top of page

సంపుటి  4   సంచిక  4

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

డాక్టర్ సునీత

hemavempati.JPG

వెంపటి హేమ

ఆకాశాన్ని మేఘాలు కమ్ముకుని ఉండడంతో, వాతావరణం జీబురోమంటూ దిగులుతో దీనంగా ఉన్నట్లుoది. ఆరోజు డ్యూటీ కి సెలవు కావడంతో డాక్టర్ సునీత ఇంట్లోనే ఉంది. ఈవేళ వాతావరణం ఎలాగుందో అలాగే ఆమె మనసుకూడా దీనంగా, ఏమీ తోచకుండా మొరోజ్ గావుంది. ఏనాటివో జ్ఞాపకాలు తామరతంపరలుగా ఒకదాని తరవాత ఒకటి గుర్తుకివచ్చి మనసును మరింతగా కలత పెడుతున్నాయి.

ఆమె ఆ ఊరి గవర్నమెంట్ హాస్పిటల్లో పీడియాట్రిక్ సర్జన్. అవివాహిత! అందం, ఐశ్వర్యాలే కాకుండా విద్యావినయసౌశీల్యాదులన్నీ కూడా పుష్కలంగా వున్న ఆమెలాంటి యోగ్యురాలికి తగిన వరుడు దొరకకపోడం ఏమిటి – అని మనం ఆశ్చర్యపోవలసిన పనిలేదు. వరుడు దొరక్కకాదు,  అసలు వరాన్వేషణ జరిగిoదే లేదు. వివాహంపై ఆమెకున్న విముఖతయే దానికి కారణం. ఆ కారణానికి ఉన్న కారణమేమిటో తెలిస్తే అంతలా ఆశ్చర్యపోవలసిన పనిలేదని మనకి చక్కగా అర్థమౌతుంది...

**       

సునీత తండ్రి సీతారాం, సురేశ్ తండ్రి ప్రకాశరావు మంచి స్నేహితులు.  వాళ్ళు ఉంటున్నది ఒకే ఊరు కావడంతో, ఇళ్ళు దూరంగావున్నా, రెండుకుటుంబాలూ ఒకరి ఇంటికి ఒకరు తరచూ వస్తూపోతూ, చాలా సన్నిహితంగా ఉండేవారు. తెలిసినవాళ్ళందరూ, ఈడైనపిల్లలున్నారుకనుక మిత్రులిద్దరూ వియ్యమందుతారనే అనుకున్నారు. అదే ఆలోచనతో ఉన్న ఆ రెండు కుటుంబాలూ చిన్నప్పటినుండీ పిల్లలకు పూర్తి స్వేచ్చనిచ్చేశారు. సునీతా, సురేశులు ఇద్దరూ  ఆడుతూ, పాడుతూ కలిసిమెలిసి పెరిగారు. 

సునీత, సురేశ్ కన్నా ఐదేళ్ళు చిన్నది కావడంతో, సునీత కాలేజికి వచ్చేసరికి సురేశ్ యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. కాని ప్రతివారం సునీతకు ఉత్తరం రాసేవాడు. సునీత కూడా ఆరోజుకారోజే అతనికి జవాబిచ్చేది. అతడు  సెలవులకు ఇంటికి వచ్చినప్పుడల్లా సినిమాలకనీ, షికారుకనీ కలిసివెళ్ళేవారు. సురేశ్ చదువు పూర్తయ్యి ఉద్యోగంలో ప్రవేశించగానే వాళ్ళపెళ్లి జరిపించే ఉద్దేశంతో ఉన్నారు మిత్రులిద్దరూ.

దసరా సెలవులు రాగానే సురేశ్ ఇంటికి వస్తానని రాశాడు. ఆవార్త సునీతకు చాలా సంతోషాన్నిచ్చిoది.  సెలవురోజుల్లో ఇద్దరూకలిసి సంతోషంగా గడిపడానికని ఎన్నెన్నో ప్లానులు వేసుకుంది ఆమె.  కాని భవిష్యత్తులో  ఏమి జరుగనుందో ఆమె ఎంతమాత్రం ఊహించలేకపోయింది.

**           

                                    

ఇక సురేశ్ రెండురోజుల్లో ఇంటికి వస్తాడనగా ఆరోజు ఖరీదైన కారు ఒకటి వచ్చి ప్రకాశరావు ఇంటిగుమ్మం ముందు  ఆగింది. సురేశ్ తల్లి తాలూకు బంధువైన కాంతారావు ఆ కారులోంచి దిగాడు. చాలా రోజులకు కనిపించిన బంధువును ఆప్యాయంగా ఆహ్వానించారు భార్యాభర్తలు. అంతలో కారుడ్రైవరు రకరకాల పార్సిల్సు ఎన్నిటినో కారులోంచి తీసుకువచ్చి నట్టింటవుంచాడు.

ఆ వచ్చినాయన సురేశ్ అమ్మతో, “రమా! ఇవి నీకోసమే! ఆడపడుచు ఇంటికివస్తూ ఉత్తిచేతులతో రాకూడదంటారు. ఏదో సమయానికి ఎదురుగా కనిపించిన ఈ నాలుగూ తీసుకువచ్చా, ప్రస్తుతానికి ఇవి తీసుకో” అన్నాడు చిరునవ్వుతో, పరమలౌక్యుడైన ఆ బంధువు తన స్టేటస్ ఏమిటో గుట్టుగా వ్యక్తంచేస్తూ.

గుట్టగా ఉన్న ఆ పార్సిల్సు చూడగానే రమ కళ్ళు ఆనందంతో మెరిశాయి, “ఇవన్నీ ప్రస్తుతానికేట! అంటే - ముందుముందు ఇంకా చాలా ఇస్తాడన్నమాట! వాళ్ళకిదేం పెద్ద లెక్కకాదుకదా” అనుకుంది మనసులో. పైకి మాత్రం, “అన్నయ్యా! దుబాయి నుండి వచ్చి ఎన్నాళ్ళయ్యింది?ఒక్కనెలైనా ఉంటారా ఈమాటు లేక ఇదివరకులాగే సెలవు లేదు - అంటూ వెంటనే వెళ్లిపోతారా” అని అడిగింది, మంచినీళ్ళగ్లాసు తెచ్చి అందిస్తూ.

“లేదమ్మా, ఇక వెళ్ళీ ఉద్దేశం లేదు. పిల్లకి పెళ్ళీడువచ్చిoది, లేకలేక పుట్టిన పిల్ల అది. దానికి మనవాళ్ళల్లోనే  ఔనన్నసంబంధం చూసి పెళ్ళిచేసి, మేముకూడా దగ్గరలోనే, ఇండియాలోనే ఉండిపోవాలనుకుంటున్నాము. సంపాదించినది మూడుతరాలకి చాలినంతవుoది. ఎటు చూసినా ఉన్నది ఒక్కపిల్లాయే!“

“సంబంధమేమైనా కుదిరిందా అన్నయ్యా?”

“లేదమ్మా! నేను ఇప్పుడు వచ్చింది ఆ పనిమీదే... మన మామయ్య భార్య లేదూ, కావుడత్తయ్య! ఆమె చెప్పింది మీ అబ్బాయి సంగతి, వెంటనే రెక్కలుకట్టుకుని వచ్చి వాలిపోయా సంబంధం మాటాడాలని” అన్నాడు కాంతారావు, రమకు పెత్తల్లి కొడుకు.

వెంటనే ప్రకాశరావు కంగారుపడుతూ ఏదో అనబోయాడు, “మా అబ్బాయి పెళ్ళికి ఇదివరకే సంబం... ”

భర్త ఏమిచెప్పబోతున్నాడో గ్రహించిన రమ వెంటనే అతనిమాటకు అడ్డువచ్చిoది. “రా అన్నయ్యా, ఇల్లుచూపిస్తాను” అంటూ వచ్చి ఇద్దరికీ మధ్య అడ్డుగా నిలబడి భర్తవైపు ఉరిమి చూసింది. ప్రకాశరావు నోరు మూతబడింది. రమవెంట నడిచాడు కాంతారావు.

భార్య ఆలోచన దారి మారిందని గ్రహించాడు ప్రకాశరావు. కాని కొడుకు సునీతతో తన పెళ్లిని గురించి గట్టినిర్ణయంతో ఉంటే ఆమేమి చెయ్యగలదులెమ్మని మనసు సరిపెట్టుకున్నాడు.

**

                                 

ఉదయం ఎనిమిది గంటలయ్యింది. స్నానం చేసివచ్చి, కాఫీతాగుతూ  పేపరు చదువుతూ వరండాలో వాలుకుర్చీలో కూర్చుని ఉన్నాడు సీతారాం. పేపర్లోని ఫ్రెంట్ నె ఉన్న దుర్వార్తలు ఆతని మనసుని కలతపెట్టాయి.  దగ్గరలోనే మసలుతున్న కూతురునుద్దేశించి, “ఒకప్పుడు “పుణ్యభూమి”, “ధన్యభూమి” అనిపించుకున్న ఈ దేశంలో రోజురోజుకీ దుర్మార్గం పెట్రేగిపోతోంది.  స్వార్ధం తెగపెరిగడంతో మనిషికి యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం నశించిపోతోంది. చివరికి ఈ దేశం ఏదారిపట్టి పోనుందోకదా“ అన్నాడు.

అప్పుడే గుమ్మాలెక్కి వస్తున్న ప్రకాశరావుకి తగిలివచ్చాయి ఆ మాటలు.  ఇంకేముంది, తన ఇంటి నిర్వాకం అతనికి తెలిసిపోయిందనీ, సీతారాం ఆ మాటలు తనను ఉద్దేశించే అంటున్నాడనీ అనుకున్నాడు అతడు.

వెంటనే మిత్రునికి దగ్గరగావచ్చి, “క్షమించరాని ద్రోహంరా ఇది, నిజమే! ఒప్పుకుంటా. ఏది ఏమయినా నువ్వు నన్ను క్షమించక తప్పదు. నిస్సహాయుణ్ణి,  నువ్వు నన్ను క్షమించానని అంటేగాని నేను నీ కాళ్ళు వదలను” అంటూ సీతారాం కాళ్ళ మీద వాలిపోయాడు ప్రకాశరావు కన్నీళ్ళతో.

బిత్తరపోయాడు సీతారాం. “ అయ్యో! ఇదేమిటిరా ప్రకాశ్, ఏమయ్యింది నీకు? నాకు నువ్వుచేసిన ద్రోహమేమిటి? విడ్డూరాలుపోకు, ఎవరైనా వింటే నవ్విపోతారు” అంటూ అతన్ని లేవదీసి పక్కనున్న కుర్చీలో కూర్చోపెట్టాడు సీతారాం.  సునీత వెళ్లి మంచినీళ్ళు తెచ్చి అతనికి తాగనిచ్చిoది.

మంచినీళ్ళుతాగి కొంచెం తెప్పరిల్లి, తన ఇంట్లో జరిగినదంతా మిత్రునికి చెప్పాడు ప్రకాశరావు. “నా కొడుకైనా నామాట నిలబెడతాడని ఆశపడ్డానురా. కాని వాడు కూడా డబ్బు మాయలో పడిపోయి వాళ్ళ అమ్మకే వంతపాడాడు. తల్లీకొడుకులిద్దరికీ కాంతారావు భాగ్యం మీద ఆశ పుట్టిoది. మెజార్టీ వాళ్ళదయ్యిoది, నేను అసహాయుడినయ్యా. ఇది తగదని నేనెంత చెప్పినా వాళ్ళు నామాట వినలేదు. నేను చెప్పినదంతా విని ఆ కాంతారావూ పట్టించుకోలేదు. ఎల్లుండే కాoతారావు కూతురుతో మావాడికి నిశ్చితార్ధం జరగబోతోంది. కనీసం ఈ సంగతయినా మీకు చెప్పాలని ఇలా  వచ్చా. ఈ నిర్భాగ్యుణ్ణి క్షమిoచగలవా సీతారాం?”  సీతారాం రెండుచేతులూ పట్టుకుని ప్రాధేయపడ్డాడు ప్రకాశరావు.

“అసలువాడికి లేనప్పుడు నువ్వేం చెయ్యగలవు చెప్పు! బాధపదకురా ప్రకాశo, వాళ్ళిద్దరికి ఆ బ్రహ్మదేవుడు ముడిపెట్టడం మర్చిపోయాడు కాబోలు. ఘటన లేనప్పుడు ప్రతిఘటన తప్పదు.  ఏది ఎలా జరగాల్సివుoటుందో అలాగే జరిగితీరుతుంది. అది అర్ధంచేసుకుని మనం మనసు సరిపెట్టుకోవాలి. మనకు వివరం తెలియక ఏవేవో ఆశలు పెంచుకుంటాము. కాని వాస్తవాన్ని భరించక తప్పదుకదా” అన్నాడు సీతారాం దీనంగా. తనని తాను ఓదార్చుకుoటూ తన మిత్రునికి కూడా ఓదార్పు నివ్వాలని.

**

ప్రకాశరావు తన అశక్తతను వ్యక్తంచేసి వెళ్ళాక రెండురోజులపాటు ఇంట్లో అందరూ ఆ విషయాన్నెత్తి మాటాడకుండా గడిపేశారు. దసరా సెలవులు కావడంతో పిల్లలందరికీ ఆటవిడుపు. తల్లికి సాయపడుతూ సునీత కూడా, మనసులో ఎంత బాధున్నా, దానిని పైకి వ్యక్తం కానీకుండా యాంత్రికంగా పనులు చక్కబెట్టుకుంటూ మామూలుగా ఉన్నట్లు కనిపించాలని ప్రయత్నిస్తోంది. కాని వైదేహి, సీతారాం భార్య, ఎంతో కాలం మౌనంగా ఉండలేకపోయింది. ఆ రోజు మధ్యాహ్నం, డైనింగ్ టేబుల్ చుట్టూకూర్చుని అందరూ టీలు తాగుతూన్నప్పుడు అంది, “ఆ పెద్దమనిషి వచ్చి, కల్లబొల్లి కబుర్లు చెప్పి, కొడుకు పెళ్ళివార్త మీ చెవినేసి వెళ్ళాడు. అక్కడితో ఆయన బాధ్యత తీరిపోయి తెరిపిన పడిపోయాడు.  కాని ఇప్పుడు మన సంగతేమిటి?”

సీతారాం నొచ్చుకున్నాడు, “మరీ అంత ఇదిగా ఆడిపోయ్యకే పాపం, వాడిని. వాడు మరీ అంత చెడ్డవాడేమీకాడు. ఐనా పాపం! కొడుకూ, భార్యా కలిసిరానప్పుడు వాడేమి చెయ్యగలడు చెప్పు! మనమింకా మాయలోపడి దేవులాడకుండా విషయం చెప్పి వెళ్ళాడని సంతోషించు. మన పుణ్యం బాగుండి పెళ్ళికి ముందే తెలిసింది కనుక సరిపోయింది, మన పిల్ల ఇలాంటి చపలచిత్తుడిని, డబ్బుమనిషిని పెళ్ళాడి సుఖంగా బ్రతకగలదనే అనుకుంటున్నావా?”

 “మీరలా ఆయన్ని వెనకేసుకు రాకండి. నాలుగు కోప్పడి పెళ్ళాన్ని కొడుకునీ దారిలో పెట్టకుండా, తగుదునమ్మా – అని, మనకీ వార్త చెప్పడానికి వచ్చాడు చూడండి, అందు కాయనని మెచ్చుకోవలసిందే!  ఇన్నాళ్ళూ కలిసిమెలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు, వీళ్ళిద్దరినీ చూసి మొగుడూ పెళ్ళాలౌతారనే అనుకున్నారు అందరూ. ఇప్పుడిలా వాళ్ళు కాదంటే, రేపు దీని పెళ్ళిచెయ్యడం మనవల్ల నౌతుదనే అనుకుంటున్నారా?”  వైదేహికి కూతురు భవిష్యత్తు అంధకారబంధురంగా కనిపించడంతో చిరాకుపడింది.

అక్కడేవున్న సునీత గతుక్కు మంది. వెంటనే, “అమ్మా! నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. కలిసి తిరిగినంతలో తప్పేమిటి? వేన్నీళ్ళు పోసినంత మాత్రంలో ఇళ్ళు కాలవు. నువ్వుచెప్పిన జాగ్రత్తలు నేనేం మర్చిపోలేదు. ఏ తప్పూ చెయ్యలేదమ్మా నేను” అంది.

“అలాగని ఎవరిని నమ్మించగలవు? తాడిచెట్టుక్రింద నిలబడి పాలుతాగినా అది కల్లే అనుకుంటుంది లోకం! అసలే లోకులు పలుగాకులు! క్షణంలో సగంకూడా అక్కరలేదు వాళ్లకి, ఏ ఆధారం లేకపోయినా తప్పుడు కథలల్లి ప్రచారం చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు, ఇంతపిసరు కూడా ఆలోచించరు. ఇక ఈపాటి ఆధారం దొరికినప్పుడు ఒదులుతారా ఏమిటి?ఇప్పటినుండీ సంబంధాలు వెతకడం మొదలెట్టండి. మనపుణ్యం బాగుంటే జుట్టు నెరిసీలోగా ఏదైనా ఒక సంబంధం కుదరొచ్చు.“ వైదేహి తన కడుపులో రగులుతున్న బాధని మాటల రూపంలో వెళ్ళగక్కిoది. 

“నాన్నా! నాకు పెళ్ళoటే రోతగా వుంది. నాకసలు పెళ్ళొద్దు, నేను చదువుకుంటా. డాక్టర్నయ్యి మంచి పేరు తెచ్చుకుంటా.”

“వైదేహీ! అనవసరంగా దాన్ని బాధపెట్టకు. ఇందులో దాని తప్పేముంది? ఇదంతా పెద్దవాళ్ళమైన మనం చేసిన  తప్పు. వాళ్ళిద్దరి స్నేహాన్నీ ప్రోత్సహించకుండా ముందుగానే అడుపులో పెడితే ఇప్పుడిలా బాధపడవలసివచ్చేది కాదు. దానికి లేనిపోని ఆశలు కల్పిoచినవాళ్ళం మనమే కదా!”

“నాన్నా! ఆడపిల్లకి పెళ్ళే పరమార్ధ మనుకున్నన్ని నాళ్ళూ ఇలాంటి ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. జీవితాన్ని సార్ధకం చేసుకోడానికి అనేక దారులున్నాయి. శ్రద్ధగా చదివి పరీక్షలు బాగారాస్తా. మంచి మార్కులు వస్తాయన్న నమ్మకముంది నాకు. నేను MBBS కి ఎంటరెన్సు పరీక్ష రాసి రేoక్సులో వస్తా.  సీటు నాకు తప్పకుండా వస్తుంది” అంది సునీత.

“అయ్యో అమ్మా! మధ్యతరగతి వాడిని, నిన్ను డాక్టర్ని చెయ్యగల స్తోమత నాకు లేదమ్మా. నిన్నుమాత్రమే కాదు, మిగతా పిల్లల్నికూడా పెంచి పెద్దవాళ్ళని చెయ్యాలిగా. కన్నబిడ్డల్ని ఒకళ్ళని ఒకలాగా, ఇంకొకళ్ళని ఇంకొకలాగా చూడకూడదుకదా! ఏమి చెయ్యగలను చెప్పు” అన్నాడు సీతాపతి.

హతాశురాలై బిక్కమొహం పెట్టుకుని తలవంచుకుని ఉండిపోయింది సునీత. అంతలో డోర్ బెల్ మోగింది.  గమ్మునలేచి, సునీత తరవాతి వాడైన రాజు చూసివచ్చి తండ్రితో చెప్పాడు, “నాన్నా! లాయర్ అంకుల్ వచ్చారు” అని.

సీతాపతి వెంటనే లేచాడు. వైదేహికూడా లేచి, ఆయనకోసం టీ చేసే సన్నాహంలో పడింది.

సీతారాం మిత్రుడిని లోనికి ఆహ్వానిస్తూ, “ఏమిటిరా లక్ష్మీపతీ! ఇలావచ్చావేమిటి? ఊరకరారు మహాత్ములు - అంటారు! ఏమిటీ  సంగతి?” అన్నాడు.

సీరియస్ అయ్యాడు లక్ష్మీపతి. “ఔను, అది నిజమే, పనుండేవచ్చా. నాతో పార్కుకి రా, నీతో కొంచెం పర్సనల్గా మాటాడాలి” అంటూ తను ముందుగా దారితీశాడు దగ్గరలోనేవున్న పార్కుకి లాయర్ సీతాపతి.  గమ్ముని చొక్కా అందుకుని తొడుక్కుంటూ అతని వెంట నడిచాడు సీతారాం.

పార్కులోని చెట్టునీడనున్న బెంచీ మీద కూర్చున్నాక లక్ష్మీపతి నిట్టూర్చి చెప్పడం మొదలుపెట్టాడు, “ రేపు పోతాడనగా ఆ ముందు రోజు నాదగ్గరకు వచ్చాడురా మన ప్రకాశం ...”

“ఏమిటీ! మన ప్రకాశం పోయాడా! ఎప్పుడు” అంటూ ఆశ్చర్యంతో, దుఃఖంతో కెవ్వుమన్నాడు సీతారాం.

లక్ష్మీపతి, ప్రకాశరావు, సీతారాం కాలేజీ రోజులనుండీ మంచి మిత్రులు, పైగా ముగ్గురూ హైదరాబాదులోనే స్థిరపడడంవల్ల ఆనాటి స్మేహబంధం మరింతగా పెంచుకున్నవాళ్ళు.

“ఏమిటీ! వాడు పోయినట్లు నీకు తెలియనే తెలియదా? ఎంతకైనా తగినవాళ్ళే ఆ తల్లీకొడుకులు! నీకు వాళ్ళు కబురుకూడా పంపలేదన్నమాట! “మాస్సివ్ హార్టు ఎటాక్“ అన్నారు డాక్టర్లు. కాదని నాకు అనుమానo! ఆరోజు వాడుపడ్డ ఆవేదనచూసిన నాకది ఆత్మహత్యేమో నన్న అనుమానం వస్తోంది. పోయేoదుకు ముందురోజు వాడు నాదగ్గరకు వచ్చాడు. భార్య, కొడుకు చేసిన  నిర్వాకమంతా చెప్పుకొచ్చాడు. నీ కూతురికి అన్యాయం జరిగిందని వాడు చాలా ఫీలయ్యాడురా!  చివరకి  అన్నాడు  “బంగారుతల్లి సునీత నాకు కోడలౌతుందని ఆశపడ్డా! కాని అది జరగలేదు. కనీసం ఆమెను నేను నా కూతురుగా భావించి, నాస్వార్జితంలో కొంతవాటా ఆమెకు ఇవ్వాలనుకుంటున్నా. అది నీవల్ల జరగాలి. నేనింక ఏమొహంపెట్టుకుని వెళ్ళి వాడిమొహం చూడగలను చెప్పు” అంటూ ఈ అట్టపెట్టె నాచేతిలో ఉంచాడు. ఇందులో కరెన్సీ రూపంలో డబ్బు ఉందిట. ఈడబ్బు వివరాలున్న ఉత్తరం, వాడు స్వహస్తంతో రాసినది కూడా దీంట్లోనే ఉందన్నాడు ప్రకాశం.  నువ్వుకనక కాదంటే తను రౌరవాది నరకాల పాలైపోతానని నీకు చెప్పమన్నాడు. ఇప్పుడు నేను నీకు చెపుతున్నా, వాడి ఆత్మశాంతి కోసమైనా సునీత ఈ డబ్బు తీసుకోక తప్పదు. ఇదిగో తీసుకెళ్ళి నీ కూతురుకియ్యి” అంటూ ఆపెట్టెను సీతారామ్ కి అందించాడు లక్ష్మీపతి.

“నువ్వలా అంటూంటే నేనింకేమి మాటాడగలను” అంటూ కారే కన్నీటితో, ఒణికేచేతులతో ఆ పెట్టిని అందుకున్నాడు సీతారాం.

                                          

**

అకస్మాత్తుగా పేజర్ మ్రోగేసరికి, గతాన్ని గురించి ఆలోచిస్తూ పరాకుగావున్న సునీత ఉలికిపడింది. ఇలా, సర్జన్ ఎవరైనా “ఆఫ్ డ్యూటీ”లో ఉన్నప్పుడు హాస్పటల్ నుండి పేజర్ వచ్చిందంటే, అదేదో యమర్జన్సీ కేసనే అర్ధం చేసుకోవాలి. వెంటనే లేచి ఆసుపత్రికి వెళ్ళే సన్నాహంలో పడింది డాక్టర్ సునీత. వీలైనంత తొందరగా కారు డ్రైవ్ చేసుకుంటూవెళ్ళి ఆసుపత్రిని చేరుకుంది. ఆమెకోసమే కనిపెట్టుకునివున్న ఆసుపత్రి సిబ్బంది ఆత్రంగా ముందుకువచ్చారు.

తాగి డ్రైవ్ చేస్తున్న ఒక వేన్ డ్రైవర్ అకస్మాత్తుగా రాంగ్ రూటులోకి వచ్చి, ఒక స్కూలు బస్సుని “ఢీ” కొట్టి పడేశాడు. పదేళ్లకు కొంచెం అటూ, ఇటూ వయసున్న పిల్లలతో నిండివున్న ఆబస్సు పక్కకి పడిపోడంతో చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. పిల్లలు కొంతమంది బస్సుక్రిoద పడి నలిగిపోయారు. నలుగురు పిల్లలు మరణించారు. చాలామందికి గాయాలయ్యాయి. అందులో ఒకపిల్ల ఒళ్లంతా గాయాలతో ప్రాణావశిష్టంగా ఉంది. చాలా రక్తంపోయింది ఆ పిల్లకి.  వెంటనే తగిన ట్రీట్మెంట్ జరిగితే ప్రాణం నిలబడవచ్చు.

“ఫస్టు ఎయిడ్ చేసి, బ్లడ్డుగ్రూప్ టెస్టు చేసి, X - rays తీసి  అంతా సిద్దంచేసి ఉంచాము డాక్టర్! ఆ అమ్మాయిది రేర్ బ్లడ్డుగ్రూప్. (-AB)! బ్లడ్డు బ్యాంకుకి ఫోన్ చేస్తే, ఆ గ్రూప్ లేదన్నారు. ఎవరైనా డోనర్లు ఉంటే తీసుకురమ్మని స్కూల్ వాళ్లకి ఫోన్ చేశాము.”

“ఇంటికి ఫోన్ చేశారా? సాధారణంగా తల్లితండ్రులలో ఎవరో ఒకరి బ్లడ్ సరిపోవచ్చు”  అంటూ డా. సునీత ఆ పాప రిపోర్టులన్నీ తీసి చూసింది. ఆ తరవాత నేరుగా ఆమె డ్రెస్సింగ్ రూములోకి నడిచింది. డ్రెస్ మార్చుకుని ఆపరేషన్ ధియేటర్లోకి వెళ్ళింది. “ఆపరేషన్ ఇన్ ప్రోగ్రెస్” అన్నదానికి గుర్తుగా ఆపరేషన్ ధియేటర్ గుమ్మం మీదున్న రెడ్లైట్ వెలిగింది.

**

ఆరోజు పీడియాట్రీషియన్ డాక్టర్ సునీత చాలా బిజీగావుంది. చల్లని చెయ్యనీ, ఆపరేషన్ ఎంత గడ్డుదైనా ఆమె చెయ్యిపడితే తప్పకుండా సక్సెస్ ఔతుందనీ పేరు రావడంతో ఆమెకు పేషంట్ల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఆ రోజున, రోజూకంటే ఎక్కువమంది పేషంట్లు ఉన్నారు. పసిపిల్లల ఏడుపులతో కోలాహలగావుoది వెయిటింగ్ హాల్.  రొటీన్ గా పేషంట్లను చూస్తోంది డాక్టర్ సునీత.  పేషంట్లని ఒకరి తరవాత ఒకరినిగా పిలుస్తోంది ఆమెకు సహాయకురాలిగావున్న నర్సు.

ఒక పేషంటు వెళ్ళిపోగానే వరసలోవున్న తరవాతి పేషంట్ ఫైల్ల్ ముందుంచుకుని చూస్తూన్న సునీతకు ఎవరో తనను పేరుపెట్టి  పిలిచినట్లై తలెత్తి చూసింది. ఎదురుగా సురేశ్ నిలబడివున్నాడు.

“సునీతా! నేను నీకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను. నా కూతురికి ట్రీట్మెంట్ నువ్వు చేస్తున్నావని తెలిసినప్పుడు నేను చాలా భయపడ్డాను. పాతజ్ఞాపకాలు మనసులో ఉంచుకుని, నా కూతురుకి నువ్వేమైనా హానిచేస్తావేమోనని చాలా భయపడ్డాను నేను.  కాని నువ్వు ఆపరేషను సక్సెస్ఫుల్గా చెయ్యడమేకాకుండా సరైన సమయానికి నీ రక్తం కూడా ఇచ్చి నా కూతుర్ని బ్రతికించావు. అది అసలు నీకూతురు కావలసినదేగాని కొద్దిలో తప్పిపోయింది. కాని ఇప్పుడు నువ్వు నీ రక్తమిచ్చి దానికి పునర్జన్మనిచ్చావు. ఇప్పుడు దానిలొ ఉన్నది నీ రక్తమే! డాక్టర్ సునీతా!“హాట్సాఫ్ టు యూ!” నీవు చేసిన మేలు నేను ఎన్నటికీ మర్చిపోలేను” అన్నాడు. అంత చక్కగా మాటలు కూర్చి మాటాడినందుకు మనసులో తనను తాను అభినందించుకున్నాడు సురేశ్. అతని కళ్ళలో గర్వం తళుక్కుమంది.'

“జీవితం భగవంతుడిచ్చిన వరం! దాంపత్యజీవితం అన్నది  అందులోని ఒక చిన్న భాగం మాత్రమమేగాని మొత్తం జీవితం కాదు. వేలుకి “గాంగ్రీన్” వచ్చిందని ఎవరూ పీకకోసుకోరు. నా జీవితంలోoచి నువ్వు ఏనాడో నిష్క్రమిoచావు. ఇప్పుడు నువ్వు నా పేషంటుకి నాన్నవి మాత్రమే! నువ్వు నాకు గతవిషయాలు గుర్తుచెయ్యాలనుకోకు, వృధా శ్రమ! దానివల్ల నాలో ఏ స్పందనా రాదు” అనుకుంది డా. సునీత మనసులో.

తలెత్తి అతనివైపు చీదరగా చూసింది డాక్టర్ సునీత. “మీ ధన్యవాదాలతోగాని, మెప్పూమెహర్బానీలతోగాని నాకు పనిలేదు. ఈ ఆసుపత్రి గడపదాటి నా ఎదుటికివచ్చి, నా వైద్యాన్ని ఆశించిన ఏ బిడ్డనైనా నా స్వంతబిడ్డగా భావించి, మనసారా ఆబిడ్డ శ్రేయం కోసం పాటుపడడం నా ధ్యేయం. అది నా విద్యుక్త ధర్మం కూడా! ఆ బిడ్డ మామూలుస్థితికి వచ్చేవరకూ ఏమాత్రం ఏమరకుండా, నాకున్న వైద్యవిజ్ఞానమంతా ఉపయోగించి కృషిచెయ్యడం నా కర్తవ్యం. దానికోసమని పగలూ రాత్రీ అన్న భేదం లేకుండా పనిచెయ్యడం నా వృత్తిధర్మం. మీరెవరో నాకు గుర్తులేదు. ఇక మీరు వెళ్ళవచ్చు” అని అతనికి చెప్పి, నర్సువైపుకి తిరిగి “నెక్టు” అని, ఆపై, వరుసక్రమంలో ఉన్న తరువాతి పేషంటు తాలూకు ఫైలు తెరిచి చూడసాగింది డాక్టర్ సునీత.

డాక్టర్ సునీత మాట అందిపుచ్చుకుని, తరవాతి పేషంట్ ని  పిలవడానికి వెళ్ళింది నర్సు.

*****

 

bottom of page