top of page
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
ప్రియమైన మహానటికి
సేకరణ: మెడికో శ్యాం
Society for Social Change, Kavali వారు వెలువరించిన సామల సదాశివ గారి స్మృతి సంచిక ‘పరిశోధన’ లోని వ్యాస సంపుటిలో ఒకటి మహానటి సావిత్రి పై సూసన్ హేవర్డ్ రాసిన ఒక ఆంగ్ల వ్యాసానికి తెలుగీకరణ. ఆమె ఎప్పుడు రాశారో తెలియదు. అయితే 1962లో ఆమె అనుకోకుండా ఇండియా వచ్చినప్పుడు సుచిత్రా సేన్ సావిత్రి గారిని మంచి నటిగా చేసిన పరిచయం, అప్పటినుంచి విడవకుండా అమెరికా వచ్చిన తరువాత కూడా సావిత్రి నటించిన సినిమాలు చూడడం, సావిత్రిని కలియకుండానే సావిత్రి నటనపై, సూసన్ పెంచుకున్న ఆరాధన, అభిమానం, గౌరవం, ఇవీ ఈ ఉత్తరంలోని ముఖ్యాంశాలు.
నాకు తెలుసు హాలీవుడ్ నుంచి ఎవరై ఉంటారని ఆలోచిస్తూ ఉంటారు మీరు. నేను సూసన్ హేవర్డ్.. హాలీవుడ్ యాక్ట్రెస్ సూసన్ హేవర్డ్‌ని. నేను మీ అభిమానిని. నేను మీ అభిమానిని ఎప్పుడయ్యానని ఆలోచిస్తున్నారా? అసలు మీ గురించి నాకెలా తెలిసిందా అని ఆశ్చర్యపడుతున్నారా? వినండి చెప్తాను. కాదు కాదు చదవండి. 1962 లో ఒకసారి ఇండియా వచ్చాను. నేనే కాదు నాతో పాటు మా డైరెక్టర్, ప్రొడ్యూసర్‌తో సహ ఎంటైర్ యూనిట్ ఉంది. షూటింగ్ నిమిత్తం బ్యాంకాక్ వెళ్లవలసి ఉంది. కాని మా ఫ్లైట్ వాతావరణం బాగోలేక కలకత్తాలోనే దిగింది. మేము దిగింది కలకత్తా. ఇండియా అనగానే మాకు గుర్తు వచ్చింది సత్యజిత్ రే. వెంటనే ఆ ఓరియంటల్ జీనియస్‌ని చూడాలనుకున్నాము. ఎయిర్‌పోర్ట్ అఫిషియల్స్‌కు చెప్పగానే వారు సత్యజిత్ రే కి కబురు పంపారు. ఒక గంటలో సత్యజిత్ రే, సుచిత్రా సెన్ మరికొందరు మా హోటల్ రూంకు వచ్చారు. సుచిత్రాసేన్‌ను తన పిక్చర్స్ చూపించమన్నాను. తను అలా చెయ్యనంది. మీకు నీ నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడైనా కావచ్చు. మీ ఈ సమయాన్ని అత్యంత సద్వినియోగం చేసుకోవాలి. నన్ను మీరు ఎలాగూ చూశారు కనుక మీకు ఇప్పుడు మా దేశం గర్వించే ఒక నటీమణిని చూపిస్తాను. చూడండి అని ప్రొజక్టర్ మీద ఒక సినిమా చూపించింది. అది 'కన్యాశుల్కం' సినిమా.
and with that I fell in love with you.
'కన్యాశుల్కం' లో మధురవాణి పాత్ర ఒక అద్భుతమైతే, మీ నటనతో ఆ పాత్రకు జీవం పొసి, ఇంకో అద్భుతం సృష్టించారు. ఆ సినిమాలో రామప్ప పంతులుకి తాంబూలం తినిపిస్తూ, లుబ్దావధానులుకి మళ్లీ పెళ్ళి చేస్తామంటూ పంపించేవరకు మీరు చూపిన నటన నాకు ఎంతొ నచ్చింది.
ఈ సినిమాలో మీ బాడీ లాంగ్వేజ్, ముఖంలో చూపించిన హావభావాలు మరియు కళ్లతో పలికించిన భావాలు అన్నీ అద్భుతాలే. మీ నటనలో బ్ల్రహ్మాండమైన లయ ఉంది. మీ చూపు, ముఖ కవళికలు, శరీర కదలికలు అన్నీ ఒకే భావాన్ని వ్యక్తం చేస్తాయి. అందుకే మీ నటన పరిపూర్ణమైనదైంది. మీరు ఈ సినిమాలో ఒక చోట, ఒకేసారిగా నవ్విన నవ్వు నిడివి ఒక అర నిమిషం. నేను ఒక 20 సెకండ్స్ ఆపకుండా నవ్వటానికి ప్రయత్నించాను. ప్రతి 5 సెకండ్లకి నా నవ్వు ఆగిపోయేది. ఎంతో కష్టం మీద మళ్లీ నవ్వు తెచ్చుకోవాల్సి వచ్చెది. ఇలా ప్రతి 5 సెకండ్లకు నవ్వి, అతుకులు వేసుకుంటూ, ఓ అరనిమిషం నవ్వు పూర్తి చేయగలిగాను. అయినా నా అతుకుల నవ్వు మీ ఆణిముత్యాలతో సమానమా?
మీ ఈ నవ్వుని నేను రికార్డు చేసి పెట్టుకున్నాను. నాకు మీ నవ్వు స్ట్రెస్ రిలీవరే కాదు, నన్ను ఉత్సాహపరిచేది. నటనలో నేను అందుకోవాల్సిన ఎత్తులు ఇంకా ఉన్నాయని గుర్తు చేసే పాఠాలు కూడా.
ఆ సినిమా ఆ రోజు అక్కడ చూసిన తరువాత ఆ ఫిల్మ్ తీసుకొని మరీ బ్యాంకాక్‌కు బయలుదేరాను. బ్యాంకాక్‌కు వెళ్ళినా, అక్కడ నుంచి మళ్లీ అమెరికా వచ్చిన ఆసలు మిమ్మల్ని నేను మరిచిపోతేగా. సెట్స్ మీద ఉన్నా కూడా మీ అందం , మీ రూపు, మీ నవ్వు మనసులో మెదలుతూనే ఉన్నవి. అసలు బ్యాంకాక్ నుంచి మళ్ళీ ఇండియా వచ్చి ఒక్కసారి మిమ్మల్ని కలిసి వెళదామనుకున్నాను. కానీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదు. మళ్లీ వెళ్ళే ఫ్లైట్ కూడా ఏదో కారణం చేత మళ్లీ ఇండియాలో దింపేస్తే బాగుండు అనుకున్నాను. అదిగో ఆనాటినుంచి నేటి వరకు కూడా మిమ్మల్ని కలుసుకోలేకపోయాను. హాలీవుడ్ యాక్ట్రెస్‌ని కదా, మరి ఈ ఫీల్డులో మన టైం మన చేతిలో ఉండదు. సెక్రటరీస్ చేతులలో, ప్రొడ్యూసర్ల చేతులలో ఉంటుంది. కానీ మీ సినిమాలు అన్నీ తెప్పించుకున్నాను. సుచిత్రా సేన్‌ను మీ గురించి అడుగుతుంటాను. మీకో పాప, ఒక బాబు అని కూడా తెలిసింది. అన్నింటికీ మనసులోనే అభినందించుకున్నాను. సుచిత్రాసేన్ ఒక్కో రోజు అడిగేది నన్ను " మీ గురించి సావిత్రికి చెప్పేయమంటారా?" అని. నేను వద్దన్నాను. ఎందుకంటే మీకు నేను ఒకసారి ఎదురుబడి మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచేద్దామని అనుకున్నాను. ఒకసారి నాకు సుచిత్రాసేన్ మీరు నా సినిమాలు చూసి ఉన్నారని, మీకు నేను అభిమాన నటిని అని చెప్పింది. అది తెలిసి ఎంతో ఆనందించాను. ఉబ్బితబ్బిబ్బు అయిపోయాను. మీ అంతటి మహానటిని నన్ను అభిమానించటం నా అదృష్టం.
మీ ప్రతి సినిమాని ఒక్కొక్కటి నాలుగైదుసార్లు చూశాను. ఇన్‌ఫ్యాక్ట్ మీ సినిమాలే నాకు స్ఫూర్తి. మీ నుంచి నేర్చుకొవటానికి ఎంతో ఉంది. కాని మీది ఇండియన్ కల్చర్. అందులోనూ మీకు వచ్చిన సాత్వికమైన పాత్రలు మా హాలీవుడ్ కల్చర్‌కి సరిపడవు. లేకుంటే హాలీవుడ్‌లో వాళ్లందరూ మరో సావిత్రిని చూసేవారు. అంటే నేను అంతగా మిమ్మల్ని ఇమిటేట్ చేసున్నానన్నమాట. అయిన ఈ బావిలో ఉన్న హాలీవుడ్ కప్పలకేం తెలుసు మీ చేత నా పాత్ర నటింపచేసి, నేను నేర్చుకొని వచ్చి ఇక్కడ నటిస్తే కచ్చితంగా ఆస్కార్ నాదేనని నాకు గట్టి నమ్మకం. కాని ఎక్కడా నాకు కుదరనే లేదు.
మీరు మీ కల్చర్‌కు తగ్గట్లు ఆమోఘమైన నటన ప్రదర్శించారు. ఎన్నని చెప్పను. మీకు గొప్ప పేరు తెచ్చిన 'దేవదాసు' సినిమా నుంచి మొదలు పెడితే, మీరు 'దేవదాసు'లో చాలా గొప్పగా నటించారు. అది మీ మొదటి చిత్రాల్లోనిది అంటే నమ్మటం కష్టం. ఇక 'దేవదాసు' కొస్తే దానిలో ఒక పాటలో "నా ఎడుటే నీ బడాయి" అంటూ మురిపెంగా మీరు ప్రదర్శించిన చిరుకోపం అనితర సాధ్యం.
'దేవదాసు'లోనే మీరు దేవదాసుకి ఏవో తింటానికి తెచ్చినప్పుడు "కళ్లు మూసుకో" అనేముందు నవ్వి తర్వాత డైలాగ్ చెప్తారు. అది చాలా గొప్పగా ఉంటంది. ఆర్టిస్ట్‌లందరూ ఏడుపు సీన్ ఈజీగా చేసేయగలరు. కాని సుకుమారంగా చెయ్యగలగటం అనేది మాత్రం ఆర్టిస్ట్ యొక్క నటనా కౌశల్యం మీద ఆధారపడి ఉంటుంది. అది మీకు పుష్కలంగా ఉంది.
నేను మొదట 'మిస్సమ్మ' చూసి మీరు పొగరుబోతు పాత్రలు బాగా మెప్పించగలరు అనుకున్నాను. మీరు నిజంగానే కాస్త పొగరుగా ఉంటారేమోనని అనిపించింది. కాని ఆ తర్వాత 'అర్ధాంగి' చూస్తే మీరు ఏ పాత్రనైనా చేయగలరనిపించింది. ఊరికే చేయటం కాదు. ఆ పాత్ర స్వభావాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తారు.
తర్వాత 'తోడికోడళ్లు' తీసుకుంటే "ఆడుతు పాడుతు పని చేస్తుంటే" పాటలో అనురాగాన్ని, మొహమాటాన్ని, పరవశత్వాన్ని కలిపి ఏకకాలంలో అభినయించటం మీకే చెల్లింది.
అటు తర్వాత 'దొంగరాముడు' "చిగురాకులలో" పాటలో "ఎవరనినారో ఈ మాట వింటున్నాను నీ నోట" మిమ్మల్ని ప్రశంసించిన ప్రియుడి మాటలకు కేవలం పొగడ్తేనా, నిజమా అనే అనుమానం ఆ వదనంలో ఎంత చక్కగా ప్రతిఫలింప చేశారో ఎంత చెప్పినా తక్కువే. విలన్‌ని కవ్విస్తూ పాడిన 'రావోయి మా ఇంటికి' పాటలో కృత్రిమపు కులుకులు, అతనిపై క్రోధం, కసి కలగాపులగంగా ప్రదర్శించటం ఇతరులకు సాధ్యం కాని విషయం.
ఇక 'మాయాబజార్' విషయానికొస్తే ఎవరన్నారు మీరు మీ కెరియర్‌లో ద్విపాత్రాభినయం చెయ్యలేదని. ఒకే మనిషికి వేరు వేరు వేషధారణ, వేరు వేరు ఉచ్చారణ ఇస్తేనే ద్విపాత్రాభినయం ఔతుంది అనుకుంటున్నారు మీ వాళ్ళు. కాని వాళ్లు గుర్తించారో లేదోగాని మీరు 1957లోనే గొప్ప ద్విపాత్రాభినయం చేశారు. భారతదేశ సినిమాలన్నింటిలోను అన్ని ద్విపాత్రాభినయం మీద మీరు 'మాయాబజార్' లో చేసిన ద్విపాత్రాభినయం గొప్పది. రెండు పరస్పర విరుద్ధ స్వభావాలను ఒకే పాత్రలో మీరు మెప్పించిన తీరు అద్భుతం. ఈ సినిమాలోనే ' సుందరి నీవంటి దివ్యస్వరూపం' అనే పాటలో మీరు చేసిన నృత్యం, చిలిపి చేష్టలు ఎంతో ముచ్చటగా ఉన్నాయి.
మీ అన్ని సినిమాల్లో కెల్లా మీ శరీరాకృతి ఈ సినిమాలో ఎంతో చక్కగా ఉంది. 'మిస్సమ్మ'లో మీ చిన్న వయసు మీ మోములోనూ, శరీరాకృతిలో తెలిసిపోయింది. కాని 'మాయాబజారు' వచేసరికి మీ ముఖారవిందం సరేసరి. మీ శరీరాకృతి పరిపూర్ణత సంతరించుకుంది.
‘మామకు తగ్గ అల్లుడు'లో మీ నటన నన్ను మరోసారి అబ్బురపరచింది. మీరు హస్యపాత్రను కూడా అంతే సునాయాసంగా చేయగలుగుదురని నిరూపించుకున్నారు.
'మా బాబు' లో డాక్టరు మిమ్మల్ని, బాబుని ఇంటికి తీసుకువచ్చినప్పుడు, మీ సంభాషణలు, మీరు చూపిన భావ ప్రకటనలు అసమానం.
'చివరకు మిగిలేది'లో మీరు చూపిన సంఘర్షణ నా మనసును పిండేసింది. ఆ సినిమాలో నాకు 'పద్మ' అనే ఆవిడ బాధే కనిపించింది గాని సావిత్రి ఎక్కడా కనిపించలేదు.
'వెలుగు నీడలు, 'రక్త సంబంధం', 'ఆరాధన'లో కూడా మీ నటన అద్భుతం.
'గుండమ్మ కథ'లో మీరు అతి సౌమ్యవతిగా కనిపించడం నాకు ఆశ్చర్యమేసింది. నేను అప్పటిదాకా చూసి ఉన్న మీ పాత్రలు సౌమ్యమైనవే అయినా ఈ పాత్రలొ ఎంతో లీనమై కనిపిస్తారు. మీరు నిజంగానే సౌమ్యులై ఉంటే తప్ప ఆ పాత్రను అలా మెప్పించలేరు అనిపిస్తుంది. కాని మీరు చాలా హుషారుగా ఉండే మనిషి అని తెలిసింది నాకు. అంత హుషారుగా ఉండే మనిషి అంత సౌమ్యంగా ఎలా చేయగలిగారంటే.. మీరు గొప్ప నటులు కనుక. ఇదే సినిమాలో మీరు 'కోలుకోలోయన్న కోలో నాసామి' అనే పాటలో హమ్మింగ్ చేస్తారు. అది చాలా బాగుంది. అదే పాటలో హీరో మీ వెనక వస్తున్నప్పుడు మీరు వడివడిగా నడవడం, ఆ తీరును నేనేమని వర్ణించను? ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్క 'మీరు జీవించారు' అనే పదం తప్ప.
మరలా ఇదే సినిమాలో 'కనులు మూసినా నీవాయే' అనే పాటలో శృంగార భావాన్ని పెదవులతో చూపించారు. పెదవులతో భావాన్ని చూపించడం ప్రత్యేకంగా శృంగార భావాన్ని, తన్మయ భావాన్ని చూపించడం నాకు తెలిసి మీ ఒక్కరిలోనే చూస్తున్నాను. ఈ పాటలో మీరు ప్రదర్శించిన హావభావాలు "నభూతో నభవిష్యతి"
'సిరిసంపదలు' లో వెండివెన్నెల జాబిలి నిండు పున్నమి జాబిలి' అనే పాటలో, పాటకి మధ్యమధ్యలో మీరు చూపిన హమ్మింగ్, నటన అమోఘం. ఈ పాటలో మీరు నటించలేదు. మీ కళ్ళే నటించాయి. చూసిన వారిని మైమరపించాయి. మీ మోము నిజంగానే వెండి వెన్నెల జాబిలి. ఆ కవి మిమ్మల్ని చూసే ఈ పాట రాసి ఉంటాడు.
'మూగ మనసులు'లో మిమ్మల్ని ప్రేమంటే ఏంటి అని అడిగినప్పుడు మీరు చూపిన నటన అమోఘం. అప్పటి మిమ్మల్ని చూసి ఎంతమంది హృదయతంతులు తెగి వుంటాయో? ఈ సినిమా అంతటా మీ నటన సహజంగా కన్నా మిన్నగా ఉంది.మరింత అందంగా ఉంది. మీ నటనా నిఘంటువులో ఒక అపురూప ఘట్టం ఈ సినిమాలో వుంది. నేనేమైనా చేయగలనా అని అనుమానపడుతూనే ప్రయత్నించాను. కాని విఫలమయ్యాను. మీరు 'ముద్దబంతి పువ్వులో..' అనే పాటను పాడమని సైగ చేశారా, లేక ఆజ్ఞాపించారా, లేక అనుమతి ఇచ్చారా అనేది ముందుగా నాకు తెలిస్తే, మీరు చూపించిన భావనని ఏమన్నా చేయగలుగుతానేమో, అప్పుడు కూడా చేయగలగుతాను అని కచ్చితంగా చెప్పలేను. సరే, ఏ భావంతోనైనా కానివ్వండి. సైగే కానివ్వండి ఆజ్ఞే కానివ్వండి లేదా అనుమతి ఇస్తున్నాను అనుకొని ఆయా భావాలు పలికించ చూసినా, మీరు తల తిప్పకుండా, కేవలం (ఇక్కడ కేవలం అనకూడదు) కళ్ళతో, పెదవులతోనూ ఆ భావాన్ని పలికించారు. నేను ఎంత ప్రయత్నించినా కేవలం కళ్లతోనూ, పెదవులతోనూ నేను భావప్రకటన చేయలేకపోయాను. నా తల పాడమని అనుమతిస్తూ కాస్త కదులుతూనే ఉంది.
'డాక్టర్ చక్రవర్తి' లో ‘నీవు లేక వీణ' అన్న పాటలో విరహాన్ని మీరు ప్రదర్శించిన తీరు అద్వితీయం. ఆ పాటలో మీరు ప్రదర్శించిన హావభావాలు దర్శకుల మాటలకు అందని 'సటిల్ ఫీలింగ్స్'. దర్శకుడు చెప్పలేకపోయినా మీరు ఆ విరహగీతాన్ని మీ ప్రతిభతో రక్తి కట్టించారు.
ఇలా ఎన్నని వివరించను మీ నటనా కౌశల్యం గురించి, మీరు నటించిన ప్రతి పాత్ర ఒక వజ్రం.
మీ మోము మీద హావభావాలు పాదరసంలా కదులుతాయి . ఏ భావం వచ్చినా మీ మొహంలోని అందం మాత్రం చెదరదు. ఇంతకు ముందు చెప్పానో లేదో కాని, మీ ప్రతి అవయవం నటిస్తుంది. మీ ముక్కుపుటాలు నటిస్తాయి. మీ భుజాలు కూడా నటిస్తాయి. ఉదాహరణకి 'మాయాబజార్'లో "ఆహా నా పెళ్ళంట" పాట. నేను గమనించిన ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మీ గొంతు ఏ స్థాయికి వెళ్ళినా కీచు రాదు.
దురదృష్టవశాత్తు భారతదేశంలో సినిమాలను హీరోల పేరుతో సంబోధిస్తారు. కాని నాకు మటుకు మీరు నటించిన చిత్రాలన్నీ 'సావిత్రి చిత్రాలే’. నాకు సుచిత్రా సేన్ ఒకటికి రెండు సార్లు చెప్పారు. మొదట్లో మీరే కావాలి అన్న హీరోలు కొంతమంది ఆ తరువాత "అమ్మో! సావిత్రి వద్దు. ఆమె ఉంటే మేమేమి ఆనుతాం జనానికి" అని మీరున్న సినిమాలో నటించడానికి భయపడేవారని.
తెలుగువారు అదృష్టవంతులు. మీరు వాళ్ల గడ్డ మీద పుట్టి వారు ఎంతో గర్వపడేలా చేశారు. నటులు అవ్వాలి అని అనుకునేవారికి ఒక విశ్వవిద్యాలయం అయ్యారు. మీరు ఒక్క భారతదేశానికే పరిమితం కాకపోయి ఉంటే , మీ ప్రతిభ యావత్ ప్రపంచంలో తళుకులీనేది.
నేను చివరిసారిగా చూసిన మీ సినిమా 'నవరాత్రి'. ఆ సినిమాలో పెళ్ళికు ముందు సీన్‌లో హీరో మిమ్మల్ని రమ్మని సైగ చేస్తే మీరు రానంటూ ముద్దుగా, మంకుగా, వెళ్లాలని ఉన్నా కూడా చిలిపి పంతంతో వెళ్లకపోవడం, ఆ తర్వాత వెళ్లి ఆనందాన్ని ప్రకటించే తీరు అమోఘం. ఇక్కడ మీ నటన, మీ అందాన్ని చూసి ఇక మిమ్మల్ని చూద్దామనే నిర్ణయానికొచ్చాను. అలాగే అనుకోవటంతోనే ఇంకో ఐదేళ్లు గడిచిపోయాయి. కాని ఇప్పుడు నేను వస్తున్నాను. మిమ్మల్ని చూడటానికి వస్తున్నాను.. ప్రేమతో...
.
ooo
bottom of page