MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
కవిత్వంలో ఆశావాదం , నిరాశావాదం
విన్నకోట రవిశంకర్
చాలాకాలం తరువాత కలిసిన ఒక బాల్య మిత్రునికి ఆమధ్య నా కవితలు కొన్ని చూపించాను. అతనికి కవిత్వం చదివే అలవాటు పెద్దగా లేదు. నా కవితలు చదివాక అతను "నీ కవితలు చదువుతోంటే నువ్వేదో నిరాశలో ఉన్నట్టుగా అనిపిస్తోంది." అన్నాడు. ఆతను చెప్పిన మాట నాకు ఆశ్చర్యం కలిగించింది. సాధారణంగా నిరాశ కలిగించే సామాజిక, రాజకీయ అంశాలకి దూరంగా, సామాన్యమైన జీవితానుభవాలకి మాత్రమే పరిమితమై రాసే నా కవిత్వమే అతనికి నిరాశగా ధ్వనిస్తే, అటువంటి అంశాలే తమ కవిత్వానికి పునాదిగా రాసే అనేకమంది ఇతర కవుల కవిత్వం చదివితే ఏమంటాడో అనుకున్నాను.
ఇంతకంటే చిత్రమైన మరొక సంఘటన. మహీధర మురళీమోహన్ గారి పేరు తెలుగు పాఠకులకి సుపరిచితమైనదే. ఆయన ఒక వ్యాసంలో ఈ సంఘటన గురించి వివరించారు. ఇదెప్పుడో డెబ్భైలనాటి మాట. అప్పట్లో ఆయన ఏదో ప్రాజెక్టు పనిలో భాగంగా కొన్నాళ్ళు స్వీడన్ లో ఉండేవారు. ఆ రోజుల్లో ఆయన పండిత రాయలు రచించిన “భామినీ విలాసం” కావ్యానికి తెలుగు అనువాదం చేస్తుండేవారట. హోళీ సందర్భంగా అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆ కావ్యం నుంచి కొన్ని శ్లోకాలు, వాటికి తాను చేసిన అనువాదం చదివి వినిపిస్తారు. వాటిలో ఒకటి :
నైర్గుణ్యమేవ సాధీయో ధిగస్తు గుణ గౌరవం
సాఖినోన్యే విరాజంతే ఖండ్యంతే చందన ద్రుమాః
దానికి ఆయన చేసిన అనువాదం
గుణవిశేషంబు కలిగిన కొంప మునుగు
నిర్గుణత్వంబె మేలని నేదలంతు
ఇతర వృక్షము లెల్ల వర్ధిల్లుచుండ
నరకబడుచుండు మంచి గంధంపు చెట్లు
దీనిని పోలిన జాతీయాలు మనకు తెలుగులో కనిపిస్తాయి - కాయలున్న చెట్టుకే దెబ్బలు, మంచి వాళ్ళకే ఎక్కువ కష్టాలు వంటివి.
ఐతే, ఈ శ్లోకం గురించి విన్న ఒక స్వీడిష్ వనిత what a pessimist అని వ్యాఖ్యానించిందట. అందరికీ అనుభవమైన ఒక వాస్తవాన్ని అర్థవంతంగా చెప్పిన శ్లోకంగా తాను అభిమానించే శ్లోకాన్ని ఆవిడ నిరాశావాదంగా భావించటం చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడట.
దీనిని బట్టి, ఏది నిరాశావాదం అన్నది కొంతవరకు వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాల మీదే కాకుండా, వారి సాంస్కృతిక నేపథ్యం మీద కూడా ఆధారపడి ఉంటుందనుకోవాలి. కానీ, స్థూలంగా చెప్పాలంటే వర్తమానంతో ప్రమేయం, భవిష్యత్తులో ఏదో మంచి జరుగుతుందనే ఆకాంక్ష ఆశావాదమైతే, ఎప్పుడూ గతంలో జరిగినదాని మీద చింత, వర్తమాన పరిస్థితుల మీద నిస్పృహ, ఏదీ మారదనుకోవటం వంటివి నిరాశావాదంగా పేర్కొనవచ్చు.
కవుల్ని సాధారణంగా నవయుగ వైతాళికులుగా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళు మార్పును ముందుగా కనిపెట్టి దానికి ఆహ్వానం పలుకుతారు. కానీ, అదే సమయంలో ఏదైనా మార్పు జరిగినప్పుడు దానివల్ల అనివార్యంగా తలెత్తే అసంతృప్తిని ముందుగా వ్యక్తం చేసేది కూడా కవులే. తెలంగాణా ఉద్యమాన్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఉద్యమ సమయంలోనూ, తెలంగాణా ఆవిర్భావ సమయంలోనూ గొప్ప ఆశాభావంతో కవితలు రాసినవారు అనేకమంది ఉన్నారు. వారు కోరుకున్న రాష్ట్రం, కోరుకున్న నాయకత్వంలోనే ఏర్పడినా, అది ఏర్పడిన కొద్దీ నెలల కాలంలోనే దాని మీద అసంతృప్తితో కవితలు రాసినవారూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే, కవులలో ఆశా, నిరాశలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. సందర్భాన్ని బట్టి వీటిలో ఒకటి నెగ్గుతూ ఉంటుంది.
తెలుగు కవిత్వంలో నిజమైన ఆశావాదంతో కూడిన స్ఫూర్తి మొదటిసారిగా భావకవిత్వంలో కనిపిస్తుంది. దానిలో వ్యక్తి స్వేచ్ఛ, సంస్కరణాభిలాష, మనుషులంతా ఒక్కటేనన్న భావన, బలంగా వ్యక్తమౌతాయి. కృష్ణశాస్త్రి గారు రెండు స్వేచ్చా గానాలు రాశారు. మొదటిదానిలో 'జగమునిండ స్వేచ్చాగాన ఝరుల నింతు’ అని వినమ్రంగా ప్రకటించిన తరువాత, రెండవదానిలో ఇంకా దృఢంగా, ధిక్కార స్వరంతో -
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా యిచ్ఛయేగాక నాకేటి వెరపు
పక్షినయ్యెద చిన్ని ఋక్షమయ్యెదను
మధుపమయ్యెద చందమామనయ్యెదను
మేఘమయ్యెద వింత మెరుపునయ్యెదను
అలరునయ్యెద చిగురాకునయ్యెదను
పాటనయ్యెద కొండవాగునయ్యెదను
పవనమయ్యెద వార్ధి భంగమయ్యెదను
ఏలకో యెప్పుడో యెటులనో గాని
మాయమయ్యెద నేను మారిపోయెదను
అంటారు. వ్యవస్థ నుండి విముక్తిని, దానికతీతమైన వ్యక్తి స్వేచ్ఛను చాటిచెప్పటం దీని ముఖ్యోద్దేశం. సరిగా అర్థం చేసుకుంటే, ఈ గీతం భావకవిత్వోద్యమ సారాన్ని, దానిలోని ఆశాభావాన్ని తెలియజేస్తుంది.( కానీ, దురదృష్టవశాత్తు తెలుగులో అత్యంత దురుపయోగం చెందిన కవితా వాక్యాలలో ఇది ఒకటిగా నిలిచింది. వ్యక్తిస్వేఛ్చను ప్రస్తుతించే ఈ వాక్యాన్ని అవకాశవాదులైన రాజకీయ నాయకులకి, అవినీతిపరులైన అధికారులకి అన్వయించి మన జర్నలిస్టు మిత్రులు భ్రష్టుపట్టించారు.)
శ్రీశ్రీ కవిత్వంలో సహజంగానే ఆశావాదం నిండి ఉంటుంది. మహాప్రస్థాన గీతంలో "పదండి ముందుకు, పడండి తోసుకు" అన్నా, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయని చెప్పినా,” పుడమితల్లికి పురిటి నొప్పులు కొత్త జగతిని స్ఫూరింపించా” యని సూచించినా, “నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవించా”నని జయభేరి మ్రోగించినా అన్నిటిలోనూ భవిష్యత్తు పట్ల గొప్ప ఆశ కనిపిస్తుంది. ఎప్పుడైనా సకృత్తుగా “చదువు వృధా , బ్రతుకు వృధా, కవిత వృధా! వృధా!వృధా!” అనో, "మనదీ ఒక బ్రతుకేనా" అనో అనటం ఏదో క్షణికమైన నిరాశలో కావచ్చు.
తిలక్ లో కూడా సమకాలీన పరిస్థితుల పట్ల నిస్పృహ ధ్వనించినా, ఆయన కవిత్వం చాలా వరకు ఆశావహమే. వేదనలో ఉన్నవాడికి ఉపశమనం కలిగించే లేపన గుణం ఆయన కవిత్వంలో ఉంది. అంతేకాదు, వ్యవస్థ కతీతంగా స్వేచ్ఛను కాంక్షించే వ్యక్తీకరణల వంటివెన్నో ఆయన చేస్తాడు. "స్వేచ్చా విహారం" అన్న కవితలో "కులాసాని చెడగొట్టేందుకు అలాస్కా దాకా అవకాశం ఉంది" అంటూ "మిథ్యా జీవన రథ్యలలో స్వప్నం ఒక సుందర తనుమధ్య" అనిచెప్పటం నిరాశామయంగా కనిపించే జీవితంలో కొంత ఆశను, వెసులుబాటును వెతుక్కోవటం వంటిదే అని అర్థం చేసుకోవాలి.
స్వాతంత్రోద్యమ సమయంలో, స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశం పట్ల, ఎంతో ఆశాపూరితమైన కవిత్వం వచ్చింది. వీటిలో బ్రిటిషువారిపై ద్వేషం కంటే, మాతృదేశం మీద ప్రేమే ఎక్కువగా కనిపిస్తుంది. స్వతంత్రం వచ్చాక నిజంగా ఏదో గొప్ప మేలు జరుగుతుందనే ఆశ, నమ్మకం వీటిలో ధ్వనిస్తాయి. బహుశా ఆధునిక కవితా ప్రస్థానంలో దేశం పట్ల ఇంత అనుకూలమైన కవిత్వం వచ్చిన సందర్భం ఇదొక్కటే అనుకుంటాను. (పెద్ద కవులు కూడా నిర్బంధంగా అటువంటి కవిత్వం రాసేట్టుగా చేసిన ఎమర్జెన్సీ రోజుల్ని మినహాయిస్తే)
ఉదాహరణకి
దున్నరా ఈ భరత భూమిని
తొలకరించిన పుణ్య భూమిని
కరువులేని స్వర్గ రాజ్యపు
దొరవు నీవయ్యెదవురా! (తురగా వేంకట రామయ్య)
వంటి ఎన్నో గీతాలు ఆ కాలంలో వచ్చాయి.
అలాగే గాంధీ మహాత్ముని గొప్పతనం మీద వచ్చిన కవిత్వం గురించి కూడా చెప్పుకోవాలి. ఉదాహరణకి
నేనూ నీ రణోన్మత్త గానం విని పులకరించి
రణోన్మత్త రణడిండిమ ధ్వానం విని జలదరించి
జలదరించి, కలవళించి
రణభూమికి పరువెత్తాను. (పురిపండా)
అంతా గాంధిమయం ఈ జగమంతా గాంధిమయం
ప్రభుశాసనములు నిరాకరించుచు
అభయహస్తమున అందరిని బిలుచుచు
స్వరాజ్యమిదుగో స్వతంత్రమిదుగో
రారండనుచు దండిగ బిలిచే (దామరాజు)
వంటివి. రాజకీయ సమీకరణాల కతీతంగా ఎంతో మంది కవుల్ని ప్రభావితం చేసిన ఏకైక నాయకుడు బహుశా గాంధీ ఒక్కడేనేమో.
తరువాతి కాలంలో వచ్చిన ఉద్యమ కవిత్వం సమకాలీన వ్యవస్థ మీద కోపంతో ఒక బాధితుని స్వరం నుండి వెలువడినది. కవి దృష్టిలో తాను తీవ్రంగా నిరసించేదానిపై ద్వేషం వ్యక్తం చెయ్యటం, ఒక బాధితుని ఆక్రోశానికి అక్షర రూపం ఇవ్వటం చెయ్యవలసిన పనులుగానే తోస్తాయి. కానీ, ఆ రాజకీయాలతో సంబంధంలేని సామాన్య పాఠకులకి మాత్రం ఇవి చదివిన తరువాత ప్రస్తుత పరిస్థితుల పట్ల నిరాశ కలగక మానదు. ఈ రకం కవిత్వంలో చాలా వరకు వ్యవస్థకతీతమైన వ్యక్తి స్వేచ్ఛ కోసం పరితపించటంగా కాకుండా, ఎక్కువగా వ్యవస్థనుండి ఒక సమూహంగా తాము కోరుకునే ప్రయోజనాలను సాధించుకోవటం లక్ష్యంగా రూపొందినవనిపిస్తుంది. ఇంతకు ముందు చెప్పినట్టు, ఒకవేళ వారి ఉద్యమం సఫలమైనా, ఇంకేవో అసంతృప్తులు ఉంటూనే ఉంటాయి. అందువల్ల, ఒక నిరంతరమైన, నిరాశాపూరితమైన కవిత్వం కొనసాగుతూనే వస్తోంది.
వివిధ అస్తిత్వ వాదాలకు సంబంధించిన కవిత్వం కేవలం తాము ప్రాతినిధ్యం వహించే సమూహాల సమస్యలను చిత్రించటంతోనే ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఆయా వృత్తులలో, వారి శ్రమ జీవనంలో ఉన్న సౌందర్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం కూడా చెయ్యవచ్చు. ఫిర్యాదు కవిత్వానికి మనకు కొదవలేదు. ఎటొచ్చి మనకు తెలియని వివిధ వర్గాల, వృత్తులకు చెందినవారి జీవన విధానంలో ఉన్న లోతుపాతులు కవిత్వం ఆవిష్కరించినప్పుడు అది అన్ని వర్గాల పాఠకుల లోనూ అది ఒక ఆసక్తిని, సానుకూల అనుభవాన్ని కలిగిస్తుంది.
భావకవిత్వం వచ్చిన తరువాత మళ్ళీ చాలా సంవత్సరాలకి వ్యక్తి అనుభూతి ప్రధానంగా సామాన్య అనుభవాల్ని, స్నేహాలను, మనుషుల పట్ల, ప్రకృతిలోని చరాచరాల పట్ల ప్రేమను ఆవిష్కరిస్తూ పాఠకుల్లో జీవితం మీద కొంత సానుకూల దృక్పధాన్ని పెంపొందించే ప్రయత్నం అనుభూతి కవులుగా చెప్పబడే కొంతమంది చేశారు. ఇస్మాయిల్, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ మొదలైనవారు ఇందులో ముఖ్యులు. ఇస్మాయిల్ గారు ఒకచోట సరస్సు గురించి రాస్తూ ఇలా అంటారు
చలించే నీళ్ళు చంద్రకాంతిలో మెరుస్తున్నాయి.
ఇంతకుమించి ఏమీ చెయ్యలేవు నువ్వు.
కాంతిమంతం చేసుకో జీవితాన్నిగట్టును తాకి ఆగిపోయే దాక.
ఉన్నంతలో తృప్తిపడటం, వ్యక్తిగా తనదైన స్పేస్ ంటే చాలనుకోవటం కూడా ఒకవిధమైన అనుకూల దృక్పధమే. శ్రీకాంత శర్మగారి లలిత గీతం "ఇంత వింత వెలుగులలొ సుంత నాకు దొరికేనా నీలి నిదుర రెక్కలపై నింగికి నేనెగిరేనా " అన్నది దీనికి చక్కని ఉదాహరణ. ఇంకా అందులో "ఇదిగో ఈ కుటీరాన ఇరులు మూగకున్న చాలు. గూటిలోని గువ్వలాగ కొత్త వెలుగు కాంతి చాలు" వంటి ఎంతో అందమైన, అర్థవంతమైన వ్యక్తీకరణలుంటాయి.
ఒక విధమైన తలపోతగా ఉండే కవిత్వం, వయసుతోబాటు అనివార్యంగా వచ్చే మార్పులు, కలిగే వైఫల్యాలవంటి వాటిగురించి రాసిన కవిత్వం పైకి నిరాశావాదంగా అనిపించవచ్చుగాని, వాటిని చదివిన పాఠకుడు ఒక్క క్షణం తననుతాను అంచనా వేసుకొనే అవకాశం అవి కలగజేస్తాయి. ఉదాహరణకు నేను కొంతకాలం క్రితం రచించిన ఒక కవితను తీసుకుంటాను. "ఆఖరి మనిషి" అనే ఈ కవిత
క్రమక్రమంగా మరణానికి అలవాటుపడటమే జీవితంగా మారిపోతుంది
ప్రావురాలకు బదులు తీతువు పిట్టలు ఉత్తరాలు మోసుకువస్తాయి
చిన్నప్పటి గ్రూప్ ఫొటోలో చిరునవ్వులు చిందించినవారంతా
ఎవరి ఫోటోవారు వెతుక్కుని వెళ్ళిపోతారు.
అని మొదలౌతుంది. ఈ కవితకు స్పందించి ఆంగ్లానువాదం చేసినవారున్నారు. అలాగే, నిరాశావాదమని విమర్శించినవాళ్ళున్నారు. కొన్నిసార్లు విషాదకరమే అయినా, మనకు సామాన్యంగా కలిగే ఒక అనుభవాన్ని కవితలో చదివినప్పుడు గొప్ప ఊరటలాంటిదేదో కలుగుతుంది. కనీసం ఒక పాఠకునిలోనైనా అటువంటి స్పదన కలిగించగలిగితే ఆ కవిత నిష్ఫలం, నిరాశాగ్రస్తం కాదని నాకనిపిస్తుంది.
మృత్యువు గురించి, ఇతర విషాదకర సంఘటనల గురించి చెప్పటం వేరు, మృత్యుకాంక్ష లేదా మృత్యువుపై ఆరాధన వ్యక్తపరచడం వేరు. ఈ రెండవరకం ధోరణి కొంతమంది కవుల్లో కనిపిస్తుంది. ప్రారంభ యౌవన దినాల్లో కొంత ఉండటం సహజం. అటువంటి స్థితిలో మృత్యువుపై ప్రేమతో రాయవచ్చు. అయితే, చాలామందిలో ఈ దశ గడిచిన తరువాత ఆ రకమైన మొహం క్రమంగా తొలగిపోతుంది. అతికొద్దిమంది కవుల్లో మృత్యువుపై ఆరాధన వారి కవితా ప్రస్థానంలో ఒక భాగంగా మిగిలిపోతుంది. అటువంటివారిలో అజంతా ముఖ్యమైన వాడు. ఆయన అనేక కవితల్లో మృత్యు ప్రస్తావన కనిపిస్తుంది.
"మృత్యు ముఖంలోని కదా మనిషి విజృంభరణ
గగన వేదికపై అస్తంగత సూర్యుడు నిజంగా ఎంత అందం!"
"భయ విభ్రమాల మధ్య విషాద వాక్యం వాలే సాగే జీవితంలో మృత్యువు ఒక్కటే నిజం"
"నేను రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎవరైనా ప్రమాదంలో చిక్కుకున్నారనుకో
చుట్టూ నిలబడిన జనం నా వైపు విచిత్రంగా చూస్తారు
ఇదేం చిత్రం ఇద్దరిదీ ఒకే పోలిక అని ఆశ్చర్యపోతారు
అంతదాకా దేనికి, రోడ్డుమీద నా మృత కళేబరాలను నేనే లక్షసార్లు చూసాను"
జీవితంలో అడుగడుగునా మృత్యువును దర్సించిన ఈ కవిత్వం పైకి చూస్తే నిరాశావాదంగానే కనిపిస్తుంది. ఐతే, ఒక సంక్లిష్టమైన మానసికస్థితికి అద్దంపట్టే ఈ భావచిత్రణ కవిత్వరీత్యా గొప్ప కవిత్వంగా నిలుస్తుంది. పైగా అజంతాది అధివాస్తవిక ధోరణి అన్నది కూడా మనం గుర్తించాలి. మో కవిత్వంలో మృత్యు ప్రస్తావన ఇంతగా లేకపోయినా, సంక్లిష్టతను వ్యక్తీకరించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. వీరి ధోరణులను కేవలం ఆశ, నిరాశల తూనికరాళ్ళతో కొలవటం సాధ్యం కాదు.
"కాలం ఒక మృతినొందిన సూర్యాస్తమయాల కిరణాల మోపు" అని, "కౌమారమూ, యవ్వనమూ మృత్యువు ధరించిన పూలదండలో ముత్యాలు" అని పోల్చిన విలక్షణమైన కవిత్వం ఇటీవల నేను చదివిన చిత్రకొండ గంగాధర్ ది. ఇతనిలో మృత్యు ఆరాధన, మృత్యు కాంక్ష తరచుగా కనిపిస్తాయి. ఇతని కవితా సంపుటి "పత్ర శకలం"కి మిత్రులు పెట్టిన టాగ్ లైన్ "ఆత్మహత్యా సదృశ దేశద్రిమ్మరి ఆఖరి కోరిక". మరణకాంక్ష కతీతమైన గొప్ప కవిత్వం ఇతని పుస్తకంలో ఉంది. కానీ, విషాదమేమంటే ఈ కవి 37 సంవత్సరాల చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని నిష్క్రమించాడు. మరణకాంక్ష, నిరాశ, నిస్తేజం ఒక భావోద్వేగంగా కవిత్వంలో కనిపిస్తే అర్థం చేసుకోగలంగాని, అది వాస్తవంలో జీవితాన్నే కబళిస్తే ఎంతో బాధ కలుగుతుంది.
సామాన్య మనుషులలాగానే, కవులలో కూడా ఆశ, నిరాశలు ఆయా సందర్భాలలో కలగటం, దానికి స్పందనగా వారు కవిత్వం రాయటం సహజం. ఏదైనా వారి కవిత్వం అంతిమంగా పాఠకునికి జీవితం పట్ల ఒక అనుకూల దృక్పధాన్ని కలిగించటం, కష్టాల్లో ఉన్నవారికి కూడా ఊరటనిచ్చి వాటినెదుర్కొనే మానసిక స్థైర్యాన్ని అందించటం ముఖ్యం. ఇందులో ఏది చెయ్యగలిగిన వారి కవిత్వం సఫలమైనట్టే.
*****