
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
స్వగతం

చెరుకూరి రమాదేవి
*1962 లో అమెరికా వలసవచ్చిన ఉత్తర అమెరికాలో తొలి తెలుగు కథా రచయిత్రి చెరుకూరి రమాదేవి గారు మన పత్రికతో పంచుకుంటున్న సరదా స్వగతం...
అయ్యబాబోయ్ అయ్యబాబోయ్ యెంత వెనక పడిపోయాను?
నాతోటి వారంతా యెంత ముందుకు వెళ్ళిపోయారు. కలానికి కాలదోషం పట్టించి, కంప్యూటర్స్ తో కసరత్తు చేస్తూ, యెంతముందుకు వెళ్ళిపోయారు?
పోతన, పూతన అంటూ, ఏవేవో ఫాంట్స్ నేర్చేసుకుని, కంప్యూటర్స్ మీద కథలు రాసేస్తున్నారు. బ్లాగులు సృష్టించేసుకున్నారు. బోలెడు మందిని పోగేసుకుని, వోహో కబుర్లాడేసుకుంటున్నారు. యెంత నైపుణ్యం సంపాష్టించేకుంటున్నారు. హ! ఎంతయినా, తెలుగువారు తెలివైనవారు. మహా ఘనులు.
అయినా, అంతమంది ఆ కంప్యూటర్ ని వాడేసుకుంటూవుంటే, నేనేనా అంత చేతకాని రచయితని? అందరికంటే ముందు మొదలు పెట్టాను. వెనక పడిపోతానేమిటి?--- అనుకుంటూ, నోట్ బుక్స్, పెన్స్ అన్నీ తీసి సొరుగులో పడేశాను.
కంప్యూటర్ on చేసి, పోతన గారు వున్నారో లేదో చూసుకున్నాను. ఫాంట్ కి పోతన అని పేరుపెట్టుకున్నంత మాత్రాన, పోతన అంత పండితులయై పోతారా? పోతనతో రాస్తే మాత్రం భాగవతం అయిపోతుందా? అని విమర్శించుకుంటూనే మొదలు పెట్టాను.
మొదటగా అక్షర మాలను ప్రాక్టీసు చేశాను. అ, ఆ ఇ ఈ ల తో గొడవ లేదు. క, ఖ గ ఘ ల తో గడబిడ లేదు. ఎక్కడ లేని సమస్య వత్తులు, గుణిoతాల తోనే వచ్చింది.
చిన్నపుడు ఓనమఃలు దిద్దిoచిన నరసింహం మాస్టారు గుర్తుకు వచ్చారు. ఆయన ఒక్కొక్క అక్షరం దిద్దిస్తూ, ఒక్కో పిట్టకథ చెప్పేవారు. అ నేర్చుకుంటే అబద్దాలు రావని, చ నేర్చు కుంటే చెట్టెక్కడం వస్తుందని. యిలా ఆయన దగ్గర యాభైయారు కథలు ఉండేవి. యిక గుణిoతాల కైతే , అంతే లేదు.
యిప్పుడు అవన్నీ ప్రాక్టీసు చేసానంటే, ప్రతి ఒక్కరిని మించిపోతాను అన్న భరోసా వచ్చిoది.
అమ్మయ్య కంప్యూటర్ రెడీ. యిక కథ రాయడమే తరువాయి.
తెలుగు సాహితీ సభలకు, వెళ్లి వచ్చాక చాలా విషయాలు తెలిశాయి. దాని దుంప తెగ, యెన్నో కథలు రాసిన నాకు, కథ రాయడానికి యెన్నో కిటుకులుండాలా? ఆ సంగతే ఆలోచించలేదు యింతవరకు. ఇంతకుముందు, బుర్రలోకి వచ్చిన బుల్లి, బుల్లి ఆలోచనలను బరికి పారేశా.
యిప్పుడైనా, అన్నీ హంగులు చూచి రాయాలి.
ఒకటి కథావస్తువు. పూర్వం, మా గురువుగారు అగ్గిపుల్ల, కాకిరెట్టా కూడా కథావస్తువులే అనే వారు.
కానీ, వీరు అలా కూడదంటున్నారే!
సమయాసమయాలు, వాతావరణాలు ఏవి చెప్పకూడదుట. అవన్నీ కథ చదువుతుంటేనే అర్థమై పోవాలిట. కథలో ఉండకూడనివి చాలా వున్నాయి. వాటన్నిటిని లిస్టుచేశాను.
వాన లో తడుస్తూ యింటికి వచ్చాక జరిగిన వేషయమే నా కథ, కానీ, నా కథకు యే మాత్రం సంభంధం లేదు. మరి వానను తలచుకుంటూ కథ చెప్పొద్దoటారేమిటి?
మండే ఎండను తలచుకోకుండా, మంచి నీళ్ళు తాగకుండా కథ ఎలా చెప్పాలబ్బా? అది కుదరడం లేదే.
అయినా కథకు అవసరం లేనంత మాత్రాన, ఎండ కాయదా, దాహం వేయదా?
సరే! అనుభవజ్ఞులు చెప్పినప్పుడు, ఆషామాషీ గా చూడకూడదు.
సరే! అవధానం లో నిషిద్దాక్షరిలా వద్దన్నవన్ని మానేసి, కథ వస్తువును గురించి ఆలోచించాను.
ఇంతకాలం, నా రచనా అనుభవంలో, కథకు మొదటి వాక్యం, ముగింపు వాక్యం తప్ప మరేమీ ఆలోచించను. మొదటి వాక్యం తో పాటు, మిగతా భాగం, నా పెన్నుకు తోచినట్లు తను అల్లుకుపోతూవుంటుంది.
అటువంటిది తొలిసారిగా నా పెన్నును డ్రాయరు లో పెట్టేశాను. పాపం పాత నేతం. ఏమనుకుంటుందో ఏమిటో. యింతకాలం చాలా లాయల్టీగా ఏకీభవిoచి సహకరించింది.
యిక కథ రాయడం:
నా కథ పేరు అప్పుడు – యిప్పుడు.
కష్టపడి పోతన లో టైపు చేశాను.
కథావస్తువు నా చిన్నప్పుడు విన్న విషయం.
కానీ, కొత్తగా కథల లో వుండ వలసిన లక్షణాలలో, కాలం గురించి మాటలాడకూడదే. ఆ విషయం కథనం లో స్పూర్తి కలగాలిట.
కాలాన్ని గుర్తించక్కర లేకపోతే, ఓ పేరా ఎగిరిపోయింది. మరీ నయం. మా పోతన కు పని తగ్గింది. యెంత చక చకా టైపు చేసినా, యెంత ప్రాక్టీసు చేసినా యెంత కష్ట పడ్డా, వాక్యం పూర్తి అయ్యేసరికి, వత్తులు వెదుక్కుంటూ రాయడానికి టైం పట్టేస్తోంది.
రెండో వాక్యానికి వచ్చేసరికి, భావనలు తెల్ల మొహం వేస్తున్నాయి. మూడో వాక్యానికి వచ్చేసరికి, మూడ్ మారిపోయింది.
కీ బోర్డుమీద కొట్టింది చదువుతూ, బ్యాక్ బటన్ నొక్కి తప్పులు దిద్దేటప్పటికి, నిద్ర ముoచుకు వచేసింది. రాద్దామనుకున్న విషయం మారిపోయింది. కంప్యూటర్ ఆపేసి, నిద్ర పోయాను.
మర్నాడు కథ పూర్తి చేద్దామని, కంప్యూటర్ ముందు కూర్చున్నాను. క్రితం రోజు రాసినదంతా ప్రూఫ్ చేయ బోయాను. తప్పులే ఎక్కువ కనిపించాయి ఒప్పులకన్నా.
కథలో ఉండకూడనివే కనుపించాయి. మెల్లిగా అవన్నీ దిద్దాను. కథ కురచ పడిపోయింది. కథ లో వుండాల్సిన మెళకువలన్ని చొప్పించి, ప్రారంభించాను. మళ్ళీ మళ్ళీ మొదలు. ఒక వాక్యం ముందుకు, రెండు వాక్యాలు వెనకకు.
టైపు కొట్టినంతవరకు ప్రింట్ చేశాను. చెప్పొద్దూ పోతన లిపిలో అక్షరాలు పొందిగ్గా ముద్దుగా వున్నాయి. కథే చప్పగా ఉంది. ఉప్పులేనిపప్పులా.
ఉండలా చుట్టి వేస్ట్ బాస్కెట్ లోకి విసిరాను. వేడి గా ఒక కప్ టీ తెచ్చుకుని కిటికీ ముందు నిల్చున్నాను.
మోడయిన చెట్లు బేల గా నిల్చున్నాయి.. ఎండి రాలిన ఆకుల మీద తెల్లగా మంచు మెరుస్తోంది. చలికి అలవాటు పడ్డ వుడుత మంచు మీద గంతులు వేస్తోంది. మంచు మీద సూర్య కిరణాలు వెదజల్లిన వజ్రాలలా కనుపిస్తున్నాయి.
కాదేది కవితకనర్హం, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, మా గురువుగారు సాక్షాత్కరించారు. వెనక్కి తిరిగి వెళ్ళాను.
సొరుగులోవున్న ఎల్లో పాడ్, పెన్ను పైకి లాగాను.
నా నేస్తం చకచకా నడిచింది.
సంతృప్తిగా పెన్ను కు మూతపెట్టి సొరుగులో వుంచాను.
నా యీ కథ పేరు “పులిని చూచిన నక్క.”
*****