సంపుటి  4   సంచిక  4

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

కాళిదాసు కవిత

ఎర్రాప్రగడ రామకృష్ణ

మీకు గుర్తుందా? మన దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత కూడా మన దేశంలోనే ఒక భాగమైన గోవాను మనం స్వాధీనం చేసుకోవడానికి పద్నాలుగేళ్ళు పట్టింది. ఎస్! బుడత కీచుల నుండి మనం తీవ్రమైన ప్రతిఘటనల నేపథ్యంలో గోవాను 1961లో ఎట్టకేలకు స్వాధీనం చేసుకోగల్గాం.  సర్వతంత్ర స్వతంత్ర భారతదేశపు స్వాతంత్ర్య సమరోద్యమ రథసారధి గాంధీ మహాత్ముడి 150వ పుట్టినరోజు సందర్భంగా ఆలోచించవలసిన విషయాలివి.

నిజానికి 1947లో మనకి లభించింది కేవలం టెరిటోరియల్ ఫ్రీడం మాత్రమే. పొలిటికల్ ఫ్రీడం మాత్రమే అని ఒక బలమైన వాదన ఇంకా వినిపిస్తూనే వుంది. ఆర్ధిక పరమైన , ఆధ్యాత్మిక పరమైన స్వాతంత్ర్యం ఇంకా లభించలేదనే ఒక విశ్లేషణ నేపధ్యంలో మనం గోవా విడుదల కథను స్మరించుకోవాలి. దేశమంతటా స్వేచ్చావాయువులు యధేచ్చగా సంచరిస్తున్నా, గోవా మాత్రం పోర్చుగీస్ ఆధిపత్యంలోనే మిగిలిపోయింది. అది భారతదేశంలో ఒక భాగం కాదని, తమకు చెందిన ఒక ప్రత్యేకమైన రాజ్యమనీ, పోర్చుగీస్ మొండికేసింది. ఏళ్ళ తరబడి చర్చలు, వివాదాలు నడిచాయి. ఆఖరికి సైనిక చర్య అనివార్యమైంది. యుద్ధం జరిగింది. ఇరుపక్షాలూ రక్తసిక్తమయ్యాయి. కేవలం కొన్ని వందల విస్తీర్ణం గల మన భూభాగాన్ని మనం స్వాధీనం చేసుకునే క్రమంలో గోవా నేల రక్తంతో తడిసింది. ఈ సువిశాల భారతదేశానికి స్వేచ్చ లభించడంలో అది కూడా మహా బలశాలి, సూర్యుడస్తమించని మహా సామ్రాజ్యంగా, అపారమైన వనరులు, సైనిక పాటవం కల్గిన బ్రిటీష్ వారి నుండి మనకు స్వేచ్చ లభించడంలో సైతం  జరగనంత హింస, ఆయుధాలతో పని చిన్న శత్రువుతో కలిగింది. అది ఎందుకో మర్చిపోతే ఎలా? 

గోవాను గెలవడానికి మనకు అంత కష్టం ఎందుకైంది? బ్రిటీష్ వారితో పోలిస్తే పోర్చుగీసు వాళ్ళెంత? మరి ఏమిటి కారణం? మిగిలిన అంత పెద్ద భూభాగాన్ని మనం అహింసాయుతంగా లోబర్చుకోగల్గినవాళ్లం.   జె.ఎం.చౌధురి అని గుర్తు.. ఆయన నేతృత్వంలో యుద్ధం చేయ్యడమూ- 70 మందికి పైగా సైనికులను మనం కోల్పోవడమూ ఆఖరికి 1961 డిసెంబర్ 19 న స్వాధీనమూ జరిగిందంటే లోపం ఏమిటి? మనం ఆలోచించుకోవద్దూ. ఆగస్టు 15 అంటే శెలవు రోజో, చాక్లెట్ల పండగో కాదు. అది మన జాతికి సంబంధించిన ఒకానొక చిరస్మరణీయమైన విజయం. గొప్ప సంబరం. మన దేశంలో దసరా అందరికీ పండగ కాదు. క్రిస్మస్ అందరికీ పండగ కాదు. రంజాన్ అందరికీ పండగ కాదు. కాని, ఆగస్టు 15, జనవరి 26  మన భారతీయులందరికీ పండగలు. దేశమంతటా జరిగే పండుగలా రెండూ. ఆ పండుగల నేపధ్యంలో కొన్ని వాస్తవాలను మనం గుర్తు చేసుకోవాలి. పాండవుల దగ్గరికి సంజయుడు రాయభారం వెళ్ళొచ్చాక, గుడ్డి రాజుగారు పాండవుల బలం ఏమిటయ్యా? అని అడుగుతాడు. అతగాడి ఉద్ధేశ్యంలో కౌరవుల పక్షం బలమైనదనీ, పైగా యోధులు చాలా ఎక్కువని. ఆ దిక్కుమాలిన ఆలోచనను సంజయుడు గుర్తుపట్టి మొట్టమొదటే కృష్ణుడి పేరు ఎత్తుతాడు. ముందు కృష్ణుడికి సమానమైన యోధుడ్ని మన పక్షంలో చూపించు, తక్కిన వారి విషయం తర్వాత ఆలోచిద్దాం అని చురక వేస్తాడు. అదీ ప్రజ్ఞ అంటే. అటువైపు సైన్యం ఎంతుంది, ఇటువైపు ఎంతుంది? అందులో వీరులెంతమంది, ఇందులో ఎందరు, ఇవన్నీ కాకుల లెక్కలు. కౌరవ సైన్యానికీ, పాండవ పక్షానికి తేడా ఒక్కడే ఉంది. ఇరు పక్షాలకూ సంబంధించి విజయాన్ని ఖాయం చేసే ఒకే ఒక్కడు .. శ్రీ కృష్ణుడు. ఆయన పాండవుల వైపు ఉన్నాడు. అదొక్కటే రహస్యం. మిగిలినవన్నీ అప్రస్తుతం. 

అలాగే 1947లో మనం సాధించిన అద్భుత విజయం వెనుక గాంధీ మహాత్ముడు ఉన్నాడు. 1961 నాటికి ఆయన లేడు. అదొక్కటే తేడా. దానివల్ల అవలీలగా, అహింసాయుతంగా, అనతికాలంలో మనకు దక్కవలసిన విజయం చచ్చీ చెడీ, పద్నాలుగేళ్ల పాటు తంటాలు పడితే దక్కింది. అది కూడా రక్తం చిందించిన తర్వాతే దక్కింది. ఒక్క మనిషి ఉనికి వల్ల అంత తేడా వుంటుందా? పాండవుల విజయంలో అసలు హీరో అర్జునుడు కదా... అని మనకి సందేహం వస్తుంది. అందుకూ భారతమే జవాబు చెప్పింది. శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తి తర్వాత స్త్రీ జనాన్ని, గో సంపదనూ అర్జునుడి రక్షణలో తరలిస్తుంటే కేవలం కొంతమంది దొంగలు వాళ్లను దోచేసారు. యోధాన యోధులను నిర్జించి, మహేంద్రుడి అర్ధ సింహాసనాన్ని కైవసం చేసుకున్న అర్జునుడు దోపిడీ దొంగల ముందు చేతులెత్తేసాడు. భీష్మ ద్రోణ కృపాది ధ్వని నికారాలాభిలంబైన కురు మహా సైన్యాన్ని ఒంటిచేత్తో జయించి, గోగ్రహణం సమయంలో అసాధారణమైన విజయం చేజిక్కించుకున్న అర్జునుడి చేతిలోని గాండీవం మామూలు డెకాయిట్స్ ముందు పుచ్చు కర్ర అయిపోయింది. కారణం ఏమీ లేదు. ఆ విజయాలన్నింటి వెనుక శ్రీకృష్ణుడున్నాడు. ఇప్పుడు లేడు అంతే తేడా..

అలాగే స్వారాజ్య సమరంలో గాంధీజీ ఉన్నాడు. గోవా యుద్ధం వెనుక లేడు.  అంతకన్నా ఏం లేదు. కృష్ణుడు, గాంధీ అనేవి వ్యక్తుల పేర్లు కాదు. ధర్మానికి సంకేతాలు. ధార్మిక నేపధ్యం కల్గిన వ్యక్తుల ప్రమేయం విజయాన్ని శాస్తుంది. తేలిగ్గా సాధిస్తుంది. ఈ జాతికి కావలసింది అదిగో అలాంటి నాయకులు. ప్రస్తుతం ఈ జాతి, ఈ సమాజం రాజకీయ నాయకుల్ని తయారు చేస్తున్నాయి పుట్టగొడుగుల్లా. వీధికి నలుగురూ, అయిదుగురూ పుడుతున్నారు. పేట నాయకులు, కులం నాయకులు, రాజకీయులు, వీరు కాదు మనకి ... నేషనల్ లీడర్స్ కావాలి. అమోఘమైన, నీతివంతమైన వ్యక్తిత్వంతో ఈ జాతిని ముందుకు నడిపించగల సామర్ధ్యం గల నాయకులు ప్రస్తుతం ఈ దేశానికి అవసరం. అలాంటి అవసరాలు ఏర్పడినప్పుడు ఈ డేశం గొప్ప నాయకులను రూపొందించుకున్నది కూడా . సమయం వచ్చినప్పుడు వస్తారు. మనం ఆగస్టు 15 న, జనవరి 26న పాడుకునే పాటలు .. అదిగో అలాంటి మహాయోధుల ఆగమనానికి సంబంధించిన వైతాళిక గీతాలు. మనం జరుపుకునే సంబరాలన్నీ వారిని స్వాగతించడానికి ఈ జాతి సంసిద్ధమవుతున్నదని తెలియజేసే ఎమొషనల్ సంకేతాలు. మంగళ తోరణాలు.  స్వస్తి.

*****

Website Designed

 &  Maintained

by

 Srinivas Pendyala 

Feedback

sahityam@madhuravani.com

 

©  2021 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా sahityam@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed

 &  Maintained

 by

Srinivas Pendyala