top of page

సంపుటి  4   సంచిక  4

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

అదన్నమాట సంగతి

పెళ్లివారమండి... మేము పెళ్లివారమండి....

Jyothi Valaboju

జ్యోతి వలబోజు

పందిట్లో పెళ్లవుతున్నది.... కనువిందవుతున్నది...

పెళ్లివారమండి... మేము పెళ్లివారమండి...మా బాధ వినేదెవరండ?

ఇది సినిమా పాటే కాని నాడు నలభై యాభై ఏళ్ల క్రింద పాడినా, ఇప్పుడు పాడినా రెండూ వాస్తవ సత్యాలే. కాని అప్పుడ ఒక రకం బాధలు.. ఇప్పుడు మరో రకపు కష్టాలు. 

ఇంట్లో పెళ్లికెదిగిన కొడుకు లేదా కూతురుంటే తల్లిదండ్రులకు ప్రతీ గడియలో మెదిలే ఆలోచన వాళ్లకు పెళ్లి చేయాలి. అప్పట్లో అంటే నేను పెళ్లీడు వయసు అంటే పదహారు దాటగానే చదువు సంగతి పక్కనపెడితే పెళ్లి సంబంధాల వేట మొదలయ్యేది. అప్పటికి పదో క్లాసు పూర్తవుతుంది కాబట్టి ఆడపిల్లకు ఆ మాత్రం చాలులే. ఉద్యోగాలు చేయాలా? ఊళ్లేలాలా? అనేవారు. అప్పుడంతా అబ్బాయి, అతని తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు .. వాళ్లదే రాజ్యం. అబ్బాయిలను అడిగేవారేమో కాని అమ్మాయిలను నీకు నచ్చాడా అనే ఆచారం, సంప్రదాయం అస్సలు లేదని నా నమ్మకం. అంటే నా స్వానుభవమ్మీద చెప్పిన మాటన్నమాట..  తల్లిదండ్రులు, ఇంటికి పెద్దవాళ్లు, ఆడపడుచులు మొదలైనవారే ఈ సంబంధాలు వాకబు చేయడం. ఏ పెళ్లికెళ్లనా, పేరంటానికెళ్లినా, అసలు ఏ గుడికెళ్లినా కూడా ఈ సంబంధాల వేటే.. అమ్మాయిలైతే ఎంచక్కా పరికిణీ వోణీలు, చీరలు కట్టుకుని అందంగా ముస్తాబై వచ్చేవారు. అసలే అందమైనవారు, ఇంకా అందంగా కనిపించేవారు. అబ్బాయిలకంటే వాళ్ల అమ్మలకే ఆత్రుత, ఆరాటం ఆ అందమైన అమ్మాయిని తన కొడుకుకు పెళ్లాంగా కాదు తనకు కోడలిగా తీసుకురావాలని. అటువైపు బంధువులని కదిలించి, కథను ముందుకు నడిపించేవారు. తమకు స్కూలుకెళ్లే పిల్లలున్నా సరే తమకు తెలిసినవారింట్లో పెళ్లీడొచ్చిన అమ్మాయికాని, అబ్బాయికాని ఉన్నారంటే వాళ్లకు సంబంధాలు చూసేస్తారు. ఒకవైపు ఘనంగా పెళ్లి జరుగుతోంటోంది. మరోపక్క ఈ ఇనస్టెంట్ పెళ్లిచూపులు జరిగిపోయేవి. అదృష్టవంతులు ఎవరో కొందరు పెళ్లికొడుకులు.. కాదు కాదు పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలు, అమ్మాయిలు ఓరగా చూసుకుంటూ ఉండేవారు. మరోవైపు పెద్దవాళ్లు కూడా ఇదే పని మీద ఉండేవాళ్లు. ఒక అమ్మాయికాని అబ్బాయికాని నచ్చిందనిపిస్తే వెంటనే ఎవరో ఒకరిని పురమాయించి వాళ్ల వివరాలు కనుక్కుంటారు. ఇంకా బాగా నచ్చితే పెళ్లిచూపులు ఏర్పాటు చేసేసి , ఇంకా ఇంకా నచ్చేస్తే పెళ్లి కూడా కానిచ్చేస్తారు. ఈ నచ్చడాలతో పాటు కట్నకానుకలు, లాంఛనాలు వగైరాలు కూడా ఉంటాయండోయ్..  అవి ఎవరి తాహతుకు తగినట్టుగానే కాకుండా ఎక్కువ అడిగేవాళ్లు బోల్డుమంది ఉంటారు. ఆ వచ్చిన కట్నంతోనే పెళ్లి ఖర్చులు, ఇంట్లో ఖర్చులు, వాళ్లు పెట్టుకోవలసిన కట్నాలు, కానుకలు కూడా కొనేస్తారు. అంటే... పెళ్లికి ముందు కట్నం డబ్బులు అందితే వాటితో పని కానిస్తారు. లేదా తర్వాత ఇస్తాం అని కొంటారన్నమాట. 

ఇక మగపెళ్లివారు చెప్పినట్టుగా అమ్మాయివాళ్లు అన్ని పెట్టుపోతలు, మర్యాదలు చేయాలన్నమాట. అబ్బాయి కుటుంబసభ్యులు మాత్రమే కాకుండా వాళ్ల తరపున వచ్చినవాళ్లందరినీ చాలా మర్యాదగా చూసుకోవాలి. ఏ ఒక్కరినుండి కంపెయిన్ రాకూడదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒకోసారి చిన్నా, పెద్దా మనస్పర్థలు, గొడవలు రాక మానవు. కొన్ని సర్దుకుపోతాయి. కొన్ని అలా కొనసాగుతూ ఉంటాయి. సినిమాల్లో చూస్తుంటాం కదా.  కట్నం డబ్బులు ఇవ్వలేదని ఎత్తిపొడుస్తూ అవమానించే భర్తలు ఉంటారు. అలాగన్నమాట. పెళ్లి తర్వాత అంటే ఎవరదృష్టం వారిది. మంచి భర్త దొరకడం అమ్మాయి అదృష్టమని అంటారు కాని గుణవంతురాలు, అర్ధం చేసుకుని తోడుగా ఉంటూ, భర్తని అత్తమామలను ప్రేమగా చూసుకునే ఇల్లాలు దొరకడం అబ్బాయి అదృష్టమే. లేకుంటే ప్రతీరోజూ రణరంగమే... ఇప్పట్లా కాస్త పెద్ద గొడవకే నువ్వెంత అని విడాకులు తీసుకునే కాలం కాదు. మరీ భరించలేనంత అయితే తప్ప విడాకులు తీసుకునేవారు కాదు. సో జీవితాంతం సర్దుకుంటూ, గొడవపడుతూ, గొణుక్కుంటూ సంసారం ఒక సంగీతం అంటూ గడిపేస్తారు. అయినా రోజూ తీపి తింటే వెగటు కలగదా. అప్పుడప్పుడు కారం రుచి కూడా తగలాలి ఎవరికైనా..

ఇక ఇప్పటి విషయానికొస్తే పైన చెప్పినట్టి విషయాలు కాని, సంఘటనలు కాని చాలా అరుదుగా మారిపోతున్నాయి. పెళ్లి అంటే ఒక పెద్ద తంతు. పెళ్లీడు వయసు కూడా చాలా ఎక్కువైంది. చదువులు పూర్తిచేసి, ఉద్యోగాలు చేసి, సంపాదించి సెటిల్ అయ్యాకే పెళ్లి అంటున్నారు. పెళ్లి రెండు మూడేళ్లు ఎంజాయ్ చేసాక  పిల్లలంటారు. పెళ్లీడు అంటే అమ్మాయిలకు పాతిక దాటాలి ముప్పై అయినా పర్లేదు. అబ్బాయి అయితే ముప్పయి దరిదాపుల్లోకాని దాటాక కాని పెళ్లిసంబంధాలు చూసే వయసు రాలేదంటున్నారు. ముందు కెరీర్ సెటిల్మెంట్ ముఖ్యం అమ్మాయిలకు, అబ్బాయిలకు. వాళ్ల తల్లిదండ్రుల పెళ్లిగోల అస్సలు పట్టించుకోరు. లేదా తమ కొలీగ్, ప్రెండ్ అంటూ ప్రేమిస్తారు. కొందరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే మరికొందరు ఎదిరించి , ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకుంటున్నారు. కొందరు ఒకరినొకరు అర్ధం చేసుకుని కలిసి సుఖంగా ఉంటే, మరి కొందరు పెళ్లికిముందు ఉన్న ప్రేమలు, దోమలు కొట్టుకుపోయి తమ తమ ఇగోలతో మాటలతో కొట్లాడుకుంటూ ఉంటారు. మరీ హద్దు దాటితే విడాకులు. ఇవి తరచూ వినపడుతున్నాయి.  ఎవరైనా మా అబ్బాయి పెళ్లి అంటే మీరు చూసారా? వాడే చూసుకున్నాడా అని ఎటువంటి మొహమాటం లేకుండా మొహం మీదే అడిగేస్తున్నారు. 

మరో మాట కూడా మరచిపోకుండా చెప్పాలండోయ్.. ఇవాళ్రేపు పెళ్లిళ్లు డిజైనర్ పెళ్లిళ్లుగా మారాయి. ఈ సినిమా స్టార్లు, బిజినెస్ మాగ్నెట్లు, బడాబాబులు తమ పిల్లల పెళ్లిళ్లు పోటీ పడుతూ మరీ లక్షలు కాదు కోట్లుకు కోట్లు ఖర్చుపెడుతున్నారు. పెళ్లివారి చీరలు, కుర్తా పైజామాలు, నగలతోపాటు పూలకు కూడా కోట్లు పెడుతున్నారు. తొడుక్కునేవి కాదు . లెక్కపెట్టే పేపర్ కరెన్సీల కోట్లు. ప్రత్యక్షంగా అయితే సామాన్యులకు అనుమతి ఉండదు కాని ప్రతీ న్యూస్ చానెల్స్ లో లైవ్ పెట్టేస్తుంటారు. అవతలివాళ్లేదో ఉద్ధరించినట్టు. అందరిలా పెళ్లి చేసుకున్నారు. బలిసినోళ్లు కాబట్టి నోట్లను చిత్తుకాగితాల్లా వాడేసుకుంటున్నారు.  కాని మామూలు వాళ్లు కూడా ఏం తక్కువ తినలేదు. ఎంత భారీగా చేస్తే అంత గొప్పగా ఫీలవుతున్నారు. లక్షల రూపాయిలను అలా ఖర్చుపెట్టేస్తున్నారు. ఖరీదైన హాలు, అలంకరణ, భోజనం.. ఒక్క మాట చెప్పుకోవాలి. వాళ్లలా దుబారా ఖర్చు పెడుతున్నారని అనుకుంటాం కాని ఈ రాచరికపు పెళ్లిళ్ల మూలంగా ఎందరికో ఉపాధి లభిస్తోంది. పెళ్లి పందిరి, బాజాలు, పూల అలంకరణ, భోజనం వగైరా.. వగైరా.. అసలు ఇవన్నీ చూసి చూసి వావ్ అనకుండా వామ్మో అంటూ చివరికి వెగటు పుట్టిస్తుంది. వాళ్ల సంపాదనే అయినా అదే డబ్బుతో ఎందరో పేద అమ్మాయిలకు చదువులు , పెళ్లిళ్లు చేయగలరు. వృద్ధులు, చిన్నారులకు సాయం చేయవచ్చు. డబ్బులేకుండా అవస్ధ పడేవాళ్లు ఎందరో మన చుట్టూనే ఎందరో కనిపిస్తారు. 

సరే ఖర్చుపెట్టేవాళ్లు పెడుతున్నారు. వచ్చేవాళ్ల సంగతి... పెళ్లిపెద్దకు తగినట్టుగా పెళ్లి కార్డులు కూడా భారీగా, అతిభారీగా ఉంటాయి. అలాంటి పెళ్లిళ్లకు వెళ్లాలంటే చాలా డాబుసరిగా, ఖరీదుగా కనపడాలి. ఇక అక్కడంతా మెరుపులు, మెరుపులు, తళతళలలే.. ఎక్కడ చూసినా డిజైనర్ లేదా జరీ పట్టుచీరలు. లెహంగా డ్రెస్సులు, వాటికి తగినట్టు నగలు. మీకీ సంగతి తెలుసా.. తెలిసే ఉంటుంది.. ప్రస్తుతం చాలా పెళ్లిళ్లలో సగం బంగారం, సగం కాకిబంగారం నగలు వేసుకుంటున్నారు. గుంపులో గోవిందలా ఆ విషయం ఎవరూ గమనించరు. గమనించినా గోల చేయరు.  పోనీలో ఎన్ని నగలని కొంటారు అంటారు. వాళ్లది అదే బాపతు కాబట్టి.. పెళ్లి జరుగుతుంటే చుట్టాలకంటే ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పందిరి చుట్టూ గుమిగూడతారు. ఇక వచ్చిన అతిధులేం చేయాలంటా. వాళ్ల వీపులు చూస్తూ చెక్క భజన చేయాలి. లేదా ఎప్పుడైనా పందిరి దగ్గరున్న గుంపులోని వారు జరిగితే పెళ్లి తంతేదేమైనా కనిపిస్తుందేమో అనుకుంటాం. ఇలాటి వాటికి కూడా ఒక పరిష్కారం ఉంది. పెళ్లి జరుగుతున్న హాలులో పెద్ద గోడలాంటి టీవీ స్క్రీన్ అమర్చి పందిట్లో పెళ్లిని ప్రసారం చేస్తుంటారన్నమాట. వచ్చిన అతిధులు ఎంచక్కా పెళ్లికూతురు, పెళ్లి కొడుకును, పంతులు చేసే తంతును చూస్తూ ఉండొచ్చు. సరే ఆకలేస్తుందని తినడానికి వెళితే అక్కడ కూడా టీవీ అమర్చి ఉంటుంది. పెళ్లి చూస్తూ భోజనం కానివ్వొచ్చు. 36 ఏళ్ల క్రితం నా పెళ్లిలో మా నాన్న ఇలా పెళ్లి తంతు చూడడానికి టీవీలు పెట్టిస్తే అదో వింతగా మారింది. ఇప్పటికీ ఆ విషయం చర్చినీయాంశమే. అప్పుడు టీవీ చానెల్స్ చాలా తక్కువగా ఉండేవి..   మరో విషయం పెళ్లికి రాలేనివారికి , వేరే ఊర్లలో, దేశాల్లో ఉన్నవారు పెళ్లి చూడడానికి లైవ్ టెలికాస్ట్ కూడా ఉంటుంది. ఇది బావుంది కదా..అమెరికాలోని ఇంట్లో కూర్చుని అనకాపల్లిలో జరుగుతున్న పెళ్లిని, వచ్చిన బంధువులందరినీ చూడొచ్చు. ఇతరత్రా ఈ సౌకర్యం ఉండదు కదా. మరో విషయం మర్చిపోకుండా చెప్పాలి. కొన్నేళ్ల క్రితం టీవీలో ఆధివారం 11 నుండి 12 వరకు మహాభారతం సీరియల్ వచ్చేది. అది ఎంత పాపులర్ అంటే ఆ సీరియల్ వచ్చే సమయంలో రోడ్లన్నీ కర్ఫ్యూ పెట్టినట్టుగా ఖాళీగా ఉండేవి. పెళ్లిళ్లు, పేరంటాలు కూడా ఖాళీ. సీరియల్ ఉన్నంతసేపూ అందరూ టీవీల ముందే. దానికంటే పెళ్లి ముఖ్యం కాదన్నమాట. అందుకే పెళ్లిళ్లలో టీవీలో మహాభారత్ సీరియల్ పెట్టేవాళ్లు. అలా ఈ టీవీ సీరియల్ చూసే అవకాశం ఉంది అని పెళ్లి కార్డులో అచ్చొంతించేవారు.

భోజనాల సంగతి కొస్తే ... ఇది కూడా రూటు మార్చుకుంది. ఎన్ని ఎక్కువ రకాలు పెడితే అంత గొప్ప. ఎక్కువ అనే తప్పు రుచి ఎలా ఉంది. తినేవాళ్లకు నచ్చుతుందా లేదా అన్నది అంత ముఖ్యం కాదు. మేము ఇన్ని రకాలు పెట్టామా లేదా. అన్నది వాళ్లకు ముఖ్యం. కాని అందరూ ఇలాటివాళ్లే కాదు.  వరుసగా ఐదారు రుచి చూసేసరికే కడుపు నిండిపోతుంది. మిగతావన్నీ అల నాలికకు తగిలించి పక్కన పెట్టడం. ఇలా ఎంతో ఆహారం వృధా అవుతోంది. కాని కొందరు మహానుభావులు. తమ ఫంక్షన్ లో ఆహారం మిగిలింది అంటే వాటిని తీసుకొచ్చి పేదలకు, రోడ్లమీద పడుకున్నవారికి పెడతారు. 

చివరిగా చెప్పుకోవలసింది రిటర్న్ గిఫ్ట్. పెళ్లి కెళితే వధూవరులకు గిఫ్ట్ ఇవ్వడం ఆనవాయితీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వచ్చిన అతిధులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కంపల్సరీ ఆచారం అయింది.. అందులో కూడా చిన్నా పేద్దా తేడాలున్నాయనుకోండి.. 

 

ఇలా తరాలు మారినా... అంతరాలు మారునా... కొన్ని మారతాయి. కొన్ని మారవు . అంతే...

bottom of page