top of page

సంపుటి  5   సంచిక  1

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

శరత్ నవల  లో  స్త్రీ పాత్రలు - ఒక వీక్షణ

Attaluri.JPG

అత్తలూరి విజయ లక్ష్మి

​ప్రపంచ సాహితీ చరిత్రలో శరత్ చంద్ర చటోపాధ్యాయ అంటే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో!

 

“ శరత్ “ ఈ మూడక్షరాలు శిలాక్షరాలు అవడానికి ప్రధాన కారణం దేవదాసు నవల.  అనేక భాషల్లో సినిమాగా రూపొంది చరిత్ర సృష్టించిన సంగతి మనకు తెలుసు. బెంగాలీ, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, అస్సామీ, భాషల్లో  గొప్ప నటీ నటులు, గొప్ప దర్శకుల చేతిలో రూపుదిద్దుకున్న ఈ ప్రేమ కావ్యం తెలుగులో అత్యంత విజయం సాధించి ఇలాంటి దృశ్య కావ్యం మళ్ళీ రాదు అనిపించేలా న భూతో న భవిష్యతి అనిపించుకుంది .  తెలుగులో ఈ సినిమా సాధించిన విజయం అనూహ్యం. దేవదాసు, పార్వతి, చంద్రముఖి పాత్రలు తెలుగువారి బంధువులు అయారు. ఎంత మంది ఎన్నిసార్లు తీసినా వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో, అక్కినేని, సావిత్రి  ప్రదర్శించిన నటనకి సాటి రాలేదు .. శరత్ ఊహాలకి ప్రాణం పోసి ఆ పాత్రను సజీవం చేశారు. 

 

అలాంటి శరత్ వేళ్ళ కొసలనుంచి జాలువారిన ఆణిముత్యాలు ఎన్నో.. వాటిలో బడాదీది,  నిష్కృతి, సవితా, దత్త, చరిత్రహీనులు, శేషప్రశ్న, ఇలా ఎన్నో అద్భుతమైన రచనలు చేసి సాహితీ లోకంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న గొప్ప రచయిత. దేవదాసే కాక బాటసారి పేరుతో బడాదీదీ , తోడికోడళ్ళు పేరుతో నిష్కృతి మొదలైన రచనలు  కూడా తెలుగులో చిత్రాలుగా వచ్చి ఘనవిజయం సాధించాయి. అలాంటి మహత్తర నవలల్లో శరత్ రాసిన శ్రీకాంత్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. 

 

నవల మొత్తం ఉత్తమ పురుషలో సాగుతుంది.  

 

శ్రీకాంత్ నవల శరత్ జీవిత చరిత్ర అనడం నాకు గుర్తుంది. ఈ నవల భారత వర్ష అనే పత్రికలో సీరియల్ గా వచ్చింది. ఇందులో సాహసం, ప్రయాణం, స్త్రీ పురుషుల ప్రేమలాంటి వాటికి సంబంధించిన అనేక కథలుంటాయి. వివిధ ప్రదేశాలు, వివిధ రకాల మనుషులు, మనస్తత్వాలు, వారి జీవితాలు, అన్నీ కలిపి అల్లిన ఈ నవల లో అమలిన ప్రేమ, ఆ ప్రేమలోని త్యాగం  పాఠకుల హృదయాన్ని రాగరంజీతం చేస్తుంది. జీవితపు లోతులను అన్వేషించిన తాత్వికత గుండెలను పిండివేస్తుంది.

 

ముఖ్యంగా ఈ నవలలో కథానాయకుడైన శ్రీకాంత్  జీవితంలోకి అప్రయత్నంగా ప్రవేశించి అంతులేని అనురాగం, ఆప్యాయత, ఆత్మీయత పంచిన ఎందరో స్త్రీలు.. ఎవరూ కూడా  ఆ జీవితంలో శాశ్వతమైన చోటు పొందలేకపోతారు. దేశదిమ్మరిగా ఒక చోటు నుంచి మరో చోటుకి ఆవిశ్రాంతంగా తిరుగుతూ జీవన సత్యాన్ని అన్వేషిస్తున్న శ్రీకాంత్ కి ఆయాచితంగా లభించే ఆత్మీయులు ఎందరో. ఎవరితో అతనికి రక్త సంబంధం లేదు. 

 

 శ్రీకాంత్ అనబడే కథానాయకుడు తన  జీవితంలో జరిగిన సంఘటనలు, ఎదురయిన వ్యక్తులు వారితో తన ప్రయాణం, అనుభవాలు, అనుబంధాలు అన్నిటినీ హృద్యంగా ఆవిష్కరించిన నవల - శ్రీకాంత్. 

 

నా జీవితమంతా తిరుగుళ్ళతోనే గడిచిపోయింది .. ఈ దేశ దిమ్మరి జీవితంలో మూడవజామున నిలబడి దానిలో ఒక అధ్యాయాన్ని వినిపిస్తూ ఉంటే, ఇవాళ నాకు ఎన్నో సంగతులు జ్ఞాపకం వస్తున్నాయి అని ప్రారంభం అవుతుంది . ఆ దేశ దిమ్మరితనం తోటే బాల్యవస్థ నుంచి వృద్ధాప్యం వరకు వచ్చాను. నా జీవితాన్ని ఒక క్షుద్రపురుగుకన్న మిన్నగా భావించలేక పోయాను. కొంత జ్ఞప్తి ఉండి మరికొంత మర్చిపోయిన కధామాలనల్లడానికి కూర్చున్నాను అని చెబుతూ తిరగడం వేరు.. దాన్ని గురించి వర్ణించి  చెప్పడం వేరు. కాళ్లున్న ప్రతివాడూ తిరగగలడు. కానీ చేతులున్న ప్రతివాడు రాయలేడు అంటాడు. నాలో కవిత్వం గానీ, కల్పన గానీ భగవంతుడు ఇవ్వనప్పుడు నేను నా కళ్ళతో ఏది చూస్తానో అది అలాగే కనపడుతుంది. వృక్షాన్ని వృక్షం గానే చూస్తాను.. పర్వతాలు పర్వతాల లాగానే కనిపిస్తాయి. నీరు నీరుగా తప్ప మరోలా కనిపించదు. ఆకాశంలో మేఘాలు మేఘాలుగానే కనిపిస్తాయి వాటిని చూస్తుంటే నాకే కేశ రాశీ కనిపించదు అంటాడు. ,ప్రపంచంలో నదులు, పర్వతాలు, వృక్షాలు ,మేఘాలు కిటికీ బయట ప్రపంచం, వా క్కాయ పూలు , ఆ పూల సౌరభాలు, రాయంచ విహారాలు  వీటితో పాటు మనుషుల స్వభావాలు, బలహీనతలు , సుఖ దుఖాలు, కష్టాలు కన్నీళ్ళు , దారిద్ర్యం కూడా శ్రీకాంత్ లో కనిపిస్తాయి. శరత్ శ్రీకాంత్ అయితే ఆయన భావుకుడు కాదు అని అనలేరు పాఠకులు. గంగానదిని, వెన్నెలరాత్రి అడవీపూల సుగంధాలను, వెన్నెల్లో మెరిసే రెల్లు పూల సౌందర్యం ఎంతో రమ్యంగా వర్ణించాడు . అలాగే అర్ధరాత్రి వేళ శ్మశానంలోని భయంకరమైన వాతావరణాన్ని కూడా అంతే భయంకరంగా వర్ణించాడు. ఆ వర్ణనలో తాను చూసిన వస్తువులన్నీ వర్ణించాడు. అన్నీ కూడా ఎంతో వాస్తవికంగా , పాఠకుల హృదయాలను చూరగొనెలా ఆవిష్కరించాడు. అంతే కాదు తన జీవన పయనంలో  ఎంత మందిని కలిశాడో, ఎన్ని రకాల జీవితాలని చదివాడో , వారి గాధలని, బాధలు ఆ సజీవ చిత్రణ మనకు కనిపిస్తుంది. అందులో కులీనులు, పెదవారు , పండితులు, పామరులు, విధివంచితలు, పరిస్థితుల వల్ల పాపాపంకిలనం చేసుకున్న దౌర్భాగ్యులు ఇలా ఎన్నో రకాల మనుషులు కనిపిస్తారు, 

 

కధలోకి వస్తే క్లుప్తంగా ఇది.  పెద్దమ్మా, పెదనాన్న గారి ఇంట్లో పెరుగుతూ ఉన్న పేద బాలుడు శ్రీకాంత్.  చండ శాసనుడైన చిన్నన్నగారి ఆజమాయిషీలో చదువుకుంటూ ఉంటాడు. చదువుకునేటప్పుడు అన్నగారి, ఆజ్ఞ లేకుండా దాహానికి, కాలకృత్యాలకు కూడా కదలకూడని క్రమశిక్షణ ఆయనది. 

 

దాదాపు శ్రీకాంత్ వయసే ఉన్న కుర్రాడు ఇంద్రనాథ్. ఇంద్రనాథ్ ధైర్య సాహసాలు అధికంగా ఉన్న యువకుడు. అతనితో ఫుట్ బాల్ ఆట దగ్గర పరిచయం అవుతుంది. సహజంగా నెమ్మదస్తుడు, పిరికివాడు అయిన శ్రీకాంత్ ఇంద్రనాథ్ ధైర్య సాహ సాలు చూసి అబ్బురపడతాడు. ఒక రాత్రి తనతో పాటు శ్రీకాంత్ ని గంగానది వద్దకు చేపలు పట్టడానికి తీసుకు వెళతాడు ఇంద్రనాథ్. అక్కడ అతని మొండి ధైర్యం, సాహసం పరవళ్ళు తొక్కుతున్న గంగానదిలో అత్యంత సునాయాసంగా ఈత కొట్టడం వంటి విన్యాసాలు చూసిన శ్రీకాంత్ భయంతో వణికిపోతాడు. పాములతో చెలిమీ, పులితో తలపడడం, అడవిలో అర్ధరాత్రి వొంటరిగా తిరగడం ఇలాంటివి చూసి ఇంక ఎప్పుడు ఇంద్రనాథ్ తో వెళ్లకూడదు అనుకుంటాడు. ఆ కాళరాత్రి పరవళ్ళు తొక్కుతూ భయనకంగా ప్రవహిస్తున్న గంగానదిని, వాళ్లు నది దాటే తీరుని, అవతలి ఒడ్డున ఉన్న వాతావరణం , చంద్రుడి విన్యాసాలు, అడవి, నదిలో కొట్టుకు వస్తున్న శవాలు, శ్రీకాంత్ గగుర్పాటు ఇంద్రజిత్ నిర్లక్ష్యం ఎంతో అద్భుతంగా వర్ణించాడు శరత్. చదువుతున్నప్పుడు పాఠకుడు కూడా పాత్రలతో పాటు రచయితలాగే ప్రయాణం చేస్తూ ఆ అనుభూతిని ఆస్వాదిస్తాడు. శ్రీకాంత్ ఇంద్రనాథ్ లోని తెగువ ను చూసి భయపడి ఇంకెప్పుడు అతనితో కలవకూడదు అనుకుంటాడు. కానీ అనుకోకుండానే ఇంద్రనాథ్ అతడిని ఆకర్షిస్తాడు. అతని ముందు తన భయాలను ప్రదర్శించడానికి పౌరుషం అడ్డు వస్తుంది. అప్రయత్నంగానే అతనితో అనుబంధం పెరుగుతుంది. ఇంద్రనాథ్ ద్వారానే అనేక విషయాలు తెలుసుకుంటాడు. జీవితాన్నీ జీవన మర్మాన్ని తెలుసుకుంటాడు. అలాగే నిస్సహాయురాలైన ఒక స్త్రీ పట్ల ఇంద్రనాథ్ కి ఉన్న సానుభూతి దయార్ద్ర హృదయం చూస్తాడు. విషసర్పాలని ఆడిస్తూ సంపాదించినదంతా , గంజాయికి తగలేస్తూ మత్తులో తేలి ఉండే షాహాజీ మీద అతనిలోని క్రౌర్యం చూస్తాడు.

ప్రేమ మైకంలో మంచి చెడు తెలియని వయసులో కన్నవారిని, తోబుట్టువులను త్యజించి ఒక మహమ్మదీయుడితో లేచిపోయి వచ్చిన ఒక బ్రాహ్మణ కన్య అన్నదా. చేసిన తప్పుకి పశ్చత్తాపం పడినా తాను ఇష్టపడిన వ్యక్తి గంజాయి మత్తులో మునిగి తేలుతున్నా, అతన్ని బతికించడానికి, తనని తాను బతికించుకోడానికి జీవితంతో పోరాడే అన్నదాని ఇంద్రనాథ్ అక్కలా చూస్తాడు.  ఆమెకి అప్పుడప్పుడూ ఆర్ధికంగా సాయం చేయాలని, ఆ దగుల్బాజీ భర్త నుంచి ఆమెని కాపాడాలని ఇంద్రనాథ్ తహతహ. శ్రీకాంత్ కి ఆమెని అక్క అని పరిచయం చేస్తాడు.  ఆమెని చూసిన శ్రీకాంత్ మనోభావాలు ఇలా వర్ణిస్తాడు శరత్. యుగయుగాంతరాల నుంచి చేస్తున్న కఠోర తపస్సు ముగించుకుని ఇప్పుడే వస్తున్న ఆ స్త్రీ మూర్తిని చూడడం ఒక గొప్ప అనుభవం. జీవితమంతా గాలించినా అంతా అదృష్టం లభిస్తుందా.. అలాంటి వస్తువుని నేను ఈ రోజు చూడకుంటే మళ్ళీ ఎప్పుడు చూడగలను. ఆమెని చూసిన తరవాత స్త్రీ జాతిని నేనెన్నడూ హీనంగా చూడలేకపోయాను అనుకుంటాడు శ్రీకాంత్. 

 

శరత్ ప్రతి నవలలో కనిపించే అద్భుతమైన స్త్రీల వ్యక్తిత్వం అన్నదా లో కూడా చూస్తాము. ఆమె ఆత్మీయత, ఆదరణ , ప్రేమ ఆమె తన భర్త పట్ల చూపించే ఔదార్యం, ప్రేమ, త్యాగం ఇవన్నీ కేవలం శరత్ సృష్టించిన పాత్రల్లోనే కనిపిస్తాయి. శరత్ దృష్టిలో స్త్రీ ఒక దేవత.  శరత్ సంఘ సంస్కారాభిలాషి కానీ, సంస్కర్తలకు శాస్త్రీయ ధృక్పధమే కానీ ప్రజల మనోభావాల గురించి ఆలోచించారని శరత్ అభిప్రాయం. ఆనాటి సాంఘిక స్థితి గతులను బట్టి విధవా వివాహాలు సంస్కారణాభిలాషుల ఆదర్శమే కానీ సమాజం సమర్థించలేదని, అందుకే తాను విధవ వివాహాలు చేయలేదని అంటాడు. విధవరాలైన మాధవి సురేంద్ర బాబు పట్ల ఆకర్షింపబడడం, అతని మీద అనురాగం పెంచుకోడం సమర్ధించగలిగాడు.. అది వాస్తవం.. ఆ వాస్తవాన్ని శరత్ వ్యతిరేకించలేదు. కానీ నాటి వ్యవస్థకు భిన్నంగా విధవా వివాహం, వేశ్యల కు సంసార జీవితం ఆయన ఇవ్వలేదు.. కారణం సాహిత్యం కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మారుతూ ఉంటుందని, నేటి సాహిత్యం రేపు తెరమరుగు అవడం సృష్టి ధర్మం అని నమ్మాడు. విధవలకు పెళ్లి చేసి నిష్టావనటులైన హిందువుల దృష్టిలో సౌందర్యాన్ని సృష్టించడం అసాధ్యం అంటాడు. అలాంటప్పుడు ఆ రచనలో మిగతా మంచి విషయాలు కూడా వ్యర్ధం అవుతాయి అంటాడు శరత్.  బంధింపబడిన మానవ హృదయ కవాటాల వద్దకు, మానవ వేదనా గాధను చేర్చగలగడం మినహా రచయితగా నేనేమీ చేయలేను.. ఇందులో ఏం చేస్తే మంచిది అని నిర్ణయించ వలసింది సమాజమే అంటాడు. 

 

శరత్ తన జీవితంలో ఎంతోమంది పతివ్రతలనబడే వాళ్ళ జీవిత చరిత్రలను సేకరించాడు. తమ అభీష్టాలకు వ్యతిరేకంగా సామాజిక పరిస్థితుల ఒత్తిళ్ళ వల్ల అధోగతి పాలైన వారి కన్నీటి గాధలు. ఒకవైపు దరిద్రం, మరోవైపు పురుషాధిపత్యం తో అణచివేతకు గురికాబడి , మోసగాళ్ల తో వంచింపబడి, ఇల్లు విడిచినా , తమ ఇష్టానికి వ్యతిరేకంగా అవినీతి విధానంలో జీవనాన్ని సాగించినా వారిలో కూడా  ప్రేమించే హృదయం , ప్రేమించే వాళ్ళ కోసం సర్వస్వం త్యాగం చేయగల మానవ స్థైర్యం , వారిలో చూడగలిగాడు. వారి ఆత్మగౌరవాన్ని నమ్మిన వాళ్ళు విసిరిపారేసినా , ఇతరుల కష్టాన్ని తమదిగా భావించే హృదయ వైశాల్యం, కరుణ, దయ పుష్కలంగా ఉన్నదని తన కవి హృదయం ద్వారా కనుగొన్న శరత్ దేవదాసులో ఒక చంద్రముఖిని, చరిత్రహీనుల్లో సావిత్రిని, శ్రీకాంత్ లో ఒక రాజ్యాలక్ష్మిని. ఒక అన్నదా ని. ఒక అభయను. ఇలా అపూర్వమైన వ్యక్తిత్వం గల స్త్రీ పాత్రలను సృష్టించి స్త్రీ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన రచయిత.  త్యాగమూర్తులుగా సహనమూర్తులుగా , హృదయ సౌందర్యంతో పాటు శారీరక సౌందర్యంతోనూ మెరిసిపోయే ఆయన స్త్రీ పాత్రలు అనంత దుఖంతో వేగిపోతాయి. ఎన్ని గొప్పలక్షణాలున్నా సావిత్రి, సతీష్ ని పెళ్లి చేసుకోలేకపోతుంది. రాజ్యలక్ష్మి కి శ్రీకాంత్ అంటే ఎంత ఆరాధన, ప్రేమ ఉన్నా అతనిని సంప్రదాయ భర్తగా అంగీకరించదు. ధర్మబద్ధం గా సహచరి స్థానం ఆశించలేకపోతుంది. కానీ మనసులో మాత్రం అతనే ఆమె భర్త. ఎలాంటి శాస్త్రబద్ధమైన తంతు లేకుండా శ్రీకాంత్ తో జీవిస్తుంది. రాజ్యలక్ష్మి శ్రీకాంత్ ఒక ఊరి వాళ్ళు.. చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు. రాజ్యలక్ష్మి చిన్నప్పటి నుంచి తనకు తెలియకుండానే శ్రీకాంత్ ని ఆరాధిస్తుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో మరొకరితో ఆమె వివాహం జరిగిపోతుంది. దురదృష్టవశాత్తూ విధవరాలు అవుతుంది. విధివంచిత అయి ప్యారీ అనే పేరుతో  వేశ్యగా మారుతుంది. స్నేహితుడు అయిన ఒక రాకుమారిడీ తో వేటకు వెళ్ళిన శ్రీకాంత్ కు ఆ ప్రయాణంలో ప్యా రీ ఎదురవుతుంది . రెండు వారాల పాటు తనఆటపాటలతో రాజకుమారుడిని ఖుషీ చేయడానికి తన బృందంతోడ వచ్చి డేరా వేసుకుని ఉన్న ప్యారీ అక్కడ శ్రీకాంత్ ని చూసి ఆశ్చర్యపోతుంది. తరవాత అతడిని తన దేరాకు పిలిచి చిన్ననాటి రోజులు గుర్తుచేస్తుంది. కుమార రాజా తో వేటకు వెళ్లద్దని ప్రార్ధిస్తుంది. అక్కడ దయ్యాలు, భూతాలు ఉన్నాయని చెబుతుంది. హేతువాది అయిన శ్రీకాంత్ ఆమె మాట లక్ష్య పెట్టక వెళ్ళి, జబ్బు పడతాడు. అతనికి సపర్యలు చేసి తనతో తీసుకు వెళ్తుంది ప్యారీ. అప్పటి నుంచి తన జీవన విధానం మార్చుకుంటుంది. ఆమె అవడానికి వేశ్య అయినా ఆమెలో ఉన్నతమైన మానవతా విలువలు, స్త్రీ సహజమైన ప్రేమ, దయ, ఇతరుల కష్టాల పట్ల సానుభూతి, పరోపకారం, త్యాగం ఉండి ఆమెని ఒక మహోన్నత వ్యక్తిగా తీర్చి దిడ్డాడు శరత్.  శ్రీకాంత్ కోసం సర్వం త్యజించి పూర్తిగా విరాగిగా మారిపోతుంది. ఆమెలో ఏ మాత్రం ఈర్ష్యా అసూయ కనిపించవు. శ్రీ కాంత్ ని చంటి బిడ్డలా చూసుకుంటుంది. ఆయన ఆరోగ్యం కోసం ఉపవాసాలు చేస్తుంది.. తీర్ధ యాత్రలు చేస్తుంది. అలా అని ఆమె సనాతనురాలు కాదు.. తన మనసులో ఎలాంటి భావాన్ని అయినా నిర్భయంగా వ్యక్తం చేయగల ధీశాలి . సాధారణ స్త్రీగా కాక ఏ సంకోచం లేకుండా అన్నీ విషయాలను చర్చిస్తుంది. ఆమెలో అంతులేని విజ్ఞాన తృష్ణ ఉంది . విచక్షణ ఉంది ..తన నౌకరు రతన్ కూడా ఆమె ఎంతో ఆదరిస్తుంది. కాశీరామ్, ఆయన భార్య, కాశీరామ్ మరదలు సునంద , తమ్ముడు అందరినీ తన వాళ్ళుగా చూసుకునే మానవతా మూర్తి. మాతృమూర్తి కావాలన్న తన అభిలాషని సవతి కొడుకుని దత్తు తీసుకోడం ద్వారా తీర్చుకుంటుంది. అయితే శరత్ గొప్పతనం రాజ్యలక్ష్మి, శ్రీకాంత్ ల అనుబంధం ఎంత గాఢ తరమైనా వాళ్ళని వివాహబంధంతో ముడివేసి తనని తాను ఒక సంస్కర్తగా చెప్పుకొడు. 

 

ఈ నవలలో మరొక ముఖ్య పాత్ర అభయ . ఆమె బర్మా స్త్రీ.. వివాహిత .. తనని విడిచి పెట్టి వెళ్ళిపోయిన భర్తను వెతుకుతూ రంగూన్ బయలు దేరుతుంది. ఆమెతో కూడా జబ్బుమనిషి రోహిణీ బాబు ఉంటాడు. అభయ అతనికి కేవలం స్నేహ భావంతో సపర్యాలు చేస్తుంది. కానీ రోహిణిబాబు ఆమె పట్ల అనురాగం పెంచుకుంటాడు. ఆమెకోశం తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఆమెని పోషించడానికి ఎంతో కష్టపడతాడు.  ఆతని పట్ల ఉదారత కే కానీ మరో భావం లేని అభయ చివరికి తన భర్త మరో స్త్రీని వివాహం ఆడాడని శ్రీకాంత్ ద్వారా తెలుసుకుని కూడా రెండో భార్యగా అయినా ఉంటానని భర్త దగ్గరకు వెళ్తుంది. కానీ అతను ఆమెని అవమానించి, హింసించి ఇంటినుంచి గెంటి వేస్తాడు. అభయ అప్పుడు తిరగబడుతుంది. రోహిణీ బాబు నిష్కల్మషమైన ప్రేమకు లొంగిపోతుంది అతనితో కలిసి జీవనం సాగిస్తుంది. అభయ చేసింది మంచిపనా, చెడా అని తర్కించు కుంటూ ఎటూ తేల్చుకోలేని శ్రీకాంత్ కి అభయలోని అసాధారణ వ్యక్తిత్వం గురించి చెప్తుంది.

 

వాస్తవికత, మానవీయ ధృక్పధం శరత్ ప్రత్యేకత. ఆఖరికి అతి చిన్న పాత్ర నీరూడీడీ, గౌరవ్ లలో కూడా ఎంతో ఔన్నత్యాన్ని చూపించాడు శరత్. 

 

ప్రేమ అందమైన భావం .. సెక్స్ , ఆకలి లాంటి సహజాతం కానే కాదు అది సంస్కృతి నుంచి పుట్టి బలపడేది. చదువు, సంస్కారం, సంస్కృతీ వీటివల్ల చిన్న బుద్ధులకు, అసూయలకు దూరమైన స్త్రీ పురుషులు మాత్రమే ప్రేమకు కొత్త అర్ధం  ఉంటుంది అంటాడు శరత్. స్వాతంత్ర్యం పరిపూర్ణత ద్వారా పొందేది కానీ సిద్ధాంతాల ద్వారా పొందేది కాదని అంటాడు. 

 

ప్రతివాళ్ళు తప్పులు చేస్తారు తప్పులను సరిచేసుకుంటూనే మానవ సమాజం ముందుకు పోతూ ఉంది . ఇది స్త్రీ పురుషులిరువురికీ వర్తిస్తుంది. ఒక జీవితాన్ని చీకటి మయం చేయడం భరించలేనిది. స్త్రీని ఆమె జీవితాన్ని ఆమెను నిర్ణయించుకోనివ్వండి .. తప్పులు చేస్తుందా చేయనివ్వండి ఆ తప్పులు గుర్తించి లేచి నిలబడానికి చేయూత నివ్వండి .. ఆడపిల్లకు పెళ్లి అవసరమే కానీ సర్వస్వం కాదు  పెళ్లి చేసి ఒక అయ్యా చేతుల్లో పెడతామనడం కాదు.. ఆమెని ఒక మనిషిగా ఎదగనివ్వండి అంటాడు శరత్. 

 

మాతృత్వం అనేది గొప్ప వరం కావచ్చు స్త్రీకి కానీ అందులోనే స్త్రీ జన్మకి సార్ధకత ఉంది అనడం పురుషాధిక్య సమాజం నమ్మకం అని పిల్లలని కనీ పెంచితేనే మాతృత్వం అవదని  శరత్. అంటాడు .

 

శరత్ శైలి అనుభూతిమయంగా ఉంటుంది. ఆయన ప్రవేశ పెట్టె పాటగరాల పరీఛాయాల వెనక జాలి సానుభూతి ప్రేమావేశాలు మొదలైన మానవ విలువలు ఉంటాయి. రచనలో అనుభూతిని నింపి మళ్ళీ, మళ్ళీ చదవాలనిపిస్తాయి.  

 

 శ్రీకాంత్ కి  పూంటు అనే యువతిని ఇచ్చి వివాహం చేయడానికి అతని బంధువులు నిశ్చయిస్తారు. రాజ్యలక్ష్మి తో కొంతకాలం కలిసి జీవించిన తరవాత , ఎంతో నిజాయితీగా కట్టుకున్న భర్తకి చేసినంత శ్రద్ధగా ఆమె చేసిన సేవలు పొందిన తరవాత తాను పూంటును పెళ్లి చేసుకోడం ఎంతవరకు న్యాయం అని ఆలోచిస్తాడు. ధర్మ,అధర్మ విచక్షణ చేసేది రాజ్యలక్ష్మి అని నమ్మి ఆమె అనుమతి కోసం ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరానికి రాజ్యలక్ష్మి రాసిన సమాధానం ఆమె వ్యక్తిత్వాన్ని హిమాలయం అంత ఎత్తున నిలబెడుతుంది. ఆమె ఆత్మాభిమానం, శ్రీకాంత్ పట్ల ఆమెకున్న ప్రేమ పాఠకుడిని పులకింపచేస్తుంది. బంకు పెద్దవాడైనాడు వాడికి భార్య వచ్చింది. మీ వివాహం అయిన తరవాత నేను ఏ మొహం పెట్టుకుని తిరగను!ఈ అవమానాన్ని ఎలా సహించను ! అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడులే అనే ఆశతో ఎదురు చూసేంత అవకాశం నాకు లేదు. 

 

ఇందులో శ్రీకాంత్ ని సంస్కారవంతుడిగా, స్త్రీల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా , వితంతువుల పట్ల, విధివంచితుల పట్ల సానుభూతి కలవాడిగా , ఉన్నతుడిగా చూపించినా రాజ్యలక్ష్మి ని మాత్రం జీవితంలోకి ఆహ్వానించక పోవడం అనేది ఆనాటి సామాజిక సూత్రాలను అనుసరించి ఎంతో వాస్తవికమైన స్వాభావికుడిగా చిత్రించాడు శరత్. 

OOO

bottom of page