top of page

సంపుటి  5   సంచిక  1

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

సీజర్

Sundaresa.JPG

తమిళ మూలం: జయకాంతన్

అనువాదం: రంగన్ సుందరేశన్

*మూలకథ తొలి ప్రచురణ: 1972 "ఆనందవికటన్" తమిళ వారపత్రిక. 

 *మలి ప్రచురణ-  2014, "మంగైయర్ మలర్"తమిళ మాస పత్రిక.

 

అసలు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిపోయిందనిపిస్తోంది. మేడక్రిందినుంచి గభీమని వినిపించిన సందడిలో - నాన్నగారి కేక విని - నేను పడకనుంచి లేవడానికి భయపడుతూ, ఈ సమయంలో అతని మొహంలో కనిపించకూడదని, లేవకుండానే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, పావుగంటకిపైగా నా మంచంలో దొర్లుతున్నాను. ఇదిగో, నా తలగడకి పక్కనేవున్న కిటికీలోనుంచి  చూస్తే నాకన్నీ బాగా కనిపిస్తున్నాయి. 

 

అపవాదంకి గురి అయిన మంగళం ఆంటీ - సీతారామయ్యర్ భార్య- ఏడుస్తూ, దేవుడికి మొరపెడుతూ, అందరినీ శపించే మాటలు నాకు నా చెవులకి అందాయి:

 

“ఇదేం ఘోరం! ఇవేం వెలికి మాటలు! ఎంత బలవంతంగా వీళ్ళు ఇలాంటి నీలాపనింద నామీద మోపుతున్నారు! రానీ, మా ఆయన రానీ! నా చేతిలో నిప్పు పట్టుకొని నేను అతనిముందు ప్రమాణం చేస్తాను!” 

 

ఆవిడ మాటలు తలాతోకా లేనట్టూ, కోపం, అహంకారం ఒకేసారి కలిసివచ్చినట్టూ, ఆ ఏడ్పు మధ్య నాకు వినిపించాయి.

 

ఈ జగడంలో ఎవరో ఎవరినో చెయ్యిచేసుకున్నట్టూ, గోడమీడకి తోసినట్టూ చప్పుడు వినిపించింది. 

 

“రాస్కల్, ఎక్కడకిరా జారుకుంటున్నావ్? సీతారామయ్యరు రానీ! అతనిచేతికి చెప్పులిచ్చి మరీ నిన్ను మొత్తమంటాను! వాళ్ళ ఇంట్లో పరాన్నజీవిగా ఉంటూ ద్రోహం చేస్తావా? నేనే ఐతే ఇప్పుడే నీ ప్రాణం తీస్తాను!” అని నాన్నగారు దయ్యంపట్టినట్టు గెంతుతున్నారు. ఇది తరచుగా నాన్నకి వచ్చేదే. ఇవాళ ఉదయం ఇది మూడవసారి. ఇప్పుడు అమ్మకూడా అతనితో జతగా కలిసింది. “అయ్యో, మీకెందుకండీ ఈ  గొడవ? ఆ బ్రాహ్మణుడు మొహం చూసి జాలిపడి మనం అతనికి జాగా ఇచ్చాం. అతను దిక్కుమాలిన వెధవలని తీసుకొనివచ్చి ఇంటిలో వదిలేసి పొద్దున్నే పనిమీద వెళ్ళి రాత్రి తిరిగి వస్తున్నారు. ఇక్కడ జరిగే సిగ్గుమాలిన వ్యవహారాలు మనమేగా చూస్తున్నాం! అందుకే మీరతనితో ఒక మాట చెప్పమని నేను అన్నాను . . . కాని ఎందుకు మీరిలాగ ఈ గడబిడలో కలిగించుకోవాలి?? కర్మ, కర్మ, రండి, మనం ఇంటికి వెళ్దాం!” అని బతిమాలుతోంది. “నోరు మూసుకొని ఇంటికి వెళ్ళు!” అని నాన్నగారి ఒక గర్జన చాలు, అమ్మ ఇంతలోనే ఇంటికి వెళ్ళి ఉంటుంది. “సార్, కొంచెం ఓపిక పట్టండి. సీతారామయ్యర్ రానీ . . . ఎవరు ఎలా పోతే మనకేం?” అని ఎదురు పోర్షనులో ఉన్న నారాయణన్ నాన్నగారిని సముదాయిస్తున్నారు. 

 

“మనకేం అని అడుగుతున్నారా? బాగుంది! నాలుగు కుటుంబాలున్న జాగా ఇది. ఇక్కడ ఇలాంటి అవినీతి జరగవచ్చా? అంటే ఆ  వెఱ్ఱిబాగుల మనిషికి చేసే ద్రోహంకి మన సహాయమూ ఉందన్నమాట!” ఇల్లు కూలిపోయినట్టు నాన్నగారు బొబ్బలు పెడుతున్నారు. అవును మరి, ఈ ఇంటి యజమాని కదా? అద్దెకున్నవాళ్ళందరూ ఇక్కడ గుమిగూడి ఉన్నట్టు కనిపిస్తోంది. మంచివేళ, పిల్లలెవరూ లేరు, అందరూ స్కూళ్ళకి వెళ్ళివుంటారు . . . నాన్నగారు ఎందుకిలా తొందరపడుతున్నారు? రవంతైనా మర్యాద, సభ్యత లేకుండా ఎందుకిలా మండిపడుతున్నారు? పొద్దుటనుంచే ఇలాంటి గొడవ ఏదో జరుగబోతుందని నాకు తెలుసు. కొన్నిరోజులుగానే ఆడవాళ్ళందరూ కలుసుకొని - అందులో మంగళం ఆంటీని విడిచిపెట్టి - రహస్యంగా ఏదో కుట్ర పన్నుతున్నారనిపించింది. ఆ తరువాత అమ్మ నాన్నతో ఏమో చెప్పింది. నాన్నగారు, అది వింటూ, ఉరుముతూ, నడవలో నిలబడి, సీతారామయ్యర్ ఇల్లుని రెప్పవాల్చకుండా చూసారు. అప్పుడే నాకు తెలుసు, ఇలాంటి గొడవ ఏదో జరుగబోతుందని . . . నాకు మందబుద్ధి  . . . పదిగంటలకి భోజనం చెయ్యగానే ఎప్పటిలాగ బయటికి వెళ్ళివుంటే ఇవన్నీ చూడక్కరలేదు, వినక్కరలేదు . . . నేను పేపర్ లో Wanted Column చూస్తూ అలాగే నిద్రపోయాను . . . 

 

నేను భోజనం చేసేటప్పుడు నా కంచెంలో అన్నం వడ్డించి అమ్మ పరుగెత్తుకొని వెళ్ళి నాన్నగారికి ఏదో రహస్యం - కాలూ, చేయీ ఊపుకుంటూ - చెప్తోంది; నాకది చాలా అసహ్యంగా అనిపించింది.

 

నేను అన్నం కలుపుకొని మజ్జిగ కోసం కాచుకొనివున్నాను; ఎవరెలా పోతే వీళ్ళకేం? ఎవరిమీదనైనా క్రూరంగా ఎందుకు నేరమారోపించాలి! అందులో వీళ్ళకి సంతోషం ఉందని తెలిసినతరువాత ‘ఎందుకురా వీళ్ళకి కొడుకుగా పుట్టాను?’ అని నేను వాపోయాను.   

 

“అమ్మా, ముందు నాకు మజ్జిగ వడ్డించు . . . ఆ తరువాత మీరు ఊరు కబుర్లు మాటాడుకోండి!” అని అరిచాను.

 

అంతే, నాన్నగారికి దయ్యం పట్టుకుంది. “ఓహో, దొరగారికి ఆఫీసుకి ఆలస్యమైపోయిందా?” అని ఆరంభించి నేను భోంచేసి లేవడానికి ముందు  నన్ను వందసార్లు ‘పరాన్నభుక్కు’ అని తిట్టారు. నేను తలవొంచుకొని, నిందలన్నీ వింటూ, కళ్ళ నీళ్ళుబెట్టుకొని, భోజనంతో చేసి, మేడమీదకి వచ్చి మంచంలో వాలాను . . . 

 

ఈ ‘పరాన్నభుక్కు’ అన్న మాట వింటూనే భోజనం చెయ్యడం నాకు అలవాటైపోయింది. ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తోంది. కాని, ఎక్కడకి? ఎన్ని applications పంపడం, ఎంతమందిని బతిమాలడం! పోనీ, నాకు మంచి దేహబలం ఉందా అంటే అదీ లేదే! మిలిటరీకి వెళ్దాం అనుకుంటే ‘వెయిట్’ తక్కువ అనేసారు.  అసలు S.S.L.C చదివినవాడికి ఏం ఉద్యోగం దొరుకుతుంది? ఈ రోజుల్లో B.A., M.A. చదువుతో జనులు తికమకలాడుతున్నారు. ఎటువంటి పని దొరికినా నేను రెడీయే. ‘మీ కేంటీన్ లో సర్వరుగా పని చేస్తాను,’ అనికూడా  సీతారామయ్యర్ కి చెప్పాను. కాని కిందటివారం వాళ్ళ కేంటీన్ లో ‘రిట్రెంచ్‌మెంట్‌’ ఆరంభమవడంవలన మణి సీతారామయ్యర్ ఇంటిలో వచ్చికూర్చున్నాడు; అదేకదా ఇప్పుడు ఈ రభసకి దారి తీసింది? . . . 

 

సీతారామయ్యర్ ఇంటిలో మణి పరాన్నభోజనం చేస్తే నాన్నగారికి ఏంపోయింది? నాన్నగారు నన్ను పరాన్నభుక్కు   అని తిట్టినప్పుడల్లా అతను ఆ మణిని కూడా చేర్చుకుంటున్నారని నాకు బాగా తెలుసు, మరి నాన్నగారి సంగతో? ఇతను ఒడలు వొంచి ఎక్కడైనా ఒక నెల ఉద్యోగం చేసివున్నారా? లేదే? తాతగారు కట్టిన ఇల్లు ఇతనికి దక్కింది, నెలా 480 రూపాయల ఆదాయం అద్దెగా వస్తోంది. పేకాట ఆడుతూనే ఇతను జీవితం నడుపుతున్నారు. అసలు ఇతను ఈ ఇల్లు తనే కట్టివుంటే నేను  ఇక్కడ ఒక పూటైనా భోజనం చెయ్యను. ఇవన్నీ అడగడానికి ఎంతసేపు పడుతుంది? కొన్ని సమయాల్లో అడిగేద్దామనిపిస్తుంది; కాని ఆ తర్వాత? ఇక్కడేకదా నేను పరాన్నభుక్కుగా రోజులు గడపాలి? నా బతుకంతా పరాన్న భోజనం అంటే, అది నిజమే కదా? ‘మీదీ పరాన్న భోజనంమే’ అని నేను అంటే అది నాన్నగారికి సరైన బదులవుతుందా? మా తాతగారో, ముత్తాతగారో ఈ ఇల్లు కట్టినా ఇప్పుడు నాన్నగారేకదా దీనికి యజమాని? అతను బొబ్బలు పెట్టనీ, మంటపడనీ, తిట్టనీ, నేనతనికి తప్పకుండా మర్యాద చూపాలి. అతన్ని సూటిగా చూసినప్పుడెల్లా, ‘సరే’, ‘అవును’, ‘లేదు’ అని ఒకటో రెండు మాటలే నా నోటినుంచి వస్తాయి; అతను కీచుమంటే అవీ బయటికి రావు. ఇటీవల నాన్నగారు నన్ను బాదడం లేదు; కాని బాదుతారనే భయం నాకు ఇప్పుడూ ఉంది. అతను ఉన్నంతవరకూ ఆ భయం నాకు ఉంటుందనిపిస్తోంది.

 

అదిగో, నాన్నగారు నన్ను పిలుస్తున్నారు.

 

“ఇదిగో వస్తున్నాను, ఇక్కడే ఉన్నాను!” అని అంటూ, పంచెని బిగించుకొని, దడ దడ మని మేడమెట్లు దిగి కిందకి వచ్చాను.

 

నేననకున్నట్లే పరిస్థితి తారుమారుగా ఉంది. నడవాలో అందరూ గుంపుగా నిలబడివున్నారు. మంగళం ఆంటీ నన్ను చూడగానే మొరపెడుతున్నట్టు పెదిమలు కలుపుతూ ఏడుస్తున్నారు; మణి రెండు కాళ్ళూ ముడుచుకొని కూర్చొనివున్నాడు. ఎవరో గుంజినట్టు వాడి తల జుత్తు చింపిరిగా ఉంది; చొక్కాయికూడా మెడ దగ్గర చింపినట్టు కనిపిస్తోంది. ఒంటరిగా తన దేహబలంతో వాడిని అణచి నేలమీద కూర్చోబెట్టిన సాహసానికి గర్వపడుతూ నాన్నగారు నెపోలియన్ లాగ  గంభీరంగా నిలబడివున్నారు. అతని వెనుక ఏ ఫిరంగీ, సైన్యమూ లేకపోయినా అతన్ని చూస్తే అందరికీ హడలని తెలిసింది. ఎవరు ఏమన్నా అతను నిష్కర్షగా తోసిపారేస్తారనే భయం వలన న్యాయం, అన్యాయం తెలిసినవాళ్ళుకూడా. - అసలు భయమంటూ మనసులోకి వస్తే ఇవన్నీఎవరికి కావాలి? - నాలాగే నోరు మూసుకొనివున్నారు. 

 

మంగళం ఆంటీ ఏడవడం చూసి నాకు బాధగా ఉంది; నాన్నగారు ఒక రౌడీలాగ మణిని తన చేతితో కొట్టారనే ఆలోచన రాగానే నేను సిగ్గుతో తలవంచుకున్నాను. 

 

నిజంగానే నాన్నగారి కోపంకి, ప్రవర్తనకి న్యాయం ఉండవచ్చు. కాని తన చేష్టవలన ఇతను తన నోటితో వెఱ్ఱిబాగుల మనిషి అని పిలిచిన సీతారామయ్యర్ కి ఎంత అవమానం అని రవంతైనా ఆలోచించారా? నాకు నాన్నగారి బాగా మనసు తెలుసు; హాని చేసినతరువాతనే  నొచ్చుకునే స్వభావం అతనికి. 

 

నేను మెట్లు దిగి కిందకి రావడానికి ముందే అతను తాళలేక నన్ను రెండుమూడు సార్లు పిలిచేసారు. మొదట ‘ఒరేయ్ బాబూ!’, అని, ఆ తరువాత నా పేరు; ఆఖరికి పళ్ళు బిగించుకోని ‘ఒరేయ్, వెధవా! రారా ఇక్కడికి . . .”  

 

నేను అతన్ని చూస్తూ నిలబడ్డాను; నా దేహమంతా వొణుకుతోంది. 

 

“కేంటీన్ కి వెళ్ళి సీతారామయ్యర్ ని పిలుచుకొని రా . . . వెళ్ళు!”

 

అంతే; మరేం అనక నేను బయటకి పరుగెత్తాను. వీధిలోకి వచ్చిన తరువాతే, మెల్లగా నడుస్తూ ఆలోచనలో పడ్డాను: 

 

‘నాన్నగారు మూర్ఖంగా, ముందాలోచన లేకుండా ఇంకొకరి భార్య విషయంలో చొరబడుతున్నారు! ఇది చాలా sensitive matter! ఈ ఘటన ఎలా అంతమవుతుందో?’ అనే భయం నన్ను ఆకట్టుకుంది.

 

సీతారామయ్యర్ చాలా సాధువు. మంచి మనిషి. నా బాల్యంనుంచే నాకు అతనితో పరిచయముంది. అతనికి కోపంవచ్చి నేనెప్పుడూ చూడలేదు. ఎప్పుడూ నవ్వుతూనేవుంటారు. లేకపోతే ఇతరులని నవ్వించి తనేం అనకుండా నోరుమూసుకొనివుంటారు. అతను చెప్పే జోక్ విని ఎవరూ నవ్వలేదంటే అతనే బిగ్గరగా నవ్వుతారు. రెండు సంవత్సరాలముందు ఇప్పుడు నేను మేడమీదున్న గదిలో అతను ఒంటరిగా అద్దెకి ఉండేవారు. గోడనిండా బరువులెత్తుతున్నట్టు, కసరత్తు చేస్తున్నట్టు, యోగాసాన భంగిమల్లో అతని ఫోటోలు కనిపిస్తాయి. నా చిన్నప్పుడు అతనితో వివేకానందా క్లబ్ కి వెళ్ళి కసరత్తులు చూసినది నాకు గుర్తుంది. అతను వేరుసెనగలు నానబెట్టి నాకూ ఒక పిడికెడు ఇచ్చేవారు; పెళ్ళైన తరువాత అవన్నీ వదిలేసారు. 

 

నలభై సంవత్సరాలవరకూ బ్రహ్మచర్యం ఆదర్శజీవితం అని అంటున్న మనిషి ఒకరోజు గభీమని పెళ్ళిచేసుకొని మంగళం ఆంటీతో మా ఇంటికి వచ్చారు. ఆ పెళ్ళి ఎలా జరిగిందని అతను కధలాగ వివరించి చెప్పడంతో మాకందరికీ అది బాగా తెలుసు. అతనే నడవాలో నిలబడి కుళాయిలో నీళ్ళు పట్టుకున్నవాళ్ళకి తన పెళ్ళిగురించి నవ్వుతూ మాటాడతారు; మంగళం ఆంటీ ఇంటిలోపలనుంచి అది వింటూ తనలో తనే నవ్వుకుంటుంది.

 

కేంటీన్ ఇంకా ఒక ఫర్లాంగు దూరంలో ఉంది. అది ఒక ట్యూటోరియల్ కాలేజిలో ఉండే కేంటీన్. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఇతనితో చదివారట. అందువలన సీతారామయ్యర్ కి  మంచి పలుకుబడి ఉందని చెప్పుకుంటారు. కాని ఆ కారణంవలన మనం మన అధికారం ఏ సమయంలోనూ దుర్వినియోగం చెయ్యకూడదని సీతారామయ్యర్ అనేవారు. 

 

ఇప్పుడు నేను ఇతన్ని చూసి ఏమని చెప్పి నావెంట రమ్మని పిలవడం? నోరు విప్పి నేనేం మాటాడను. ‘అంకుల్, నాన్నగారు మిమ్మల్ని నాతో రమ్మని పంపారు,’ అని మాత్రం చెప్తాను, అంతే. 

 

సీతారామయ్యర్ని చూసినప్పుడెల్లా నేను  అతన్ని‘అంకుల్’ అనే పిలుస్తాను; కాని నా మనసులో నేను అనుకోడం ‘సీతారామయ్యర్’ అనే.

 

రెండు సంవత్సరాలముందు సీతారామయ్యర్ పాలఘాట్ కి వెళ్ళారు. అతని మేనకోడలికి పెళ్ళి అని పత్రిక వచ్చింది. ఆ అక్కయ్యకి ఇతను ప్రతీ నెలా యాభై రూపాయలు మనియార్డరు పంపేవారు. పెళ్ళిలో వియ్యంకులవారితో ఏదో రచ్చ. తాలి కట్టే సమయం పెళ్ళికొడుకుని అతని తండ్రి “కట్టవద్దు!” అని అంటూ  ఈడ్చుకొని వెళ్ళిపోయారట. ఆ పెళ్లికొడుకెవడో నాలాంటి మొద్దనుకుంటాను . . . మరేం దారి? ఇతని అక్కయ్య ఇతని దగ్గర “తమ్ముడూ, నా పరువు కాపాడురా!” అని ఏడ్చారట. ఇంతవరకూ పెళ్ళి సంబరాల్లో అతిధి సత్కారం చేస్తున్న సీతారామయ్యర్ వెంటనే పరుగెత్తుకొని వెళ్ళి పీఠంమీద కూర్చొని మంగళం మెడలో తాళి కట్టేసారట! ఇతను ఆ ముచ్చట వర్ణించి చెప్పినప్పుడు అందరూ ముసిముసి నవ్వులు నవ్వుతారు. అతను ఇంటిలో ఉన్నప్పుడు తరచుగా ఇలాగేదైనా మాటాడుతూ మంగళం ఆంటీని, తక్కినవారిని నవ్వించుతారు. అతనిదగ్గర రహస్యమంటూ ఏదీ లేదు. ఎప్పుడూ నవ్వే!

 

ఒకరోజు అందరి ఎదుటా మంగళం ఆంటీని ఇతను అడిగారు:

 

“ఏమే, స్వయంవరంలో ఎవరినో తలచుకుంటూ ఎవరి మెడలోనో పూలదండ వేసినట్టు, తాళి కట్టే నిమిషంవరకూ ఎవరినో నీ భర్త అని అనుకుంటూ ఆఖరికి నా భార్య ఐపోయావ్! అవునా?” 

 

అప్పుడు మంగళం ఆంటీ కుళాయి పక్కనే బిందెతో నిలబడివుంది. అంకుల్  ఎగతాళిగా అడిగిన ప్రశ్న విని ఆవిడకి చురుక్కుమంది; కాని నవ్వుతూనే అతనికి బదులు చెప్పింది:

 

“నా మనసులో ఎవరూ లేరు. ‘నాకొక మంచి భర్త కటాక్షించు!’ అని నేను దేవుడ్ని వేడుకున్నాను. నాకేది మంచిదో అది దేవుడు అనుగ్రహించాడని నేను చాలా సంతోషంగా ఉన్నాను.” 

 

అదిగో, ట్యూటోరియల్ కాలేజీ వచ్చేసింది, దాని వెనుక కేంటీన్ ఉంది. నేను కేంటీన్ లో ప్రవేశించినప్పుడు ఇతను గోడ చివరవున్న అద్దంముందు నిలబడి తలజుత్తుని దువ్వుకుంటున్నారు. పక్కనే గోడలోవున్న మేకునుంచి వేలాడుతున్న ఒక చొక్కాయిని అందుకొని, దాని జేబులు ఖాళీ చేసి, రెండుసార్లు బాగా దులపడం చూసాను. ఆ తరువాత మనీపర్సు, వక్కాకు డబ్బి, ఇంతకు ముందు వాడిన దువ్వెన - వీటిని మళ్ళీ జేబులో నింపుకొని అద్దంలో చూసినప్పుడు వెనుకనున్న నన్ను చూసేసారు; నవ్వుతూనే అడిగారు:

 

“రా . . . కాఫీ తాగుతావా?”

 

“వద్దు . . . నాన్నగారు మిమ్మల్ని తొందరగా పిలుచుకొని రమ్మన్నారు.”

 

“మీ నాన్నగారికి ఎప్పుడూ తొందరే . . . ఇంట్లో కాఫీ తాగావా?”

 

“లేదు. నేను నిద్రపోతుంటే నన్ను లేపి మిమ్మల్ని పిలుచుకొని రమ్మన్నారు, నాన్నగారు . . . ”

 

“సరేలే, నువ్వు కూర్చో” - నన్ను కూర్చోబెట్టి, లోపలికి వెళ్ళి,  ఒక పళ్ళెంలో ఒక గరిటె కేశరి, కారాబూందీ తెచ్చి నాకు అందించారు. కాఫీ తీసుకురమ్మని ఒక సర్వరుకి ఆజ్ఞ ఇచ్చారు. కేశరి రుచిగావుందికాని నాకు కడుపులో ఎలాగో ఉంది. సర్వరు కాఫీ తీసుకొని వచ్చాడు. ఇతను గల్లాపెట్టె దగ్గరకి వెళ్లి ఒక పొడవైన పుస్తకం అందుకొని, పేజీలు తిరగేసి, ఏదో రాస్తున్నారు. నేనిప్పుడు తింటున్నదానికి కూలియా? ఆ తరువాత నా పక్కనేవున్న బెంచిలో కూర్చొని తాంబూలం వేసుకుంటున్నారు; నేను తొందర తొందరగా కాఫీ మింగుతున్నాను.

 

అక్కడ ఇంటిలో ఒకటే గడబిడ; నాన్నగారు దెయ్యం పట్టినట్టు గోల పెడుతున్నారు; మంగళం ఆంటీ గట్టిగా బతిమాలుతోంది; మణి అవమానంతోనూ, తక్కినవాళ్ళందరూ సిగ్గులేక అన్నీ చూస్తున్నారు; అమ్మ నాన్నగారిని వెనకేసుకొని మాటాడుతోంది. ఇవన్నీ నా మనసులో ఒక వైపు లేచాయి. ఇంకొక వైపు ఇవన్నీ తెలియని సీతారామయ్యర్ ప్రవర్తనలో నిశ్చింతభావం, నాపై అతను చూపే అభిమానం, ఇంకా కొంచెం సమయంలో జరుగబోయే గందరగోళం - ఇవన్నీ తలుచుకుంటే ఇతని అతిథి సత్కారంలో పాల్గొనడం మహా పాపం అని నాకనిపిస్తోంది. నేనతనికి ద్రోహం చేస్తున్నానా?

 

నేను తొందర తొందరగా చేయి కడుక్కొని “అంకుల్, రండి, వెళ్దాం,” అని బతిమాలాడాను.

 

“ఎందుకురా తొందరపడుతున్నావ్ . . . అక్కడ పేకాటకి నన్ను పిలుస్తున్నారు కాబోలు . . . నేనూ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను . . . సరే,  కానీ . . . అవును, నువ్వేదో మిలిటరీలో చేరుతున్నట్టు ఎవరో చెప్పారే? నీకేం మతి పోయిందా? నీలాంటివాళ్ళు మిలిటరీలో పనిచేస్తే మన దేశం నాశనం ఐనట్టే లెక్క! చెప్పు, నీ చెయితో ఒక తుపాకి ఎత్తగలవా? ‘కసరత్తు చెయ్!’, ‘కసరత్తు చెయ్!’ అని ఎన్నిసార్లు నీకు చెప్పాను, విన్నావా?” అని అంటూ సీతారామయ్యర్ తన భుజాన్ని నావైపు తిప్పారు. ఇప్పుడంతా సీతారామయ్యర్ యోగాసానాలు  చెయ్యడం ఆపేసినా అతని భుజకండరాలు పుష్టిగానే కనిపిస్తున్నాయి.

 

“రండి అంకుల్, నాన్నగారు నన్ను తిడతారు!” అని నేను మళ్ళీ బతిమాలాడాను. చెప్పులు తొడుక్కొని అతను కాలేజీ కాంపవుండు దాటి బయటకి రావడానికి ముందు నలుగైదురుతో కలుసుకొని, కబుర్లు చెప్పుకుంటూ, బిగ్గరగా నవ్వుతున్న అతని ధోరణి చూస్తే, ఈ మేలైన మనిషికి ఇంటిలో కాచుకొనివున్న అఘాతం గురించి నాకు బాధ కలిగింది. కాలేజీలో చదువుతున్న అబ్బాయిలకి ఇతనంటే చాలా అభిమానుకుంటాను. ఇతను కాంపవుండు దాటిరాగానే “అంకుల్, మీరు ఇంటికి వెళ్తున్నారా?” అని ఎవరో అడిగారు. తిరిగి చూస్తే ఒక మేడ  వరండానుంచి నలుగురు విద్యార్ధులు కనిపించారు. “ఆరుగంటలకి తిరిగి వచ్చేస్తాను!” అని అంటూ ఇతను చెయ్యూపారు. 

 

నడుస్తూనే అతను ఆ విద్యార్ధులని పొగడసాగారు: “వీళ్ళందరూ పరీక్షలలో ఫెయలైనవారే; అసలు ఎందుకు ఫెయిలయ్యారో తెలుసా? వాళ్లు నీలాంటి మందమతులు కారు, మంచి బుద్ధిమంతులు, అందుకే ఫెయిలయ్యారు . . . నువ్వు ఒక క్లాసులోనూ ఫెయిలవకుండా చదివావ్, కాని ఏ లాభం చెప్పు? చదివి పాసవడం తప్పించి ఏదైనా సరే ఆ అబ్బాయిలు సాధించగలరు . . . అవును, నీకు చెప్పడమే మరిచిపోయాను . . . ఆ ప్రిన్సిపాల్ దగ్గర నీగురించి చెప్పాను . . . ‘మంచి అబ్బాయి,  కేంటీన్ లో సర్వరు పని చేస్తానంటున్నాడు, ఏదైనా vacancy వస్తే మరిచిపోకండి,’ అని చెప్పాను. చూద్దాం, ఏం జరుగుతుందో . . . ” అని ఏమేమో నాకు చెప్తున్నారు, కాని నా మనసు ఏదీ అందుకోలేదు. 

 

అదిగో, ఇల్లు కనబడుతోంది.

 

“అసలు ఎందుకురా మీ నాన్నగారు ఇంత తొందరగా నన్ను పిలుచుకొని రమ్మన్నారు? నీకు తెలుసా?” అని అంటూ, నవ్వుతూ అంకుల్ నన్ను చూసారు.

 

“నన్నేం అడక్కండి. నేను నిద్రపోయాను. నాకేం తెలీదు.” 

 

నేనెందుకు అలాగ బదులు చెప్పానని అతనికి అర్ధం కాలేదు. మరేం అనక తనలో తనే నవ్వుకున్నారు; అతనికి ఎప్పుడూ ఈ నవ్వే.

 

ఇప్పుడే, మొట్టమొదటసారి, నేను మంగళం ఆంటీ గురించి అమ్మ అన్న కబుర్లూ, నాన్నగారి నిందారోపణా గురించి  ఆలోచిస్తున్నాను. ఇంతవరకూ నేను దానిగురించి పట్టించుకోలేదు. కాని ఇప్పుడు ఆ ధోరణి వదలేసి నేనూ ఈ సమస్యలో చిక్కుకున్నట్టు నాకు ఆవేశం కలిగింది: మంగళం ఆంటీ ఇతనికి ద్రోహం చేస్తారా? మణిని పోకిరి అనవచ్చా? అలాగైతే నాన్నగారు వాడిని బాదడం న్యాయమేకదా? నాన్నగారు అన్నట్టు అంకుల్ చేతికి చెప్పులిచ్చి మణిని మొత్తమంటే అందులో తప్పేముంది? . . . సరే . . . ఇక మంగళం ఆంటీని ఏం చెయ్యాలి? . . . అంకుల్ కీ ఆవిడకీ వయస్సులో ఇరవై సంవత్సరాల తేడా ఉంది, అందువలన ఆవిడ ఇలా తప్పు చేస్తారా? ఎది ఎలాగున్నా అంకుల్ ఇటువంటి  ద్రోహం భరించగలరా? . . . దేవుడా, ఏమౌతుందో?” - ఇలాంటి ఆలోచనలలో పడి, తలవంచుకొని నేను వేగంగా నడుస్తున్నాను; నాతోబాటు అంకుల్ నడకతీరు కూడా పెరిగింది. 

 

మధ్యాహ్నమంతా మంగళం, మణి ఇంటిలో పాచికలతో ఆడుకుంటారు. మణికి మంచి కంఠం ఉంది, బాగా పాడుతాడు. అంకుల్ కూడా వాడిని పాడమని తరచుగా అడుగుతారు. వాడు ఆంటీకి సాయంగా ఇంటిలో అన్ని పనులూ చేస్తాడు. వాడి సొంత ఊరుకూడా పాలఘాటే, మంగళంతో అక్కడ వాడికి పరిచయముందని చెప్పుకునేవారు. ఒక వేళ అక్కడే వాళ్ళకి? . . . ఈ మంచి మనిషి ఈ ద్రోహం ఎలా భరించగలరు? పాపం, అంకుల్!

 

ఇల్లు వచ్చేసింది.

 

ఇతన్ని చూడగానే ఇంతసేపూ నడవాలో నిలబడి ఆసక్తితో అన్నీ చూస్తున్న జనులు, గబగబమని తమ తమ ఇళ్ళళ్ళోకి జారుకుంటున్నారు. నాన్నగారు మాత్రం ధైర్యంగా అక్కడే నిలబడి మమ్మల్ని తిరిగిచూసారు; నాన్నగారి ధైర్యం చూసి నాకూ ఒక నిమిషం గర్వంగా ఉంది.

 

“రండి, రండి!” అని నాన్నగారు ఏమో అనబోతున్నారు. ఇంతలో మంగళం ఆంటీ లేచివచ్చి సీతారామయ్యర్ కాలుకింద వాలింది. ఆవిడ ఏడుస్తూనే ఏమేమో అంటోంది, కాని ఏదీ ఎవరికి భోదపడలేదు; మణి వొణుకుతూనే లేచి నిలబడ్డాడు. నాన్నగారే పెద్ద గొంతుకతో, “ఇక్కడ మేం కాపురమున్నాం . . . ” అని అంటూంటే సీతారామయ్యర్ కొంచెం కటువుగానే అతన్ని చూసి “మీరు కాసేపు నోరు మూసుకోండి!” అని అన్నారు. నాన్నగారు మరేం అనక ఊరుకున్నారు. కాని కోపంతో పళ్ళు పటపటమని కొరికారు. సీతారామయ్యర్ అదేం లెక్కచెయ్యక ఆంటీని ఒక బిడ్డని ఎత్తి నిలబెట్టినట్టు ఎత్తి “నువ్వెందుకిలా ఏడుస్తున్నావ్, అసలు ఏం జరిగింది?” అని అడిగారు. ఆవిడ ఏడుస్తూనే ఏదో చెప్పబోతుంటే నాన్నగారు మళ్ళీ అరిచారు:

 

“నాకేం పోయింది? నీకు జరుగుతున్న ద్రోహం సహించలేక పరుగెత్తుకొని వచ్చాను. నేను అబద్ధం చెప్తున్నానా అని ఇక్కడున్నవాళ్ళని ఎవరినైనా అడుగు! ఎక్కడ, ఎవరూ కనబడరేం? నేనెందుకు అబద్ధం చెప్పాలి? నాకు నిన్ను ఇరవై సంవత్సరాలకిపైగా తెలుసు . . . వీళ్లు నీకు చేసిన ద్రోహం నాకు చేసినట్టుంది . . . నా ఒళ్లంతా మండుతోంది . . . ”

 

ఇప్పుడు అమ్మకూడా నాన్నగారుతో : “నేను చెప్పానుగా, మీరు విన్నారా? మనకేం పోయింది?” అని అరుస్తోంది. ఇద్దరికీ ఇప్పుడు తామే అబద్ధం చెప్పామా అనే భయం వచ్చేసింది. సీతారామయ్యర్ నెమ్మదిగా, “రాజామణిగారూ, మీకు నా మీదున్న అభిమానం నాకు బాగా తెలుసు  . . . దయచేసి మీ ఆవిడతో మీ ఇంటికి వెళ్ళండి,” అని నాన్నగారికి చెప్పారు. అది నాన్నగారు వినిపించుకోలేదని అమ్మతో “మీరైనా మీ ఆయనతో ఇంటికి వెళ్ళండి,” అని చెప్పి మంగళం ఆంటీ భుజంని మెల్లగా తట్టారు. “ఏడవకుండా ఇక్కడ ఏం జరిగిందో చెప్పు,” అని ఆవిడని అడిగారు. ఆంటీ ఇంకా ఏడుస్తూనేవుంది. కాని వెక్కిళ్ళతోనే మాటాడింది: 

 

“నేనూ, మన మణీ - అదిగో . . . అక్కడ కూర్చొని . . . ”  అని ఆరంభించి, ఇంటిలోని వసారాని చూపిస్తున్న ఆవిడ చేయి అలాగా నిలిచిపోయింది; కంఠధ్వని హీనమైపోయింది. ఇటీవల అక్కడ జరిగిన ఘటన, దృశ్యం గుర్తుకి రాగానే మళ్ళీ పెద్ద ఏడ్పు.

 

“ఏడవకూడదు . .  . ఏడవకుండా ఏం జరిగిందో చెప్పు . . . ” 

 

“అక్కడ కూర్చొని మేం పాచికలాడుకుంటున్నాం . . . తిన్నగా ఎండ మామీద వచ్చి పడుతోందని నేనే ముందు ద్వారం తలుపు మూసేసాను; కిటికీలన్నీ తెరిచేవున్నాయి. మణి తలనొప్పి అని పడుకున్నాడు. నేను పాచికలన్నీ తీసి డబ్బాలో పెట్టాను . . . అప్పుడే ఈ అంకుల్ . . . ఇక్కడికి వచ్చి . . . వచ్చి . . . ”  

 

అంతకుమించి నోటిలో మరేంమాట పెగల్లేదు. గోడ మూల నిలబడివున్న మణికూడా ఏడ్చాడు. 

 

“వెఱ్ఱిదానా . . . అందుకేనా ఈ ఏడ్పు? ఊరుకో . . . రాజామణి అయ్యరుకి నామీదున్న అభిమానం నీమీదింకా రాలేదు . . . అతనికి నాతో ఇరవై సంవత్సరాల పరిచయం ఉంది . . . నువ్వు ఇప్పడేగా వచ్చావ్?” అని అంకుల్ అంటున్నారు. కాని మంగళం ఆంటీ ఊరుకోలేదు. “వీళ్ళు మణిని దడదడమని ఈడ్చుకొనివచ్చి . . . నా గురించి అన్యాయంగా ఏమేమో అంటున్నారు . . . నేను చేతి లో నిప్పు పట్టుకొని ప్రమాణం చేస్తాను! . . . ” అని బిగ్గరగా ఏడుస్తూంటే సీతారామయ్యర్ నవ్వుతున్నారు. 

 

“చాలు, ఊరుకో! . . . బాగుంది, చేతి లో నిప్పంట! . . . రాజామణిగారూ, వినండి . . . మంగళం నా భార్య, మణి, మా ఇంటి అబ్బాయి, నాకు వాళ్ళగురించి బాగా తెలుసు, నా గురించి తెలుసు, మీ గురించికూడా తెలుసు; ఇరవై సంవత్సరాలుగా మీ కాపురం నేను చూస్తున్నానుగా? ఏ మగవాడు తన భార్యని  నమ్ముతాడో వాడే ఊరులోవున్న తక్కిన భార్యలని నమ్ముతాడు . . . మామీ, మీరు రాత్రివేళ కోవిలలో హరికధ వింటున్నారుకదూ? మహాభారతంలోని కధ గుర్తుందా? దుర్యోధనుడి భార్యా, కర్ణుడూ ఆమె మందిరంలో పాచికలు ఆడుకుంటున్నారు. సగం ఆటలో ఆమె లేవగానే కర్ణుడు ఆమె మణికట్టుని పట్టుకొని కూర్చోమన్నాడు. ఆవిడ వడ్డాణానికి అలంకారమైన ముత్యాలు తెగి కింద రాలాయి . . . ఇవన్నీ మీరు వినివుంటారే? దుర్యోధనుడికి దుర్మార్గుడని పేరు, కాని అతను మగవాడు . . . అందువలనే అతను తన భార్యని అనుమానించలేదు! అసలు తన భార్యని నమ్మనివాడు ఏం మగవాడు? రాజామణిగారూ, బాగుంది మీ వాలకం! నా భార్యగురించి వీళ్ళందరిని నేను అడగాలంటున్నారు!” అని సీతారామయ్యర్ గట్టిగా నవ్వారు. నవ్వేసి మళ్ళీ అన్నారు. “ఇక్కడున్న మగాళ్ళందరికీ ఒక మనవి: ముందు మీ మీ మీ భార్యలని మీరు నమ్మండి, అది చాలు!”

 

“ఎందుకురా ఏడుస్తావ్? వెళ్ళి మొహం కడుక్కో!” అని అంకుల్ అనగానే, మణి కుళాయికి వెళ్ళాడు; మంగళం ఆంటీ ఇంకా నిలబడి ఏడుస్తోంది. 

 

“ఇదిగో, విను. వీళ్ళందరూ నిన్ను నమ్మి నాకేం కావాలి? నాకు నమ్మకం ఉంది. లోపలికి రా!” అని ఆవిడ చేయి పట్టుకొని ఆంటీని అంకుల్ ఇంటిలోకి నడిపించారు. 

 

“నాకు ఈ ఇంటిలో భయంగా ఉందండి. మనం మరెక్కడైనా వెళ్ళిపోదాం!” అని మంగళం ఆంటీ అన్నారు కాబోలు; నా చెవుల్లో అంకుల్ జవాబు మాత్రం వినిపించింది. 

 

“వెఱ్ఱిదానా, ఎక్కడికి వెళ్ళినా మనుషులు ఇలాగే ఉంటారు!” అని అంటూ అతను గట్టిగా నవ్వారు.

 

రోమన్ చక్రవర్తి-జూలియస్ సీజర్ తాలూకు సామెత Caesar’s wife must be above suspicion నాకు గుర్తుకి వచ్చింది. మంగళం ఆంటీ గురించి నాకేం తెలియకపోయినా సీతారామయ్యరే సీజర్ అని నాలో నేను అనుకున్నాను.

 

*****

bottom of page