

‘‘దెయ్యాలను చూపిస్తా

నయ్యా’’ రమ్మనుచునొక్క ఆసామీ నా 

కయ్యో తన కూతుళ్లను

చెయ్యూపుచు పిలిచిచూపె సిరిసిరిమువ్వా’’

‘‘ నేనూ ఒక మూర్ఖుణ్ణే

ఐనా నాకన్న మూఢులగపడుతుంటే

ఆనంద పారవశ్యము 

చేనవ్వక తప్పలేదు సిరిసిరిమువ్వా’’

‘‘గొర్రెల మందగ వేలం 

వెర్రిగ ఉద్రిక్తభావ వివశులయి జనుల్ 

కిర్రెక్కి పోయినప్పుడు

చిర్రెత్తుకు వచ్చునాకు సిరిసిరిమువ్వా’’

‘‘మాస్కోకి వెళ్లగలిగే 

ఆస్కారం లేకపోయినప్పటికైనన్

విస్కీ సేవిస్తూనే 

శ్రీస్కీ నై బ్రతకగాలను సిరిసిరిమువ్వా..’’

సిరిసిరిమువ్వ ‘పజ్యాలు’ రాగయుక్తంగా పాడిమరీ వినిపించాడు ర.మో. జనాల చప్పట్లు చరిచారు.

ముక్తేశ్వర్రావు గారైతే వయసుని మరిచి ఈలలు వేశారు.

‘‘అందరికీ ఓ  విషయం గుర్తు చెయ్యాలి.

 ‘‘ఏమని పాడెదనో యీ వేళా

మానస వీణా మౌనముగా

నిదురించిన వేళా’’ అని శ్రీశ్రీగారు రాసిన వీణ పాట ఎంత ప్రాచుర్యం పొందిందంటే,  ఆ తర్వాత అనేక సినిమాల్లో నిర్మాతలూ, దర్శకులూ ఓ సన్నివేశాన్ని సృష్టించి మరీ వీణపాటలు పెట్టేవారు. ఆ సందర్భాలు కోకొల్లలు’’ అన్నది అమూల్య

‘‘అందరూ శ్రీశ్రీని విప్లవ కవి అంటారు. కానీ ఆయన  రాసినన్ని వైరుధ్యమైన పాటలు మరెవ్వరూ రాయలేదని ఘంటా పధంగా చెప్పొచ్చు...ఈ పాట చూడండి . ఈనాటికీ ఈ పాట ఆత్రేయ రాశారనుకుంటారు. కానీ రాసింది శ్రీశ్రీగారు’’ అని పాటందుకున్నాడు ర.మో.

ప.: మనసునమనసై... బ్రతుకునబ్రతుకై

తోడొకరుండిన అదే భాగ్యమూ..అదే స్వర్గమూ..

చ: నిన్నునిన్నుగా ....ప్రేమించుటకూ 

నీకోసమే కన్నారునించుటకు

నేనున్నానని...నిండుగపలికే

తోడొకరుండిన..అదే భాగ్యమూ ..అదే స్వర్గమూ..||మన||

చ:  చెలిమికరువై.. వలపే అరుదై

చెదరిన హృదయమె..శిలమైపోగా

నీ వ్యధ తెలిసీ... నీడగ నిలిచే

తోడొకరుండిన అదే భాగ్యమూ..అదే స్వర్గమూ ||మన||

‘‘ అసలు సిసలు ‘లోటు’కి అర్థం చెప్పిన ఏకైక గీతమిది ఎన్నో ఎన్నెన్నో పాటలు ఏకాంతం గురించి మనసుపడే ఆవేదన గురించీ వచ్చాయి. దీనికి సాటైన పాట మాత్రం నేటి వరకూ రాలేదు. ముఖ్యంగా రెండో చరణం అద్భుతం అపూర్వం ’’ భక్తిగా శ్రీశ్రీగార్ని తలుచుకుంటూ మనసులోనే నమస్కరించింది సావిత్రి.

‘‘ఇంకా’’ ఏదో చెప్పబోయిన సైకిల్ మూర్తి.

‘‘అయ్యా మన కోటా అయిదు పాటలే, మేక్సిమమ్ పదిపేజీలే, ఎక్కువైతే అమెరికా ‘మధుర  వాణి తల్లి’ మనందర్నీ ఇంగ్లండ్ గన్ తో షూట్ చేస్తుంది. అఫ్ కోర్స్.. దీప్తీ గారూ, శ్రీనివాస్ పెండ్యాల గారు చిట్టెన్ రాజుగారితో కలిసి ఆ తల్లి వాణికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారనుకోండీ.." కాలాన్ని గుర్తుచేసింది అమూల్య.

‘‘సరే..ఈ సారికో గొప్ప పాటతో ముగిద్దాం... చాలా సార్లు నేను పద్మనాభం గార్ని అడిగాను. ’’ అయ్యా దేవతలాంటి సినిమా మళ్లీ ఎప్పుడు తీస్తారని ఆయన నవ్వి, దేవుడు కరుణించినప్పుడు అనేవారు. ఇప్పుడు వాళ్లెవరూ లేకపోయినా పాట మాత్రం మిగిలేవుంది. పచ్చగా వంద కాలాలు బ్రతికేవుంటుంది. అందుకోవోయ్" ర.మో అన్నాడు గురయ్యగారు.

చిత్రం..దేవత   సంగీతం ..కోదండపాణి

ప:   బొమ్మను చేసీ..ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుక ( ఈలైను వేటూరి)

గారడీ చేసి..గుండెను కోసీ..నవ్వేవు ఈ వింత చాలిక

చ: అందాలు సృష్టించినావు -దయతో నీవు

మరల నీచేతితో నీవు తుడి చేవులే

దీపాలు నీవే...వెలిగించినావే

గాఢాందకారాన విడిచేవులే

కొండంత ఆస అడియాస చేసి పాతాళ లోకాన త్రోసినవులే  ||బొమ్మను||

చ: ఒకనాటి ఉద్వానవనమూ...నేడు కనమూ

అదియే మరుభూమిగా నీవు మార్చేవులే

అనురాగ మధువు..అందించి నీవు 

హాలాహాల జ్వాల చేసేవులే

ఆనంద నౌక.. పయనించు వేళ..శోకాల సంద్రాన ముంచేవులే ||బొమ్మను||

 ******

  P.S. : ఆనాటి మహానుభావుల పాటల్ని ఎవరు వర్ణించినా ఎంత రాసినా తనివితీరదు. శ్రీశ్రీ హిమాలయమైతే నేనో గులకరాయిని. ఈ వ్యాసాలన్నీ భక్తితో రాస్తున్నవేగానీ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు కాదు. ఎందుకంటే, వారిని కీర్తించగలిగిన భాష నాకుంటేగా? అయ్యా, తప్పులు వుంటే అవి నావి, క్షమించండి. వారి గీతాన్ని మాత్రం మరోసారి అందిస్తున్నాననే ఆనందం నాది. 

నమస్సులతో ---- మళ్లీకలుస్తా...

- మీ భువనచంద్ర

శ్రీశ్రీ..................కొన్ని చమక్కులు.....

ప్రశ్న: కవికీ..కష్టజీవికి గల సంబంధం ఎలాంటిది?

శ్రీశ్రీ జవాబు: ‘కష్ట జీవి’ కి రెండు వైపులా నిలిచేవాడు కవి.

ప్రశ్ర: బ్రతుకు అంటే అర్థం ఏమిటీ?

శ్రీశ్రీ జవాబు: ‘చావకు’ అని అర్థం

ప్రశ్న: దేవుడు ప్రశ్నార్థకం అయితే దెయ్యం ఏమవుతుంది?

శ్రీశ్రీ జవాబు: ఆశ్చర్యార్థకం ( ! )

ప్రశ్న: కట్నానికీ లంచానికీ తేడా ఏమిటి?

శ్రీశ్రీ జవాబు: ఒకే నేరానికి రెండు పేర్లు

ప్రశ్న: జనన మరణాలు గురించి మీ అభిప్రాయం ఏమిటి?

శ్రీశ్రీ జవాబు: నా అభిప్రాయంతో నిమిత్తం లేకుండానే ఇది వరకే అవి సంభవించాయి. ఇక మీద కూడా సంభవిస్తూనే ఉంటాయి.

యోగి వేమన సినిమాపై వ్యాసం రాస్తూ శ్రీశ్రీ అంటారు.....

వేమన్న మూఢ విశ్వాసాలకు విరోధి. కానీ వేమన చిత్రాన్ని చూసిన తర్వాత మన ప్రజల్లో మూఢ విశ్వాసాలు మరింత పదిలమవుతాయి.

చంద్రలేఖ చిత్రం గురించి:

చంద్ర లేఖ చిత్రాన్ని పూర్తిగా చూశా బ్రహ్మండంగా వుంది. కానీ అది ‘చలన’ చిత్రం కాదు. నాలో అది ‘చలనం’ కలిగించలేక పోయింది.

తెలుగు సినిమా గురించి:

సినిమా అనేది బ్రహ్మండమైన ఆయుధం ప్రస్తుతం అది చిటికెన వేలంతటి మనుషుల చేతుల్లో వుంది

రాజాజీ గురించి:

సినిమా దుష్టమైనదని రాజగోపాలా చార్యుల వారు అంటున్నారు. అసలు రాజాజీనే దుష్టుడని నా అభిప్రాయం.

సినిమా రచయితగా నేను:

ఇప్పటి వరకూ చైనా బజార్లో వర్తకులు బిస్కెట్లు చాక్లెట్లు అమ్ముకున్నట్లు నా వద్ద వున్న మాటల్ని అమ్ముతూవున్నాను.

సినిమా: సినిమా ఓ కళ నే కాదు కాకరకాయ కాదు, ఫక్తు వ్యాపారవ్యాసంగం  అని ఆలస్యంగా తెలుసుకున్నాను.

చివరిగా ....

ఈ రాణి ప్రేమపురాణం / ఆముట్టడి కైన ఖర్చులూ

మతలబులూ కైఫీ యతులు../ తారీఖులు దస్తావేజులు

ఇవి కావోయి చరిత్ర సారూ.

*****

శ్రీ శ్రీ మాత్రం ఎప్పటికీ వర్తమానమే కానీ చరిత్ర కాదు, కాబోడు.

నమస్సులతో - మీ భువనచంద్ర

bottom of page