
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కవితా మధురాలు

నిరీహ
~వేగుంట మోహన ప్రసాద్
సంపాదకుల ప్రత్యేక ఎంపిక
ఆమె ఎవరైతే మాత్రం ఎలా కదుపుతాం
ప్రశాంతంగా నిర్మలంగా దేవతలెవరో ఆమె తల చుట్టూ
తిరుగుతూ వింజామరలు విసురుతున్నట్టు
హాయిగా అస్వప్నంగా మళ్ళా ముకుళిత పుష్పంలా
శయనించిన ఆమెను
ఆమె ఎవరైతే మాత్రం ఎలా కదిలిస్తాం-
ఆమె ఎవరైతే మాత్రమేమిటి
నా భార్యో, పక్కింటావిడో, పిల్లల తల్లి తెల్లని పిల్లో
ఆమె ఎవరైతే మాత్రం ఎలా కదిలిస్తాం, కనలిస్తాం
పెదవులు కూడా కదపకుండా అయితే మాత్రం ఎలా పిలుస్తాం-
ఒక సంక్షుభిత పగటి తర్వాత
ఒక వ్యాకుల కలిత శిథిల పగటి తర్వాత
ఏ సౌందర్యమూ లేని, ఏ లాలిత్యమూ లేని భయంకర
పశువు పగటి తర్వాత
విశ్రమిస్తున్న ఆమెను కదపటం ఎలా
మళ్ళా రేపటి జీవన వ్యాపారం కొరకు
మళ్ళా రేపటి అనూత్న అత్యతి సాధారణ నిర్జీవ యాంత్రిక జీవనాన్ని
ఎదుర్కునే శక్తినీ, సారాన్నీ, ఓర్పునూ నిశ్శబ్దంగా
తన నుంచే తను స్వీకరిస్తున్న ఆమెను
ఆ స్వేచ్ఛా సమాధి నుంచి, రోజూ పొందే
ఆ అప్రయత్న గాఢ సౌఖ్యం నుంచి
ఎలా కనలించను, కలతించను
కరుగుతున్న మంచు ముక్కలా ఆమె పడుకుంటే
కదులుతున్న నీటిబొట్టులా ఆమె పడుకుంటే
కంట్లో బంధించబడ్డ గొప్ప దృశ్యంలా ఆమె పడుకుంటే
రాత్రంతా ముకుళించి రేప్పొద్దున వికసించే అద్భుత పుష్పంలా
ఆమె పడుకుంటే పడుకోనీ –
మనం ఆమె చుట్టూ చేరి ప్రార్థనలు చేద్దాం
ఏ కల్మష స్వప్నమూ ఆమెను అంటవద్దని
రేపటి తాలూకు ఏ దురూహన్నా ఆమెను సోకవద్దని
రేపటి మృగాన్నెదుర్కోనేందుకు
సర్వశక్తి సామర్థ్యాల్నీ స్వీకరిస్తున్న
ఆమెను కదపొద్దు, మనసులో అన్నా పిలవద్దు.
(“అజేయం” సంకలనం నుండి)
సంపాదకుల ప్రత్యేక ఎంపిక
అట్లా అని
పెద్ద బాధా ఉండదు.
వెల్ల వేసిన గోడలేమో తెల్లబోతూ ఉంటాయి
విద్యుత్కాంతికి.
మహా అయితే ఏ బల్లో ప్రాకుతూంటుంది
గోడ మీద.
దాని నీడ ఒక్కటే ఛాయా మాత్రంగా మెదుల్తుంది
విచారంగ.
ఎక్కడో దూరాన్నుంచి పట్టి లాక్కొస్తుంది ఏ సినిమా పాటనో
రికామీ గాలి.
తీరా ఆ ఆఖరి చరణాన్ని వదిలేసి వెళిపోతుంది రోషంగ,
జుట్టు పై కెగదువ్వుకుని.
ఇక నే నా చరణాన్ని మననం చేసుకుంటాను నా
దిగులుతో కలిపి
తెల్లవారెను కోడిగూసెను కోడిగూసెను తెల్లవారెనని
నూర్జహాన్ నీ నన్నూ వడబోసుకుంటూ
హరే రామ హరే రామ రామ రామ హరే హరే లాగ.
గోడకు తగిలించిన గళ్ళ టెరిలిన్ చొక్కా
మెల్లగా చేతులు కదుల్చుతుంది.
ఉదయం దానికి పూసిన నైట్ క్వీన్ ని వాసన చూసుకుంటుంది
రాత్రిలో ఒక్కతే.
నూనెలా మెరుస్తూన్న నల్లని గచ్చు మీద చీమ ఒకటి
కాశీ యాత్రకి ప్రాకుతూంటుంది.
ఇది దిగులు చిత్తప్రవృత్తి సీన్.
సెంట్ రాసిన చొక్కాకి దిగులు.
బల్లికి ప్రాకలేని కాళ్ళల్లో గాలి నిండిన ఎగొని.
బరువైన చివరి నూర్జహాన్ చరణానికి మెలంకొలి.
పాలిపోయిన గది గోడలకు ప్రతీక్ష.
పొగ నిండిన అగరొత్తుల పడగ్గదికి పొగలో మెలికల అన్వేషణ.
బలాదూరు గాలికి నైరాశ్య జనితోక్రోషం.
చీమకు పలాయనాధ్యాత్మికావేశం.
వస్తుగతం కాని కవితకు భావం బలం
కేవలం భావంలో భవం
అధివాస్తవిక విచారమ్ అవ్యక్తమ్
అగమ్యగోచరమ్.
గమ్యమే లేని జానేదేవ్ గాలి
వ్యక్తావ్యక్త చరమ చరణమ్.
దిగులు గుండెల పగుళ్లకు
స్వాతి చినుకుల స్వాంతన వాక్యా
లేవి మరీ!
కరుచుకు పోయిన బల్లిలా గోడకు
నిచ్చెన ఉంటుందిగాని తీరా ఎక్కే
వాడెవ్వడు?
వస్తువూ లేక, స్వీయాత్మా లేకనే
నేననటం
పోనిస్తూ
పెద్ద బాధా లేదని
వాక్యుయెస్** బల్లి ప్రలాపంలో
--రక్తం స్రవిస్తున్నా.
*మధుర గాయని ; రేడియో పాకిస్తాన్ లో
**Vacuous = Suggesting absence of thought. ఈ కవిత చెప్పేదిదే
(‘చితి – చింత’ కవితా సంపుటి నుండి)

నా తండ్రి జ్ఞాపకంలా
~తమ్మినేని యదుకుల భూషణ్
ఎంత తడిమినా తనివి తీరదు
ఎండ తిరిగి వచ్చింది
నా తండ్రి జ్ఞాపకంలా
ఎదురు గాలి
మెరిసే వదనాన్ని
మేఘాలు కప్పినా
క్షణకాలం
వెనుతిరుగుతాను
నా నీడను
నేనే
అనుసరిస్తూ

తీర్మానాలు
~డా. రావి రంగారావు
తీర్మానా లంటే
కాగితాలమీద విరిసే పరిమళాల పువ్వులు,
నిర్భయంగా తిరిగే వెలుతురు గువ్వలు...
తీర్మానా లంటే మానాలు, అభిమానాలు,
క్రమ శిక్షణకు కొలమానాలు,
జీవన నిర్దిష్ట మృదుల గానాలు...
ఒక మంచి తీర్మానం అంటే
ఆయుధా లవసరం లేని ఋషి,
లోక కళ్యాణ కాంక్షా కృషి,
అమలు చేస్తే ఆశీర్వచన దీపాలు,
మరుగున పెట్టా లనుకుంటే తిరుగులేని శాపాలు...
వెలుతురు తీర్మానాలు ఆరోగ్య బీజాలు,
సుమధుర భవిష్యత్తుకు "గ్యారంటీ"లు...
చీకటి తీర్మానాలూ ఉంటాయి
దుష్ట క్రిమి కీటకాల "బ్యూటీ"లు...
ఒక మురికి తీర్మానం అంటే
బలిసిన కొండను ఇంకా ఇంకా పెంచేది,
తరిగిన కొండను ఇంకా ఇంకా తరుక్కుపోయేలా తవ్వేది...
ప్రజాస్వామ్యంలో తీర్మానాల ఆయుధాలు
జాగ్రత్తగా వినియోగించుకోవాలి,
ఎప్పటి కప్పుడు తుప్పు పట్టకుండా పదునుపెట్టుకోవాలి...
చీకటి బురదలోకి తొక్కేయకుండా
గుడ్ల గూబలనుంచి కాపాడుకోవాలి,
చీకట్లో కూడా నక్షత్రాల్లా మెరుస్తూ కనిపించే తీర్మానాలకోసం
వెలుతురు జీవుల సహాయం తీసుకోవాలి...
కొంత మంది ఎప్పుడూ ఉంటారు
మీరే తీర్మానం చేసినా మానం తీసేయాలని చూస్తుంటారు,
పసి పిల్లలమీద అత్యాచారం చేసే కాముకుల్లా
రాసిన అందమైన తీర్మానం మీద ఏవో పిచ్చి గీతలు గీస్తుంటారు
***

లాల్ బహదూర్ శాస్త్రి
~పిల్లుట్ల విశ్వనాథ్
ఉత్సాహ॥ పొట్టివాడవైన పేరు పొందినావు గొప్పగా
గట్టివాడవెల్లవారికంటె అనియుఎల్లెడన్
ఇట్టి ఘనత నీకుదక్క ఎవరికైన దక్కెనే
పట్టుదలను నిన్ను మించువాడు కనబడడెచటన్
ఉత్సాహ॥ చక్కనైన రాజకీయ చతురుత కలవాడవీ
వొక్క కార్యమైన స్వోపయోగమునకు చేసితే?
ఎక్కడైన నాడు నేడునిట్టిది కనబడదుగా!
నిక్కమైన దేశభక్తునిగ నిను గణియింతుమా
తే॥ జైజవాను మరియు జైకిసానటన్న
ఘన నినాదాలతోడ చక్కంగ నీవు
దేశమందలి ప్రజలనుత్తేజ పరచి
ముందుకు నడిపించితివి సద్బుద్ధి పెంచి
పం॥ కుశాగ్రబుద్ధితోడ నీవకుంఠిత ప్రయత్నమున్
విశుద్ధచిత్తమింక చేర్చి పేర్చి స్వార్థమెంచకే
విశాల భారతంబునెప్డు పెంపుచేయగా అహ
ర్నిశల్ ప్రజాభివృద్ధికోరి నీవు సేవ చేసితే!
పం॥ ప్రశస్తిపొందినావుగా ప్రపంచమందునెప్డు నీ
వు శాంతికాముకుండవంచు పోరు కోరవంచు; ది
గ్దిశాంతముల్ మహాసముద్ర తీరదూరముల్ భవ
ద్యశంబు దాటెనన్న వింతయౌనె లోకనాయకా!
పం॥ ప్రధానమంత్రులుండరే ప్రభాప్రపూరితుల్ భువిన్
ప్రధానమైనవాడవీవు ప్రక్కదేశమున్ భవ
ద్విధానమొప్ప మార్గమందు తెచ్చినావు కొంత ఓ
సుధీమతీ! యిటుల్ తలంచుచున్ నుతింపమే నినున్
పం॥ నిజాయతీపరుండవంచు స్నేహశీలివంచు నీ
వజాండమందు నిన్ను బోలినట్టి త్యాగశీలి ఉం
డ జాలడంచు కొల్తురెప్డు నాయకుల్ జనుల్ నినున్
ప్రజాభిమానమిట్టులెల్లవారికిన్ లభించునే
మ॥ జనసామాన్యము కోసమంచు పగలున్ సాయంత్రమంచింత యై
నను లోనెంచక యోగిపుంగవు వలెన్ తా పూర్తి నిస్వార్థతన్
తన సర్వస్వము వీడి పాటుపడెనీతండంచు లోకుల్ నినున్
కొనియాడన్ హృదయంబు పొంగుకద మాకున్ నాయకేంద్రోత్తమా
సీ॥ నవనీతహృదయుండు పావనచరితుండు
సర్వపక్షాధిప సంస్తుతుండు
సకలసద్గుణగణసంపన్నుడఖిల రా
జ్య ప్రధాననాయక సన్నుతుండు
నిత్యనిరాడంబరేత్యాది బిరుదాంకు
డాత్మాభిమాన మహాధనుండు
రాజర్షి నామార్హ రమణీయ పురుషుండ
హంకారరహిత మహామనీషి
తే॥ దేశభక్తాగ్రగణ్యుండు దివిజసముడు
సకలజనపూజ్యుడు నిఖిలలోక నుతుడు
జనప్రియుండు లాల్ బహదూరు శాస్త్రి వరుడ
టంచు నిన్నెంత పొగడిన ఇంచుకె యగు

నిన్ను నిన్నే
~లత
నిన్ను..నిన్నే..
చూస్తున్నా పదే..పదే..నిన్ను
ఒకటా రెండా.. మన పెళ్ళైన దగ్గరనుంచీ
మన ఇరువురి కళ్ళు రెండైన దగ్గరనుంచీ
అదేమిటో.. నాకు అంత వ్యామోహం ..
నీ మోము చందురుని చూడాలన్న ఆరాటం
నీ కంటి అద్దాలలో నేనున్నానన్న
సంతోషాల హ్యాంగ్ ఓవర్.. నిన్ను
లేత ఎండల తొలి పొద్దు కెమ్మోవిగా
సంపెంగ పువ్వు మారింది నాసికగా.. స్నిగ్ద మందారాలు బుగ్గలపై జారాయా,
నల్ల తుమ్మెదలు కళ్ళయినాయా
నీలి ముంగురులలో సంద్రమే పారిందా
మెడ మీది మల్లెలతో తగువాడాలనుకొన్నా
నిన్నే చూస్తూ రేయంతా గడపాలనుకున్నా
కల కాలం ఇలాగే సాగాలని తపిస్తున్నా
నీ చేతనే స్వాంతన పొందాలనుకొంటున్నా
***

నవశకం
~తిరుమలశెట్టి సాంబశివరావు
తూర్పు వాకిట తలుపుతెరచి ఆకాశ దేశాన విరిసింది సూర్యోదయం.
అది చూసిన నా మనసులో నిదురలేచె నీ తలపుల ఉషోదయం.
నిను తలచిన నా మనసులో పొంగెను అరుణోదయం.
తూర్పున ఉదయయించిన భాస్కరుడు పశ్చిమకు చేరినట్లు నా జీవిత మలి సంధ్యలో నిను చేరాను
నీ పరిచయం తో నాలో ఉదయించింది నవోదయం
నాపై నీవు శీతకన్ను వేసిన నాలో రేగెను పడమటి సంధ్యాస్తమయం
నీ ఎడబాటుతో నా మనసంతా నిండే కృష్ణ పక్షం, నిను చూసినా, కలిసినా నాలో కలుగు పూర్ణ చంద్రోదయం.
నా మనసుకి అందిన జాబిలివి నీవు ఇక నా జీవితం అంతా శుభోదయం.
వెండి వెన్నెల్లో తలపుల మందిరంలో ఊహల పందిరి కింద జతగా కలసి సృష్టిద్దాం నవశకం