top of page

సంపుటి  5   సంచిక  1

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

తేనెజాబిలి

SeshasayiVemuri.JPG

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి

“పద్ధతైన పిల్ల, పైగా ఉద్యోగస్తురాలు, ఏ వంకలూ పెట్టకుండా సరే అనరా!” అని అందరూ అంటే, అమ్మాయిని చూసి ‘బానే ఉంది, ఇంతకీ పేరేమిటి?’ అని అడిగాడు మిరియం.

 

‘మల్లిక’ అనగానే మారు మాట్లాడకుండా, సరే! అన్నాడు.

 

మిరియాన్ని సంస్కృతంలో మరీచి అంటారు. 

 

అన్న హితవు లేనివారికి  మిరియం నలిపి,  నెయ్యిలో   వేయించి, మొదటి ముద్దలో పెడితే గొంతు గరగరలు పోయి, గాత్ర శుద్ధయ్యి,  అన్నహితవు కలుగుతుంది. ఈ వంటకాన్ని ఘృతమరీచి అంటారు. 

 

ఆ వంటకం బాగా ఇష్టపడే ముద్గసూపం, తన  కొడుక్కి,  "మిరియం"  అని పెడితే మరీ, జనాలు ఏడిపిస్తారని అందంగా పెట్టిన పేరు మరీచి. 

 

మరీచుడిని ముద్దుగా అందరూ ఇంట్లో మిరియం అని పిలవటం వల్ల అది ఆనోటా ఈ నోటా పాకి చివరకు రికార్డుల్లో మాత్రమే మరీచిగా, లౌకికంగా మాత్రం మిరియంగా సమాజంలో చలామణీ అవుతోంది.

 

దీన్నే హిందీలో కాలా మిర్చీ అంటారు.  

 

నిజం చెప్పొద్దూ, కుర్రాడు నిజంగానే మిర్చిలా ఉంటాడు. 

 

సహజంగా భావుకుడూ, కవీ అయిన మిరియానికి పెళ్ళి అయిన తరువాత, భార్యతో కలిసి కొన్ని రోజులు హనీమూన్ పోవాలనే కోరిక, పెళ్ళి కాకముందు నుంచీ ఉంది. అద్భుతమైన ప్రదేశాలు చూస్తూ, కవితాత్మకంగా రోజులు గడపాలని ఎన్నో కలలు కన్నాడు.

 

అదే కోరిక కాబోయే భార్యకి చెప్పి ఎక్కడకెడదాం? అన్నాడు.

 

ఆ పిల్ల భక్తిగా కళ్ళుమూసుకుని ఇంకెక్కడికి? తిరుపతి వెడదాం అంది. 

 

అదివిన్న మిరియం, నేను చెప్పేది, హనీమూన్ కి, తీర్థయాత్రకి కాదు అన్నాడు.

 

నేను చెప్పేదీ అదే, మా ఇంట్లో హనీమూన్ అంటే అక్కడికి వెళ్ళడమే అలవాటు అని చెప్పింది.

 

సమాధానం విన్న మిరియం మొహం, వడియంలా మాడిపోయింది.

 

ఓన్లీ వెళ్ళడమేనా, తలనీలాలు కూడా ఇస్తారా? అనుమానంగా అడిగాడు.

 

అవునండోయ్!  అలా చేస్తే ఇంకా మంచిది. మీరు నిజంగానే చాకు.  ఈ ఐడియా మా వాళ్ళకు ఇంతకు ముందు రాలేదు. ఎంచక్కా పుష్కరిణిలో స్నానం చేసి, తిరునామం పెట్టుకుని, పట్టుపంచెలో మీరూ, కచ్చాబోసిలో నేనూ వెడితే "అబ్బా! ఊహించుకుంటేనే పులకరింత వస్తోంది", తన్మయంగా అంది.

 

పెళ్ళిచూపులనాడు ‘మా అమ్మాయి అమాయకం, మీరే చూసుకోవాలి’ అన్నారు కానీ, మరీ ఇంత అమాయకమనుకోలేదు మిరియం. 

 

కానీ! అప్పటికే తాంబూలాలు తీసుకుని, కార్డులు కొట్టి పోస్టు చేయడం కూడా అయిపోయింది. అందుకనీనూ, వేరే ఆలోచన రానీయక  హనీమూన్ అంటే ఏమిటో కౌన్సెలింగ్ మొదలెట్టాడు.

 

అంతా విన్న మల్లిక అయిష్టంగానే సిమ్లా, కులూ మనాలీ, ఢిల్లీ, ఆగ్రా పోవడానికి ఒప్పుకుంది.

 

ఇద్దరూ కలిసి పెళ్ళయిన తరువాత మొదట ఢిల్లీ వెళ్ళి, స్వామినారాయణ్ టెంపుల్, లోకల్ సైట్ సీయింగ్ లో అన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూసి షాపింగ్ కూడా పూర్తి చేశారు. 

 

ఒద్దన్నా వినకుండా, షాపింగ్ లో మల్లిక పాలరాతితో చేసిన పచ్చళ్ళు చేసుకునే రోలూ, అందులోనికి గూటం కొంది. అక్కడ చపాతీ చేసే పెనాలు కూడా ఆమెకు నచ్చాయి కానీ, మిరియం మోయడం కష్టం అన్నాక ఊరుకుంది.

 

అంతా అయ్యాక, ఎలా ఉంది? ఢిల్లీ అని అడిగాడు. 

 

"వేడిగా ఉంది". 

 

అదికాదు. "ఇక్కడ ఏం నచ్చింది? ఏది అద్భుతం అనిపించింది?"

 

"రెడ్ ఫొర్ట్, పార్లమెంటు".

 

"గుడ్! వాటిలో ఏది అద్భుతం అనిపించింది?"

 

అప్పట్లో అంతంత పెద్ద పెద్ద కోటలు కట్టేవారు కదా!  రోజూ అంత దొడ్డి ఎలా ఊడ్పించే వారా అని ఆశ్చర్యం వేసింది? రెండు వేళ్ళతో గడ్డం ఆశ్చర్యంగా నొక్కుకుంటూ అంది.

 

"అదా నీ ఆశ్చర్యం?" అంటూ భోరుమన్నాడు మిరియం. 

 

"ఎలా ఊడ్చేవారంటారూ?" భర్తని ధర్మం సందేహం మళ్ళీ అడిగింది.

 

"కోటలో చాలామంది ఉంటారు కదా, రాజు, రాణీలతో సహా అందరూ పొద్దుటే లేచి, తలో చీపురూ తీసుకుని ఊడ్చేవారు". 

 

ఏదో ఒకటి చెప్పకపోతే వదిలేలా లేదని నోటికొచ్చింది ఊహించి చెప్పాడు.

 

అంతేనా ఇంకా ఏమైనా ఉందా? ఆశ చావక మళ్ళీ అడిగాడు.

 

"ఉంది, ఇక్కడ అందరూ రొట్టెలే తింటారు కదా, అంతమంది రొట్టెలు తినడానికి పొద్దస్తమానూ చపాతీలు వత్తుకుని, కాలుస్తూ కూర్చుంటే వీళ్ళకి ఆఫీస్ కి వెళ్ళడానికి టైం ఎలా సరిపోతుందండీ?" మరో అద్భుతమైన ప్రశ్న వేసింది.

 

"చిన్నప్పటినుంచీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చేస్తారు. అందుకే!  ఎవరి రొట్టెలు వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడల్లా వత్తేసుకుంటారు" అన్నాడు.

 

మరికాసేపు అలాంటివెన్నో ప్రశ్నలకు సమాధానాలిచ్చిన తర్వాత -"మల్లికా! ఒక విషయం అడుగుతా నిజం చెప్పు, నువ్వు నిజంగా డిగ్రీ పాసయ్యావా?" అనుమానంగా అడిగాడు. 

 

"అదేంటి! అలా అడుగుతున్నారు? అనుమానం అయితే చెప్పండి, ఇప్పుడే నా మార్క్స్ లిస్టులు చూపిస్తా" అని, క్లౌడ్ లో పెట్టిన సర్టిఫికెట్లు అన్నీ డౌన్ లోడ్ చేసి చూపించింది. 

 

అన్నీ సెంట్లే. అది చూసిన మిరియం, ఇంటికెళ్ళిన వెంటనే తన సర్టిఫికెట్స్ అన్నీ మల్లిక కి కనిపించకుండా దాచేయాలి అనుకున్నాడు. ఆమెకొచ్చిన మార్కులు  అలా ఉన్నాయ్.  తను కలలో కూడా ఊహించలేడు. 

 

"మరి ఉద్యోగం నిజంగానే చేస్తున్నావా? "అని మళ్ళీ ఇంకో సందేహం అడిగాడు. 

 

"మీరింత అనుమానం మనిషి అనుకోలేదు. ఉండండి నా శాలరీ స్లిప్ చూపిస్తా.... " అంటూ భోరుమని కళ్ళనీళ్ళు పెట్టుకోబోయింది. 

 

కంగారు పడిన మిరియం, లేదు చిన్నా! అనుమానం కాదు, ఇంత పరిశీలనా శక్తి, చక్కటి ఉద్యోగం ఉన్న పిల్లవి, ఇప్పటి వరకూ ఈ ప్రదేశాలు ఎందుకు చూడలేదా అనే సందేహంతో అడిగా! అంతే!  ఈ కాలంలో నీలాంటి వాళ్ళు అరుదు. నిజంగా నువ్వు గ్రేట్" అని సర్ది చెప్పాడు.

 

ఆ మాటన్నాక, సర్దుకుని.... చదువుకున్నంత కాలం స్కూలు, ట్యూషన్ తప్ప ఎక్కడికీ వెళ్ళలేదు. కార్పొరేట్ స్కూల్స్ లో అలా వెళ్ళటం కుదరదు. ఆదివారాలు కూడా మాకు సెలవలు ఉండేవి కాదు. ఒకవేళ ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఇంట్లో ఉంటే అమ్మకి వంట పనిలో సాయం చేసేదాన్ని. అందుకే నాకు అన్ని పనులూ వచ్చు. అంది.

 

నీ క్లాస్ పుస్తకాలు కాకుండా వేరే  ఏవైనా పుస్తకాలు చదివావా? అదే బుక్ రీడింగ్ హేబిట్ లాంటిది ఉందా అన్నాడు.

 

చదివా, చాలా చదివా అని గర్వంగా చెప్పింది.

 

రియల్లీ, వెరీనైస్, ఏం పుస్తకాలు చదివావ్?

 

విష్ణు సహస్రం, లలితా సహస్రం, ఖడ్గమాలా... అబ్బో ఒకటేమిటి చాలా చదివా, వింటారా అని పద్మాసనం వేయబోయింది.

 

వద్దని వారించి ఆగ్రా బయలుదేర దీశాడు. 

 

ట్రైన్ కదులుతున్నంతసేపూ కిటికీలోంచి బయటకు చూస్తూ మధ్య మధ్యలో విచిత్రమైన ప్రశ్నలు వేస్తూ, సమాధానం చెప్పేవరకూ భర్త కేసే చూస్తూ...ప్రయాణం సాగిస్తోంది మల్లిక.

 

భార్యలోని లోకజ్ఞానం పసికట్టిన మిరియం, ఇక భావుకత్వం, తొక్కా తోలూ అటకెక్కించి ఆవిడ ప్రశ్నలు ఎంజాయ్ చేయటం మొదలు పెట్టాడు.

 

ఈ ఉత్తరాదివాళ్ళు తెలివయిన వాళ్ళండోయ్! అంది.

 

ఈ సారి ఏం అడుగుతుందో అని నవ్వుతూ ఆవిడకేసే చూస్తూ "ఎందుకు?" అన్నాడు.

 

"చూడండి, ఆ ఇంటిమీద పిడకలు.  మనవైపు మినపట్లు వేసినట్టు పల్చగా చేస్తే వీళ్ళు ఏకంగా దిబ్బ రొట్టె వేసినట్టు ఎంత పెద్దవి చేస్తున్నారో!" అంది.

 

ఉత్తరాది వారి తెలివికి, భార్య సునిశిత పరిశీలనకు ముచ్చటపడి అవును అన్నాడు.

 

ఆగ్రా వెళ్ళిన తరువాత, తాజ్ సౌందర్యాన్ని, నిర్మాణ కౌశలాన్నీ, షాజహాన్ ప్రేమనీ తలుచుకుని భావావేశానికి లోనయిన మిరియం, భార్యను దగ్గరకు తీసుకొని, "ఇటువంటి ప్రేమచిహ్నాన్ని చూసిన ఈ అపూర్వమైన క్షణంలో నాకూ  నీ మొదటి కానుకగా ఏదైనా  ఇవ్వాలని ఉంది, అడుగు!" అన్నాడు.

 

కొంచెం ఇబ్బందిగా కదిలిన మల్లిక చుట్టూ చూస్తోంది.

 

మిరియం నవ్వుతూ.... "ఫర్వాలేదు! ఎవరో చూస్తున్నారని ఇబ్బంది పడకు, ఎవరూ మనని పట్టించుకోరు‌" అన్నాడు.

 

"ఇప్పుడు నువ్వు కోరే కోరిక నీకూ, నాకూ ఓ మధురమైన జ్ఞాపకం లా మిగిలిపోవాలి అడుగు!" మళ్ళీ అన్నాడు.

 

ఆ మాట విన్నాక ఆమె మొహంలో కాస్త జీవం వచ్చి చెవిలో తను కోరిక చెప్పింది.

 

"బాత్రూంకి వెళ్ళాలి, తీసుకెళ్ళండి" అని.

 

మిరియం, ఆ ప్రేమ దేవాలయంలో ఆవిడ మొదటి కోరిక తీర్చడానికి బాత్రూం వైపు బయలుదేరాడు.

 

ఆమె కోరిక వినడానికి ఇబ్బంది అనిపించినా, మొదటి సారి ఆడపిల్లని బయటకు తెచ్చినప్పుడు అటువంటి జాగ్రత్తలు తీసుకోలేక పోయినందుకు రిపెంట్ అయ్యాడు.  

 

ఆడవాళ్ళతో జర్నీ కదా, అవన్నీ ఆలోచించకపోతే ఎలా? ఈ తప్పు మళ్లీ జరగకూడదని తనకు తానే చెప్పుకున్నాడు.

 

వెళ్ళిన పని అయ్యాక, రిలాక్సింగ్ గా బయటకొచ్చిన మల్లిక,  థాంక్స్ అంది.

 

ఎందుకంత ఇబ్బంది పడ్డావ్!  చెప్పచ్చుగా అన్నాడు.

 

మొహమాటం అనిపించింది, సిగ్గుపడుతూ అంది. 

 

సిన్సియర్ గా సారీ చెప్పి, ఇంకెప్పుడు అలా మొహమాట పడకు. నా దగ్గర మొహమాటం ఏంటీ? మనిద్దరం ఒకటేగా అన్నాడు.

 

మల్లెపూవులా నవ్వింది. సిగ్గు అనే నదిని దాటి, మిరియాన్ని చేరి, స్వతంత్రంగా అతని భుజం చుట్టూ చేయివేసి, రండి ఇక వెడదాం, అంది.

 

అదేంటి తాజ ని  చూడవా? అన్నాడు. చూశాంగా ఇంకా ఏమిటి చూసేది? అంది.

 

ఇది ప్రపంచ వింతల్లో ఒకటి కదా, దీన్ని చూడగానే నీకేమనిపించింది? లాలనగా అన్నాడు.

 

కొంచెం నల్లగా ఉంది. పాలరాయంటే తెల్లగా ఉంటుందనుకున్నా. ఓ సారి సర్ఫ్  వేసి కడిగితే బావుంటుంది అని సలహా ఇచ్చింది.

 

ఇంత చక్కటి ఐడియా వీళ్ళకు ఎందుకు రాలేదబ్బా! అని ఆలోచిస్తూ, తాజ్ అందాన్ని, దానిపై నిలబెట్టిన డోమ్, దానిపై నిలబెట్టిన ఐరన్ స్థూపం, వీటిలో వారుపయోగించిన కౌశలం, గోడలపై రాసిని కాలీగ్రఫీ, ఒక ద్వారం నుంచి కదులుతూ చూసినపుడు క్లోజ్ షాట్, లాంగ్ షాట్ వ్యూలో కనిపించే తాజ్ రూపాన్నీ, కింద ఉన్న నీటిలో తాజ్ ప్రతిబింబం కనిపించడంలో ఉండే ప్రత్యేకతనీ, తాజ్ ముందు ఉండే బెంచ్ స్పెషాలిటీని, అన్నీ వివరంగా చెబుతూంటే నోరు తెరిచి వింది‌. 

 

ఆ తర్వాత చాలాసేపు వాటినే చూస్తూ మైమరచి పోయి, ఇంతుందా ఈ కట్టడంలో అని ఆశ్చర్య పోయింది.

 

తర్వాత కులూ వెళ్ళి గుర్రం మీద కొండెక్కడం, గిరిజన దుస్తుల్లో ఫొటో దిగటం, కస్తూరి మృగాన్ని చూడటం, యాపిల్ తోటల సౌందర్యం, హిడింబా టెంపుల్ అన్నీ చూసి, నైట్ స్టేలో చలికి వణుకుతూ ఉంటే వారు వేసుకున్న స్వెట్టర్లు వారి చలిని ఆపలేకపోయాయి. 

 

వెచ్చదనం కోసం ఒకరికొకరు దగ్గరవుతూ, వేడివేడి చాయ్ తాగుతూ హనీమూన్ లో ఉండే సున్నితమైన మాధుర్యం చవిచూస్తూ.... మరుసటి రోజు సిమ్లా బయలుదేరారు. 

 

టాయ్ ట్రైన్ లో కూర్చున్నాక చిన్నపిల్లే అయిపోయింది మల్లిక.

 

సిమ్లా వెళ్ళాకా ఆమెకి మరో సందేహం వచ్చి, భర్తను అడిగింది. "ఇంత చలిలో వీళ్ళు బట్టలుతుక్కుంటే ఎలా ఆరతాయండీ?"

 

వినడానికి నవ్వులాటగా ఉన్నా, ఆమె వేసే ప్రతీ ప్రశ్నలో ఒక నిజం ఉందని అనిపించింది. డ్రైయ్యర్‌ వాడతార్రా అన్నాడు.

 

ఒకవేళ అది కొనే శక్తి లేకపోతే అంటున్న భార్య, మిరియం కంటికి ఒక చిన్నపిల్లలా అనిపించింది.

 

అంతలోనే తేరుకుని, అలా డ్రయ్యర్లు కొనే శక్తి లేని పేదలు, మనలాంటి కొత్త జంటలు కనబడితే, వారిని అభ్యర్ధించి, వారి మీద తమ తడి బట్టలు ఆర బెట్టుకుంటారు. చప్పున ఆరిపోతాయ్!” అన్నాడు.

 

ఆ సమాధానం విని, ఒక్క క్షణం ఆగి, అర్థమైనట్టుగా మెల్లిగా నవ్వింది మల్లిక.

 

ప్రతీరోజూ, ఇంటికొచ్చి డైరీ రాయటం అలవాటు మిరియానికి. 

 

హనీమూన్ కీ వచ్చాక, అప్పటి వరకూ రాసిన కాగితాలు అతను తిరిగి చదివుతూ ఉంటే.... దాన్నిండా పెనాలు, గూటాలు, బాత్రూంలు, పిడకలు కనిపించాయి, నవ్వుకున్నాడు. 

 

తాజ్ చూసిన తరువాత రాసిన పేజీల్లో ఒక మధురమైన భావన చక్కటి కవనంలా మెల్లమెల్లగా మొదలై ఒక ఏరులా ప్రవహించడం మొదలుపెట్టింది.

 

హనీమూన్ ముచ్చట తీరింది మిరియానికి. 

 

మిరియాన్ని గమనిస్తున్న మల్లికకీ అర్థమయింది. తమ ఆలోచనలు సాగే విధానంలో సారూప్యతలు లేవనీ, మిరియంలా తన దృష్టికోణం లేదనీ... జీవితం హాయిగా సాగాలంటే పాఠ్యాంశాలు, ఉద్యోగం తో పాటు తన పాఠశాలల్లో చెప్పని ప్రపంచ జ్ఞానం, భావుకత, కలుపుగోలు తనం కావాలని.   మిరియంలో తనని ఆకట్టుకుంటున్న హాస్యం, సున్నితత్వం, అక్కర్లేని విషయాలు తేలిగ్గా తీసుకోవటం, ఎదుటివారిని అర్థం చేసుకొనే తత్వం ఇవన్నీ చూసిన మల్లికకి తన చిన్నప్పుడు ఊరిలో ఉన్న తాతగారు పదేపదే శెలవుల్లో చెప్పిన మాటలూ గుర్తొచ్చాయి. ‘ఎప్పుడూ చదువే కాక - సాహిత్యం, కధలూ, విహార యాత్రలు, కళలూ, ఆటలూ ఉండాలనీ, అలాగైతేనే పిల్లలు అన్నివిధాలా చక్కగా ఎదుగుతారనీ’ 

 

అప్పటి వరకూ తెలియని ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలిగింది మల్లికకి. 

 

హనీమూన్ ముచ్చట తీరి ఇంటికొచ్చిన తరువాత వాస్తవ జీవితంలో అడుగు పెట్టాక, చాలామంది దంపతులను చూసి అనుకున్నాడు మిరియం,

"ఇది కదా ఓపిగ్గా ఒకరినొకరు అర్థం చేసుకుంటే, భాగస్వామి సాంగత్యంలో దొరికే జీవిత మధురిమ అంటే!' అని. 

 

పిల్లలు పుట్టి, పెద్దవాళ్ళయ్యాక కూడా, మొదటి తేనెజాబిలి జ్ఞాపకాలు మధురంగా అనిపిస్తూనే ఉన్నాయ్ మిరియానికి, మల్లికకీ. అవగాహన ఉంటే జీవితంలో ప్రతీరోజుని హనీమూనుగా మార్చుకోవచ్చని తెలిసినదపుడేగా!

*****

bottom of page