top of page
hasya.JPG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

ఉత్తరాయణ పుణ్యకాలం

ఎర్రాప్రగడ రామకృష్ణ

ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అనడం ఆనవాయితీ. ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే మోక్షం లభిస్తుందని ఒక నమ్మకం. శరతల్పగతుడైన భీష్మ పితామహుడు ఉత్తరాయణ ఆగమనం కోసమే చాలాకాలం ఊపిరి నిలుపుకొన్నాడని భారతం చెబుతోంది. ఉత్తరాయణం పుణ్యకాలం ఎలా అవుతోందంటే, దక్షిణాయనంలో చేసిన తపస్సు వల్ల. మన మహర్షులు రూపొందించిన ప్రణాళిక రీత్యా దక్షిణాయనం చక్కని సాధన కాలం. దక్షిణాయనంలో చేసిన తపస్సు వల్ల ఉత్తరాయణం పుణ్యకాలమవుతోంది. శ్రావణంతో మొదలై పుష్యం, మాఘం దాకా మన పెద్దలు నిర్దేశించిన ఒకానొక ఆరాధన క్రమాన్ని పరిశీలిస్తే అది రుజువవుతుంది.

దక్షిణాయనం వర్ష రుతువుతో మొదలవుతుంది. సృష్టికి దాన్ని ఆరంభకాలంగా చెబుతారు. తపస్సు ఆరంభానికి అది అనుకూలమైన కాలం. ఆధునిక యోగుల్లో పేరు గడించిన అరవిందయోగి జననం శ్రావణంలోనే. ఈ లోకానికి గీతోపదేశం చేసిన పరమ యోగీశ్వరేశ్వరుడు కృష్ణభగవానుడు శ్రావణమాసంలోనే జన్మించాడు. అమృతాన్ని సాధించిన గరుత్మంతుడు గరుడ పంచమినాడు పూజలందుకుంటాడు. అదీ శ్రావణంలోనే. యోగసాధనతో అమృతత్వసిద్ధికై చేసే ప్రయత్నాలకు శ్రావణం ప్రశస్త ప్రారంభ శుభకాలం.

శ్రావణంలో ప్రధానమైనది శ్రవణం. అంటే వినడం. దేన్ని శ్రవణం చేయడమంటే - వేదాన్ని. వేదపండితులు సంచారాలకు బయలుదేరడంలోనూ, వేదసభలు శ్రావణంలో విశేషంగా జరగడంలోనూ ప్రత్యేకత అదే. వేదపఠనం, శ్రవణం. తపస్సుకు తొలిమెట్లు. సాధనకు గురి కుదిరి, ఏకారత స్థిరపడితే, షట్చక్రాల్లో మొదటిది  మూలాధారంలో ఆధ్యాత్మిక చైతన్యం పురివిప్పుతుంది. కుండలిని జాగృతమవుతుంది.

మూలాధారానికి పృథివీతత్వం. భాద్రపదంతో బ్రహ్మదేవుడు గణపతిగా ఆవిర్భవిస్తాడు. మట్టితో వినాయకుడి ప్రతిమ చేసుకుని, పృథివీతత్వాన్ని ఆరాధించాలన్నది మన మహర్షుల ఆదేశం. తొలి పూజలందుకునే ఇలవేలుపుగా గణపతిని ఆరాధించడమంటే మూలాధారాన్ని, పృథివీతత్వాన్ని ఆరాధించడమే. పెద్ద ఏనుగు ముఖం, బానపొట్ట, చేటల్లాంటి చెవులు, చేతిలో పెద్ద లడ్డు, ఉండ్రాళ్ళు వంటివన్నీ పృథివీతత్వానికి చెందిన స్థూల రూప ప్రతీకలు. గణపతి మూలాధార క్షేత్రజ్ఞుడు. చవితి అంటే నాలుగో తిథి. దాని అర్ధం త్రిగుణాతీతమైనదని. భాద్రపదంలో గణపతి ఆరాధనకు లక్ష్యం .. త్రిగుణాతీత స్థితిని సాధించడం.

శ్రావణ భాద్రపదాల తరువాత వచ్చే ఆశ్వీయుజమాసం శక్తికి సంకేతం. దేవీ నవరాత్రులు ఆశ్వీయుజంలో వస్తాయి. కుండలినీ శక్తి జాగృతికి అవి కీలకమైన రోజులు. సకల శక్తి స్వరూపిణిగా అమ్మవారిని ఆరాధిస్తారు. ముక్తికి ఆటంకంగా నిలుస్తున్న లోపలి శత్రువుల్ని జయించడానికై సాధకుడికి అవసరమైన శక్తిని అమ్మవారు అనుగ్రహించే కాలమది. దసరా రోజుల్లోని దశమిని విజయదశమిగా పిలుస్తారు. సాధకుడు అంతశ్శత్రువులపై సాధించిన విజయానికి అది సంకేతం. పరమ శక్తిస్వరూపిణి సీతమ్మను అన్వేషిస్తూ హనుమ ప్రయాణమైంది  శరదృతువులోనేనని రామాయణం చెబుతోంది. శక్తి సాధనకై ఆశ్వీయుజం సద్వినియోగం కావాలని మన పెద్దలు ఆ రోజుల్లో అమ్మవారి ఆరాధనకు మిక్కిలి ప్రాధాన్యం కల్పించారు.

ఆశ్వీయుజం అనంతరకాలం కార్తీకం. శివుడికి పరమ ప్రీతికరమైనది. శివుడు జ్ఞానప్రదాత. కార్తీకంలో శివారాధనం జ్ఞానప్రాప్తికి గొప్ప సాధనం. జ్ఞానం మోక్షానికి దారి చూపిస్తుంది. కర్మపాశాలచే బంధితులవుతారు కనుక జీవులందరినీ పశువులు అంటారు. వాటికి యజమాని  పరమశివుడు. అందుకే ఆయనను పశుపతి అన్నారు. కర్మవిమోచనానికి అవసరమైన జ్ఞానాన్ని పశుపతి అనుగ్రహిస్తాడు. కర్మబంధ విమోచనం మోక్షానికి ముఖ్య అర్హత. దాని కోసం చేసే సాధనకు కార్తీక మాసం చాలా అనుకూలమైన కాలం.

మోక్షాన్ని అనుగ్రహించేవాడు మహావిష్ణువు. ఆయనను ఆరాధించడానికి అనువైన కాలం.. మార్గశిర మాసం. దుర్లభమైన మనిషి జన్మకు పరమలక్ష్యం మోక్షం. కనుక మార్గశిరంలో మోక్షప్రదాతగా విష్ణువును ఆరాధించాలని మన పెద్దల  నిర్దేశం. నేను మరణిస్తున్నానన్న అసురభావంలోంచి ఈ దేహాన్ని విడిచిపెడుతున్నానన్న అమృత భావనలోకి జీవుణ్ని నడిపిస్తాడు విష్ణువు. మృత్యుభావన విడిచిపెట్టడమే ముక్తస్థితి. 'మాసాల్లో నేను మార్గశీర్షాన్ని' అన్నాడు గీతాచార్యుడు. అందుకే మార్గశీర్షాన్ని 'తల దారి' అంటారు.

 

మార్గశిరం తరువాత వచ్చే పుష్యం, మాఘం సూర్యభగవానుడికి ప్రీతికరమైన మాసాలు. సూర్యుణ్ని పుష్యమాసంలో విశేషంగా ఆరాధిస్తారు. పుష్యంలోనే దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం ఆరంభమవుతుంది.

 

శ్రావణంలో మొదలైన సాధకుడి తపస్సు భాద్రపదంలో గణపతిని, ఆశ్వీయుజంలో అమ్మవారినీ, కార్తీకంలో పరమశివుణ్ని, మార్గశిరంలో మహావిష్ణువును, పుష్య మాఘాల్లో సూర్యభగవానుణ్ని ఉపాసిస్తూ క్రమంలో పక్వస్థితికి చెరుతుంది. ఇదే 'పంచాయతన మహా పూజా విధానం'.  వైష్ణవం, సౌరం అనే అయిదింటి సమ్మేళన మహాయొగం - పంచాయతనం. దక్షిణాయనంలో ఇలా దశలవారీగా సాగిన సాధన పంచాయతన పూజగా పర్యవసించి ఉత్తరాయణంలో ఫలించి మోక్షానికి యోగ్యతను కలిగిస్తుంది. ఉత్తరాయనం ఆ రకంగా సాధకుడికి పుణ్యకాలం అవుతుంది. అంటే దక్షిణాయనాన్ని సద్వినియోగం చేసుకుంటేనే ఉత్తరాయణం పుణ్యకాలమై అనుగ్రహిస్తుంది.

 

స్వచ్చంద మరణాన్ని వరంగా పొందిన భీష్ముడు ఉత్తరాయణం వచ్చేదాకా ఎందుకు ఆగాడంటే - నరకానికి పోతానన్న భయంతో కాదు,, దక్షిణయాన సాధనా క్రమాన్ని పరిపూర్తి చేయడానికి. తద్వారా అమృతత్వసిద్ధిని సాధించడానికి. అదీ - ఈ రెండు కాలాల మధ్య గల ఆధ్యాత్మిక అనుబంధం. ఉత్తరాయన శుభఫలాలను అందుకోవాలనుకుంటే సంవత్సరం కాలవృక్షపు దక్షిణాయన మూలాలకు చక్కగా ఆధ్యాత్మిక ఎరువులు, నీళ్లు పోసి పెంచి పెద్ద చేయాలి. అందుకే దక్షిణాయనంలో ఎన్నో పండుగలు నిర్ణయించి, ఉపవాస నియమాలు ఏర్పరచి, పెద్దలు ఆరాధనాక్రమాన్ని నిర్మించి ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోవడం మన కర్తవ్యం.

*****

Bio

ఎర్రాప్రగడ రామకృష్ణ

ఎర్రాప్రగడ రామక్రిష్ణ గారు ఈనాడు ఆదివారం పత్రిక 'అంతర్యామి ' శీర్షిక ద్వారా సాహితీబంధువులందరికీ సుపరిచితులు. తిరుపతి లో శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలోనూ, భద్రాచలం లో సీతారామకళ్యాణ మహోత్సవాల్లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించే వీరికి ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ఆసక్తికరంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం వెన్నతో పెట్టిన విద్య. తెలుగు పద్యాలపై పట్టు, వాటిని పలకటంపై సాధికారత వీరి సొంతం.

bottom of page