top of page

సంపుటి  5   సంచిక  1

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

కౌశికి నుంచి మిసిసిపికి

KVRamanaRao.JPG

డా.కే.వి. రమణరావు

టీపాయ్ మీద వున్నరాహుల్ సాంకృత్యాయన్ రాసిన ‘ఓల్గా నుంచి గంగకు’ పుస్తకాన్ని తదేకంగా చూస్తున్నాడు రవీంద్రబాబు. మిస్సిసిపినుంచి వచ్చే చలిగాలులు ఆ మధ్యాహ్నం సెయింట్ లూయిస్ సబర్బన్ ఏరియాను చల్లబరుస్తున్నాయి.

 

"అయితే యితనేమంటాడు, ఆర్యులు మధ్య ఆసియానుంచి వచ్చారంటాడా. నేనామాట యన్నటికీ నమ్మను. అట్లాగైతే ఈరోజు ఆ ప్రాంతపుదేశాల్లో మన వేదసంస్కృతి ట్రేసెస్ ఐనా వుండాలగదా, యక్కడపోయినట్టు?" అన్నాడు రవీంద్రబాబు కొంచెం ఆవేశంగా.

 

"’ప్రతిమనిషి తన తలలో తనదైన వొక ప్రపంచాన్నే మోస్తూంటాడు’ అంటాడు ప్రముఖ తాత్వికుడు జిడ్డు కృష్ణమూర్తి" అన్నాడు జగన్నాథ్ నవ్వుతూ.

 

"నేనడిగిందానికి జవాబు చెప్పదలుచుకోనప్పుడంతా నువ్వు టాపిక్ మారుస్తావు. అయితే యీ సెయింట్ లూయిస్ లోనే లక్షప్రపంచాలుండాలి. యేవీ?" అన్నాడు రవీంద్రబాబు తనూ నవ్వుతూ.

 

"నేను చెప్పేది తలలోపల. అయితే డార్విన్ లెక్కలో మనుషులంటే సమూహాలు. ఆ లెక్కన బయటికి కనిపించేవి మాత్రం సమూహానికొక్క ప్రపంచం చొప్పునవుండాలి. అంతేకాదు మజిలీల్లో క్యాంపులేస్తూ యీ ప్రపంచాలు రవాణాకూడా ఔతూంటాయట" అన్నాడు జగన్నాథ్ నవ్వును కొనసాగిస్తూ.

 

"అంటే యీవూర్లో మన తెలుగు సమూహానికి వొక ప్రత్యేక ప్రపంచం…” అంటూ రవీంద్రబాబు ఏదో అనబోయాడు. జగన్నాథ్ కొడుకు కౌశిక్ బయటినుంచి తలుపుతోసుకొచ్చి రవీంద్రబాబుకు హాయ్ చెప్పి "డాడ్... సృజన్ తన ఇండియా ట్రిప్ డ్రాప్ చేసుకున్నాడు, నేనొక్కడినే వెళ్తున్నాను" అన్నాడు. అతని చేతుల్లో క్రికెట్ బ్యాటు, బంతి ఉన్నాయి.

 

“ఒకే. నువ్వు తెలుగు బాగానే మాట్లాడతావు కాబట్టి ప్రాబ్లెమేమీ లేదు. పైగా అక్కడ నిరంజన్ సెలవుపెట్టుకుని కొన్నిరోజులు నీతోనే వుంటానన్నాడు. క్యారీయాన్” అన్నాడు జగన్నాథ్ కొడుకువైపు చూసి.

 

“నిరంజనంటే మీ పెద్దనాన్న కొడుక్కదా? యెన్నాళ్లు ఇండియా టూర్” కౌశిక్ ని అడిగాడు రవీంద్రబాబు.

 

"స్ప్రింగ్ లో నా మాస్టర్స్ క్లాసులు మొదలయ్యేలోపల వచ్చేయాలి. మొత్తం నెలరోజులు, ఏపీలో వారం" చెప్పాడు కౌశిక్.

 

"మీ కమ్యూనిటి గ్రౌండ్స్ లో గూడా అదివారాలు క్రికెట్ మ్యాచులాడుతున్నారా? నా కాలేజిరోజుల్లో మాపల్లెలో క్రికెట్ యింట్రడ్యూస్ చేసింది నేనే" అన్నాడు రవీంద్రబాబు.

 

"మనవాళ్లిక్కడా క్రికెట్ ని వదల్లేదు, లేకుంటే మైకెల్ జోర్డాన్, బ్యారి బాండ్స్, టైగర్ వుడ్స్ స్థాయిలో వెలుగుతూవుండేవాళ్లు" అన్నాడు జగన్నాథ్.

 

జగన్నాథ్ శ్రీమతి సునంద కిచెన్లో రవీంద్రబాబు శ్రీమతి వనజ సహాయంతో చేస్తున్న సంప్రదాయ గుత్తొంకాయకూర తయారీ పూర్తైనట్టుగా లోపల్నుంచి శబ్దాలు, వాసనలు వచ్చాయి. ఆవెంటనే ‘రండి, లంచ్ రెడీ’ అని లోపల్నుంచి సునంద పిలుపు వినిపించింది. ‘పదండి’ అని లేచాడు జగన్నాథ్.

 

ఆ ఆదివారం జగన్నాథ్ ఆహ్వానం మీద, రవీంద్రబాబు దంపతులు భోజనానికొచ్చారు. సెయింట్ లూయిస్ లో వివిధరకాల వృత్తుల్లో స్థిరపడ్డ భారతీయుల్లో వీళ్లూ ఉన్నారు.

 

రవీంద్రబాబు అమెరికాలో స్థిరపడినా గాఢమైన భారత జాతీయభావాలను వదిలిపెట్టలేదు. అక్కడి లోకల్ దేవాలయం ఆర్గనైజింగ్ కమిటీలో చురుకైన సభ్యుడు. అప్పుడప్పుడూ ఇండియా వెళ్లి కొన్ని ఆధ్యాత్మికకార్యక్రమాలు నిర్వహిస్తూంటాడు, కొన్నిటిని స్పాన్సర్ చేస్తూంటాడు.

 

సెయింట్ లూయిస్ సమాచారం, దేవాలయం విషయాలు మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారు. ఆమధ్యన కోవెలకొచ్ఛి అర్చన చేయించిన ఓకొత్త దంపతులు తమపిల్లకు పెట్టిన వేదకాలంనాటి పేరును ప్రస్తావిస్తూ "యిప్పుడు మనవాళ్లు పిల్లలకు పేర్లన్నీ మూలాలకుపోయి వెతికి పెడతావున్నారు. నీపేరు, అదే ఫస్ట్ నేమ్, అట్లా యెందుకుపెట్టారో నీకు తెలుసా" అని కౌశిక్ వైపు చూసి అడిగాడు రవీంద్రబాబు.

 

“అది సేజ్ విశ్వామిత్రుడి మరో పేరట, మా గ్రాని చెప్పింది” చెప్పాడు కౌశిక్

 

“మా అమ్మాయికి మా అత్తగారి పేరు పెట్టాలని మా మామగారు యంతచెప్పినా రవీంద్ర పడనీయలేదు. వాళ్ల హంపీ గురువుగారు పురాణాల్లో వెతికి చెప్పిన పేరే పెట్టినారు” నిష్టూరం చేసింది వనజ.

 

“మా నాన్న విశ్వామిత్రుడిపేరని పెట్టలేదు. అదొక నది పేరు” సరిదిద్దాడు జగన్నాథ్.

 

“రివర్ పేరా? ఇన్నాళ్లూ నాకీమాట చెప్పలేదే. ఎక్కడుంది ఆ రివర్” అడిగాడు కౌశిక్.

 

“చిన్న నది. ఆంధ్రలోనే, ఈస్ట్ గోదావరి జిల్లాలో, కోనసీమలో వుంది. నది చిన్నదైనా దానికి చాలా ప్రాముఖ్యం వుండేది, వొకప్పుడనుకోండి. మా పూర్వీకులది కోనసీమే. ఆ అఫినిటి వల్ల వీడికీపేరు పెట్టాడు మానాన్న" వివరించాడు జగన్నాథ్.

 

“కోనసీమ అంటే అమలాపురం దగ్గరేగా. అబ్బో యక్కడచూసినా నీళ్లే, బలే పచ్చగా వుంటుంది. శాన్నాళ్లకిందట పోయింటిని. గోదావరిని, కాలవలను చూసినాను. యీ నదిగురించి నాతో యవరూ చెప్పనుగూడాలేదే. మాది అనంతపురం గాబట్టి ఆప్రాంతం తెలీదనుకో. ఆ నదికేదో ప్రాముఖ్యముందన్నావు, యేందది?” ఆసక్తిగా అడిగాడు రవీంద్రబాబు.

 

“నాకూ ఖచ్చితంగా తెలియదు. యెప్పుడో విన్నాను. మందపల్లి దాటాక గౌతమీ గోదావరినుంచి కాలువ పరిమాణంలో ఒక చిన్న శాఖ విడిపోయి కోనసీమంతా పాములాగా మెలికలుతిరిగి వెళ్లి వైనతేయ గోదావరిలో కలుస్తుందన్నారు. అదే కౌశికి నది. నెమ్మదిగా పారే స్వచ్చమైన నీళ్లతో మడికి, స్నానాలకి సదుపాయంగావుంది కాబట్టి కోనసీమ అగ్రహారాలన్నీ దానికి దగ్గర్లోనే యేర్పడ్డాయంటారు. కాబట్టి కోనసీమలో వేదం, యితర వైదిక సాహిత్యం స్థిరపడడానికి కౌశికినది పాత్రకూడా యెంతో వుందన్నమాట" వివరించాడు జగన్నాథ్.

 

“మా రాయలేలిన సీమలో అగ్రహారాలే మాయమైపోయినాయి. కోనసీమ మరో కాశీ అనుకుంటే యీ కౌశికి గంగానదిలాంటిదన్నమాట. మరి అక్కడ మీ తాతగారిదేవూరు?" జగన్నాథ్ మాటలు ఆసక్తిగా విన్న రవీంద్రబాబు అడిగాడు.

 

"మా వూరు మల్లన్నపేట అగ్రహారం, చాలా చిన్నదనుకో. కౌశికి నది దగ్గరే వుంటుంది. అన్నీ అమ్మేసుకుని మా తాత కాలంలోనే ఆ వూరొదిలేశాము. యిప్పుడక్కడ మా అన్నయ్య పిన్నత్తగారిల్లుంది" అన్నాడు జగన్నాథ్.

 

అంతా మౌనంగా విన్న కౌశిక్ "ఇది చాలా ఇంట్రెస్టింగ్ డాడ్. నా స్కెడ్యూల్ లో కోనసీమ, మన ఊరు కూడా చేరుస్తాను. నిరంజన్ కి చెప్తాను. ఆ ఏరియా ఈ పెర్స్పెక్టివ్ తో స్టడీకూడా చేస్తాను" అన్నాడు.

 

"గుడ్, మీనాన్నకంటే నువ్వే మేలు. ఆ నదిని, యింటీరియర్ గ్రామాలను చూసి, అక్కడి వేదపండితుల్ని కలిసి అసలు మన సంస్కృతి వొరిజినల్ గా అక్కడ యట్లా ప్రిజర్వ్ చేస్తున్నారో రికార్డ్ చేసుకొనిరా. వాళ్లకే సపోర్ట్ కావలన్నా మనం చూసుకుందాం. యిలోగా నేను యిక్కడి మిత్రులతో మాట్లాడతాను" అన్నాడు రవీంద్రబాబు ఉత్సాహంగా.

 

“ష్యూర్ అంకుల్” చెప్పాడు కౌశిక్.

 

భోజనాలయ్యాక ‘గుత్తొంకాయకూర అద్భుతంగా ఉంద’న్నాడు రవీంద్రబాబు. ‘యీమధ్య వాళ్లింటిదగ్గరి తెలుగువాళ్ల స్టోర్లో మంచి సన్నటి ఊదారంగు నీటివంకాయలు దొరుకుతున్నా’యని చెప్పింది సునంద.

 

* * *

 

ఇండియా వచ్చిన చివరి వారంలో మూడురోజులపాటు కోనసీమ చూడ్డానికి బయలుదేరాడు కౌశిక్.

 

కౌశిక్, నిరంజన్ లు పొద్దునే ఫ్లైట్లో హైద్రాబాదు నుంచి రాజమండ్రి వచ్చి, టాక్సి మాట్లాడుకుని మల్లన్నపేటకు ప్రయాణమయ్యారు. డ్రైవర్ చంద్రయ్య మధ్యవయస్కుడు, మాటకారి. జొన్నాడ దాటాక బ్రిడ్జిమీద ఆగి నాలుగైదు సన్నటిపాయలుగా పారుతున్న గౌతమీ గోదావరిని చూశారు.

 

"ఇదే మైటీ గొడావరి, పైన డాములు కట్టేసి ప్రస్తుతం నీటికంటే ఎక్కువ ఇసుకను సరఫరా చేస్తోంది" చెప్పాడు నిరంజన్, దూరంగా కనిపిస్తున్న లారీలవరస చూపిస్తూ.

 

"యా... డిజప్పాయింటింగ్ అండ్ పెరిలస్” అన్నాడు కౌశిక్.

 

రావులపాలెంలో టీ తాగి అమలాపురం రోడ్డుకు తిరిగారు. పరిసరాలు ఒక్కసారిగా మారిపోయాయి. చుట్టూ ఆవరించిన ఎత్తైన చెట్లు, చిక్కటి కొబ్బరి, అరటి తోటలు. ఎటుచూసినా పచ్చదనంతప్ప మరోరంగు లేదు. కౌశిక్ లీనమైపోయి చూస్తున్నాడు.

 

కారు మందపల్లిదాటి కొత్తపేటలో ప్రవేశిం చింది. పచ్చనిదృశ్యం తాత్కాలికంగా మాయమైంది. ‘మెయిన్ రోడ్డుకు రిపే’రంటూ డ్రైవర్ సన్నటి కాలేజిరోడ్డులోకి తిప్పాడు.

 

"వాట్ ఈస్ దిస్? ఈ మురిక్కాలవనిండా ప్లాస్టిక్, చెత్త... హారిబుల్" అన్నాడు కుడివైపును కూర్చున్న కౌశిక్ అటుపక్కనున్న కాలవను చూస్తూ.

 

"అది మురుక్కాలవ కాదండి, కౌసికి నది" అన్నాడు డ్రైవర్ చంద్రయ్య.

 

"వాట్... నిజమేనా కారాపు, కారాపు" అన్నాడు కౌశిక్. ఒక పక్కగా కారాపాడు డ్రైవర్.

 

నిరంజన్, కౌశిక్ కారుదిగి రోడ్డుదాటి వెళ్లి గట్టుమీద నిలబడి చూశారు. అది రకరకాల చెత్తతో నిండిపోవడమేకాక నీళ్లు నిలిచి కంపుకొడుతోంది.

 

“రివర్ అన్నారు, నీళ్లు స్టాగ్నంట్ గా ఉన్నాయే” అన్నాడు కౌశిక్ ఎక్కువసేపు చూడలేక కారుదగ్గరికి తిరిగొచ్చి. అతనిమొహంలో కొంచెం కళ తగ్గింది.

 

“ముందు బానే పారేదటండి. ఆమద్యనెప్పుడో గోదారిగట్టో, కాలవగట్టో యెత్తు పెంచినప్పుడు దీనికడ్డుకట్టడిపోయి నీటిసప్లై ఆగిపోనాదండి.  మరి యెదరేమో వెదిరేస్వరం పంటకాలవ అడ్డొస్తుంది. యిది డ్రైనేజి కాలవైపోయింది" అన్నాడు చంద్రయ్య కారుపోనిస్తూ.

 

పుల్లేటికుర్రు దాటాక ఒక చిన్న బ్రిడ్జిమీద కారాగింది. “యిదికూడా కౌసికేనండి. దిగి చూసిరండి, కారు యెదరెడతాను” సూచించాడు చంద్రయ్య

 

“నీళ్లుపారడంలేదుగాని ఇక్కడ కొంచెం బెటర్ గా ఉంది” అన్నాడు నిరంజన్.

 

నీళ్లుతగ్గిపోయిన కాలవలాగా ఉన్న కౌశికి రెండువైపులావున్న ఎత్తైన కొబ్బరి, అరటితోటలతో కలసి పైకప్పులేని డీప్ టన్నెల్ లా ఉంది. ఆ లోతైన పచ్చని ‘త్రి-డి’ దృశ్యాన్ని తదేకంగా చూ శాడు కౌశిక్.

 

“ఇక్కడ పొలాల్లోనుంచి నదిలోకి డ్రైనేజి నీళ్లొస్తాయండి. టౌనుచెత్త లేదుకాబట్టి ఇక్కడ నీళ్లంతగా పారకపోయినా మురిగ్గా వుండదండి" చెప్పాడు చంద్రయ్య.

 

"ఇక్కడి సాయిల్ అండ్ వాటర్ చాలా రిచ్ అనుకుంటాను. ట్రాపికల్ సన్ లైట్. ప్రతి ఇంచ్ ఫెర్టైల్ గా ఉంది. ఎక్సెలెన్ట్ ఫర్ క్రాప్స్. ఈ గ్రీనరీకూడా థిక్ గా ఉంది" అన్నాడు కౌశిక్

 

“ఔను, యీ ప్రదేశం రెండుగోదావరి శాఖల మధ్య ఉంది" సమర్దించాడు నిరంజన్

 

"మరే్… కోనసీమండి" అని ముక్తాయించాడు చంద్రయ్య.

 

కారు అంబాజిపేట జంక్షన్లో గన్నవరంరోడ్లోకి తిరిగి, కొద్దిదూరం వెళ్లాక కుడివైపు తిరిగి కొన్ని సన్నటి మలుపుదారులంట వెళ్లి మల్లన్నపేట అగ్రహారం చేరేసరికి మధ్యాహ్నం పన్నెండు దాటింది. మధ్యలో చిన్న చెరువు, ఒకవైపు మల్లన్నపేట ఊరు, మరోవైపు అగ్రహారం ఉన్నాయి. చుట్టూ తోటలతో అడవిలాగుంది. అగ్రహారమంతా ఒకే వీధి. రెండువైపులా కలిపి అన్నీ ముప్పై యిళ్లున్నాయి. మొదట్లోనే చెరువునానుకుని గుడి ఉంది. నిరంజన్ వాళ్ల చినతాతగారి పెంకుటిల్లు వీధిచివరనుంది. చంద్రయ్య వాళ్లను దింపేసి ‘గన్నవరంలో చుట్టాలున్నా’రని వెళ్లాడు.

 

నిరంజన్ చినతాత నీలకంఠం, బామ్మ గిరిజమ్మ వాళ్లరాక కోసం ఎదురుచూస్తున్నారు. నీలకంఠం ఇన్సూరెన్స్ కంపెనిలో పనిచేసి రిటైరై పెన్షన్ తీసుకుంటున్నాడు. అది చిన్న మండువా ఇల్లు, పాతకాలపు ఫర్నీచర్. కుశల ప్రశ్నలయ్యాక నీలకంఠం అతన్ని హల్లో చుట్టూ తిప్పి మండువా నిర్మాణాన్ని వివరించాడు.

 

ఇంటి మూడువైపులా ఖాళీస్థలంలో రకరకాల చెట్లు ఉన్నాయి. ట్రాపికల్ ప్రాంత చెట్లు అంతగా చూడని కౌశిక్ వాటిగురించి తెలుసుకున్నాడు. వాడకంలో లేని రాగి అండా, కట్టెలపొయ్యి, ఉట్లు, కుంపటిలాంటి కొన్ని వస్తువులను చూశాడు.

 

పచ్చటి అరిటాకుల్లో భోజనాలు వడ్దించింది గిరిజమ్మ. భోజనాలు చేసేప్పుడు నీలకంఠాన్నడిగి ముందుతరాలనాటి జీవితవిధానాన్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాడు కౌశిక్.

 

మధ్యలో గిరిజమ్మ చేసిన వంకాయకూరను మెచ్చుకున్నాడు. ‘ఇంకా రుచిగా ఉండాల్సిందని, కానీ ఇదివరకులా ఇప్పుడక్కడ మంచి వంకాయలు దొరకట్లే’దని చెప్పిం దామె. చివరికొచ్చాక ఆకుపక్కనే ఉంచిన చక్కెరకేళి అరటిపండుని తొక్కతీసి ముక్కలుచేసి మజ్జిగన్నంతో కలిపి తిన్నాడు కౌశిక్. “మాబాబే, అంతదూరమెళ్లినా యిక్కడి పద్ధతులేవీ వదల్లేదు" అంది గిరిజమ్మ మురిపెంగా. వాళ్లిద్దరివైపు వింతగా చూశాడు నిరంజన్.

 

కాస్సేపు పడుకుని, లేచి కాఫీలుతాగాక, బయట అరుగులమీద కూర్చున్నారు. కౌశిక్ దారిలో ‘కౌశికి’ నదినిచూసి నిరాశచెందడం గురించి చెప్పాడు నిరంజన్.

 

"ఈప్రాంతంలో శ్రోత్రియం భూములివ్వడం మొదలెట్టాక వైదిక వ్యవహారాలకోసం అగ్రహారాలన్నీ స్వచ్చమైన పారేనీరున్న కౌశికికి అటూఇటూగా ఏర్పడ్డాయంటారు. కానీ ఇప్పుడు కౌశికి ముక్కలై, నదీ డ్రైనేజి కలసిపొయి నీళ్లుపారని కాలవలాగా మిగిలింది" అన్నాడు నీలకంఠం ఉదాసీనంగా.

 

“మరి వైదిక్ ఎడ్యుకేషన్ కీ, రిట్యుయల్స్ కి ఇబ్బంది కాదా?” అడిగాడు కౌశిక్

 

“దగ్గరలో నది ఉంటే వాటికి బావుంటుంది నిజమే. అయినా వ్యవసాయానికి పంటకాలువలు కూడా ముఖ్యమేకదా" జవాబిచ్చాడు నీలకంఠం.

 

"పూర్వం యీవూళ్లో కనీసం యింటికో వేదపండితుడు వుండేవాడని విన్నా. పొద్దునపూట వేదఘోష, సాయంత్రం వీదరుగులమీద పండితచర్చలు వినబడేవన్నారు. యిప్పుడుకూడా వున్నారా?" అనడిగాడు నిరంజన్

 

"ఇప్పుడీ ఊళ్లో అలాంటి వేదపండితులెవ్వరూ లేరు. చుట్టుపక్కల అగ్రహారాల్లో కొద్దిమందే మిగిలున్నారు. గోదావరి రెండుశాఖల మధ్యనున్న ‘త్రికోణసీమ’ కాలప్రవాహంలో కోనసీమ అయినట్టుగానే ఆ తరం కూడా అంతరించింది. ఆమండువాలు, అరుగులూ పోతున్నాయి. మా ముందుతరంనుంచే ఇంగ్లీషు చదువుల్లోకి వెళ్లడం మొదలైంది" అన్నాడు నీలకంఠం విచారంగా.

 

"రియల్లీ?.. ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు కౌశిక్.

 

"వైదిక విద్య చాలా క్లిష్టమైన విద్య, చిన్న వయసునుంచే ఎంతో నిష్టగా కష్టపడి సంవత్సరాలపాటు నేర్చుకోవాలి. ఇంతాచేస్తే అది లౌకికమైంది కాదు. దానివల్ల బ్రతుకుదెరువు ఏముంది? గౌరవం అన్నం పెట్టదుకదా. ఆ గౌరవంకూడా ఇప్పుడు ఎక్కడుంది? నేనుకూడా కొన్నాళ్లు వేదం చదివినవాడినే. జరగబోయేది గ్రహించారో ఏమో, మానాన్నగారు అది మాన్పించి స్కూల్లో చేర్పించారు” అన్నాడు నీలకంఠం. చిన్నప్పుడు వేదం చదువుకోవడంవల్ల నీలకంఠం అచ్చులు స్పష్టంగా పలకడం నిరంజన్ గమనించాడు.

 

“కనీసం దీన్ని మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్ లాగా ఒక ఫైనార్ట్ గా రికగ్నైస్ చేసి సొసైటి సపోర్ట్ చెయ్యచ్చుగా?" అడిగాడు కౌశిక్ .

 

"మనప్రాంతంలో వాటికే సరైన ఆదరణ లేదు" అన్నాడు నిరంజన్

 

"రాజులకు, జమిందార్లకు వేదంమీద నమ్మకం, గౌరవం ఉండి, దాన్నొక అవసరంగా అనుకుని, శ్రోత్రియం భూములిచ్చి ప్రోత్సహించారు. ఆతర్వాత కాలంమారి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పండితులు సంసారాల్ని ఈదడంలో ఆ భూములూ చాలావరకూ పోయాయి. పరిస్థితినిబట్టి అందరూ స్కూలు చదువుల్లోకి మారిపోయారు" వివరించాడు నీలకంఠం.

 

“లూప్ లైన్ని వదిలేసి మెయిన్ లైన్ కి వెళ్లిపోయారన్నమాట, అన్నిదేశాల్లోలాగే” అన్నాడు నిరంజన్.

 

"వెరీ శాడ్. వేల సంవత్సరాల లెగసీని మనం వదిలేసుకుంటున్నాం" అన్నాడు కౌశిక్.

 

బయట చల్లబడింది. గిరిజమ్మ లోపల్నించి వచ్చి "పిల్లల్ని అలా తీసుకెళ్లి గుడీ అదీ చూపించుకురండి" అంది. ‘పదండి’ అంటూ లేచాడు నీలకంఠం.

 

ముందుగా ఊరికి కాస్త దూరంలో ఉన్న కౌశికిదగ్గరికి తోటలమధ్యగా నడుచుకుంటూ వెళ్లారు. అక్కడకూడా నది నీరడుగంటిన పంటకాలవలాగుంది. కౌశిక్ తల అడ్డంగా ఊపి నిట్టూర్చాడు. నిరంజన్ అతని భుజంచుట్టూ చెయ్యేసి ‘స్టాప్ రిలేటింగ్ టు ఇట్' అన్నాడు.

 

నిదానంగా వీధిలోని ఇళ్ల ని, అరుగుల్నీ చూస్తూ గుడివైపు నడిచారు. మధ్యలో నీలకంఠం వాళ్లని ఒక పెద్ద మండువాఇంట్లోకి తీసుకెళ్లి లోపల గుండ్రటిస్థంభాలున్న మండువాను చూపించాడు. దారిలో తగిలినవాళ్లందరికీ నీలకంఠం సోదరులిద్దర్నీ పరిచయం చేశాడు. వాళ్లు కౌశిక్ కుటుంబం ఎప్పటినుంచో తెలిసివున్నట్టుగా కుశలప్రశ్నలు వేయడం అతనికి ఆశ్చర్యమైంది. మాటల్లోవున్నా కౌశిక్ ఆవీధిలోని సగం పెంకుటిళ్లు మూతపడివుండడం గమనించాడు. అందులో కొన్ని కూలిపోయి చెట్లు మొలిచినవైతే, మరికొన్ని హాంటెడ్ హౌసెస్ లాగా దుమ్ముకొట్టుకునీ ఉన్నాయి. బాగున్నవాటిలో కొన్ని సీమెంటుతో కట్టిన ఆధునిక డాబాఇళ్లున్నాయి. అగ్రహారం గురించిన అతని ఊహాచిత్రం వివర్ణమైంది.

 

వీధి మధ్యలో ఒక కొత్తడాబాను చూపించి ‘కౌశిక్ పూర్వీకులుండిన మండువా పెంకుటిల్లు’ అక్కడే ఉండేదని నీలకంఠం చెప్పాడు. కౌశిక్ నిరాశగా చూస్తూ కాసేపు నిలబడ్డాడు. అతనికి తమపూర్వీకులతో బంధం పూర్తిగా తెగిపోయినట్టనిపించింది. మొత్తంగా అగ్రహారం ఒక ‘హాఫ్ డెసెర్టెడ్ ప్లేస్’ గా ఉన్నట్టు కౌశిక్ కి అనిపించింది.

 

"ఇదే కేరళలో అయితే కాంక్రీటుతో కట్టినా మండువాతో పెంకుటిల్లులాగే కడతారు" చెప్పాడు నిరంజన్.

 

గుడి బాగాపాతదేగాని ఆమధ్య రెనొవేట్ చేశారట. విశాలమైన ఆవరణలో పూలచెట్ల మధ్య  రంగురంగుల చిన్న గోపురాలతో నాలుగు గుళ్లున్నాయి. వాటి లోపలంతా టైల్స్ పరచివున్నాయి. భక్తుల సంఖ్య బాగానే ఉంది. కుళాయి దగ్గర కాళ్లు కడుక్కున్నారు.

 

"మొదట శివాలయం ఒకటే ఉండేది. తరువాత రాముడిగుడి, మొన్నామధ్య సుబ్రమణ్యస్వామికి, అయ్యప్పకూ చిన్న మందిరాలు ఏర్పరిచారు. చెరువుకు అటువేపు కొత్తగా సాయిబాబా మందిరం కడుతున్నారు. ఇప్పుడు పేటలోవాళ్లు ఈ గుళ్లను బాగా సపోర్ట్ చేస్తున్నారు" అని శివాలయంవైపుకి నడిచాడు నీలకంఠం.

 

"యీ టెంపుల్స్ మా చిన్నప్పటికంటే యిప్పుడు బాగా కళకళలాడుతున్నాయి" అన్నాడు నిరంజన్

 

"మా ఊరిక్కూడా టూ డికేడ్స్ బ్యాక్ పెద్ద టెంపుల్ వచ్చింది. ఐ మీన్… టెంపుల్ కట్టారు. మా ఇంట్లో మాఅ మ్మే కాదు, అక్కడ అందరూ ఈ పూజలు, వ్రతాలు చేస్తారు" చెప్పాడు కౌశిక్

 

గుడినుంచి బయటకువచ్చేసరికి చీకటి పడింది.

 

"మేమలా పేటవైపు వెళ్లొస్తాం" చెప్పాడు నిరంజన్ మరోవైపుకు దారితీస్తూ.

 

"త్వరగా వచ్చేయండి" అన్నాడు నీలకంఠం ఇంటివైపు నడుస్తూ.

 

చెరువు, ఆపైన స్కూలు దాటి మల్లన్నపేటవైపు నడిచారు. ఊరిముందరే గ్రామదేవత గుడి ఉంది. అదికూడా పునర్నిర్మించినట్టుగా కొత్తగా ఉంది. సీరియల్ లైట్లు వెలుగుతూ ఆరుతూ ఉన్నాయి. పక్కనే పెద్ద రావిచెట్టుంది. నిరంజన్ కౌశిక్ ని గుళ్లోకి తీసుకెళ్లాడు. అక్కడున్న విగ్రహం నిలువెత్తుగా, వేరుగా ఉండడం చూసి కౌశిక్ విభ్రమ చెందాడు.

 

"ఇక్కడ డైటీ మరొకలా ఉందే" అన్నాడు కౌశిక్ బయటికి వచ్చాక.

 

"యీ టెంపుల్  అగ్రహారంకంటే ముందునుంచే వుందిట" చెప్పాడు నిరంజన్.

 

కొంచెం ముందుకు వెళ్లాక బజారువీధి మొదలైంది. వీధిలైట్ల వెలుగులో రెండువైపులా దుకాణాలతో, బడ్డీలతో, మోటారుసైకిళ్లతో, తిరుగుతున్న మనుషులతో అంతా హడావుడిగా ఉంది. కాఫీబడ్డీ దగ్గర ఐదారుగురు కుర్రాళ్లు గుంపుగా నిలబడి నవ్వుతూ గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఒకచోట ట్రాక్ట ర్లోంచి షాపులోకి సరుకులు చేరుస్తున్నారు. దూరంగా ఒక లారి ఆగివుంది. బజారు వెనక వీధుల్లో చిన్న చిన్న మేడలు కనిపిస్తున్నాయి.

 

"ఇక్కడ సందడిగా ఉంది" అన్నాడు కౌశిక్ బజారువీధిని చూస్తూ.

 

"పొద్దున్నుంచీ మనం గతంలో ఉన్నాము. యిది వర్తమానం. ఫ్యూచర్ కూడా యిక్కడే  వుందనుకుంటా” అన్నాడు నిరంజన్ నవ్వుతూ.

 

ఆ మర్నాడు ఉదయమే బయలుదేరి మూడునాలుగు అగ్రహారాలు చూశారు. ఆతరువాత అమలాపురం వెళ్లి నిరంజన్ స్నేహితుడిని కలిసి, ఓడలరేవు బీచ్ చూసుకుని రాత్రికి ఇల్లు చేరుకున్నారు.

 

ఆ రాత్రి భోంచేశాక అరుగులమీద కూర్చున్నారు. తోటల్లోంచి చెట్లవాసనలతో వీచే చల్లగాలి చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది.

 

"ఐతే తాతగారూ ఇక్కడ కౌశికితో పాటే వేదిక్ కల్చర్ కూడా అంతరిస్తున్నట్టేనా?" నిరాశగా అడిగాడు కౌశిక్.

 

"పూర్తిగా పోలేదు. ఈ చుట్టుపక్కల కొన్ని వేదపాఠశాలలున్నాయి. పూర్తిగా వేదమే  చదువుకునే వాళ్లున్నారు" అన్నాడు నీలకంఠం

 

"మరి వాళ్లంతా మళ్లీ ఇక్కడికొచ్చి అగ్రహారాల్లో ఉంటారా" కొంచెం ఆశ ధ్వనించింది కౌశిక్ గొంతులో.

 

“చెప్పలేం. ఈప్రాంతంలో మునుపటి పోషకులు ఇప్పుడు లేరు. ఎవరు వేదాన్ని అవసరమనుకుని ఆదరిస్తున్నారో వాళ్లదగ్గరికి వెళ్తున్నారు. పరిస్థితులిలాగే ఉంటే కొన్నాళ్లకు యిక్కడ పండితులెవరూ లేకపోయినా ఆశ్చర్యం లేదు" చెప్పాడు నీలకంఠం.

 

"వేదం చదువుకున్న పండితులు యిప్పుడు హైద్రాబాద్, బెంగుళూర్లలో ఉన్నారు. ఫంక్షన్లలకు వస్తూంటారు" అన్నాడు నిరంజన్.

 

"రియల్లీ? అది మంచిదే కదా" అని "మరి ఇక్కడ ఇంత ఎస్టాబ్లిష్ మెంట్ అంతా ఉంది కదా" అన్నాడు కౌశిక్

 

"నదులు, ఇళ్లూ కాదు, పోషకులెక్కడున్నారన్నది ముఖ్యం. అగ్రహారాల్లో సంప్రదాయం, ఆచారాల్లాంటి ఉపాంగాలు ఉన్నంతలో ఇంకా మిగిలాయి. ప్రస్తుతానికి వీటివల్లే ఎంతోకొంత ఆదరణ" అన్నాడు నీలకంఠం.

 

“పొద్దున్నే దూరప్రయాణమంటున్నారు ఇక పడుకోండి" అంది లోపల్నుంచి గిరిజమ్మ. ముగ్గరూ లేచారు.

 

"లౌకికమైనవి కాలం మారినప్పుడు అలౌకికమైనవి ఐపోతా యనుకుంటా. ఆ తర్వా త అవేమౌతాయో ఎవరికి తెలుసు" అన్నాడు నీలకంఠం కౌశిక్ బుజంతట్టి లోపలికెళ్తూ.

 

మరుసటిరోజు ఉదయమే విశాఖపట్నానికి ప్రయాణమయ్యారు. కౌశిక్ కారెక్కేముందు మరోసారి వెళ్లి కౌశికిని చూసొచ్చాడు.

 

* * *

ఆ శనివారం కొన్ని సెయింట్ లూయిస్ తెలుగుకుటుంబాలు గంగిరెడ్డి ఇంట్లో సత్యనారాయణవ్రతం సందర్భంగా కలిశాయి.

వ్రతం అయ్యాక లోపల కొందరు విష్ణుసహస్రనామం చదువుతున్నారు. పెరట్లో కొంతమంది అతిధులు ఒకవైపు చేరి ఆమధ్య ఆవూర్లో జరిగిన తెలుగు కార్యక్రమాలగురించి మాట్లాడుకుంటున్నారు. రవీంద్రబాబు, జగన్నాథ్, కౌశిక్ ఇంకా నలుగురైదుగురు ఒకమూలనున్న ఆపిల్ చెట్టుకింద కూర్చున్నారు.

 

“కౌశిక్ యిండియానుంచొచ్చాక మీ అగ్రహారంగురించి చెప్పింది వింటే చాలా బాధేసింది. అంతగా వేదం విలసిల్లినచోట మన సంస్కృతి అంతరించినట్టేనా అని భయమేస్తావుంది. యేదోవొకటి చెయ్యాలనుకుంటున్నాం" అన్నాడు రవీంద్రబాబు విచారంగా.

 

“ఒక అగ్రహారంలో ఒకాయన వేదం లైవ్ గా పాడుతుంటే థ్రిల్లింగ్ గా ఉంది, గ్రేట్ సౌండ్. ఐతే, కౌశికి రివర్ పోయినట్టే, ఆ గ్రేట్ ఆర్ట్ కొన్నాళ్లకు అక్కడ వానిష్ ఐపోతుందంటున్నారు" ఉద్వేగంగా చెప్పాడు కౌశిక్.

 

"మ్యూజికల్ గా ఆ రిథిం గొప్పగా ఉంటుంది, టైమ్ లెస్" అన్నాడు జగన్నాథ్.

 

"అది మామూలు లయకాదు మహాలయ" చెప్పాడు పక్కనే కూర్చుని వీళ్లమాటలు వింటున్న లింగస్వామి. అతను మృదంగ విద్వాంసుడు, బళ్లారిలో ఉంటాడు, ఇక్కడ కొడుకుదగ్గరికొచ్చాడు. ఆ పక్కనే కూర్చున్నవాళ్లు ఆకాశంవైపు చేతులెత్తి నమస్కరించారు.

 

"అదంతా క్రమంగా అంతరించిపోతూందంటే మాకు ఆందోళనగా… " అంటూన్న రవీంద్రబాబు మాటలు పూర్తికాకుండానే- ఒక కుర్రాడు హడావుడిగా పెరట్లోకి వచ్చి "వాళ్లొచ్చారు, అందర్నీ లోపలికి రమ్మంటున్నారు" అని చెప్పి లోపలికి వెళ్లిపోయాడు.

 

లోపల హఠాత్తుగా వేదపఠనం మొదలైంది. వేదపండితుల గొంతుల్లోంచి వెలువడుతున్న నాదంతో ఇల్లంతా మారుమ్రోగుతోంది. పెరట్లోనివాళ్లంతా లోపలికెళ్తున్నారు. రవీంద్రబాబు ఆశ్చర్యంగా లేచి నిలబడి, “పద” అంటూ జగన్నాథ్ వైపు చూశాడు.

 

"కంగారుపడకు. మీరనుకుంటున్నట్టు అదెక్కడా అంతరించిపోవడంలేదు, కొంత మన వెనకాలే మిసిసిపికి వచ్చింది. కాకపోతే మొదటిదైనా మిగతావాటికంటే చివరన వచ్చింది. అంతే!" నవ్వుతూ అన్నాడు జగన్నాథ్ తనుకూడా లేస్తూ.

 

జగన్నాథ్ అన్న ఆ మాటలు కూడా ఆ వేదనాదంలోని మహాలయలా శృతిబద్ధంగా తోచాయి రవీంద్రబాబుకు. మనసుని అనిర్వచనీయమైన సంతృప్తి ఆవరించగా ఇంట్లోకి నడిచాడు.

 

 

 

*****

bottom of page