top of page

సంపుటి  4   సంచిక  4

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

సత్యాన్వేషణ - 10

స్వర్ణయుగ స్వర మాధురి

 

సత్యం మందపాటి

ఈ వ్యాసంలో ఆనాటి మన తెలుగు చలన చిత్ర స్వర్ణయుగం గురించి చెప్పటం లేదు.

 

ఎందుకంటే అది చాల విస్తారమైనది. 1930లలో మొదలై, 1940లలో పుంజుకుని, 1950లలో స్వర్ణయుగ ప్రారంభానికి నాంది అయింది. దాదాపు ఆ స్వర్ణయుగం 1980వ దశాబ్దం దాకా ఒక వెలుగు వెలిగింది. తర్వాత కొన్ని మంచి చిత్రాలు వచ్చాయి కానీ, లాభాపేక్షతో మాత్రమే తీసిన మిగతా చిత్రాలు చూస్తే, చిత్రసీమలో చిత్ర నిర్మాణ విలువలు కుంటుపడ్డాయని తెలిసిపోతుంది. దాని తర్వాత పాశ్చాత్య దేశాల ప్రభావం వల్లా, ప్రేక్షకులకన్నా వారి డబ్బు మీదే వ్యామోహం ఎక్కువ అవటం వల్లా, త్వరగా ఏదో తీయాలనే తపన వల్లా, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో, అప్పుడప్పుడూ ముగ్గురు నలుగురు దర్శకులు తీసిన మంచి చిత్రాలు తప్ప, ఆ స్వర్ణ యుగ ఛాయలు పూర్తిగా కనుమరుగైపోయాయి. 2000 సంవత్సరం, దాని తర్వాత వ్యాకుల రాజకీయాలు మాయం అయిపోయి, బహిరంగంగానే పూర్తిగా కుల రాజకీయాల మయం అయిపోయింది. దరిమిలా సినిమా వారి కొడుకుల, తమ్ముళ్ళ, మనవల వారసత్వ యుగం వచ్చాక తారల నటన కొరతతో, తెలుగు సినిమా రంగం పూర్తిగా దిగజారిపోయింది. దానివల్ల నవలా చిత్రాలు, కథా ప్రధానమైన చిత్రాలు కరువైపోయాయి. ఒకే కథతో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఆ వెలితిని పూడ్చటానికి ఒకే మూసలో హింస, మితిమించిన శృంగారం, బొడ్డు చిత్రాల కోసం హిందీ హీరోయిన్ల దిగుమతి, భాషా దోషాలు, నటశూన్య నటులకు మాటల డబ్బింగ్, డబ్బాల మోత సంగీతం, డిజిటల్ గ్రాఫిక్స్ మొదలైన వాటితో, ‘ఇవాళ డబ్బులు వస్తే చాలు, రేపటి సంగతి రేపు చూద్దాం’ అనే స్థితికి వచ్చింది మన తెలుగు సినిమారంగం. థియేటర్ల పంపకం మాఫియా వచ్చి తెలుగు చిత్ర సీమని పాతాళలోకానికి తీసుకువెళ్ళింది. ఆ విషయాల గురించి ఒక పుస్తకమే వ్రాయవచ్చు. అందుకని అది వదిలేసి, ఈ వ్యాసంలో మన చలన చిత్ర సంగీత స్వర్ణయుగంలో సంగీత సాహిత్య సమలంకృతమైన ఆ స్వర మాధురి గురించీ, ఆ మాధుర్యాన్ని అందించిన ప్రముఖుల గురించీ, వారి సంస్కారాన్ని గురించీ వ్రాద్దామని వుంది. 

అవునయ్యా.. బాగుంది. కానీ ఇది వ్రాయటానికి నీ అర్హతలు ఏమిటి అని అడిగేవారు వుండవచ్చు. నాకున్న అర్హతలు రెండే రెండు. ఒకటి నేను కూడా మన దేశానికి స్వతంత్రం రాక ముందే పుట్టి, ఆ స్వర్ణయుగపు సోయగాలను ఆస్వాదిస్తూ పెరిగినవాడిని. రెండు, ఆనాటి 78 RPM, 45 RPM గ్రామఫోన్ రికార్డుల నించీ, టేప్ రికార్డర్ యుగంలో వందల కొద్దీ పాటలు విని, ఈ డిజిటల్ యుగంలో కూడా ప్రతిరోజూ కొన్ని గంటలు ఆనాటి పాటలు విని ఆనందించటం.  

బాపుగారు సాక్షి సినిమా తీయబోయే ముందు, ‘మేము మా మొట్టమొదటి సినిమా తీస్తాం, డబ్బులివ్వండి’ అని అడిగితే, డిస్ట్రిబ్యూటర్లు ‘సినిమా తీయటానికి మీ అర్హతలేమిటి?’ అని అడిగారుట. ‘మేము ఎన్నో వందల సినిమాలు చూశాం. అదే మా అర్హత’ అన్నారుట బాపు. ఇదీ ‘అలాహే’ అన్నమాట! 

***

ఆరోజుల్లో మా ఇంట్లో అమెరికా తయారీ వెస్టింగ్ హౌస్ వారి రేడియో వుండేది. మేము ఆ రేడియోలో ‘మీరు కోరిన పాటలు’ ఆకాశవాణి విజయవాడ కేంద్రంనించీ వినేవాళ్ళం. ‘గుంటూరునించీ సత్యనారాయణ, ఆదినారాయణ, సూర్యనారాయణ, శంకరనారాయణ, వారి గూఢ మిత్రులూ గాఢ శత్రువులూ కోరిన ఈ పాట..’ అంటూ పాటలు వేసేవారు. తర్వాత కొన్నేళ్ళకి, రేడియో సిలోన్ నించీ మీనాక్షి పొన్నుదురై సాయంత్రం పూట తెలుగుపాటలు. ఆవిడ కూడా చక్కటి తెలుగులో, ‘గుడివాడనించీ ప్రసాద్, శంకర్, కోదండం, సూర్యుడు, చంద్రుడు, వారి బంధువులు’ కోరిన పాటలు కూడా వేసేవారు. అదీకాక శ్రీరామనవమికీ, మిగతా పండగలకీ పందిళ్ళు వేసి నాటకాలకి ముందు, సినిమా పాటలు వేసేవారు. మా ఇంట్లో హిస్ మాస్టర్స్ వాయిస్ వారి గ్రామఫోన్ కూడా వుండేది. ‘పెద్ద మనుషులు’ సినిమా పాటలు ‘నందమయా గురుడ నందామయా’ మొదలైన రికార్డులు ఎన్నో వుండేవి. ఇంకా వున్నాయి కూడా. తర్వాత టేప్ రికార్డర్లు, సిడి ప్లేయర్లు. ఈ డిజిటల్ యుగంలో పాడు ఐపాడ్లు, పాడు సెల్ ఫోన్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఎన్నో అంతర్జాల పాటల వెబ్ సైట్లలో పాత పాటల్ని వినిపిస్తూనే వున్నారు. 

1950 దశకం చివరలో అనుకుంటాను, నేను మా నాన్నగారితో కలిసి గుంటురులో ఘంటసాలగారి కచేరీకి వెళ్ళాను. మూడు గంటల పైన ఆయన మధురంగా పాడటం నాకింకా గుర్తుంది. ఆ మహా గాయకుడి కచేరీని ఎలా మరచిపోతాం!

1939వ సంవత్సరం నించీ, దాదాపు 1980 దశకం దాకా, నిజంగా అది సంగీత స్వర్ణ యుగమే. తర్వాత కూడా అడపాదడపా కొంతమంది మంచి విలువలు, సంస్కారం వున్న నిర్మాతా దర్శకులు తీసిన సినిమాల్లో కొన్ని మంచి పాటలు వచ్చినా, 2000 సంవత్సరం దాటాక, సంగీత సాహిత్యాలకు విలువ ఇచ్చిన పాటలు మాత్రం కొంచమే. 

ఆరోజుల్లో ఏ నిర్మాత, దర్శకుడు ఏరకం సినిమా తీసినా, చక్కటి సాహిత్యంతో కూడిన ఎన్నో మంచి పాటలు అందించేవారు. బి.ఎన్. రెడ్డి, కె.వి. రెడ్డి, వేదాంతం రాఘవయ్య, ఆదినారాయణరావు, ఆదుర్తి, వి. మధుసూదనరావ్, తిలక్, ఎల్వీ ప్రసాద్, కమలాకర కామేశ్వర్రావు, తాతినేని ప్రకాశరావు, లక్ష్మీరాజ్యం, దుక్కిపాటి మధుసూదనరావు, భానుమతి-రామకృష్ణ, పి. పుల్లయ్య, సి. పుల్లయ్య, సియస్ రావు, శంకరరెడ్డి, జంధ్యాల, దాసరి, విశ్వనాథ్, నాగిరెడ్డి-చక్రపాణి, బాపు.. మొదలైన ఎందరో మహానుభావులు కలకాలం నిలిచే ఆ పాటలకి నాంది పలికారు. వీరందరూ సినిమాల్లో పాటల సందర్భం దగ్గర నించీ, సాహిత్యం, సంగీతం. బాణీ, వాద్య సహకారంలాటి ప్రతి విషయం వరకూ ఎంతో శ్రద్ధ తీసుకుని, ఎన్నో రిహార్సల్స్ చేయించి ప్రతి పాటా ఒక మంచి పాటగా తయారు చేసేవారు. దానివల్ల, అంతే శ్రద్ధ తీసుకుని నిర్మించిన సినమాతో పాటు, ఆ సినిమా పాటలను కూడా చిరస్థాయిగా నిలబెట్టాయా సినిమాలు. 

మరి ఒక గొప్ప పాట కావాలంటే, మంచి సాహిత్యం వుండాలి. సంగీతం తెలిసిన సంగీత దర్శకుడు కావాలి. మంచి బాణీలు కుదరాలి. మధురమైన కంఠం వున్న గాయకులు కావాలి. వారి భాషలో లలితమైన భావ ప్రకటన అలా జాలువారుతూ వుండాలి. వీటన్నిటికీ మించి, మనకి కనపడని రకరకాల నిపుణుల చేతిలో అలవోకగా పలికే వాద్యాల ఆర్కెస్ట్రా వుండాలి. 

ఒకసారి కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారిని ఎవరో అడిగారుట. ‘మీ కరుణశ్రీ, సాంధ్యశ్రీ మొదలైన పద్యాలు మహాగాయకుడు ఘంటసాలగారు పాడినందుకు, మీకు అంత పేరు వచ్చిందా? లేక ఘంటసాలగారు ఇంత గొప్ప సాహిత్యం వున్న పద్యాలు పాడినందుకు, ఆయనకి మంచి పేరు వచ్చిందా’ అని.  

దానికి ఆయన, ‘ఘంటసాలకీ కరుణశ్రీకీ వున్న సంబంధం, సంగీతానికీ సాహిత్యానికీ వున్న అనుబంధం. ఘంటసాల ఏ పాట పాడినా, ఏ పద్యం పఠించినా, ఏ శ్లోకం చదివినా, సంగీతానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి, సాహిత్య సౌందర్యాన్ని చెడగొట్టలేదు. సంగీత సాహిత్యాల సన్నిహిత సంబంధాన్ని సరసంగా, సముచితంగా, సర్వాంగ సుందరంగా దర్శించి, ప్రదర్శించిన సంగీత సార్వభౌముడు ఘంటసాల!’ అన్నారు.

ఒకసారి సాలూరి రాజేశ్వర్రావుగారు అంటారు, ‘ఇంత మంచి సాహిత్యం అందిస్తే మరి సంగీత దర్శకుడికి అంతకన్నా కావల్సిందేముంది. అదో పెద్ద పండుగ.. అందుకే అంత మంచి పాటలు వస్తున్నాయి’ అని. 

ఈ వ్యాసాన్ని సంగీతంతో పాటు సాహిత్యంతో కూడా కలిపి వ్రాద్దామనుకున్నాను. కానీ నేను సేకరించిన సమాచారం రెండు వ్యాసాలకు పైగా సరిపోయేటట్టు వుంది. అందుకని, మనసు మార్చుకుని, ఈ సంచికలో ఒక్క చలన చిత్ర స్వర్ణయుగ స్వర మాధురి గురించే వాస్తున్నాను. అంటే సంగీత దర్శకులు, గాయకులు మనకి అందించిన ఆనాటి సంగీత వైభవం గురించి. వచ్చే సంచికలో, జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు చెప్పినట్టు ఆ స్వర మాధురికి తోడైన, సాహిత్య సౌరభం గురించీ, ఆ మహా రచయితల కవితా స్రవంతి గురించీ వ్రాస్తాను.

కొన్ని చక్కటి పాటల గురించి చెప్పుకునే ముందు, ఈ స్వర్ణయుగ సంగీతాన్ని మనకి అందించిన సంగీత దర్శకులు, గాయనీ గాయకులను ముందు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 

మన అదృష్టం ఏమిటంటే, ఈ స్వర్ణ యుగం తొలినాటి సంగీత దర్శకులు గాలిపెంచల నరసింహారావు, ఓగిరాల రామచంద్రరావు, బాలాంత్రపు రజనీకాంతరావు, చిత్తూరు నాగయ్యలతో మొదలయి, అలనాటి సాలూరి రాజేశ్వర్రావు, సుసర్ల దక్షిణామూర్తి, మాస్టర్ వేణు, సుబ్బురామన్, ఘంటసాల, పెండ్యాల, ఆదినారాయణరావు, టివిరాజు, అశ్వత్థామ, ఎమ్మెస్ విశ్వనాథన్, టి. చలపతిరావు, భానుమతి, జెవి రాఘవులు, రమేశ్ నాయుడు, కోదండపాణి, కెవి. మహాదేవన్, పుహళేంది, రాజన్ – నాగేంద్ర, ఇళయరాజా మొదలైన సంగీతదర్శకులతో ఎన్నో ఎన్నెన్నో సువర్ణ కమలాలు అందించింది. తర్వాత తరం సంగీత దర్శకులు సత్యం, చక్రవర్తి, ఎస్పీ బాలు, కోటి, కీరవాణి మొదలైన వారు కూడా మంచి పాటలు అందించారు. 

అలాగే గాయనీ గాయకులలో అలనాటి అక్కినేని నాగేశ్వరరావు, నాగయ్య, జి. వరలక్ష్మి, ఎస్వరలక్ష్మి, టంగుటూరి సూర్యకుమారి, బాలసరస్వతి, పుష్పవల్లి, భానుమతి, ఎమ్మెస్ రామారావు, కమాలాదేవి, సూరిబాబు, రఘురామయ్య, సి.ఎస్.ఆర్., శాంతకుమారిలతో పాటు జిక్కి, లీల, సుశీల, ఘంటసాల, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వర్రావు, ఎ.ఎం. రాజా, పిబి శ్రీనివాస్, జానకి, జమునారాణి, ఎల్లార్ ఈశ్వరి, వసంత, స్వర్ణలత మనల్ని అలరించారు. తర్వాత వచ్చిన గాయకుల్లో ప్రముఖులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, ఎస్పీ శైలజ,  జేసుదాస్, ఆనంద్, మనో మొదలైన వారు. ఆనాడు కానీ, ఈనాడు కానీ భారతదేశంలో, తన మధురమైన కంఠంతో పదేపదే వినాలనిపించే గాంధర్వ గాయని ఒక్క చిత్రగారే అని నా స్వాభిప్రాయం. ఆవిడ ఎలాటి పాట పాడినా కళ్ళు మూసుకుని, మనం కూడా తన్మయత్వంతో ఆ గాంధర్వ లోకంలో ఓలలాడవచ్చు.  

“పైన చెప్పిన గాయనీ గాయకులలో కొంతమందిని గాయకులుగా మాకు పరిచయం లేదు. వారే పాటలు పాడారో చెప్పండి” అని ఎవరైనా అడగవచ్చు. అందుకే ముందే ముగ్గురు గాయకుల పాటల గురించి చెప్పేస్తున్నాను.

 

నాటకాలలో తన పద్యాలు, పాటలు తనే పాడుకున్న అక్కినేని నాగేశ్వర్రావు, మొదట్లో కొన్ని సినిమాల్లో తన పాటలు తనే పాడుకున్నారు. వాటిలో చెప్పదగినది, పల్నాటి యుధ్ధం చిత్రంలోని ‘ఓహో.. చారుశీలా” అనే పాట.

నాగయ్య వందేమాతరం, సుమంగళి, భక్త పోతన, యోగి వేమన, త్యాగయ్య మొదలైన ఎన్నో సినిమాల్లో పాటలు పాడటమే కాక, కొన్నిటికి ఆయనే సంగీత దర్శకత్వం కూడా వహించారు. ఆయనక కర్ణాటక సంగీత విద్వాంసులు కనుక, త్యాగరాజ కీర్తనలను కూడా అలవోకగా సినిమాల్లో పాడేశారు. జి. వరలక్ష్మి ‘జ్యోతి’ సినిమాలో పాడిన గురజాడ “దేశమును ప్రేమించు మన్నా”, దేవులపల్లి “జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి” పాటలంటే నాకెంతో ఇష్టం. మిగతావి మీకే వదిలేస్తున్నాను. నాలాగా కొన్ని పాత పాటలు విన్నా, పుస్తకాలు చదివినా ఎవరు ఏ పాటలు పాడారో మీకూ ఇట్టే తెలిసిపోతుంది. 

నాకెంతో నచ్చిన ఈ స్వర్ణయుగంనాటి ఎన్నో వేల పాటల్లో, స్థలాభావం వల్ల కేవలం కొన్ని పాటల గురించి మాత్రమే ఇక్కడ చెప్పుకుందాం.

 

కొన్ని చిత్రాల్లో దాదాపు చిత్రంలోని అన్ని పాటలూ, మనం ఏనాటికీ మరువలేని, మరుపురాని పాటలు. అవి మనకి తరచుగా వినపడుతూనే వుంటాయి. చిత్రం పేరు చెప్పగానే, పాటలు అన్నీ చేప్పేవారూ, పాడేవారు వున్నారు. 

వాటిల్లో ముఖ్యమైనవి కొన్ని ఇవి. మల్లీశ్వరి (దేవులపల్లి, సాలూరి, భానుమతి, ఘంటసాల, బిఎన్ రెడ్డి), దేవదాసు (మల్లాది, సముద్రాల, సుబ్బురామన్, ఘంటసాల, రాణి, బాలసరస్వతి, వేదాంతం రాఘవయ్య), సువర్ణసుందరి (సముద్రాల, జిక్కి, సుశీల, ఘంటసాల, ఆదినారాయణరావు, వేదాంతం రాఘవయ్య), లవకుశ (సముద్రాల, మాధవపెద్ది, లీల, సుశీల, ఘంటసాల, సి.పుల్లయ్య, సి. యస్. రావు), కళాతపస్వి కె. విశ్వనాథ్, ప్రముఖ చిత్రకారుడు దర్శకుడు బాపు నిర్మించిన దాదాపు అన్ని చిత్రాలు. 

రాజేశ్వర్రావుగారు మాట్లాడిన సి.డి. ఒకటి వుంది నా దగ్గర. ఆయన్ని ఎవరో అడిగారు, “సినిమా పాటకి మాధుర్యం (మెలోడీ) అవసరమా” అని. ఆయన అమాయకంగా జవాబిచ్చారు, “మంచి సంగీతంలో మాధుర్యం లేకుండా ఎలా వుంటుంది సార్” అని. అందుకనేనేమో ఆ రోజుల్లో పాటలోని మెలోడీకే ప్రాధాన్యం ఎక్కువగా వుండేది.

అలాటి మెలోడీ పాటలు వినాలంటే నాకు వెంటనే గుర్తుకి వచ్చేది, బ్రతుకుతెరువు చిత్రంలో ఘంటసాల పాడిన ‘అందమె ఆనందం’. తర్వాత షావుకారులోని ‘పలుకరాదటే చిలుకా’, దొంగరాముడులో సుశీల పాడిన ‘అనురాగము విరిసేనా’, జయసింహలో ‘ఈనాటి ఈ హాయి’, ఇలవేలుపు ‘చల్లని రాజా, ఓ చందమామా’, ఉయ్యాల జంపాలలో ‘కొండగాలి తిరిగింది’, పెళ్ళికానుకలో ‘పులకించని మది పులకించు’, సిరిసిరి మువ్వలో ‘అందానికి అందం ఈ పుత్తడి బొమ్మా’, కన్నె వయసులో ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. సుశేల గొంతులోని తీయదనం వినాలంటే, ‘చదువుకున్న అమ్మాయిలు’లో ‘వినిపించని రాగాలే’ పాట వింటే చాలు. ఎంతో మధురమైన పాటలు ఒకటా రెండా ఎన్నో వున్నాయి అవి వ్రాయాలంటే ఈ వ్యాసం ఒక పుస్తకమే అవుతుంది. 

మళ్ళీ రాజేశ్వరరావు గారిని అడిగిన ఇంకో ప్రశ్న చెబుతాను. “తెలుగు పాటల్లో బీట్ వుండదండీ” అన్నాడుట ఒకాయన. దానికి సాలూరివారు, ‘బీట్ అంటే ఏమిటి, తాళం. మన శాస్త్రీయ సంగీతం నుంచి ఈనాటి సినిమా పాటల దాకా ప్రతి పాటలో తాళం వుంటుంది. బీట్ అంటే డబ్బాలు బాదటం కాదు, అది శ్రావ్యంగా వుండాలి’ అన్నారు. విశ్వనాథ్ గారి శంకరాభరణం శంకరశాస్త్రి చెప్పింది కూడా అదే. 

మంచి బీట్ వుండాలంటే ఈనాటి తెలుగు పాటల్లోలాగా కర్ణకఠోరమైన డబ్బా బాదుళ్ళు వుండనఖ్కర్లేదు. ఎన్నో పాటలు మంచి బీట్ ఒక్కటే కాకుండా, వినటానికి ఎంతో శ్రావ్యంగా కూడా వున్నాయి.   

   రోజులుమారాయిలో “ఏరువాకా సాగాలోయ్ అన్నా చిన్నన్న” మొదలు మంచి మనసులులో “మామ మామ మామా” పాటతో సహా, తర్వాత ఎన్నాళ్ళకో వచ్చిన విశ్వనాథ్ గారి స్వరాభిషేకంలో మనో, చిత్ర పాడిన ‘నీ చెంతే ఒక చెంచిత వుంటే’ వరకూ ఎన్నో పాటలు వింటుంటే, అటు తలా, ఇటు కాళ్ళూ వూపని వాళ్ళు ఎవరూ వుండరు. అనుమానం వుంటే కనీసం ఈ మూడు పాటలూ ఇప్పుడే వినేసి, అప్పుడు చెప్పండి. 

శాస్త్రీయ సంగీతం రంగరించి కూర్చిన పాటలు తెలుగు పాటల్లో వున్నన్ని ఇంకెక్కడా లేవేమో అనిపిస్తుంది. మనకి మొట్టమొదటగా గుర్తుకి వచ్చే పాట ‘జగదేక వీరుని కథ’ చిత్రంలో పెండ్యాల సంగీతంతో ఘంటసాల ఆలపించిన ‘శివశంకరి, శివానందలహరి’. రికార్డింగులో ఆ పాట ఒకే వూపులో పాడిన ఘంటసాలవారు, మళ్ళీ ఏ కచేరీలోనూ పాడలేదుట. పాడమని అడిగితే ‘మళ్ళీ నేనంత గొప్పగా పాడలేనయ్యా’ అన్నారుట. 

నాకు బాగా ఇష్టమైన శాస్త్రీయపరమైన పాటలు చాల వున్నాయి. వెంటనే గుర్తుకి వచ్చేవి, అనార్కలి చిత్రంలో  ఆదినారాయణరావుగారి ‘రాజశేఖరా నీపై మోజు తీరలేదురా’, ఆయన సంగీతంలోనే సువర్ణసుందరిలోని ‘హాయి హాయిగా ఆమని సాగే’, జయభేరి చిత్రంలో పెండ్యాలగారి ‘రసికరాజ తగువారము కామా’, ‘మది శారదాదేవి మందిరమే’, సాలూరివారి ‘శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా’, లవకుశ సినిమాలో ఘంటసాల శాస్త్రీయ బాణీలో చేసిన ఎన్నో పాటలు, ‘ముక్కోటి దేవతలు ఒక్కటైనారు’, ‘మోహనరాగ మహా మూర్తిమంతమాయే’.. ఇలా ఎన్నో వున్నాయి. 

నా దగ్గరవున్న ఒక్ సీడీలో పెండ్యాలగారు అన్నారు. ‘మహాకవి కాళిదాసు’ చిత్రంలో ‘మాణిక్యవీణాం’ దండకం, దాని వెంటనే ఒక చిన్న శ్లోకం ఘంటసాలగారు పాడవలసి వచ్చింది. ఆయనకి రికార్డింగ్ రోజున జ్వరంగా వుంది. రికార్డింగ్ కాన్సిల్ చేస్తానంటే, ఆయన నిర్మాతకి నష్టం వస్తుందని వద్దన్నారు. పోనీ బిట్స్ బిట్సుగా పాడితే ఎడిటింగ్ చేసుకుంటానన్నాను. ఆయన వినలేదు. ఆయన ఒకే టేకులో ఆ దండకం, వెనువెంటనే ఆ శ్లోకం ఆపకుండా పాడారు. మీకు తెలుసు అది ఎంత బాగా పాడారో. అది ఆయనకే సాధ్యం’ అని. 

ఆనాటి చిత్రాల్లో భక్తి పాటలకి కొదువలేదు. పౌరాణిక చిత్రాలలోనే కాక, సాంఘిక చిత్రాల్లో కూడా ఎన్నో భక్తి పాటలు వుండేవి. నాకు బాగా ఇష్టమైనది పాండురంగ మహాత్యం చిత్రంలో టీవీరాజు సంగీతం ఇచ్చిన ‘జయ కృష్ణా ముకుందా మురారి’. ఇది ప్రతి చోటా వినిపించే ఆపాత మధురం.  భూకైలాస్, భక్త ప్రహ్లాద, వెంకటేశ్వర మహాత్యం, భక్త శబరి మొదలైన చిత్రాల్లో ఎన్నో గొప్ప భక్తి పాటలు వున్నాయి. 

కొసరాజుగారి పుణ్యమా అని ఎన్నో హాస్య భరితమైన పాటలు తెలుగు చిత్ర స్వర్ణయుగానికి మెరుగుపెట్టాయి. ఆయన సాహిత్యంలో మామూలు హాస్యం కన్నా, చెణుకులు బెణుకులు ఎక్కువ. పెద్ద మనుష్యులులో ‘నందామయా గురుడ నందామయా’, రోజులు మారాయి ‘ఏరువాక సాగాలోయ్ చిన్నన్న’, కులగోత్రాలులో ‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే’, ఇల్లరికంలో ‘భలే చాన్సులే’, మంచిమనసుల్లో ‘మామ మామా మామా’, ‘కంపుగొట్టు ఈ సిగరెట్టు, కాల్చకోయి నాపై ఒట్టు’.. ఒకటా రెండా ఆయన వ్రాసిన పాటలు, మాధవపద్ది సత్యం, పిఠాపురం, పిబి శ్రీనివాస్, స్వర్ణ్లలత, జమునారాణి గొంతుల్లోనించీ వచ్చి, రేలంగి, రమణారెడ్డి, గిరిజ, మొదలైన నటులకు ప్రాణం పోశాయి. 

విశ్వనాథ్ అంతకు ముందే ఎన్నో చిత్రాలు తీసినా, ‘శంకరాభరణం’ చిత్రంతో ప్రేక్షకుల అభిరుచిని మార్చారని చెప్పవచ్చు. విశ్వనాథ్ మన చలన చిత్ర సంగీత స్వర్ణయుగానికే ఒక ఆభరణం. సరిగమలు తెలిసిన వారికే శాస్త్రీయ సంగీతం అనుకునే వారికి కూడా, శాస్త్రీయ సంగీతం ఒక్క పండితులకే కాదు, పామరులు కూడా ఆస్వాదించవచ్చు అని నిరూపించారు. మనం చిత్రసీమలో సంగీతం గురించి మాట్లాడుకునేటప్పడు, విశ్వనాథ్ పేరు ఎప్పుడూ మొట్టమొదటే వుంటుంది. ‘శంకరాభరణం’, ‘శృతిలయలు’ ‘సప్తపది’, ‘స్వాతిముత్యం’, ‘స్వర్ణకమలం’, ‘స్వాతికిరణం’, ‘సాగర సంగమం’.. ఒకటా రెండా.. ఆయన తీసిన చిత్రాలన్నీను. అలాగే బాపుగారి చిత్రాలు. ఈ ఇద్దరు దర్శకులకీ ఎక్కువ చిత్రాలకి సంగీతం అందించినది కెవీ మహాదేవన్ గారే. 

అలాగే పెళ్ళి పాటలు కూడా ఎన్నో వున్నాయి. వాటిల్లో ముఖ్యమైనది గాలిపెంచల నరసింహారావుగారు స్వరపరిచిన “సీతారాముల కల్యాణం, చూతము రారండి”. ప్రతి పెళ్ళిలోనూ ఆనాటినించీ ఈనాటిదాకా వినిపిస్తూనే వుంటుంది. అలాగే ఆరుద్ర విరచితాలు “పందిట్లో పెళ్ళవుతున్నాది, కనువిందవుతున్నాది”, “”బంగారు బొమ్మ రావేమే”, “శ్రీరస్తూ శుభమస్తు”.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో వున్నాయి. 

పద్యాలకీ కొదువలేదు.హంటసాల, మాధవపెద్ది, శ్రీనివాస్, రఘురామయ్య, సూరిబాబు, ఎస్వరలక్ష్మి మంచి పద్యాలు పాడారు. నాకు బాగా ఇష్టమైనవి భక్త ప్రహ్లాద చిత్రంలో కోయిలమ్మ సుశీల పాడిన ఏనాటికీ మరువలేని పోతన మందార మకరంద పద్యాలు.   

ఇంతవరకూ భారతదేశంలోని ఒకే ఒక్క గొప్ప గాయని గురించి, ఇందాక వూరికే పేరు చెప్పాను. కానీ ఆవిడ పాటల గురించి చెప్పనే లేదు. తెలుగు ఒక్క ముక్క కూడా రాని మలయాళ మనోహరం. బాలు సహకారంతో తెలుగు కూడా నేర్చుకుని, భావం తెలుసుకుని, అదే భావాన్ని అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు తన పాటలో పలికించటం ఆవిడ గొప్పతనం. తెలుగు భాషలోని అందాలని ద్విగుణీకృతం చేస్తూ, అసాధారణ భావ ప్రకటనతో, తన తీయని గొంతుతో శ్రోతలను తన్మయుల్ని చేయగలదు. ఆవిడే చిత్ర. చిత్ర చేచ్చి. అంటే చిత్ర అక్కయ్య. 

‘మరల తెలుపనా ప్రియా’, ‘మనసున వున్నదీ’, “ఏదో ఒక రాగం పిలిచిందీ వేళా’, ‘గోపాల బాలుడమ్మా’.. ఇలాటివి ఎన్నో వున్నాయి. ప్రతి పాటా ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. వీటన్నిటికీ మించిన మూడు పాటలు నాకెంతో ఇష్టం. అవి “వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోయాను గగనానికి’, “మౌనంగానే ఎదగమనీ చెట్టు నీకు చెబుతుందీ, ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్ధమందులో వుందీ’, “వేణుమాధవా.. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వ మవుతున్నదో’..  ఎన్ని వందలసార్లు విన్నానో వీటిని. ఇవి పాటలా? కాదు. మన మనసుని కలకాలం ఆహ్లాద పరిచి గగనానికి తీసుకు వెళ్ళే స్వర మాధురీ సౌరభాలు.

మలయాళీ లీలకు ఘంటసాల తెలుగు భాష, భావం నేర్పారని అంటారు. అలాగే బాలు తెలుగు శిక్షణలో చిత్ర. నాకు అర్ధంకానిదేమిటంటే, ఇతర భాషల వాళ్ళే తెలుగులో అంత చక్కగా పాడుతుంటే, ఈనాటి సంగీత దర్శకుల కాకికూతలు, గార్ధభ స్వరాలు ఎందుకూ అని. పాడుతా తీయగా, స్వరాభిషేకంలాటి కార్యక్రమాల్లో ఎంతో మంచి యువ గాయనీ గాయకులు వున్నా, ఎక్కువగా తెలుగురాని, ఏమాత్రం భావం పలకలేని భాషేతర గార్ధభాల చేత ఎందుకు పాడిస్తున్నారా అని. వారి భాషల్లో వారు గొప్పవారు కావచ్చు. అక్షరాలూ, ఒత్తులూ పలుకలేనివారు తెలుగు కాని తెగులులో పాడుతుంటే చాల బాధగా వుంటుంది. ఒకవేళ చక్కటి తెలుగులో పాడగల మన యువ గాయనీ గాయకులకి అవకాశాలు ఇచ్చినా, ఆకాశమంత హై పిచ్చిలో, ఏ మాటా అర్ఢం కాకుండా డబ్బాల మోత పిచ్చితో, చెవులు మూసుకోవలసిన పాటలు అవి. ఈనాటి పాటల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కనీసం నూటికి ఒక మంచి పాట వస్తున్నదని సంతోషిద్దాం. ఒక ప్రముఖ సినీ రచయితని కలిసినప్పుడు, ‘ఏమిటండీ మన పాటల్లో ఆ మోత?’ అని ఆడిగాను. ఆయన నవ్వి, ‘మీకు ఆ పాట అర్ఢమయితే భరించలేరని, సంగీత దర్శకుడు అలా బాదేస్తున్నాడేమో’ అన్నారు.

కొన్ని చోట్ల చదివాను, ఆనాటి సంగీత దర్శకుల, గాయకుల సంస్కారం ఎంత గొప్పగా వుండేదో. రెండు సంఘటనలు ఇక్కడ ఉదహరిస్తాను. 

శాంతినివాసం చిత్రంలో నాగయ్యగారి మీద ఒక పాట చిత్రీకరించవలసి వుంది. ఆ పాటని పి.బి. శ్రీనివాస్ పాడాలని అనుకున్నారు. అదే మాటని ఆయనకి చెబితే, ఆయన ‘అదేమిటండీ. నాగయ్యగారు సంగీతంలో దిట్ట. ఆయనకి నేను పాడటమేమిటి?’ అన్నారుట. కాదూ కూడదని నిర్మాతలు శ్రీనివాసే పాడాలని నిర్దేసిస్తే ఆయన ఒప్పుకుని, నాగయ్య గారిని కలిసి, ఆయన పాదాలకి నమస్కారం చేశారట. ‘నాన్నగారూ, మీలాటి గాయకులకు నేను మీకు ప్లేబాక్ ఇవ్వాల్సి వచ్చింది. నన్ను క్షమించండి’ అన్నారుట. అప్పుడు నాగయ్యగారు, ‘రోజులు మారాయి నాయనా. ఇప్పుడు అలాటి పాట నువ్వు పాడితేనే బాగుంటుంది’ అని ఆశీర్వదించారుట. ఆ పాట ఏమిటంటే, తర్వాత ఎంతో పెద్ద హిట్ అయిన, ‘శ్రీ రఘురాం, జయ రఘురాం, సీతా మనోభిరాం’. సముద్రాల జూనియర్ సాహిత్యం, ఘంటసాల సంగీతం. అది శ్రీనివాస్ గారి సంస్కారం. తనకి వచ్చిన అవకాశం కన్నా, ఆయనకి సీనియర్ ఆర్టిస్టుల మీద గౌరవం ఎంతో చూపించిన సంఘటన. 

అలాగే శంకరరెడ్డిగారు లవకుశ సినిమా తీయబోతూ, పెండ్యాలని సంగీత దర్శకులుగా తీసుకున్నారు. కానీ ఆర్ధిక ఇబ్బందుల్లో పడి ఆ చిత్ర నిర్మాణం అనుకున్న దానికన్నా ఎంతో ఆలస్యం అయింది. ఈలోగా పెండ్యాల విపరీతంగా బిజీ అయిపోయారు. ఆయన శంకరరెడ్డితో సంగీత దర్శకుడిగా ఇంకెవరినైనా పెట్టుకోమన్నారు. ‘ఇది సంగీత ప్రధాన చిత్రం. మిమ్మల్ని మించిన సంగీత దర్శకులు ఎవరూ లేరు. నాకు మీరే కావాలి. ఆగమంటే ఇంకా కొన్నాళ్ళు ఆగుతాను’ అన్నారుట. ‘వద్దు, ఇప్పటికే మీ చిత్రం బాగా వెనకపడింది. ఘంటసాలని సంగీత దర్శకుడిగా తీసుకోండి. అతను చాల బాగా చేయగలడు’ అని శంకరరెడ్డిని ఒప్పించారుట. అన్ని పాటలూ రికార్డింగ్ అయాక, ఘంటసాల ఆ టేప్ తీసుకుని, పెండ్యాలగారి పాదాల దగ్గర పెట్టి, ‘ఇది మీరు పెట్టిన బిక్ష. ఎలా వుందో చెప్పండి’ అన్నారుట. లవకుశ చిత్రంలోని అన్ని పాటలూ విని పెండ్యాల పరవశించి పోయారుట. ఘంటసాలని కౌగలించుకొని, కళ్ళల్లో ఆనందభాష్పాలతో ‘ఇంత గొప్ప సంగీతాన్ని నువ్వు ఇచ్చినంత గొప్పగా నేనివ్వలేనయ్యా’ అన్నారుట. లవకుశ సినిమా పాటలు ఎంత గొప్పవో మనకందరికీ తెలుసు. ఆ చిత్రం నడిచిందే పాటల వల్ల. ఆ సినిమాకి హీరోయిన్ తెలుగువారి సీతమ్మ అంజలీదేవి అయితే, నిజమైన హీరో మరి ఘంటసాలే. అదీ పెండ్యాలగారి సంస్కారం. ఘంటసాలవారి గురుభక్తి. 

ఈ వ్యాసం ముగించే ముందు, సాలూరి రాజేశ్వర్రావుగారి హోస్యోక్తులు చెప్పకపోతే ఎలా? ఆయనలో మంచి హాస్య చతురత వుంది. ఇబ్బంది కలిగించే కొన్ని విషయాలు సూటిగా చెప్పవలసి వచ్చినప్పుడు, ఆయన తన హాస్యంతో రంగరించి తనకి నచ్చని విషయాలు నిర్మాతలతో చెప్పేవారట. 

ఒకసారి నిర్మాణ ఖర్చులు పెరిగిపోతున్నాయని గొడవ పెడుతున్న ఒక నిర్మాత, రాజేశ్వర్రావుగారితో, “మీరు ఇన్ని వాయిద్యాలు పెట్టి పాటలు రికార్డింగ్ చేస్తున్నారేమిటి? బెంగాలీ సినిమాల్లో చూడండి, ఏవో ఒకటో రెండో వాయిద్యాలతో పాట రికార్డ్ చేసేస్తారు. ఎందుకు మనకా వృధా ఖర్చు. మనమూ అలా చేయొచ్చు కదా” అన్నారు. 

దానికి జవాబుగా ఆయన, ‘దాందేముంది. అలాగే చేద్దాం. కాకపోతే మీ సినిమా కూడా ఆ బెంగాలీ సినిమాల్లాగానే రెండు మూడు రోజులు మార్నింగ్ షోలు ఆడుతుంది’ అన్నారుట నవ్వుతూ.  

ఇంకోసారి ఒక పాటకి చాల మంచి బాణీ కట్టి, గాయకులతో రిహార్సల్స్ చేస్తున్నప్పుడు, సరిగమలు కూడా సరిగ్గా పలుకలేని పక్కనే వున్న నిర్మాత, ఆయన మిత్రులూ, ‘ఇక్కడ బాగా లేదు, అక్కడ బాగా లేదు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది’ అని ఉచిత సలహాలు ఇస్తుంటే, రాజేశ్వర్రావుగారికి కోపం వచ్చింది. ఈలోగా అందరికీ కాఫీ కప్పులు అందిస్తున్న కాఫీ బాయ్ వచ్చి, ఆయనకీ ఒక కప్పు అందించాడు. అప్పుడు రాజేశ్వర్రవుగారు అతనితో, ‘నమస్కారం సార్! ఈ పాటకి మేమిలా ఏదో బాణీ కట్టాం. మీరు కూడా ఒకసారి విని, ఎలా చేస్తే బాగుంటుందో సలహా చెబితే, అలాగే చేద్దాం. చెప్పండి’ అన్నారుట నవ్వుతూ. 

మరి ఆ నిర్మాత ముఖం ఎలా వుండివుంటుందో మీరే వూహించండి!

*****

bottom of page