top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

సంపుటి  4   సంచిక  4

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

సాహితీ సౌరభాలు

కాళోజీ మరియు దాశరథి

ప్రసాద్ తుర్లపాటి 

కాళోజీ నారాయణరావు గారు

 

మొగలాయిల కాలంలో, నిజాముల కాలంలో ఉర్దూ ప్రభావంతో కొంత తెలుగు సాహిత్యం వెనుకబడింది. ఇక 20వ శతాబ్దంలో తెలంగాణాలో నిజాం వ్యతిరేక ఉద్యమం మొదలయింది. తెలుగు సాహిత్యంపై కూడా ఉర్దూ ప్రభావం పడింది. ఆధునిక యుగం తెలుగు సాహిత్యంలో అభ్యుదయ యుగం అని చెప్పవచ్చును. “కలం కుంచెను కదిలిస్తూ, కలం కుంచెను మెత్తటి కత్తి చేసి వాడతారా” అంటూ కాళోజీ నారాయణరావు గారు నినదించారు.  

భావకవితల సమాహారాలు, పన్నీటి జల్లులు, మధుహాసాలు, వెన్నెల విహారాలు నిష్క్రమించి వాటి స్థానే విప్లవ గీతాలు, జన చైతన్య రాగాలు కవితా వస్తువులుగా భాసిల్లాయి.

"ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం, పరపీడన పరాయణ తత్వం" అన్న శ్రీశ్రీ పంథాలోనే ఎందరో కవులు విప్లవ సాంప్రదాయాన్ని అనుసరించారు.

ఆగర్భ శ్రీమంతునికి, అనాధకి మధ్య జరుగుతున్న సంఘర్షణే, కవితా వస్తువుగా కాళోజీ, దాశరధి ఇత్యాదిగా కవులుదయించారు. తెలుగు సాహిత్యంలో ఇది ఒక విప్లవాత్మకమయిన మార్పు. ఈ మార్పులు అప్పటి  ఆర్ధిక, సాంఘీక పరిస్థితులే కారణం అని చెప్పవచ్చును.

“అష్టపదుల జావళీల

ఆలాపనీ మాని నేడు

గళము కూడ రణ దుందుభి

కళల బూని పాడుచుండ

కర్ణాటక చాముండి వలె

కలకత్తా  కాళికగా

కైలాసము  పిలుపు విని

కాకతి చిందులు త్రొక్కగ”

అంటూ ప్రభోద గీతాలను రచించారు శ్రీ కాళోజీ. 

 ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి - అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.

నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడుఆయన స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. ఆయన 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందారు. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం గా చేసి గౌరవించింది. వరంగల్ లో నెలకొన్న వైద్య విద్యాలయానికి ఆయన పేరు పెట్టబడింది.

“ అక్షర రూపము దాల్చిన ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక” - కాళోజి  అంటూ, మహాకవి శ్రీశ్రీ గారిచే ఈ విధముగా ప్రస్తుతించబడినారు -

" కాళోజీ నిఖిలాంధ్ర కవి. అందులో ఎట్టి సందేహం లేదు. ఆయనకు తెలంగాణా అంచులు గోడలుగా అడ్డునిలువజాలవు. ఆయన తన ఖండకావ్య సంపుటానికి 'నా గొడవ' అని పేరు పెట్టాడు. అదే కవి ప్రతిభ. అదే కవి చెప్పవలసిందీను. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ "

 

"ఏ భాష నీది, ఏమి వేషమురా

ఈ భాష, ఈ వేష మెవరి కోసమురా

ఆంగ్లమందున మాటలనగానే

ఇంతకు ఎక్కు వెందుకురా

తెలుగువాడవై/ తెలుగు రాదనుచు

సిగ్గు లేక/ ఇంక చెప్పుటెందుకురా

అన్య భాషలు నేర్చి, ఆంధ్రమ్ము రాదంచు

సకిలించు ఆంధ్రుడా, చావవెందుకురా"

అని గట్టిగానే మందలించారు శ్రీ కాళోజీ.

 

1914 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రం. బీజాపూర్‌లో వీరి జననం. వరంగల్,  హైదరాబాదులో విద్యాభ్యాసం, నివాసం. 1953 సంవత్సరంలో తెలంగాణా రచయితల సంఘాధ్యక్షులుగా పని చేసారు. పద్మవిభూషణ్ బిరుదాంకితులు. తెలంగాణా ప్రభుత్వం సెప్టెంబరు 9వ తేదీన (వీరి జన్మదినం) తెలంగాణా భాషాదినోత్సవంగా ప్రకటించింది.

‘అన్యాయాన్ని ఎదిరించేవాడే నాకు ఆరాధ్యుడు’ అంటూ నవంబరు 13,2002 న తుదిశ్వాస విడిచారు.

కాళోజీ నారాయణరావు గారి పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002)


 

దాశరధి కృష్ణమాచార్య 

ఇక "నా తెలంగాణా కోటి రతనాల వీణ అన్న దాశరధి  కృష్ణమాచార్యులుగారు 22 జులై 1925న వరంగల్ జిల్లా మానుకోట తాలుకా(ఇప్పుడు మానుకోట/మహబూబాబాద్ జిల్లా) చిన్న గూడూరు గ్రామంలో జన్మించారు. ఖమ్మంలో వీరి విధ్యాభ్యాసం సాగింది. 1946-48 మధ్య నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని ఉద్యమించిన ప్రజాకవి దాశరధి.

దాశరధిగారు ఎన్నో కవితా సంకలనాలను, కవితా సంపుటాలనూ, సినీ గేయాలనూ రచించారు. అగ్నిధార, మహాధోంద్రోదయం, రుద్రవీణ, తిమిరంతో సమరం, పునర్నవం, ఆలోచనాలోచనాలు, అమృతాభిషేకం మొదలగునవి. ఇవి కాక "గాలిబ్ గీతాలు"(తెలుగులోకి అనువదించారు) అగ్నిధారలోని "అగ్ని" మానవుని చైతన్యానికి సూచన అంటారు దాశరధి.

జైలు గోడపై ..

" ఓ నిజాము పిశాచమా కానరాడు.

నిన్ను బోలిన రాజు మా కెన్నెడేని

తీగలను తెంపి అగ్నిలో దింపావు

నా తెలంగాణ కోటి రతనాల వీణ “

 

"నవభారత యువకులారా

కవులారా, కథకులారా

భవితత్వపు సహనానికి

హోతలు, నూతన 

భూతల నిర్మాతలు మీరే, మీరే" 

 

అంటూ విజయగీతిక లాలపించారు.

 

అందుకే

“ఓ జనతా, నతాంజలి ఫుటోజ్జ్వల

దివ్యకవోష్ణ, రక్తధారా జల సిక్త

పాద కమల ద్వయ శోభ మనోజ్ఞ

దేహరేఖా, జయభారతి

యుగయుగమ్ముల పున్నెపు పంట నీవు

నీ పూజకు తెచ్చినాను, నేడే

పొంగిన గుండె నిండు పద్యముల్"

అని జయభారతికి అగ్నిధార నర్పించిన కవితా శరధి దాశరధి.

“కోటి వెలుగుల బంగారు కొండ క్రింద

పరచుకొన్నట్టి సరసులోపల వసించి

ప్రొద్దు ప్రొద్దున అందాలు పూయు

నా తెలంగాణా తల్లి కంజాతవల్లి”

 

“నా తెలంగాణా కోటి అందాల జాణ.

మూగవోయిన కోటి తమ్ముల గళాల

పాట పలికించి కవితాజనమ్ము కూర్చి

నా కలానుకు బలమిచ్చి నడిపినట్టు 

నా తెలంగాణ కోటి రతనాల వీణ”

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ సందర్భముగా,

 

“నా తెలంగాణా కోటి రతనమ్ముల వీణ

మహాంధ్రరాష్ట్ర సంగీతము పాడె నేడు

పలికించెను మూక గళాలు కోటి

ఆశాతురణమ్ము జీవితము, సఖ్యమునన్, 

విలసిల్లు సౌఖ్యమునన్

గీతలు తెల్గువారి గిలిగింతలు పెట్టగ విను సోకడిన్.

కోటి కంఠాలతో తెలుంగులు సతమ్ము

ఆంధ్ర రాష్ట్రావతరణ శుభావసరము

గోరుచున్నారు:"

అని ఎలుగెత్తి చాటిన అగ్నిశరధి .. దాశరధి.

 

తెలంగాణా సాయుధ పోరాటంలో వచ్చిన విప్లవ సాహిత్యం మరే యితర ఉద్యమాలలోనూ కానరాదు.


 

“ ఆ చల్లని సముద్రగర్భం, దాచిన బడబాగ్నుల లెంతో

ఆ నల్లని ఆకాశంలో, కానరాని భాస్కరులెందరో

ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన సైనికులెందరో

పసిపాప నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఏదో

గాయబడిన కవి గుండెలలో, రాయబడని కావ్యాలెన్నో”

అంటూ 1987 సంవత్సరం నవంబరు 5వ తారీఖున అస్తమించారు.

అక్షర వాచస్పతి డా.దాశరధి రంగాచార్య వీరి సోదరులు. తొలిసారిగా చతుర్వేదాలనూ, తెలుగులో వచనంలో అందించిన ఆద్యుడు. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం, భాగవత గ్రంధాలను తేట తెలుగులో వచన రూపంలో అందించారు. వాల్మీకి వ్యాసుడు, గోర్కి, ప్రేంచందుల మేటి కలయిక ఈ కవిరుషి.

*****

bottom of page