top of page
hasya.JPG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

“దీప్తి” ముచ్చట్లు

కొంచెం ధ్యానం…

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

క్రిస్మస్ శెలవుల సమయం. 

 

సుప్రభాతవేళ... సుమధురంగా ఎస్పీబాలు గారి గాత్రమాధుర్యంలో ఒదిగిన బిల్వాష్టకామృతం చెవుల్లోకి జాలువారుతున్న వేళ... 

 

ఎదురుగా "ఆపిల్ సినమిన్ సెంటెడ్ క్యాండిల్" ని ఉంచి ఆ జ్యోతిని చూస్తూ ధ్యానాన్ని ప్రయత్నిస్తున్నాను. 

 

ఈ లోపల లేస్తూనే, అలెక్సాకి పాటలు మార్చమని ఆర్డరేసి, మా చిన్నాడు బాత్రూంలోకి దూరాడు. అప్పటివరకూ ప్రశాంతమైన వాతావరణాన్ని భగ్నం చేస్తూ బీ.టీ.ఎస్ మ్యూజిక్ ఆల్బం. పోనీ ఇంగ్లీషు పాటలయినా, తెలుగు వారికి- తెలుగు కంటే ప్రియమయిపోయిన 'గాడ్ మదర్ టంగ్' -  దైవభాష కనుక, ఇష్టంగానే వినొచ్చు. ఆ రొద భరించవచ్చు.  బీ.టీ.ఎస్ మ్యూజిక్ ఆల్బం  మ్యూజిక్ బావున్నప్పటికీ, కొరియన్ పాటలవటంతో అంత పొద్దునే వినే ఓపిక లేక, మళ్ళీ నా పాటలకే మార్చేసాను.

 

"మమ్మీ, ఎప్పుడూ అవే పాటలెందుకు వింటావు? హాలిడేస్ లోనైనా నాకిష్టమైనవి విననీయొచ్చు కదా?" నా దగ్గరికొస్తూ అడిగాడు.

నిండా పదేళ్ళు లేవు. వీడపుడే నా ఇష్టాలని ప్రశ్నిస్తున్నాడు. అదే నా కూతురైతే ఒక్కరోజయినా ఇలా అడిగిందా? అది బంగారం. వెంటనే, ఫస్ట్ బోర్న్ వర్సస్ సెకండ్ బోర్న్ కంపేరిజన్ మొదలయిపోయింది నా మెదడులో. అప్రయత్నంగానే. 

 

 నా మెదడులో ఝూంకారం చేస్తున్న ఆలోచనలతో సహా అన్ని సంగీతాలూ ఆపేసి, వాణ్ణి దగ్గరికి రమ్మని పిలిచాను. వాడికి ప్రశాంతమైన సంగీతంలో,అసలు ప్రశాంతతలో ఉండే ఆనందాన్ని పరిచయం చేసి తీరాల్సిందే అని ఘాట్టిగా నిశ్చయించుకున్నాను. 

 

మా వాడికి నాతో గడిపే సమయమేదయినా ఇష్టమే. ముచ్చట్లంటే చాలు, చక్కగా కూర్చుంటాడు. కాసేపు అదీ ఇదీ మెల్లిగా మాట్లాడి, ఎట్టకేలకి కాసేఫు కలిసి కూర్చుని ధ్యానం చేసేలా ఒప్పించాను. 

ముందుగా ఫోన్లో ఓంకారం పెట్టి, పద్మాసనం వేయించాను. క్రిస్ క్రాస్ ఆపిల్ సాస్! ఓ క్షణంలో పద్మాసనం లో వాడు. 

నడుము నిటారుగా ఉంచమని చెప్పి, క్యాండిల్ ని చూస్తూ కళ్ళు మూసుకొమ్మన్నాను. మెల్లిగా శ్వాస తీసుకుంటూ వదలమన్నాను. కళ్ళు మూసుకునే, భృకుటి మధ్యలో జ్యోతిని గమనించమన్నాను. 

వాడికీ ఆ ప్రశాంతమైన వాతావరణంలో మృదువుగా నేనిస్తున్న సూచనల మేరకు ధ్యానం చేయటం బావుందేమో, బుద్ధిగా కూర్చున్నాడు. 

కళ్ళు మూసుకున్నప్పటికీ దీపం కనబడుతుంది అని సంబరపడ్డాడు. వాడిని మరింత ప్రోత్సహిస్తూ, ఈసారి, ప్రశాంతమైన ప్రకృతిలో కూర్చున్నట్టు, వెనకాల వాటర్ ఫాల్స్ ని ఊహించుకొమ్మన్నాను. 

భృకుటి ముడిచాడు. "ఇట్స్ టూ క్రౌడీ" అన్నాడు. నయాగరా ఫాల్స్ కాకుండా, ఓ స్టేట్ పార్క్ లోని చిన్న జలపాతాన్ని ఊహించుకొమ్మన్నాను. 

భృకుటి విడివడింది. మళ్ళీ మొహం లో ప్రశాంతత వచ్చి చేరింది. 

 

ఆ పై, "ఓం" అని ధ్యానం చేయమన్నాను. పెదాలయితే కదుల్తున్నాయి. లోలోపలే ఉప్పొంగిపోయాను. బాగా పనిచేసింది. వీడట్టే దారిలో పడ్డాడని. అంతటితో ఆగక, మెల్లిగా వాణ్ణట్టే డిస్టర్బ్ చేయకుండా... మెల్లని స్వరంతో అడిగాను.  

 వాటర్ ఫాల్స్ ని  , ప్రశాంతతని ని అనుభూతిస్తున్నావా? అని. 

"యా! ఐ సీ వాటర్ ఫాల్స్, ఇప్పుడే ఓ డ్రాగన్ వచ్చింది. లేజర్ గన్ తో షూట్ చేసాను మరో డ్రాగన్ పెద్ద రెక్కలతో వస్తుంది. దగ్గరికి రాగానే షూట్ చెస్తాను. నా వర్చ్యూల్ రియాల్టీ లాగే ఇదీ బావుంది" అన్నాడు. నిట్టూర్చాను. ఇలా కాదంటూ, మళ్ళీ కాసేపు వాడిని, ఆలోచనలన్నీ నియంత్రించేలా ట్యూన్ చేసి, ఇలా భీకర యుద్ధాలు, అవీ కాకుండా కాస్త ప్రశాంతమైన వాతావరణాన్ని ఊహించుకొమ్మన్నాను.

 

కాసేపాగి, ఉత్సుకగా అడిగాను. "ఏమి చూస్తున్నావని?"

 

వాడు చెప్పాడు." నేనిప్పుడు ఈ స్పేస్ లో లేను. ఔటర్ స్పేస్ లో హ్యాపీ గా ఉన్నాను".

అవునవుననుకున్నాను.మొహం చూస్తూంటే తెలీట్లేదూ? ఆ ప్రసన్నత, ఆ వెలుగూ... ఈ సంతోషం కదూ ధ్యానం వల్ల సాధించవచ్చు?

కాకపోతే, వాడు ఇంగ్లీషు పదాలు తెలుగులో మాట్లాడుతున్నాడో, లేక, తెలుగుని ఇంగ్లీషులా మాట్లాడుతున్నాడా అనేది నాకెప్పుడూ సందేహమే.  

 

వాడి మాటలు కొనసాగించాడు." ఈ ఔటర్ స్పేస్ చాలా బావుంది. అన్ని ప్లానెట్స్ గ్రావిటీ కోల్పోయాయి, ఏలియెన్స్[గ్రహాంతరవాసులు] బూం అంటూ దూసుకువస్తున్నారు. అదిగో, ఇపుడు భూమి నుంచి వస్తున్న మనుషులందరూ ఏలియన్స్ లా తేలుతున్నారు, వావ్. ప్లానెట్స్ అన్నీ ఒకదానికొకటి ఢీకొడుతున్నాయి. ఇప్పుడు యూనివర్స్ ని రెస్క్యూ చేయాలి నేను."  వాడి మొహం వెలిగిపోతుంది.

కంగారు పడ్డాను నేను. ప్రసన్నంగా ధ్యానం చేయమంటే, వీడు గ్రహాల గతులన్నిటినీ అస్తవ్యస్తం చేస్తున్నాడని గొణుక్కుంటూ, వాడినర్జెంటుగా కళ్ళు తెరవమన్నాను. 

వాడు మొరాయించాడు. మెడిటేషన్ బావుంది అని. అది మెడిటేషన్ కాదురా. అలాంటి వయొలెంట్ ఆలోచనలేవీ రాకూడదు. అని చెప్పా. 

"ఓహ్, అలాగయితే డల్ గా ఉంటుంది, ఈ ఇమాజినేషన్, ఆలోచనలు మేక్స్ మి హ్యాపీ!" అని కళ్ళు తెరవటానికి ఇష్టపడలేదు.

నవ్వొచ్చింది. 

వాడి వర్షన్ ధ్యానాన్ని, ఆనందాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటంలో నాకు ధ్యానం కుదరలేదు. వాడే కాసేపటికి గ్రహాలన్నిటినీ మళ్ళీ సవ్యగతుల్లో ఉంచేసి, విశ్వాన్ని మామూలు స్థితిలోకి తెచ్చి కళ్ళు తెరిచాడు.

 

"బావుంది మమ్మీ, నేను రోజూ మెడిటేషన్ చేస్తాను."

"ఇది కాదు నాన్నా, దీన్ని మెడిటేషన్ అనరు. ధ్యానమంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం."

"యా. మెడిటేషన్ తో నాకు క్లారిటీ వచ్చింది మమ్మీ, నేను స్పేస్ థీం తో మంచి గేమ్స్ డిజైన్ చేస్తాను. మంచి గేమర్ అవుతాను. నో మోర్ పిజా మ్యాన్." 

"మరి, నిన్న రాత్రి టూల్ బాక్స్ ఏదో కొనుక్కున్నావుగా? ఫిక్సర్ ఏదో అవుతానని"- అనుమానంగా అడిగాను.

 

అవునెలాగా? అని నిమిషమాలోచించి, "గేమర్ ప్రైం జాబ్. పార్ట్ టైం జాబ్ లో ఫిక్సర్ ని అవుతాను. ఐ విల్ ఫిక్స్ థింగ్స్" అంటూ... రిమోట్ ని తీసుకుని దాన్ని టూల్ బాక్స్ లోనించి తీసిన ఓ సుత్తి తో కొట్టటం మొదలుపెట్టాడు. 

"బావున్న రిమోట్ ని నువ్వు ఫిక్స్ చేయటమేంటిరా? ఆ సుత్తి వదిలేయ్." అన్నాను. 

 

"బానే ఉన్న వాడి ఆలోచనలని నువ్వు ఫిక్స్ చేయాలనుకోవటంలా?" పాతసినిమాల్లోలా అద్దం నించి వినవచ్చిన అంతరంగం డైలాగులు కావివి. మెట్ల మీదినుంచి, వస్తున్న నా అర్ధభాగమడిగాడు. 

"లాభం లేదు. వీడికంటే ముందు నిన్ను 'ఫిక్స్' చేయాలి" నవ్వుతూ జవాబిచ్చి పనుల్లో పడ్డాను.

అన్నానే కానీ, ఈయన ధ్యానాన్ని ఫిక్స్ చేయాల్సింది ఏమీ లేదు. ఈయనది మరో రకం ధ్యానం. నాకే అభ్యంతరాలు లేని ధ్యానం. ఇలా తీరుబడిగా ఉన్న రోజుల్లో ఓ పది నిమిషాలపాటైనా యప్ టీవీలో, ఈటీవీ "అన్నదాత" కార్యక్రమం పెట్టుకుని చూడటమే ఈయన ధ్యానం. రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు ఈ ధ్యానాన్ని అవలంబిస్తే నోస్టాల్జియా అనుకోవచ్చు. ఇళ్ళు కట్టుకునేప్పుడు, ఓ మూణ్ణాలుగొందల గజాలు ఇంటి వెనకాల వదిలేసి,  తోటపనిపై ఆసక్తితో ఇంటికి కావాల్సిన కూరగాయలూ, పళ్ళూ, పూలమొక్కలు ఇష్టంగా పెంచుకోవటమే తప్ప, ఎకరాల్లో కష్టించి  పంటలు పండించిన రైతు కుటుంబమూ కాదు. మరెందుకిలా అని మొదట్లో ఒకటీ రెండు సార్లు అడిగితే వచ్చిన సమాధానమిదీ. 

 

 "రోజు ప్రారంభించేముందు,  ఆరోజు చక్కగా గడవటానికి దేవుడికి దండం పెడతామా? మరి, ఆ రోజు సరిగా గడవటానికి తగిన శక్తినిచ్చేది ఆహారమేగా. కష్టాలకోర్చి ఆ ధాన్యం పండించిన వారి మొహం చూడటం కూడా పూజతో సమానమే అందుకే 'అన్నదాత 'చూస్తాను. అని". నిజమే కదా. ధ్యానం అంటే ధీయానం! మనో ప్రజ్ఞను దైవ ప్రజ్ఞవైపు నడిపించేదని అర్థం.  కనుక , ఈయన ధ్యాన ప్రక్రియ తో నాకే ఇబ్బందీ లేదు. ఎటొచ్చీ, పందుల పెంపకం, రొయ్యల పెంపకం కూడా అంతే శ్రద్ధతో చూస్తున్నపుడు మాత్రం ధ్యాన భంగం కలిగిస్తాను. మా ఇంటి మటుకూ, అవి తినటం ఇంకా మొదలవలేదు మరి. 

 

ఈ రోజూ అలాగే పట్టుపురుగుల పెంపకమేదో చూస్తుంటే, మా పుస్తకాల పురుగు తన ధ్యానాన్ని డిస్టర్బ్ చేయొద్దంటూ, ఓ చిన్నపాటి హెచ్చరిక చేసెళ్ళింది. దానితో ఇల్లు నిజమైన ధ్యానం -నిశ్శబ్ధ మోడ్ లోకి వెళ్ళిపోయింది. మరే. మా అమ్మాయి ధ్యానం అన్నిటికన్నా సర్వోత్కృష్టమైనదని ఇంట్లో అందరికీ నమ్మకం. కనుక, సాధారణంగా అస్సలు ఆ ధ్యానానికి కాస్తయినా ఆటంకం కలిగించము. అసలు, మేమేమిటి? ఏ దేశమేగినా,  ప్రతీ ఇండియన్... ముఖ్యంగా తెలుగు కుటుంబాల్లో, ఈ ధ్యానాన్ని సర్వోత్తమమైన ధ్యానంగా పరిగణిస్తారు. ధ్యాన ఫలానికై ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఫలం ఏమాత్రం తేడా వచ్చినా, ఇంటిల్లిపాదీ విషాదం లో మునిగిపోతారు. చివరాఖరికి ఆ ధ్యాన లక్ష్యం ఇంజనీరో, డాక్టరో అవటమే. ఆ రెండు తప్ప మరో ప్రొఫెషనే లేనట్టు. ఇంతకీ, ఈ ధ్యానం "జీ.పీ.ఏ." కోసం.- నిర్విరామ చదువు మాత్రమే సరిపోదు ఈ ధ్యానానికి. హైస్కూలు రావటం ఆలస్యం, అప్పటి వరకూ ఆడుతూ, పాడుతూ మా వాడిలా సరదాగా అపుడపుడూ వయొలెంటు ధ్యానాలు చేసిన పిల్లలల్లా.... గ్రేడులు, జీ.పీ.యేలు అంటూ ఒకే ధ్యానానికి పరిమితమవుతారు. రకరకాల ఆటలూ, ఆక్టివిటీ/అకడెమిక్ క్లబ్బులూ ఎన్నిటిలో ఎంత సాధించినా వాళ్ళకి కావాల్సిన కాలేజీల్లో సీటుకి ఏ మాత్రం సరిపోతుందా అని లెక్కగట్టుకోవటమే. రోజుకి 24 గంటలు సరిపోనట్టుగా నిరంతర ధ్యానం చేసినప్పటికీ, గ్రేడ్ యావరేజ్ ఏ మాత్రం తగ్గుతుందని అనుమానమొచ్చినా సరే, ధ్యాన సమయం మరింత పెరుగుతుంది. 

 మొదట్లో… అంటే  ఈ హైస్కూల్ పిల్లల ధ్యాన శక్తి తెలీని రోజుల్లో, ఓ రోజిలాగే మా అమ్మాయి ఇన్ స్టాగ్రాం లో మరో తెలిసిన టీన్ అమ్మాయి ఇన్ స్టాగ్రాం  పోస్టు చూసి కంగారు పడ్డాను. దాని సారాంశం ఇదీ- "ఐ వాన్నా కిల్ మైసెల్ఫ్, నాకు వందకి వందే వచ్చాయి. వచ్చే వారం టెస్టులో 98 వస్తే, యావరేజ్ 99 అవుతుంది. ఇపుడెలా?". అది చదవగానే -"99 మాత్రం తక్కువా? ఆ మాటకొస్తే 90 గొప్ప కదూ..." అంటూ అల్లల్లాడిపోయిన మనసు కాస్తా పోస్టులో మొదటి లైన్ గుర్తొచ్చి అలర్టయింది. టీన్ పిల్లల్లో పెరుగుతున్న మానసిక వత్తిడి, డిప్రెషన్, దాన్ని సరైన సమయంలో గమనించకపోతే వచ్చే అనర్థాలు- ఇలాంటివన్నీ గింగిరాలు కొడుతూ మెదళ్ళో తిరిగి, ఇంకాస్త అలర్టయి, వాళ్ళమ్మకి ఫోన్ చేయబోయాను. అక్కడ రింగవుతుంటే- ఇక్కడ మా అమ్మాయి చెవినేసాను. అది ఠక్కున వచ్చి ఫోన్ పెట్టేసి -" మమ్మీ. ఇంకెపుడూ అలా చేయకు" అంది. అర్థమవలా. చిన్నపిల్ల కదాని, చదివుండదని, నా మెదడులో తిరుగుతున్న ఆర్టికల్స్ అన్నీ అప్పచెప్పాను. తేలిగ్గా నవ్వేసి "మాకివన్నీ తెలుసు, ఆ అమ్మాయివన్నీ సరదా మాటలు. మాకు తేడా తెలిసిపోతుంది" అని. ఎందుకయినా మంచిది, వాళ్ళమ్మకి చెబితే చూస్తూంటుందేమో అన్నాను. "నో మమ్మీ, వాళ్ళమ్మ  కి చెబితే కాంప్లికేట్ అవటం తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు. అందరు పేరెంట్స్ అంత అర్థం చేసుకునే వారుండరు. వదిలేయ్. మాకు తెలుసు కదా"  ఇదీ సమాధానం. అన్నట్టుగానే, ఆ అమ్మాయి అర్ధగంటలో చక్కగా సర్దుకుని తిరిగి ధ్యాన నిమగ్నురాలయింది. వందకు 98 మాత్రమే వచ్చే ప్రమాదాన్ని ముందుగానే నివారించటానికి. 

 

నాకే మనసొప్పక, వాళ్ళమ్మ ఉన్న వాట్సప్ గ్రూపులకి "డిప్రెషన్ ఇన్ టీన్స్" లింకులు పంపించి, అందరూ చదివారని నిర్ధారించుకునేందుకని, ఆ ఆర్టికల్ పై చిన్న చర్చాకార్యక్రమం ప్రారంభించాక కానీ కుదుటపడలేదు. ఆర్టికల్స్, కాలమ్స్ ఊరికినే రాయరుగా మరి.  అవగాహన మంచిదేగా. పంచుకున్నా, పెంచుకున్నా...

 

ఈ దేశీ పిల్లల అమెరికా చదువుల పోటీ పార్శ్వం ఇలా ఉంటే, ఇవేవీ తెలీని ఫేస్బుక్ మిత్రులు, ఫేసుబుక్కుల్లో ఇక్కడి పిల్లలని 'జాలీ యూత్' కి ప్రతినిధుల్లా భావిస్తూ, స్వదేశంలో బుద్ధిగా ఉండే పిల్లలని వదిలేసి,  నిర్లక్ష్యంతో  తిరిగే జులాయి పిల్లలని మాత్రం "పాశ్చాత్యపోకడలు" అంటూ  తిడుతుంటే... నవ్వాలో, ఏడవాలో అర్థం కాని చిత్రమైన సంధికాల సందిగ్ధాల్లో తల్లిదండ్రులు సంయమనంగా చేసేది ఉందే... అది కూడా ఓ రకం ధ్యానమే. 

 

ఇన్ని రకాల ధ్యానాలు మాట్లాడుతున్నాము, అసలు ధ్యానమంటే ఏమిటో?

 

ఎక్కడో చదివాను-  చేసేది ధ్యానం కాదట, ఏమీ చేయకపోవటమే ధ్యానం. అంటే ఏ పనీ చేయకుండా ఉండటం కాదు. అన్ని పనులను అర్థవంతంగా, సమర్థవంతంగా, నేర్పరితనంతో, ఓర్పుతో, కూర్పుతో చేయటమే ధ్యానం ట. చేయటమే కాదు, అలాగే అన్నిటినీ సమంగా ఓర్పుతో చూడగలగమూ ధ్యానమేట.  

 

కాకపోతే ఇక్కడో చిక్కుంది. ఇలాంటి సంయమనధ్యానం అందరూ చేసి, నిర్వికార స్థితికి చేరితే అసలు లోకం... అందునా ముఖ పుస్తక లోకం… మరెంత బోరుగా ఉంటుందో కదా? అసలు సామాజిక మాధ్యమాలన్నీ వెలవెలబోతాయి. ఆవేశాలు వెళ్ళగక్కేవారు లేక. బాబోయ్. ఏ సినిమా స్టారు నీ, రాజకీయ పార్టీలనీ ఎవరు పొగిడినా, ఎందరు తెగిడినా రెస్పాన్సులే ఉండవు. అభిమానులు ధ్యాన ప్రభావంలో ఉంటారు కనుక. పొరపాట్న ఏ కవిగారి కవిత బాలేదనిపించినా, ఏ పుస్తకమో బాలేదనిపించినా చెప్పము. పొరపాటున, మనం చెప్పినప్పటికీ, భీకరదాడి చేసే అభిమానులుండరు. ధ్యానప్రభావంలో ఉంటారు కదా. ధ్యానం అన్నివిధాలా మంచిదే. కానీ, ఇలాంటి ప్రమాదాలూ లేకపోలేదు. ఇలాంటి ధ్యానం చేయకుండా ఉంటే, సామాజిక మాధ్యమాల పురోగతికి మంచిదేమో.  

 

[ముచ్చట్లు మొదటి పేరాల్లో ఆంగ్ల పదాలని మన్నించాలి.]

*****

bottom of page