
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు
మరపురాని రోజు?
నిర్మలాదిత్య
రిలీఫ్... ఒక్క నిమిషం తల, భుజస్కంధాల మీదున్న మోయాలేని బరువు దిగిపోయినట్లుంది. అడ్మిషన్స్ డైరెక్టర్ నుంచి ఫోన్. ఆవిడ ఫోన్ పెట్టేసినా, తన మొబైల్ ఇంకా చెవికి ఆనించి ఉన్నానని తెలియడానికి బాగా సమయం పట్టింది. ఒక చిన్న పొరపాటు ఇంత సమస్య గా మారుతుందని ఎప్పటికి ఊహించలేదు. పొరపాటే.
చిన్నప్పటినుంచి ఏదో డాక్టరో, లాయరో అవ్వాలని ఇంట్లో వారి కోరిక. పెద్ద శ్రమలేకుండానే LSAT అడ్మిషన్ టెస్టులో మార్కులు బాగా రావడం, నేను అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న యూనివర్సిటీ లోనే ఉన్న లా స్కూల్ టాప్ 25 ర్యాంకింగ్లో ఉండటం వల్ల అప్లై చేయడం, సీటు రావడం జరిగిపోయింది.
లా స్కూల్ వాళ్ళు చేరే ముందు పంపించిన అడ్మిషన్ పత్రాలలో బ్యాక్ గ్రౌండ్ చెక్ కని కొన్ని ప్రశ్నలున్న పేపర్ కూడ ఒకటి. అన్నీ రొటీన్ ప్రశ్నలే. అలాంటి ప్రశ్నలున్న ఫార్ములు ఇది వరకే నేను జవాబిచ్చి ఉండటం వల్ల చక చక పూర్తి చేసి మిగతా పేపర్లతో పాటు పంపించేసాను.
ఓ రెండు వారాల తరువాత అడ్మిషన్స్ ఆఫీసు నుంచి పిలుపు. స్కూల్ కాంపస్ లోనే ఉండటం వల్ల పొద్దున్న బ్రేక్ మధ్యలో వెళ్లాను.
సంకెళ్ళు
గిరిజాహరి కరణం
స్టేషను చివర చాలా దూరంలో సామాన్లు దింపాడు కూలీ. పిల్లలతో నడవలేక ఆయాసమొస్తూంది.
‘‘ఇదేమిటీ ఇంత దూరంలో పెట్టావు సామాన్లు’’? అన్నాను. మీ బోగీ ఇక్కడే వస్తాదమ్మా బండొచ్చేటయానికి కొస్తా’’ అనేసి వెళ్లిపోయాడు. ‘‘ ఏం భయంలేదమ్మా... ఈ బెంచీ మీద కూచోండి.’’ బాబునెత్తి బెంచీమీద కూర్చోబెట్టి స్టేషను వైపు వెళ్లాడు డ్రైవరు కూడా.
చాలా చిన్న స్టేషను ప్రయాణీకులు కూడా ఎక్కువ లేరు. కొద్ది మంది స్టేషన్ లోని షాపుల దగ్గర అటుఇటూ తిరుగుతున్నారు. లైట్లు గుడ్డిగా వెలుగుతున్నాయి. నేను కూచున్నచోట చెక్క ప్రహరీకవతల మర్రిచెట్టు కాబోలు చాలా పెద్దది వుంది. దానికి అవతలున్న స్ట్రీట్ లైట్ వెలుతురు కొమ్మల సందునుంచి సన్నగా పడుతోంది. రాలిన మర్రి కాయలు మేమున్నచోట నేల మీద ఎర్రర్రెగా కనిపిస్తున్నాయి. దోమలు జుయ్ మని శబ్దం చేస్తూ మా చుట్టూ తిరుగుతున్నాయి. బ్యాగ్ లోంచి బ్లాంకెట్ తీసీ పిల్లలిద్దరికీ కప్పి. దగ్గరకు తీసుకుని కూర్చున్నాను. సమ్మర్ హాలిడేస్లో సెలవులు పెట్టి అందరం తిరుమకెళ్లి అక్కడి నుంచి వాళ్లన్నయ్య వాళ్ల ఊరొచ్చాం. వారం రోజులకవి వచ్చిన మూడో నాడే ఆఫీస్ నుంచీ ఫోనొచ్చిందని నన్నూ పిల్లల్ని వదిలి ఆయన వెళ్లిపోయారు.
ఎందుకొచ్చాంరా బాబూ ఈ ఊరు అనిపిస్తోంది...
డాక్టర్ సునీత
వెంపటి హేమ
ఆకాశాన్ని మేఘాలు కమ్ముకుని ఉండడంతో, వాతావరణం జీబురోమంటూ దిగులుతో దీనంగా ఉన్నట్లుoది.
ఆరోజు డ్యూటీ కి సెలవు కావడంతో డాక్టర్ సునీత ఇంట్లోనే ఉంది. ఈవేళ వాతావరణం ఎలాగుందో అలాగే ఆమె మనసుకూడా దీనంగా, ఏమీ తోచకుండా మొరోజ్ గావుంది.
ఏనాటివో జ్ఞాపకాలు తామరతంపరలుగా ఒకదాని తరవాత ఒకటి గుర్తుకివచ్చి మనసును మరింతగా కలత పెడుతున్నాయి.
ఆమె ఆ ఊరి గవర్నమెంట్ హాస్పిటల్లో పీడియాట్రిక్ సర్జన్. అవివాహిత! అందం, ఐశ్వర్యాలే కాకుండా విద్యావినయసౌశీల్యాదులన్నీ కూడా పుష్కలంగా వున్న ఆమెలాంటి యోగ్యురాలికి తగిన వరుడు దొరకకపోడం ఏమిటి?
పేకాట
మూలం: జయకాంతన్
అనువాదం: సుందరేశన్
జానకి ఒక కొత్త వాయిల్ చీర ధరించి గోడమీదున్న అద్దంముందు నిలబడి తను దువ్వుకున్న జుత్తుని ఇంకొకసారి సరిచూసుకుంది. చెమటవలన కనుబొమ్మల మధ్య కుంకుమబొట్టు కొంచెం తారుమారుగా కనిపించడం చూసి చేతివ్రేలుతో చీర మొన అందుకొని దాన్ని చిన్నదిగా దిద్దుకుంది. ‘ఇదీ బాగానే ఉంది’ ఇని తృప్తిపడుతూ, గాజుల డబ్బాలోనుంచి తను జాగ్రత్తగా నాలుగుసార్లు మడతబెట్టి కాపాడిన రెండురూపాయల నోటు బయటకి తీసింది. అప్పడే రవి - ఆమె రెండేళ్ళ పిల్లవాడు - పలుచబాఱిన తన రెండు కాళ్ళతో నేలమీద పాకుతూ వచ్చి, తల్లికాళ్ళముందు నిలబడి ఒక ఎగురు ఎగిరాడు.
పిల్లవాడిని ఎత్తుకొని, జానకి కిటికీ పక్కన కూర్చోబెట్టి, తను ఉతికిన ఒక కొత్త చొక్కాయి వాడికి తొడిగించింది. జుత్తుని లాలించి, కొంచెం తైలం రుద్ది, దువ్విన తరువాత నెమ్మదిగా పౌడరు పిల్లవాడి మొహంలో తట్టింది. బుగ్గలు తాకి ముద్దాడిన తరువాత దిష్టి తీసింది. పిల్లవాడిని చంకలో ఎత్తిబెట్టుకొని గడియారం చూసినప్పుడు రెండు గంటలని తెలిసింది.
“ఏమే, ఈ మండుటెండలో పిల్లవాడిని ఎత్తుకొని సినిమాకి వెళ్తున్నావా?” తను అడిగిన ప్రశ్నకి జానకి ఎలా చిఱచిఱలాడుతుందో అని భయపడుతూనే, పొడినవ్వుతో సరస్వతీ అమ్మాళ్ నిలబడింది.
“అవును . . . వెళ్తున్నాను . . . మీకేం?”