top of page
hasya.JPG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వంగూరి పి.పా.

చెదిరిన ఆంధ్రా కల... నా అమెరి’కల’

vanguri.PNG

వంగూరి చిట్టెన్ రాజు

ఇటీవల జరిగిన తెలంగాణా ఎన్ని’కల’ లలో కే సీ ఆర్ గారు తన ప్రత్యర్దులని చిత్తు చేసి ఘన విజయం సాధించారు. పాత్రికేయులూ, టీవీల వాళ్లూ, రాజకీయ విశ్లేషకులూ ఆ విజయానికి రక రకాల కారణాలు నొక్కి వక్కాణించారు కానీ ...కేసీఆర్ గారి ఘన విజయానికి అసలు కారణం నాకూ, ఆయనకీ మాత్రమే తెలుసు. అదే తెలుగు భాష. అనగా ఆయన తెలంగాణాలో తెలుగు భాషకి పట్టం కట్టడానికి నిశ్చయించుకుని ముందుగా ప్రతీ పాఠశాలలోనూ తెలుగు భాష నేర్పి తీరాలి అని అధికారికంగా నిర్దేశించడం. పైగా ఆ నిబంధన అమలుకి తగిన డబ్బు కేటాయించి, లేని చోట పంతుళ్లని నియమించి, పాత అలవాటు కొద్దీ ఈ నిబంధనని చూసీ చూడనట్టు వదిలేసి అమలు పరచడానికి ప్రయత్నం చెయ్యని పాఠశాల యాజమాన్యాలకి జరిమానా వెయ్యడం  మొదలైన చర్యలు కేసీఆర్ చేపట్టారు. అసలే తెలంగాణా వారికి తెలుగంటే అభిమానం. పైగా ప్రత్యర్ధులలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ, బీజీపీ వగైరాలకి తెలుగు అంటే నిర్లక్ష్యం మరియు  చులకన. ఈ పరిస్థితులలో తెలుగుకి పట్టం కడుతున్న కేసీఆర్ కి తప్ప ఇంక ఎవరికి ఓటు వేస్తారు చెప్పండి? తెలుగు భాషని పునరుద్దరించి తద్వారా చరితార్ధుడుగా నిలిచిపోయే దిశలో కేసీఆర్ మొదటి అడుగులు వేశారు. అందుకే గెలిచారు.

ఇక ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికలలో ఎవరు నెగ్గినా ఆంధ్ర ప్రదేశ్ లో గత నలభై యాభై ఏళ్లలో క్షీణించి ప్రస్తుత తెలుగు భాషా, సాహిత్య, కళా రంగాల దౌర్భాగ్య పరిస్థితులకు కారణాలు ఏమైనప్పటికీ, ఎవరైనప్పటికీ, అవన్నీ పక్కన పెట్టి, ఇప్పుడు నడుం కట్టి   మన ఆస్తిత్వాన్ని  పునరుద్దరించి, ప్రగతి బాటలో పెట్టగలిగిన నాయకుడే చరితార్దుడు ఔతాడు. ఎందుకంటే కేవలం ఈ ఒక్క కారణానికి..అంటే తెలుగు భాషా, సాహిత్యాలని పునరుద్దరిస్తేనే పాలకులు చరిత్రలో నిలిచి పోతారు. రాజధాని నిర్మిస్తే చరిత్రలో ఒక వాక్యం ఉంటుంది. భాషనీ సాహిత్యాన్నీ పునరుద్ధరిస్తే ఆ భాష మాట్లాడే అనేక తరాలు ఆ పేరు మననం చేసుకుంటారు.  అతి చిన్న పాలకులైన రాజ రాజ నరేంద్రుడు, రెడ్డి రాజులూ అందుకు ఉదాహరణ. ఆఖరికి కృష్ణ దేవరాయలు కూడా సాహితీవేత్త గానూ, అష్ట దిగ్గజాలని పోషించిన రాజు కాబట్టే ఎక్కువ గుర్తింపు పొందుతున్నాడు.

ఇప్పుడు చంద్రబాబు నెగ్గే అవకాశాలు చాలానే ఉన్నాయి కాబట్టి, ఆంధ్రాలో ఆయనకి చెప్పే దమ్ములు ఎవరికీ లేవు కాబట్టి,  అన్ని విషయాలూ తెలిసిన మన ఎన్నారై టీడీపీ కార్యకర్తలకి నాది ఒక సూచన. వారే కాక, వాటిలో నాయకులూ ఏదో కండువా కప్పుకుని నాయుడు గారితో ఫోటోలు తీయించుకుని మురిసిపోవడంతో సరిపెట్టుకోకుండా మన భాషా, సాహిత్యాల వేపు దృష్టి పెట్టి తీరవలసిన సమయం వచ్చింది అనీ, వాటిని పునరుద్దరించే చర్యలు చేపట్టి చరిత్రలో కలకాలం నిలిచిపోయే అవకాశాన్ని అంది పుచ్చుకోమని నాయుడు గారికి నచ్చ చెప్ప వలసిన బాధ్యత నెరవేర్చాలి. నాయుళ్లు ఇద్దరూ అంటే చంద్రబాబు, లోకేష్ బాబూ  ఎన్నారై టీడీపీ వారు చెప్తే వింటారు. అప్పుడే రాజకీయ నాయకులు తెలుగు భాషలో మాట్లాడడమే కాకుండా తెలుగు భాష గురించి కూడా మాట్లాడ తారు. ప్రభుత్వం అండదండలు లేక పొతే భాష బలుసాకు తింటూ బతికే ఉంటుంది కానీ పురోగమించదు.

ఇది ఎన్నికల సమయం కాబట్టి చంద్ర బాబు ఆయా రాజకీయ  అస్త్రాల సమీకరణ, ప్రయోగాల మీదే దృష్టి పెడతారు. ఉదాహరణకి నిన్న రాత్రి మన తెలుగు టీవీలు  చూస్తుంటే అందులో చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వం అనేక రంగాలలో గత నాలుగేళ్ల లో సాధించిన పురోగతి మీద శ్వేత పత్రాలు విడుదల చేసే వార్తలు ప్రసారం అవుతున్నాయి. ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో ఎంత మంది తనతో సహా అన్నా కేంటీన్ లో ఐదు రూపాయల భోజనం చేసి బతికి బయట పడ్డారో, ఎన్ని కోట్ల మందికి పింఛను, యువతీ యువకులకి నిరుద్యోగ భత్యం మొదలైన కార్యక్రమాల ద్వారా ఎన్ని బెల్టు షాపుల లాభాలు పెరిగాయో,  నదుల సంధానం ప్రణాళిక లో కృష్ణా నది వెళ్లి ఎలా గోదాట్లో కలిసి పోయిందో..ఇలా అనేక శ్వేత పత్రాలు విడుదల చేశారు. రెండు రోజుల పాటు ఈ శ్వేత పత్రాల విడుదల చూసి ముగ్ధుడిని అయిపోయిన నాకు ..ఎక్కడో తీరని లోటు కన పడింది...అది కోడి గుడ్డికి వెంట్రుకల లాంటిది కానే కాదు. కానీ నాగరికుల విందు భోజనంలో ఉండవలసిన శాకంబరీ దేవీ ప్రసాదం లేనే లేదు.  భాషాసాహిత్య కళా రంగాల ప్రసక్తే లేదు. ఈ లోగా నిద్ర ముంచు కొచ్చింది...

నిద్రలో ఒక అసాధారణమైన కల..అమెరికల...అవును...అమెరికా వాడికి వచ్చే ఆసాధారణమైన “ఆంద్రా కల.....అమెరి’కల’..... అందులో కూడా సరిగ్గా అదే సీన్... అదే మనిషి...అదే అమరావతి....ఆ పెద్దాయన చంద్రబాబు లాగానే ఉన్నాడు కానీ క్షణ క్షణానికీ మారిపోతూ ఒక సారి జగన్, మరో సారి పవన్..ఇలా అసలు ఎవరు ముఖ్యమంత్రో తెలియడం లేదు. ఎవరయితేనేం.. ఆయన వెనకాల తెర మీద “తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక శాఖ వారి శ్వేత పత్రం విడుదల మరియు సమీక్షా సదస్సు” అని పెద్ద ఫ్లెక్సీ. ఆయనకి ఒక పక్క మరో పెద్దాయన గారు, ఆ పెద్దాయన ముందు “సాంస్కృతిక శాఖామాత్యులు” అనే చిన్న బోర్డు, మిగతా వారి ముందు “రాష్ట్ర సాహిత్య సమితి (ఎకాడెమీ) అధ్యక్షులు, అలాగే రాష్ట్ర శాస్త్రీయ సంగీత, లలిత సంగీత, కూచిపూడి నాట్య, నాటక, జానపద మొదలైన రాష్ట్ర స్థాయి ఎకాడెమీల అధ్యక్షుల వారి పేర్లతో ప్రముఖులు ఆసీనులు అయి ఉన్నారు. ఇక శ్రోతలలో 13 జిల్లాల సాహిత్య సంగీత, లలిత సంగీత, కూచిపూడి నాట్య, నాటక, జానపద మొదలైన  స్థానిక ఎకాడెమీల అధ్యక్షులతో సభ నిండుగా ఉంది. వారిలో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. చాలా మంది వేసుకున్న ఒకే రంగు కండువాలతో సభ కళ కళ లాడుతోంది. కండువా రంగులు కూడా చీటికీ, మాటికీ మారి పోతూ అది ఏ పార్టీ ప్రభుత్వమో తెలియడం లేదు.  

ముఖ్యమంత్రి గారు తమ ప్రసంగం మొదలు పెట్టారు. “అందరికీ నమస్కారం. గత నాలుగు సంవత్సరాలలో మన రాష్ట్రం తెలుగు భాషా, సాహిత్య సాంస్కృతిక రంగాలలో సాధించిన పురోగతిని మీకు ఈ శ్వేత పత్రం ద్వారా విన్నవించి రాబోయే నాలుగేళ్ళలో ఆయా రంగాలలో మరొక స్వర్ణయుగం ఆవిష్కరించడం మా ప్రభుత్వం ధ్యేయమని ఈ సందర్భంగా  మీకు తెలియ జేస్తున్నాను.” ఇలా ఉపోద్ఘాతం ఇచ్చి ఆయన శ్వేత పత్రం విడుదల చేసి అందరికీ చూపించగానే పూర్తిగా తెల్లగానే ఉన్న ఆ శ్వేత పత్రాన్ని చూసి సభికులు హాహా కారాలు చేశారు. అ సభలో ఎక్కడో మూల కూచున్న నేను ‘గత నాలుగేళ్ళలో సాధించిన ప్రగతి అంతా ఖాళీయేగా”  అనుకుంటూ ఉండగా ముఖ్యమంత్రి గారు నాలిక కరుచుకుని మరింత పుంజుకున్నారు. “ఈ శ్వేత పత్రం మా ప్రతిపక్షం వారు మాకు ఇచ్చిన ప్రోత్సాహానికీ, మోడీ గారు ఇచ్చిన సహాయానికీ నిదర్శనం. దానికి ప్రత్యామ్నాయంగా రాబోయే ఎన్నికల కోసం మా భాషా సాహిత్యాల మానిఫెస్టో ప్రకటిస్తున్నాను. ఇది వరకటి ప్రభుత్వాల తప్పుడు విద్యా విధానాలకి స్వస్తి చెప్పి ఆయా రంగాలకి పూర్వ  వైభవం తీసుకు రావడం కోసం తెలుగు సాంస్కృతిక శాఖ పేరిట ఒక కేబినేట్ స్థాయి మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టిస్తాం. పక్క రాష్ట్రాల మీద నిఘా పెట్టి తెప్పించుకున్న రహస్య నివేదికల ఆధారంగా మేము పది ఫ్లాగ్ షిప్ సాంస్కృతిక అభివృద్ది కార్య క్రమాలు రూపొందించాం. అందులో మొదటిది ప్రతీ రంగానికీ ఒక రాష్ట్ర స్థాయి ఎకాడెమీ, అనుబంధ సంస్థలుగా ప్రతీ జిల్లాకి ఒక సమితి ఏర్పాటు చేస్తాం. మేము ఇటీవల అమెరికా వెళ్ళినప్పుడు అక్కడి తానా, ఆటా, నాటా, నాట్స్ సంస్థల వారు ఈ ప్రణాళికలని ఎంతో హర్షించి తమ వంతు సహాయంగా ఒక్కొక్కరు మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించారు అని ఈ సందర్భంగా మీకు తెలియ జేస్తున్నాను.” మిలియన్ డాలర్లు అని వినగానే అందరూ జై ఎన్నారై, జై జై ఎనారై, జై జై  ఎన్నారై టీడీపీ అని బల్లలు చరిచి తమ ఆనందాన్ని తెలియ జేశారు. మరి కొందరు జండాలు ఊపారు. ఈ ప్రణాళికలతో, ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలతో తెలుగు సాహిత్య, నాట్య, సంగీత, రంగస్థల సాంస్కృతిక రంగాలలో ముందుకు పోవాలంటే రాబోయే ఎన్నికలలో  నన్ను ఎన్నుకోక తప్పదు. మా హయాంలోనే తెలుగు రచయితకి నోబెల్ బహుమానం వచ్చే పరిస్థితి వస్తుంది అని హామీ ఇస్తున్నాను. అలా ముఖ్యమంత్రి గారి ప్రసంగం కొన సాగుతోంది. అవును.. సాగుతోంది...

ఇక నేను ఆగలేక పోయాను. జై చంద్ర బాబూ, జై జగన్, జై పవన్  జై, జై  తెలుగు దేశం, జై జై తెలుగు తల్లి అని ఆనందంతో ఒహటే అరుపులు, కెవ్వు కేకలు...ఒళ్లంతా చెమట్లు...

ఏయ్....ఏమయిందే...ఏమిటా అరుపులు...ఏమన్నా పీడ కలా? ఏమిటా చెమట్లు? లేలే” అని నా రోజు వారీ టెంకి జెల్ల అమరావతి దాకా వినపడేలా మరింత ధాటీగా కొట్టి తన అర్ధ రాత్రి వర్క్ కి వెళ్ళిపోయింది మా క్వీన్ విక్టోరియా. నా రంగు రంగుల ఆంధ్రా కల, అమెరి ‘కల’ చెదిరి పోయింది. నేను మా పడక గది సీలింగ్ వేపు శూన్యంగా చూస్తూ ఉండిపోయాను. అది నా మొహం లాగా మరియు శ్వేత పత్రంలాగా తెల్లబోతోంది.

*****

bottom of page