top of page
hasya.JPG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

'అలనాటి' మధురాలు

సేకరణ: వంగూరి చిట్టెన్ రాజు |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com 

సందేశం

రచయిత: టి. జానకిరామన్

అనువాదం: ఏండీ సుందరేశన్  

టి. జానకీరామన్ గారు రచించిన తమిళ మూలకథ కి సుందరేశన్ గారు చేసిన ఈ తెలుగు అనువాదం - మన అలనాటి మధురాలకై ప్రత్యేకం.

“ఇదేం గొడవరా?”

పిళ్ళై ముఖం జుగుప్స, కోపంతో, చిరచిరలాడింది. “ఆపు!” అని చెయ్యెత్తి అరిచారు.

నాదస్వర వాద్యం ఆగింది.

 

“ఇదేం రోతరా పొద్దున్నే? ఇవన్నీ రాత్రిపూట వాయించడం నీకు అలవాటైపోయింది, సరేలే అని ఊరుకున్నాను. ఇప్పుడు తెల్లవారుజామునే మొదలుబెట్టావా, ఏం ఎందుకు? ఉదయం మలయమారుతం, బిలహరి రాగాలు పాడి ఆకాశమంతా పువ్వులు కుంభవృష్టిగా కురవడానికి బదులు ఎందుకీ శోకం? నీకేం మతిపోయిందా?”

పిల్లవాడు నాదస్వరాన్ని చేతితో తడుముతూ ఏమీ అనక ఉరుకున్నాడు.

“ఇందుకేనా నీకు నేను ఈ విద్య నేర్పాను? దానికి బదులు ఆ చెరువుగట్టున ఒక కసాయి దుకాణం పెట్టుకొని బ్రతికితే చాలదా!  ఎందుకీ నాదస్వరం? హూం, మాటాడవేం?”

“ఇవాళ సాయంకాలం కచేరీ అని అన్నారుగా, అందుకే సాధన చేస్తున్నాను,” అని పిల్లవాడు నెమ్మదిగా జవాబు చెప్పాడు.

“సాధన! హూం,” అని పిళ్ళై ఎత్తిపొడిచారు. దానితోబాటు, ఆ పట్టరాని కోపంలో  వాడికి చెంపలు బాగా వాయించాలని అతనికి తోచింది. కాని మరుక్షణం ఒక అనుమానం కూడా కలిగింది: ‘వీడికేం మతి పోయిందా?’ అని.

“ఇవాళ కచేరీలో వాయించేది ఎవరో నీకు తెలుసా?”

“ . . . . . . .”

“ఎవరో తెలుసా?”

“ . . . . . . .”

 

“నోరు తెరిచి మాటాడవేం?”

“మీరే.”

“నేనేకదా? . . . మరి, నిన్ను నా పక్కనే కూర్చోబెట్టుకొని ఈ డబ్బా సంగీతం, సినిమా పాటలు, వాయించాలని అంటున్నావా?”

“నాన్నగారూ, కచేరీ వినడానికి వచ్చేది తెల్ల దొరలుకదా?”

“అవును, అందుకని?”

“వాళ్ళకేది బోధపడుతుందో అదే వాయించితే మంచిది కదా?”

“నువ్వేమంటున్నావ్? . . . నేను వాయించేది వాళ్ళకి అర్ధం కాదు, నా గౌరవం కాపాడడానికి నువ్వేమో ఇలా ఏవో రెండు వాయిస్తే మన ఊరుకి వచ్చినందుకు నష్టం లేదని వాళ్ళు సంతోషపడాలి, అవునా? అదేనా నీవనేది?”

తంగవేలు మరేం అనక ఊరుకున్నాడు. నాన్నగారు తన్ను ఎత్తిపొడిచి మాటాడుతున్నారని తెలిసినా నిజం తన వైపే ఉందన్న నమ్మకంతో, త్యాగిలాగ మౌనం వహించాడు.

“అసలు వకీలు అయ్యరు నాకు ఏం చెప్పారో తెలుసా? వాళ్ళకి మన శాస్త్రీయ సంగీతమే కావాలట. మన వాయింపు వాళ్ళకి నచ్చుతుందో లేదో మనకెలాగ తెలుసు? నచ్చదని నువ్వు అప్పుడే నిశ్చయించావన్నమాట! మన సంగీతం అర్ధం చేసుకోవాలని వాళ్ళు రావటంలేదు. అది ఎలావుందని తెలుసుకోడానికి వస్తున్నారు. అసలు ముందు మన వాయింపు వింటేనేకదా వాళ్ళకి ఏదైనా బోధపడుతుంది? నీకేమో గోలగా ఏదో వాయించి ‘ఇదే మా సంగీతం!’ అని చెప్పి నా పరువూ ప్రతిష్టా కాపాడాలని చాలా ఆత్రుతగావుంది! అవునా? అబ్బా,  ఎంత పట్టుదల, ఎంత మొండితనం!”

పిల్లవాడు నవ్వేసాడు. పిళ్ళైకీ నవ్వు వచ్చేసింది.

“నవ్వు, బాగా నవ్వు, ఛీ ఛీ . . . వెళ్ళి నాదస్వరాన్ని శుభ్రం చేసిపెట్టు!”

పిల్లవాడు వాయిద్యాన్ని ఒరలో పెట్టి, గోడకి వ్రేలాడగట్టి వెళ్ళాడు. పిళ్ళై పక్కనేవున్న బల్లమీద కూర్చొని, పెట్టెనుంచి పోకచెక్కలు బయటకి తీసి తోలువొలవడం మొదలుబెట్టారు.

మామూలుగా అన్ని వాయిద్యాలు వేలాడుతున్న జాగా అది. పిల్లవాడు ఇప్పుడు వాయించిన వాయిద్యాన్ని పిళ్ళై తండ్రి ఒకప్పుడు వాయించి అమృతధారగా కురిపించిన గానంతో శ్రోతలని ఉల్లాసపరిచారు. తిరుచ్చేరై కోవిలలో హుసేని రాగంలో అతని గానం ఇప్పుడు పిళ్ళైకి గుర్తుకి వచ్చింది. వెంటనే దేహమంతా పులకరించింది. ఆహా, ఏం మాధుర్యం, ఎంత తేజస్సు! ఎంత స్వానుభూతి! ఆ వాద్యంతోనే ఈ తంగవేలు కిల్లాడి అపస్వరాలు ఊది పారేస్తున్నాడు . . .  

ఒక సంవత్సరంగా అతనికి అదే బెంగ. పెళ్ళి సంబరాల్లో ఎనిమిది దిక్కులూ వినిపించే సినిమా పాటలన్నీ తంగవేలు నాదస్వరంలో సాధకం చేస్తూ వస్తున్నాడు. ముందునుంచే ప్రజలని రంజింపజేసే శక్తి పిళ్ళైకి లేదని ఈ సమాజం అతన్ని త్రోసిపుచ్చేసింది. దానిగురించి అతను బాధపడలేదు. అధీనంలోవున్న కోవెలనుంచి మాన్యం వచ్చినంతవరకూ తను సంగీతం మీద ఆధారపడి రోజులు గడపవచ్చు అనే ధైర్యమే కారణం. తిండికి ఎటువంటి ప్రశ్నా లేదు. ఆ తరువాత తనకి రెండు జతల పంచెలు, భార్యకి నాలుగు చీరలు, అబ్బాయికి నాలుగు పంచెలు - మనిషికి మరేం కావాలి? అతను తలెత్తి ఎలాగో ఇరవై ఐదు సంవత్సరాలు గడచిపోయాయి. ఇంతవరకూ అబ్బాయి గురించి అతనేం ఎక్కువగా పట్టించుకోలేదు.

ఈ తంగవేలుకు మంచి ప్రజ్ఞవుంది. కాని వాడికి బొత్తిగా సినిమా జ్ఞానం తప్ప సంగీత జ్ఞానంలో ఆసక్తి లేదని అతనికి బోధపడింది. అందుకే పిళ్ళై చురుకుగా వాడికి తనకి తెలిసినవన్నీ నేర్పాలని సిద్ధమయ్యారు. కాని ఆ వెధవ మనసులో ఈ సామాన్యులనీ, మూఢులనీ తృప్తి చెయ్యాలని ఎలా తోచిందో? అంటే సంగీతానికి వినాశ కాలం వచ్చేసిందా? అవును, దేవుడ్నే ధ్వంసం చెయ్యాలని కొందరు పూనుకున్నప్పుడు తన కీర్తీ, పేరూ ఎన్నిరోజులకి?  

‘అసలు మనం చేసే సేవకి ఏమైనా అర్ధముందా?’ అని అతనికి అనుమానం కలిగింది.

‘ప్రజలకి అర్ధంకాని సంగీతం, సంగీతమా? అర్ధంకాని కళ, కళ అవుతుందా?’

‘మన వాద్యం విని ఆనందించాలనే కదా నలుగురు మనల్ని పిలుస్తున్నారు? వాళ్ళని వదిలేసి మనం మనకిష్టమైనట్టు ఎక్కడో ఒక ఊహా ప్రపంచలో సంచారం చేస్తే అది న్యాయమేనా?’

చాలా సంవత్సరాలుగా అతనడుగుతున్న ప్రశ్న అది. ఒక సంవత్సరంగా, ప్రతీ రోజూ ఇదే ప్రశ్న అతన్ని ఆకట్టుకుంది.

ఒకసారి తంగవేలు మలయమారుతంలో సంచారం చేసి గభీమని ఒక జానపద గీతం వాయించాడు. ఎప్పుడు? తెల్లవారగట్ల . . . అబ్బా. ఎంత అపస్వరం! కోతికి చొక్కా, లోలకులు తొడిగించి ఆటలాడుతున్నట్టు ఒక దృశ్యం పిళ్ళై మనసులో కనిపించింది.

 ఉత్సాహంతో అతను గబగబమని ఒర విప్పి ఆ నాదస్వరంని తన పెదవులకి అదుముకున్నారు. కాని ఆ అపస్వరం అతనికి సాధ్యం కాలేదు. ఎటువంటి స్వరంలోనూ కలవకుండా అది అతన్ని తికమక పెట్టింది. ‘ఇదేం స్వరంరా!’ అనే నిరాశతో బాటు ‘ఛీ, ఛీ, స్వరం లేకుండా ఇదేం సంగీతం?” అని ఏవగింపుకూడా కలిగింది.

‘ఛీ!’ అని అన్నారేకాని, అదీ ఒక విద్య అనే భావనతో ఇంకొకసారి పిళ్ళై ఆ స్వర అన్వేషణకి పూనుకున్నారు. కాని ఏం లాభం? అతని మొండితనానికి అది వశంకాలేదు.

“అలాక్కాదు నాన్నగారూ, ఇలాగ . . . చూడండి,” అనే ధ్వని వినిపించింది.

తంగవేలు అతని పక్కనేవచ్చి నిలబడ్డాడు.

“ఏదీ, నువ్వు వాయించు చూద్దాం.”

పిల్లవాడు వాయించాడు.

“ఊరూ పేరూ తెలియని ఈ అపస్వరం నీకు బాగా వస్తుందే? నాకెందుకు చేతకాదు?”

అతను మళ్ళీ ప్రయత్నం చేసారు. లాభం లేదు.

కండువాని నడుములో చుట్టబెట్టుకొని అతను నేలమీద సాస్టాంగ నమస్కారం చేసి లేచారు.

“ఇది ఎవరికని తెలుసా? ఈ అపస్వరానికి! మరెప్పుడూ నేను దీని జోలికి వెళ్ళను!”

“ఇదేంటండీ?” అని - అతనికోసం కాఫీ తీసుకొనివచ్చిన భార్య - విస్తుపోయి అతన్ని అడిగింది.

“నమస్కారం.”

“ఎవరికి?”

“నువ్వు పదిమాసాలు మోసి కన్న సుపుత్రుడు వాయించే సంగీతానికి.”

“మరేం కాదమ్మా, ఇదొక సినిమా పాట!” అని తంగవేలు తల్లికి చెప్పాడు.

“ఏం, మీరు వాయించలేరా?”

“నూరు జన్మలు పాలాభిషేకం చేస్తే సాధ్యమౌతుందేమో?” అని అంటూ పిళ్ళై నవ్వారు.

ఆ రోజునుంచి తండ్రి, కొడుకు మౌనంగా ఒక ఒడంబడిక చేసుకున్నారు. పెళ్ళిసంబరాల్లో కార్యక్రమం చివర శ్రోతలు సినిమాపాటలు కోరి చీటీలు పంపితే అది నెరనేర్చడం తంగవేలు బాధ్యత. అప్పుడు పిళ్ళై ఏ వసారాలోనో నిద్రపోతారు.

ఇటీవల అతను రాత్రుల్లో కొత్త కొత్త కీర్తనలు సాధకం చెయ్యడం ఆరంభించారు. ఇవాళ ఉదయం గభీమని ఈ తంగవేలు వాయించిన పాట వినగానే అతను ఉలికిపడ్డారు.

అతని చూపు  మళ్ళీ ఆ వాద్యంమీద పడింది.

‘తెల్ల దొరలట! సంగీత బృందమట! అసలు కర్ణాటక సంగీతం వినాలని అభిలాషతో వస్తున్నారట!’

మొన్నటి ఉదయం, వకీలు మణి అయ్యరు చెప్పిన మాటలు పిళ్ళై గుర్తు చేసుకున్నారు.

“ఏ సంగీతం మనం విన్నతరువాత చాలాకాలం నిలకడగా మన గుండెని ఆక్రమించుకుంటుందో ఆదే కావాలని అంటున్నారు.”  

“ఎందుకీ గొడవ? ఇవాళా రేపూ - కరువేపాకు, పాలు, వెట్టివేరు - అన్నిటికీ ఇమిటేషన్ వచ్చేసాయి. అసలు సంగీతం, నకిలీ సంగీతం - ఇవన్నీ ఎవరికి కావాలి? ఇదేం పిచ్చి?”

“పిళ్ళైగారూ, ఈ ప్రపంచం ఇంకా అంత అధ్వాన్నంగా చెడిపోలేదు. మీకెందుకీ బాధ? నేను వాళ్ళకి మాట ఇచ్చాను. మీరు వాయించాలి. అదే నేనడుగుతున్నది. ఓ నాలుగు కీర్తనలు వాయించండి, చాలు. డోలుకాడా వద్దు. ఆత్మార్ధంగా మీకు ఏకాంతంగా ఎలా వాయించడం అలవాటో అలాగే చెయ్యండి, మరేం వొద్దు! మీ గానం వింటూంటే ఎవరూ మీ చొక్కాయి, వుడుపు లెక్క చెయ్యరు. కళ్ళు మూసుకొని రెండు కీర్తనలు వాయించండి.”

“భలే, మీరు చురుకుగా నాకన్నీ చెప్తున్నారు!” అని పిళ్ళై అతన్ని పొగడారు. ఒక క్షణం ఆగి  “ఐతే చొక్కాయి తప్పక కావాలా?” అని అడిగారు.

“అది మీ ఇష్టం. వచ్చే అతను నిరహంకారమైన మనిషి. నాకతనిలో బాగా కనిపించేవి నమ్రతా, వినయం - ఈ రెండే. మీరు చొక్కాయితో వస్తేనేం, లేకపోతే ఏం, ఎవరూ లెక్క చెయ్యరు!”

కచేరీ సాయంత్రం ఆరుగంటలకి. ఏం కీర్తనలు వాయించాలని పిళ్ళై ముందే  ఆలోచించి ఎంచుకున్నారు. తంగవేలు సాధకం అతని మనసుని కలగాపులగం చేసేసింది.

కటువైన ఆ ధారణ మింగేసి అతను మనశ్శాంతి కోరుతూ వేరే ఒక రాగం ఎంచుకొని, దాని సాహిత్యరూపాన్ని మనసులోనే వల్లించుకున్నారు. ఏం ఆశ్చర్యం! అది అతన్ని ఆనందభరితమైన చిత్తవృత్తిలో ముంచేసింది. గోడమీద వాలుకొని అతనలాగే నిద్రపోయారు.

** 

 

ఎద్దులబండి నుంచి దిగి పిళ్ళై వకీలు మణి అయ్యరు ఇంట్లోకి ప్రవేశించారు. తంగవేలు వాద్యపరికరాలు మోసుకొని అతని వెంట నడిచాడు.

ఒక పెద్ద హాలు. గుమ్మం దగ్గర పిళ్ళైని కలుసుకున్న వకీలు అతని చేయి పట్టుకొని, అక్కడవున్న బృందంలోని ఒక్కొక్కరిని, అతనికి పరిచయం చేసారు.

 

“ఇతనే ఫిలిప్ పోల్సకా, ఈ బృందానికి పెద్ద.”  

ఫిలిప్ పోల్సకా ఒక ఋషిలాగ కనిపించాడు. వయసు డెభ్బై వుండొచ్చు. బట్టతల కాకపోయినా జుత్తు బాగా నెరిసిపోయింది, గాలిలో చింపిరిగా కనిపించింది. సగటు ఎత్తు. చాలా పెద్ద కళ్ళు, కిందా మీదా ఆడకుండా అవి స్థిరంగా ఉన్నట్టు అనిపించింది. అసలు అవి దేన్నీ చూస్తున్నట్టు ఏ సూచనా లేదు. అతనేమైనా నిద్రపోతున్నాడో, లేక ఏదో ఆలోచనలో తేలుతున్నాడో అనే సంశయం పిళ్ళైకి కలిగింది. అతని చూపు పోల్సకామీద పడిన ఆ క్షణమే ఎవరో తన గుండెని ఆ దిశలో ఈడ్చి, అతనితో పెనవేసినట్టు ఒక భావన పిళ్ళైకి కలిగింది.

 

“మీరతన్ని నిరహంకారమైన మనిషని అన్నారు, జ్ఞాపకం ఉందా?” అని పిళ్ళై వకీలుని అడిగారు

“ఉంది.”

“బాగా చెప్పారు. అతని కళ్ళు చూసారా? ఎంత చోద్యంగా కనిపిస్తున్నాయి!”

“నేనూ అదే ఆలోచిస్తున్నాను. మీరన్నది అతనికి చెప్పనా?”

 

“వొద్దు! ఆ ముఖస్తుతి మనలోనే ఉండనీ. అతనడిగితే అతన్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పండి.”

పోల్సకాతోబాటు, అతని బృందంలోని ఇరవై, ఇరవై ఐదుమంది సహచరులకి వకీలు పిళ్ళైని పరిచయం చేసారు.

కచేరీ ప్రారంభమైంది. తంగవేలు వేదిక వెనుక కూర్చున్నాడు. పిళ్ళై నాట రాగంలో గంభీరంగా ఆలాపన ఆరంభించారు.

పోల్సకా ముఖంలో చిరునవ్వు కనిపించింది. కళ్ళు ఇంకా మూసుకునే వున్నాయి. అమృతధారగా కురుస్తున్న ఆ నాదప్రవాహంలో లీనమైనట్టు కనిపించింది అతని ధోరణి. ఆ గానం అతని ఆత్మని అతనికి ఇంతవరకూ తెలియని లోకాలూ, అనుభవాలు అలవరించుకోడానికి ప్రోత్సాహించుతున్నట్టు తోచింది. అలసిపోయి, నీళ్ళలో పడి మరణించిన మనిషిని వరద కొట్టుకొని పోతుంటే అతనేం చెయ్యగలడు?

హఠాత్తుగా నాదం ఆగింది. పోల్సకా కళ్ళు ఆ ధ్యానంలోనే ఇంకా నిమగ్నమై ఉన్నాయి. ఒక నిమిషం తరువాత అతను కళ్ళు తెరచి పిళ్ళైని చూసాడు.

 

హాలులో, టై, పంట్లాము తొడుక్కొని, కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న జనమంతా  పిళ్ళైని చూస్తున్నారు.

“అయ్యా, నేనిప్పుడు ఒక చిన్న పరీక్ష చెయ్యదలచుకున్నాను,” అని పిళ్ళై వకీలుకి చెప్పారు.

“ఏం పరీక్ష?”

“చూడండి.”

వకీలుకి పిళ్ళై మాటలు బోధపడలేదు. అతని మొహం చూసారు, కాని ఏదీ గ్రహించలేదు.

“దసరిమా . . . మా”   అని పిళ్ళై ఆరంభించారు.

అది సామా రాగమని వకీలుకి తెలిసింది. కనురెప్ప వాల్చకుండా అతను పిళ్ళైని చూసారు. మెల్లమెల్లగా రాగం వికసించింది. తోటలో, అర్ధరాత్రివేళ నిమ్మళంగా వర్ధిల్లే మల్లెపువ్వుల వాసన అతని గుండెని ఆకట్టుకుంది. ఆ వాసనకి తగినట్టుగా అతని తల కూడా ఇలా అలా ఆడడం ఆరంభించింది. రాగం ఎదుగుతూనేవుంది.

ఎవరో చప్పట్లు కొట్టారు. వకీలు తిరిగి చూసారు. పోల్సకావే! అతనే తన మెచ్చుకోలు తెలియజేసాడు. అంతేకాదు. ఆ రాగంతోబాటు అతని దేహం కూడా ఏకీభవించి ఆడుతోంది. రెండు చేతులూ చాచి అతనేదో ఆర్ధించుతున్నట్టు కనిపించాడు. మొహంలో చిరునవ్వు. భక్తి ఆవేశంలో, మతిపోయి, ఆకాశంలో ఎక్కడో, ఏదో చూస్తున్నట్టు ధోరణి.

గభీమని కూర్చున్నవాడు లేచి నిల్చున్నాడు. చేతులు చాచుకుంటూనే పోల్సకా, గాలిలో ఊగుతున్న సంపంగి పువ్వులాగ ఆడడం మొదలుబెట్టాడు. రాగం ఎదుగుతూనే,  ఇప్పుడు ఇంకా ఉచ్ఛ స్థాయిని చేరుకుంది.

నిలబడిన మనిషి ఇప్పుడు అడుగులు పెట్టాడు. మెల్లమెల్లగా నడుస్తూ, వేదికదగ్గర రాగానే, ఆగి, మోకరిల్లి కూర్చున్నాడు. చేయిని వేదిక మూల ఆనుకుంటూ తలని దానిపై అదుముకున్నాడు.

వకీలు, పోల్సకా బృందం అతన్ని చూస్తూనే ఉన్నారు. పోల్సకా ఏ ప్రపంచంలో తిరుగుతున్నాడో? ఏ ఆకాశంలో సంచారం చేస్తున్నాడో?

అతని తపసు భంగపరచకూడదనే భయం పిళ్ళైకి వచ్చిందా? రాగ ఆలాపన ముగించిన వెంటనే అతను కీర్తన మొదలుబెట్టారు.

“శాంతము లేక . .  .”

ఒక బిడ్డని ముద్దాడుతున్నట్టుంది ఆ కీర్తన అధమాంగం. సత్యాన్వేషణలో బ్రతిమాలుతున్నట్టనిపించింది.

పోల్సకా దేహం పులకరించింది. తన వీపు కంపించడం అతను గ్రహించాడు.

కీర్తన సమాప్తి అవగానే వాద్యసంగీతమూ ఆగింది.

గభీమని లేచి పోల్సకా పిళ్ళై వైపు దూకి, అతని చేయి పట్టుకున్నాడు. అతని కళ్ళలో బతిమాలే చూపు చోటుచేసుకుంది.

పిళ్ళై ఏమీ బోధపడక నిర్ఘాంతపోయారు. కొంచెం ధైర్యం తెచ్చుకొని బిడ్డలాగ ఒక నవ్వు నవ్వారు.

“మిస్టర్ పిళ్ళై,” “మిస్టర్ పిళ్ళై,” అని అతని చేయి పట్టుకొని పోల్సకా వేడుకున్నాడు. అతని కంఠధ్వని వణుకుతోంది.

“మిస్టర్ పిళ్ళై, మరేం వాయించకండి! నాకు ప్రాణం పోతున్నట్టుంది. మరేం వద్దు!”

అతని భాష పిళ్ళైకి అర్ధం కాలేదు. తలాతోకా తెలియక అతను వకీలుని చూసారు.

“మిస్టర్ పిళ్ళై, మళ్ళీ అదే వాయించండి, లేకపోతే నా . . . నా ప్రాణం పోతుంది.”

“అతను ‘శాంతములేక . .  .’ కీర్తన మళ్ళీ వాయించమని అడుగుతున్నారు,” అని వకీలు పిళ్ళై చెవిలో మెల్లగా చెప్పారు.

“మళ్ళీ ‘శాంతములేక . . . ’?”

“ఎస్,” “ఎస్,” అన్నాడు పోల్సకా.

అతను కీర్తన వింటూ తలూపుతూనే ఉన్నాడు. కీర్తన ముగిసింది.

“ఆపకండి, ప్లీజ్ . . .  ” అని పోల్సకా బతిమాలాడు.

“మీరు ఆపవద్దు. అతనికేదో ఆవేశం వచ్చినట్టుంది. మీ వాయింపు సాగనీ . . . ”

మళ్ళీ అదే గాన ప్రవాహం . . .

ఐదారుసార్లు పిళ్ళై అదే కీర్తన మరల మరల వాయించారు. ఆఖరికి నాదం మౌనంతో లయమౌతున్నట్టు కచేరీ ముగిసింది.

పోల్సకా ఇంకా తలూపుతూనేవున్నాడు. ఎటువంటి అనుభవం! ఘంటారవం విని ఆ నిశ్శబ్దంలో మనసూ, ఆత్మా, ఆలపించిన అనుభూతి!

మూడు నిమిషాలు గడిచాయి.

వకీలు ఒక నిట్టూర్పు వదిలారు. పోల్సకా పిళ్ళైని తిరిగిచూసాడు.

“మిస్టర్ అయ్యర్, మిస్టర్ పిళ్ళై, ఇందులో ఏదో రహస్యముంది. నాకెవరో ఒక సందేశం పంపిస్తున్నారు. అది ఎక్కడినించో వచ్చి నన్ను తాకుతోంది. ఆ అనుభవంలో నేను ఇంకా మునిగి తేలుతున్నాను. ఆ ఆవేశం ఇంకా తగ్గలేదనిపిస్తోంది. అవును, అది  ఒక సందేశం. నాకోసం ప్రత్యేకంగా పంపిన సందేశం. మీ గానం నాకు తెలియజేసిన సందేశం!”

చంటిపాపలా నవ్వుతూ, మనస్సులో ఉన్నదేమో వివరించలేక పోల్సకా తడబడుతూ మాటాడాడు.

“నేను చెప్పేది మీకు బోధపడిందా?” అని వకీలుని అడిగాడు.

“బోధపడిందనుకుంటాను.” అన్నారు వకీలు.

“నాకది బాగా బోధపడింది. ఈ ప్రపంచంలో మరెవరూ నాకా ఆజ్ఞ ఇవ్వలేదు. నేనది రెండు చేతులూ చాచి పుచ్చుకున్నాను. ఎవరూ, ఏ కళా, ఏ సంగీతమూ ఇవ్వని సందేశం నాకిప్పుడు దొరికింది. ఎంత భాగ్యం! మీరిప్పుడు నన్ను ప్రాణం వదలమంటే నేను సరే అంటాను.”

“ఏమంటున్నారతను?” అని పిళ్ళై వకీలుని అడిగారు.

వకీలు ఆ ప్రశ్నని తర్జుమాచేసి పోల్సకాని అడిగారు.

“ఏమని తోచిందని అడుగుతున్నారా? మిస్టర్ అయ్యర్, మిస్టర్ పిళ్ళై, వినండి. నాకీ లోకమంతా శ్మశానంలా కనిపిస్తోంది. ఎక్కడచూసినా సందడి, గోల, పోట్లాట! గాలివాన చెట్లని వేళ్ళతో పెళ్ళగించి ధ్వంసం చేస్తోంది. అలలు మీదమీదకి ఎదిగి గుడిసెలని పూర్తిగా ముంచేస్తున్నాయి. దారిలోనున్న చెట్లన్నీ మెరపుతీగల వేడికి కాలిపోయాయి. కట్టడాలు కూలిపోయాయి. ఈ పోరాటంలో, ఈ కోలాహలంలో నేను కోరేది శాంతి . . . ఇప్పుడు ఈ కోలాహలంలో నేను మాత్రం శాంతి అనుభవిస్తున్నాను. క్రమక్రమంగా ఈ సందడి, గోల, తరుగుతున్నాయి. నా మనస్సు శాంతంగా, నిశ్చలంగా ఉంది. ఇక ఏ సందడి, ఘోష, నా వెంట రానేరావు. ఇది నాకొక ఉద్భవం. ఏ ధ్వని చొరరాని శిఖరం నేనిప్పుడు అందుకున్నాను. నాకు శాశ్వతమైన శాంతి దొరికింది. అది నాకు చాలు. ఇక చావంటే నాకు భయం లేదు.”

పోల్సకా నిదానంగానే మాటాడాడు. వకీలు అతని మాటలు తర్జుమా చేసి పిళ్ళైకి చెప్పారు.

అతను విస్తుపోయారు.

“శాంతం? అదేనా అతనంటున్నారు?”

“అవును.”

“నిజంగానా? అంటే మన త్యాగరాజస్వామికూడా శాంతం కావాలనేకదా ఈ కీర్తనలో కోరారు? ఎంత కాంక్షతో అతను పాడారు! ఇతనికీ అలాగే అనిపించిందన్నమాట!”

“అవును. పోల్సకా అదే చెప్తున్నారు.”

“మిస్టర్ పోల్సకా, ఈ కీర్తనకూడా శాంతి కావాలనే అడుగుతోంది. మీరన్న గాలివాన, మెరపుతీగలు ఇందులో లేక పోయినా వరుస వరుసకీ శాంతి తన లక్ష్యం అని అంటోంది.”

“ఓ, అలాగా?” అని పోల్సకా కూడా అదిరిపడి మరేం అనలేక స్తంభించిపోయాడు.

“అవును. అదే మనం వింటున్న సందేశం. అసలు సంగీతానికి పరిమితి ఏదైనా వుందా? లేదు. ఎక్కడైనా, ఎలాగైనా అది తన సందేశం అందజేస్తుంది,” అని అతను అన్నాడు.

“మీ చేయి నాకివ్వండి. వాయించిన మీ చేయి ఇలా ఇవ్వండి. దేవుడు నృత్యం చేస్తున్న ఈ వేలిని ఇవ్వండి. నేను దేవుడ్ని అనుభవించాలి, ముద్దుపెట్టుకోవాలి!” అని అంటూ పోల్సకా పిళ్ళై వేలిని తన పెదవిపై అదుముకున్నాడు.

ఇప్పుడు పిళ్ళైకి కూడా  ఒక సందేశం దొరికింది!

 

*****

bottom of page