top of page
hasya.JPG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

అదన్నమాట సంగతి

ఆహా చీరలు!!!.. అమ్మో చీరలు!!

Jyothi Valaboju

జ్యోతి వలబోజు

cheera.PNG

దృతరాష్ట్రుడి సభలో ఘోర అన్యాయం జరిగింది.  ఒక్కరు కాదు అయిదుగురు భర్తల ముందు, వంద మంది కౌరవులు, పెద్దలు , మునులు, ఇతరుల ముందు ఆ యింటి కోడలు వివస్త్రగా చేయ తలంచారు దుష్టులు. అందరూ నిస్సహాయులై ఉండగా ద్రౌపది మొర విన్న గోపాలుడు ఆమె నిండుసభలో వివస్త్ర కాకుండా వేలకు వేలు చీరలు ఇచ్చాడు. వాటిని లాగి లాగి చేతులు లాగి దుశ్వాసనుడు పడిపోయాడు. గుట్టలుగా చీరలు పేరుకుపోయాయి. తర్వాత పెద్దాయన దృతరాష్ట్రుడు, భీష్ముఢు వగైరా ముందుకు వచ్చి  ఆమెను లోపలికి పంపారంట. అప్పుడు కొన్ని ప్రతిజ్ఞలు కూడా జరిగాయనుకోండి. సినిమాలో ఈ సీన్ చూసాక నాకు వచ్చిన సందేహం ఒక్కటే.. అసలు ఇన్ని చీరలు ఎక్కడి నుండి తీసుకువచ్చారు. అన్నీ కొత్తవేనా. తక్కువ ధర చీరలా? లేక అన్ని రకాల చీరల్లో సెలెక్ట్ చేసుకొచ్చారా. మరి మహాభారతం టైములో ఇప్పట్లా నైలెక్స్, పాలియస్టర్, షిఫాన్, జార్జెట్ లాంటి చీరలు ఉన్నాయా? లేవు కదా. అలాంటప్పుడు ఆ సీనులో చీరలన్నీ ఎలా సెలెక్ట్ చేసారు. ఆ కాలంలో ఎలాటి చీరలు కట్టారో ఎవరు చెప్పారు? ఎవరు చూడొచ్చారు. ఆ సినిమా మళ్లీ చూసి  కనుక్కుందామా అంటే బ్లాక్ & వైట్ ఆయె. టీవీలో చూసినా కనుక్కోవడం కష్టమే. సరే ఇదంతా పక్కన పెడితే సినిమా షూటింగ్ తర్వాత ఈ చీరలన్నీ ఏం చేసారు? ఎవ్వరు తీసుకున్నారు. షాపులో రిటర్న్ ఇచ్చారా? షాపులో డబ్బులిచ్చి తెచ్చారా? తిరిగి ఇస్తే అన్ని చీరలు షాపువాడేం చేసాడు. మళ్లీ ఇస్త్రీ చేసి అమ్మేసాడా? ఇంకో సినిమా కూడానండోయ్. శోభన్ బాబు జయప్రద, శ్రీదేవి ల దేవత సినిమా. అందులో ఒక పాటలో అన్నీ చీరలే చూపిస్తారు. నయం ఇక్కడ చీరలు మరీ ఎక్కువ ఖరీదుగా కనపడలేదు. సగం మడతలుగానే చూపించారు. మళ్లీ అదే డౌటనుమానం ఈ చీరలన్నీ కొని తెచ్చారా? తర్వాత వాటినేం చేసారు అని. ఇప్పుడంటే ఇలాటి తింగరి ఆలోచనలు రావులెండి. ఖరీదైన డ్రెస్సులు, చీరలు షాపు వాళ్లే ఇచ్చి తమ ప్రకటన వేసుకుంటున్నారు. వాళ్లే షూటింగ్ తర్వాత జాగ్రత్తగా తీసికెళతారు. వాళ్లకూ, సినిమావాళ్లకూ పుణ్యం పురుషార్ధం కూడా దక్కుతాయి. కదా..

ఇంతకీ పురాణాలు, పాతకాలం సినిమాలు అందులోని చీరలు ఎందుకు గుర్తొచ్చాయంటారా? చాలా పెద్ద కథ ఉందండి. కథ అంటే మామూలు కథ అదొక వ్యధ. బాధ, ఎవరూ తీర్చలేనిది. దాదాపు ప్రతీ ఇంట్లో ఉండేదే. వద్దు వద్దు అనుకుంటూనే మనసు దాని మీదకు లాగేస్తుంది. ఒకవైపు భీరువాల నిండా ఉన్నా, ఏదైనా పెళ్లి లేదా ఫంక్షన్ ఉందంటే ఏ చీరా నచ్చి చావదు. చలికాలం మొదలవుతుందంటేనే మందంగా ఉండే సింథటిక్, ఫాన్సీ, పట్టు చీరలు బయటపెట్టాలి. పార్టీలకు స్వెట్టర్లు వేసుకెళ్తే బాగుండదు కదా. షాల్ కప్పుకుంటేనేమో చీర, బ్లౌజ్ మీద వర్క్, చేతినిండా గాజులు, మెడలో నగలు ఎలా కనిపిస్తాయి. అందుకే చీరలే కాస్త మందంగా ఉన్నవి కట్టుకుంటే సరి. అదీ గాక ఇవాళ్రేపు అన్నీ ఏ.సి హాలులే.  వానకాలం వస్తుందంటే చాలా చిరాకబ్బా.. ఇంట్లోనే ఉంటే హాయిగా ఉంటుంది. కాని ఒక్కోసారి పెళ్లిళ్లు, పార్టీలు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది. ఏ చీర తీయాలో అర్ధం కాదు. కాస్త లైట్ వెయిట్ అయతే మేలేమో. మిగతా సమయాల్లో డ్రెస్సులు, సింథటిక్ చాలా ఉపయోగపడతాయి. ఇక వేసవి వచ్చిందంటే ఫుల్ పండగే నాకైతే. ఎన్నెన్ని కాటన్ చీరలో. బెంగాలీ కాటన్ అందులో ఎన్ని రకాలో. కాస్త ఖరీదు ఎక్కువైనా మన్నికగా అందంగా , హాయిగా ఉంటాయి. కొన్నేళ్ల క్రితం పల్లవి కాటన్స్ చాలా ఫాషన్ గా ఉండేది. ఇవి కూడా ఖరీదే కాని చాలా మన్నికైనవి. డిగ్నిఫైడ్ గా ఉంటాయి లెండి. సౌత్ కాటన్, కలంకారీ కాటన్, ఇలా ఎన్నెన్నో రకాలు. అన్నీ కావాలనిపిస్తుంది. ఇప్పుడైతే కలంకారీ బ్లౌజులు చాలా ఫాషన్ అయ్యాయి కదా. ఓ పది కుట్టించేసుకున్నా. వంద చీరలకు మాచింగ్ అయిపోతాయవి. చీరలో ఒక్క కలర్ బ్లౌజులో ఉంటే చాలు. లేకుంటే ఈ చీరలేమోగాని  మాచింగ్ బ్లౌజులు కుట్టించడం, ఫాల్ పీకో అంటూ అదో తతంగం. లక్కీగా నేనే కుట్టుకుంటా కాబట్టి టైలర్ గొడవ లేదు.

అమ్మో అసలు సంగతి చెప్పడం మర్చిపోతానేమో.. చీరలకంటే ఖరీదైనవి జాకెట్లు . నమ్మడంలేదా. కావాలంటే ఒక్క తెలుగువారింట  లేదా సినిమావాళ్ల పెళ్లికి రండి. ఎంత మంచి వర్క్ బ్లౌజులు కనిపిస్తాయో. చీర రెండువేలే కాని బ్లౌజ్ వర్క్ ఓ ఆరువేలు, కుట్టడానికో వెయ్యి..  ఇంకా ఎక్కువ కూడా పెట్టి కుట్టించుకునేవాళ్లున్నారు. నాకైతే అలా మెరిసే మెరిసే వర్క్ ఉన్న చీరలైనా, బ్లౌజులైనా అస్సలు నచ్చదు. మా ఆయన బ్రతికిపోయాడు కదా. ఇక నాకు చీరలు ఎందుకిష్టం అంటే..


చీర చక్కదనాలకి వెండి జలతారు బంగారు ఝరీలు కుట్టుట, పట్టుచీరకి బరువు, పరువూ పెంచడం నాటి నవాబులు, నరపతులకాలం నుండి నేటి నటవారసుల వివాహవైభవాలకీ జరుగుతోంది. అది పట్టునుండి నైలాన్ షిఫాన్ దాకా ఎంత పెట్టుకుంటే అంత. ఎంత కుట్టుకుంటే అంతలా ‘వర్క్’ కొద్దీ వైభోగం పెరుగుతోంది. ఆ మధ్య ఓ జూనియర్ నటుడికి పెళ్ళైతే ఆ నటుడి అభిమాని తన హీరోకి నిజ హీరోయిన్ అవుతున్న దొరసానికోసం నవరత్నాలు కుట్టించిన పట్టుచీర కానుక ఇచ్చాడట. మరి సామాన్య వనిత  తను కొనుక్కున్న మామూలు   చీరకి పూసలు, చెంకీలు,జరీలు (బంగారు రంగుదారాలు) కొండొకచో చిప్స్, అద్దాల బిళ్లలూ పెట్టి కుట్టుకుంటోంది..రంగులతో లతలూ, పువ్వులతో తన చీర, జాకెట్టును మరింత అందంగా తయారుచేసుకుంటొంది.అన్నట్టు మీకు తెలుసో లేదో నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంట్లో ఉండేది ‘ ఉయ్యాలా చీర’ ఇప్పుడు తగ్గాయి గానీ, అప్పట్లో ప్రతీ ఇంట్లోనూ అమ్మమ్మ చీర …బుజ్జి మనవల గుడ్డ వుయ్యాలగా ఇంటి మధ్యలో అమరేది. ఓ మెత్తటి.. బుజ్జి బొంత వేసి దాంట్లో బజ్జోపెట్టిన బుజ్జ్జి బాబుకి  ఏపాటి నలుగుడు, నొప్పులు రాకుండా మెత్తగా, వెచ్చగా ఉండేది. పైగా ఆ  చీరవాసనకి పెద్దాళ్ళు తన పక్కనే ఉన్నట్టు నిశ్చింతగా నిద్రపోయేవారంట . ఇప్పుడు పెద్దవాళ్ల చీరలు పసిబిడ్డల ఊయలలోని పరుపు క్రింద వేసుకుని వారి ఆశీస్సులు అందుతాయని భావిస్తున్నారు.

ఈ మధ్య నాకు తిరుగుళ్లు ఎక్కువయ్యాయి. అదేనండి పుస్తకాల ప్రచురణ మొదలైనవి. దానికోసం రచయితలను కలవడం, మీటింగులు, ఆవిష్కరణలు అంటూ తిరుగుతుంటే చీరలకు గిరాకీ పెరుగుతుందిగా. ఇక ఏముంది పాతిక ముప్ఫై ఏళ్ల క్రింద చీరలు తీసి వాటికి మాచింగ్ ప్రింటెడ్ లేదా కలంకారీ జాకెట్ట వేసేసుకుని ఝామ్మని వెళ్లిపోతున్నా. అప్పుడప్పుడు టీవీ షూటింగులంటే ఓ నాలుగైదు చీరలు పట్టుకెళ్లడం... ఉతికిని చీరలు, .. ఇలా మంచంనిండా చీరలే చీరలు. మా అబ్బాయి మంచం. అతను ఇంట్లో ఉండడు కాబట్టి నా కథలు నడుస్తున్నాయి. లేకుంటే చచ్చినట్టు ఎప్పటికప్పుడు మడతబెట్టి అల్మారాలో సర్దుకునేదాన్ని. అదేంటోగాని ఎప్పుడూ నాకు నేనే వాపోతుంటాను. నాలుగైదు బకెట్ల బట్టలు చీరలు వీరలెవెల్లో ఉతికి పారేస్తాను (బయట కాదండోయ్) కాని మడతపెట్టడం అంటే ఎంత విసుగ్గా ఉంటుందో. ఎవరైనా ఇంటికి వచ్చినవాళ్లు కాస్త  జాగ్రత్తగా నా చీరలను మడత పెట్టిస్తే అల్మారాలో పెట్టుకుంటా కదా. అప్పుడు ఆ మంచం, రూమ్ ఎంత నీట్ గా ఉంటాయి అని కుమిలిపోతుంటాను. అలా కుదరదు కాబట్టి ఒకరోజు బలవంతంగా కూర్చుని సర్ధుకుంటాను.

పుస్తకాల ఆవిష్కరణలకు వెళ్తే షాల్ కప్పొద్దు అని నొక్కి వక్కాణిస్తాను కాబట్టి ఈ మధ్య స్నేహితులైన కొందరు రచయిత్రులు నాకు చీరలే ఇస్తున్నారు. ఎంత మంచోళ్లో ... మళ్లీ ఇంకెవరో చీర పెడతారు. అలా కొత్తవి వచ్చి పడుతున్నాయి. వాటికి జాగా కావాలంటే పాతవి తీసేయాలి కదా. అదేంటోగాని నాకు పాత చీరలంటే  కూడా చాలా మక్కువ. కొన్నైతే ఎంత బావుంటాయో. ఎంత పాతవైనా ఎవ్వరికీ ఇవ్వబుద్ధి కాదు. ఇచ్చేసాకేమో అవే గుర్తొస్తుంటాయి. ప్చ్.. మావారికైతే నా చీరలమీదే కళ్లు, కుళ్లు.. ఇంటినిండా చీరలు, పుస్తకాలు అని విసుక్కుంటారు. అన్నీ తీసికెళ్లి లేదా ఎవరినైనా ఇంటికి పిలిచి ఇచ్చేస్తా అంటారు. అమ్మో!! కంచి, ఆరణి, నారాయణపేట్, గద్వాల్, సీకో, కలంకారీ, పాటూర్ పట్టు, ఉప్పాడ, ఇక్కత్, పోచంపల్లి..ఎన్ని చీరలు. ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నాను.  నేనిస్తానేంటి.

ప్రపంచం ఎంత మాడ్రన్ గా మారినా, ఎంత అభివృద్ధి చెందినా. ఆడవాళ్లు చీరలు కట్టడం లేదు, డ్రెస్సులు, జీన్సులే వేసుకుంటున్నారని వాపోయినా చీరకున్న అందం, హుందాతనం చీరదే. ముఖ్యంగా తెలుగువారింట ఆడపడుచుకు కట్నం పెట్టాలన్నా, ఇంటికొచ్చిన ముత్తయిదువకు తాంబూలం ఇవ్వాలన్నా, ఆడవాళ్లను గౌరవించాలన్నా చీరదే అగ్రస్ధానం. అందుకేగదా నా చీరల కలెక్షన్ పెరిగిపోతుంది. ఒకవైపు పాత చీరలు, కట్టని చీరలు అని తీసేసి కష్టంగా దానం చేస్తుంటానా. వెనకాలే కొత్త చీరలు వచ్చేస్తుంటాయి. ఎంత చీరలు ఎక్కువయ్యాయని మొత్తుకున్నా ఎవరైనా మళ్లీ చీర పెడతానంటే వద్దంటారేంటి. మీరు మరీనూ.. దేని లెక్క దానిదే. ఇంకోమాట.. ఇప్పుడు ఆన్లైన్ లో కూడా మంచి మంచి చీరలు దొరుకుతున్నాయి. అయిదొందల నుండి మూడు వేలవరకు మంచి ఫాషనబుల్ చీరలు. ఫేస్బుక్ వాడేవారికైతే ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చాలామంది అమ్మాయిలు ఈ ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు. ఎంచక్కా కంప్యూటర్ లేదా ఫోనులో చీరల సెలెక్షన్ చేసేసుకుని ఆర్డర్ పెట్టేయొచ్చు. ఇంట్లో వాళ్లకు అసలు తెలీదు. మనం ఇంటినుండి బయటకెళ్లి షాపింగ్ చేయట్లేదు కదా. హాయిగా అవే మనింటికి వచ్చేస్తున్నాయి. సింపుల్.. ఎంత సీరియస్  పని చేస్తున్నా చీరల యాడ్ కనపడగానే అక్కడికెళ్లి కొత్తవేమొచ్చాయో చూడడం, అతి కష్టం మీద నచ్చినా, కొనాలనిపించినా మనసు గొంతు నొక్కేసి ఆ లింక్ తీసుకెళ్లి ఫ్రెండ్స్ కి ఇవ్వడం. ఇక వాళ్ల తిప్పలు వాళ్లు పడతారు. మనపనైపోతుంది. యాభై డ్రెస్సులున్నా మధ్యలో నీలి, ఆకుపచ్చ చీర కనపడగానే గబుక్కున లాగేసి బట్ట ఎలాగుందో చూసి బిల్లేయించడం. ఇప్పుడు ఏం పండగుంది, ఏ పబ్బముంది అని ఆలోచించే అవసరం లేదు. కొనేయాలంతే.. కాస్త ధర మనకు సరిపోతుందో లేదో చూసుకుంటే చాలు. మనమేమైనా బంగారాలడిగామా, ఆస్తులడిగామా, యాత్రా స్పెషల్స్ అడిగామా. ఒక్కటంటే ఒక్క చీరే కదా. ఈ మొగుళ్లు అర్ధం ఎప్పటికీ అర్ధం చేసుకోరూ...

చీరలు సినిమాల్లో , నిజజీవితంలోనే కాదు  సాహిత్యంలో కూడా విశేషంగా ప్రస్తావించారు. తెలుగు సినిమాల్లో చీరమీద చాలా పాటలే ఉన్నాయి. చీరల్లో రకరకాల చీరలు వున్నా, తెలుగువారికి మాత్రం  పట్టుచీరదే మొదటి స్థానం. పెళ్ళిళ్ళలో, వేడుకల్లో ఆడవాళ్ళు రంగు రంగుల పట్టుచీరల్లో కళకళలాడుతూ కలయ తిరుగుతుంటే ఎంత కన్నుల పండుగలా వుంటుంది. అందుకే సినీ కవులు అన్నారేమో “నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా, ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” అని.  

మరో కవి “వన్నె వన్నె చీరల్లోనా నీ ఒళ్ళే హరివిల్లు” అని.
“చుట్టూ చెంగావి చీర చుట్టాలే చిలకమ్మా
బొట్టూ కాటుక పెట్టి, నే కట్టే పాటని చుట్టి,
ఆశపడే కళ్ళల్లోనా ఊసులాడు వెన్నెల బొమ్మా“
ఎర్ర రంగు చీరలో సందెపొద్దులా , పచ్చరంగు చీరలో పంట చేను సిరిలా ఆ పడుచు కనిపించిందేమో! నేరేడు పళ్ళరంగులో జీరాడే కుచ్చిళ్ళుతో, వంగపండు రంగులో పొంగుతున్న సొగసులతో కవి హృదయాన్ని తాకి వుంటుంది ఆ పడతి. అందుకే ఆ పాట ఇప్పటికీ మనసును అనుభూతులతో నింపుతుంది.

ఎన్ని ట్రెండ్స్ మారినా, ఎన్ని డిజైన్స్ వచ్చినా ఆడవాళ్ళకి అన్ని చీరలూ నచ్చుతాయి తన భర్త తెచ్చిన చీర తప్ప. భర్త ఎన్ని చీరలు తెచ్చినా ” మన పక్కింటావిడ చీర చూసారూ–ఎంత బాగుందో” అంటూ పొరుగింటి పుల్లకూర వాసన చూపిస్తూ వుంటారు. అందుకే ఒక కవి తనే చీర నేయించాడంట.
సరికొత్త చీర ఊహించినాను,
సరదాల సరిగంచు నేయించినాను.,
మనసూ మమతా పడుగూ పేటా చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత, నా వన్నెల రాశికీ సిరిజోతా.. చీరగురించి ఇంతందంగా కూడా చెప్పవచ్చా.. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు సమయమే తెలీకుండా పోతుంది. ఇంకో విశేషం కూడా చెప్పనా. ఒక నేతన్న అగ్గిపెట్టెలో పట్టేంత పలుచని చీర నేసాడం. అదెలా కట్టుకుంటారబ్బా.. ఇంకో నేతన్న నేనేం తక్కువా అంటూ వరిగడ్డితో 30 నెలలు కష్టపడి చీర నేసాడంట. దాని ఖరీదు కనీసం రెండు లక్షలు ఉండొచ్చంట. మనకు కాదులేగాని వార్తలు చూసాం కదా చాలు. మర్చిపోయా ఇప్పుడు బెనారస్ పట్టు ఫాషన్ అయిందని  నా కూతురు కొత్త చీర కొంటా అంటే ముప్పైయైదు ఏళ్ల క్రింద నా పెళ్లప్పటి బెనారస్ చీర ఇచ్చా. అప్పుడు మూడువేలకే వచ్చింది ఇప్పుడది యాభై వేలకు తక్కువ ఉండదు. అనుకుంటాం. జస్ట్ చీరలే కదా అని కాని నిజంగా ఫోటోల్లాగానే ఒక్కో చీరకు ఒక్కో కథ లేదా సందర్భం ఉంటుంది. ఒక ఫ్రెండ్ ఇచ్చిందనో, మరదలు పెట్టిందనో, ఆడపడుచు కొనిచ్చిందనో, కూతురు ఇచ్చిందనో, అమ్మకు బావుంటుందని కొడుకు కొనిచ్చాడనో, మొదటి పెళ్లిరోజుకు భర్త కొనిచ్చాడనో, అలా ఎప్పటికీ దాచుకునే ఎవ్వరికీ ఇవ్వని చీరలు చాలా ఉంటాయి. వాటిల్లో అవి ఇచ్చిన వ్యక్తుల ప్రేమ, ఆప్యాయతలు, అభిమానం కనిపిస్తాయి. కాదంటారా.

ఇప్పుడే దర్జీ పది చీరలు పాల్స్ , పీకో, బ్లౌజ్ కుట్టినవి ఇచ్చెళ్లాడు. చెక్ చేసుకుని డబ్బులివ్వాలి. మళ్లీ వాళ్లు వీళ్లు పెట్టినవి నాలుగు కొత్త చీరలు వచ్చాయి. దేవుడా... వద్దనలేని బలహీనత. ప్చ్. నేను బాగుపడను. అప్పటికి మావారిని ఎన్నోసార్లు అడుగుతుంటాను. నేను కొనకుండానే ఇన్ని చీరలు వచ్చి పడుతున్నాయి. ఎందుకలా? ఏం చేయను అని.. సాలెపురుగు మీద పడితే కొత్త బట్టలు వస్తాయి. నీ మంచం  పక్కన టేబుల్ శుభ్రంగా పెట్టుకోవు. రాత్రిపూట అక్కడ సాలెపురుగులు ఉండి నీ మీద పాకుతున్నట్టున్నాయి. ఇంకో అల్మారా తెచ్చుకో అన్నారు. నేను , నా చీరలు మరీ లోకువైపోయాము కదా.. ఏంటో??

అన్నట్టు మీకు తెలుసా! మార్కెట్లో కొత్తగా  పొర్ట్రెయిట్ చీరలని వచ్చాయంట. కప్పులమీద మనకు కావలసిన బొమ్మలు ప్రింట్ వేసి ఇస్తారు కదా అలాగే మనకు కావలసినవారి లేదా మన బొమ్మనే కొంగుమీద , లేదా బార్డర్ మీద నేయించుకోవచ్చంట. మనకు కావలసిన రంగు, బార్డర్, డిజైన్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటే రెండు లేదా మూడు నెలల్లో చీర రెడీ చేసి ఇస్తారంట. భలే ఉంది కదా. దాని ఖరీదు కూడా భలేనే. ముప్పై వేలనుండి లక్ష వరకు అంట.. పూర్తిగా పర్సనలైస్డ్ అన్నమాట. ఉన్నవాళ్లకైతే తమవారికి బహుమతిగా ఇచ్చుకోవచ్చు. మనకు కుదరదులే. ఎవరైనా కట్టుకుంటే చూసి తుత్తిపడదాం.

*****

cheera 2.PNG
bottom of page